రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, February 1, 2018

596 : సందేహాలు - సమాధానాలు




Q :     మీ రివ్యూలు ఆసక్తికరంగా వుంటాయి లెంగ్త్  కాస్త ఎక్కువనిపించినా. అయితే మీరు తరచుగా వాడే పదంజానర్ అంటే ఏమిటి?
విన్నకోట నరసింహా రావు  (ఊరి పేరులేదు)
 A :    మీ అభిమానానికి థాంక్స్. జానర్ గురించి చెప్పాలంటే, కళల్లో ఒక నిర్ణీత కేటగిరీని జానర్ అంటారు.  దీనికి తెలుగు అర్ధం ‘కళాప్రక్రియ’.  కథల విషయానికొస్తే జానపద కథలకి ఒక నిర్ణీత కళా ప్రక్రియ వుంటుంది, కామెడీకి ఒక నిర్ణీత కళా ప్రక్రియ వుంటుంది. ఇలా ఒక్కో కళాభివ్యక్తికి ఒక్కో నిర్ణీత ప్రక్రియ వుంటుంది. ఆ ప్రక్రియలోనే సృష్టి జరగాలి. దీన్నే జానర్ మర్యాద అంటారు. జానర్ అనే మాటని పక్కనబెట్టి సింపుల్ గా పిలుచుకోవాలంటే, అది జానపద కేటగిరీ, ఇది కామెడీ కేటగిరీ...ఇలా  చెప్పుకుంటే చక్కగా  అర్ధమైపోతుంది. ఫలానా కేటగిరీ అన్నాక ఆ కేటగిరీ కుండే లక్షణాలతోనే సృష్టి జరగాలని, జరిగి వుంటుందని  కూడా చప్పున అర్ధమైపోతుంది.
          జానర్ అనేది ఇంగ్లీషు ‘genre’ కి తెలుగు నుడికారం. ఇంగ్లీషులో ‘ఝాన్ర’ అని పలుకుతారు. తెలుగులో అలా పలికినా  రాసినా ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. కాబట్టి ‘జానర్’ అని తెలుగైజుడు అయింది. ఇంగ్లీషులో మాటాడేప్పుడు ‘ఝాన్ర’ అనే పలకాలి. తెలుగులో మాటాడేప్పుడు ‘జానర్’ అనాలి. కొందరు సినిమా వాళ్ళు ఏదోలా నోరు తిప్పుతూ ‘జోనర్’  అంటారు. అంత నోరు ఏదోలా తిప్పాల్సిన అవసరంలేదు. ‘జొన్నలు’ అన్పించేలా నోరూరిస్తూ పలకాల్సిన అవసరమూ లేదు.

Q :  త్రీ యాక్ట్ లో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ తప్పని సరి అని ఒక చోట చదివాను. మీరు కూడా రాసినట్టు గుర్తు.శివ’  సినిమా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ ఎందుకు లేదు?లేకపోయినా అంత పర్ఫెక్ట్ గా ఆర్డర్ ఎందుకు వుంది?
 
పేరు వెల్లడించ వద్దన్న టాలీవుడ్ దర్శకుడు  
A : కథనంలో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ అనే మజిలీ 1950 లలో జోసెఫ్ క్యాంప్ బెల్ సూత్రీకరణ లోంచి వచ్చింది. అది పురాణ గాథల  నిర్మాణంలో ఆయన పట్టుకున్న మజిలీ, దాని సూత్రీకరణ. హాలీవుడ్ దాదాపు ’80 ల వరకూ జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ నే మార్పు చేర్పులు చేసుకుంటూ స్క్రీన్ ప్లేలు, వాటితో సినిమాలూ సృష్టించుకుంటూ వచ్చింది. (విచిత్రమేమిటంటే యూఎస్ నుంచి వచ్చిన దర్శకుడు దేవా కట్టా 2010 లో తీసిన  ‘ప్రస్థానం’ క్యాంప్ బెల్ ప్రభావంతోనే తీశారు. ఆ ఉన్నత కళావిలువల ఛాయలన్నీ అందులో కనపడతాయి. 2005 లోనే ఈ వ్యాసకర్తని ఆయన అడిగిన మొదటి ప్రశ్న కూడా - క్యాంప్ బెల్ ని చదివారా? అనే).  తర్వాతి కాలానికి – అంటే ’80 లలోనే  ఇది అవుట్ డేటెడ్ అయిపోయింది. స్ట్రక్చర్ ని మరింత సరళీకరించి, కథనానికి స్పీడు పెంచేలా కొత్త పారడైంని అందించిన సిడ్ ఫీల్డ్ ని ఫాలో అవడం మొదలెట్టింది హాలీవుడ్. ’90 లనుంచీ  ఇప్పటి వరకూ హాలీవుడ్ స్ట్రక్చర్ కి సిడ్ ఫీల్డ్ పారాడైంనే ఫాలో అవుతూ వస్తోంది. ఈ స్ట్రక్చర్ లో ‘రెఫ్యూజల్ ఆఫ్ కాల్’ అనే  మజిలీని తొలగించాడు సిడ్ ఫీల్డ్. పరిస్థితి డిమాండ్ చేస్తున్నా హీరో చర్యకి పూనుకోవడానికి తిరస్కరించే ఘట్టాన్నే ‘రెఫ్యూజల్ ఆఫ్ కాల్’ మజిలీ అన్నారు. ఇది బిగినింగ్ విభాగంలో ప్లాట్ పాయింట్ వన్ కి ముందు వస్తుంది. అప్పుడు ఒక సీనియర్ పాత్రో, ఇంకో సన్నిహిత పాత్రో (థ్రెషోల్డ్ క్యారక్టర్ అంటారు) వచ్చి హీరోకి నచ్చజెప్తుంది. అప్పుడు హీరో సరేనని చర్యకి పూనుకోవడానికి సిద్ధమవుతాడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితి తీవ్రతరం కూడా అవడంతో. 
          ఇది పాత్ర చిత్రణకి సంబంధించిన ఒక షేడ్. సిడ్ ఫీల్డ్ పారాడైంలో దీని అవసరం లేదని తొలగించారు. ఎవరో వచ్చి నచ్చజెప్తే హీరో అప్పుడు ఫీలై చర్యకి పూనుకోకుండా, ఈ సెకండ్ హేండ్ ఫీలింగుకంటే,  తానుగా ఫీలై రంగంలో దిగాలన్న కథనానికి స్పీడు పెంచే ఇన్నోవేషన్ లో భాగంగా ఆ మజిలీ ఎగిరిపోయింది. ఇప్పటి హాలీవుడ్ సినిమాల్ని చూస్తే అవి హీరో పాత్రచిత్రణ సంగతుల్ని బాగా కుదించి, యాక్షన్ ఓరియెంటెడ్ గానే వుంటాయి. సినిమా వ్యాపారానికి  క్యారక్టరైజేషన్ కంటే, ప్లాట్ ప్రొగ్రెషన్  ముఖ్యమని వాళ్ళ కొత్త విధానం.
          ఇందుకే ‘శివ’ లో ఆ మజిలీ – లేదా క్యారక్టర్ షేడ్ లేకపోయినా ఆర్డర్ లో బిగువు తగ్గలేదు. అయితే బిగినింగ్ ఆర్డర్ లో ఆ మజిలీ వుంటుంది. ఒకేసారి హీరో సైకిలు చైన్ తో జేడీని కొట్టడు ప్లాట్ పాయింట్ వన్ లో. అంతకి ముందు జేడీ చేష్టల్ని గమనిస్తూనే వుంటాడు. ఎప్పుడైతే చేష్టలు ముదిరి హీరోయిన్ ని టీజ్ చేస్తాడో,  అప్పుడు చర్యకి పూనుకుని ఫైనల్ గా జేడీని కొట్టి ప్లాట్ పాయింట్ వన్ని సృష్టిస్తాడు. ఇక్కడ హీరోకి ఇంకో సీనియర్ పాత్రో, ఇంకెవరో కొట్టమని నచ్చజెప్పలేదు. ఇక్కడ హీరో స్వయంపోషకత్వం, స్వశక్తీ గలవాడు.
          సిడ్ ఫీల్డ్ తరచూ 19 వ శతాబ్దపు అమెరికన్ నవలారచయితా హెన్రీ జేమ్స్,  ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్’ వ్యాసంలో రాసిన మాటల్ని ప్రస్తావిస్తూంటాడు -
“What is character but the determination of incident? And what is incident but the illumination of character?” అని.
 
        ఈ తరహా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రచిత్రణే  క్యాంప్ బెల్ పాసివ్ మజిలీని తొలగించింది. యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రచిత్రణంటే యాక్షన్ సినిమాలకనే కాదు, ఫ్యామిలీ ప్రేమా, కామెడీ గిమిడీ ఏ రకం సినిమాలకైనా హీరో స్వయం నిర్ణాయక శక్తితో తానుగా సంఘటనల్ని సృష్టించి ఆశ్చర్య పర్చే వాడుగా,  మెరుపులు మెరిపించే వాడుగా వుండాలని అర్ధం. ఇలావుంది కాబట్టే ‘శివ’ లో సైకిలు చైను సంఘటన అంత పాపులరైంది. క్లాసిక్ గా వుండిపోయింది.
         
అయితే గత డిసెంబర్ లో వచ్చినటైగర్ జిందా హైలో   రెఫ్యూజల్ ఆఫ్ కాల్ మజిలీ సహా, జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణ ప్రక్రియలు అనేకం వున్నాయి. అవతల ఘోరాలు జరుగుతున్నాయ్ రారా బాబూ అంటే ససేమిరా అంటాడు సల్మాన్ (రెఫ్యూజల్ ఆఫ్ కాల్).  వచ్చిన అధికారులు ఖర్మ అనుకుని వెళ్ళిపోతారు. తర్వాత థ్రెషోల్డ్ క్యారక్టర్ గా కత్రినా కల్పించుకుని,  బుజ్జగిస్తే బయల్దేరతాడు. అయితే ఆనాటి క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో ఈ మిథికల్ క్యారక్టర్ లు, కథనమూ సీరియస్ గా వుంటే ఈ యాక్షన్ మూవీ నిలబడేది కాదు. ఆ మిథికల్ క్యారక్టర్స్ తో, కథనంతో ఎక్కడా సీరియస్ నెస్ అనేది లేకుండా,  తెగ నవ్విస్తూ పోవడడంతో ఈ టెర్రరిజం మూవీ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ అయింది.


Q :     Just now, I read your review on 'Padmavath' movie. It's outstanding. I want to represent this review in my 'media policy' class. Cause, we discussed this controversy in the previous class. Could you please send me, the English version of this movie review.
-
Dileep Kumar, EFLU
A :     Thanks for your compliment,  and as well as your idea of presenting the review in your class. But the shortcoming is that it cannot be had in English. I only write in Telugu for the blog, for Telugu audience. Hence I request you to make other arrangements of value, for translation.


Q :  మీరు అప్పుడప్పుడు స్క్రీన్ ప్లే టిప్స్ ఇచ్చేవారు సరదాగా చదువుకోవడానికి. మళ్ళీ ఎప్పుడిస్తారు?
కె. ఏ. రాగిణి, హైదరాబాద్
A :
ఈ ప్రశ్న మరికొందరు కూడా అడుగుతున్నారు. తప్పక వచ్చేవారం ప్రారంభిద్దాం. ఇప్పటికి 140 దాకా టిప్స్ ఇచ్చాం.

Q :  మిడిల్  మాటాష్ స్క్రీన్ ప్లే  అంటుంటారు కదా, అసలు ఒక కథకి మిడిల్  లో వుండాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి? మిడిల్  లో ఎలాంటి సంఘటనలు జరగాలి? పాత్రలు ఎలా వుండాలి?  రూల్స్ పాటించకపోవడం వల్ల మిడిల్  మాటాష్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి?
శ్రవణ్, అసోసియేట్ దర్శకుడు
          మిడిల్లో వుండాల్సిన బేసిక్ పాయింట్స్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ప్రాణం పోసుకుంటాయి. కథ అనేది ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే  పుడుతుంది. అంతకి ముందుది కథ కాదు, ఉపోద్ఘాతం. వొళ్ళు మండిన సగటు ప్రేక్షకుడి భాషలో చెప్పుకోవాలంటే సోది చెప్పడం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టిన కథ ప్లాట్ పాయింట్ టూ దాకా వుంటుంది. ప్లాట్ పాయింట్ టూ దగ్గర్నుంచి కథకి ముగింపే వుంటుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచి ప్లాట్ పాయింట్ టూ వరకూ స్క్రీన్ ప్లేలో 50 శాతం కథ ఆక్రమించి వుంటుంది. అంటే ఈ భాగమంతా మిడిల్ అన్న మాట. ఈ మిడిల్ భాగం తగ్గే కొద్దీ  కథాబలం కూడా తగ్గుతుంది.
          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ పుట్టాలనే బేసిక్ పాయింటుతో బాటు, అక్కడ్నించీ మిడిల్లో ఆ కథని నడిపించే మరికొన్ని బేసిక్స్ వుంటాయి. అవి : 1. సమస్య, 2. హీరోకి గోల్, 3. హీరో గోల్ ఎలిమెంట్స్ లో a. కోరిక, b. పణం, c. పరిణామాల హెచ్చరిక, d. ఎమోషన్ (‘శివ’ చూస్తే ఇవి బాగా అర్ధమౌతాయి).
          ఇవీ కథ, ఆ కథతో హీరోతో, ఆ హీరోతో ప్లేతో వుండే బేసిక్స్. కథే హీరో హీరోయే కథ - ఈ బేసిక్ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇందిరాయే ఇండియా - ఇండియాయే ఇందిరా అన్న స్లోగన్ తల్చుకుంటే ఇది బాగా గుర్తుంటుంది. ఇందిర నచ్చకపోతే, వాజ్ పాయే ఇండియా షైనింగ్ – ఇండియా షైనింగే వాజ్ పాయ్ అని ఎగ్జాంపుల్ పెట్టుకున్నా గుర్తుంటుంది. కథే హీరో హీరోయే కథ - కథలో పుట్టే సమస్య క్యాన్సర్. కాబట్టి ఆ క్యాన్సర్ ని తొలగించి కథనీ దాంతో తననీ పునీతం చేసుకోవడమే హీరోకుండే గోల్.
          ఇవన్నీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడే సమస్యతో కథ పుట్టినప్పుడే వుండే బేసిక్స్. కథలో పుట్టే సమస్య  క్యాన్సర్ అయినప్పుడు, ఆ సమస్య లేదా క్యాన్సర్ అనేది వ్యతిరేక పాత్రకి ప్రతీక, లేదా సింబల్. అంటే ఇది హీరోకి వ్యతిరేక పాత్ర. దీన్ని నిర్మూలించడానికే హీరో సంఘర్షిస్తాడు. దీన్నే మిడిల్ బిజినెస్ అంటారు. ఈ మిడిల్ బిజినెస్ లో - సంఘర్షలోంచి అనేక సంఘటనలు పుడతాయి. వ్యతిరేక పాత్రతో ఈ సంఘర్షణలో హీరో పడుతూ లేస్తూ వుంటాడు. మిడిల్ బిజినెస్ కి ఇదే  బేసిక్ పాయింటు. ఈ మిడిల్ బేసిక్ పాయింటుని డైనమిక్స్ అంటారు. ఈ డైనమిక్సే మిడిల్లో టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఏర్పరుస్తాయి.
          ఇప్పుడు వెళ్లి వెళ్లి ఈ సంఘర్షణ ప్లాట్ పాయింట్ టూ కి చేరుతుంది. ఇక్కడి వరకే కథ లేదా ఆ సమస్య, లేదా క్యాన్సర్, లేదా వ్యతిరేక పాత్ర  ప్రతాపం చూపించడం వుంటుంది. ఈ ప్రతాపం తీవ్రత ఇక్కడ ఇంకా పెరిగి,  హీరోకి జ్ఞానోదయమై,  ఒక పరిష్కారం దొరుకుతుంది. వ్యతిరేక పాత్రని  ఇక శాశ్వతంగా నిర్మూలించ గలిగే పరిష్కార మార్గం. ప్లాట్ పాయింట్ టూ ధర్మమే పరిష్కార మార్గాన్ని అందించడం.
          ఇప్పుడు చూస్తే మిడిల్ ప్రారంభంలో,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టే సమస్యకి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర అది సమసిపోయే పరిష్కార మార్గమన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ సమస్య అయితే, ప్లాట్ పాయింట్ టూ పరిష్కారం అవుతాయన్న మాట. ఇవి రెండూ స్క్రీన్ ప్లేకి  ప్లేకి మూల స్థంభాల్లాంటివి. వీటి మధ్య జరిగే సంఘర్షణంతా  మిడిల్ బిజినెస్. ఇక మిడిల్ బిజినెస్ పూర్తి చేసిన ఆ హీరో,  ఆ పరిష్కార మార్గంతో ఎండ్ విభాగాన్ని ప్రారంభించి క్లయిమాక్స్ కెళ్ళిపోతాడు.
          ఇప్పుడు మిడిల్ మటాష్ కొస్తే, మిడిల్ శాతం తగ్గిపోవడం. ఇదెలా తగ్గుతుంది? మిడిల్ కి ముందుండే బిగినింగ్ విభాగం పెరగడం వల్ల. మరి బింగినింగ్   నిడివి ఎంత వుండాలి? మొత్తం స్క్రీన్ ప్లే మొత్తంలో పాతిక శాతమే వుండాలి. మిడిల్ ఎంత వుండాలి? స్క్రీన్ ప్లేలో సగం అంటే యాభై  శాతం వుండాలి. మరి ఎండ్? ఇది మిగిలిన పాతిక శాతం వుంటుంది.
          ఇప్పుడు పాతిక శాతమే వుండాల్సిన  బిగినింగ్ విభాగం యాభై శాతానికి పెరిగితే 
ఏమవు
తుంది? ఆ మేరకు బిగినింగ్ కీ ఎండ్ కీ మధ్య వుండే  మిడిల్ నిడివి సగానికి  సగం తగ్గిపోయి, పాతిక శాతం మిగులుతుంది. అప్పుడు స్క్రీన్ ప్లేలో  మిడిల్ ఉనికి ఎక్కడ వుంటుంది? ఇంటర్వెల్ అవతలికి జరిగిపోయి అక్కడ కన్పిస్తుంది. అప్పుడేమవుతుంది?  ఇంటర్వెల్ అవతలి వరకూ, అంటే  సెకండాఫ్ సగం వరకూ బిగినింగే వ్యాపించి వుంటుంది.  అయినంత మాత్రాన ఏమవుతుందని? ఈ బిగినింగ్ సెకండాఫ్ సగం దగ్గర ముగిసినప్పుడు,  ప్లాట్ పాయింట్ వన్ కూడా ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్ సగానికి జరిగిపోయి అక్కడే ఏర్పాటవుతుంది. అంటే కథ అక్కడ పుడుతుందన్న మాట. ఆ పుట్టిన కథ అక్కడ కుంచించుకు పోయివున్న మిడిల్లో పావు శాతమో ఇంకా తక్కువో వుంటుంది. 
          ఇలా సెకండాఫ్ సగం దాకా కథే ప్రారంభం కాకపోవడం, ఆ ప్రారంభించిన  కథ కూడా ఇట్టే ముగిసిపోవడం జరుగుతాయన్న మాట.  కొండంత రాగం తీసి...అన్నట్టుగా వుంటుందన్న మాట సినిమా. ఫస్టాఫ్ అంతా వెస్ట్ చేసి, అక్కడెక్కడో  సెకండాఫ్ లో కథ ప్రారంభమయ్యే దాకా మునిసిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ తవ్వుతున్నట్టు బారుగా కంపు కొడుతూ బిగినింగ్ విభాగమే పర్చుకుని వుంటుంది గనుక,  సినిమా భరించలేకుండా తయారవుతుంది.
          బిగినింగ్ విభాగమంటే ఉపోద్ఘాతమని కదా? వొళ్ళు మండిన సగటు ప్రేక్షకుడి భాషలో సోది అని కదా? ఈ సోది నిర్దేశించిన దాని పాతిక శాతం కంటే కూడా ఎంత తక్కువ వున్నా ఫర్వాలేదు, దాటిపోయి ఇలా మిడిల్ ని మటాష్ చేస్తూ దాడి చేస్తే, ఇప్పుడు  సగటు ప్రేక్షకుడికి ఇంకా మండిపోయి  -  ఎదవ సోది - అనేస్తాడు సినిమాని.  ఇలా పచ్చి నిజాలు మాటాడు కోకపోతే అంత సులభంగా మిడిల్ మటాషులు వదిలిపోయేలా లేవు.
          ఈ బేసిక్స్ రాసిరాసి బ్లాగు బాగా  అరిగిపోయింది.  బేసిక్స్ తెలియకుండానే పేజీలకి పేజీలు వీధి నాటకాల్లాగా రాసేస్తూంటారు. ఇలాగని తెలుగు నాటకరంగ అభివృద్దికి పనికొస్తారా  అంటే అదీ లేదు, ఆ బేసిక్స్ అసలే తెలీవు.

సికిందర్