రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 5, 2018

580 : సందేహాలు - సమాధానాలు



Q :  మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతూంటాను. ఎంతో ఆసక్తి కరంగా, విజ్ఞాన దాయకంగా వుంటాయి మీ రచనలు. నాకు సినీ పరిభాషలో ట్రీట్ మెంట్ అంటే ఏమిటో అర్థం కాదు. ఎప్పుడో మీరు చెప్పే వుంటారు కానీ మిస్ అయ్యాను. వీలైతే తెలియబర్చగలరు.
డా. డి.వి.జి. శంకరరావు, విజయనగరం

A :  ఒక కథ అనుకుని కథలో సీను తర్వాత సీను రావాలో ఒక వరస క్రమంలో ఒకటి రెండు లైన్లలో 60, 70 సీన్లకి రాసుకుంటూ పోతారు. దీన్ని లైన్ ఆర్డర్ అంటారు. ఇలా అనుకుందాం :
          1. గెస్ట్ హౌస్ లో సమావేశం : తనకు కంపెనీలో 40శాతం వాటా, ప్రజలకు ఉద్యోగాల్లో 10 శాతం వాటా డిమాండ్ చేస్తాడు ఎమ్మెల్యే. ఇదెక్కడి  గొడవని కెవిపికి ఫోన్ చేస్తారు ప్రమోటర్లు.
          2.
పాడుబడ్డ స్కూల్లో పిల్లలమధ్య, పిల్లల యూనిఫాంలో చిన్న పిల్లాడిలా వున్న హీరోని చూసి షాక్ అవుతాడు హెడ్ మాస్టర్. స్కూలు రిపేరు నిధులు మింగినందుకు రేపటి నుంచి పిల్లలు నీ ఇంటికే వచ్చి చదువు కుంటారని ఆర్డరేస్తాడు హీరో. 

          ఇలా నెంబర్లు వేసుకుంటూ ప్రతీ సీనూ రాసుకున్నాక, ఒక్కో సీను తీసుకుని ఆ సీనులో జరిగే బిజినెస్ అంతా వివరంగా రాయడం మొదలెడతారు. ఈ రాసేటప్పుడు సీను ప్రారంభం (బిగినింగ్) మధ్యమం (మిడిల్ ), ముగింపు (ఎండ్) వుండేట్టు చూసుకుంటారు.  ఒక్కో సీనుకి ఎన్ని పేజీలైనా రాసుకోవచ్చు. తెర మీద ఎలా రన్ అవ్వాలో అలాగే రాసుకుంటారు. పేజీ పైన సీను నెంబర్ వేసి, ఎక్కడ తీయాలో,  ఏ సమయం తీయాలో రాస్తారు. ఈ కింద ఒక సీను చూద్దాం:

సీన్ : 60
ఎక్స్/ రోడ్స్ / నైట్

ఖాళీగా వున్న రోడ్ల మీద JP వెంట నడుస్తున్నారు అమిత్, సూరి, సత్తి, జ్యూనియర్లు దుడ్డు కర్రలు పట్టుకుని - ఇలా మీతో నడుస్తూంటే ఎంత హాయిగా వుంది. మీరు కనపడరు గానీ గొప్పోళ్ళురా! నన్ను భలేగా కాపాడేశారు. కానీ డేంజర్రోయ్ మీరూ...  ఏకుమేకై పోతున్నారు. పార్టీ  ఫండ్స్ అంటూ  జోక్యం చేసుకుని వేలం పాటేస్తున్నారు.  పైగా పార్టీ టికెట్లకి డబ్బులొస్తున్నాయా అని అడిగేదాకా వెళ్ళిపోయారు.  ఒవరై పోతున్నార్రా. ఇందాకా ఏమన్నావు రా? పార్టీని సొంతం చేసుకుంటారా? ఎంత యాక్టింగ్ అయినా మాటలెందుకు వచ్చాయిరా? మనసులో కుట్ర లేకపోతే? ఏంటి? కాబట్టి మీ గురించి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. రాజకీయాల్లో ఎవర్నీ నమ్మకూడదు. మీలాంటి కుర్ర నాయాల్ని అస్సలు నమ్మ కూడదు. మీ జనరేషను మా ఓల్డ్ జనరేషన్ని తోసిపారేసి అధికారం చేజిక్కుంచుకోవాలని చూస్తున్నారు. నా సీక్రెట్స్ ని కూడా సీక్రెట్స్ గా వుంచి చావలేదుగా మీరూ...అగండ్రా ఆగండి, మిమ్మల్నీ...అంటూ రివాల్వర్ తీసి టపటప కాల్చిపడేశాడు. చెల్లాచెదురుగా పడిపోయారు నల్గురూ.

     
JP ఆగిపోయి తన చేతిలోని రివాల్వర్నే ఆశ్చర్యంగా చూస్తున్నాడు- వండర్ గా వుందే... ఈ సమయంలో నా రివాల్వర్ పేలిందేంటి?  నీ రివాల్వర్ నా చేతిలో వుందేంటి?అంటున్నాడు. కింద అలాగే పడిపోయి  తన చేతిలో రివాల్వర్ని నొక్కినొక్కి  చూస్తున్నాడు అమిత్. పేలడమే  లేదు.  ఫకాలున నవ్వాడు JP-ఒరే, నాది అడిగితే నీది నా కిచ్చేశావ్ రా! గుడ్ లక్ ఎవరి వైపు వుండాలో వాళ్ళ వైపు వుండక ఛస్తుందా, ఏంటి?’ అని పగలబడి నవ్వసాగాడు. 
 షాకింగ్ గా చూస్తున్నారు  నల్గురూ.

          ఇలా రాసుకుంటే సీనులో  బిజినెస్ మొత్తం కళ్ళకి కట్టినట్టు విజువలైజ్ అవుతుంది. దీన్ని  ట్రీట్ మెంట్  అంటారు. ఒక సీను ఎలా రన్ అవ్వాలో ట్రీట్ చేయడమే ట్రీట్ మెంట్. ఇదంతా స్క్రీన్ ప్లే పనే.  మొదట అంకెలు వేసుకుని వన్ లైన్ ఆర్డర్ రాయడం దగ్గర మొదలు పెట్టేదే స్క్రీన్ ప్లే పని.   దీన్ని పూర్తి చేశాక దీన్ని బట్టి ఫైనల్ గా డైలాగ్ వెర్షన్ రాయడంతో మొత్తం స్క్రిప్టు వర్క్ పూర్తవుతుంది. ఇంతే, ఇంత కంటే మరేమీ లేదు.

Q :  ఒకప్పటి సినిమాల్లాగా ఇప్పుడెందుకు రావడం లేదంటారు ?
 
కె. వనజా రావు, హైదరాబాద్ 

A :   ఎందుకంటే, తీసుకునే ఆహారాన్నిబట్టి సినిమాలుంటాయి. అప్పట్లో అలాటి ఆహారం తీసుకునే వాళ్ళు  కాబట్టి అలాటి సినిమా లొచ్చాయి. ఇప్పుడు కరివేపాకులో కూడా పస లేదు. నలిపి చూసినా వాసనా రాదు, రుచీ వుండదు. ఈ పిచ్చి ఆకుల్ని మానిపారేసి చారు తింటున్నాం. ఇప్పటి తిండిని బట్టే ఇప్పటి సినిమాలు, అంతే.


సికిందర్



      q