రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 12, 2022

1155 : స్పెషల్ ఆర్టికల్

        

2022 జనవరి 7-  ఏప్రెల్ 8 మధ్య  మూడు మాసాల్లో ఓ 50 పెద్ద, మధ్య, చిన్న తరహా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చిన్నా చితకా సినిమాలన్నీ చిరునామా లేకుండా పోయాక, కాస్త తెలిసిన 25 సినిమాలు చూస్తే 20 ఫ్లాపయ్యాయి. రాధేశ్యామ్’, అతిధి దేవో భవ’, రౌడీ బాయ్స్’, హీరో’, గుడ్ లక్ సఖీ’, సెబాస్టియన్ - పిసి 524’, ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, స్టాండప్ రాహుల్’, మిషాన్ ఇంపాసిబుల్’, గని  ఇవి కొన్ని ప్రముఖ ఫ్లాపులు. ఇవి భారీ నష్టాల్ని మిగిల్చాయి. రాధేశ్యామ్ ని పక్కన బెడదాం. ఈ ఫ్లాపుల్లో రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్’, తాప్సీ పన్నూ నటించిన మిషాన్ ఇంపాసిబుల్’, వరుణ్ తేజ్ నటించిన  గని’- ఈ చివరి మూడిటి కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, స్టాండప్ రాహుల్ ఓవర్సీస్ కలుపుకుని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే 62 లక్షలే! దీని బిజినెస్ కోటీ 87 లక్షలు. బయ్యర్లకి తేలిన నష్టం కోటీ 25 లక్షలు. బడ్జెట్ మూడున్నర కోట్లు. ఇలా నిర్మాత నష్టాన్ని ఓటీటీ, శాటిలైట్స్ తీర్చేస్తాయి.

        రియాల వారీగా దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే, నైజాం 18 లక్షలు, సీడెడ్ 9 లక్షలు, ఉత్తరాంధ్ర 10 లక్షలు, ఈస్ట్ - వెస్ట్ 10 లక్షలు, గుంటూరు - కృష్ణా 9 లక్షలు, నెల్లూరు 3 లక్షలు, ఓవర్సీస్ 5 లక్షలు. మొత్తం 62 లక్షలు.

        మిషాన్ ఇంపాసిబుల్ క్లోజింగ్ కలెక్షన్స్ ఓవర్సీస్ కలుపుకుని 95 లక్షలు! దీని బిజినెస్  రెండు కోట్ల 22 లక్షలు. బయ్యర్లకి నష్టం కోటీ 27 లక్షలు. బడ్జెట్ సుమారు ఆరు కోట్లు. ఈ నిర్మాత నష్టాన్ని కూడా ఓటీటీ, శాటిలైట్స్ తీర్చేస్తాయి.

        ఏరియాల వారీగా దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే, నైజాం 29 లక్షలు, సీడెడ్ 16 లక్షలు, ఉత్తరాంధ్ర 21 లక్షలు, ఈస్ట్ - వెస్ట్ 7 లక్షలు, కృష్ణా - గుంటూరు 9 లక్షలు, నెల్లూరు 6 లక్షలు, ఇతర భాషలు, ఓవర్సీస్ కలుపుకుని 7 లక్షలు.  మొత్తం 95 లక్షలు.

        ఇక గని నిన్న ఆదివారం కలుపుకుని తొలి మూడు రోజులు ఓవర్సీస్ సహా 4 కోట్ల 18 లక్షలు వసూలు చేసింది. బిజినెస్ 25.30 కోట్లు, బడ్జెట్ 35 కోట్లు. బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 21.82 వసూలు చేయాలి. నిన్న ఆదివారం మరీ పడిపోయిన వసూళ్ళు (69 లక్షలు) చూస్తే అసాధ్యమని తెలుస్తోంది. రేపు 13, 14 తేదీల్లో విడుదలయ్యే బీస్ట్’, కేజీఎఫ్ 2 ల ముందు గని తట్టుకుని నిలబడడం సందేహమే. ఈ నిర్మాత నష్టాన్ని కూడా ఓటీటీ, శాటిలైట్లే తీర్చాలి.

        ఓవర్సీస్ కలుపుకుని దీని తొలి మూడు రోజుల వసూళ్ళు చూద్దాం : నైజాం కోటీ 38 లక్షలు, సీడెడ్ 43 లక్షలు, ఉత్తరాంధ్ర 58 లక్షలు, ఈస్ట్ - వెస్ట్ 52 లక్షలు, గుంటూరు - కృష్ణా 54 లక్షలు, నెల్లూరు 18 లక్షలు, కర్ణాటక 24 లక్షలు, ఓవర్సీస్ 31 లక్షలు. మొత్తం నాల్గు కోట్ల 18 లక్షలు.

చందాలిస్తున్నారు
        పై వివరాలు స్పష్టం చేస్తున్నదేమిటంటే, విడుదలవుతున్న విషయం లేని తెలుగు సినిమాలకి ప్రేక్షకులు డబ్బులివ్వడానికి నిరాకరిస్తున్నారని. చందాలేసుకున్నట్టు అరకొర డబ్బులిచ్చి వదిలేస్తున్నారని. ఇక ఓటీటీ, శాటిలైట్లే ఆశాకిరణా లన్నట్టు నిర్మాతల్ని అటు వైపు నెట్టేస్తున్నారని. అలాగే ఓటీటీ, శాటిలైట్ల ద్వారా నష్టాలు తీర్చుకుని ఎలాగో బయటపడతున్నారు నిర్మాతలు.

        థియేటర్లో ప్రేక్షకుల కోసం తీసే సినిమాలకి ప్రేక్షకులు డబ్బివ్వక, నిర్మాతలు ఇతర చోట్ల లాభార్జన చేసుకునే పరిస్థితి వచ్చింది. అంగడి కోసం ఉత్పత్తి చేసిన వస్తువుని అడవిలో అమ్ముకున్నట్టు. కానీ అంబానీ జియోని అడవి జంతువుల కోసం ప్లాన్ చేయలేదు. నిర్మాతలు, మేకర్లు మాత్రం అటవీ ప్రదర్శనల కోసమే సినిమాలన్నట్టు  ఆటవికంగా, ప్రణాళికా బద్ధంగా రూపొందిస్తున్నారు. ఇలా ఇతర మార్గాల్లో  లాభార్జనకి వీలున్నప్పుడు ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడమెందుకు? ఓటీటీల కోసమే, శాటిలైట్ల కోసమే సినిమాలు తీసుకోవచ్చుగా? అద్దెలు కట్టి థియేటర్ రిలీజులు, థియేటర్లో రాని ప్రేక్షకుల కోసం షోలూ వగైరా దేనికి? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

        పైన పొందుపర్చిన వసూళ్ళ వివరాలు ఆలకించక పోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ మూడునెలల్లో ఎన్ని రిలీజయ్యాయి, ఎన్ని ఫ్లాపయ్యాయి ఎందరికి తెలుసు? 25 తెలిసినవి విడుదలైతే 20 ఫ్లాపయ్యాయని ఎంత మందికి తెలుసు? ఇవి తెలుసుకోకుండా ఎలా సినిమాలు తీయాలో ఎలా తెలుస్తుంది?

        వారం వారం విడుదలవుతున్న సినిమాల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జయాపజయాల విశ్లేషణ చేసుకోక పోతే ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే వుంటుంది. విడుదలయ్యే పెద్ద సినిమాల పని తీరే తప్ప మిగతా మధ్య, చిన్న తరహా సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఏం ఆర్జిస్తున్నాయీ తెలుసుకునే ఆసక్తి లేకపోతే పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు.

        శనివారం బెంగుళూరు నుంచి సీనియర్ జర్నలిస్టు కాల్ చేసి, ఫలానా ఆ పానిండియా మూవీ అంత వసూలు చేసిందటగా అని అంటే - ఎంత వసూలు చేస్తే మనకెందుకండీ, అది ట్రేడ్ పండితులు చూసుకునే విషయం, మనం సినిమా ఎలా వుందో రివ్యూ రాసి వూరుకుంటాం, పూటపూటకీ నెట్లో కలెక్షన్ డేటా, దాని మీద ఫ్యాన్స్ వార్ మన బుర్ర కెక్కించుకోవడం దేనికీ?- అనాల్సి వచ్చింది.

విడుదలల సమాచారానికి దూరం
        మేకర్ల విషయం కూడా ఇంతే, ఇలాగే వుండాలి. అయితే ఈ డేటా వార్ తో కాలక్షేప కబుర్లు చెప్పుకుని కాలం గడిపే వాళ్ళే ఎక్కువ. పెద్ద సినిమాలు తప్పితే మధ్య, చిన్న తరహా సినిమాలు వారం వారం ఏవేవి విడుదలవుతున్నాయో కూడా చాలామంది మేకర్లకి తెలీదంటే ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. తెలుసుకోవాలని కూడా అనుకోరు. ఈ మధ్య పెద్ద సినిమాలు లేని వారం చిన్నా చితక సినిమాలు ఏడెనిమిది విడుదలవుతున్నాయి. వీటి టైటిల్స్ కూడా తెలీవంటే తెలీవు. గత వారం గని  తో బాటు ఐదు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలేమిటో ఎంతమంది మేకర్లకి తెలుసో ఆలోచించాలి.

        ఆదివారం కేవలం రెండంటే రెండు నిమిషాలు కేటాయించి ఆంధ్రజ్యోతి తిరగేస్తే,  ఆ వారం విడుదలయ్యే కొత్త  సినిమాల యాడ్స్ రెండు పేజీల నిండా వుంటాయి. ఈ రెండు పేజీల కోసం రెండు నిమిషాలు కేటాయించే వాళ్ళెంత మంది? మార్కెట్లో ఏం సినిమాలొస్తున్నాయో సమాచారం లేని జీవితం మేకర్ జీవితమేనా? దీనికి బదులు ఓటీటీలో ఆ మలయాళం వచ్చింది, ఈ తమిళం వచ్చిందీ అని ఆర్టీఐ కార్యకర్త ల్లాగా ఇన్ఫర్మేషన్ లాగి అందించడం.

        ఈ వ్యాసం స్టార్ సినిమాల మేకర్ల గురించి కాదు. వాళ్ళకి ఏ వారం ఏ చిన్నా చితకా విడుదలవుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు తీసే మేకర్ల సినిమాలు 10 వుంటాయి. మిగతా 90 సినిమాలు మధ్య, చిన్న తరహా సినిమాలు తీసే  మేకర్లవే. వీళ్ళల్లో 90 శాతం మళ్ళీ కొత్త వాళ్ళే. నిన్న ఆదివారం పండక్కి ఏకబిగిన 20 మధ్య, చిన్న తరహా సినిమాల ప్రారంభోత్సవాలు జరిగినట్టు సమాచారం. ఈ నిర్మాతలూ మేకర్లూ కొత్త వాళ్ళే. ఈ వర్గం గురించే ఈ వ్యాసం.

        విరివిగా 90 శాతం మధ్య, చిన్న తరహా సినిమాలు  తీయడానికి వచ్చే మధ్య, చిన్న తరహా మేకర్లు తాము తీయబోయే సినిమా గురించే తప్ప మార్కెట్ గురించి ఆసక్తి లేకపోతే ఆ 90 శాతాన్నీ ఫ్లాపుల లిస్టులో నమోదు చేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. గత 20 ఏళ్ళుగా జరుగుతోందిదే.  

        స్క్రిప్టు రాసుకోవడమంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గ్రిక్చర్ మాత్రమే కాదు, ఇకో సిస్టమ్ కూడా. ఇక్కడ ఇకో సిస్టమ్ అంటే మార్కెట్లో విడుదలవుతున్న కొత్త సినిమాలు, వాటి కథాంశాలు, ప్రేక్షకుల రెస్పాన్స్, రివ్యూలు, వసూళ్ళూ - మొదలైన వాటితో కూడిన భౌతిక భౌగోళిక వాతావరణ స్థితి. సినిమా పర్యావరణ వ్యవస్థ.

        ఈ వ్యవస్థ గురించి ఆలోచనలేకుండా, ఎమోషన్, పాషన్, బర్నింగ్ యాంబిషన్ లతో  మాత్రమే స్క్రిప్టు రాసేసి, సినిమా తీసేసి, మార్కెట్లో పెడితే అది పర్యావరణ కాలుష్యానికి దారి తీసి, శిక్షార్హ నేరమవుతుందే తప్ప మరోటి కాదు, అందమైన అట్టర్ ఫ్లాప్ తో.  

        అంటే విడుదలయ్యే అన్ని సినిమాలూ చూడాలని కాదు. వీలున్నన్ని చూడొచ్చు జేబు సహకరిస్తే. ముఖ్యంగా వాటి కథాంశాలు, అవెలా తెరకెక్కాయీ  తెలిపే రివ్యూల మీద దృష్టి పెట్టాలి. వీటిలో చాలా వాటికి రివ్యూలు కూడా రాక పోవచ్చు. కానీ వాటి కథలేమిటో ఎక్కడో సమాచారం లభించక పోదు. దీంతో ఆ వారం ఏఏ జానర్ల సినిమాలు వచ్చాయి, అవెందుకు ఆడుతున్నాయి, లేదా ఆడడం లేదు, మనం తీస్తున్న జానరేంటి, వాటికన్నా మనమెలా బెటర్ గా తీయగలం- ఈ మూల్యాంకన చేసుకున్నప్పుడే రేపు సినిమాతో మార్కెట్లో ఎక్కడుంటామన్నది తెలుస్తుంది.

        ఇకో సిస్టంని కలుపుకుని సినిమా కథని ఆలోచించకపోతే ఆ సినిమా ఇకో సిస్టం నుంచి దూరమైపోతుంది. స్క్రిప్టు రైటింగ్ త్రికోణీయ కలాపమని అంటారు. అంటే మేకర్ కథ గురించే ఆలోచించి కథ రాయకూడదు. ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించి రాయాలి. ఇలా మేకర్-కథ-ప్రేక్షకులనే బంధం రచనకి ముఖ్యమవుతుంది. ఇక్కడ ప్రేక్షకులనే మాటని విస్తరించి ఇకో సిస్టంగా చూడాల్సి వుంటుంది. వారం వారం ఇకో సిస్టం మీద నిఘా, నాలెడ్జీ రచనలో పొరపాట్ల నుంచి కాపాడతాయి.

ప్లే స్కూల్ స్క్రీన్ ప్లేలు
        ఇక సినిమా డిజిటలీ కరణ చెంది మేకింగ్ ఎవరైనా చేసుకోవచ్చనే స్వేచ్ఛా ద్వారాలు తెర్చుకున్నాక, ఈ స్వేచ్ఛతో  - మా యిష్టం ఎలాగైనా తీసుకుంటామెనే ధోరణొకటి పెరిగింది. అంటే ఇండిపెండెంట్ సినిమాలన్న మాట. వీటికి పరిమిత ప్రేక్షకులే తప్ప, ఫేస్ బుక్ మిత్ర బృందం మునగ చెట్టు నెక్కించడం తప్ప మరేమీ వుండదు. వీటికి ఇకో సిస్టంతో పనుండదు. వీటికి మార్కెట్లోకి వచ్చి కలెక్షన్లు పొందే వీలుండదు. ఇకో సిస్టం అంటేనే, మార్కెట్ అంటేనే కమర్షియల్ సూత్రాలూ స్క్రీన్ ప్లే సూత్రాలూ మొదలైనవి. ఈ ఇండిపెండెంట్ సినిమాలకి స్క్రీన్ ప్లే సూత్రాలంటేనే గిట్టదు. స్క్రీన్ ప్లే సూత్రాలు కమర్షియల్ మార్కెట్ గురించే ఏర్పడ్డాయి. ఇవి పట్టని ఇండిపెండెంట్ మేకర్లు ఫిలిమ్ ఫెస్టివల్స్ కెళ్ళొచ్చు, డైరెక్ట్ ఓటీటీ కెళ్ళొచ్చు, ఈ స్క్రీన్ ప్లేలు ప్లే స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికి రావు.

        రెండేళ్ళు హార్డ్ వర్క్ చేసి సినిమా తీశామంటారు. దేని ఆధారంగా? ఇకో సిస్టం ఆధారంగానా? అసలు వర్క్ ని హార్డ్ వర్క్ అనడమేమిటి? పనిని అంత కష్ట పెట్టుకుని ఎందుకు చేయాలి? వర్కుని హార్డ్ వర్క్ అని శాపం ఎందుకు పెట్టాలి. ఈజీ వర్క్, ఈజీగా చేసుకుపోవాలని ఎందుకు వర్క్ కి ఆశీస్సులందించ కూడదు. నేను బిజీ బిజీ అని మాటలెందుకు కాలానికి శాపం పెడుతున్నట్టు. నేను ఈజీ ఈజీ, నా దగ్గర చాలా టైముందని ఎందుకు కాలాన్ని ఆశీర్వదించ కూడదు. మైండ్ కి ఏ మాట అందిస్తే ఆ పరిస్థితినే అందిస్తుంది మైండ్. ఢిల్లీ వెళ్ళిన మంత్రి బిజీబిజీ అని టెంప్లెట్ లో పెట్టి వార్తలు రాసేస్తూంటారు. అందుకే మంత్రుల పని తీరులు అలా అఘోరిస్తూంటాయి. ఈజీ ఈజీ అనుకుంటే మంత్రి గార్ల పనితీరులు జనరంజకంగా వుంటాయి. ఈ బిజీ బిజీ, హార్డ్ వర్క్ అన్న పదాలు ఆత్మ శక్తిని తగ్గించే, అసహ్యమేసే సోమరి పదాలు. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డులో వుంటున్న వాళ్ళకి.

        ఆఖరిగా - స్టీవెన్ స్పీల్ బెర్గ్ మాట -  I love to go to a regular movie theater, especially when the movie is a big crowd-pleaser. It's much better watching a movie with 500 people making noise than with just a dozen.”

—సికిందర్