రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఆగస్టు 2023, సోమవారం

1353 : రివ్యూ!


 

రచన –దర్శకత్వం : అమిత్ రాయ్
తారాగణం : అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠీ, యామీ గౌతమ్, గీతా అగర్వాల్, ఆరూష్ వర్మ, పవన్ మల్హోత్రా, అరుణ్ గోవిల్ తదితరులు
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, హన్స్ రాజ్ రఘు వంశీ, డీజే స్ట్రింగ్స్, ప్రణయ్, సందేశ్ శాండిల్య; ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్స్ : కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వయాకామ్ 18 స్టూడియోస్, వకావూ ఫిల్మ్స్
నిర్మాతలు : అరుణా భాటియా, విపుల్ డి షా, రాజేష్ బహల్, అశ్వి వర్డే
విడుదల ; 11.8.23
***

        2019 లో హౌస్ ఫుల్ హిట్టయిన తర్వాత నుంచి నటించిన 12 సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాక, ఓఎంజీ -2 తో ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు కన్పిస్తున్నాడు అక్షయ్ కుమార్. 2012 లో తానే నటించిన ఓఎంజీ (ఓ మైగాడ్) సూపర్ హిట్టయ్యింది. ఇది తెలుగులో గోపాల గోపాల గా రీమేకైంది. 2010 లో రోడ్ టు సంగం అనే సినిమాతో దర్శకుడుగా మారిన అమిత్ రాయ్, 13 ఏళ్ళ తర్వాత రెండో సినిమా తీసే అదృష్టానికి నోచుకున్నాడు. అయితే ఓఎంజీ -2’, ఓఎంజీ కి సీక్వెల్ కాదు. రెండిటి కథలు, పాత్రలు వేర్వేరు. అక్షయ్ కుమార్ తప్ప ఓఎంజీ లో నటించిన వాళ్ళెవరూ ఓఎంజీ -2 లో లేరు. ఇంతకీ అమిత్  రాయ్ ఏం తీశాడు? ఇది ఎందుకంత సెన్సార్ తో వివాదంలో పడింది? అక్షయ్ కుమార్ కిది హిట్టేనా? ఇవి తెలుసుకుందాం.

కథ

    కాంతి శరణ్ ముద్గల్ (పంకజ్ త్రిపాఠీ) శివ భక్తుడు. ఓ పుణ్యక్షేత్రంలో పూజా సామగ్రి అమ్మే షాపు నిర్వహిస్తూంటాడు. భార్య ఇందుమతి (గీతా అగర్వాల్), కొడుకు వివేక్ (ఆరూష్ వర్మ), కూతురూ వుంటారు. వివేక్ స్కూల్లో చదువుతూ వుంటాడు. ఒకరోజు వివేక్ అనైతిక చర్యకి పాల్పడ్డాడని స్కూలునుంచి డిస్మిస్ అవుతాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. తన కొడుకు తప్పుడు సమాచారం వల్ల, తప్పుదారి పట్టించే వాళ్ళ వల్లా దగా పడ్డాడని భావించిన కాంతి, స్కూలు ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి (అరుణ్ గొవిల్ )తో ఘర్షణ పడతాడు. లాభం లేక, అవమానం తట్టుకోలేక వూరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబంతో వెళ్ళి పోతూంటే, దేవదూత శివగణ్ (అక్షయ్ కుమార్) ప్రత్యక్షమై సత్యం కోసం పోరాడమంటాడు. దీంతో స్కూలు యాజమాన్యాన్ని, నకిలీ వైద్యుల్ని, బూటకపు మందులు అమ్మే వాళ్ళనీ కోర్టుకి లాగుతాడు కాంతి.
       
కాంతి లక్ష్యం ఏమిటి
? విద్యా వ్యవస్థలో ఏం మార్పు కోరుకుంటున్నాడు? ఆ మార్పు సాధించాడా? ఎలా సాధించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఓఎంజీ లో నాస్తికుడు భూకంపం వల్ల తన వ్యాపారానికి జరిగిన నష్టానికి దేవుడి మీద కేసు వేసి కోర్టుకి లాగితే, ఓఎంజీ-2 లో ఓ వ్యాపారి పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల తన కొడుకు పెడ దారి పట్టిపోయాడని స్కూలు యాజమాన్యాన్ని కోర్టుకి లాగుతాడు. ఈ కథ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ సీరియస్ చర్చల్లోవుండేది. తర్వాత చెత్త బుట్ట దాఖలైంది. దాన్ని దులిపి పైకి తీశాడు దర్శకుడు.
        
కౌమార దశలో లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల అపోహలు పెంచుకుని పిల్లలు మోసపోతున్నారని, ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా క్రుంగిపోతున్నారనీ, దీన్ని అరికట్టి ఆరోగ్యవంతమైన తరాల్ని అందించాలంటే, పాఠశాల దశలోనే తగిన లైంగిక విజ్ఞానాన్ని సార్వజనీనం చేయాలనీ వాదించాడు దర్శకుడు.
        
మొట్ట మొదటిసారిగా, 1974 లో బికె ఆదర్శ్ తీసిన గుప్త్ జ్ఞాన్ లోనూ ఇదే విషయం చెప్పారు. 1979 లో దాసరి నారాయణరావు తీసిన నీడ లో అశ్లీల సాహిత్యం చదివి వ్యభిచారానికి అలవాటుపడ్డ టీనేజర్ గురించి చెప్పారు. ఇదొక బర్నింగ్ టాపిక్ గా వుంటూ వస్తోంది. కానీ ప్రభుత్వాలు కదలడం లేదు. పైగా ఇలాటి సినిమాలు తీస్తే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఓఎంజీ -2 సెన్సార్ ఇబ్బందుల్లో ఇరుక్కుని విలవిల్లాడిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ శివుడి పాత్రనే మార్చేస్తూ చాలా సన్నివేశాలు, డైలాగులూ కత్తిరించేసిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తో సరిపెట్టింది. పిల్లలూ పెద్దలూ అందరూ చూసి కళ్ళు తెరవాల్సిన సమస్యకి   సర్టిఫికేట్ జారీచేస్తే, దీన్నెవరు చూడాలి? ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాలో శివుడ్ని చూపించారని, రామాయణం తో తీసిన ఆదిపురుష్ కి ఉదారంగా సెన్సార్ అనుమతి ఇచ్చేసి విమర్శల పాలైనట్టు ఈసారి కాకూడదని, ఓఎంజీ -2 మీద ప్రతాపం చూపెట్టారు.
        
అయినా ఓఎంజీ -2 కంటెంట్ పరంగా దెబ్బతినకుండా, సెన్సారే జరగనట్టు సాలిడ్ గా వుందంటే అది దర్శకుడి ప్రతిభే. ఈ కంటెంట్ లో ఇంకెన్ని కత్తిరింపులు వేసినా (ఆల్రెడీ 27 వేశారు) కథని చెడగొట్టలేరు. అలా రాసి తీశాడు దర్శకుడు.
        
స్కూల్లో చదివే వివేక్ ని తోటి స్టూడెంట్స్ టాయిలెట్ లో చూసి, నీది ఇంత చిన్నగా వుందా? చేతితో రుద్దితే పొడుగ్గా అవుతుంది అని ఇంటర్నెట్ లో రకరకాల వెబ్సైట్స్, వీడియోలు చూపిస్తారు. దీంతో వివేక్ పొడవు పెంచుకోవడం కోసం అదే పనిగా హస్తప్రయోగం చేసుకోవడం మొదలెడతాడు. ఏవో మందులు తింటాడు. ఇంటిదగ్గర అమ్మలక్కలు బుగ్గలు నిమిరి లేత పిల్లాడు ఎలా వాడిపోయాడు అని దిగులుపడతారు విషయం తెలీక. ఇంకోసారి వివేక్ స్కూలు టాయిలెట్ లో చేతికి పనిచెప్తే ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తారు. ఇది రచ్చ అయి స్కూలు నుంచి డిస్మిస్ అవుతాడు.
        
దీంతో పరువు పోగొట్టుకున్న తండ్రి కాంతి, కొడుకుని తిరిగి స్కూల్లో చేర్పించడానికి విఫలయత్నాలు చేసి కుటుంబంతో వూరు విడిచి వెళ్ళి పోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు దేవదూత శివగణ్ ప్రత్యక్షమై కర్తవ్యం బోధించేసరికి స్కూలు యజమాన్యాన్ని కోర్టుకి లాగుతాడు. తన కేసు వాదించడానికి లాయర్లు ముందుకు రాకపోవడంతో తానే వాదిస్తాడు.
        
అంచెలంచెలుగా శివగణ్ అందించే క్లూస్ తో ప్రాచీన గ్రంథాల దగ్గర్నుంచీ, పాశ్చాత్య దేశాల వరకూ చెప్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ ని అధ్యయనం చేసి కేసు వాదిస్తాడు.రెండు వేల ఏళ్ళ నాడే విష్ణు శర్మ లైంగిక విజ్ఞానం గురించి రాశాడనీ, నేర్పాడనీ;  దేవతల మొదటి ఇచ్ఛ కామమేననీ, దాంతో సృష్టి ఏర్పాటయిందనీ, ఇది అసభ్యమని పురాణాల్లో ఎక్కడా చెప్పలేదనీ, ధర్మార్ధ కామ మోక్షాల గురించే చెప్పారనీ... ఇలా వాత్సాయన కామసూత్రాల్నీ, అజంతా ఎల్లోరా గుహల్లో శిల్పాల్నీ, ఇంకా చాలా డేటానీ కోర్టు ముందుంచుతాడు. ప్రాచీన కాలంలోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంత ఓపెన్ గా వుంటే ఇప్పుడెందుకు దాయాలని అతడి ప్రశ్న.
        
ఈ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. రోడ్డు పక్క నాటు వైద్యుల్నీ, కొందరు ఘరానా డాక్టర్లనీ, సెక్స్ వర్కర్ నీ కోర్టుకి లాగుతాడు. ఎదుటి లాయర్ కామినీ మహేశ్వరి కూడా తక్కువేం కాదు. ఈమెతో కలిసి స్కూలు యజమాన్యం, మత పెద్ద, కొందరు రాజకీయులూ మతాన్ని లాగి, కాంతి మీద కేసులు వేయించి నోర్మూయించేదాకా పోతుంది...
        
విషయం మీద చాలా అవగాహనతో, ఇబ్బంది అన్పించే అంశాల్ని హాస్యంతో తేలికబరుస్తూ ఆద్యంతం ఒక స్టడీ మెటీరీయల్ లాగా అందించాడు దర్శకుడు. సాధారణంగా బూతంతా చూపించి చివర్లో నీతి చెప్తారు. అలా కాకుండా శృంగారంతో తేడా చూపించాడు. కాంతి భార్యని కోర్టులో -మీ మొదటి రాత్రి ఎలా జరిగిందని కూతురి ముందే అడిగినప్పుడు, చాలా తెలివిగా కోర్టంతా నవ్వేలా ఆమె చెప్పే సమాధానం దర్శకుడి క్రియేటివిటీకి నిదర్శనం.
        
అలాగే సెక్స్ వర్కర్ ని కాంతి క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ- నీ కొడుకు ఎలాటి పౌరుడు కావాలని కోరుకుంటున్నావ్, నీ దగ్గరికి వచ్చే విటుల్లాగానా?’  అని వేసే ప్రశ్న సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం గురించే వుంటుంది. ఈ సన్నివేశం, సినిమా ముగింపులో కాంతి కొడుకు చెప్పే మాటలూ కదిలిస్తాయి.
        
కరుణా, జాలి, ఆలోచన, హాస్యం పుట్టించే ఇలాటి సినిమాకి యూనివర్సల్ యూ సర్టిఫికేట్ ఇవ్వకుండా విలన్ లాగా ప్రవర్తించింది ప్రభుత్వమని చెప్పాలి.

నటనలు – సాంకేతికాలు

    అక్షయ్ కుమార్ శివుడి గెటప్ మారలేదు. పేరు మాత్రం దేవదూత శివగణ్ గా మార్చారు. సినిమా మొత్తం మీద ఏడెనిమిది సీన్లలో కన్పిస్తాడు. బయటే గుళ్ళూ గోపురాల్లో తిరుగుతూంటాడు. ఎక్కడికెళ్ళినా ఒక వృషభం అతడి వెనుక వెళ్తూ వుంటుంది. అతను కామెడీ క్యారక్టర్. కానీ లోతుగా ఆలోచిస్తే తప్ప అర్ధంగాని కోర్టు చిట్కాలు చెప్తాడు. చివర్లో కాంతి ఓడిపోయాక క్లయిమాక్స్ లో విజయం అతడి చేతిలో పెట్టే బహిరంగ కోర్టు దృశ్యాలు సినిమాని మరో స్థాయికి తీసికెళ్తాయి. అక్షయ్ కుమార్ ఈసారి దేశభక్తి, మతభక్తి డైలాగులతో అరుపులు అరవకుండా నిగ్రహించుకున్నాడు.
        
అయితే సినిమాకి పబ్లిసిటీ లేక మౌత్ టాక్ మీద ఆధారపడింది. సెన్సార్ గొడవలే పెద్ద పబ్లిసిటీ అనుకున్నారేమో, అదేమంత కలిసి రాలేదు. అక్షయ్ పూనుకుని ప్రమోషన్స్ ప్రారంభిస్తే మంచి హిట్ వైపు వెళ్తుంది.
        
సినిమా కాంతి పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠీ మీదే పూర్తిగా ఆధారపడింది. అతను ప్రతి చోటా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎదుటి లాయర్ పాత్రలో యామీ గౌతమ్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమెవైపు వాదనలు కూడా ఆలోచింప జేస్తాయి. మరొక చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ జడ్జి పాత్రలో పవన్ మల్హోత్రా. సినిమా జడ్జిలా కాకుండా  రియల్ జడ్జిలా వుంటాడు. నేపథ్యంలో నాల్గు పాటలు వస్తాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలు బావున్నాయి.
        
13 ఏళ్ళ తర్వాత దర్శకుడు అమిత్ రాయ్ అవుట్ డెటెడ్ అయిపోకుండా నేటి ప్రమాణాలకి తగ్గకుండా చిత్రీకరణ జరిపాడు. గుప్త్ జ్ఞాన్ తర్వాత 49 ఏళ్ళకి తిరిగి మరోసారి సెక్స్ ఎడ్యుకేషన్ అవశ్యకతని ప్రేక్షకుల ముందుంచాడు.

—సికిందర్