రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, April 25, 2021

1036 : రివ్యూ

కలతిల్ సంతిప్పమ్ (తమిళం)
రచన -దర్శకత్వం : ఎన్. రాజశేఖర్
తారాగణం : జీవా, కలతిల్ సంతిప్పమ్ (తమిళం)
జీవా, అరుళ్ నిధి, మంజిమా మోహన్, , ప్రియా భవానీ శంకర్, శ్రీరంజని, రేణుక, ఇళవరసు, శరవణన్, రోబో శంకర్, రాధా రవి తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
బ్యానర్ : సూపర్ గుడ్ ఫిలిమ్స్
నిర్మాత : ఆర్ బి చౌదరి
విడుదల : ఫిబ్రవరి 5, 2021;  జీ 5 విడుదల : ఏప్రెల్ 23, 2021
***

      జీవా, మంజిమా మోహన్, అరుళ్ నిధిలు నటించిన కలతిల్ సంతిప్పమ్ (ఆట స్థలంలో కలుసుకుందాం) లాక్ డౌన్ ఎత్తేసిన నేపధ్యంలో ఫిబ్రవరిలో విడుదలైనా, ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో విఫలమైంది. ప్రధానంగా కుటుంబ ప్రేక్షకులకి ఉద్దేశించినట్టున్న ఈ లైటర్ వీన్ కమర్షియల్, అప్పటికింకా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకి తిరిగి రాకపోవడం కారణంగా కావచ్చు- 10 కోట్ల బడ్జెట్ కి ఓవర్సీస్ తో కలుపుకుని 2.66 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాపయ్యింది. జనవరి నుంచి మార్చి 31 వరకూ విడుదలైన 10 తమిళ సినిమాల్లో రెండు హిట్టై, మూడు యావరేజీలై, 5 ఫ్లాపయ్యాయి.

        లతిల్ సంతిప్పమ్ దర్శకుడు ఎన్ రాజశేఖర్ కొత్తవాడు. అయినా కొత్తదనంలేని పూర్వకాలపు కథ ప్రయత్నించాడు. ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య స్నేహం ఆధారంగా రొటీన్ ప్రేమ కథ చూపించాడు. దీన్ని కుటుంబ ప్రేక్షకుల కన్నట్టు లైటర్ వీన్ గా, హాస్యాయుతంగా చెప్పాడు. అయితే విడుదల చేసిన సమయం లెక్క తప్పినట్టుంది. ఆ   లెక్క సరి చేసుకోవడం కోసం నిన్న జీ 5 లో విడుదల చేసినట్టుంది. దీని వివరాల్లోకి వెళ్దాం...  

కథ

     అశోక్ (జీవా), ఆనంద్ (ఎం. కరుణానిధి మనవడు అరుళ్ రవి) మిత్రులు. ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూంటారు. అశోక్ నిదానస్తుడు, ఆనంద్ ఆవేశపరుడు. అశోక్ గొడవల్ని ఎవాయిడ్ చేస్తాడు. అశోక్ ని ఎవరేమన్నా ఆనంద్ తోలు తీస్తాడు. ఆనంద్ పోరాటానికి దిగితే, అశోక్ చల్లగా తప్పించుకుని, ఆనంద్ గురించి బ్యాడ్ గా మాట్లాడే అలవాటుంటుంది. ఒకసారి అశోక్ చేసిన పనికి అశోక్ మీదికి ఒక గ్యాంగ్ వస్తే, ఆనంద్ ఆ గ్యాంగ్ తో తలపడతాడు. అశోక్ తప్పించుకుని టీస్టాల్ దగ్గర కూర్చుని ఫైటింగ్ చూస్తూ - వాడంతే, వాడొక రౌడీ వెధవ అంటూ అలవాటు చొప్పున చెత్త వాగుడు వాగుతాడు ఆనంద్ గురించి.

        వీళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటారు పేరెంట్స్. అశోక్ కి పెళ్ళీ గిళ్ళీ పడదు. కేర్ ఫ్రీగా వుండాలనుకుంటాడు. ఆనంద్ కి మామ కూతుర్ని చేసుకోమని తల్లి పోరుతూంటుంది. ముందుగా అశోక్ కి పెళ్ళి చూపులు ఏర్పాటవుతాయి. పెళ్ళి చూపుల్లో భయంకరంగా వున్న ఆ అమ్మాయిని చూసి మొహమాట పడుతూంటే, నువ్వే నాకు నచ్చలేదంటుందా అమ్మాయి. అక్కడ్నించి సేఫ్ గా బయటపడతాడు.

          ఇక ఆనంద్ కి మేనమామ కూతురు కావ్య (మంజిమా మోహన్) తో పెళ్ళి చూపులేర్పాటవుతాయి. అక్కడికొచ్చిన బంధువు అశోక్ ని గుర్తు పడతాడు. అప్పుడారోజు ఆనంద్ గ్యాంగ్ తో తలపడుతున్నప్పుడు, ఆనంద్ గురించి అశోక్ వాగిన చెత్త వాగుడంతా ఈ బంధువు విన్నాడు. దీంతో ఆనంద్ క్యారక్టర్ గురించి కావ్య తండ్రిని హెచ్చరిస్తాడు. అది నిజం కాదనీ, కామెడీ కోసం అలా అన్నాననీ అశోక్ ఎంత మొత్తుకున్నా నమ్మరు. సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది.

        ఇలా ఆనంద్ పెళ్ళి సంబంధం చెడగొట్టిన అశోక్ ఇరకాటంలో పడతాడు. ఇప్పుడేం చేశాడు? ఆనంద్ ఏం చేశాడు? ఇద్దరూ కొట్టుకున్నారా? ఈ ఇద్దరి మద్య కావ్య ఏం చేసింది? ఆమెని ఎందుకు కిడ్నాప్ చేశాడు అశోక్? మధ్యలో కొత్తగా దిగిన సోఫియా ఎవరు? అసలేం జరిగింది? ఏం జరుగుతోంది?... ఇదీ మిగతా కథ. 
 
ఎలావుంది కథ

         షోలే లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పెళ్ళి సంబంధం మాట్లాడడానికి హేమమాలిని పెద్దమ్మ దగ్గరికెళ్ళి, ధర్మేంద్ర గుణగణాల గొప్పదనం గురించి సుందర వ్యంగ్యంగా సంభాషించే కామెడీ సీనుతో పోలిక కన్పిస్తుంది. జీవా ఫ్రెండ్ గురించి అవాకులు చవాకులు పేలే కామెడీ ఇదే. దీనికి పెళ్ళి చూపులు జోడించి పెళ్లి సంబంధం చెడగొడితే, కలతిల్ సంతిప్పమ్ కథ అయింది.  
  
         ఇది పూర్వకాలపు కథ. ప్రేమ స్నేహాల అదే ఫార్ములా కథ. అయితే స్నేహంలో గానీ, ప్రేమలో గానీ ఎమోషన్లు, ఓవర్ గా సెంటిమెంట్లు, ఘర్షణలు, విడిపోవడాలు వంటి టెంప్లెట్స్ లేని, మూస ఫార్ములా కథనం లేని, మాస్ ఎలిమెంట్స్ లేని,  ఫ్రెష్ గా అన్పించే, మూడు కుటుంబాల మధ్య సాగే లైటర్ వీన్ హాస్య ప్రధాన కథగా ఇది కన్పిస్తుంది. అయితే ఇందులో కబడ్డీకీ, కబడ్డీతో టైటిల్ కీ జస్టిఫికేషన్ లేదు.

నటనలు - సాంకేతికాలు

        ఇందులో ఎవరిది హీరో పాత్రో చెప్పడం కష్టం. జీవా యాక్షన్ సీన్స్ అరుళ్ కి అప్పగించి తప్పుకున్నాడు. గొడవలంటే తప్పించుకునే కామెడీ క్యారక్టర్ కాబట్టి ఇలా వుంది. అరుళ్ ది సీరియస్ గా వుండే పాత్ర. ఈ రెండు పాత్రల మధ్య బ్రొమాన్స్ కూడా లైటర్ వీన్ గానే వుంటుంది. ఇద్దరూ కలిసి కన్పించే సీన్లు తక్కువే. అయినా ఈ బ్రోమాన్స్ లో బాండింగ్ బలంగా వుంటుంది. జీవా తండ్రిని అరుళ్ నాన్నా అని పిలిస్తే, అరుళ్ తండ్రిని జీవా కూడా నాన్నా అని పిలిచే ఫ్యామిలీ బాండింగ్ కూడా వుంటుంది. కుటుంబాలకి పరస్పరం సాయం చేసుకోవడం తెలియకుండా చేసుకున్నా, తెలిశాక ఎవరికీ ఎవరూ రుణపడి వుండే టెంప్లెట్ వుండదు. ఒక సహజ ప్రక్రియగా వాళ్ళ మధ్య వ్యవహారాలు సాగిపోతూంటాయి. ఇవన్నీ ఇద్దరి పాత్రలకీ, నటనలకీ తాజాదననాన్ని తెచ్చాయి.

        జీవా గొడవలకి దూరంగా వుండే డిఫెన్సివ్ క్యారక్టర్ అయినట్టుగా, అలాగే అరుళ్ గొడవల్ని ఎదుర్కొనే అఫెన్సివ్ క్యారక్టర్ అయినట్టుగా, రోమాన్స్ లో కూడా అలాగే వుంటారు. మంజిమతో జీవా డిఫెన్సివ్ గా వుంటే, ప్రియా భవానీ శంకర్ తో అరుళ్  అఫెన్సివ్ గా వుంటాడు. అయితే హీరోయిన్లిద్దరి పాత్రలు ఫార్ములా హీరోయిన్ పాత్రలు. మంజిమ సొంతంగా ఆలోచించే పాత్రగా కాసేపు కన్పించి, తర్వాత అలా కన్పించదు.

        హీరోలిద్దరి ఫ్రెండ్స్ గా రోబోశంకర్, బాల శరవణన్ లు ప్రతీ సీనులో - అది సీరియస్ గా వున్నా సరే, ఏదో కామెడీతో తేలిక బర్చేస్తూంటారు. ఇంకో ఇలాటి పాత్ర ఫైనాన్స్ కంపెనీ ఓనర్ పాత్ర. ఇతను రాధా రవి. పేరెంట్స్ పాత్రల్లో ఇళవరసు, నాదోడిగళ్ గోపాల్, ఆడుకాలం నరేన్,  వేలా రామ్మూర్తి, శ్రీ విద్యా శంకర్, శ్రీరంజని, రేణుక... వీళ్ళంతా ఫ్యామిలీ సెగ్మెంట్ లో ఒక హోమ్లీ ఫీల్ తీసుకొస్తారు.

        యువన్ శంకర్ రాజా సంగీతంలో పాటలూ లైటర్ వీన్ గానే వున్నాయి. అభినందన్ రామానుజం కెమెరా వర్క్ కూడా లైటర్ వీనే. టౌను లొకేషన్స్, నేపథ్య వాతావరణం మొదలైనవి కూడా లైటర్ వీన్ గానే లైటర్ వీన్ కథతో పాటు కలిసి నడిచాయి. 

సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులు

       కొత్త దర్శకులకి సర్వ సాధారణంగా ఓ సమస్య వుంటుంది. చేసుకున్న కథ ఒకవేళ బాగా చేసుకున్నా, వాళ్ళ మీద నమ్మకం లేక మార్పు చేర్పులు జరిగి పోతాయి. హిట్టయిందా ఫర్వాలేదు, పోయిందా కొత్త దర్శకులే పోతారు. కొత్త దర్శకులూ, వాళ్ళ కథల్ని మార్చేసే  హస్తాలూ తెలియని ఒక దశలో వుంటే చాలా ప్రమాదం. చేస్తున్నది కథ కాదనీ, గాథ అనీ తెలియని దశ. చేస్తున్నది కథ కాదనీ, గాథ అనీ పక్కాగా తెలిసి చేయడం వేరు. అప్పుడు కనీసం గాథ ఎలా చేయాలో తెలుసుకుని చేయవచ్చు. గాథ అని వేరే ఒకటుంటుందని తెలియక పోతే చాలా ప్రమాదంలో పడిపోతారు. చేస్తున్న కథలో కథాంగాలు మిస్సయి, అది గాథై పోతూ ఎక్కడికో... తీసికెళ్ళి పోతారు.

        అయితే గాథ కి కూడా కొన్ని అర్హతలుంటాయి. పక్కాగా కథే అనుకుంటూ చేస్తున్న కథలోంచి 5 ప్రధాన కథాంగాలు - ప్రధాన పాత్ర, యాక్టివ్ పాత్రలు, ప్రత్యర్ధి పాత్ర, ప్రధాన సమస్య, గోల్ అన్నవి లేకుండా కథ చేసుకుని-  ఇదే నా తిరుగులేని కథ అనుకుంటే గాథ కూడా వూరుకోదు. గాథకైనా ప్రధాన పాత్ర వుండాల్సిందే. కాకపోతే పాసివ్ గా వుండొచ్చు. అలాగే గోల్ లేకపోయినా ఓ ప్రధాన సమస్య చుట్టూ సంఘర్షణ వుండాల్సిందే. ప్రధాన సమస్యని ఆపేసి ఇంకో సమస్యని ఎత్తుకుని, దాన్ని కూడా ఆపేసి ఇంకో...ఇలా చేస్తూ పోతే అది గాథ కూడా అవదు. ఆపి ఆపి ఒక్కో సమస్య చెప్పుకుంటూ పోయే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బాపతు  డాక్యుమెంటరీ అవుతుంది. ప్రత్యర్ధి పాత్ర లేనప్పుడు, గాథలో ప్రధాన సమస్య సృష్టించిన పరిస్థితులతో  సంఘర్షణ వుంటుంది. వేరే విడివిడి చిన్న చిన్న సమస్యలతో కాదు.

        కొత్త దర్శకుడి ఈ కథలో ఇవన్నీ జరిగాయి. ఒకటే యూఎస్పీ పెట్టుకున్నట్టుంది -కుటుంబ ప్రేక్షకుల కోసమని అన్నీ లైటర్ వీన్ గా వుండాలని. మంచిదే. కానీ దీనికి అడ్డొచ్చిన కథాంగాల్ని ఎత్తేసి ఏమీ లేకుండా చేస్తేనే వస్తుంది సమస్య.  

        30 నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వస్తుంది. జీవా వల్ల ఆనంద్ పెళ్ళి చెడే సీనుతో ప్లాట్ పాయింట్ వన్. దీంతో తనవల్ల జరిగిన తప్పుని  సరిదిద్దాడానికి జీవా మంజిమని ఆనంద్ తో కలిపే ప్రయత్నాలు చేస్తాడు. ఈలోగా ఆమె తండ్రి ఆమెకి వేరే పెళ్ళి పెట్టేస్తాడు. జీవా ఆమెని కిడ్నాప్ చేసి ఆనంద్ దగ్గరికి తీసికెళ్లి పెళ్ళి చేసుకోమంటాడు. ఆనంద్ చేసుకోనంటాడు. ఇలా చేసి మేనమామ పరువు తీయలేనంటాడు. మంజిమకి వొళ్ళు మండి తనని ఇంటిదగ్గర దింపెయ్యమంటుంది. ఇలా ఈ ఇంటర్వెల్ సీను ఏమీ తేలకుండానే, అర్ధాంతరంగా ఇంటర్వెల్ పడుతుంది.

        సీను మధ్యలో ఆపి ఇంటర్వెల్ వేయాలంటే అక్కడేదో సస్పెన్స్ వుండాలి. లేకుండా ఇలా కరెంటు పోయినట్టు సీనాపి ఇంటర్వెల్ వేసేస్తే అర్ధమేమిటో అర్ధంగాదు. ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఈ ఇంటర్వెల్ వరకూ ప్రధాన పాత్రగా జీవా కనిపిస్తూ, ఓ సమస్యా, గోల్ బాగానే వుంటాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇవన్నీ మాయమైపోతాయి.       

         ఇంటర్వెల్ దగ్గర కట్ అయిన సీను తిరిగి ప్రారంభమవగానే, మంజిమ తండ్రి మనుషులతో వచ్చి, జీవాని కొట్టి ఆమెని తీసికెళ్ళి పోతాడు. ఇక జీవా మంజిమతో ఆనంద్ పెళ్ళి జరిపించే సమస్య జోలికి పోడు. ఈ కథ అక్కడితో ఆగిపోతుంది. ప్లాట్ పాయింట్ వన్ తో ఏర్పడిన  సమస్య, గోల్, యాక్టివ్ క్యారక్టర్ ఇవన్నీ అదృశ్యమై పోతాయి. ప్రత్యర్ధి పాత్రగా కన్పించిన మంజిమ తండ్రి మంజిమని తీసికెళ్ళి పోయి ప్రత్యర్ధి పాత్రని చాలించుకుంటాడు. ఆ కథే అదృశ్యమైపోయి, ఆనంద్ కి ప్రియా భవానీ శంకర్ తో వేరే ప్రేమ కథ ప్రారంభం! ప్రధాన పాత్రగా కన్పించిన జీవా సహా ఆనంద్ పాసివ్ పాత్ర అయిపోవడం. ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ తండ్రితో ఇంకో సమస్య. ఈ సమస్య తేల్చడానికి జీవా ఆనంద్ లు ఏమీ చేయకుండానే, మంజిమ తండ్రి మళ్ళీ ఆమెకి పెళ్ళి పెట్టేసి ఇంకో సమస్య... ఇంతలో ఇంకేదో పని కల్పించుకుని కబడ్డీ పోటీలతో క్లయిమాక్స్.          

    వాటికవే సంఘటనలు జరుగుతూ, సమస్యలు వాటికవే పరిష్కారమయ్యే కథనమంతా లైటర్ వీన్ కథనమనుకుంటే, మొదట దెబ్బ తినేది పాత్ర చిత్రణలే. కథ కవసరమైన కథాంగాలనే లేకుండా చేస్తే, అదెలాటి లైటర్ వీన్ అవుతుందో ఇలా చూస్తాం. ఇలా మొదటిసారి చూస్తున్నాం...

సికిందర్