రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 22, 2019

801 : రివ్యూ





దర్శకత్వం : అనురాగ్ సింగ్
తారాగణం : అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా తదితరులు
రచన : అనురాగ్ సింగ్, గిరీష్ కొహ్లీ, సంగీతం : తనిష్ బాగ్చీ, చిరంతన్ భట్ తదితరులు, ఛాయగ్రహణం : అన్శుల్ చోబే
బ్యానర్ : ధర్మా, అజూరే, కేప్ ఆఫ్ గుడ్, జీ స్టూడియోస్
నిర్మాతలు : కరణ్ జోహార్,  అరుణా భాటియా తదితరులు 
***         చారిత్రక సినిమాల సీజన్ లో మరుగున పడిపోయిన చరిత్రలు వెలుగు చూస్తున్నా యి. మనం మర్చిపోయి, బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటికీ స్మరించుకుంటూ వార్షికోత్సవం జరుపుకుంటున్న సిక్కు పోరాట యోధుల ఆత్మబలిదానాన్ని ఎట్టకేలకు కరణ్ జోహార్ తెరకె క్కించాడు. హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 21 మందితో కూడిన సిక్కు రెజిమెంట్, ఆఫ్ఘన్ దురాక్రమణాన్ని ఎదుర్కొన్న చారిత్రక పోరాట ఘట్టం అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ టైటిల్ తో విడుదలైంది. ఇదెలా వుందో చూద్దాం...

కథ 
      ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో రాక్షస భర్తని వదిలి పారిపోతున్న ఒకామెని వెంటాడి వస్తూంటారు ముల్లా మనుషులు. ఇటు సరిహద్దులో గులిస్తాన్ పోస్టు నుంచి ఇది చూస్తున్న హవల్దార్ ఇషార్ సింగ్ (అక్షయ్ కుమార్) వెంటనే ఆమెని కాపాడడానికి సిద్ధమవుతాడు. అటు వెళ్ళ వద్దని బ్రిటిష్ లెఫ్టినెంట్ లారెన్స్ (ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్) వారిస్తున్నా వినకుండా వెళ్లి మూకని చంపి, ఆమెకి శిరచ్ఛేదం గాకుండా కాపాడి తీసుకొచ్చేస్తాడు. దీంతో ఆఫ్ఘన్ ముల్లా సైదుల్లా (రాకేష్ చతుర్వేదీ ఓం) కక్ష గడతాడు. సైన్యాన్ని రెచ్చగొట్టి గులిస్తాన్ పోస్టు మీద జిహాద్ జరపాలంటాడు. పఠాన్ సైనిక నాయకులు ఖాన్ మసూద్ (మీర్ సర్వర్), గుల్ బాద్షా ఖాన్ (అశ్వథ్ భట్) లు గిరిజన దండునేసుకుని కోట మీద భీకర దాడి జరుపుతారు. ఇషార్ సింగ్ తన పటాలంతో ఈ దాడిని విజయవంతంగా తిప్పి కొడతాడు. దీంతో దీనికంతటికీ నువ్వే కారణమని ఇషార్ సింగ్ ని బదిలీ చేసేస్తాడు లెఫ్టినెంట్ లారెన్స్. సుదూరంగా వున్న సరగర్హీ ఆర్మీ పోస్టు (కోట) కి వెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు ఇషార్ సింగ్. అక్కడ 36 వ సిక్కు రెజిమెంటుకి చెందిన 21 మంది సైనికులు పనీ పాటా లేక కోళ్ళ పందాలు ఆడుకుంటూ వుంటారు. ఎవరికీ సైనికుల లక్షణాలుండవు. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పి సైనికులుగా తీర్చిదిద్దుతాడు.   

          ఇక ఇప్పుడు ఆఫ్ఘన్ పఠాన్లు, ముల్లా,  పదివేల మంది గిరిజనులతో సరగర్హీ మీదికే భారీఎత్తున దాడికొస్తారు. సరగర్హీ తో బాటు గులిస్తాన్, లొకార్ట్ కోటల్ని కూడా ముట్టడించే పెద్ద పథకంతో వస్తారు. 21 మంది సైనికులతో వున్న ఇషార్ సింగ్ ఈ పది వేల మందిని ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       ఇప్పటి పాకిస్తాన్లోని సరగర్హీలో 1897 సెప్టెంబర్ 12 న, 21 మంది సిక్కు- 10 వేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య 30 గంటలపాటు జరిగిన భీకర పోరాట వాస్తవ గాథ ఇది. వెనక్కి వచ్చేయమని బ్రిటిష్ అధికారులు ఆదేశాలిచ్చినా, ఆ పిరికిపంద చర్యకి మనస్కరించక, 30 గంటల పాటు చివరి శ్వాసవరకూ పోరాడి,180 మందిని హతమార్చి చనిపోయారు సిక్కు దళం. ఈ చరిత్రకి కల్పనని జోడించి తీసినప్పుడు దారితప్పి పోయారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులైన వాళ్లకి నివాళిగా అంటూ ప్రారంభించే ఈ పోరాటం, మత ప్రతిష్ట కోసం చేసే వ్యక్తిగత పోరాటమన్నట్టుగా సాగుతుంది. దీనికి వ్యతిరేకంగా అటు ఆఫ్గన్ ఫైపు జిహాద్ అంటూ మతప్రాతిపదికన రెచ్చ గొడుతున్న ముల్లాని నిలదీస్తాడు పఠాన్ సైనిక నాయకుడు - భూభాగాల కోసం జరిగే యుద్ధంలో మతాన్నెందుకు లాగుతావని.  
  
           ఇటు ఇషార్ సింగ్ వేరే రంగుతో వున్నపగిడీ (తలపాగా) తీసేసి, కేసరి (కాషాయ రంగు) పగిడీ ధరించి పోరాటం చేయడంతో, ఈ కాల్పనిక చరిత్ర ఎన్నికల ప్రచార సాధనంగా మారిపోయింది - ఇవ్వాళ నా పగిడీ రంగు కేసరి, ఇవ్వాళ నా పారే రక్తం రంగు కేసరి, ఇవ్వాళ నేనిచ్చే సమాధానం రంగూ కేసరీ అంటూ. అటు ముల్లా ప్రభావంతో  ఆఫ్ఘన్లు కూడా మతం కోసమే రాక్షన కాండ ప్రారంభిస్తారు. ఇషార్ సింగ్ పోరాటంలో వీరమరణం పొందాక పఠాన్ నాయకుడు అంటాడు -  ఇతను నేలకొరిగాడని పగిడీ తీసి నేలమీద పారెయ్యకండని. ఇతడి మతాన్ని అగౌరవపర్చ కూడదన్న ఉద్దేశంతో. 

        దళంలో చివరి సైనికుడు చనిపోతూ, తమ మరణాన్ని పోరాట స్ఫూర్తిగా పెట్టుకున్న స్వాతంత్ర్య పోరాటంలో చనిపోయిన తన లాంటి వీరులకి నివాళిగా అర్పించక, నానక్ కీర్తనలు పాడి మరణిస్తాడు. ఇలా నిమిషానికో రకం సంకేతాలతో, సందేశాలతో సాగుతుందీ కాల్పనిక చరిత్ర చిత్రణ. లాజికల్ గా స్వాతంత్ర్య పోరాటంలో నేలకొరిగిన వీరులకి నివాళిగా సైనిక తత్వంతో  ప్రారంభించే పోరాటం, దారితప్పి జింగోయిజంగా మారిపోవడం కన్పిస్తుంది.

          సర్జికల్ స్ట్రయిక్  మీద తీసిన ‘యురీ’ లో సైనిక తత్వం తప్ప మతభక్తి, దేశభక్తి - వాటి జింగోయిజపు నినాదాలూ వుండవు. ఈ సరగర్హీ పోరాట గాథ,  ‘21 సర్ఫరోష్ - సరగర్హీ 1897’ అని  గత సంవత్సరం జింగోయిజం లేని పంజాబీ టీవీ సీరియల్ గా వచ్చింది. అన్ని మతాల వాళ్ళూ వుండే సైన్యానికి మతం వుంటుందా. 

          ఏవో రాజకీయ ఉద్దేశాలతో కల్పితాలు చేసి ‘కేసరి’ ని తీసినప్పుడు ఇంకోటి కూడా చేసి వుండాల్సింది. పోరాటం మధ్యలో చర్చల సందర్భం వస్తుంది. బలగం చాలని ఇషార్ సింగ్ ని లొంగిపొమ్మంటారు అవతలి పక్షం వాళ్ళు. అప్పుడు ఇషార్ సింగ్, ‘మీరు మత పోరాటంగా మార్చేశారు. మేమూ అలాగే మార్చాం. ఇది పోరాటంలో అకృత్యాలకి దారి తీస్తోంది. మత అల్లర్లుగా మారిపోయింది. ఇది చూసి ఇరువైపులా ప్రజలు మతోన్మాదులవుతున్నారు. ఇది మంచిది కాదు. మతం జగడం తేలేది కాదు. టైం వేస్టు. మీరు మతాన్ని పక్కనబెట్టి భూభాగం కోసం మాత్రమే పోరాడతామంటే మేమూ అలాగే పాయింటు మీద పోరాడతాం. ముందు ఇది తేలాలి. ఇది తేల్చడానికే ఇక ముందు చర్చలుంటాయి. తేలేదాకా కాల్పుల విరమణనే’ అని కూడా కల్పన చేసివుంటే కాంటెంపరరీగా ఇంకా బావుండేది. 
ఎవరెలా చేశారు 
     సూపర్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటన ఈ వయోలెంట్ పోరాట గాథకి హైలైట్. అన్యాయాన్ని, అవమానాన్నిసహించని ముక్కుసూటి వ్యవసాయదారుడైన తను సైనికుడయ్యాక అదే సంకల్పంతో కొనసాగుతూ ఆకర్షిస్తాడు. వూళ్ళో తల్లీ, భార్యా -  వాళ్ళతో అనుబంధమూ ఇవన్నీ సున్నితంగా ప్రదర్శిస్తాడు. క్రమశిక్షణ లేని దళాన్ని తీర్చిదిడ్డంలో జరిగే హాస్య ప్రహసనాల్లో మాత్రం సీరియస్ గా వుంటాడు. లెఫ్టినెంట్ తనని బదిలీ చేస్తూ అవమానించడంతో తనకి జ్ఞానోదయమైన భావాన్ని పటిష్టంగా ప్రదర్శిస్తాడు. మీరు బానిసలనీ,ఇక్కడి మట్టిలో పిరికిపందలే పుడతారనీ లెఫ్టినెంట్ అవమానించడాన్ని సీరియస్ గా పట్టించుకుని ఫీల్ ని పుట్టిస్తాడు. దేనికి మనం ప్రాణాల్ని త్యాగం చేయాలి? బ్రిటిష్ వాళ్ళ కోసమా? జీతాల కోసమా? యూనిఫామ్స్  కోసమా? - అని కేసరీ పగిడీ ధరించి వచ్చి, మన పోరాటం, ప్రాణత్యాగం స్వాతంత్ర్య పోరాటంలో అమరుల కోసమని అంటాడు. కానీ కేసరీ పగిడీతో మతప్రతిష్ట ఫీలై పోరాడతాడు. 

            గత సంవత్సరం పంజాబీలో ‘సజ్జన్ సింగ్ రంగ్రూత్’ అనే మూవీ విడుదలైంది. ఈ చారిత్రక కథలో సజ్జన్ సింగ్ అనే సిపాయి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరపున జర్మన్లతో పోరాడి వీరమరణం పొందుతాడు. యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు అతడి అంతర్మథనం ఒక్కటే - ఈ యుద్ధం గెలిస్తే ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కి స్వాతంత్ర్యమిస్తుందా అన్నదే. మనల్నికబళించి పాలిస్తున్న ఇంగ్లీషు దొరల కోసం ప్రాణత్యాగం చేయడం అవసరమా అన్న ప్రశ్నని ప్రశ్నలాగే మిగిల్చి అమరుడవుతాడు. అంతేగానీ మతావేశం పూని పోరాడడు. 


          అక్షయ్ కుమార్ చివర ఒంటరిగా మిగిలి వేల మందితో చేసే పోరాటం నాటి ఇషార్ సింగ్ వీరపరాక్రమాన్ని కళ్ళకి కట్టినట్టు వుంటుంది. అయినంత మాత్రానా ఇషార్ సింగ్ మూర్తిమత్వాన్ని అల్లూరి సీతారామ రాజు మూర్తిమత్వాన్ని ప్రేక్షకుల్లో కృష్ణ ప్రతిష్టించినట్టుగా ప్రతిష్టించడంలో విఫలమయ్యాడు అక్షయ్. కనీసం చివరి డైలాగులైనా లేకుండా కన్ను మూస్తాడు. ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఇషార్ సింగ్ ని ప్రతిష్టించలేక పోవడానికి కారణం పాత్ర చిత్రణే అలా వుండడం. కాషాయీకరణ జరగడం. అల్లూరిని ప్రజలు ఎంత దైవంలా కొలిచి పాటలు పాడినట్టు సినిమాటిక్ గా చిత్రీకరించినా, అల్లూరి అలా ఫీలై పోరాటం చేయడు. ఒక విప్లవకారుడి స్పష్టతతోనే పోరాడతాడు. అక్షయ్ ఇషార్ సింగ్ పాత్రకి సైనిక స్ఫూర్తి కొరవడింది. లేకపోతే అతనెంత గొప్ప సైనికుడో మర్చిపోలేని ముద్రవేసేవాడు. 

          ఇషార్ భార్య జీవనీ కౌర్ పాత్రలో పరిణీతీ చోప్రాది పరిమిత పాత్ర. ఆమె అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తుంది. ఆమె పూర్వమెప్పుడో చనిపోయిందని చరిత్ర చెప్తోంది. అందుకే చివర్లో ఇషార్  మరణించినప్పుడు సమూహంలో నిలబడి చూస్తూంటుందే గానీ దగ్గరికి రాదు. ఆమె ఆత్మరూపం. అంతవరకూ ఆమెతో మనం చూసిన సన్నివేశాలన్నీ ఇషార్ వూహల్లో ఆమె ఆత్మరూపం. మంచి క్రియేటివ్ అయిడియాతో ఈ చిత్రణ. 

       దళంలో ప్రతీ ఒక్కరూ ఫస్టాఫ్ లో వాళ్ళ వెర్రితనాలతో  కామెడీలు చేస్తారు. కోడి పందాలతో మొదలయ్యే వీళ్ళ కామెడీ సీక్వెన్స్ - ఆ కోడి పుంజుల ముందే తాము కోళ్ళుగా పోట్లాడుకునే శిక్షగా, ఆ తర్వాత ఆ కోడి పుంజుల్ని కూరొండేసుకున్నందుకు, అన్నపానీయాలు లేని రెండు వారాల కఠిన శిక్షగా అనుభవించే దాకా నవ్విస్తూ సాగుతుంది.  

          ఇషార్ దళంలో పఠాన్ వంటవాడుగా పొట్టి బ్రహ్మామిశ్రా వుంటాడు. పోరాటం జరుగుతున్నప్పుడు, ‘నేను పఠాన్ ని కాబట్టి పఠాన్లతో పోరాడలేననా?’ అని ఇషార్ ని ప్రశ్నిస్తాడు. ‘నువ్వు ఎవరు గాయపడితే వాళ్లకి మంచి నీళ్ళు అందించు’ అంటాడు ఇషార్. ‘శత్రువులకి మంచి నీళ్ళిచ్చి నేను బ్రతికించను’ అంటాడు. శత్రువుని చంపితే శత్రువే చస్తాడు, మంచి నీళ్లిస్తే శత్రుత్వం నశిస్తుందంటాడు ఇషార్ సింగ్. గాయపడ్డ శత్రువులకి మంచి నీళ్ళిస్తూంటే చంపేస్తాడు ముల్లా.

          అల్లా కోసమని మధ్యలో దూరే ముల్లా సైదుల్లాగా రాకేష్ చతుర్వేదీ ఓం ఎక్సెలెంట్ గా నటిస్తాడు. ముల్లాగిరీని డిప్లమటిక్ గా పోషిస్తాడు. పఠాన్ సైనిక నాయకులుగా మీర్ సర్వర్, అశ్వథ్ భట్ లు ఆఫ్ఘనీ రూపురేఖలతో పర్ఫెక్ట్ గా వుంటారు. దళంలో వార్తాహరుడుగా వుండే పిరికివాడైన గురుముఖ్ సింగ్ పాత్రలో సుమీత్ సింగ్ బస్రా చివరి సన్నివేశాల్లో హైలైట్ అవుతాడు. నిజానికి ఇతడితో ఓ క్లయిమాక్స్, అక్షయ్ తో ఓ క్లయిమాక్స్ అన్నట్టుంటుంది సినిమా. 

చివరికేమిటి
      దర్శకుడు అనురాగ్ సింగ్ కేవలం 80 కోట్లతో ఇంత భారీ పోరాట యాక్షన్ తీయడం రికార్డే. సెకండాఫ్ గంటన్నర పాటూ ఏకబిగి, సుదీర్ఘ పోరాట దృశ్యాలు కాలీన స్పృహతో వాస్తవ దృశ్యాలన్పించేలాగే తీశాడు. చరిత్రని ఎంత కల్పితం చేసినా కృతకమైన డిజైనర్ చరిత్రలా చిత్రీకరించలేదు. ఎక్కాడా గ్రాఫిక్స్ వున్నట్టే అన్పించదు. పైగా వాడిన ఆయుధాలు ఆ కాలంలో ఏవైతే వుండేవో అవే సింగిల్ లోడెడ్ తుపాకులు, తూటాలు, మామూలు కత్తులు, తల్వార్లు, నాటు బాంబులు మాత్రమే చూపించాడు. ‘పద్మావతి’ లో లాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో లాగా చిత్ర విచిత్ర నమ్మశక్యంగాని టెక్నాలజీలతో డిజైనర్ ఆయుధాలూ, వాహనాలూ, వీటితో సర్కస్ ప్రదర్శన చేస్తున్నట్టు డిజైనర్ పోరాట దృశ్యాలూ లేకుండా, పక్కా నేటివ్, సహజ మాస్ లుక్ తో దృశ్యాల్ని సృష్టించి ఆ కాలంలోకి తీసికెళ్ళాడు. అక్షయ్ కుమార్ దుర్బిణీని తుపాకీకి కట్టి టెలిస్కోపిక్ రైఫిల్ గా మార్చుకోవడంలో కూడా డిజైనర్ లుక్  వుండదు. ఇక ఆఫ్ఘన్ వైపు ముగ్గురు నాయకుల గుర్రాలు తప్ప ఇంకే గుర్రాలూ ఏనుగులూ, మోటారు వాహనాలూ వుండవు. వేలమంది కాలినడకనే వస్తారు. లారెన్స్ ఉడ్ వర్డ్, పర్వేజ్ షేక్ లు సృష్టించిన అద్భుత యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా నమ్మశక్యంగాని విన్యాసాల్లేవు. 

          మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లలోని అనంతమైన ఎడారిమయమైన కొండ ప్రాంతాల్లో లొకేషన్స్ ఒకెత్తు. పీరియడ్ లుక్ రావడానికి చేసిన డీఐ కూడా, దానికి తగ్గ కాస్ట్యూమ్స్ కలర్స్ కూడా కూల్ గా వుంటాయి. సుబ్రతా చక్రవర్తి, అమిత్ రేల ప్రొడక్షన్ డిజైనింగ్, అన్శుల్ చోబే కెమెరా వర్క్ చాలా గొప్ప కళాత్మకతలు.

          ఆరుగురు సంగీత దర్శకుల పాటలు అక్కడక్కడా నేపథ్యంలో బిట్ సాంగ్స్ గా వుంటాయి గానీ, రాజూ సింగ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాత్రం కట్టి పడేస్తుంది. 

          ఒక్కటే సమస్య. జింగోయిజం. రాజకీయ కేసరీయం. ఎన్నికల కంగాళీయం. ఆగస్టు పదిహేనున విడుదల చేయమని అక్షయ్ కుమార్ అంటే, అప్పుడెవరూ చూడరని ఇప్పుడే విడుదల చేయడం. ప్రేక్షకులు షహీద్ హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్ర చూడాలంటే కూడా ఫలానా ఒక ఇలాటి టైంలోనే చూడాలన్న మాట. ప్రతీ యేటా లండన్లోని ఆర్మరీ హౌస్ లో బ్రిటిష్ ఆర్మీ నాటి సరగర్హీ సిక్కు అమర సైనికులకి శ్రద్ధాంజలి ఘటిస్తూనే వుంటుంది. 1897 లోనే ఈ పోరాట యోధులకి బ్రిటన్ అత్యున్నత ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ప్రకటించింది. విక్టోరియా రాణి వేనోళ్ళ కొనియాడింది. ఇండియాలో ఈ దళం గుర్తే లేదు. ఎన్నికలప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించాలి...

సికిందర్
Watched at Prasads,
7.30 pm, 21 March, 2019

Ps : సరగర్హీ పోరాట కారణం సినిమాలో చూపించినట్టు ఇషార్ సింగ్ ఆఫ్ఘన్ స్త్రీని రక్షించడం కాదు. ఖైబర్ పాస్ కి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వంతో తేడాలొచ్చి దాడులు చేశారు ఆఫ్ఘన్లు.