రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 19, 2019

806 : రివ్యూ


రచన - దర్శకత్వం : అభిషేక్ వర్మ
తారాగణం :  వరుణ్ ధవన్, ఆలియాభట్, సోనాక్షీ సిన్హా, మాధురీ దీక్షిత్, ఆదిత్యా రాయ్ కపూర్,  సంజయ్ దత్, కునాల్ ఖేమూ తదితరులు
కథ : శివానీ భతీజా, మాటలు : హుస్సేన్ దలాల్, సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : బినోద్ ప్రధాన్
నిర్మాతలు : కరణ్ జోహార్, సాజిద్ నాడియావాలా
విడుదల : ఏప్రెల్ 18, 2019
***
          ట్టహాసంగా ప్రచారం చేసుకుని మల్టీ స్టారర్ పీరియడ్ మూవీగా కరణ్ జోహార్ నిర్మించిన ‘కళంక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల హిందీ సినిమాలు ఎటు తిరిగీ రాజకీయాల వాసనేస్తూ, పనిలోపనిగా దేశభక్తిని గుర్తుచేస్తూ రిలీజవుతున్నాయి. బయోపిక్ లు తీసినా, చారిత్రాత్మకాలు తీసినా, యుద్ధాలు, గూఢచర్యాలు తీసినా ఇవే. వీటి మధ్య స్వాతంత్ర్య పూర్వపు పీరియడ్ మూవీగా ‘కళంక్’ చేరింది. దేశ విభజన నేపధ్యంలో ప్రేమ కథని చిత్రించింది. అయితే ఇది ప్రేక్షకులు భరించే స్థితిలో వుందా లేదా అన్నదే చాలా ప్రధానమైన పాయింటు. ఎందుకో వివరాల్లోకి వెళ్లి చూద్దాం...

కథ 
       స్వాతంత్ర్య పూర్వం 1946 లో లాహోర్ సమీపంలోని హుస్నాబాద్  అనే కల్పిత పట్టణం. అక్కడొక పత్రికాధిపతి బల్రాజ్ చౌదరి (సంజయ్ దత్), అతడి కుమారుడు ఎడిటర్ దేవ్ ( ఆదిత్యారాయ్ కపూర్), కోడలు సత్య ( సోనాక్షీ సిన్హా) లు...సత్య క్యాన్సర్ తో చనిపోబోతోంది. అందుకని భర్త సుఖం కోరుకున్న ఆమె ఈ లోగా భర్తకి పెళ్లి చేయాలనుకుంటుంది. చదువుకుని, సంగీతంలో అభిరుచిగల రూప్ (ఆలియాభట్) ని ఇందుకు ఒప్పిస్తుంది. కుటుంబ ఆర్ధిక కారణాలవల్ల ఒప్పుకున్న రూప్, దేవ్ కి భార్యవుతుంది. కానీ అతను ఆమెని దూరంగా వుంచుతాడు. ఆమె పాలుపోక బహార్ బేగం (మాధురీ దీక్షిత్) దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్తుంది. అదే సమయంలో తమ పత్రికలో రిపోర్టర్ గా చేరుతుంది. బహార్ బేగం వుంటున్న హీరా మండీలో వేశ్యల జీవితాలపై పరిశోధన చేయాలనుకుంటుంది రూప్. ఈ సందర్భంగా కమ్మరి వాడైన జాఫర్ (వరుణ్ ధవన్) ని కలుసుకుంటుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడతాడతను. ఆమె కూడా ప్రేమిస్తుంది. అప్పుడతను తల్లి బహార్ బేగంని కలుసుకుని, బల్రాజ్ చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నానని చెప్పేస్తాడు. తను బహార్ బేగంకీ, బల్రాజ్ చౌదరికీ పుట్టిన అక్రమ సంతానం. ఇప్పుడు అతడి కోడలు రూప్ ని ఇవతలికి లాగి పెళ్లి చేసుకుని, కసి తీర్చుకుంటానంటాడు... అప్పుడేం జరిగింది? ఇందుకు తల్లి ఒప్పుకుందా? అటు బల్రాజ్ కి కొడుకు దేవ్ తో వున్న ఇంకో సమస్యేమిటి? జాఫర్ ప్రతీకారం తీర్చుకున్నాడా? రూప్ ఎవరి భార్య అయింది చివరికి?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ 
     దీన్ని ఇప్పటి కాలపు కథగా తీస్తే కాలం చెల్లిన కథవుతుంది. అందుకని స్వాతంత్ర్య పూర్వ కథగా, పీరియడ్ మూవీగా తీస్తే అప్పటి కాలానికి సెట్ అయి కవరై పోవచ్చనుకున్నట్టుంది. కానీ దీన్ని చూడాల్సింది ఇప్పటి కాలపు ప్రేక్షకులే. 1970 - 80 లలో అక్రమ సంతానం తండ్రి మీద పగదీర్చుకునే ఫ్యామిలీ డ్రామా ఫార్ములాలు ఎన్నో వచ్చాయి. అమితాబ్ బచ్చన్  నటించిన ప్రసిద్ధ ‘త్రిశూల్’ అందులో ఒకటి. కాబట్టి కాలం చెల్లిన ఫార్ములా కథనే పీరియడ్ మూవీగా తీసి కవర్ చేయాలనుకున్నారు. ఇలా కూడా తేడా కొట్టింది. ఈ కథని నిర్మాత కరణ్ జోహార్ తండ్రి సుప్రసిద్ధ నిర్మాత యశ్ జోహార్ పదిహేనేళ్ళ క్రితం రాసి పెట్టుకున్నారని చెప్పుకున్నారు.

          పాతని పాతలాగే తీయకుండా అప్డేట్ చేసివుంటే ఈ కథకి యూత్ అప్పీల్ వచ్చేది. క్యాన్సర్ తో చనిపోయే సోనాక్షీ పాత్ర రివర్స్  అయి చనిపోకపోతే, ఆలియాభట్ పాత్ర పెళ్లి కథకి మంచి ట్విస్ట్ వచ్చేది. ఎన్టీఆర్ ‘జీవిత చక్రం’ లో చనిపోతుందనుకున్న శారద పాత్ర చనిపోకపోవడంతో, వాణిశ్రీతో ఎన్టీఆర్ పెళ్లి కథ రివర్స్ అయినట్టు. ఎలాటి మలుపులూ లేకుండా మొదలెట్టిన కథ మొదలెట్టిన కథలాగే నీరసంగా సాగడం ‘కళంక్’ లోపం. పైగా హీరో ప్రతీకారం తీర్చుకునే పాయింటు కూడా అతను కాంప్రమైజ్ అయిపోవడంతో మధ్యలోనే ఆసక్తిని పోగొట్టుకుందీ కథ.

ఎవరెలా చేశారు 
       అందరూ బాగానే చేశారు. కాకపోతే అవి డల్ పాత్రలు కాబట్టి ఎంతబాగా నటించినా బోరుకోట్టక మానలేదు. పాత్రలు డైలాగులతో ఒకటే నసపెడతాయి. ఈ డైలాగులు కవితాత్మకంగా వుండడం ఇంకో సమస్య. హీరో పాత్ర సహా ఏ పాత్ర  కూడా ఎంటర్ టైన్ చేయని సీరియస్ పాత్రలే. మూడు గంటల సేపు బరువైన పాత్రల్ని మోస్తూ భారీ ఎమోషనల్ డ్రామా నడపడానికి సమాయత్తమయ్యారు. సగంలోనే సినిమా నిలబడక విఫలమయ్యారు. హీరో ప్రతీకార కథగా మారాకానైనా కథని హీరోకి వదిలెయ్యక, ఇటు హీరోకీ, అటు హీరోయిన్ కీ సర్ది చెప్పే పాత్రల స్పీడ్ బ్రేకర్లతో ప్రతీకార కథ కూడా లేకుండా పోయింది.

          హీరో వరుణ్ ధవన్ కి నటనలో నిరూపించుకోవడానికి మంచి అవకాశం దక్కింది. ఈ సినిమా మొత్తంలో గుర్తుండిపోయేది అతనొక్కడే. అర్ధవంతంగా అద్భుతంగా నటించాడు. కానీ ఏం లభం, పాత్ర అర్ధవంతంగా లేనప్పుడు. ఆలియాభట్ ఎలాటి యూత్ అపీల్ లేని సీరియస్ నటనతోనే సరిపెట్టింది. డిటో సోనాక్షీ. ఇక సంగీత నాట్యాలతో కాస్త ఎంటర్ టైన్ చేసేది మాధురీ దీక్షిత్ ఒక్కతే. మాధురీ - అలియాల మీద గ్రూప్ డాన్స్ సాంగ్ పెద్ద హైలైట్. ఇక సంజయ్ దత్ సగం మూసిన కళ్ళతోనే మాట్లాడతాడు. ఆదిత్యారాయ్ కపూర్ ఎమోషన్లు లేని పాత్ర, నటన. అబ్దుల్ పాత్రలో కునాల్ ఖేమూ విలన్ పాత్ర. దేశవిభజన కోరుకునే ఇతను, వ్యతిరేకించే పత్రికాధిపతులు (సంజయ్ దత్, ఆదిత్యారాయ్ కపూర్)తో గొడవలు పెట్టుకుని, మతకల్లోలాకి దారితీస్తాడు.  

          సంజయ్ లీలా భన్సాలీ కూడా ఉలిక్కి పడేంత కళాత్మకంగా నిర్మాణం చేశారు. అద్భుత సెట్స్ వేసి పరమాద్భుత చిత్రీకరణ చేశారు. ప్రతీ ఫ్రేమూ పోయెటిక్ గా తీశారు. హుస్నా బాద్ పట్టణాన్ని అట్టహాసంగా చూపించారు. షాట్స్ లో క్రౌడ్ మేనేజిమెంట్ ని అపూర్వంగా నిర్వహించారు. ఫేమస్ బినోద్ ప్రధాన్ కెమెరా వర్క్ కళ్ళు  తిప్పుకోనివ్వదు. పాటపాటకీ సంగీతంతో ప్రీతమ్ ఊపిన వూపు చెప్పక్కర్లేదు. ఇంత హంగామాలో సినిమాలో విషయమొక్కటే విషయం లేకుండా, భరించే ఓపిక నివ్వకుండా పోయింది!

          ‘టూ స్టేట్స్’ అనే తొలి ప్రయత్నంతో దృష్టి నాకర్షించిన దర్శకుడు అభిషేక్ వర్మ, ఈ పీరియడ్ మూవీతో ఇంత బాధ్యత మీదేసుకుని చతికిలబడ్డాడు.

సికిందర్