రచన –దర్శకత్వం : చేరన్
తారాగణం : శర్వానంద్, నిత్యా మీనన్, సంతానం, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : సిద్దార్థ్
బ్యానర్ : బృందావన్ పిక్చర్స్ , నిర్మాత : డి. ప్రతాప్ రాజు
విడుదల : 25 జూన్, 2016
***
శర్వానంద్ నటించిన
ద్విభాషా చలనచిత్రం ‘రాజాధిరాజా’ మొత్తానికి విడుదలయ్యింది. చేరన్ దర్శకత్వంలో
నిత్యా మీనన్ తో కలిసి నటించాడు. చేరన్ గతంలో ‘ఆటోగ్రాఫ్’ అనే హిట్ తీశాడు. చేరన్ కి ఆటోగ్రాఫులు, బయోగ్రఫీలు,
డైరీలూ అంటే బాగా ఇష్ట మున్నట్టుంది. ‘జేకే ఎనమ్ నాన్
బనిన్ వళక్కాయ్’ అని ‘రాజాధి రాజా’ తమిళ వెర్షన్ కి టైటిల్ పెట్టాడు. అంటే ‘నా
మిత్రుడు జేకే జీవితం’ అని అర్ధం. ఎవరా మిత్రుడు? ఏమిటా జీవితం?...ఒకసారి
తెలుసుకుందాం.
కథ???
ఐటీ ప్రొఫెషనల్ జయకుమార్
(శర్వానంద్) ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు.
అలాంటిది అకస్మాత్తు గా బుద్ధిమంతుడై పోతాడు. సీరియస్ గా ఇంటిని పట్టించుకోవడం మొదలెడతాడు.
రిటైర్ అయిన తండ్రి, తల్లి, ఇద్దరు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు, ఒక చదువుకుంటున్న
తమ్ముడూ వుంటారు. వీళ్ళందరూ జీవితంలో స్థిరపడడానికి చర్యలు చేపడతాడు. ఉద్యోగం
మానేసి ఫ్రెండ్స్ ని కలుపుకుని ఫ్లాట్స్ ని శుభ్రం చేసే క్లీన్ అండ్ గ్రీన్ అని
కంపెనీ పెడతాడు. రియల్ ఎస్టేట్ లోకి దిగి డూప్లెక్స్ లు కట్టే ప్రణాళిక వేస్తాడు.
ఫ్లవర్ బిజినెస్ ప్రారంభిస్తాడు, ఫ్యాషన్ డిజైనింగ్ మొదలెడతాడు. ఈ వ్యాపారాల్లో గర్ల్
ఫ్రెండ్ నిత్య కూడా తోడ్పడుతూంటుంది. వ్యాపారాలు బాగా సాగుతున్నప్పుడు బడా రియల్
ఎస్టేట్ వ్యాపారి రుద్ర (ప్రకాష్ రాజ్) దెబ్బ తీస్తాడు, ఫలితంగా రియల్ ఎస్టేట్
వెంచర్ ని అతడికే తక్కువకి అమ్ముకోవాల్సి
వస్తుంది. ఆ డబ్బుని తనతో పనిచేస్తున్న ఏడుగురు ఫ్రెండ్స్ తో పంచుకుంటాడు. పెద్ద
చెల్లెలికి సంబంధం చూస్తాడు. దానికి పెద్ద
మొత్తంలో కట్నం అవసరమేర్పడి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరే అప్పుతీసుకుంటాడు. నిత్యకి కార్డియాక్ ఆస్థమా జబ్బు వుంటుంది. గుండె మార్పిడి చేయాలి. అది
కూడా చేయిస్తాడు జేకే. తన కుటుంబానికి ఫ్లాట్ కొని అందులోకి మారుస్తాడు. చెల్లెలి
పెళ్లి ఘనంగా చేస్తాడు. ఇంతలో ఒక వూళ్ళో
ఇంకో సమస్య తలెత్తుతుంది. ఆ సమస్య ఎందుకొచ్చిందో నిత్యకి చెప్తాడు. ఆ సమస్య
తీరుస్తాడు. తిరిగి వచ్చి కంపెనీల్ని ఫ్రెండ్స్ పేర రాసేసి శాశ్వతంగా విదేశాలకి
వెళ్ళిపోతాడు...
ఎందుకిలా చేశాడు? అసలేం జరిగిందతడికి? జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్న వాడు ఎందుకు సీరియస్ గా మారిపోయి ఈ పనులన్నీ చేశాడు? వీటికి సమాధానాలు అతడు గడిపిన విశృంఖల జీవితంలోనే దొరుకుతాయి.
దురదృష్టవశాత్తూ కథకీ, గాథకీ
ఇంకా తేడా తెలుసుకోలేదు దర్శకుడు చేరన్. కథ అనుకుంటూ గాథలుగా తీసిన అనేక ఫ్లాప్
సినిమాలొచ్చాయి భారీ ‘బ్రహ్మోత్సవం’ తోబాటు!
ఒకదాని తర్వాత ఒకటి కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’, ‘పైసా’ రెండూ కూడా టాప్ బ్రాండ్ అట్టర్ ఫ్లాప్ గాథలు
రికార్డు స్థాయిలో. మనవాళ్ళ సినిమా నాలెడ్జి ఇలా వుంటోంది. చేరన్ అయితే కృష్ణవంశీ
రికార్డు కూడా బద్దలు కొడుతూ ఏకంగా ద్విభాషా చలన చిత్రంగా ఈ గాథని తలపెట్టాడు.
2013 లో పూర్తి చేస్తే, 2015 వరకూ తమిళ వెర్షన్ విడుదలే కాలేదు. చివరికి డీవీడీ లు విడుదల చేసి చేతులు
దులుపుకోవాల్సి వచ్చింది. శర్వానంద్- నిత్యామీనన్ -ప్రకాష్ రాజ్ ల వంటి స్టార్స్
సినిమాకి ఈ పరిస్థితి. ఇక తెలుగు వెర్షన్ కి ‘ఏమిటో ఈ మాయ’ అని తమ మీద తామే జోకు వేసుకుంటున్నట్టు టైటిల్
పెట్టి అమ్మకానికి పెడితే, నలిగినలిగి ‘రాజాధి రాజా’ గా రూపాంతరం చెంది ఇలా
విడుదలయ్యింది. దర్శ కులు, హీరోలు, నిర్మాతలూ ఇప్పటికీ ఎందుకిలా జరిగిందో
తెలుసుకుంటారా అంటే, అంత నాలెడ్జి ఎక్కడిది? కథ అనుకుంటూ గాథ తీయాల్సిందే, గాథలు
తీశాక వాటి తడాఖా చవి చూడాల్సిందే కోట్లు వదిలించుకుని
కథా గాథా అన్నది పక్కన
పెడితే, అసలిందులో విషయం ఎంత పాతది... అనగనగా ఒక హీరో రాము, చాలీ చాలని జీతం,
రిటైరైన తండ్రి, చాకిరీ చేసే తల్లి, పెళ్లి
కెదిగి కూర్చున్న చెల్లెళ్ళు, డాక్టరీ చదవాలనుకుంటున్న తమ్ముడూ...వీళ్ళకోసం కుటుంబరావులా బతుకు బండిని ఈడుస్తూ...బాపతు కథల
సినిమాలు ఇంకానా! ట్రెండ్, బాక్సాఫీసు
అప్పీల్, యూత్ అప్పీల్, మాస్ అప్పీల్ ల
వంటి కమర్షియాలిటీలు పట్టని ‘విషయం’ ఎలా
వర్కౌట్ అవుతుందనేది కామన్ సెన్సు కదా? దీనికి తోడు హార్ట్ పేషంట్లు, బ్రెయిన్
ట్యూమర్ పేషంట్లు కూడా వుంటే ఇంకేం
చెప్తాం!
ఎవరెలా చేశారు
సీరియస్ వాతావరణంలో అందరూ
సీరియస్ గా వున్నప్పుడు చేయడానికి
ఇంకేముంటుంది. ప్రారంభం నుంచీ
ముగింపు వరకూ విషాదాన్ని ఒలకబోస్తూ కన్పించే నటీనటులతో –శర్వానంద్, నిత్యా మీనన్
సహా- ఆఖరికి కమెడియన్ సంతానంతో కూడా-ఎక్కడా
రిలీఫ్ అనేది వుండదు. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్, కాస్త నవ్వు, మరికాస్త హుషారు
అనేవి లేకుండా ప్రవర్తించే నటీనటుల ప్రతిభాపాటవాల గురించి చెప్పుకోవదానికేమీ
వుండదు. జివి ప్రకాశ కుమార్ సంగీతం ఇంకో నీరసమైన వ్యవహారం. ఛాయాగ్రహణం, కళా
దర్శకత్వం బావున్నాయంటే.
చివరికేమిటి
‘నా
మిత్రుడు జేకే జీవితం’ ద్వారా విచ్చలవిడి జీవితాల్ని గడిపే యూత్ ఒకనాటికి అనుభవిస్తారని చెప్పడం
దర్శకుడి ఉద్దేశం. యూత్ కి పాఠాలు చెప్పే కాలం కాదని మా ఉద్దేశం. కావలసినంత ఎంటర్
టైన్ చేసి వదిలెయ్యాలని బాక్సాఫీసు కూడా విన్నవించుకుంటుంది. బాగా ఖర్చుపెట్టి ఎంత
క్వాలిటీతో తీసినప్పటికీ, దర్శకుడికి ఎంత కళా హృదయమున్నప్పటికీ, కాస్త
ప్రేక్షకుల్ని కూడా పట్టించుకుని తీస్తే ఇలాటి పరాభవాలు ఎదురుకావు. కుటుంబరావులూ
క్యాన్సర్ వ్యాధులూ లాంటి అరిగిపోయిన విషయాలు డైరీల్లో, ఆటో బయోగ్రఫీల్లో మాత్రమే బావుంటాయనేదీ,
సినిమాల్లో బావుండవనేదీ ఇవ్వాళ్ళ కొత్తగా
చెప్పుకోవాల్సిన విషయం కాదు.
స్క్రీన్ ప్లే
సంగతులు
కథ ఒక ఆర్గ్యుమెంట్ ని
ప్రతిపాదిస్తుంది. గాథ ఒక స్టేట్ మెంట్ నిస్తుంది. అనిల్ కుమార్ రోడ్డు మీద
పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. కాలు ఫ్రాక్చరైందని తేల్చారు.
తిరిగి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత తిరిగి
ఎప్పటిలా నడవసాగాడు. ఇది గాథ. ఇది ఇలా
స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోతుంది.
అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. ఆ వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందే నని పట్టుబట్టాడు. కోర్టులో కేసు వేశారు. అనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడు. వాహనదారుడిదే తప్పని తేలింది. అనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించింది. ఇది కథ . ఇది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోంది. స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన గాథ ఎంత చప్పగా వుందో, ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథ అంత ఆసక్తి కరంగా వుందని తేలుతోంది. ఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే, గాథలు కాదు.
ఇంకోటి గమనిస్తే- గాథకి స్ట్రక్చర్ వుండదు, కథకి వుంటుంది. సినిమాకి స్ట్రక్చరే ముఖ్యం. గాథలో బిగినింగ్ మాత్రమే వుండి, సాగి సాగి బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని సినిమాకి పనికి రాదు. కథ కి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ కూడా వుండి సంతృప్తికరంగా ముగుస్తుంది.
గాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు, కథకి వుంటాయి. కథకి క్యారక్టర్ ఆర్క్ వుండదు, ఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి క్యారక్టర్ ఆర్క్ తో పాత్ర ఉద్విగ్నభరితంగా వుంటుంది. గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదు, కథనం నేలబారుగా సాగుతూ వుంటుంది. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుంది, కథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుంది.
గాథలో సంఘర్షణ వుండదు, సంఘర్షణ లేనిది కథ వుండదు. గాథకి ప్రతినాయక పాత్ర వుండదు, కథకి ప్రతినాయక పాత్ర కీలకం. గాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి, కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి.
ఇవన్నీ ‘రాజాధిరాజా’ సినిమా పొడవునా గమనించవచ్చు. గాథతో జరిగే మోసమేమిటంటే, అది గాథ అని చాలాసేపటి వరకూ తెలీదు. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాం. ఎంతకీ రాదు, విశ్రాంతి వచ్చేస్తుంది. అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడు తెలుస్తుంది మోసం. మోసపోయామే అని లేచిపోవడమో లేక, ఏం చేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాం.
‘రాజాధిరాజా’ లో మొదటి పదినిమిషాలు హీరో విశృంఖల జీవితాన్ని చూపిస్తారు పాటతో సహా. ఆ తర్వాత అతను ఎందుకో మారిపోయి కుటుంబ బాగు కోసం వ్యాపారాలు పెడుతున్నట్టు చూపించు కొస్తూంటారు. ఒకదాని తర్వాత ఒకటి కంపెనీలు పెట్టడం, వాటికి ప్రచారం చేసుకోవడం, కష్టమర్లని ఆకర్షించడం వగైరా- ఇదంతా వివిధ ఉత్పత్తుల యాడ్ ఫిలిమ్స్ చూపిస్తున్నట్టుగా ముప్పావు గంట సేపూ నడిపిస్తారు. అప్పుడు ప్రకాష్ రాజ్ అడ్డుపుల్ల వేయగానే, హమ్మయ్యా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందని రైలొచ్చినంత సంతోష పడతాం. ఇక ఇద్దరికీ సంఘర్షణ పుట్టి, ఆ పోరాటంతో హీరోకి ఒక గోల్, మనకి కథతో ఆడుకోవడానికి ఒక బాల్ లభిస్తాయని ఆనందపడతాం. ఇదేమీ వుండదు. ప్రకాష్ రాజ్ అడిగింది ఇచ్చేసి వేరే పని చేసుకుంటాడు హీరో. ప్రకాష్ రాజ్ ఇక కన్పించడు. ఇంటర్వెల్ దగ్గర ఒక ఫోన్ ఫస్తుంది హీరోకి- ఆమె అన్నా కాపాడమని వేడుకుంటూ వుంటుంది...
ఎవరామె? తెలుసుకోవాలంటే సెకండాఫ్ లోకి వెళ్ళాలి. హీరోయిన్ తో హీరో చిత్తూరు జిల్లాకి వెళ్తూ, ఆ కుటుంబానికి తన వల్ల జరిగిన అన్యాయం తాలూకు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఈ కుటుంబానికి చెందిన తన కొలీగ్ తో న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ చేస్తే అతను చనిపోయాడు. కుటుంబం దిక్కులేనిదనిది. తండ్రికి గుండె హబ్బు వచ్చింది...ఇప్పుడు ఇలా వెళ్లి ఆ కుటుంబానికి బోలెడు డబ్బు ఇస్తాడు హీరో. అ డబ్బుతో పూల తోటలు వేసి తన కంపెనీకి అమ్మమంటాడు.
ఇక హీరోయిన్ కి గుండెజబ్బు సీరియస్ అవుతుంది. ఆమెకి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి బతికిస్తాడు. ఆమె అతడి మెడికల్ రిపోర్టులు చూస్తుంది. దాంతో అదే ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఇంకో విశేషం చెప్తాడు హీరో. తన తలకి దెబ్బ తగిలింది. రిపోర్టులో బ్రెయిన్ ట్యూమర్ ఇది వరకే వున్నట్టు తెలిందనీ, యాక్సిడెంట్ తో బ్లడ్ కొద్ది కొద్దిగా వూరుతూ చావుకి దగ్గర చేస్తోందనీ, అందుకే కుటుంబం గురించి ఇంట కష్టపడుతున్నా ననీ అంటాడు.
చెల్లెలి పెళ్లి ఇదివరకే చేశాడు, కుటుంబానికి ఫ్లాట్ కొనిచ్చాడు, బోలెడు డబ్బు ఇచ్చాడు, హీరోయిన్ కి ఆపరేషన్ చేయించాడు, కొలీగ్ కుటుంబానికి ఆధారం చూపించాడు, ఇక ఫ్రెండ్స్ అందరికీ కంపెనీలు రాసేసి, సెలవు తీసుకుని మరణాన్ని ఆహ్వానిస్తూ విదేశాలకి వాలస... ఇంట్లో అసలు విషయం తెలియ నివ్వకుండా...ది ఎండ్.
గాథ గోదాములోకి, మనం అగాథంలోకి!
-సికిందర్