రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, మే 2020, ఆదివారం

941 : సందేహాలు -సమాధానాలు


Q: నేనొక కథ తయారు చేసుకున్నాను. త్వరలో ఒక హీరోకి పంపించబోతున్నాను. ఇప్పుడు కథలు వినడం లేదు, తెప్పించుకుని చదువుతున్నారని మీకు తెలుసుకదా. అయితే మొన్న మీ పాత ఆర్టికల్ చదివితే అందులో కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ వుండాలని వుంది. నా కర్ధం గాలేదు. సినిమా అనేదే యూత్ అప్పీల్ తో తీస్తాం కదా? కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ ఏమిటి? ఇది వివరిస్తే, అది బావుందనుకుంటే, ఆ విధంగా నా కథలో కాన్ఫ్లిక్ట్ లో జోడించుకుంటాను. ఆ తర్వాతే హీరోకి పంపిస్తాను. వీలైనంత త్వరగా సమాధానమిస్తారని ఆశిస్తాను.
కాశీనాథ్ (పేరుమార్పు), దర్శకుడు

A: ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ ని జోడిస్తే మీ కథే మారిపోవచ్చు. కథకి పాయింటు కాన్ఫ్లిక్ట్ నుంచే పుడుతుంది కదా? హీరోహీరోయిన్లు విడిపోయే కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా కలుస్తారనేదే పాయింటు. అపార్ధాలతో విడిపోతే, ఆ అపార్ధాలు తొలగిపోతే తిరిగి ఏ కమవుతారని ఆ పాయింటు అంతరార్ధం. ఈ అంతరార్ధంలో యూత్ అప్పీల్ వుందా అనేది  చూడాలి. ఈ అపార్ధాలు తొలగిపోయి కలుసుకునే పాయింటు చూసి చూసి విసుగెత్తి పోయుంటారు ప్రేక్షకులు. అంటే ఇందులో యూత్ అప్పీల్ అనేది ఇక లేదన్న మాట. ఆఁ... చేసుకుంటే చేసుకున్నావ్ లే అపార్ధం, నేనింకోదాన్ని చూసుకుని సెటిలైపోతా - అని హీరో అన్నాడంటే ఇది యూత్ అప్పీల్. యూత్ అప్పీల్ అంటే ఎక్సైట్ మెంట్. హీరో ప్రకటనలో ఎక్సైట్ మెంటుంది. కర్నూల్లో కబడ్డీ ఆడేందుకు వెళ్ళిన మహేష్ బాబు (ఒక్కడు) అక్కడ్నుంచి ప్రమాదంలో వున్న భూమికని లేపుకు వచ్చే కాన్ఫ్లిక్ట్ లో ఎక్సైట్ మెంట్. యూత్ అప్పీల్. అదే మహేష్ బాబు ఏడు తరాల బంధువుల్ని వెతికే కాన్ఫ్లిక్ట్ (బ్రహ్మోత్సవం) ఎక్సైట్ మెంట్ కాదు, యూత్ అప్పీల్ లేదు. ఏడుతరాల బంధువుల అమ్మాయిల్ని వెతికితే, అది ఈలల్తో దద్దరిల్లిపోయే కాన్ఫ్లిక్ట్, యూత్ అప్పీల్. ఇలా మీ కథ కాన్ఫ్లిక్ట్ లో యూత్ అప్పీల్ వుందేమో చూడండి. లేకపోతే కథనే మార్చి యూత్ అప్పీల్ని కూర్చాల్సి రావొచ్చు. ఈ సమయంలో కథని మార్చడం కుదరకపోతే అలాగే వదిలెయ్యండి. ఐడియా అనుకున్నప్పుడే అన్నీ నిర్ణయించుకుంటే ఇలాటి సమస్యలు ఎదురుకావు.

Q: నా పేరు వి.డి, అసోసియేట్ డైరెక్టర్. నావి కొన్ని సందేహాలు. 1. యుద్ధాలతో డైరెక్ట్ గా సంబంధం ఉన్న మిగతా దేశాల సినిమాలతో పోలిస్తే మన దగ్గర యుద్ధాల బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయడం కొంచెం కష్టమే. నార్త్ లో అయితే పాకిస్తాన్ తో వచ్చిన యుద్ధాల నేపథ్యంలో సినిమాను తీసుకోగలరు. ఎందుకంటే ఉత్తర భారతదేశం వారు యుద్ధాలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. అదే సౌత్ ఇండియాకు వచ్చేసరికి యుద్ధాల బ్యాక్ డ్రాప్ లో మనం సినిమాలు తీయడం కుదరదు. ఇలా ఒక గొప్ప కథా నేపధ్యాన్ని మనం మిస్ అవుతున్నాం కదా, దీనికి ప్రత్యామ్నాయంగా వేరే కథా నేపథ్యన్ని ఏమైనా సూచించగలరు.
        2. లుకా చుప్పి’ లో లాగా మన దగ్గర ఉన్న టౌన్స్ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటి కథలు చెప్పచ్చో సలహాలు సూచనలు చెప్పండి.
       
3. థ్రిల్లర్ కథలను చిన్న  బడ్జెట్ లో చెప్పేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  అలాగే థ్రిల్లర్ అంటే ఎంత సేపు అవే సీరియల్ కిల్లర్ లేదా పోలీస్ డిటెక్టివ్ కథలు కాకుండా కొత్తగా ఏం చేయాలి అనేది సలహాలు సూచనలు చెప్పండి.
       
4. చివరగా కొత్త దర్శకులు తమ తొలి ప్రయత్నంగా ప్రయోగం చేయడానికి ఏవైనా కొత్త జానర్స్ కానీ, అలాంటి టైపు సినిమాల గురించి కానీ చెప్పండి.
వీడీ, అసోసియేట్
A: ఇండో - పాక్ యుద్ధాల్లో పాల్గొన్న తెలుగు సైనిక వీరులున్నారు- హవల్దార్ వీరచక్ర పోత రాజు, కెప్టెన్ మనోజ్ శర్మ, గ్రూప్ కెప్టెన్ నచికేత మొదలైన వారు (1965 ఇండో - పాక్ యుద్ధంలో పాక్ యుద్ధ విమానాన్ని గన్ తో కూల్చేసిన హవల్దార్ పోతరాజు వీరచక్ర అవార్డు నందుకుంటున్న దృశ్యం పక్క పటంలో చూడొచ్చు). యుద్ధ సినిమాకి తెలుగు నేటివిటీకి ఇంత కంటే ఏం కావాలి. వీళ్ళ బయోపిక్స్ తీయొచ్చు. 2015 లో దర్శకుడు క్రిష్ ‘కంచె’ తీసినప్పుడు అది రెండో ప్రపంచ యుద్ధంలో నిజంగా పాల్గొన్న తెలుగు సైనికుల కథ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించ లేదంటే వాళ్ళ ఖర్మ. ‘ఘాజీ’ లాంటి నేటివిటీ లేని యుద్ధ సినిమాని మళ్ళీ బాగానే చూశారు. తెలుగు యుద్ధ నేపథ్య సినిమాలకి నేటివిటీ అడ్డొచ్చే మాట నిజమే. దీనికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ‘ఆర్ ఆర్ ఆర్’, ‘విరాటపర్వం’ లాంటి స్థానిక పోరాట కథలు తీసుకోవడమే. దేశ విభజన నేపథ్యంలో 2019 లో కరణ్ జోహార్ తీసిన ‘కళంక్’ చూసినప్పుడు, అలాంటిది హైదరాబాద్ నిజాం రాజరిక కుటుంబాల్లో దేశ్ ముఖ్ హీరో పాత్రని కల్పించి ఒక పీరియెడ్ మూవీ తీయొచ్చన్న ఆలోచన రావచ్చు. తెలుగు సినిమాలకి నేపథ్యాలతో స్వేచ్ఛ అంతగా లేదు. యుద్ధ కథలకి ప్రత్యామ్నాయం స్థానిక పోరాట కథలే. 


        2. అగథా క్రిస్టీ ఏనాడో చెప్పింది - న్యూయార్కే ఒక క్రైం స్టోరీ, ఇంకా న్యూయార్క్ లో నేపథ్యంలో క్రైం స్టోరీలు రాసేదేమిటని. ఆమె క్రైం స్టోరీలు గ్రామీణ నేపథ్యంలో వుంటాయి. ఎక్కడో హైదరాబాద్ లో జరిగేలాంటి సంఘటనలు మెట్ పల్లిలో జరుగుతూంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. హిందీలో ఇలాగే చేస్తున్నారు. యువతీ యువకులు నగర సంస్కృతిలో పాల్పడుతున్న కొత్త పోకడల్ని పట్టణ నేపథ్యాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో పెట్టి తీస్తున్నారు. దీనివల్ల షాక్ వేల్యూ వుంటుంది. దీంతో ఇవి హిట్టవువుతున్నాయి. ‘లుకా చుప్పీ’ (దాగుడు మూతలు) ఇలాంటిదే. ఇంకా మన్మర్జియా, డ్రీం గర్ల్, బరేలీకీ బర్ఫీ, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ మొదలైనవి కూడా ఇంతే. సినిమాల్లో నగరాలకి పరిమితం చేసిన సహజీవనాల్ని, స్వలింగ సంపర్కాల్ని ఇక పట్టణాల్లో చూపించే కొత్త ఒరవడి ప్రారంభించారు. ఈ ఆధునిక జీవన శైలుల్నే కాదు, ఆర్ధిక ఆరాటాల్ని కూడా చిన్న టౌన్లో చూపించారు ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ లో. చిక్కడపల్లిలో వుండే మధ్యతరగతి కుర్రాళ్ళు, బంజారా హిల్స్ లో సంపన్న జీవితాలకి ఎగబ్రాకాలని ఆరాటపడ్డారనుకుందాం, దానికోసం ఏం చేస్తారన్నదే చిక్కడపల్లిలో సంచలనం సృష్టించే కథ. అవే కథల్ని బ్యాక్ డ్రాప్స్ మార్చేస్తే నేటి కథలవుతాయి. పాత సినిమాల్లో నగర కథలేమేం వున్నాయో వెతికితే వాటిని పట్టణాలకి, పల్లెలకీ దించి అలజడి సృష్టించవచ్చు కొన్నాళ్ళు. ఏదైనా కొన్నాళ్ళు వుండేదే. ఆ కొన్నాళ్ళ తర్వాత ఇంకో కొన్నాళ్ళు ఇంకో ఆవిష్కరణ. కొన్నాళ్ళు కొన్నాళ్ళుగా కొలుచుకుంటూ సాగేదే సినిమా. ఒకటే పట్టుకుని ఎన్నాళ్ళో కూర్చుంటే బుద్ధి చెప్తుంది అదే సినిమా.

       
3.  థ్రిల్లర్ కథల్ని చిన్నబడ్జెట్లో లో చెప్పేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ‘హిట్’ లో చూశారుగా ఎన్ని అజాగ్రత్తలు తీసుకోవాలో. ‘హిట్’ వ్యాస పరంపరకి ముందు క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల వ్యాస పరంపర సాగింది. అవొకసారి చదవండి. థ్రిల్లర్ అంటే ఎంత సేపూ  అవే సీరియల్ కిల్లర్ లేదా పోలీస్ డిటెక్టివ్ కథలు కాకుండా కొత్తగా ఏం చేయాలంటే ఏమీ లేదు, ప్రస్తుత ప్రపంచమెలా వుందో అలా చేయాలి. సోషల్ మీడియా నుంచీ సోషల్ లైఫ్ వరకూ ప్రపంచం పరమ వయొలెంట్ గా వుంది. దీన్నే ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకీ అంటిస్తున్నారు. అంటే ఇందులోకి దూకి మనమూ ఎంజాయ్ చేయాలనీ కాదు. ఒడ్డున వుంటూ ఆట గమనించాలి. ఆ ఆటకి తగ్గ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలి. ఎంటర్ టైన్మెంట్ తోనే కళ్ళు తెరిపించాలి. 

        ఈవారం ఒక దర్శకుడు ఒక లో బడ్జెట్ థ్రిల్లర్ కథ సినాప్సిస్ పంపారు. అది చదివాక దీన్ని తిరగేసి తీస్తే బావుంటుందని చెప్పాం. వెంటనే ఆయన ఈ సవరణ లోని పాయింటుని పసిగట్టారు. ఏదైనా తిరగేస్తేనే కొత్తగా మారుతుంది. ‘హిట్’ వుంది. ఇందులో కథ ఇన్వెస్టిగేటర్ పాయింటాఫ్ వ్యూలో అతడి కథగా నడుస్తుంది. ఇలాకాక కిల్లర్ పాయింటాఫ్ వ్యూలో వాడి కథగా నడిస్తే? ఇంకా ఈ
వయొలెంట్ ప్రపంచంలో క్రైం సినిమాల్ని పాజిటివ్ పాయింటాఫ్ వ్యూలో చూపిస్తే లెక్క చెయ్యరు. నెగెటివ్ పాయింటాఫ్ వ్యూలో చూపించాల్సిందే. పోలీస్ మైండ్ కాదు, క్రిమినల్ మైండ్ ఓపెన్ చేయాల్సిందే. పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తూంటే, క్రిమినల్ కౌంటర్ ఇన్వెస్టిగేషన్ చేసే కథలు. క్రిమినలే ఒక పెద్ద ఆర్టిస్టు అన్నారు, పోలీసు కేవలం క్రిటిక్. వయొలెంట్ ప్రపంచంలో క్రిటిక్ కి స్థానం లేని మాట నిజమే, మరి ఆర్టిస్టు గెలుపు కూడా ఎలాంటి గెలుపు? ఫిలిం నోయర్ జానర్ క్రైం సినిమాల్ని పదేపదే కర్మ సిద్ధాంతంతో ఎందుకు తీసేవాళ్ళు? మనిషి ఎంత వయొలెంట్ గా మారినా, అతను ఆత్మికంగా పురాణాలతో కనెక్ట్ అయి వుంటాడు కాబట్టి.  ఏమీ చేయనవసరం లేదు, క్రైం మీద ఇంటర్నెట్ లో ప్రముఖులు చెప్పిన కోట్స్ చాలా వుంటాయి. ఆ సుభాషితాలు చదువుతూ వుంటే సబ్జెక్టు మీద పరిజ్ఞానం విశాలమవుతుంది, పట్టు లభిస్తుంది. వంద కేజీలు తెలుసుకుంటే ఒక కేజీ కథ వస్తుందని గమనించాలి. ఏమీ తెలుసుకోకుండా సినిమాలు చూసి కాపీ కొడితే సన్నాసులుగా మారడమే. 

        4. ఇక
 కొత్త దర్శకులు తొలి ప్రయత్నంగా ప్రయోగం చేయడానికి రియాలిస్టిక్ ఫిక్షన్ అనే తెలుగులో ప్రయత్నించని జానర్ వుంది. ‘ఏ వుమన్ అండర్ ది ఇన్ ఫ్లూయెన్స్’, ‘బాయ్ హుడ్’, ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ లాంటివి. వీటిని స్టడీ చేసి ఇలాటివి తీయొచ్చు. అలాగే రోమాంటిక్ సస్పెన్స్ వుంది. ‘వైల్డ్ థింగ్స్’, ‘సీ ఆఫ్ లవ్’ లాంటివి. కొత్తగా ఏం ప్రయత్నించినా మార్కెట్ యాస్పెక్ట్స్ రెండే - రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్. రోమాంటిక్ డ్రామా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా, ఇంకేదైనా వీటి చుట్టూ వుండడం విజ్ఞత. 

Q: సీరియస్ పాత్రలు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎలా రాయాలో వివరిస్తారా? దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఇస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది.
ఏపీ, ఏడీ 

A: అమితాబ్ బచ్చన్ ‘దీవార్’, శోభన్ బాబు ‘మల్లెపువ్వు’ లాంటివి తీసుకోవచ్చు పరిశీలనకి. సీరియస్ పాత్రలు రకరకాలు. ‘మిలి’ లో లోపల బాధ దాచుకుని పైకి నవ్వుతూ వుండే జయాబాధురీ పాత్ర,  ‘అంతులేని కథ’ లో కుటుంబ భారమంతా మోయాల్సి వస్తోందన్న కసితో జయప్రద పాత్ర,  ‘శంకరాభరణం’ లో లౌకిక తత్వానికి నిలబడే సోమయాజులు పాత్ర, ‘పెదరాయుడు’ లో కుటుంబ విలువలకి ప్రాణమిచ్చే మోహన్ బాబు పాత్ర... హిట్టయిన సీరియస్ పాత్రలకి బోరుకొట్టకుండా ఏఏ క్యారక్టర్ ఎలిమెంట్స్ జతపడ్డాయో గమనిస్తే ఆ ఎలిమెంట్స్ ని  వాడుకుంటూ బోరుకొట్టని సీరియస్ పాత్రల్ని తయారు చేసుకోవచ్చు. ‘గ్లాడియేటర్’ లో రసెల్ క్రొవ్, ‘మాట్రిక్స్’ లో కీనూ రీవ్స్, ‘ఇట్సె వండర్ఫుల్ లైఫ్’ లో జేమ్స్ స్టీవార్ట్ లాంటి పాత్రలు. కథేమిటి, ఆ కథలో పాత్రేమిటి అనే దాన్నిబట్టి సీరియస్ పాత్రలొస్తాయే తప్ప, విడిగా చెప్పడం కష్టం. అయితే ముందు అలాటి పాత్ర అనుకుంటేనే దాన్ని అనుసరించి పాత్రచిత్రణా కథా వస్తాయి. నిజజీవితంలో కొందర్ని రిఫరెన్స్ గా తీసుకున్నా సరిపోతుంది. ఎప్పుడు నవ్వుతారో తెలీని చంద్రబాబు నాయుడిని తీసుకోవచ్చు. ఎప్పుడు మాట్లాడతారో తెలీని మన్మోహన్  సింగ్ ని తీసుకోవచ్చు. పక్కన కమెడియన్ పెట్టి ఎత్తి పొడుస్తూంటే కూడా సీరియస్ పాత్రలు బోరు కొట్టవు. సీరియస్ పాత్రల్ని వూహించాలంటే కామెడీ పాత్రల్ని రిఫరెన్స్ గా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. రాజేంద్ర ప్రసాద్ కామెడీల్ని తీసుకుని, ఆయా కామెడీ సన్నివేశాల్లో రాజేంద్ర ప్రసాద్ ని సీరియస్ గా మార్చుకుని ఆలోచించవచ్చు. 

        అసలు పాత్ర సీరియస్ గా ఎందుకుంటోందీ? ప్రాథమికంగా ఈ మూలాలు అవసరం. స్వాభావికంగానే తనలో తాను గడిపే మనిషి కావడం, స్వాభావికంగానే నవ్వడం చేతగాని వ్యక్తి కావడం, చాలా చిన్న వయసునుంచే సుఖాలకి దూరంగా బాధ్యతల బరువు మోయడం, జీవితపు ఏదో మజిలీలో దెబ్బతినడం, ప్రేమలో ఏదో సందర్భంలో గాయపడడం, ‘అమర దీపం’ లో కృష్ణం రాజులాగా అపార్ధాలకి గురికావడం (ఆ పైన ఆత్మ హత్య చేసుకోవడం), ‘నేరము శిక్ష’ లో కృష్ణలాగా ఇంకొకర్ని నష్టపర్చడంతో స్వయం శిక్ష విధించుకోవడం, ఏదో అన్యాయానికి బలైతే తిరుగుబాటు చేయడం, పగ దీర్చుకోవడం లాంటివి. బోరు కొట్టకుండా వుండాలంటే ముఖ్యంగా యాక్టివ్ పాత్రయి వుండాలి.

సికిందర్