రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జూన్ 2022, బుధవారం

1173 - 'డ్యూయెల్' స్క్రీన్ ప్లే సంగతులు-2

   బిగినింగ్ విభాగపు మూడో టూల్ అయిన సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని విశ్లేషించుకుంటే, ఒకదాన్నొకటి ఓవర్ టేక్ చేసుకునే ఆ రెండు వాహనాల మూవ్ మెంట్స్ లో విషయం దొరుకుతుంది. మొదట ట్యాంకర్ డ్రైవర్ ఫ్రెండ్లీగా సైడ్ ఇవ్వడం, డేవిడ్ ఓవర్ టేక్ చేసి వెళ్ళి పోయాక ట్యాంకర్ డ్రైవర్ తను ఓవర్ టేక్ చేయడం, తిరిగి డేవిడ్ ఓవర్ టేక్ చేశాక మళ్ళీ ట్యాంకర్ డ్రైవర్ ఓవర్ టేక్ చేయడం...ఈ మూవ్ మెంట్స్ లో ట్యాంకర్ డ్రైవర్ అసహజంగా బిహేవ్ చేస్తున్నట్టు మనకర్ధమవుతుంది. ఇది ఈ మూవ్ మెంట్స్ లో వున్న సబ్ టెక్స్ట్, మనసు. ఇదేం గ్రహించని డేవిడ్ క్యాజువల్ గా ఓవర్ టేక్ చేస్తూ డ్రైవ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. మూడోసారి ఓవర్ టేక్ చేసేప్పుడు డేవిడ్ దాదాపూ యాక్సిడెంట్ చేసేవాడే. ట్యాంకర్ డ్రైవర్ కావాలనే ఎదురుగా మరో కారు వస్తున్నప్పుడు డేవిడ్ కి సైడ్ ఇస్తాడు. ఎదురుగా కారు వస్తోందని తెలియని డేవిడ్ ట్యాంకర్ ని ఓబర్ టేక్ చేయబోయి - తక్షణం అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పిస్తాడు.

     మూవ్ మెంట్స్ తో కథనంలో జీవాన్ని నింపే ఇంకో చర్య ఏమిటంటే, ట్యాంకర్ డ్రైవర్ కేవలం పదే పదే పోటీపడి ఓవర్ టేక్ చేయడం లేదు, అలా ఓవర్ టేక్ చేస్తూ వెంటాడుతున్నాడు. అంటే వేట మొదలెట్టాడు. ఎందుకని? అతడి ట్యాంకర్ ముందు భాగంలో వివిధ వాహనాల నెంబర్ ప్లేట్స్ బిగించి వున్నాయి. ఇదివరకు ఈ నెంబర్ ప్లేట్స్ గల వాహనదారుల్ని వెంటాడి చంపాడనడానికి ఇవి గుర్తులు. అంటే ఇతనొక సైకో. తనని సైడ్ అడిగినా, ఓవర్ టేక్ చేసినా సహించడన్న మాట!

    ఈ మూవ్ మెంట్స్ లో డైనమిక్స్ ఏమిటంటే, ట్యాంకర్ డ్రైవర్ ఉద్దేశం మనకర్ధమవుతోంది, డేవిడ్ కే తెలియడం లేదు. ఇది ఐరనీని సృష్టిస్తోంది. కథనానికి జీవాన్నీ, డెప్త్ నీ ప్రసాదిస్తోంది. ఈ ప్రమాదకర ఓవర్ టేక్స్ తో డేవిడ్ విసిగి పోయి ఎక్కడా ట్యాంకర్ డ్రైవర్ తో ఘర్షణ పడ్డం లేదు. ఘర్షణ పడితే ఇద్దరి పోరాటం ఇక్కడ్నించే మొదలైపోతుంది. బిగినింగ్ విభాగంలో ఈ పోరాటం జరగడాన్ని (కథ ప్రారంభమవడాన్ని) బిగినింగ్ సూత్రాలు ఒప్పుకోవు. ఆరాటం ఆపుకోలేని  మేకర్ ఇప్పుడే హీరో చేత తిట్టిస్తే ఇక్కడే కథ చచ్చిపోతుంది.

    ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేశాక, కొంత గ్యాప్ తీసుకుంటుంది కథనం. ఈ గ్యాప్ లో పెట్రోల్ బంకు దగ్గర కథకి అవసరమున్న మరికొంత సెటప్ ఏర్పాటవుతుంది- 1. విండో గ్లాస్ మీద వాటర్ కొట్టడం, 2. ట్యాంకర్ డ్రైవర్ బూటు కాళ్ళు మాత్రమే రివీలవడం, 3. రేడియేటర్ పైపు మార్చాలనడం, 4. డేవిడ్ భార్యకి కాల్ చేయడం.

    ఈ సీనులో డేవిడ్ పెట్రోల్ బంకులో కారాపగానే ట్యాంకర్ వచ్చి పక్కనే ధడాల్న ఆగడం మనకర్ధమైపోతుంది. ఈ ట్యాంకర్ డ్రైవరనే వాడు సైకోతనంతో పగ బట్టేశాడని. డేవిడ్ కారులోంచి తల పైకెత్తి ట్యాంకర్ లో డ్రైవర్ ని చూడాలని ప్రయత్నిస్తూంటే, బంకు వర్కర్ వచ్చి విండో గ్లాస్ మీద వాటర్ కొట్టడం కూడా కథ చెప్పే కథనమే. వాటర్ కొట్టి తేటగా అద్దాన్ని తుడవడం- డేవిడ్ ఎంత స్పష్టంగా చూడాలని కూడా ప్రయత్నించినా ఆ డ్రైవరనే వాడు కంటపడే సమస్యే లేదని డేవిడ్ తో బాటు మనకూ తెలియజేస్తున్న కథనం. కథ కుండే మనసు.

   కారు కింద నుంచి ట్యాంకర్ డ్రైవర్ బూటు కాళ్ళు రివీలయ్యే సెటప్, తర్వాత సెకండ్ యాక్ట్ లో, అంటే మిడిల్ విభాగంలో, రెస్టారెంట్ సీన్లో పేఆఫ్ అవుతుంది. ఇక బంకు వర్కర్ డేవిడ్ కారు రేడియేటర్ పైపు మార్చాలనడం, డేవిడ్ తర్వాత మారుస్తాననడం గురించి...ఇది థర్డ్ యాక్ట్, అంటే ఎండ్ విభాగపు -అంటే క్లయిమాక్స్ యాక్షన్ కి ప్లాట్ పాయింట్ టూ లో, పేఆఫ్ అయ్యే సెటప్. దీన్ని ఇక్కడే ఏర్పాటు చేశాడు ముందు చూపుతో.

    సరైన స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటయ్యే సమస్యకి పరిష్కార మార్గం ప్లాట్ పాయింట్ టూ లోనే దొరుకుతుంది. ఇదే ఇక్కడ జరగబోతోంది. ఈ పెట్రోలు బంకు సీను ప్లాట్ పాయింట్ వన్ సీనుగా ఎస్టాబ్లిష్ అవుతోంది. పాయింటేమిటంటే, డేవిడ్ కి తన కారు ప్రయాణం మామూలు ప్రయాణం కాదనీ, ఇది ఓ కథనే సృష్టించబోతోందనీ, ఈ కథలో చాలా ప్రాణాంతక సమస్య నెదుర్కోబోతున్నాడనీ ఇప్పటికీ అతడికి తెలీదు. ఇది డైనమిక్స్, ఐరనీ, డెప్త్ వగైరా వగైరా. ట్యాంకర్ డ్రైవర్ కి మాత్రం తను డేవిడ్ తప్పించుకోలేని సమస్యని  సృష్టించబోతున్నాడని తెలుసు, ఇది మనకీ తెలుసు. ఇది డేవిడ్ తో సస్పెన్సు ని సృష్టిస్తోంది.

   ఒక సినిమా చేసి వెళ్ళిపోయే మేకర్ కి-  ఈ పెట్రోల్ బంకులో డేవిడ్ ని దింపి, ట్యాంకర్ డ్రైవర్ ని బయటికి లాగి బూతులు లంకించుకుని, కింద పొర్లాడి కొట్టుకునేదాకా చూపించేస్తే గానీ కుతి తీరదు. ఇతను మేకరిన్లా (టాలీవుడ్ అల్లుడు) ఎలా అవుతాడు?

    ఇక బంకులో డేవిడ్ భార్యతో కాల్ మాట్లాడినప్పుడు, ఇంటి దగ్గర భార్యా ఇద్దరు పిల్లలూ రివీలవడం ఐరనీని మరింత పెంచుతుంది. ఇప్పుడిక్కడ డేవిడ్ టేబుల్ మీద కాలెత్తి పెట్టి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ఒక లావాటి ఆవిడ వస్తుంది. కాలు తీసేస్తాడు. లోపలి కెళ్ళి పోతుంది. ఈ బంకులో లాండ్రీ వసతి కూడా వుంది. ఆమె ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ డోర్ తీసి బట్టలు తీసుకుంటూ వుంటే, గుండ్రంగా వున్న ఆ డోర్ గ్లాస్ లోంచి అవతల డేవిడ్ ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ షాట్ లో కనిపిస్తాడు. ఏమిటి దీని కథనం? సమస్యలో పడబోతున్న డేవిడ్ చట్రంలో బందీ అవుతున్నాడని ఫిలిమ్ నోయర్ జానర్ ఎలిమెంట్ తో ప్రయోగం.    

    ఇదీ మొత్తం బిగినింగ్ విభాగపు సెటప్. సెటప్ లో బిజినెస్. ఇక్కడ్నించీ డేవిడ్ కారులో బయల్దేరడం సెకెండ్ యాక్ట్, అంటే మిడిల్ కి ప్రారంభం. మిడిల్, ఎండ్ విభాగాలు రేపు చూసేద్దాం.

    డ్యూయెల్ మేకింగ్ విశేషాలు చాలా వున్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు. ఈ వ్యాసం స్క్రీన్ ప్లే సంగతులుకే కేటాయించాం. దీని మేకింగ్ విశేషాల గురించే కాదు, ది మేకింగ్ ఆఫ్ ఏ ఫిలిమ్ కెరీర్ అంటూ స్పీల్ బెర్గ్ గురించి ఏకంగా ఓ పుస్తకమే వెలువడింది (దీని పీడీఎఫ్ కాపీని సుకుమార్ అసిస్టెంట్ కమలాకర్ రెడ్డి డౌన్ లోడ్ చేసి పంపారు, థాంక్స్). దీన్ని మీరు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది.

—సికిందర్