సినిమా డైలాగులు రాయడం లోతుగా
నేర్చుకోవాలంటే
ఈ సూత్రాలు ఉపయోగపడవచ్చు, ట్రై చేయండి!
1. డైలాగ్
అంటే సమాచారం కాదు, భావోద్వేగం
డైలాగ్ ద్వారా
ప్రేక్షకులు కథని వినకూడదు; పాత్ర మనసుని అనుభవించాలి.
ఫ్లాట్ డైలాగు :
‘నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా కష్టపడ్డాను’
ఫీల్ తో వున్న డైలాగు :
“నాన్న వెళ్ళిపోయిన రోజు నుంచి... ఇంట్లో నిశ్శబ్దం కూడా నన్ను
భయపెడుతోంది’
2. ప్రతి పాత్రకీ ఒక పదజాలం వుండాలి
చదువుకున్న వ్యక్తి: ‘ఇది సరైన నిర్ణయం కాదు’
గ్రామీణ వ్యక్తి: ‘ఇది మన పని కాదు రా’
రౌడీ: ‘ఇలారా, ఒక్క మాట చెబుతా... విను!’
ప్రతి పాత్ర ఒకేలా మాట్లాడకూడదు.
3. చిన్న డైలాగులు ఎక్కువ ప్రభావం చూపుతాయి
పొడవైన ప్రసంగాల కంటే చిన్న మాటలు గుర్తుండిపోతాయి.
ఉదాహరణ:
‘ఒక్క అవకాశం చాలు’
‘నేను ఓడిపోలేదు... ఇంకా గెలవలేదు’
4. పంచ్ డైలాగ్‌కి ముందు బిల్డ్-అప్ వుండాలి
పంచ్ ఒక్కసారిగా వస్తే ప్రభావం తగ్గుతుంది.
ఉదాహరణ:
విలన్: ‘నువ్వు నన్ను ఆపలేవు’
హీరో: ‘నిన్ను ఆపడానికి రాలేదు...’
కొన్ని క్షణాలు ఆగి, మళ్ళీ హీరో : ‘...ముగించడానికి వచ్చాను’
పాత్రలు కేవలం
మాట్లాడకూడదు;
మాటలతోనే
ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నించాలి.
భయపెట్టడం, ప్రేమని వ్యక్తం చేయడం, అవమానించడం, ప్రోత్సహించడం, మోసం చేయడం వగైరా.
6. పాత్రకి తగిన భాష
ఒక పదేళ్ళ పిల్లవాడు ఇలా మాట్లాడడు:
‘నీ ప్రవర్తన నన్ను తీవ్రంగా నిరాశపరిచింది’
అతను ఇలా అంటాడు : ‘నువ్వు అలా చేస్తావని అనుకోలేదు’
7. గుర్తుండిపోయే డైలాగులు రాయాలంటే:
అవి మూడు లక్షణాలు కలిగి ఉండాలి:
చిన్నవి, కొత్త ఆలోచన కలిగినవి, భావోద్వేగంతో నిండినవి
ఉదాహరణలు:
‘భయం గెలవదు... మనమే ఓడిపోతాం’
‘గాయం మానిపోతుంది... అవమానం కాదు’
‘సమయం అందరికీ దొరుకుతుంది... అవకాశం కాదు’
8. డైలాగ్‌కి రిథమ్ వుండాలి
మాటలు సహజంగా ప్రవహించాలి.
ఉదాహరణ :
‘వస్తావా?’
“రాను’
‘ఎందుకు?’
నువ్వున్నావు కాబట్టి’
చిన్న వాక్యాలు వేగాన్ని పెంచుతాయి.
9. మంచి డైలాగ్ ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది
ఉదాహరణ:
‘అబద్ధం చెప్పినవాడిని క్షమించొచ్చు... కానీ నమ్మినవాడిని ఎలా మర్చిపోగలం?’
10. డైలాగ్ రాయడానికి ఒక సులభమైన ఫార్ములా
Emotion +
Conflict + Surprise = Memorable Dialogue
ఉదాహరణ:
‘నిన్ను ద్వేషించడం లేదు...’
‘మరి?’
‘నువ్వు నాకు పరాయివాడివయ్యావు’
ఇక్కడ భావోద్వేగం వుంది, సంఘర్షణ వుంది, చివర్లో ఊహించని మలుపు వుంది.
11. రోజూ చేయాల్సిన ఒక మంచి అభ్యాసం
ఒకే పరిస్థితిని మూడు రకాలుగా రాయాలి:
హీరోలా, విలన్లా, హాస్య పాత్రలా
ఇలా చేస్తే ప్రతి పాత్రకి ప్రత్యేక గొంతు ఎలా ఇవ్వాలో సహజంగా అలవాటవుతుంది. అదే
బలమైన సినిమా డైలాగ్ రచనకి పునాది.
డైలాగులు రాయడంలో నిజమైన
నైపుణ్యం మాటలు రాయడంలో కాదు, పాత్రని వినడంలో వుంటుంది. పాత్రని వింటే దాని మనసు తెలుస్తుంది.
అప్పుడు పాత్ర మనసులోంచి వస్తాయి డైలాగులు- రైటర్ మనసులోంచి కాదు. ప్రొఫెషనల్ రైటర్లు
అనుసరించే మరికొన్ని ముఖ్యమైన పద్ధతులు మరోసారి!
-సికిందర్
