రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జులై 2019, సోమవారం

856 : స్క్రీన్ ప్లే సంగతులు

            A TALE exists with no greater sense of its self, no greater purpose beyond a simple rehashing of events...127 Hours isn’t the only one—Taken, Coraline, Battle: LA, True Grit, Inglorious Basterds, 2012, Where the Wild Things Are, The Informant, Public Enemies—all tales with little to say.  All works of fiction that are easily forgotten.
            A STORY  gives audience members an experience they can’t have on their own. This experience is why audience members return to a film over and over again. Star Wars, The Shawshank Redemption, The Lives of Others, The Godfather, The Apartment, The Sound of Music, Toy Story, Toy Story 2 (pretty much anything Pixar), The King’s Speech, The Dark Knight, Good Will Hunting, Chinatown—all stories with much to say. All works of fiction that are not so easy to forget
.
―From Narrative First 



                   విజయ్ దేవరకొండ 2017 లో ఆల్రెడీ ‘ద్వారక’ అనే ఫ్లాపయిన ‘గాథ’ లో నటించాక తిరిగి డియర్ కామ్రేడ్’ అనే ఇంకో ‘గాథ’ లో నటించే పొరపాటు చేశాడు.  గాథతో సినిమా అంటేనే గ్యారంటీగా ఫ్లాప్. కమర్షియల్ సినిమాలు డిమాండ్ చేసేది కథలే గానీ  చప్పిడి గాథలు కాదు. ఒకసారి ఫ్లాపయిన గాథల లిస్టు చూస్తే- మొగుడు, పైసా, ఓకే బంగారం, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా, జక్కన్న, ఉన్నది ఒకటే జిందగీ, రాజుగారి గది -2, అంతరిక్షం, బ్రహ్మోత్సవం, కబాలీ, ద్వారక...ఇలా చాలా వుంది, ఇప్పుడు బాధాకరంగా డియర్ కామ్రేడ్ ని లిస్టులో కలుపుకోవాలి. అసలు కథలు వేరు, గాథలు వేరనీ, గాథలు సినిమాలకి పనికి రావనీ కనిపెట్టిన హాలీవుడ్ లోనే తెలియక కొందరు గాథలతో సినిమాలు తీస్తూంటారు.


          తెలుగులో తెలిసి గాథలు తీస్తున్నారా అంటే అదేం కాదు, కథే తీస్తున్నామనుకుంటారు. తీరా అది గాథగా తేలి బెడిసి కొడుతుంది. కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో తేడా తెలిసి, ఉద్దేశపూర్వకంగానే  గాథలు తీస్తే, పైన చెప్పుకున్న సినిమాల్లా వుండవు. మోహన్ బాబు నటించిన విజయవంతమైన గాథ ‘పెదరాయుడు’ లా వుంటాయి. ఉద్దేశపూర్వకంగా, ప్రామాణికంగా తీసే గాథల్లో ఉదాత్త పాత్ర వుండి, ఉదాత్త కథా కథన నియమాల పాలన వుండి అప్పుడు సక్సెస్ అవుతాయి. ఇది అందరివల్లా కాదు. 

          కథలే తీస్తున్నామనుకుంటూ తెలియక తీస్తున్న గాథలు ఎంత మభ్య పెట్టేవిగా వుంటాయంటే, గాథల పరిజ్ఞానం వున్న వాళ్ళు  సైతం  సినిమా చూస్తూ ఇది గాథ అని వెంటనే కనిపెట్ట లేరు. చూస్తున్నది కథే అనుకుంటూ, ఫస్టాఫ్ లో ఇక ప్లాట్ పాయింట్- 1 వస్తుందని, హీరోకి గోల్ ఏర్పడి కథ ప్రారంభమవుతుందని అరగంట, ముప్పావు గంట, పోనీ ఇంటర్వెల్ వరకూ ఎదురు చూస్తారు. 

          ఇంటర్వెల్ కైనా ఇది జరిగిందా, పోనీలే ఇప్పుడైనా కథ ప్రారంభమైందనుకుంటారు. ఇంటర్వెల్ కి కూడా హీరోకి గోల్ ఏర్పడక, కథ ప్రారంభం కాకపోయిందా, ఇదిక మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుందని డౌట్ వస్తుంది. హీరోకి గోల్ ఏర్పడనంత వరకూ అది స్క్రీన్ ప్లే స్పేస్ లో బిగినింగ్ విభాగమే. గోల్ ఏర్పడితేనే స్క్రీన్ ప్లే మిడిల్లో పడి కథ నందుకుంటుంది.

          కనుక ఇంటర్వెల్లో కూడా గోల్ ఏర్పడలేదంటే, సెకండాఫ్ లో ఇంకా ఈ బిగినింగ్ అన్యాయంగా ఇంకెంత స్పేస్ తీసుకుంటుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. రెండు గంటల సినిమాలో గంటన్నర గడిచిపోయి, చివరి అరగంటకి బిగినింగ్ పూర్తయి, అప్పుడు హీరోకి గోల్ ఏర్పడి, కథ ప్రారంభమై మిడిల్లో పడితే, ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని తేలిపోతుంది. 

          అంటే ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంటకి రావాల్సిన మిడిల్, పోనీ ఇంటర్వెల్ కైనా రావాల్సిన మిడిల్, ఇంకెప్పుడో సెకండాఫ్ లో చివరి అరగంటలో వచ్చిందంటే,  ఆ మిడిల్ అనేది స్క్రీన్ ప్లేలో మటాష్ అయిపోయినట్టే. రెండు గంటల సినిమాలో యాభై శాతం, అంటే గంట పాటు సుదీర్ఘంగా వుండాల్సిన మిడిల్ విభాగం, చివరి అరగంటకి జరిగిపోయి, అక్కడున్నకొద్ది స్పేస్ లో ఎండ్ విభాగంతో కలిసి పంచుకుందంటే, అది మటాష్ అయినట్టే లెక్క. ఇంకో మాటల్లో చెప్పుకుంటే, ఎప్పుడో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింటు వన్ తర్వాత మొదలవాల్సిన మిడిల్, ఇంకెప్పుడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర మొదలవుతుందన్న మాట! 

          స్క్రీన్ ప్లేలో ఆ చివరి అరగంటలో ఎండ్ తో కలిసి స్పేస్ ని పంచుకోవడమంటే మిడిల్ కి మిగిలేది ఓ పావుగంటే. ఈ పావుగంటలోనే ప్లాట్ పాయింట్ -1 వచ్చి, గోల్ ఏర్పడి, కథ ప్రారంభమై చప్పున ముగిసి పోతుందన్న మాట. అంటే స్క్రీన్ ప్లేలో గంటన్నర పాటూ బిగినింగ్ విభాగమే కథ ప్రారంభం కాకుండా, హీరో ఏమీ చేయకుండా గడిచిపోతుందన్న మాట. ఇలా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఈ సినిమాలు 2000 నుంచీ కథ - మాటలు-  స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకునే నయా దర్శకుల ట్రెండ్లో వచ్చినవే, ఇంకా ఇప్పటికీ వస్తున్నవే.

          సరే, ఇంతవరకూ సినిమా చూస్తూ కూర్చుంటే, ఇలా చివర్లోనైనా  ప్లాట్ పాయింట్ వన్ వస్తే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనైనా తెలుస్తుంది. ఇప్పటికైనా  ప్లాట్ పాయింట్ వన్ రాకపోతే అప్పుడు తెలుస్తుంది, ఇది మిడిల్ మటాష్ కూడా కాదనీ, ఇంత సేపూ వృథాగా చూస్తూ కూర్చున్నది గాథ అనీ! సినిమా చివరి అరగంట కొస్తే గానీ చూస్తున్నది గాథ అని తెలుసుకోలేమన్నమాట. పరిజ్ఞానం వున్న వాళ్ళని కూడా ఇలా మభ్యపెడతాయి గాథలతో వచ్చే
సినిమాలు.

           ‘డియర్ కామ్రేడ్’ ఇలా మభ్యపెట్టేదే. ఐతే ఈ గాథలో స్పెషాలిటీ ఏమిటంటే, అంతవరకూ ప్రేమగాథగా వున్న దాన్ని చివర్లో హీరోయిన్ మీద లైంగిక వేధింపుల ‘కథ’ గా అతికించి ముగించడం! గాథకి చివర ఓ కథని అతికించడం. విచిత్రం. కథో గాథో చేస్తున్నప్పుడు ఏ నియమాలూ పాటించనవసరం లేదనుకోవడం. మంచిదే, వాళ్ళ పెట్టుబడి వాళ్ళిష్టం. 

          ఇప్పుడేం జరిగిందంటే, ప్రేమ గాథ అకస్మాత్తుగా లైంగిక వేధింపుల కథగా మారడంతో మూవీ టోన్ (స్వరం) మారిపోయి, రసభంగమై, మూడ్ - ఫీల్ అనేవి కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది. జానర్ మర్యాద చెడిపోవడం సరే. 

కామ్రేడ్  మెచ్యూరిటీ 
       విజయ్ దేవరకొండ పాత్ర ఫస్టాఫ్ లో కాలేజీలో కామ్రేడ్ గా వున్నంతవరకూ యాక్టివ్ పాత్రే. కామ్రేడ్ పాత్ర కోసం స్టూడెంట్ యూనియన్లూ, వాళ్ళ మీద ‘శివ’ టైపు రాజకీయ పెత్తనాలూ, ఎలక్షన్లూ అనే ఇప్పుడు లేని ఒక అవాస్తవిక గాథా ప్రపంచాన్ని సృష్టించారు. పూర్వం వామపక్ష నేత అయిన తాత నుంచి స్ఫూర్తి పొంది కామ్రేడ్ గా స్టూడెంట్ లీడర్ అయిన తను, రొటీన్ మాస్ క్యారక్టర్ లా ఆవేశ ప్రకోపితుడై దెబ్బలాటలకి దిగడమే  కన్పిస్తుంది. 

          తర్వాత హీరోయిన్ రస్మికతో ఈ రోమాంటిక్ సీన్స్ పాత్ర స్వభావంలోకి ఇమిడేవి కావు. పేరుకి మాత్రం కామ్రేడ్, మిగతా పాత్ర చిత్రణంతా రొటీన్ లవర్ బాయ్ తరహానే. హీరోయిన్ అక్కకి లవ్ లెటర్ రాసే చిలిపి పని కూడా చేస్తాడు. కామ్రేడ్ అన్నాక, ఒక లీడర్ అన్నాక  మంచి మెచ్యూర్డ్  పాత్రయి వుంటుందని ఆశిస్తాం. ఆ మెచ్యూరిటీ ఏమీ కన్పించదు. కామ్రేడ్స్ అన్నాక శల్య పరీక్షలు చేసి భావజాల సామీప్యమున్నఅమ్మాయిని  ప్రేమిస్తారేమో కానీ, మరోలా బిహేవ్ చేయరు. చాలా వరకూ తమ  వర్గంలో, తమతో కలిసి పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడతారు. ఇక్కడ హీరోయినేమో పెట్టుబడిదారీ వర్గపు ఆట అయిన  క్రికెట్ క్రీడాకారిణి! ఎలా కుదురుతుంది ఈ గాథా నేపథ్యంతో పాత్రల ప్రొజెక్షన్.

          ఈమెతో ప్రేమలో విడిపోయాక సాత్వికుడుగా మారిపోయి హిమాలయాల్లో గడ్డం పెంచుకుని మూడేళ్ళు వుండిపోవడం రెడ్ రెబెల్ కామ్రేడ్ గిరీకి ఇంకో గొడ్డలి పెట్టు. కమ్యూనిస్టు, కేపిటలిస్టుగా, స్పిరిట్యువలిస్టుగా ఎలా పడితే అలా కనపడతాడు. పాత్ర చిత్రణకి ఓ దృక్పథం, స్థిరత్వం కన్పించవు. ‘శంకరాభరణం’ లో శంకర శాస్త్రి సాంప్రదాయవాది  కాదు, అభ్యుదయవాది, సెక్యులరిస్టు. ఈ పాత్ర చిత్రణ ఇలాగే స్థిరంగా కొనసాగుతుంది. 

          విజయ్ కి తాతే సలహా ఇచ్చి హిమాలయాలకి వెళ్ళేలా చేస్తాడు - దూర ప్రయాణం చెయ్, జీవితంలో  నువ్వేం చేయాలో తెలుస్తుందని. చే గువేరా మోటార్ సైకిల్ డైరీస్ ఐడియానేమో. కానీ మెడికల్ స్టూడెంట్ అయిన చే గువేరా లాటిన్ అమెరికా పర్యటించింది సామాజిక స్థితిగతుల్ని తెలుసుకోవడానికి, వాటి పక్షాన తిరుగుబాటు చేయడానికి. అల్లూరి సీతారామరాజు కూడా దేశపరిస్థితిని  ఆకళింపు చేసుకోవడానికి దేశాటన చేసి వచ్చే తుపాకీ చేపట్టాడు. 

          ఆల్రెడీ ఒక స్టూడెంట్ లీడరే అయిన కామ్రేడ్ బాబీకి ఇంకా పర్యటనేమిటి? జగన్ పర్యటన చేసి వచ్చే సీఎం అయ్యాడు. అంటే కామ్రేడ్ బాబీ సమాజం గురించి ఏమీ  తెలుసుకోకుండా కామ్రేడ్ అయిపోయాడా? మెడికల్ స్టూడెంట్ అయిన చే గువేరా పర్యటనతో విప్లవ వీరుడయ్యాడు. ఎర్ర కామ్రేడ్ బాబీ పర్యటనలో ఎర్ర రంగు తుడిపేసుకుని మెడికల్ ఎక్స్ పర్ట్ అయ్యాడు. హిమాలయాల్లో ప్రకృతి ధ్వనుల్ని రికార్డు చేసి ఆ ధ్వనులతో మనుషుల్ని బాగుపర్చే సౌండ్ థెరపిస్టు అయిపోయాడు! మాజీ కామ్రేడ్ అయిపోయాడు.  ఒక పాత్రలో, ఒక గాథలో ఎన్ని పరస్పర విరుద్ధ విషయాలు అడ్డగోలుగా జొప్పించారు...ఏక సూత్రత అనేదే లేదు. 


          కానీ సౌండ్ థెరపీతో తనని తానే బాగుపర్చుకోలేకపోయాడు. ఆ మూడేళ్ళూ ఆమె జ్ఞాపకాలతో రోదించాడు. కలవరించాడు. కునారిల్లి పోయాడు. విచిత్రంగా ఈ సౌండ్ థెరపీతో తర్వాత ఆమెని బాగుపర్చాడు. ఆమె ఎర్ర రంగు తుడిపేసుకో మనలేదు. కొట్లాటలు, హింస మానుకోమని మాత్రమే చెప్పింది. మానుకుని సైద్ధాంతిక పోరాటాలు చేస్తే సరి. కమ్యూనిజాన్నే వదిలించుకోవాలన్నట్టుగా హిమాలయాలకి పోయాడు. ఆ తర్వాత ఈ గాథలో కామ్రేడే కాకుండా పోయాడు. ఇదిగో నేనీ ప్రేమని బలిచ్చే రెబలిజాన్ని వదిలి పారేశా, వస్తున్నా - అని ఒక్క కాల్ ఆమెకి చేయలేకపోయాడు. ఇదీ యాక్టివ్ క్యారక్టర్ పాసివ్ గా మారిపోతూ వచ్చిన గాథా క్రమం.

రెండు పిపి వన్లు
      
            ఇది కథే అనుకుని చూస్తూంటే ఫస్టాఫ్ లో రెండు ప్లాట్ పాయింట్ వన్ లు వస్తాయి విచిత్రంగా. రస్మిక క్రికెట్ ఆడి విజయ్ టీము గెలుపొందేలా చేసిన సందర్భంగా ఇచ్చిన పార్టీలో రాజకీయ కార్యకర్తలతో ఘర్షణ చూసి, రస్మిక చెప్పేస్తుంది - ఇలాటి గొడవలు తన కిష్టముండదని. ఇదొక ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఇంటర్వెల్లో మళ్ళీ భీకర గొడవ జరుగుతుంది. ఆ హింస మళ్ళీ చూసి తనకి  గొడవలంటే ఇష్టం లేదని మళ్ళీ అంటుంది. వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఇదింకో ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

        బయ్యర్లు కాల్స్ చేసి సినిమా నిడివి ట్రిమ్ చేయమంటున్నారనీ, ఎక్కడ చేయాలో అర్ధం గావడం లేదనీ వార్త వచ్చింది. మొదటి గొడవ తీసేసి, ఇంటర్వెల్ గొడవ వుంచుకుంటే సుదీర్ఘమైన ఫస్టాఫ్ నిడివి గంటన్నర నుంచి గంటంపావుకైనా తగ్గుతుంది. రిపీటీషన్ ని కత్తిరిస్తే ట్రిమ్ ఐపోతుంది సింపుల్. ఇలాటి రిపీటిషన్లు ఇంకా వున్నాయి. ఈ సినిమానే వొక రిపీటీషన్ల పిటిషన్. 

          ఇక ఇంటర్వెల్ కి రెండో సారైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది కాబట్టి. ఈ బారుగా సాగిన బిగినింగ్ విభాగం పూర్తయి, విజయ్ కి ఒక గోల్ ఏర్పడుతుందనీ, ఇక కథ ప్రారంభమవుతుందనీ సంతోషిస్తాం. కానీ సెకండాఫ్ ఓపెన్ చేస్తే జరిగేదేమిటంటే, విజయ్ హిమాలయాలకి జంప్. అంటే ఇది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదన్న మాట - అని మనకి ఇప్పుడు అర్ధమవుతుంది. అంటే బిగినింగ్ ఇంకా ముగియలేదన్న మాట. కథే ప్రారంభం కాలేదన్న మాట. ఇక ఈ సెకండాఫ్ ని చాలా
భరించాలన్న మాట. హీరోయే ప్రేమ కథని వదిలేసి సెకండాఫ్ స్పేస్ ని ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోతే, హీరోయిన్ కూడా ఏటో వెళ్ళిపోతే, మనమెందుకు ఆ స్పేస్ లో కూర్చుని వుండడం.  హీరోహీరోయిన్లు కన్పించుట లేదు అని కంప్లెయింట్ చేయడమే. 

          మూడేళ్ళ తర్వాత తను హిమాలయాల్లో చేస్తున్న రీసెర్చికి డిమో కోసం హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కాల్ రావడం, అక్కడికెళ్తే  అక్కడే డిప్రెషన్ పేషంటుగా హీరోయిన్ వుండడం! కథా సౌలభ్యం కోసం పాత్రల్ని కిల్ చేస్తూ ఇలాటి కో ఇన్సిడెన్సులు ఇంకొన్ని  పంటికింద రాయిలా అడ్డుపడతాయి. ఎందుకంటే ఇక్కడ కథకుడు హీరో పాత్రని తన గ్రిప్ లోకి తెచ్చుకుని తన ఇష్టానుసారం కథ నడిపిస్తున్నాడు. యాక్టివ్ పాత్రయితే హీరో పాత్ర తన కథ తనే నడుపుకుంటుంది. కథకుడు జోక్యం చేసుకోడు. సినిమా కథలలోనే కాదు, సాహిత్యంలో కూడా కథకుడు కథలో జోక్యం చేసుకోకూడదన్నజనరల్ రూలుంది. కానీ ఇప్పటి సినిమా కథల్లో ఏం జరుగుతోందంటే, కథకుడు కథలో జోక్యం చేసుకోవడంతో పాసివ్ పాత్రలు పుట్టుకొచ్చి సినిమాల్ని ముంచేస్తున్నాయి. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు ఇంత పనీ చేస్తున్నాయి అజ్ఞానంతో సృష్టించుకుంటున్న పాసివ్ పాత్రలు. 20 - 30 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నపుడు యాక్టివ్, పాసివ్ క్యారక్టర్ లంటే ఏమిటో తెలియకపోవడం తెలుగు సినిమాల విచిత్ర విషాదం. ఈ విషాదం కూడా 2000 నుంచీ నయా దర్శకులతోనే మొదలైంది. నయా దర్శకులకి రచనా సామర్ధ్యం లేదు. వాళ్ళు  సాహిత్య మూలాల్నుంచీ, నాటక మూలాల్నుంచీ వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి. 

      ఇంటర్వెల్లో ప్రేమలో సమస్య దగ్గర్నుంచే కథకుడు పాత్రని హిమాలయాలకి పంపేసి  పాసివ్ గా మార్చడంతో, ఇక కోలుకోలేదు సెకండాఫ్ అంతా విజయ్ దేవరకొండ కామ్రేడ్ పాత్ర. హైదరాబాద్ హాస్పిటల్లో యాక్సిడెంటల్ గా హీరోయిన్ పేషంట్ గా ఎదురయ్యిందే తప్ప, ఆమె ఏమయివుంటుందనే ఆలోచన ఇంతకాలం కామ్రేడ్ కి లేదు. పెళ్లి చేసేసుకుందేమోనన్నవర్రీ కూడా లేదు. అతడి మనోగతం మనకి తెలీకుండా మూసేసి యాంత్రికంగా నడుపుతున్నాడు కథకుడు. ఇక పాత్ర బోరు కొట్టకుండా ఎలా వుంటుంది. 

          ఆమెకి యాక్సిడెంట్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లిందని మళ్ళీ గాథ వెనక్కొస్తుంది. రిపిటీషన్. అతనెలా హిమాలయాలకి వెళ్లి తనని తానూ ‘బాగు’ చేసుకున్నాడో. అలా ఆమెని ప్రకృతిలోకి తీసికెళ్ళి బాగు పర్చడం.  గాథయినా ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్ళే ఇంకో రిపీటీషన్ ఏమిటంటే, తను కాకినాడలో ఇంటికెళ్ళడం. మూడేళ్ళూ కన్పించని క్షేమ సమాచారం తల్లి అడగడం. ఈ సమాచారం ప్రేక్షకులకి తెలిసిందే, ఇంకెందుకు? ఇంకో రిపీటీషన్ హీరో ఫ్రెండ్ పెళ్లి అని కల్పించి, మళ్ళీ గాథని వెనక్కి కాకినాడకి షిప్ట్ చేయడం. ఆ పెళ్ళిలో ఆడి పాడడం. ఆల్రెడీ ఈ పెళ్ళిలో ఆటాపాటా ఫస్టాఫ్ లో హీరోయిన్ అక్క పెళ్ళిలో అయ్యిందే. 

          ఈ పెళ్లి పెరంటాల వ్యవహారం ఎలా వుందంటే, ఈ లెఫ్ట్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ జానర్ లో పానకంలో పుడకలా వుంది. కనీసం తన కామ్రేడ్ సిద్ధాంతాల ప్రకారం ఫ్రెండ్  పెళ్లయినా ఆదర్శ దండల మార్పిడి పెళ్లి కాలేదు. ఈ పెళ్ళిళ్ళతో కాన్సెప్ట్ కి వచ్చిన ఉపయోగం కూడా లేదు.  

          ఇది కథైతే హీరోకో గోల్ వుంటుంది. దాంతో  కథ ఏక త్రాటిపై నడుస్తుంది. గాథ అన్నాక, అందులో పాసివ్ పాత్ర అన్నాక, గోల్ వుండదు. అందుకని ఎలా పడితే అలా టైం పాస్ సన్నివేశాలు భర్తీ అవుతూ పోతాయి. కథకి స్ట్రక్చర్ వుంటుంది కాబట్టి  ఈ టైం పాస్ సన్నివేశాలు బిగినింగ్ లోనే వుంటాయి. మిడిల్లో వుండవు. స్ట్రక్చర్ వుండని గాథల్లో మిడిల్ వుండదు. బిగినింగే అంతులేకుండా సాగుతూ వుంటుంది ఇలాటి విషయం  లేని సన్నివేశాలతో. 

మార్కెట్ యాస్పెక్ట్ లేని కథ 
చివరిగా -  ఇక హిమాలయాలనుంచి వచ్చిన  హీరో మారాడని హీరోయిన్ తిరిగి ప్రేమిస్తుంది. ఎన్ని సార్లని  తిరిగి ప్రేమిస్తుంది? ఇంటర్వెల్ కి ముందు ప్రత్యర్థులతో ఘర్షణ పడినప్పుడు మారతానన్నాడు. అప్పుడు నమ్మి తిరిగి ప్రేమించింది. ఇంటర్వెల్లో ఇంకా భీకరంగా ప్రత్యర్ధులతో ఘర్షణ పడ్డాడు. ఇక ఇతణ్ణి నమ్మనని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ రౌడీ కొట్లాటల కారణం చేత హీరోయిన్ విడిపోవడమన్నది చాలా పాత టెంప్లెట్టే, కొత్త పాయింటేమీ లేదు. 

          ఇక సెకండాఫ్ లో హిమాలయాల్లో మారిపోయి వచ్చాడని తిరిగి రెండోసారి ప్రేమిస్తుంది. అంతలోనే తడాఖా చూపిస్తూ ఆమె క్రికెట్ బాస్ ని కొట్టి నానా బీభత్సం చేయడం తో షాక్ తిని, ఛీ నిన్నిక ప్రేమించను పొమ్మంటుంది. ఎన్నిసార్లని ఇలాగే  అంటుంది. ఇలా ఈ ప్రేమ గాథైనా ముందుకే పోదు. మాటిమాటికీ వెనక్కే పోతోంది. హీరోయిన్ కి ఓ స్పష్టత లేదు. పాసివ్ పాత్ర. మూడేళ్ళూ ఇంకా ఎందుకిలా వుండిపోయింది? అతడి కోసం ఎదురు చూస్తోందా? లేక ప్రేమలో దెబ్బ తిన్నది కాబట్టి, ఇక ప్రేమించనే కూడదని, పెళ్ళే చేసుకోకూడదనీ  ఇలా వుండి పోయిందా? ఈమె మానసిక లోకం కూడా అర్థం గాకుండా మూసేశాడు కథకుడు. భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేశాడు. పాత్రలతో తన స్వభావ ప్రకటనా స్వేచ్ఛ మాత్రం ఎలా పడితే అలా మారిపోతూ వుంది. 

          ఆమె యాక్సిడెంట్ కి కారణం ఆమె క్రికెట్ బాస్ ఆమెని నేషనల్ కి సెలెక్ట్ చేయాలంటే సెక్సువల్ ఫేవర్ డిమాండ్ చేయడం, దీని మీద ఆమె తోటి ప్లేయర్ కంప్లెయింట్ చేయడం, దీంతో ఆమెని చంపడానికి యాక్సిడెంట్. ఇదంతా విషయం లేకుండా నడుస్తున్నరెండు గంటల 20 నిమిషాల సుదీర్ఘ గాథకి, ఆకస్మికంగా విషయాన్ని సమకూర్చుకుని, 30 నిమిషాల కథగా - ముగింపుగా అతికింపు. 

          ఈ కథలో హీరోయిన్ పాసివే కాదు, విషాద పాత్ర. ఆమెకి ఈ లైంగిక వేధింపుల మీద పోరాడాలంటే భయం భయం. పరువు బజార్న పడుతుందని. హీరోకి ఏ మాత్రం సహకరించదు, పై పెచ్చు విడిపోతుంది. పాతకాలం టెంప్లెట్ హీరోయిన్ని ఈ కాలంలో  ప్రయోగించారు. 

       హీరోయిన్ పాత్రెలా వుందంటే, లైంగిక వేధింపుల పై అవగాహన ఏ మాత్రంలేదు. ఈ అవగాహన పెంచుకుని బయట యువతులు చుక్కలు చూపిస్తూంటే, ఈమె భయంతో ముడుచుకు కూర్చుంది. నేటి యువతులకి ఆదర్శంగా, సంఘీభావంగా చురుగ్గా వుండాల్సిన తను,  ఈ సినిమా చూసే ప్రేక్షకుల్లో నేటి యువతులకి కనెక్ట్ కాక అసంతృప్తి మిగిల్చే శాల్తీగా వుండిపోయింది. ఇంకా కమర్షియల్ సినిమాల్లో ఇదే వరస. యువతులకి ఒక ఆదర్శప్రాయమైన హీరోయిన్ పాత్రని తెరమీద చూడాలంటే దొరకడం లేదు. ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ కి ఇదొక లోపం. కథకుడి క్రియేటివ్ యాస్పెక్ట్ ఎక్కడా మార్కెట్ యాస్పెక్ట్ తో కలవడం లేదు. 

          ఈ సినిమాలో చెబుతున్న విషయం లైంగిక వేధింపుల గురించని చెప్పడానికి అధైర్య పడి రెండున్నర గంటలసేపు దాట వేయనవసరం లేదు. ‘మన్మర్జియా’ లో టౌన్లో మధ్యతరగతి కుటుంబంలో హీరోయిన్ సహజీవన కథ ఎంత సాఫీగా, ఫన్నీగా చెప్పారు. ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా’ లో సాంప్రదాయ కుటుంబంలో హీరోయిన్ స్వలింగ సంపర్కపు కథ ఎంత ముచ్చటగా చూపించారు. ‘లుకా  చుప్పీ’  లో కూడా మధ్యతరగతి కుటుంబంలో సహజీవన కథని ఎంత వినోదాత్మకంగా చూపించారు. బోల్డ్ కథల్ని ఫ్యామిలీ సినిమాలుగా మార్చి  సక్సెస్ అవడానికి ఎంత ధైర్యం కావాలి. ధైర్యం చేయకపోతే దగాపడడమే. 

          ‘డియర్ కామ్రేడ్’ హీరోయిన్ లైంగిక వేధింపుల కథయినప్పుడు అది మొదట్నుంచీ వుండాలి. హీరోయిన్ ఒక కారణం చెప్తుంది, గొడవలంటే తన కెందుకు ఇష్టం లేదో. తన అన్న కూడా గొడవల్లో చనిపోయాడు కాబట్టని. అలాంటప్పుడు లైంగిక వేధింపుల విషయంలో ఈ కారణంగానే భయపడాలి. ఆమె భయపడ్డానికి పరువు కారణంగా చూపించారు. అంటే అన్న మరణించిన భయం వొట్టిదే నన్న మాట. అందుకని కథలో అతకని అన్న మరణించిన భయం కాకుండా,  ఇంటర్వెల్లో  హీరో మీద ఫైర్ అవుతున్నప్పుడు - నేను నీ గొడవలకి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నానో తెలుసా - నాకు ఇంతకంటే పెద్ద డిస్టర్బెన్స్ వాడితో వుంది – అని క్రికెట్ బాస్ గురించి హీరోయిన్ బరస్ట్ అయివుంటే, ఈ భారమైన గాథ హుషారైన కథగా మారేది.

సికిందర్


855 : టిప్స్


     107. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో తెలుసుకుంటే  కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావా? ఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ  ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ పాసివ్ పాత్రల తేడాలే తెలీక, పాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయి, ఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు. 

         
 108.  కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తే, కమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనో, ఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేని, రుచీ పచీ లేని  కృత్రిమ అనుబంధాలు, సెంటిమెంట్లు కలిపి కుట్టి చూపిస్తే  గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదా, ఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి.

          109. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు
? విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతర, మతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితే, ప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం.   ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. ‘పెదరాయుడుఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. అయింది.

   
 110.బ్రొమాన్స్ లో నైనారోమాంటిక్ కామెడీ లోనైనా పెద్ద వయసు క్యారెక్టర్లు నీతులతో క్లాసులు పీకి యూత్ పోకడల్ని మార్చే చాదస్తాలు వుండవు.కానీ తెలుగులో ప్రతీ రోమాంటిక్ కామెడీ ఇలాగే వుంటూ ఫ్లాపవుతోంది. ఏదో మోరల్ పోలిసింగ్ చేయబోతారు దర్శకులు. అలాటిది ఇలాటి చాదస్తాలు ఏవీ లేని జానర్ స్పెసిఫిక్ కథగా హుషారు’ అనే  బ్రొమాన్స్ కొత్తఊపిరే.తల్లిదండ్రుల పాత్రలున్నా అవి కథని మేనేజ్ చేయకుండా సమస్యల్నీవాటి పరిష్కారాలనీ పిల్లలకే వదిలేస్తాయి. యూత్ వాళ్ళ జీవితాలు వాళ్ళే జీవించడం నేర్చుకునే స్వావలంబనని అలవర్చుకునేలాచేయాలన్నదే  నిజమైన బ్రొమాన్స్రోమాంటిక్  కామెడీల ఉద్దేశంఇది  కథ నేరవేర్చింది.ఇవాళ్టి యూత్ సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్చాలా కాలానికి  కథ ఎకనమిక్స్ తో వచ్చి, రోమాంటిక్ కామెడీలతో ఖాళీ అయిన తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోగల్గింది.
`        


           111. సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  -  ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  - ఆ  పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా చివర పాత్ర కనుక్కునే పరిష్కారంలోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం”  – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్  వ్యవహారమవుతుంది. పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే రచయిత  కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా పాత్ర కనుక్కునే పరిష్కారంఅని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు-  అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు.


          112.  సినిమా కథంటే పైన చెప్పుకున్న బ్రాకెట్లో పొల్లుపోకుండా వుండేదే. ఇలా లేనివి ఏవీ సినిమా కథలు కావు, సినిమాలన్పించుకోవు. కథతో వుంటేనే సినిమా. కాకుండా కథ వుండని గాథ సినిమా అవదు, కథ వుండని ఉపోద్ఘాతం సినిమా అవదు, కథ వుండని ఫ్లాష్ బ్యాక్ సినిమా అవదు, కథ వుండని డాక్యుమెంటరీ సినిమా అవదు, కథ వుండని ఎపిసోడ్లు సినిమా అవదు, కథ వుండని ఆంథాలజీ (కథల సంపుటి) సినిమా అవదు, కథ వుండని ఆర్ట్ సినిమా సినిమా అవదు, కథ వుండని వరల్డ్ మూవీ సినిమా అవదు, కథ వుండని ఇండీ ఫిలిం సినిమా అవదు, కథ వుండని క్రౌడ్ ఫండింగ్ కళాత్మకం సినిమా అవదు, కథ వుండని న్యూస్ బులెటిన్ సినిమా అవదు, కథ వుండని డైరీ సినిమా అవదు, కథ వుండని బయోపిక్  సినిమా అవదు. కెమెరాతో తీసిందల్లా సినిమా అవదు.
          
          113. రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ రోబో- 2తో  మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగిందో,  అదే ఎన్టీఆర్బయోపిక్ మొదటి భాగంతో జరిగింది. రోబో -2లో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన  పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని-  ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు. ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు, నిత్యజీవితంలో వాళ్ళు చూసే  రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు.  

      114. మ్యాటరాఫ్ ఫ్యాక్ట్  ( unemotional, practical, sensible, realistic, unsentimental, businesslike etc)  కథనాన్ని  ఏనాడో ప్యాసాలో గురుదత్ ప్రయోగించారు విజయవంతంగా. ఫలానా ఈ సంఘటన ఈ పాత్ర జీవితంలో ఇలా జరిగిందీ- అని ఒక టీవీ జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తున్న చందంగా చూపించి కట్ చేసేస్తారు ఏ సన్నివేశానికా సన్నివేశం దత్. పాత్రల ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీచల్తా. దీన్ని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ కథనమన్నారు పండితులు. ఇది మతిపోగొట్టే కథనమే. ఇలాంటిది చాలాకాలం వరకూ మరే దర్శకుడూ ప్రయత్నించలేదు- ఇటీవల కాలంలో బర్ఫీ’ లోనే చూస్తాం. ఇవి ఫ్లాష్ బ్యాక్మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూడిన కథనాలు కావు కాబట్టి చెల్లింది. కానీ చివరంటా మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులే రాజ్యమేలే  ‘కంచె’ లోని జోడు కథలకి చెల్లలేదు. 
 
          115. కొన్ని సినిమాలకి విజయవంతంగా  స్క్రీన్ ప్లే అనేది వుండదు. రాం చరణ్ ‘బ్రూస్ లీ’ కి  ‘ఐస్ స్క్రీమ్ ప్లేఅని కొత్తది కనిపెట్టారు.  దీనితర్వాత లాలిపాప్ ప్లేరావొచ్చు. చూయింగమ్ ప్లేరావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం ఇలాగే కలిసివస్తూ వుంటే,   ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లేలు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు  ‘ప్లేమాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బడాయిగా బిర్యానీ వంటకం  మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ  పెట్టలేని పేదరికంతో  వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా ( స్కామ్ గా కూడా!)  పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం-  జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని  కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ  ‘పండగ చేస్కోతో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినా, ఎంతటి వాడైనా; ఏ కథైనా, కథే కాకపోయినా, అదే సింగిల్ విండో లోంచి దూకి, అదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్, ఒక టెంప్లెట్, ఒక ఆటోమేషన్, అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే,  వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే. 
           
సికిందర్



27, జులై 2019, శనివారం

854 : స్పెషల్ ఆర్టికల్




(ఒక Q&A లో ఒక ప్రశ్నకి సమాధానంగా కథెలా చెప్పాలన్న దానిపై ఇచ్చిన వివరణని  ప్రత్యేకంగా పోస్టు చేయమని వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ కింద ఇస్తున్నాం...)


            నిజానికి సినిమా కథ చెప్పాలంటే ఓ పద్ధతేమైనా వుందా? ఒక విధంగా లేనేలేదు. ఎందుకు లేదంటే సినిమా కథలు రాయడానికే ఓ పద్ధతనేదే ఇండియా మొత్తంలో లేనేలేదని ఇందాక పై ప్రశ్నకి జవాబులో చెప్పుకున్నాం. స్ట్రక్చర్ లేదు గ్రిక్చర్ లేదంటూ ఎవరికి  తోచిన పద్ధతిలో వాళ్ళు రాసుకుంటూ, తీసుకుంటూ పోవడమే. ఓ ప్రామాణిమంటూ లేదు. కనుక కథ ఫలానా ఈ విధంగా చెప్పాలని ఈ రోజుల్లో కూడా చెప్పలేం. ఈ వ్యాసకర్తకి చెప్పే కథల్లో ఐదో పదో శాతం మంది మాత్రమే అవగాహనతో స్ట్రక్చర్ లో చెప్తారు. అంకాలు కొంచెం అటు ఇటు దొర్లినా స్థానభ్రంశం చెందకుండా చెప్తారు. మిగిలిన వాళ్ళు కొందరు కథా క్రమం పట్టకుండా హీరోయిజం చెప్తారు. 

           రి కొందరు హీరో పట్టకుండా కథాక్రమం చెప్తారు. ఇంకొందరు రెండూ పట్టకుండా కామెడీ చెప్తారు. మరింకొందరు స్పెషల్ ఎఫెక్ట్స్ తో టెక్నికల్ హంగామా చెప్తారు. ఇంకా కన్ఫ్యూజన్ గా కొందరు, పాయింటేమిటో తెలియకుండా కొందరూ చెప్తారు. కొందరు ఎలాగెలాగో అల్లుకున్న సీన్లే చెప్తారు, వర్ణనలే చెప్తారు, డైలాగులే  చెప్తారు. షాట్స్ తో, కట్స్ తో చెప్పే సంగతి సరే. ఇలాగే నిర్మాతలు, హీరోలు  దొరుకుతున్నారు మరి. కనుక ఏది ప్రామాణికమని చెప్పగలం? ఇదంతా క్రియేటివిటీ స్కూలు ఉత్పత్తి. ప్రామాణికాలేముంటాయి. క్రియేటివిటీకి కొలమానాలుండవుగా? మరి కథెలా చెప్పాలో సులువు చెప్పమంటే ఏమని చెప్తాం. ఎవరి క్రియేటివ్ దృక్కోణంలో వాళ్ళు చూస్తూ, సులువు చెబుతున్న వాడు కరెక్ట్ కాదనే అనుకుంటారు. ఇద్దరికీ టైం వేస్టు వ్యవహారం. 

          ప్రామాణికత స్ట్రక్చర్ తోనే వుంటుంది. స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పినప్పుడే దానికో కథ చెప్పే కళ అంటూ జత చేయగలం. కథ ప్రామాణికమైన స్ట్రక్చర్ లో వుంటేనే కథెలా చెప్పాలో చెప్పొచ్చు. ఒక రిఫరెన్స్ వుంటేనే కదా ఏదైనా చెప్పగలం. స్ట్రక్చర్ ని రిఫరెన్స్ గా తీసుకుని కథ చెప్పే కళ  చెప్పగలం. ప్రామాణికంగా ఆకట్టుకునేలా కథ చెప్పాలంటే మూడు బేసిక్స్ మీద దృష్టి పెట్టాలి. బేసిక్స్ గుర్తుంటే కథెలా చెప్పాలో తెలిసిపోతుంది. ఆ మూడు బేసిక్స్ వచ్చేసి ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ. ఇవి మొత్తం కథకి పిల్లర్స్ (మూల స్థంభాలు) లాంటివి. పిల్లర్స్ తెలిస్తే ఆ పిల్లర్స్ మధ్య  కథనెలా కట్టుకోవాలో, ఆకట్టుకోవాలో సులభంగా తెలిసిపోతుంది. 


           పిల్లర్ -1 గోల్ ఏర్పాటు, పిల్లర్ - 2 గోల్ భంగపాటు, పిల్లర్ - 3 గోల్ దిద్దుబాటు, ఇంతే! చాలా సింపుల్!!

          
ఇక్కడ గ్రహించాల్సింది పిల్లర్స్ మధ్య కథాగమనం ఎలా వుందనే. మొదటి పిల్లర్ వరకూ బిగినింగ్ అనుకుంటే అక్కడివరకూ దాని కథాగమనం, తర్వాత పిల్లర్ -1 నుంచీ పిల్లర్ - 2 (అంటే ఇంటర్వెల్) వరకూ మిడిల్ కథాగమనం, ఆ తర్వాత పిల్లర్ - 2 నుంచీ పిల్లర్ - 3 వరకూ మిడిల్ -2 కథాగమనం, ఇక పిల్లర్ - 3 తర్వాత నుంచీ ముగింపు వరకూ ఎండ్ విభాగపు కథాగమనం. రాసుకున్న కథని పిల్లర్స్ మధ్య ఇలా నాల్గు బ్లాకులుగా విభజించుకుంటే సులభమై పోతుంది చెప్పడం. 

          దీన్ని స్ట్రక్చర్ పరంగా మళ్ళీ చెప్పుకుంటే పిల్లర్ -1 వరకూ బిగినింగ్ విభాగం, పిల్లర్ -1 నుంచీ పిల్లర్ - 2 వరకూ మిడిల్ విభాగం. పిల్లర్ - 2 నుంచీ పిల్లర్ -3 వరకూ మిడిల్ -2 విభాగం, పిల్లర్ - 3 నుంచీ ముగింపు వరకూ ఎండ్ విభాగం. అంటే పిల్లర్ -1 ప్లాట్ పాయింట్ -1 అయితే, పిల్లర్ -2  ప్లాట్ పాయింట్ - 2 అన్నమాట. 

          ‘శివ’ ని చూద్దాం. ‘శివ’ లో పిల్లర్ -1 వచ్చేసి నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టి విలన్ భవానీతో ప్రత్యక్ష పోరాటానికి కాలుదువ్వడం (గోల్ ఏర్పాటు).
          పిల్లర్ -2 (ఇంటర్వెల్) వచ్చేసి నాగార్జున నేస్తం శుభలేఖ సుధాకర్ ని గణేష్ చేత భవానీ చంపించడం (గోల్ భంగపాటు).
          పిల్లర్ - 3 వచ్చేసి నాగార్జున గణేష్ ని పట్టుకుని పోలీసులకి అప్పజెప్పడం (గోల్ దిద్దుబాటు).

          ఇప్పుడు గంట టైములో ఎలా నేరేషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. మొట్టమొదట పిల్లర్ -1  వరకూ బిగినింగ్ కథ ఎలా సాగింది? ఇది టూకీగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే రెండున్నర గంటల కథని గంట సేపే చెప్పబోతున్నారు. కాబట్టి టూకీగా గుర్తు పెట్టుకోవాలి. కథ చెప్పేటప్పుడు ముందుగా ఈ బ్లాకు మీదే దృష్టి పెట్టాలి. మొత్తం కథంతా ఒకేసారి మీదేసుకుని చెప్పబోతే భారమై పోవడమే గాక,  గందరగోళం - వెనుక ముందులూ అవడం ఖాయం.  

       ఇప్పుడు పంజా గుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకి పోతున్నామనుకుందాం. ఈ ప్రయాణాన్ని చిన్న చిన్న మజిలీలుగా చేస్తే, మొదట నాగార్జున సర్కిల్ వరకూ వెళ్ళాలనుకుంటాం. ఆ సిగ్నల్ వరకూ  వెళ్ళాలన్న దాని మీదే దృష్టి పెడతాం. తర్వాత ప్రసాద్ లాబ్స్ సిగ్నల్ ని టార్గెట్ చేసి అక్కడిదాకా వెళ్ళే ఆలోచన చేస్తాం. ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్టుని టార్గెట్ చేసి ఆ విధంగా వెళ్ళిపోతాం. అంతేగానీ పంజాగుట్ట నుంచీ మొదలయ్యింది లగాయత్తూ ఏదీ చూసుకోకుండా, సుదూరంగా ఎక్కడో వున్న జూబ్లీ చెక్ పోస్టు ఒక్కటే చూస్తూ యమ దూకుడుగా ఒకటే దూసుకుపోవడం చేస్తే - ఎక్కడపడితే అక్కడ  యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇంకెలాగో వంద అడుగుల్లో చెక్ పోస్టు చేరుతున్నామనగా ఢామ్మని మూర్ఛ వచ్చి పడిపోవచ్చు కూడా. అప్పుడు డెస్టినేషన్ ఇటుపక్క అపోలో కార్పొరేట్ హాస్పిటలే. 

          కాబట్టి నేరేషన్ ని మొదలెట్టినప్పుడు కథలో పిల్లర్ -2 ని చూడకూడదు, పిల్లర్ -3 ని కూడా అస్సలు చూడకూడదు. పిల్లర్ -1 ఒక్కదాన్నే చూస్తూ మొదలెట్టాలి. పిల్లర్ -1 వరకూ సాగేది  బిగినింగ్ విభాగమని తెలిసిందే. ఈ బిగినింగ్ విభాగంలో పాత్రలు పరిచయమవుతాయి. సమస్యకి దారితీసే పరిస్థితులు మొదలవుతాయి. అప్పుడు సమస్య ఏర్పాటై పిల్లర్ -1 కి  చేరుకుంటుంది బిగినింగ్. 

          ఇలా ఈ బిగినింగ్ విభాగాన్ని ‘శివ’ లో చూడొచ్చు. 1. ఏ కథ బిగినింగ్ విభాగమైనా సరదాగా సాగుతుంది,  2. సరదాగా సాగుతూ మధ్య మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితులు మొదలవుతాయి.
          కనుక  పిల్లర్ -1 వరకూ బిగినింగ్ విభాగంగా గుర్తు పెట్టుకుని, సరదా సరదాగా, తేలికగా చెప్పుకుపోతూ, మూడ్ ని మారుస్తూ మిస్టీరియస్ భావం కలిగేలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చెప్పాలి. 

          కథ పిల్లర్ -1 వరకూ చెప్పడం ప్రారంభించినప్పుడు, గుర్తు పెట్టుకోవాల్సిన మరో ఐదు  అంశాలున్నాయి. అవి -  1. హీరో క్యారెక్టరైజేషన్ తో హీరోని బేస్ చేసుకుని మాత్రమే మొత్తం కథంతా చెప్పాలి. సినిమా కథ హీరోదే అయి వుంటుంది (హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే హీరోయిన్ దవుతుంది). ఎక్కడా కూడా హీరోని వదిలేసి ఇతర పాత్రలతో కథ చెప్పుకు పోకూడదు. బిగినింగ్ విభాగంలో చాలా పాత్రలు పరిచయమవచ్చు. అవన్నీ చెప్పకూదదు. కేవలం ప్రధాన కథని డ్రైవ్ చేసే హీరో, విలన్, హీరోయిన్, ఇంకేదైనా పాత్ర వుంటే అదీ మాత్రమే తీసుకుని బిగినింగ్ చెప్పడం ప్రారంభించాలి. ఫోకస్ హీరో మీదే వుండాలి. ఇతర ముఖ్య పాత్రల్ని ఇంటరాక్టివ్ పాత్రలుగా చూపించాలి. హీరో పాత్రేమిటో వివరించే ఒకటి రెండు సీన్లు చెప్పాలి. 

        ‘శివ’ బిగినింగ్ లో పిల్లర్ -1 కి కథనాన్ని చేర్చే పాత్రలు అదృశ్యంగా వుండే మాఫియా భవానీ తో పాటు, నాగార్జున, అతనితో వుండే అమల, ఆమెని టీజ్ చేసే భవానీ అనుచరుడు జేడీ. భవానీని వదిలేస్తే ఈ ముగ్గురి మధ్యే సమస్య రగిలి, పిల్లర్-1 దగ్గర సైకిలు చైనుచ్చుకుని జేడీని కొడతాడు నాగార్జున. 

           2. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన హీరోని బేస్ చేసుకునే చెప్పడం మరువకూడదు. వీటి మూలంగా పిల్లర్ - 1 దగ్గర ప్రాబ్లంలో పడేది అతనే కాబట్టి ఇది బలంగా అన్పించడానికి.
          3. పాటల్ని ప్రస్తావించకూడదు. అవి కథ ఓకే అయితే ఆ తర్వాతి దశ చర్చల్లో చెప్పవచ్చు. అలాగే సబ్ ప్లాట్స్ కూడా. కామెడీ ట్రాక్స్ కూడా. కమెడియన్లతో కామెడీ బాగా రాసుకున్నామని చెబుతూ కూర్చోకూడదు. చెబుతున్న కథ పాయింట్ మీంచి పక్కకి తొలగ కూడదు.
          4.  ఇప్పుడు ఫైనల్ గా, పిల్లర్ - 1 దగ్గర బిగినింగ్ ముగింపు సీనుని, అంటే హీరోకి గోల్ ఏర్పాటయ్యే సీనుని సాధ్యమైనంత డ్రమెటిక్ గా, ఎమోషనల్ గా వర్ణిస్తూ కథ మూడ్ ని మార్చెయ్యాలి. సరదాగా చెప్పుకొస్తున్నది కాస్తా సీరియస్ టర్న్ తీసుకున్నట్టు వినేవాళ్ళ మైండ్ లో బలంగా రిజిస్టర్ చేయాలి. ఇది ప్లాట్ పాయింట్ వన్ సీనే. జేడీని నాగార్జున కొట్టే సీనే. కథని మలుపు తిప్పుతూ అదెంత ఎమోషనల్ గా వుందో చూడవచ్చు. 

          ఈ సీన్ని బలంగా రిజిస్టర్ ఎందుకు చేయాలంటే, ఇది కథా ప్రారంభం. ఇక్కడే వినేవాళ్ళకి కథేమిటో అర్ధమైపోతుంది. ఈ పాయింటుని పట్టుకుని ఇక్కడ్నించీ నేరేషన్ ని ఎలర్ట్ గా ఫాలో అవడానికి మానసికంగా షిఫ్ట్ అవుతారు.
          ‘నాగార్జున జేడీని యమబాదుడు బాదాడు సార్. సైకిలు చైనుని విష్ణు చక్రంలా, భూచక్రంలా గిరగిరా తిప్పుతూ యమ కొట్టుడు కొట్టాడు’  అని ఫిజికల్ యాక్షన్ చెప్పి వదిలేయకూడదు. 

          జీవం వుండాలి. గుండెలకి హత్తుకోవాలి. అంటే ఫిజికల్ యాక్షన్ చుట్టూ ఎమోషనల్ కంటెంట్ ని జత చేయాలి. ఎమోషనల్ కంటెంట్ ఏమిటి?  ఈ బ్లాగుని ఫాలో అవుతున్నట్టయితే చాలా సార్లు ప్రస్తావన కొచ్చింది. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితి పక్వానికొచ్చినపుడు హీరోకి ఏర్పాటయ్యే గోల్ లో వుండే ఎలిమెంట్స్- గోల్ ఎలిమెంట్స్.  అవి 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్.  

      నాగార్జున జేడీని కొట్టినప్పుడు దాని చుట్టూ వున్న ఎమోషనల్ కంటెంట్ ఏమిటి? 1. కాలేజీ మీద మాఫియా భవానీ పడగ నీడని ఇక అంతమొందించాలన్నకోరిక, 2. దీనికేమైతే అయిందని తన చదువునే, జీవితాన్నే పణం గా పెట్టడం, 3. ఇలా భవానీతో తలపడుతూ తన అన్నకుటుంబాన్నే ప్రమాదంలోకి నెడుతున్నాడన్న ‘పరిణామాల హెచ్చరిక’,  4. ఇవన్నీ కలగలసిన ఎమోషన్. 

          అందుకని ఈ ఫిజికల్ యాక్షన్ చెప్పాక కథ చెప్పడం ఆపి, కామెంట్ చేయాలి : ‘సార్ ఇక తెగించాడు సార్ నాగార్జున. పీడలా దాపురించిన భవానీని ఇక ఫినిష్ చేసేయాలన్న కసి పుట్టుకొచ్చింది. ఇలాటి గోల్ పెట్టుకుని తన చదువునే, మొత్తం జీవితాన్నే కేర్ చేయదల్చు కోలేదు. పైగా అంత  డేంజరస్ భావానీతో పెట్టుకుంటే  తన అన్న కుటుంబం డేంజర్ లో పడుతుందేమోనన్న వర్రీని కూడా సృష్టించాడు సార్...ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో...’ అని కామెట్ చేస్తే వింటున్న వాళ్ళు ఫీలవుతారు, ఆసక్తిని పెంచుకుంటారు. ఇక చెప్పమన్నట్టుగా ఉత్సాహంగా బాడీ లాంగ్వేజీతో సంకేతాలిస్తారు. 

          ఇందుకే షాట్లు, కట్లు చెప్పవద్దనేది. వాటివల్ల ఎమోషనల్ ఫ్లో తెగిపోతుంది. టెక్నికల్ విషయాలు తెరమీదే చూపాలి, కథలో చెప్పకూడదు. 

          ఇదీ పిల్లర్ -1 వరకూ కథ చెప్పే విధానం. ‘శివ’ అనే యాక్షన్ కథ ఉదాహరణగా వివరించుకుంటున్నా, మిగతా అన్ని జానర్ల కథలకీ ఇదే ప్రక్రియ వర్తిస్తుంది. కథ కామెడీ అయితే ఆ పరమైన నవ్వొచ్చే ట్విస్ట్, లవ్ అయితే ఆ పరమైన రోమాంటిక్ ట్విస్, హార్రర్ అయితే ఆ పరమైన భయానక ట్విస్ట్. ఏదైతే ఆ రస ప్రధానమైన ట్విస్ట్. 

       5. కథంటే ఆర్గ్యుమెంట్. పాత్రల మధ్య ఒక పాయింటుతో ఆర్గ్యుమెంట్. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు గెలుస్తారన్న ఆర్గ్యుమెంట్ చుట్టూ నడిచేదే కమర్షియల్ సినిమా కథ. ఇందువల్లే ఇవి పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల సంఘర్షణతో - డైనమిక్స్ తో చైతన్య వంతంగా వుంటాయి. ఇందువల్లే ఈ పాత్రలు యాక్టివ్ పాత్రలై వుంటాయి. ఇదే గాథని తీసుకుంటే ఇందులో ఆర్గ్యుమెంట్ వుండదు. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు గెలుస్తారన్న ప్రశ్న వుండదు. పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల సంఘర్షణ లేక కథనం  చప్పగా వుంటుంది. పాత్రలు యాక్టివ్ గా వుండవు, పాసివ్ గా వుంటాయి. గోల్ వుండదు. ఈ గాథలు స్టేట్ మెంట్ నిస్తాయి. ఇదిగో నాకిలా జరిగీ నేనిలా చేసుకుంటే ఇలా తయారయ్యా  అని జాలిగా ముగుస్తాయి. ఇవి ఆర్ట్ సినిమాలకి పనికొస్తాయి.

          ఇందువల్ల, మొట్టమొదట రాసుకున్న ట్రీట్ మెంట్ కథగా వుందా, గాథగా వుందా చెక్ చేసుకోవాలి. గాథలా వుంటే వెళ్లి చెప్పకూడదు. రాసింది కథైతేనే చెప్పడానికి ప్రిపేరవ్వాలి. ఈ వ్యాసం ఆర్గ్యుమెంట్ సహిత కమర్షియల్ కథలు చెప్పే వాళ్ళ కోసమే.
          ‘శివ’ లో ఆర్గ్యుమెంట్ ఏమిటి? నువ్వెవరు కాలేజీ మీద పెత్తనానికి? – అని శివ అంటే, నువ్వెవరు నాకు అడ్డురావడానికి? – అని భవానీ అంటున్నాడు. వీళ్ళలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఇదీ ఆర్గ్యుమెంట్. 

2. ఇప్పుడు నేరేషన్ కి ఆయువు పట్టు!          

       ఇలా పిల్లర్ -1 వరకూ బిగినింగ్ నేరేషన్  తర్వాత,  ఇక్కడ్నించీ పిల్లర్ - 2 ఇంటర్వెల్ వరకూ ఇచ్చే నేరేషన్ అంతా ఆయువుపట్టుగా నిలిచేదే. కాబట్టి ఇది నోట్ చేసుకోవాలి. ఈ మిడిల్ విభాగం నేరేషన్ పిల్లర్ - 2 ఇంటర్వెల్ మీంచి సెకండాఫ్ లో ఇది పిల్లర్ -3 వరకూ కొనసాగుతుంది. పిల్లర్ -1 నుంచి పిల్లర్ -3 వరకూ మిడిల్ విభాగం ఏరియా అని తెలిసిందే. కథంతా ఈ ఏరియాలోనే వుంటుంది. అందుకని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చెప్పాలి. ఇదే స్క్రీన్ ప్లేకి వెన్నెముక. నేరేషన్ కి ఆయువు పట్టు. దీన్నెంత బలంగా చెప్తే అంత మంచి ఫలితం. 

          ముందు పిల్లర్ - 2 వరకూ మిడిల్ ని తీసుకోవాలి. పైన చెప్పుకున్నట్టు పిల్లర్ -1 దగ్గర (నాగార్జున జేడీని కొట్టడం దగ్గర) ఎమోషనల్ కామెంటరీతో ఆకట్టుకున్నాక, అక్కడ్నించీ కథని పిల్లర్ -2 (ఇంటర్వెల్) వరకే చూడాలి. అప్పుడు అక్కడి వరకూ డ్రైవ్ చేసే సీన్లు మైండ్ లోకి వచ్చేస్తాయి. మిడిల్ అంటే గోల్ కోసం హీరో, గోల్ ని ఎదుర్కోవడం కోసం విలన్ ఆడే ఎత్తుకుపై
ఎత్తుల హోరాహోరీ ఏరియా అని తెలిసిందే. ఇందులో ఒకసారి విలన్ కింద పడితే, ఇంకోసారి  హీరో కింద పడతాడు. ఇలా పడుతూ లేస్తూ పోయి, హీరో చిత్తయి విలువైంది కోల్పోతాడు. అప్పుడు గోల్ మరింత ప్రశ్నార్థక మవుతుంది. 

          దీన్ని 
శివ’ లో చూడొచ్చు. నాగార్జున జేడీని కొట్టిన దగ్గర్నుంచీ, ఇంటర్వెల్ లో నాగార్జున నేస్తం శుభలేఖ సుధాకర్ ని  చంపేసే వరకూ. కాబట్టి ఇక్కడ ఈ రెండిటి మధ్య మాత్రమే కథని చూస్తూ అందుకు తగ్గ సీన్లతో నేరేషన్ ఇవ్వాలి. ఈ సీన్లతో టెన్షన్ పెంచుకుంటూ పోవాలి.
          కామెడీ అయితే నవ్వొచ్చే కామిక్ టెన్షన్, లవ్ అయితే వెర్రెత్తించే రోమాంటిక్ టెన్షన్, ఫ్యామిలీ అయితే ఫీలింగ్ తో కూడిన డ్రమెటిక్ టెన్షన్. ఏదైతే ఆ సంబంధిత టెన్షన్. 

          ఇలా చెప్పుకు పోతూ, ఇంటర్వెల్లో (పిల్లర్ -2) బలమైన ట్విస్టు ఇవ్వాలి. కామెడీకి ఇంకా బాగా నవ్వొచ్చే ట్విస్ట్, లవ్ కి ఇంకింత బాధ పెట్టే రోమాంటిక్ ట్విస్ట్, ఫ్యామిలీ అయితే మరింత ఫీలయ్యే డ్రమెటిక్ ట్విస్ట్...పిల్లర్ -1 కంటే పిల్లర్ -2 ఇంటర్వెల్ ట్విస్టు చాలా పవర్ఫుల్ గా వుండాలి. 

       అందుకని ఈ పిల్లర్ -  2 ఇంటర్వెల్ సీసు కూడా పిల్లర్ -1 దగ్గర పైన చెప్పుకున్న గోల్ సీనుకి లాగే బలంగా రిజిస్టర్ చేస్తూ చెప్పాలి. పిల్లర్ -1 కంటే పై స్థాయిలో దీన్ని చెప్పాలి. పిల్లర్ - 1 దగ్గర జేడీని కొట్టి పోరాటం  ప్రారంభిస్తూ నాగార్జున అప్పుడే ఇంకేమీ నష్టపోలేదు. కానీ పిల్లర్ -2 ఇంటర్వెల్లో నేస్తం సుధాకర్ ని  కోల్పోయి తీవ్రంగా నష్టపోయాడు. ఇది  కథ తీవ్రతని  పెంచడం.  

          ఇక్కడ కథ చెప్పడం ఆపి మళ్ళీ కామెంటరీ చెప్పాలి : ‘సార్ ఇందాక నాగార్జున భవానీతో పోరాటం ప్రారంభిస్తూ జేడీని కొట్టి చావు దెబ్బతీశాడు కదా, ఇప్పుడు తనే చావు దెబ్బ తిన్నాడు. జేడీని కొట్టినప్పుడు తన అన్న ఫ్యామిలీని ప్రమాదంలోకి నెడుతున్నట్టు అన్పించాడు.  కానీ ఇప్పుడు చూస్తే ఊహించని విధంగా నేస్తాన్ని కోల్పోయాడు. స్టోరీ ఓపెనింగ్ బ్యాంగ్ లో ఒక స్టూడెంట్ ని చంపిన భవానీ అనుచరుడు గణేషే వచ్చి ఇలా  శివ ఫ్రెండ్ ని కూడా చంపేశాడు. ఇందుకు నైతిక బాధ్యత శివదే. శివ గిల్టీ ఫీలవుతున్నాడు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేని పరిస్థితి. ఈ బాధలోంచి కోలుకుని కొత్త వ్యూహంతో  భవానీని  దెబ్బతీయాల్సిందే. అంటే ఈసారి అన్న కుటుంబానికి  ప్రమాదమేమైనా  వుండబోతోందా ...ప్రేమిస్తున్న అమలకి కూడా.... భవానీ చంపడానికే తెగబడ్డాడాంటే శివ కూడా చావుల చాప్టర్ కే తెరతీస్తాడా... గణేష్ ని ఏం చేస్తాడు శివ.... ఈ ఇంటర్వెల్ తర్వాతే  ఇవి తెలుస్తాయి సార్...’ 

          
ఇలా ఇంటర్వెల్ సీన్ని కూడా పరిస్థితి డిమాండ్ చేస్తున్న ఎమోషనల్ కంటెంట్ తో చెప్పి ఆపాలి. పిల్లర్ - 1 దగ్గర్నుంచి ఈ  పిల్లర్ - 2 ఇంటర్వెల్ వరకూ కథ వింటున్న వ్యక్తుల్ని డీప్ గా ఇన్వాల్వ్ చేస్తూ చెప్పాలి. ఇక్కడ కామెంటరీ కూడా వింటూ ఎంత సేపటికి తేరుకుంటారానేది, సీన్ తో కలుపుకుని కామెంటరీతో ఇచ్చిన ఇంపాక్ట్ ని బట్టి వుంటుంది. . పిల్లర్ -1 కిలాగే పిల్లర్ - 2 ఆలోచింపజేసేదిగా చెప్పాలి. పైగా సెకండాఫ్ కథ కోసం ఎదురు చూసేలా హింట్స్ ఇవ్వాలి కామెంటరీలో... 

          1. ఈసారి అన్న కుటుంబానికి  ప్రమాదమేమైనా  వుండబోతోందా ...2. ప్రేమిస్తున్న అమలకి కూడా.... 3. భవానీ చంపడానికే తెగబడ్డాడాంటే శివ కూడా చావుల చాప్టర్ కే తెరతీస్తాడా... 4. గణేష్ ని ఏం చేస్తాడు శివ.... 
ఇవీ హింట్స్ఈ సస్పెన్స్ ని రేకెత్తించే ప్రశ్నల్ని పట్టుకుని సెకండాఫ్ వినడానికి సమాయత్త మవుతారు. 

          ఇలా సెకండాఫ్ కి లింక్ వేస్తూ హింట్స్ తో కూడిన ఇంటర్వెల్ చెప్పాలి. లింక్ ఇవ్వకపోతే ఇంటర్వెల్ ఫ్లాట్ గా, డ్రై గా, నిర్జీవంగా వుంటుంది. సెకండాఫ్ వినడానికి తగిన ఆసక్తి రేకెత్తించదు. ఫస్టాఫ్ - సెకెండాఫ్ రెండూ రెండు విడివిడి ముక్కలన్న తేలిక భావమేర్పడుతుంది.
          నేరేషన్ యాంత్రికంగా వుండకూడదు. రాసుకున్న కథ లోతుపాతులు బాగా తెలిసినప్పుడే, ఆ లోతుపాతుల్లోంచి కామెంటరీలు కథని కలిపి వుంచి వికసింపజేస్తూ ప్రకాశిస్తాయి. 

3. సెకండాఫ్ ఇలా 
          ఇప్పుడు సెకండాఫ్ నేరేషన్ లో ఇంటర్వెల్  పిల్లర్ - 2 నుంచీ సెకండాఫ్ లో పిల్లర్ -3 వరకే చూడాలి. అప్పుడు పిల్లర్ - 3 వరకూ డ్రైవ్ చేసే సీన్లు మైండ్ లోకి వచ్చేస్తాయి. మైండ్ కి ఎంత  చూపిస్తే అంతే అందిస్తుంది. ఎంత అద్భుతమైన ప్రోగ్రామర్ మైండ్. పిల్లర్ - 3 వరకూ ఈ మిడిల్  - 2  కూడా యాక్షన్ రియాక్షన్ల కథనమే వుంటుంది. ఇంటర్వెల్ కి ముందు మిడిల్లో ఎలా నేరేషన్ ఇవ్వాలని అన్నామో అదే విధంగా ఇక్కడా టెన్షన్ పెంచుకుంటూ పోవాలి.  
శివ’ లో చూస్తే ఇంటర్వెల్ పిల్లర్ - 2 తర్వాత సెకండాఫ్ ఓపెన్ చేస్తే,  మిత్రుడి మరణంతో నాగార్జున కొత్త వ్యూహం ప్రకటిస్తాడు. ఇప్పుడు ప్రతీకారంగా భవానీ ని చంపడం గాక, భవానీ లాంటి వాళ్ళని సృష్టిస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని. ఇది పిల్లర్ - 3 దగ్గర మిత్రుణ్ణి చంపిన భవానీ అనుచరుడు గణేష్ ని పట్టుకుని పోలీసులకి అప్పజె ప్పడంతో పక్వానికొస్తుంది. ఇప్పుడు ఈ విజయానికి మళ్ళీ ఇక్కడ కామెంటరీ ఇచ్చి ముగించాలి. 

          ఈ కామెంటరీ ఇంటర్వెల్ దగ్గర తలెత్తిన ప్రశ్నలకి జవాబివ్వాలి. ఇంటర్వెల్ దగ్గర - 1. ఈసారి అన్న కుటుంబానికి  ప్రమాదమేమైనా  వుండబోతోందా ...2. ప్రేమిస్తున్న అమలకి కూడా.... 3. భవానీ చంపడానికే తెగబడ్డాడాంటే శివ కూడా చావుల చాప్టర్ కే తెరతీస్తాడా... 4. గణేష్ ని ఏం చేస్తాడు శివ.... అన్న ప్రశ్నలు తలెత్తాయి. 

          
కామెంటరీ ఇలా వుండాలి - ‘సార్, ఇక్కడాపి మనం ఇంటర్వెల్లో చూస్తే, మిత్రుడి చావుకి రివెంజిగా శివ భావనీతో  చావుల చాప్టర్ కే తెరతీస్తాడా అనుకున్నాం. గణేష్ ని ఏం చేస్తాడనుకున్నాం. సెకండాఫ్ ఓపెనింగ్ లోనే మన అంచనాలని తలకిందులు చేస్తూ భవానీని చంపడం గాక, భవానీ లాంటి వాళ్ళని సృష్టిస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని బిగినయ్యాడు. ఆ ప్రకారమే గణేష్ ని పట్టుకుని పోలీసులకి అప్పగించాడుఓకేనా సర్? ఇంటర్వెల్లో ఇంకో రెండు ప్రశ్నలున్నాయి, నాగార్జున కుటుంబానికీ, అమలకీ ప్రమాదం గురించి. ఇప్పటి కైతే ఏమీ కాలేదు. ఇప్పుడు లాస్ట్ చాప్టర్ లో ఇది చూద్దాం, దీంతో పాటు పట్టుబడ్డ గణేష్ తో భవానీ కథ శివ ఎలా ముగించాడో కూడా చూద్దాం...’
          
ఇలా కామెంటరీ ఇచ్చి ముగించాక, ఇక క్లయిమాక్స్ చెప్పేయాలి. దీంతో పూర్తి నేరేషన్ ముగింపుకొస్తుంది. 

4. నేరేషన్ ఇలా రాసుకోవాలి           ఇదంతా నేరేషన్ స్క్రిప్టుగా రాసుకోవాలి ప్రాక్టీసు కోసం. రాసుకున్న కథ ట్రీట్ మెంట్ లోంచి తగిన సీన్లు ఎంపిక చేసుకోవాలి. పిల్లర్ -1 కి డ్రైవ్ చేసే కొన్ని సీన్లు, పిల్లర్ - 2 కి డ్రైవ్ చేసే కొన్ని సీన్లు, పిల్లర్ - 3 కి డ్రైవ్ చేసే కొన్ని సీన్లూ. అప్పుడు ఈ మూడు పిల్లర్స్ కి పైన ఇచ్చిన లాంటి మూడు కామెంటరీ లని కూడా రాసుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. స్ట్రక్చర్ ప్రకారం పిల్లర్ -1 వరకూ బిగినింగ్ కథనం 25% వుంటుంది. అలాగే పిల్లర్ -1  నుంచి సెకండాఫ్ లో పిల్లర్ -3 వరకూ మిడిల్ కథనం 50% వుంటుంది. ఇంకలాగే పిల్లర్ -3 నుంచి ముగింపు వరకూ ఎండ్ కథనం 25% శాతం వుంటుంది... 

          మిడిల్ సుదీర్ఘంగా 50% వుంటే, ఇది ఫస్టాఫ్ లో పిల్లర్-1 నుంచీ పిల్లర్ - 2 ఇంటర్వెల్ వరకూ 25%, పిల్లర్ -2 నుంచీ సెకండాఫ్ లో పిల్లర్ -3 వరకూ ఇంకో 25% వుంటుంది. ఇలా 25% చొప్పున మొత్తం రాసుకున్న ట్రీట్ మెంట్ నాల్గు సమాన బ్లాకులుగావుందనుకుందాం. ఇప్పడు గంట సేపు కథ చెప్పాలంటే ఎలా చెప్పాలి?

          గంట కాలాన్ని స్ట్రక్చర్ నిష్పత్తుల్లోనే విభజించుకోవాలి. అంటే 15 నిమిషాలు + 30 నిమిషాలు + 15 నిమిషాలు. అంటే పిల్లర్ -1 వరకూ 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు బిగినింగ్ సీన్లు ఎంపిక చేసుకుని నేరేషన్ స్క్రిప్టులో రాసుకోవాలి.
          అలాగే పిల్లర్ -1 నుంచీ ఇంటర్వెల్ పిల్లర్ -2 వరకూ ఇంకో 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు మిడిల్ సీన్లు ఎంపిక చేసుకుని నేరేషన్ స్క్రిప్టులో రాసుకోవాలి.
          మళ్ళీ పిల్లర్ - 2 నుంచీ పిల్లర్ -3 వరకూ 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు మిడిల్ -2 సీన్లు ఎంపిక చేసుకుని నేరేషన్ స్క్రిప్టులో రాసుకోవాలి.
          ఇక పిల్లర్ -3 నుంచీ ముగింపు వరకూ ఇంకో 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు ఎండ్ విభాగం సీన్లు ఎంపిక చేసుకుని నేరేషన్ స్క్రిప్టులో రాసుకోవాలి. 

 
          నేరేషన్ స్క్రిప్ట్ 30 పేజీల వరకూ రాసుకోవాలి (డిటిపి). అదే నిష్పత్తిలో పేజీలుండాలి.  అంటే పిల్లర్ -1 వరకూ 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు ఎంపిక చేసుకున్న బిగినింగ్ సీన్లని  ఏడెనిమిది పేజీలు నేరేషన్ రాసుకోవాలి.
          పిల్లర్ -1 నుంచీ ఇంటర్వెల్ పిల్లర్ -2 వరకూ ఇంకో 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు ఎంపిక చేసుకున్న మిడిల్ సీన్లని ఇంకో ఏడెనిమిది  పేజీలు  నేరేషన్ రాసుకోవాలి.
          అలాగే పిల్లర్ - 2 నుంచీ పిల్లర్ -3 వరకూ 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు ఎంపిక చేసుకున్న మిడిల్ -2 సీన్లని ఇంకో ఏడెనిమిది  పేజీలు  నేరేషన్ రాసుకోవాలి.
          ఇంకలాగే  పిల్లర్ -3 నుంచీ ముగింపు వరకూ ఇంకో 15 నిమిషాల్లో చెప్పగలిగేట్టు ఎంపిక చేసుకున్న ఎండ్ విభాగం సీన్లని మరో ఏడెనిమిది పేజీలు నేరేషన్ రాసుకోవాలి.  

          ఇలా 4 సెట్లుగా మొత్తం 28 - 32 పేజీల నేరేషన్ స్క్రిప్టు తయారవుతుంది. ఇప్పుడు మొదటి సెట్టు తీసుకుని పైకి చదవాలి. చదివేటప్పుడు రికార్డర్, స్టాప్ వాచీ పెట్టుకోవాలి. ఎంత టైం పట్టిందో గుర్తించాలి. పదిహేను నిమిషాలకి  టైము తగ్గినా, పెరిగినా రికార్డింగ్ విని ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో నోట్ చేసుకోవాలి. ఆ ఆడియో క్లిప్ ని  సేవ్ చేసుకోవాలి. రికార్డింగ్ స్మార్ట్ ఫోన్లోనే చేసుకోవచ్చు. స్టాప్ వాచీ స్మార్ట్ ఫోన్లోనే వుంటుంది.

          ఇప్పుడు మిగిలిన మూడు సెట్లకీ ఇదే పద్ధతిని ఆవలంబించి నిడివి హెచ్చు తగ్గుల నోట్స్ రాసుకుని, ఆడియో క్లిప్స్ ని సేవ్ చేసుకోవాలి. 

          ఇలా చేసుకున్నాక ఒక్కో సెట్టు నిడివి హెచ్చు తగ్గుల్ని సరిచేసుకుంటూ నేరేషన్ స్క్రిప్టు మొత్తం కంఠస్థం చేయడం మొదలెట్టాలి. ఏ సెట్టు కంఠస్థం చేస్తూంటే  ఆ సెట్టు ఐడీని మననం చేసుకోవాలి. ఇది బిగినింగ్ కథనం...ఇది మిడిల్ కథనం... ఇది మిడిల్ -2  కథనం అంటూ....ఒక సెట్టు కంఠస్థమయ్యాకే  రెండో సెట్టు తీసి కంఠస్థం చేయాలి. ఇలా 4 సెట్లు కంఠస్థమయ్యాక - నాల్గిటినీ కలిపి నేరేషన్ స్క్రిప్టు చూడకుండా రికార్డ్ చేసేయాలి. దాన్ని సేవ్ చేసుకుని వినాలి. వారం రోజులపాటు తెల్లారి లేవగానే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూనే వుండాలి. అలా నరనరానా ఇంకిపోవాలి. 

          అప్పుడా కథ గురించి ముందు నుంచీ తెలిసిన ప్రొఫెషనల్ ఫ్రెండ్ కి నేరేషన్ ఇచ్చేయాలి. రియాక్షన్ గమనించాలి. కథకి ఆధారమైన మూడు ప్లాట్ పాయింట్స్ (పిల్లర్స్) తో అర్ధవంతంగా కథ చెప్పినప్పుడు పాజిటివ్ రియాక్షనే వుంటుంది. ఆ తర్వాత ఆ కథ గురించి తెలియని ప్రొఫెషనల్ ఫ్రెండ్ కి నేరేషన్ ఇవ్వాలి. రియాక్షన్ గమనించాలి. థ్రిల్ చేసే వుంటుంది. కామెంటరీలతో ఎక్కడికక్కడ కథ మైండ్ లో సింక్ అయ్యేలా చెప్తారు కాబట్టి. 

          పై విధంగా నేరేషన్ ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్టు మీద గురి ఏర్పడి, నేరేషన్ మీద పట్టూ, కమాండ్ లభిస్తాయి. ఇచ్చిన గంట గడువుకల్లా నేరేషన్ ముగించ వచ్చు. ఇచ్చిన గడువు మించి అస్సలు చెప్పకూడదు. ఇంకా పదినిమిషాలు ముందే ముగించినా నష్టం లేదు.

          నేరేషన్ పాఠం అప్పజెప్తున్నట్టు వుండకూడదు. వార్తలు చదువుతున్నట్టూ వుండకూడదు. కబుర్లు చెప్తున్నట్టు చెప్పాలి. ఇందుకు కామెంటరీలని వాడాలి. కామెంటరీలు పైన చెప్పిన మూడు చోట్ల ప్రధానంగా వుంటే వుండొచ్చు. మిగతా కథ చెప్తున్నప్పుడు కూడా వీలైనన్ని చోట్ల సంక్షిప్త కామెంట్లు చెప్పవచ్చు... 

          ‘ఇప్పుడు హీరోతో ఇంత వరకూ వచ్చింది కదా, ఇక హీరోయిన్ వైపు చూస్తే ఆమె ఎక్కడో మహారాణిలా కూర్చుని హీరో చేసిన డిమాండ్ ని కేర్ చేయకుండా వీడియో గేమ్ ఆడుకుంటోంది...’ అంటూ ఇక్కడి  సీన్ని జోడిస్తూ చెప్పుకుపోవాలి. ఇలా సీన్లు ఒకదానితో ఒకటి కలిపే సందర్భానుగతమైన వ్యాఖ్యానాలు చేస్తూ చెప్పుకుపోవాలి. ఇలా చేస్తే ఇది వినేవాళ్ళకి యాక్టివ్ హియరింగ్ గా వుంటుంది. సీను తర్వాత సీనుగా ఖండ ఖండాలుగా  చెప్పుకు పోతే అది పాసివ్  హియరింగ్ కింది కొస్తుంది. ఇన్వాల్వ్ మెంట్ లేక, బోరు ఫీలవుతూ వింటారు. ఈ కింద ఒక నేరేషన్ స్క్రిప్టులో కామెంటరీ చూడండి...


5. అరగంట వెర్షన్
          ఇక అరగంట నేరేషన్ ఎలా ఇవ్వాలి? గంటకి రాసుకున్న నేరేషన్ స్క్రిప్టుని రీవర్క్ చేసుకోవాలి. ఇది కూడా మూడు పిల్లర్స్ ఆధారంగానే. ఏ నిడివి కథ చెప్పాలన్నా పిల్లర్సే ఆధారం. కాబట్టి ముందు పిల్లర్స్ ని (పిల్లర్స్ దగ్గర సీన్స్ ని) బాగా గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ ప్లే పరిభాషలో ప్లాట్ పాయింట్ -1, మిడ్ పాయింట్ (ఇంటర్వెల్), ప్లాట్ పాయింట్ -2 ఇవే కడా కథని నిర్ణయించే, వివరించే, స్క్రీన్ ప్లే అనే మహా సౌధాన్ని నిలబెట్టే మూల స్థంభాలు?

          కాబట్టి ఎప్పుడూ పిల్లర్స్ ని ఆశ్రయించి వుండాలి. నా పిల్లర్స్ నా కథా అని  స్పైడర్ మాన్ లా గట్టిగా పట్టుకుని వేలాడుతూ వుండాలెప్పుడూ. వాటేసుకుని రోమియోలా ప్రేమించినా ఫర్వాలేదు. పిల్లర్స్ తెలిస్తే ‘టైటానిక్’ ని కూడా ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో చెప్పాలన్నా అన్ని నిమిషాల్లో, అన్ని గంటల్లో చెప్పుకుంటూ పోవచ్చు. 

          అరగంట నేరేషన్ కి గంట నేరేషన్ స్క్రిప్టులో కథని సగానికి కుదించాలి. పిల్లర్స్ దగ్గర  సీన్స్, కామెంటరీలు అలాగే వుంచుకోవాలి. పిల్లర్స్ మధ్య మిగతా సీన్స్ కొన్ని తగ్గించి, సీన్స్ లా కాకుండా కథలా చెప్పేయాలి. 

          దీన్ని కూడా నాల్గు సెట్లుగా ఏడున్నర నిమిషాల టైమింగ్ తో, మూడున్నర పేజీల (డిటిపి) నిడివితో 15 పేజీలు రాసుకోవాలి. రాసుకున్నపుడు ఇంటర్వెల్ సీన్ ని ఇంటర్వెల్ సీన్ అని రాసుకోకుండా, సెకండాఫ్ తో కలిపి రాసెయ్యాలి. ఒక్కో సెట్టు రికార్డింగ్ చేసి నిడివి చెక్ చేసుకోవాలి. ఒక్కో సెట్టు కంఠస్థం చేయడం మొదలెట్టాలి. కంఠస్థమైన నాలుగు సెట్లూ కలిపి నేరేషన్ ఇస్తూ రికార్డింగ్ చేసుకోవాలి. దీన్ని పదేపదే విని మైండ్ లో ముద్రించుకోవాలి. ఇప్పుడు కూడా ఇది బిగినింగ్, ఇది మిడిల్, ఇది ఎండ్ ...అని స్మరించుకోవాలి. 

         ఇక కథ తెలిసిన ప్రొఫెషనల్ ఫ్రెండ్ కి, కథ తెలియని  ప్రొషనల్ ఫ్రెండ్ కీ  నేరేషన్ ఇవ్వడం డిటో. ఇక్కడ వీళ్ళకి గానీ, తర్వాత నిర్మాతలకి గానీ ఇది ఇంటర్వెల్ సీన్ అని చెప్పకుండా కంటిన్యూ చేసేయాలి. అరగంట నేరేషన్ ని ఆపకుండా ఏకమొత్తం కథగా చెప్పేయాలి. పొరపాటున ఇది ఇంటర్వెల్ సీను అని చెప్పారో- వింటున్న వాళ్ళ మైండ్ - ఇంతవరకు ఏం జరిగిందబ్బా అని  స్క్రీన్ ప్లే పరంగా లెక్కలేసుకుని, ఓస్ ఇంతేనా అనుకోవచ్చు.  తెర మీద రెండుగంటల కథని అరగంటలో చెప్తున్నప్పుడు ఇంటర్వెల్ రక్తి కట్టేలా డిటెయిల్డ్ స్క్రీన్ ప్లే నేరేషన్ సాధ్యం కాదు. అది సుదీర్ఘమైన గంట నేరేషన్ అప్పటి సంగతి. అరగంట నేరేషన్ లో ఇంటర్వెల్ ఎక్కడుందో చెప్పకుండా నేరేషన్ ఇచ్చేయాలి. తర్వాత ఎంతవరకూ ఫస్టాఫ్, ఎంత వరకూ సెకెండాఫ్ అనడితే అప్పుడు చెప్పవచ్చు. డిటెయిల్ద్ వర్క్ బౌండెడ్ స్క్రిప్టులో చూపించవచ్చు. 

          మైండ్ ఎంత చంచలమంటే, ‘సార్ ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ సార్!’ అనేస్తుంది. వెంటనే ఇంప్రెస్ చేయాలన్న ఆత్రుత కొద్దీ ఇలా జరిగిపోతుంది. ఇంప్రెస్ చేయాల్సింది మొత్తం చెప్పి. అందుకని ఈ అరగంట పాటు నోరు జారకుండా ఓపిక పట్టాలి. హైదరాబాద్ టు అమరావతి నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా చెప్పుకుంటూనే పోవాలి.  అమరావతిలో ఆగగానే కొత్త ప్రపంచం చూస్తున్నట్టు వుండాలి చిట్ట చివరికి. ఇదే ఇంప్రెస్ చేయడమంటే. 

6. పది నిమిషాల వెర్షన్
          ఇక పది నిమిషాల నేరేషన్ కి కూడా పిల్లర్సే మూలాధారం. ఐతే ఎప్పుడో కథ రాయడానికి పూర్వం కథని సినాప్సిస్ గా రాసుకునే వుంటారు కాబట్టి అది సరిపోతుంది. రాసుకోకపోతే ఇప్పుడు రాసుకోవాలి. మూడు పిల్లర్స్ ని పట్టకుని క్లుప్తంగా 750 పదాలతో మూడు పేజీలు  (డిటిపి) కథ రాసుకోవాలి. ఇది బిగినింగ్ - మిడిల్ - ఎండ్ విభాగాలుగా వుండాలి. దీంట్లో కామెంటరీలు వుండవు. సూటి కథా సంగ్రహమిది. పిల్లర్స్ కన్పించాలి ఒక్కో పేరాగా ప్రత్యేకంగా. ఇంటర్వెల్ అని చేయిజారి కూడా రాయకూడదు. 

          దీన్ని బట్టీ పడితే పట్టొచ్చు. రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ తన కథని తను క్లుప్తంగా మనోఫలకం మీద చూడలేని వాడు పెద్ద పెద్ద స్క్రీన్ ప్లేలు రాయలేడు. క్లుప్తంగా మూడు ముక్కల్లో తన కథ తనకే తెలియక పోతే రైటర్ గా, డైరెక్టర్ గా విఫలమైనట్టే. 

          ఈ పది నిమిషాల నేరేషన్ ఇస్తున్నప్పుడు కూడా - ఇప్పుడు నేను బిగినింగ్ చెప్తున్నాను ...ఇప్పుడు నేను మిడిల్ చెప్తున్నాను ... ఇప్పుడు నేను ఎండ్ చెప్తున్నాను... అని ప్రతీ యాక్ట్ దగ్గరా అనుకోవాలి. అప్పుడా యాక్ట్ కి సంబంధించిన విషయమంతా మైండ్ లోకి ఆటోమేటిగ్గా వచ్చేస్తూంటుంది. ఈ నేరేషన్ లో కూడా ఇంటర్వెల్ చెప్పకూడదు. పది నిమిషాల టైమిస్తే పదిహేను, ఇరవై నిమిషాలూ చెప్పుకుంటూ పోకూడదు. 

          కొత్తగా మొదటిసారి కథ చెప్పబోతున్న ఇద్దరు అసోషియేట్స్ కి ఇలా 60 -30 -10 నిమిషాల నేరేషన్స్ కి పది రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తే, ఇద్దరు సీనియర్ నిర్మాతలకి నేరేషన్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఆ కథల్లో మార్పు చేర్పులు కూడా కోరలేదు నిర్మాతలు. 

          రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి -  నేరేషన్ ఎంత బాగా ఇచ్చినా కథ బాగా లేకపోతే ప్రయోజనముండదు. అలాగే కథ ఎంత బావున్నా నేరేషన్ విఫలమైతే ప్రయోజనముండదు. కథా, నేరేషన్ రెండూ బావుండాలి.

7. మరి నాన్ లీనియర్ సంగతి?           ఇంతవరకూ చెప్పుకున్నది లీనియర్ కథల నేరేషన్స్ సంగతులు. మరి నాన్ లీనియర్ - అంటే ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథల నేరేషన్ సంగతి? ఒకటి రెండు ఫ్లాష్ బ్యాక్స్ తో వుంటే ఫర్వాలేదు. పైన చెప్పుకున్న నేరేషన్ పద్ధతులతోనే వున్న కథని ఫ్లాష్ బ్యాక్స్ గా అటూ ఇటూ అంకాలు  మార్చి రాసుకుని ప్రాక్టీసు చేసుకోవచ్చు. ఎండ్ తో మొదలై, బిగినింగ్ కొచ్చి, మిడిల్ మీదుగా, తిరిగి ఎండ్ కొస్తాయి ఇలాటి ఫ్లాష్ బ్యాక్ కథలు. వీటితో సమస్య రాదు. 

          మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల కథలకే  నేరేషన్ పెద్ద సమస్య అవుతుంది.
 నేరేషన్ సాధ్యం కాదు కూడా. పదిసార్లు, పదిహేను సార్లు కథ ఆగుతూ వెనక్కెళ్ళి ఫ్లాష్ బ్యాక్స్ చెప్తూ, మళ్ళీ ముందు కొస్తూంటే వినే వాళ్ళు ఫాలో కాలేరు. ఇదెలా వుంటుందంటే, కథని ఫాలో కానివ్వని షాట్స్ తో, కట్స్ తో నేరేషన్ ఇస్తున్నట్టే వుంటుంది. 

          దీన్ని గంట, అరగంట, పది నిముషాలు కూడా చెప్తే వినలేరు. కథ వింటే మానసిక శ్రమతో భారమన్పించ కూడదు. అందుకని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ కథలకి వేరే మార్గం ఎంచుకోవాలి. ఆ మార్గం పది నిముషాలు, లేదా అరగంట సూటి కథగా లీనియర్ నేరేషన్ ఇవ్వడమే. ఎంత మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ సీన్ లైనా అవన్నీ బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లీనియర్ కథ లోంచి వచ్చినవే. వీటిని ముందు లీనియర్ గానే రాసుకుని తర్వాత జంబ్లింగ్ చేయడం వల్ల నాన్ లీనియర్ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ అవుతాయి. 

      కాబట్టి ఒరిజినల్ గా అనుకున్న లీనియర్ కథనే, పైన చెప్పుకున్న మూడు పిల్లర్స్ తో అరగంట, పది నిమిషాల వెర్షన్స్ గా రాసుకుని నేరేషన్ ప్రాక్టీసు చేయాలి. నిర్మాతని అడిగేటప్పుడు, మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ కథ అనీ, గంట టైం కావాలనీ అనకుండా, ఓ అరగంట పదినిమిషాలు నేరేషన్ కి టైం అడిగితే సరిపోతుంది. 

          అప్పుడా అరగంటో పది నిమిషాలో లీనియర్ కథ నేరేషన్ పూర్తయ్యే వరకూ పొరపాటున కూడా ఏ సమయంలోనూ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ అన్న హింట్ ఇవ్వకూడదు. నేరేషన్ పూర్తయ్యాకే, ఇంకా నిర్మాత నచ్చిందనో నచ్చలేదనో అనే ముందే ఓపెన్ చేసేయాలి - ఇది మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ గా వుంటుందని. నేరేషన్ ఇచ్చాక ఆయన రెస్పాన్స్ కోసం వేచి చూసి, ఆయన బాగానే వుంది నచ్చిందంటే అప్పుడు – ‘ఇది మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో వుంటుంది సార్’ అంటే – ‘ఎందుకూ ఇలా స్ట్రెయిట్ గానే బావుందిగా, మెలికలు ఎందుకు తిప్పడం?’ అని ఆయన ఫిక్స్ అయిపోతే ఇరుక్కుని పోతారు. అందుకని ఆయన అభిప్రాయాని కొచ్చేముందే  ఓపెన్ చేసేయాలి. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో రాసిన బౌండెడ్ స్క్రిప్టు ముందు పెట్టేయాలి. ఆలస్యం చేస్తే డెడ్ స్క్రిప్టు అయిపోతుంది. 

8. హైపర్ కథల సంగతి?
          ఒక రకం కథలకి ట్రీట్ మెంట్ బేస్డ్, స్క్రీన్ ప్లే బేస్డ్ అనెందుకంటారో గానీ ట్రీట్ మెంట్లు, స్క్రీన్ ప్లేలూ అన్నిరకాల కథలకీ వుంటాయిగా. అవి లేనిది ఎలా తీస్తారు సినిమాలు. కానీ కిష్కింధ కాండ, అనగనగా ఒకరోజు, స్వామీ రారా వంటి కథల్ని ట్రీట్ మెంట్ బేస్డ్, స్క్రీన్ ప్లే బేస్డ్ అనే అంటారు. ఎన్నో పాత్రలు కథ నడుపుతాయి, కథకి ఎన్నోకనెక్షన్స్ వుంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎవడిగోల వాడిదే అన్నట్టుంటాయి పాత్రలు. హిందీలో ఢమాల్ సిరీస్ లో ఇప్పుడొచ్చిన ‘టోటల్ ఢమాల్’ కూడా ఇలాటిదే. ఇవి యాక్షన్ కామెడీలు. వీటికి నేరేషనివ్వడం కష్టం. ఇచ్చినా వినేవాళ్ళు ఫాలో అవడం కష్టం. ఇన్నేసి పాత్రలు, వాటికన్నేసి గోల్స్, వాటితో కథకి అన్నేసి కనెక్షన్స్, వీటితో అన్నేసి సంఘటనలూ వినడం అసాధ్యం.

          ఇలాటి యాక్షన్ కామెడీలు కాక, పోలీస్ ప్రోసీజురల్ గానో, ఇన్వెస్టిగేషన్ ఆధారంగానో క్రైం జానర్లు వుంటాయి. వీటికి కూడా నేరేషన్ వినడం సాధ్యం కాదు. తెలుగులో ఇప్పుడొచ్చిన ‘118’, హిందీలో ‘బద్లా’ ఇలాటివే. వీటిలో డైలాగ్స్ తో కనెక్షన్స్ వుంటాయి, క్లూస్ తో కనెక్షన్స్ వుంటాయి. ఇవి వింటూ అర్ధంజేసుకుని ఫాలో అవడం మరీ అసాధ్యం. 

          రోమాంటిక్ జానర్లో కూడా ‘చిలసౌ’ లాంటి డైలాగులు డ్రైవ్ చేసే కథలూ వుంటాయి. ఇవి కూడా చెప్పడమూ వినడమూ సాధ్యం కావు. ఈ కోవలో వున్న యాక్షన్ కామెడీలు, క్రైం, రోమాంటిక్ జానర్ కథల్ని హైపర్ కథలనొచ్చు. వీటికి నేరేషన్లు కాకుండా స్క్రిప్టులు చదువుకోవడమే. చదివితేనే అర్ధమవుతాయి. తెరమీది కొచ్చాక  అర్ధమవుతాయి. 

          వీటికి కూడా నేరేషనివ్వాలంటే టూకీగా కథ చెప్పడమే. కాకపోతే హైపర్ కథ అని ముందే చెప్పేయాలి. ఆ యాక్షన్ కామెడీ అయితే ఎన్నో క్యారెక్టర్స్ వుంటాయని, వాటికన్ని కథలుంటాయనీ ముందే చెప్పేయాలి. పోలీస్ ప్రోసీజురలో, ఇన్వెస్టిగేషన్ ఆధారమో అయుంటే, డైలాగ్స్ తో - క్లూస్ తో రన్ అవుతాయని ముందే చెప్పేయాలి. అలాగే ఇలాటి రోమాంటిక్ అయితే డైలాగ్ డ్రివెన్ అని ముందే చెప్పేయాలి.


          చెప్పేసి, అరగంట అయితే అరగంట, పది నిమిషాలైతే పది నిమిషాలు  నేరేషన్ ఇచ్చేయాలి. ఏ హైపర్ కథైనా, వాటిలో ఎన్ని పాత్రలున్నా, క్లూస్, డైలాగ్స్ ఎన్ని వున్నా, కథాపరంగా అవి అవే మూడే మూడు పిల్లర్స్ తో వుంటాయి. ఏ హైపర్ కథైనా, వాటిలో ఎన్ని పాత్రలున్నా, క్లూసూ డైలాగ్సూ వున్నా, అవన్నీ ఒకే ఒక్క ప్రధాన పాత్ర  - హీరోనో, హీరోయినో - కేంద్రంగానే వుంటాయి. ‘టోటల్ ఢమాల్’ లో గుంపుగా ఎన్ని పాత్రలు ఎంత వెంటపడ్డా, అది అజయ్ దేవగణ్ పాత్ర కథే. 

          అందువల్ల అజయ్ దేవగణ్ పాత్ర కథే చెప్పాలి. ఆ పాత్రకుండే మూడు పిల్లర్స్ తోనే అరగంట ఒకటి, పదినిమిషాలు ఒకటి నేరేషన్ రాసుకోవాలి. రాసుకున్న ట్రీట్ మెంట్లో లేదా బౌండెడ్ స్క్రిప్టులో పిల్లర్స్ దగ్గర ఏ పాత్రలైతే అడ్డు తగిలాయో, ఆ రెండు మూడు పాత్రల్ని మాత్రమే తీసుకుని నేరేషన్ స్క్రిప్టు రాసుకోవాలి. ఇలా రాసుకుని నేరేషన్ ఇస్తే పాయింటేమిటోఒక లైనులో స్పష్టంగా కన్పిస్తుంది. ఆ తర్వాత ఆ పాయింటుకి అడ్డు పడే ఇతర పాత్రల ట్రాక్స్ విడిగా కొన్ని చెప్పొచ్చు. అప్పుడు  పూర్తి స్థాయి ఆ హైపర్ కథనాన్ని బౌండెడ్ స్క్రిప్టులో చూపించవచ్చు. 

          పోలీస్ ప్రోసీజురల్, ఇన్వెస్టిగేషన్ ఆధార కథలు నేరస్థుల్ని పట్టుకునే పాయింటుతో వుంటాయి. ఇవి కూడా ఒక ప్రధాన పాత్ర కేంద్రంగానే డ్రైవ్ అవుతాయి. ‘బద్లా’ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర లాయర్ గా, నేరస్థురాలైన తాప్సీ ని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ తో వుంటుంది. దీనికి చాలా క్లూస్, డైలాగ్ కనెక్షన్స్, వూహాగానాలూ, లాజికల్ విశ్లేషణలూ వగైరా వుంటాయి. వీటితో గంట నేరేషన్ ఫాలో కాలేరు. అందుకని అరగంట, పది నిముషాలు రెండు నేరేషన్ స్క్రిప్టులు రాసుకుని ప్రాక్టీసు చేయాలి. 

          అరగంట నేరేషన్ కి -  కథలో ఎన్ని క్లూస్, ఎన్ని డైలాగ్ కనెక్షన్స్, వూహాగానాలూ, లాజికల్ విశ్లేషణలూ వున్నా, పిల్లర్స్ దగ్గరకి లీడ్ చేసిందాన్నే తీసుకుని మూడు పిల్లర్స్ తో నేరేషన్ రాసుకోవాలి. పిల్లర్స్ ని బలంగా ఎమోషనల్ గా డిజైన్ చేసుకుని వాటి మధ్య కథని చెప్పేయాలి. 

          పది నిమిషాల నేరేషన్ కి -  మూడు పేజీల సినాప్సిస్సే చెప్పాలి పిల్లర్స్ ఆధారంగా. కాకపోతే సమయాభావంవల్ల పిల్లర్స్ కామెంటరీ అవసరం లేదు.
          ఇలాటి ‘చిలసౌ’ లాంటి రోమాంటిక్ కామెడీకి కూడా 30,10 నిమిషాల నేరేషన్సే ఇవ్వాలి. మూడు పిల్లర్స్ ఆధారంగా వాటికి డ్రైవ్ చేసే సన్నివేశమో, డైలాగో ఏదైతే దాంతో రాసుకోవాలి. అరగంట కైతే పిల్లర్స్ ని వర్ణించాలి. మూడు పేజీల సినాప్సిస్ గా రాసుకునే పది నిమిషాల నేరేషన్ కి పిల్లర్స్ వర్ణన అవసరం లేదు. కానీ పిల్లర్స్ కి డ్రైవ్ చేసిన డైలాగో పాయింటో సన్నివేశమో పెట్టుకుని బిగినింగ్ మిడిల్ ఎండ్ గా సినాప్సిస్ రాసుకుని చెప్పాలి. చెప్పింతర్వాత సవివరమైన హైపర్ కథనాన్ని బౌండెడ్ స్క్రిప్టులో చూపించుకోవచ్చు. 

9. లాగ్ లైన్ వుందా?          అసలు ఎలాటి నేరేషనివ్వాలన్నా, అది వినేవాళ్ళకి సులభంగా వుండాలన్నా, యాక్టివ్ హియరింగ్ కి దోహద పడాలన్నా ఒకటుంది : ముందు లైను చెప్పడం. మూడు ముక్కల్లో ముందు లైను చెప్పడం.  లైను చెప్పడమంటే తాడు అందించడం. అయితే నూతిలో పడ్డ వాడికి తాడు అందిస్తే, అది పట్టుకుని ఎలాగెలా పైకి ఎగబ్రాకాలో ఎగబ్రాకి పైకొచ్చేస్తాడు. నేరేషన్ వినేవాళ్ళకి తాడు అందించమంటే ఈ కొస నుంచి ఆ కొసకి పంపడం. 

          ఈ తాడు లేదా లైన్ మొట్ట మొదట కథ రాయాలనుకున్నప్పుడే ఒక ఐడియాగా తడుతుంది, తట్టాలి కూడా. ఐడియా లేక, ఐడియాని స్ట్రక్చరల్ గా డెవలప్ చేయక కథ లేదు. ఉదాహరణకి - 
హీరోయిన్ని ప్రేమించిన హీరోని విలన్ ఒక ఇంజెక్షనుతో కురూపిని చేసి వదిల్తే, ఆ విలన్ ని హీరో ఇంకా భయంకరమైన కురూపిగా చేసి పగదీర్చుకుంటాడు - అని శంకర్ తీసిన ‘ఐ’ లైను. 

          ఇలా ముందుగా లైను చెప్పి నేరేషన్ ఇవ్వడం ప్రారంభిస్తే ఆ లైను ప్రకారం కథ వెళ్తోందా - వెళ్తే ఎలా వెళ్తోందీ బేరీజు వేసుకుంటూ వినేవాళ్ళు బిజీ అవుతారు, యాక్టివ్ అవుతారు. రిఫరెన్సు గా వుండే ఈ లైనుని పట్టుకుని నేరేషన్ ని పోల్చుకుంటూ తులనాత్మక శ్రవణంలో నిమగ్నమవుతారు. ఇలా తాడులాగా అందించిన లైనుని పట్టుకుని కొసదాకా వెళ్తూ నేరేషన్ తో ఇంటరాక్ట్ అవుతారు. రాసేటప్పుడు విజువల్ రైటింగ్ ఎలాగో,  చెప్పేటప్పుడు ఇంటరాక్టివ్ హియరింగ్ అలాగ.

          ఇలా లైను చెప్పకుండా నేరేషన్ చెప్తే వినేవాళ్ళకి ఏం వింటున్నామో ఒక ఐడియా అంటూ లేక, ఏకపక్షంగా తమ మీద డంప్ చేస్తున్న నేరేషన్ ని పాసివ్ గా, భారంగా  వింటారు. అనాసక్తిగా, బోరుగా కూడా వినొచ్చు. ఇది మంచిది కాదు. 

       హాలీవుడ్ లో ఈ లైనుని లాగ్ లైన్ అంటారు. లాగ్ లైన్ నే పిచింగ్ చేస్తారు, కథల్ని కాదు. లాగ్ లైన్ ఇంటరెస్టింగ్ గా వుంటేనే స్క్రిప్టు చదువుతారు, లేకపోతే లేదు. లాగ్ లైన్ ఆ కథేమిటో కాన్ఫ్లిక్ట్ (ప్లాట్ పాయింట్ వన్) సహితంగా చెబుతుంది. ఈ కింద ఉదాహరణలు -    
          * The two mighty creatures slug it out underground, using humans as bait ― Predator
          * Only two men can save the world when Aliens attack and attempt to loot and destroy Earth on July 4th ― Independence Day
            *The aging patriarch of an organized crime dynasty transfers control of his clandestine empire to his reluctant son ― The  Godfather

          చాలా కసరత్తు చేసి లాగ్ లైన్స్ ని సృష్టిస్తారు. స్క్రీన్ ప్లేలో వున్న బిగినింగ్, మిడిల్, ఎండ్ త్రీ యాక్ట్ స్ట్రక్చరే ఈ లాగ్ లైన్స్ లో వుండేట్టు చూస్తారు. పై లాగ్ లైన్స్ లో ఈ మూడు పిల్లర్స్ ని గుర్తించ వచ్చు. ఇలా సృష్టించిన లాగ్ లైన్స్ నే పిచింగ్ చేస్తారు. లాగ్ లైన్ వైరల్ గా అన్పిస్తే అప్పుడు స్క్రీన్ ప్లేని ఆహ్వానిస్తారు. వాళ్ళే చదివేస్తారు. రైటర్ కి నేరేషన్ ఇచ్చే శ్రమ వుండదు. మనలాగా నాకు కథ చెప్పడం రావడం లేదన్న బాధ వుండదు. హేమా హేమీల ముందు కూర్చుని వణుకుతూ కథ చెప్పే అవసరమే రాదు. స్క్రీన్ ప్లే ఎప్పుడు చదువుతారో డేట్ చెప్పేస్తారు. ఆ డేట్ కల్లా తెలియజేస్తారు. లాగ్ లైన్ నచ్చిందంటే స్క్రిప్టు నచ్చినట్టేనని రైటర్ హాయిగా వుండవచ్చు. కాకపోతే స్క్రిప్టులో మార్పు చేర్పులు కోరవచ్చు. వీటిని నోట్స్ అంటారు. నోట్స్ పంపుతూ వుంటారు. రైటర్ ఆ మేరకు స్క్రిప్టుని పరిష్కరించి పంపుతూ  వుండాలి. ఆ నోట్స్ ని భద్రపర్చుకుంటారు, భవిష్యత్తులో వివాదాల్ని నివారించడానికి. 

          మన దగ్గర లాగ్ లైన్ తో పని జరగదు. కథ నేరేషన్ ఇవ్వాల్సిందే. లాగ్ లైన్ ని నేరేషన్ అవసర నిమిత్తమే రాసుకోవాలి. ఎందుకో పైనే వివరించుకున్నాం తాడు ఉదాహరణగా. 
తులనాత్మక శ్రవణం, ఇంటరాక్టివ్ హియరింగ్ వగైరా ప్రయోజనాల కోసం.

          అందుకని, ఈ లాగ్ లైన్ ని స్ట్రక్చర్ లో రాసుకుని నేరేషన్ కి ముందు చెప్పాలి. పై ‘ఐ’ లాగ్ లైన్ లో స్ట్రక్చర్ వుంది, పిల్లర్స్ వున్నాయి – ‘
హీరోయిన్ని ప్రేమించిన హీరోని విలన్ ఒక ఇంజెక్షనుతో కురూపిని చేసి వదిల్తే, ఆ విలన్ ని హీరో ఇంకా భయంకరమైన కురూపిగా చేసి పగదీర్చుకుంటాడు’ – అంటూ వున్న ఈ లాగ్ లైన్ని విభజిస్తే ఇలా వుంటుంది -  హీరోయిన్ని హీరో ప్రేమించాడు (బిగినింగ్) - హీరోని విలన్ ఒక ఇంజెక్షనుతో కురూపిని చేసి వదిలాడు (మిడిల్) , విలన్ ని హీరో ఇంకా భయంకరమైన కురూపిగా చేసి పగదీర్చుకున్నా డు (ఎండ్). 

          సమంతా నాగ చైతన్యలకి నాగార్జున పుడితేనాగార్జున  శ్రియలకి నాగేశ్వర రావు పుట్టారు, అప్పుడేమైంది ? మనం’ లాగ్ లైన్.           * అత్తనీఆమె కూతుళ్ళనీ తెచ్చి తాతతో కలపడానికి పవన్ కళ్యాణ్ పడ్డ పాట్లెన్ని?  -  అత్తారింటికి దారేది’ లాగ్ లైన్.

          ఇలా నేరేషన్ కి ముందు లాగ్ లైన్ ని పిచింగ్ చేసినప్పుడు చాలా ఆసక్తి ఇప్పుడే పుడుతుంది. దీంతో ఆ లాగ్ లైన్ ఆధారంగా నేరేషన్ ఎలా వస్తోందో బేరీజు వేసుకుంటూ ఇంటరెస్టింగ్ గా వింటారు. లాగ్ లైన్ నేరేషన్ కి ట్రైలర్ లాంటిది.

          లాగ్ లైన్,  ట్యాగ్ లైన్ ఒకటి కాదు. ట్యాగ్ లైన్ పోస్టర్ల మీద టైటిల్ కింద ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి వేస్తారు. ప్రేమతో రా - వెయిటింగ్ ఫర్ యూ, ఈడియెట్ - ఓ చంటిగాడి ప్రేమ కథ అని.
***
          ప్రతీ ఏడాదీ డెబ్బైకి పైగా కొత్త దర్శకులొస్తున్నారు. ఆ డెబ్బై మందీ నేరేషన్ లో సక్సెస్ అయినట్టే. సినిమాలు ఫ్లాపవుతున్నాయి.  ఆ డెబ్బై మందీ ఫ్లాపైన ఆ ఒక్క సినిమాతో అదృశ్యమైపోతున్నారు. మళ్ళీ ఏడాది ఇంకో డెబ్బై మంది కొత్త వాళ్ళు వచ్చి ఇలాగే వెళ్ళిపోతున్నారు. ఈ వలయానికి ఆది వీళ్ళదే గానీ, అంతం నిర్మాతల చేతుల్లోనే వుంది. ప్రతీ ఒక్కరూ అవే రోమాంటిక్ కామెడీలు, అవే దెయ్యం కామెడీలు, లేకపోతే అవే క్రైం కామెడీలు... ఇవి మార్కెట్లో ఏమవుతున్నాయో చూడకుండా ఇలాటివే నేరేషన్ లివ్వడం. ఇందుకే నేరేషన్లు గొప్ప, బాక్సాఫీసులు దిబ్బ అన్నట్టు తయారయ్యింది. రేపు శుక్రవారం గంపగుత్తగా - మ్యాగ్నెట్, వేరీజ్ వెంకట లక్ష్మి, ప్రాణం ఖరీదు, బిలాల్ పోలీస్ స్టేషన్, మౌనమే ఇష్టం, కాలేజీ పోరగాళ్ళు, అశోక్ రెడ్డి, ఆ నిమిషం, మనసా వాచా - అంటూ 9 సినిమాలు విడుదలవుతున్నాయి. అవే సినిమాలు, అదే విష వలయం, అందులోనే వచ్చారమ్మా 70  పోయారమ్మా 70! 

          నేరేషన్ సంబంధించిన ఈ సుదీర్ఘ ఆర్టికల్ ఎవరికైనా ఉపయోగపడితే - విష్ యూ ఆల్ ది పాసిబుల్ సక్సెస్!

సికిందర్