రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, September 26, 2020

980 : రివ్యూ

రచన - దర్శకత్వం : ఆరతీ కడవ్
తారాగణం : విక్రాంత్ మాసీ
, శ్వేతా త్రిపాఠీ
సంగీతం : షేజాన్ షేక్
, ఛాయాగ్రహణం : కౌశల్ షా
నిర్మాతలు : అనురాగ్ కశ్యప్
, నవీన్ శెట్టి, శ్లోక్ ర్మా, ఆరతీ కడవ్
బ్యానర్స్ :  ఫండమెంటల్ పిక్చర్స్
, ఎలక్ట్రిక్ ఫిలిమ్స్
విడుదల
:  నెట్ ఫ్లిక్స్
***
         
బాలీవుడ్ నుంచి సైన్స్ ఫిక్షన్ లో కొత్త ప్రయోగం చేసింది కొత్త దర్శకురాలు ఆరతీ కడవ్. పురాణాలు చెప్పే జనన మరణాలు, పునర్జన్మ అర్ధాలకి అంతరిక్ష యుగంలో ఆధునిక టెక్నాలజీని సమన్వయం చేస్తూ పౌరాణిక -సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కించింది. రాక్షసులు మంచివాళ్ళుగా మారి, మానవ సేవకి దిగివస్తే మానవ జీవితం ఎలా వుంటుందన్న ప్రశ్న రేకెత్తించింది. బావుంది. మరి ఇదెంతవరకు చెప్పగల్గింది? అసలేం చెప్పింది? చెప్పాల్సింది చెప్పిందా లేదా? ఈ ప్రశ్నలతో ముందుకెళ్తే ఆక్సిజన్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్ళినట్టుంటుందా? అంతరిక్షంలోంచి తోసేస్తే మధ్యలో వేలాడినట్టుంటుందా? కిందపడితే పునర్జన్మ ఎత్తినట్టుంటుందా? ఎలా వుంటుంది? దీనికి జవాబుకోసం ఈ నెట్ ఫ్లిక్స్ మూవీని చూద్దాం...

        ది 2027 వ సంవత్సరం. 75 ఏళ్ల  క్రితం రాక్షసులు అంతరిక్ష యుగంలోకి ప్రవేశించి మనుష్య - రాక్షస శాంతి ఒప్పందం చేసుకుని వుంటారు. దాంతో మనుషులతో తమ వైరాన్ని పూర్తిగా తుడిపేసుకుంటారు. పుష్పక్ 634 A అనే ఒక అంతరిక్ష నౌకని సిద్ధం చేసి పంపడం మొదలెడతారు. ఈ నౌకలో రావణ సైన్యం ప్రధాన దళాధికారి ప్రహస్త (విక్రమ్ మాసీ) వుంటాడు. ఇతను ప్రతీ ఉదయం భూమికి సమీపంగా వచ్చి మరణించిన వారి కార్గోని తీసికెళ్తాడు. భూమ్మీద గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్ నీతిజ్ఞ (నందూ మాధవ్) కి కంప్యూటర్ ద్వారా అనుసంధానమై వుంటూ, మృతుల సమాచారమందుకుని ఈ డ్యూటీ చేస్తూంటాడు.

       అంతరిక్ష నౌకలో ప్రహస్త పోస్ట్ డెత్ ట్రాన్సిషన్ సర్వీసెస్ కి పని చేస్తూంటాడు. అంటే చనిపోయిన మనుషులకి  కంప్యూటరీకరణ, రీసైక్లింగ్ మొదలైనవి చేసి, పునర్జన్మకి సిద్ధం చేస్తూంటాడు. ఈ ప్రక్రియలో జ్ఞాపకాల్ని కూడా తీసేస్తాడు. 75 సంవత్సరాలుగా మార్పూ  అభివృద్ధీ లేకుండా రొటీన్ గా ఇదే పని చేస్తూంటాడు. అప్పుడు అతడి కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న యువిష్కా (శ్వేతా త్రిపాఠీ) అసిస్టెంట్ గా నౌకలో ప్రవేశిస్తుంది. 
        ఆమె చేసే ట్రీట్మెంట్ అతడికి భిన్నంగా వుంటుంది. యాంత్రికంగా వుండే అతడికి చావుపుట్టుకల గురించి పౌరాణిక అర్ధాలు చెప్తుంది. చెప్తూనే వుంటుంది...అలా చెప్తూ వుంటుంది...ఇంతే కథ
, ఇదే కథ. ఇంతకి మించి ఏమీ వుండదు.

        మృతుల్ని పునర్జన్మకి సిద్ధం చేశాక ఆ మరుజన్మ ఎలా వుంటుందో చూపించాలనుకోదు దర్శకురాలు. కార్గో రిసీవ్ చేసుకోవడమేగానీ డెలివరీ వుండదు. కథలో ఏ మలుపులూ వుండవు. పాయింటు వుండదు. పాత్రలకి లక్ష్యా లుండవు. సంఘర్షణ వుండదు. థ్రిల్స్ వుండవు
, స్పీడు వుండదు. ముగింపు కూడా వుండదు. అసలు హీరోహీరోయిన్ పాత్రల మధ్య రోమాన్స్ కూడా వుండదు. వాళ్లెందుకున్నారో, ఏం చేస్తున్నారో అర్ధముండదు. కథా లక్షణాలే వుండవు.

        హీరోయిన్ హీరోకంటే ఎలా భిన్నమో దర్శకురాలు హాస్యాస్పదంగా చూపించింది. మృతుల గాయాల్ని మాన్పడమెలాగో అతడికి తెలియకపోతే
, గాయాల మీద బ్లూ ప్లాస్టిక్ టేపు వేసి టార్చి వేస్తుంది. గాయాలు మాయం! ఇదీ హీరోయిన్ స్పెషల్ నాలెడ్జి. కత్తితో కూడా కోస్తుందామె. జానపద సినిమాల్లో మంత్రగత్తె ఉఫ్ మని వూదితే గాయాలు మాయమైపోతాయి- ఇలాకూడా వుండవు ఈ సైన్స్ ఫిక్షన్ క్యారక్టర్లు. 

        మృతులై వచ్చిన వాళ్ళల్లో ఒక మెజీషియన్, ఒక సినిమా స్టంట్ మాన్, ఇంకో కోపిష్టీ మొదలైన వాళ్ళుంటారు. ఈ ప్రత్యేకతలు కథ కుపయోగపడిందీ లేదు. ఉపయోగపడితే కథ అనే పదార్ధం పుట్టేది. మృతులు మగవాళ్లే వుంటారా? ఆడవాళ్ళు మగవాళ్ళని పైకి తోలేసి మజా చేసుకుంటున్నారా? స్టంట్ మాన్ తాను సల్మాన్ ఖాన్ గా పుట్టాలనుకుంటాడు. అలా పుట్టి భూమ్మీదికొస్తే ఏం చేస్తూంటాడో చూపించాలిగా? చచ్చిపోయిన మనుషులకి పైన నరకం లేదనీ, జన్మ మార్చుకుని మళ్ళీ కోరుకున్న విధంగా పుట్టే అవకాశముందనీ తెలిస్తే ఎవరు దారుణాలు చేయకుండా వుంటారు? భూమి పాపాల దిబ్బగా మారదా? కష్టాల్లో వున్నవాళ్లు అర్జెంటుగా ఆత్మహత్యలు చేసుకుని పైకెళ్లి మంచి జన్మ కోరుకుని పుట్టరా? ఇలాటి వన్నీ ఈ మూవీలో తలెత్తే ప్రశ్నలు. ప్రకృతికి వ్యతిరేకంగా రాక్షసులు ఇలా దుకాణం పెట్టుకుంటే ప్రకృతి వూరుకుంటుందా? 


        ఈ రాక్షసులెవరు
? యముడేమయ్యాడు, యమ భటులేమయ్యారు, యమలోకం ఏమైంది? రావణ భటు లెక్కడ్నుంచి వచ్చారు? ఈ ప్రశ్నలకి, సందేహాలకీ సమాధానాలు కూడా ఇవ్వాలనుకోదు దర్శకురాలు. పురాణాల్లో రావణుడు యమ కుబేర దేవ అసుర లోకాలపై యుద్ధం ప్రకటించి ముల్లోకాల్ని జయిస్తాడు. ఈ యుద్ధానికి ముఖ్య సేనాపతి ప్రహస్త. రావణుడు జయించడం
వల్ల యమలోకంపోయి రావణ లోకం ఏర్పడిందనీ
, అతను మనుషులతో శాంతి ఒప్పందం చేసుకుని ఈ కథ ప్రారంభించాడా? ఏదోవొక స్పష్టత నివ్వాలిగా?

        మనుష్య - రాక్షస ఒప్పందమని కొత్తగా కిల్లర్ ఐడియా చెప్పి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్టుంది
. ఇలాటి ఒప్పందమే సాధ్యమైతే పరిణామాలెలావుంటాయో వూహించినట్టు లేదు. మంచీ చెడుల్లో రాక్షసులనే చెడు లేకపోతే భూమ్మీద కూడా ఈ ద్వంద్వాలుండవు. ద్వంద్వాలనేవి సృష్టి మూల సూత్రాలు. సృష్టి మూలసూత్రాలకే విరుద్ధంగా ఐడియాలు చేస్తే ఇదుగో ఇలా ఏం కథ చెప్పాలో తెలియక చేతులెత్తేసి నట్టుంటుంది. ప్రేక్షకుల్ని అంతరిక్షంలోకి తీసికెళ్లి తోసేసి నట్టుంటుంది.

సికిందర్