రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, June 10, 2016

షార్ట్ రివ్యూ

దర్శకత్వం : మను
తారాగణం : సుమంత్ అశ్విన్, పూజా జావేరీ, పావని జి,  ప్రభాకర్, నాజర్, జీవా, రాజారవీంద్ర, తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధనరాజ్
మాటలు : డార్లింగ్ స్వామి. సంగీతం : జేబీ, ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్
బ్యానర్ : శ్రీ సత్య ఎంటర్ ప్రైజెస్, నిర్మాత : జె. వంశీ కృష్ణ
విడుదల : 10.6.16
***
     హీరోగా నిలదొక్కుకునేందుకు విఫలయత్నాలు చేస్తున్న సుమంత్ అశ్విన్ మలయాళ రీమేకుని  ఆశ్రయించాడు. కొత్త దర్శకుడు మనునీ, ‘బాహుబలి’ ప్రభాకర్ నీ, హీరోయిన్ పూజా జావేరీనీ, ఒక బస్సునీ  టీముగా ఏర్పాటు చేసుకుని కలెక్షన్స్ కోసం కండక్టరుగా నటించాడు. బస్సుతో సినిమాలు అనేకం వచ్చాయి. మొన్నే దాసరి తీసిన ‘ఎర్రబస్సు’ తో బాటు, భీమనేని శ్రీనివాసరావు తీసిన ‘స్పీడున్నోడు’ వచ్చాయి. మలయాళంలో ‘ఆర్డినరీ’ పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ప్రస్తుత సుమంత్  రీమేకు బస్సు, ఎంత ఎక్స్ ట్రార్డినరీగా వుందో, ఎన్ని టికెట్లు కొడితే ఎంత వచ్చిందో  ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...  

కథ 
      రవి (సుమంత్ అశ్విన్) కొత్తగా ఆర్టీసీ బస్సు కండక్టర్ గా చేరతాడు. గవిటి  అనే ఏజెన్సీ  ప్రాంతానికి ఒక ట్రిప్పు వేసే ఆ బస్సుకి  డ్రైవర్ గా వున్న  శేషు (ప్రభాకర్) తో దోస్తీ కుదురుతుంది. శేషు మద్యం సేవించి బస్సు నడుపుతాడు. గవిటి లో సర్పంచ్ విశ్వనాథం విశ్వనాథం (నాజర్),  ఆయన కుటుంబం వుంటారు. చనిపోయిన తన మిత్రుడి కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామను కుంటున్నాడు. అదే వూళ్ళో కల్యాణీ  అనే టౌన్ లో ఓ సెల్ ఫోన్ షోరూం లో పని చేసే అమ్మాయి వుంటుంది. రోజూ ట్రిప్పులేస్తున్న రవికి ఆమెతో సాన్నిహిత్య మేర్పడుతుంది. ప్రేమని వెల్లడిస్తాడు. ఆమె సరేనంటుంది. శేషుతో రవి వూళ్ళో షికార్లు  తిరుగుతూ, టౌనుకి ట్రిప్పులు వేస్తూ ఉంటాడు. ఒకరోజు వెళ్తున్న బస్సు ఫెయిలవుతుంది. డిపో నుంచి మెకానిక్ (జీవా) వస్తాడు. ఇతనూ శేషూ మద్యం సేవిస్తూ కూర్చుంటారు, అసిస్టెంట్ బస్సుని బాగుచేస్తాడు. బయల్దేరబోతూ తాగి వున్న శేషు బస్సు నడపబోతే, అడ్డుకుని రవి నడుపుతాడు. కొంత దూరంలో యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్, దాని తర్వాతి పరిణామాల్లో విశ్వనాథం కొడుకు చనిపోతాడు. రవీ శేషూ ఇరకాటంలో పడతారు. విషయం బయటపడి పోలీసులు రవిని అరెస్టు చేస్తారు. ఇక ఈ కేసు లోంచి బయటపడేందుకు రవి ఏం చేశాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
    ఈ కథతో మలయాళ ఒరిజినల్  ఎప్పుడో 2012 లో తీశారు. వెంటనే 2013లో తమిళంలో  రీమేక్ చేశారు. రెండూ అప్పట్లో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆలస్యంగా 2016 లో తెలుగులో తీశారు. దీంతో దీని నావెల్టీ తగ్గడమేగాక, యూత్ అప్పీల్ ని కోల్పోయింది. పైగా తెలుగులో సినిమాగా దీన్ని రీమేక్ చేయడానికి ఈ కథకున్న  విస్తృతి సరిపోయేలా లేదు, షార్ట్ ఫిలింకి సరిపోతుందేమో. రెండోది అసలుకి ఈ కథే గత శతాబ్దానికి చెందిన పురాతనమైన కథ. శోభన్ బాబుతో ‘ఖైదీ బాబాయ్’, కృష్ణ తో ‘నేరము- శిక్ష’ సినిమాలు ఇలాటి కథలే. సుమంత్ అశ్విన్  తండ్రి గారే (ఎంఎస్. రాజు) ఈ నేరం- శిక్ష బాపతు జానర్ తో 2002 లో ‘నీ స్నేహం’ (‘తుమ్ బిన్’ రిమేక్) తీశారు. భూమి గుండ్రం గా వున్నట్టు తనయుడు మళ్ళీ ఇలాటిదే వ్యవహారంలో నటించాడు. ఐతే ఈ నేరం-శిక్ష పాయింటుతో గతంలో వచ్చిన సినిమాలు నిజంగా హీరో నేరం చేసినవే- ఆ పశ్చాత్తాపంతో కుమిలిపోయే మెలోడ్రామాలు. ఈ పాయింటు మెలోడ్రామాతోనే వర్కౌట్ అవుతుంది. అలాగాక  సస్పెన్స్ కోణాన్ని జతచేస్తే, ఆ సస్పెన్స్ ఆధారంగా సులువుగా  హీరోని బయట పడేసే ప్రయత్నం చేస్తే, అంత వర్కౌట్ అయ్యే వ్యవహారంగా కనపడదు. 

ఎవరెలా చేశారు
       సుమంత్ అశ్విన్ నటించ గలడు  గానీ పాత్రలే కుదరడంలేదు. బస్సు కండక్టర్ అయినంత మాత్రాన పాత్రకి గ్లామర్ లేదని, చీటికీ మాటికీ ఈశ్వరా అనే ఊతపదంతో చాదస్తంగా కనపడాల్సిన అవసరం లేదు. కుర్ర కండక్టర్లు చాలా ఫాస్ట్ గా వుంటారు. ఫస్టాఫ్ లో ఏదో సరదాగా నటించేసినా- వయసులోనూ, శారీరకంగానూ భారీగా వుండే ప్రభాకర్ తో దోస్తీ – కెమిస్ట్రీ కుదరలేదు. అదంతా కృతకంగా వుంది. ఇక సెకండాఫ్ పూర్తిగా సీరియస్ కథ కాబట్టి, అది కూడా చప్పున ముగిసిపోయే కథ కాబట్టి నటనకి పెద్దగా స్కోపు లేక యాక్షన్ తో సరిపెట్టేశాడు. కండక్టరుగా ప్రేక్షకులకి అందించడానికి తను పోగేసిన కలెక్షన్ అంతా అవుట్ డేటెడ్. 

        ఇలాటి సాఫ్ట్ పాత్రలో ఎందుకనో ప్రభాకర్ ఆకట్టుకునేలా లేడు. అతను రఫ్ పాత్రలు వేసుకుంటేనే మంచిదేమో. హీరోయిన్ పూజా జావేరీ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రొఫైల్ లో ఆమెని చూపించకుండా వుంటే బావుండేది. కమెడియన్లు తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధన రాజ్ ముగ్గురూ వున్నా కామెడీ కూడా ఏమీ లేదు. ఇక ఇతర పాత్రధారుల గురించి కూడా చెప్పుకోవడానికేమీ లేదు.  
        సంగీతం, ఛాయగ్రహణం అవుట్ డేటెడ్ గా వున్నాయి.


చివరికేమిటి?
       కొత్త దర్శకుడు ‘మను’ తన తొలిప్రయత్నంగా రీమేక్ కి పూనుకోవడమే గాక, చాలా పాత విషయం తలకెత్తుకోవడం, అదీ కొత్తగా చెప్పలేకపోవడం, చాలా స్లోగా కథ నడపడం, ఇంటర్వెల్ వరకూ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంతోనే కాలక్షేపం చేయడం లాంటి స్పీడ్ బ్రేకర్లతో నిరుత్సాహ పరుస్తాడు. కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టిన వాడుకూడా వంటకాలతో కసకస లాడి స్తాడు. ఈ కొత్త దర్శకుడు కసకసలు, మిసమిసలు లేని చద్దన్నం ఎందుకు వడ్డించాలనుకున్నాడో అర్ధంగాదు.


-సికిందర్

http://www.cinemabazaar.in