రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జూన్ 2017, గురువారం

డార్క్ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు!

కథ
          టెక్సాస్ లో బార్ యజమాని మార్టీ, భార్య దెబ్రా, వర్కర్ రే, ప్రైవేట్ డిటెక్టివ్ విస్సర్ లమధ్య జరిగే నేర కథ ఇది. నైతిక విలువలు లేని, స్వార్ధాలూ విశ్వాస ఘతాలు, వెన్ను పోట్లూ పొటమరించిన చీకటి మనుషుల ఎత్తుగడలివి. ఎప్పుడూ మూడీగా వుండే భర్త మార్టీ తో విసిగి,  రే తో శారీరక సంబంధం పెట్టుకుంటుంది దెబ్రా. మార్టీ అనుమానించి ఆధారాలు సేకరించమని విస్సర్ ని కోరతాడు.  విస్సర్ ఒక మోటెల్ లో వాళ్ళ పడగ్గది దృశ్యాలు ఫోటోలు తీసి మార్టీకి చూపించి జోకులేస్తాడు. మార్టీ అహం దెబ్బ తిని, డబ్బు మొహాన కొట్టి మళ్ళీ రావద్దంటాడు.
          టు దెబ్రాని తీసుకుని  తన ఇంటికెళ్ళి పోతాడు రే. వెళ్ళిపోతూ మ్యారేజ్ డేకి మార్టీ  గిఫ్టుగా ఇచ్చిన రివాల్వర్ని  తీసుకుని వెళ్ళిపోతుంది దెబ్రా.

         
ఆతర్వాత జీతం డబ్బుల కోసం మార్టీ దగ్గరికొస్తాడు రే. కుతకుత లాడిపోతున్న మార్టీ,  ఎప్పుడో  డిస్మిస్ చేశాను పొమ్మంటాడు. దెబ్రా తో దెబ్బ తిని ఛస్తావని హెచ్చరిస్తాడు. మళ్ళీ ఛాయల కొస్తే చంపేస్తానంటాడు.

         
దెబ్రా రే ఇంట్లో వుందని ఫోన్ చేసి తెలుసుకున్న మార్టీ, రే ఇంటికి  వెళ్లి   దెబ్రా మీద దాడి  చేసి గాయపడి వెళ్ళిపోతాడు. ఇక లాభం లేదని డిటెక్టివ్ ని విస్సర్ ని ఆశ్రయిస్తాడు. వాళ్ళిద్దర్నీ చంపెయ్యమని కోరతాడు.

           
ఇలా ఒప్పుకున్న పని ప్రకారం డిటెక్టివ్ విస్సర్ వాళ్ళిద్దర్నీ చంపాడా లేదా? మృతదేహాల ఫోటోలు చూసిన మార్టీన్ ఏమయ్యాడు? హంతకుడైన విస్సర్ శిక్ష అనుభవించాడు? ఇందులో దెబ్రా రివాల్వర్ పాత్ర వహించింది? దొరికిపోవడానికి విస్సర్ ఏఏ ఆధారాలు వదిలాడు?...ఇవన్నీ ఒక పథకం ప్రకారం సాగే కథనంలో వెల్లడవుతాయి.

         
ముందుగా కథ ఎలా స్క్రీన్ గా రూపొందిందో, స్క్రీన్ ప్లేలో  మూడు విభాగాలుగా వుండే బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లు ఎలా నిర్మాణమయ్యాయో చూద్దాం. బిగినింగ్ విభాగాన్ని వన్ లైన్ ఆర్డర్ గా చూస్తే  13 సీన్లున్నాయి. అవి

          1. డిటెక్టివ్ విస్సర్ వాయిసోవర్ తో ప్రారంభం. టెక్సాస్ పరిసర ప్రాంతాల నిస్సార భూభాగాలని చూపిస్తూ విస్సర్ స్వగతం.
          2. రాత్రివేళ  వర్షంలో ప్రయాణిస్తూ ఎబ్బీ , రే లు ఒక మోటెల్ కి చేరుకోవడం.
           
3. మోటెల్ లో ఎబ్బీ , రే లు శృంగారంలో పాల్గోవడం.
          4. డిటెక్టివ్ విస్సర్ ఫోటోలని మార్టీకి చూపించి డబ్బు తీసుకుని పోవడం.
         
5. బార్ లో మార్టీ బార్ టెండర్ గర్ల్ ఫ్రెండ్ తో విచిత్రంగా ప్రవర్తించడం.          
           6. ఎబ్బీ  రివాల్వర్ తీసుకుని మార్టీ ఇంటినుంచి రే తో వెళ్ళిపోవడం.
          7. రే బార్ కెళ్ళి జీతం డబ్బులు అడిగి మార్టీ ని రెచ్చ గొట్టడం.
          8. మార్టీ ఇంటి కెళ్ళకుండా బార్లోనే వుండిపోవడం, రే ని రానివ్వద్దని బార్ టెండర్ కి చెప్పడం.
 
         9. రే తో వుంటున్న ఎబ్బీ  అతను మూడీగా వుండడం చూసి వేరే పడుకోవడం.
         
10. బార్ లో మార్టీ దీర్ఘాలోచనలో వుండడం.
          11. మధ్యరాత్రి తన దగ్గరికి వచ్చిన దెబ్రాని చూసి రే మెత్త బడడం.
         
12. ఉదయం మార్టీ వచ్చి ఎబ్బీ  మీద దాడికి విఫలయత్నం చేయడం.
         
13. దెబ్రా-రేలని  చంపెయ్యమని మార్టీ విస్సర్ ని కోరడం.
***

          పై ఆర్డర్ ని లింక్ ని ఇక్కడ క్లిక్ చేసి ఒరిజినల్ స్క్రీన్ ప్లే కాపీలో సరిచూసుకోవచ్చు. స్క్రీన్ ప్లేలో ఈ బిగినింగ్ విభాగాన్ని డౌన్ లోడ్ చేసుకుని దగ్గర వుంచుకుని, సినిమాకూడా చూసి, అప్పుడు స్టడీ కెళ్తే బావుంటుంది. హాలీవుడ్ స్క్రీన్ ప్లేలని పైపైన చదివెయ్యకుండా, మనసు పెట్టి  స్టడీ చేయాలి. అలా స్టడీ చేసినప్పుడు, ఈ స్క్రీన్ ప్లే కాపీలో హైలైట్ చేసిన అంశాలు కథనంలో నిగూఢ అర్థాలని ఇస్తున్నట్టు అర్ధమవుతుంది. సాధారణంగా తెలుగు స్క్రిప్టుల్లో (డైలాగ్ వెర్షన్స్ లో) పేజీలో ఎడమ వైపు వివరం, వర్ణన, యాక్షన్లు, రియాక్షన్లు, పాత్రల పేర్లు రాసి, కుడి  వైపు ఆ పాత్రల పేర్ల కెదురుగా డైలాగులు రాస్తారు. మద్రాసులో వున్నప్పుడు ఒకానొక దర్శకుడు ఇలా రాసిచ్చిన సీన్ పేపర్ని నిలువునా మధ్యకి చించి, డైలాగులతో కూడిన కుడి భాగం వుంచుకుని;  వివరం, వర్ణన, యాక్షన్లు, రియాక్షన్లు వగైరా వుండే కుడి భాగాన్ని అవతలకి విసిరేవాడట. అంటే రచయిత ఏం రాస్తాడో డైలాగులు రాసుకోవాలేగానీ, ఎడం పక్క డైరెక్షన్ నేర్పుతూ రాస్తే మాత్రం  మర్యాద దక్కదని చెప్పడమన్నమాట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్క్రిప్టుల్లో లెఫ్ట్ లో ఏమీ రాయకున్నా డైలాగులు పట్టుకుని తీసేయొచ్చు నిజానికి. ఎందుకంటే లెఫ్ట్ లో రాసే వివరం, వర్ణన, యాక్షన్, రియాక్షన్లు రోటీన్ గానే వుంటాయి :

          నవ్వుతూ-  రాధ :  నన్ను ప్రేమిస్తున్నావేంటీ గోపీ?
          ఏడుస్తూ –  గోపి :  అవును కదా రాధా,  ప్రేమించ కూడదా?
          రాధ ఒక్కటి పీకింది.
          గోపి పరుగెత్తాడు.
 

          ...ఇలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి మొక్కుబడిగా  లెఫ్ట్ రాస్తే సరిపోతుంది. కానీ నోయర్ జానరైన డార్క్ మూవీస్ కి ఇలా రాస్తే తేలిపోతుంది. డార్క్ మూవీస్ దృశ్యాల్లో నిగూఢార్ధాలుంటాయి. అవికూడా కథ చెపుతూంటాయి, పాత్రల్ని చెపుతూంటాయి.  అందుకే డార్క్ మూవీస్ కళాత్మకమైనవి- నిజమైన వ్యాపారాత్మక కళ. ఈ నిగూఢార్ధాలు ఏఏ ఎలిమెంట్స్ ద్వారా వ్యక్తమవుతాయో గత ‘డార్క్ మూవీ ఎలిమెంట్స్ ఒక ఆర్టు’ అన్న వ్యాసంలో తెలుసుకున్నాం : 


          1. చారుస్కూరో లైటింగ్, 2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్, 3. డీప్ ఫోకస్, 4. ఎక్స్ ట్రీం హై, ఎక్స్ ట్రీం లో- యాంగిల్స్, 5. టైట్ క్లోజప్స్, 6. కాంప్లెక్స్ షాట్స్, 7. కాంప్లెక్స్ మీసాన్సెన్ షాట్స్, 8. ఎసెమెట్రికల్ కంపోజిషన్, 9. బార్స్, డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్, 10. లాంగ్ ట్రాక్ షాట్స్, 11. అబ్ స్క్యూర్ సీన్స్, 12. డచ్ యాంగిల్స్, ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్, 13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్, 14. మిర్రర్స్, 15. మోటిఫ్స్ మొదలైనవి.

        కోయెన్ బ్రదర్స్ స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడే పై ఎలిమెంట్స్ లో చాలా వాటితో నిగూఢార్ధాలు సూచిస్తూ-  మన భాషలో చెప్పుకోవాలంటే ‘లెఫ్ట్’ రాశారు.  కొన్ని నిగూఢార్ధాల్ని స్క్రీన్ ప్లేలో  రాయకపోయినా, చిత్రీకరణలో కనబర్చారు. సినిమాలో వీటిని చూడొచ్చు. కాబట్టి డార్క్ మూవీస్ కి లెఫ్ట్ రాయడమంటే వివరం, వర్ణన, యాక్షన్, రియక్షన్లే, కాదు- విధిగా నిగూఢార్ధాలు కూడా రాసుకుని చిత్రీకరించడమన్నమాట. ఈ శతాబ్దం ప్రారంభం నుంచీ తెలుగు సినిమాలకి రచయితల్లేరు. దర్శకులే రచయితలయ్యారు. ఒకవేళ డార్క్ మూవీస్ అంటూ తీస్తే, వాటికి  కథ,  మాటలు అందించే రచయితలే వుంటే, ఆ రచయితా దర్శకుడూ కొట్టుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే రచయిత రాసిన నిగూఢార్ధాలకి బుర్ర తిరిగిపోతుంది దర్శకుడికి. అదృష్టవశాత్తూ డార్క్ మూవీస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే వగైరా వగైరా రాసే రచయితల్లేరు, వుండబోరు కాబట్టి- ఈ పరిస్థితి తలెత్తదు. దర్శకుడే రాసుకుంటున్నప్పుడు నిగూఢార్ధాల భారం తలెత్తుకోక తప్పదు. అప్పుడే దర్శకుడు ఎంత సత్తా గల రచయితో బయటపడతాడు. దర్శకుడు మొదట నిరంతర పాఠకుడు, చేయితిరిగిన రచయితా  అయినప్పుడే సత్తాగల దర్శకుడవగలడు. 

          దర్శకుడు నీలకంఠ తీసిన ‘షో’ డార్క్ మూవీ కాదు. అయినా అందులో చాలా నిగూఢార్ధాలుంటాయి. ఇవి నడుస్తున్న కథనే పరోక్షంగా చెపుతూంటాయి. ఒకసారి ఇదే విషయం ఆయన దృష్టికి తెస్తే నమ్మలేకపోయారు. నిగూఢార్ధాలున్నాయన్న సంగతే ఆయనకి తెలీదు. తెలియని స్పిరిచ్యువల్ ఫోర్స్  ఏదో అలా చేయించి నట్టుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీ ప్లే అవార్డునందుకున్నారు. 

      కాబట్టి కోయెన్ బ్రదర్స్ సీనులో - The car behind them waiting, patiently. Rain drifts down past its headlights- అని రాశారంటే దీనికి అర్ధాలున్నాయి. వెనక ఆగిన కారు ఓపిగ్గా ఎదురు చూస్తోందంటే, అది కథని లేదా పాత్రని చెప్పే సింబాలిజం. హెడ్ లైట్ మీదుగా వర్షం నీళ్ళు ధారాపాతంగా పారుతున్నాయంటే అర్ధం- అలా  చూస్తున్న వ్యక్తి  కళ్ళకి భ్రమాజనిత జగత్తు తెరలు కట్టేస్తోందన్నమాట. ఎదర తన భవిష్యత్తు అస్పష్టంగా వున్నప్పటికీ తెలుసుకోకుండా ప్రయాణిస్తున్నాడన్న మాట. కథకి, పాత్రలకి అర్ధాన్నందించకుండా దేన్నీ వృధాగా చూపించరు డార్క్ మూవీస్ దర్శకులు. ఫ్రేముల్లో ఏది కన్పించినా ఉద్దేశపూర్వకంగానే వుంటాయి. ఇందుకే ప్రఖ్యాత విమర్శకుడు రోజర్ ఎబర్ట్,  The genius of "Blood Simple" is that everything that happens seems necessary― అని ప్రస్తుతించాడు.
          ఇప్పుడు ఈ దృష్టితో పై లైన్ ఆర్డర్ లో బిగినింగ్ విభాగపు సీన్లు ఎలా విస్తరించుకున్నాయో (ట్రీట్ మెంట్) ఒక్కొక్కటీ తీసుకుని చూద్దాం...

                                              ***
     బిగినింగ్ విభాగం బిజినెస్ ప్రకారం ఇక్కడి సీన్లలో జానర్ వ్యక్తమయ్యే నేపధ్య వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, దాని కనుగుణమైన పాత్రల్ని పరిచయం చేస్తూ, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ,  ఆఖర్న సమస్యని ఏర్పాటు చేయడం (ప్లాట్ పాయింట్ 1) అని తెలిసిందే. ఈ నాల్గు స్క్రిప్టింగ్ టూల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో చూద్దాం...

          1. ఒక వాయిసోవర్ తో ప్రారంభం. టెక్సాస్ పరిసర ప్రాంతాల నిస్సార భూభాగాలని చూపిస్తూ విస్సర్ స్వగతం.

          డార్క్ మూవీస్ ని  వాయిసోవర్ తో ప్రారంభించడం ఒక తప్పనిసరి తంతులా వుంది హాలీవుడ్ కని గతంలో చెప్పుకున్నాం. అంటే డార్క్ మూవీస్ ని  కవితాత్మకంగా కూడా చూపించడమన్నమాట. తెలుగుకి ఇది లేకపోయినా డార్క్ మూవీ జానర్ మర్యాద దెబ్బతినదని చెప్పుకున్నాం.         

         
టెక్సాస్ పరిసర ప్రాంతాల నిస్సార భూభాగాలని చూపిస్తూ వేసిన ఈ స్వగతంలో అతను- ఈ ప్రపంచమంతా ఫిర్యాదుదార్లతో నిండి వుందంటున్నాడు. ఏదీ ఒక గ్యారంటీతో రాదని గుర్తించాలంటున్నాడు. పోప్ అయినా, అమెరికా అధ్యక్షుడైనా, ఇంకెవరో మాన్ ఆఫ్ ది ఇయర్ అయినా కూడా వాళ్లకి ఏదో ఒకటి బెడిసి కొడుతుందని అంటున్నాడు. పోనీ పక్కింటి వాడితో నీ గోడేమిటో చెప్పుకో,  వాడు జంప్ అవకపోతే చూడమంటున్నాడు. రష్యాలో పరస్పరం సహకరించుకునేట్టు చట్రంలో బిగించారనీ, అది వాళ్ళ సిద్ధాంతమనీ, కానీ టెక్సాస్ గురించి తనకి తెలిసింది వేరనీ అర్ధోక్తిలో ఆపుతున్నాడు...

          ఈ స్వగతం ఇంకా మనకి వెల్లడి కాని పాత్ర పలుకుతోంది.  సాధారణంగా స్వగతం ప్రధాన పాత్రదే అయివుంటుంది. ఈ ప్రధాన పాత్రని కోయెన్ బ్రదర్స్ అప్పుడే వెల్లడి చేయకుండా దాచిపెట్టి, మొదట స్వగతం ద్వారా కాన్సెప్ట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మీద దృష్టి కేంద్రీకరించేలా, ఆలోచింపజేసేలా చేస్తున్నారు. ఏమిటా కాన్సెప్ట్? నీ దగ్గరికి అవసరం కొద్దీ వచ్చిన వాణ్ణి నీ అవసరాలకి వాడుకుని విసిరేయ్- లాభపడు అని. పోప్ అయినా, అమెరికన్  ప్రెసిడెంట్ అయినా, ఇంకెవరైనా ఇలా నమ్మి దెబ్బతినే వారేననీ. ఎవడూ ఎవడి గోడూ ఆలకించడనీ, ఫిర్యాదులు చేసే వాళ్ళంతా ఒఠ్ఠి ఫూల్స్ అనీ. 

          ప్రధాన పాత్ర ఇలాటి మనస్తత్వంతో వుందంటే ఎంత కన్నింగ్ అయుంటుందో అర్ధమవుతోంది. అంటే ఈ కన్నింగ్ పాత్రతో కథ చూడ బోతున్నామన్నమాట- ఎవరా కన్నినింగ్ పాత్ర?  ఇతడికి గోడు చెప్పుకోవడానికి ఎవరు రాబోతున్నారు? ఆ ఫిర్యాదిని తన అవసరాలకి వాడుకుని ఇతనెలా లాభపడ బోతున్నాడు? టెక్సాస్ గురించి తనకింకేదో  తెలుసనీ పాయింటు కొస్తున్నాడు- ఏమిటది? ఈ ప్రశ్నలన్నిటినీ సంధిస్తూ స్వగతంతోనే  కథలోకి వెళ్ళిపోయారు కోయెన్ బ్రదర్స్. 

          కోర్టులో న్యాయమూర్తి వుంటాడు. ఆయన ఛాంబర్ లోంచి బెంచి మీదికి రాగానే క్షణం ఆలస్యం చేయకుండా, బెంచి క్లర్కు కేసు ఫైలు అందించి కక్షి దార్లని పిలుస్తాడు.న్యాయమూర్తి  వెంటనే విచారణ చేపడతాడు. అంతే గానీ, న్యాయమూర్తి బెంచి మీదికి వచ్చి కూర్చుని, తీరిగ్గా బెంచి క్లర్కుతోనో, టైపిస్టుతోనో కబుర్లాడుతూ వుండడు. ఐదో పదో నిముషాలు అలా రిలాక్సయి అప్పుడు కేసు పిలవమనడు. సరీగ్గా ఇలా కోయెన్ బ్రదర్స్ సినిమా ఓపెన్ కాగానే క్షణం వృధా చేయకుండా కథని చేపట్టారు స్వగతంతో.
***
       2. రాత్రివేళ  వర్షంలో ప్రయాణిస్తూ ఎబ్బీ,  రే లు ఒకమోటెల్ కి చేరుకోవడం..
          స్వగతం చివర్లో టెక్సాస్ ని ప్రస్తావించి లీడ్ ఇచ్చారు. దాని ప్రకారం టెక్సాస్ శివారు రోడ్ల మీద వర్షపు రాత్రి సీను ఓపెనైంది. వర్షపు జల్లు చేస్తున్న సవ్వడి, ఆ నీటిని వాహనాల టైర్లు గిలక్కొడుతున్నట్టు శబ్దం...ఈ ఓపెనింగ్ తో వర్షాన్నీ, వాహనాలనీ ప్రతీకాలంకారాలు (మెటఫర్స్) గా చూపిస్తున్నారు. వర్షం ఇక్కడ అస్పష్టతకి నిదర్శనం. ఎదర ఏముందో కన్పించని ప్రపంచాల్లోకి ఆ అస్పష్టతని గిలక్కొట్టేస్తూ దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరు? అదీ చూద్దాం. 

          మొదట పై వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో అదే స్వగతం చివరి భాగం పూర్తవుతుంది...ఇక్కడ (టెక్సాస్ లో) నీ బతుకు నువ్వే బతకాలని అంటున్నాడు ఇంకా వెల్లడి కాని కన్నింగ్ ఫెలో. ఇదీ టెక్సాస్ గురించి అతడి డిఫరెంట్ నిర్వచనం.

          ఈ స్వగతం ఈ సీనులోకి పారిందంటే అతనిక్కడే వున్నాడా? కారులో ఇద్దరు పోతూంటారు. వాళ్ళ  వెనుక భాగమే చీకట్లో నీడలా కన్పిస్తూంటుంది. డ్రైవింగ్ సీట్లో పురుషుడు, పక్క సీట్లో స్త్రీ అన్నట్టు వుంటారు. వాళ్ళ మాటలు సాగే విధానాన్ని ఎస్టాబ్లిష్ చేశారు (స్క్రిప్టులో హైలైట్ చూడండి).  వాళ్ళ సంభాషణకి అప్పుడప్పుడు ఎదరొచ్చే వాహనాల హెడ్ లైట్లు, పక్క నుంచి దూసుకెళ్ళే  ఆ వాహనాల చప్పుడూ విఘాతం కల్గిస్తూంటాయి. మంచి  విషయాలు మాట్లాడుకుంటే ఇలా జరగదేమో, చెడు సంగతులు చెప్పుకుంటున్నందుకు ఇలా ప్రకృతి డిస్టర్బ్ చేస్తోంది కాబోలు. దీనికి కాంట్రాస్ట్ గా,  వీండ్ షీల్డ్ మీద వర్షపు జల్లుని పారద్రోలుతున్న వైపర్స్ నుంచి వస్తున్న శబ్దం జోకొట్టి నిద్ర పుచ్చేట్టు వుందట! చెత్త ఆలోచనలు మాని నిద్రపొండని!

          అంత చెత్తగా ఎలా వున్నాయి మాటలు? హాల్ఫ్ వేలో ఆమె మొదలెడుతూ చెప్పే మొటది మాట- మా ఆయన మా ఫస్ట్ మ్యారేజ్ డేకి రివాల్వర్ గిఫ్టిచ్చాడని!

          వెంటనే కట్టి పడేసే సీను ఇది ఈ డైలాగుతో. ప్రేక్షకుల బద్ధకం మీద గురి చూసి కొట్టారు. మా ఆయన రివాల్వర్ గిఫ్టిచ్చాడనే ఓపెనింగ్ డైలాగు చాలా  తీవ్రమైన విషయం  కథకి సంబంధించి. ‘ఏం గోపీ, మాట్లాడవే? నా మీద కోపమా?’ అని  టెంప్లెట్  చొప్పున చాదస్తంగా బద్ధకంగా మొదలెడితే, బాధిత ప్రేక్షకుడు స్మార్ట్ ఫోన్ తీసి షార్ట్ ఫిల్మ్ చూడ్డం  మొదలెడతాడు- అలా లేదిక్కడ.   

          పైగా ఆమె పలికే  ఆ ఒక్క డైలాగుతో వీళ్ళిద్దరూ భార్యా భర్తలు కాదనీ, పెళ్లి కాని జంట కూడా కాదనీ, వీళ్ళది ఎఫైర్ అనీ నస పెట్టకుండా, టైం వెస్ట్ చేయకుండా తేలిపోతోంది.  

          మా ఆయన నా  మీద రివాల్వర్ని వాడక ముందే నేను వెళ్లి పోవాలనుకుం
టున్నాను-  నువ్వెలా భరిస్తున్నావో ఆయన్ని- అంటుంది.

          ఈ మాటల్లో అర్జెన్సీ వుంది. ఇంకాలస్యం చేయకుండా జంప్ అవుదామంటోంది. కథనం ఎక్కడేసిన గొంగళిలా వుండక, చకచకా కథని ముందుకి నడిపిస్తోంది ఇలాటి డైలాగులతో. ఇక – నువ్వెలా భరిస్తున్నావో ఆయన్ని అనడం,  మనం బద్ధకంతో నిద్రపోకుండా తొడపాశం పెడుతోంది. ఆమె భర్తని ఇతనెందుకు భరిస్తున్నాడు?- అన్న ప్రశ్న మనల్ని దిగ్గున లేచి చూసేలా చేస్తోంది.

          అప్పుడతను అంటాడు-  నేను వాడి పెళ్ళాన్ని కాదు, ఉద్యోగిని - అని.
          ఈ మాటతో కథ ఇంకాస్త రివీల్ అయింది. భర్త దగ్గర పని చేస్తున్న ఇతను భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడన్న మాట. ఏ జాతి పాత్రలో తెలిసిపోతోంది. ఇక ఈ నేపధ్యానికి తగిన సమాచారమిచ్చే వాళ్ళ సంభాషణ మరింత సాగుతున్నప్పుడు, ఈ సీనులో మార్పుని తెస్తూ ఒక సందడి మొదలవుతుంది. స్క్రిప్టులో 2, 3 పేజీల్లో హైలైట్స్ చేసిన అంశాల్ని గమనిస్తే, ఒక కారు దూసుకెళ్తుంది, ఇంకోసారి ఇంకో కారు దూసుకెళ్తుంది. మాటల  మధ్యలో ఇంకోకారూ దూసుకెళ్తుంది. ఎందుకో ఆమె కారాపెయ్య మంటుంది. సడెన్ బ్రేకేసి ఆపేస్తాడు. వెనక వస్తున్న ఓ కారు దగ్గరగా వచ్చేసి సడెన్ బ్రేకుతో ఆగిపోతుంది. 

          ఇప్పుడు ఆ ముందు వెళ్ళిన మూడు  కార్ల అంతరార్ధమేమిటి?  వెనుక ఆగిపోయిన నాల్గో  కారు నిగూఢార్ధమేమిటి? 

          ఎవరైనా చెప్పగలరా?  ఇదీ డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లేస్ తో వుండే ఎంజాయ్ మెంటు. బుద్ధి వికాసానికి డార్క్ మూవీస్, జంతు విన్యాసాలకి మాస్ మూవీస్. 

          గత సీనులోంచి ఈ సీను మొదట్లోకి స్వగతం చెప్పుకుంటూ ఒకడొచ్చాడు గుర్తుందిగా?  ఈ వర్షంలో ఈ రోడ్ల మీద వాడి వాయిస్ విన్పించి వాడెక్కడికి వెళ్ళాడు కన్నింగ్ ఫెలో? ఎక్కడికీ వెళ్ళకూడదు- వాయిస్ విన్పించిందంటే ఇక్కడికే వస్తూండాలి.  ఆ రాకకి నాందీ ప్రస్తావనగానే  మొదటి మూడు కార్లు దూసుకెళ్లే హడావిడి అన్న మాట. ఈ సింబాలిజంతో  ప్రమాదమేదో ముంచు కొస్తోందని ( ఫోర్ షాడోయింగ్) ఆ సీక్రెట్ లవర్స్ కి సూచించడమన్నమాట. వాళ్లింకా తెలుసుకునే స్థితిలో లేరు. కానీ ప్రేక్షకులకి గుబులు మొదలైంది.

          వెనక నాల్గో కారు అలాగే ఆగివుంది. అప్పుడు ముందు కార్లో వున్నతను వెనక్కి చూస్తాడు. వెనక కారు హెడ్ లైటు అతడి మొహం మీద పడి, ఇప్పుడతను  మొట్ట మొదటి సారిగా మనకి రివీలవుతాడు. ఇంకో విధంగా అతడి ముఖం మనకి కనపడే వీలుందా? లేదు, అంత  సేపూ ముందు నుంచి అప్పుడప్పుడు హెడ్ లైట్లు పడుతున్నా రివీల్ చేసే అవకాశం లేదు దర్శకులకి. ప్రయాణిస్తున్న కారు ఫ్రంట్ షాట్లు తీసి వాళ్ళ మొహలని చూపించేసే చవకబారు తనానికి పాల్పడలేదు. ఇల్లాజికల్ గా షాట్లు తీయలేదు. 

          దర్శకులు  మనల్ని కారు వెనుక సీటులో కూర్చోబెట్టి సీన్లో ఇన్వాల్వ్ చేస్తూ, ఆ పాయింటాఫ్ వ్యూలో చీకట్లో వాళ్ళని వెనకనుంచి చూపిస్తూ వచ్చారు. మనం కారు దిగి పోయి ఫ్రంట్ కెళ్ళి వాళ్ళెవరో చూసేసే అవకాశం లేదు కదా? అతని ఫేస్ ఎలావుందో వెనక నుంచి ఇంకో కారు హెడ్ లైటు పడితేనే, అతను వెనక్కి చూస్తేనే అతడి మొహాన్ని ఆ వెలుగులో మనం స్పష్టంగా చూడగలం - కదూ? ఇదే జరిగిందిక్కడ. ఈ స్క్రీన్ ప్లేలో ఏది జరిగినా అదింకో దాన్ని పుట్టిస్తుంది. దర్శకత్వమంటే ప్రధానంగా రచనే. రచనే దర్శకత్వాన్ని పట్టిస్తుంది. రాయడం రాలేదంటే ఆలోచించడం రానట్టే. ఆలోచించడం రానప్పుడు దర్శకత్వమెలా వస్తుంది? కాబట్టి అంతా రాయడం దగ్గరే దర్శకత్వం చేసేశారు కోయెన్ బ్రదర్స్. ఒక రెండొందల పేజీల తెలుగు సినిమా స్క్రిప్టుని రెండు గంటల్లో చదివేసి అభిప్రాయం చెప్పేయవచ్చు. తొంభై పేజీల కోయెన్ బ్రదర్స్ స్క్రీన్ ప్లే చదవడానికే పది రోజులు పట్టింది. ఓ రెండు పేజీలు  చేదివితే ఆ రెండు పేజీలు  వెంటాడుతూ మూడో పేజీకి వెళ్ళలేకపోతున్నాం.

          కారు డ్రైవ్ చేస్తున్నతను ఇలా మనకి తెలిశాక, అతను పక్క సీట్లో వున్నామెతో ‘ఎబ్బీ?’ అంటాడు. 

          ఇతనెవరో ముఖాన్ని రివీల్ చేశారు, కానీ పేరు చెప్పలేదు; ఆమె పేరు ఇతని చేత చెప్పించారు, కానీ ఆమె ముఖాన్ని రివీల్ చేయలేదు దర్శకులు. ఇంటరెస్టింగ్ ప్లే ప్రేక్షకుల మైండ్ తో. 

          ఇప్పుడు వెనుక కారుని చూస్తే,  అదలాగే ఆగి వుంటుంది హెడ్ లైట్లతో. ఓపిగ్గా వేచివుందనీ,  హెడ్ లైట్ మీదుగా వర్షపు నీళ్ళు పారుతూంటాయనీ రాశారు దర్శకులు. ఈ రెండూ కారులో కనిపించకుండా వున్న వ్యక్తి గురించిన విషయాలే.  దీని నిగూఢార్ధం ఇతను మనం ఎదురుచూస్తున్న కన్నింగ్ ఫెలో అయితే ఇతడికి ఓపిగ్గా వేచి చూసే లక్షణమెందుకు? ఎవరితను? ఇకపోతే, హెడ్ లైట్ మీద వర్షపు నీళ్ళు పారడమన్నది ఎదర ఇతడి భావిజీవితం అస్పష్టంగా వుందని చెప్పడమే. ఆల్రెడీ ముందు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళిద్దరి జీవిత ప్రయాణం అస్పష్ట గమ్యంతోనే  వుందని,  ఇంత సేపూ చూపిస్తూ వచ్చిన ఎదురద్దం మీద వర్షపు జల్లు చెప్తూనే వుంది. 

      అప్పుడతను అడుగుతాడు, ఆ కారు నీకు తెలుసాని. తెలీదంటుంది. మరెందుకాపావంటే, తెలీదు- నేను పొరపాటు చేస్తున్నానేమో అన్పిస్తోందని అంటుంది...

          సిక్స్త్ సెన్స్ ఇది. ఆమె మనసు ఈ సంబంధం పట్ల క్షణకాలం కీడు శంకించి వుండొచ్చు. పక్క నుంచి కార్లు ఎడాపెడా పోతూంటే కారాపెయ్యమంది. చూస్తే వెనకాల వస్తున్న కారుని ఆపేసినట్టయ్యింది. ఈ వెనకే దురదృష్టం వెన్నాడుతోందని ఆమెకీ అతడికీ తెలీదు!

          ఈ దురదృష్టాన్ని గమనించకుండా, ఆ వెనక ఏమిటది?-  అంటుంది. అతను చూసి – మోటెల్ అంటాడు. వెనకాలే  వెన్నాడుతున్న దురదృష్టం వేచి వుంది. తనేమో ఆ వెనకాలే వున్న మోటెల్ కి పోదామని సూచిస్తోంది. ఎంత ఐరనీ ఇది. భర్త కన్నుగప్పి ఎఫైర్ నడిపిస్తున్న ఈమె,  సాక్షాత్తూ  వెనకే వున్న దురదృష్టాన్ని చూసుకోకుండా, పడక మీదికి ఆహ్వానిస్తోంతడ్ని!

          ఇప్పుడే మొదటిసారి అతణ్ణి పేరు పెట్టి పిలవడంతో అతడి పేరు ‘రే’  అని తెలుస్తుంది. రే ఫేస్ ని ఇందాక మనకి హెడ్ లైట్లో రివీల్ చేసిన దర్శకులు,  ఇక వెనకనుంచి పడుతున్న అదే  హెడ్ లైట్లో, ఆమె ఫేస్ ని పాక్షికంగా ఎడం వైపే చూపిస్తూంటారు (ఆమె ఎడం వైపు తిరిగి మాట్లాడు తున్నప్పుడు ఎడమ చెంప మీదే ఫోకస్ పడుతుంది). ఇదామె పైకి ప్రియుడితో ఇలా ప్రకాశిస్తోందనీ, లోపల భర్తని అటు చీకట్లో వుంచిందనీ అర్ధంతో వుంది. 

          ఒక్క సీనులో ఈ రెండు పాత్రల పరిచయాన్ని పరిపూర్ణంగా చేసేస్తూ, ఇక యేం జరగబోతోందన్న  సస్పెన్సుని క్రియేట్ చేశారు. డిటెక్టివ్ రచయిత డషెల్ హేమెట్ కంటే జేమ్స్ ఎం కెయిన్ కి దగ్గరగా సినిమా తీశామని చెప్పుకున్నారు కోయెన్ బ్రదర్స్.

(ఇంకా వుంది)

-సికిందర్