రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, August 24, 2017

501: రివ్యూ!


రచన - దర్శకత్వం: శివ
తారాగణం: అజిత్, కాజల్అగర్వాల్, అక్షరా హాసన్, వివేక్ఒబెరాయ్, శరత్సక్సేనా, భరత్రెడ్డి, కరుణాకరన్, ఆరవ్చౌదరి, కరుణాకరన్ తదితరులు
రచన : శివ, కనిలన్ వైరముత్తు; మాటలు
: రాజేష్, సంగీతం : సంగీతం: అనిరుధ్రవిచంద్రన్,
ఛాయాగ్రహణం : వెట్రి, బ్యానర్ :
సత్యజ్యోతి ఫిలింస్, సమర్పణ : టి.జి.త్యాగరాజన్
నిర్మాతలు: అర్జున్త్యాగరాజన్, సెంథిల్త్యాగరాజన్
విడుదల : ఆగస్టు 24, 2017
***
        తమిళ స్టార్ సినిమాలు లోకల్ మాస్ ఇమేజిని  పక్కనబెడుతూ నెమ్మదిగా గ్లోబల్ కంటెంట్ ని అందుకుంటున్నాయి. రంగూన్, 24, సింగం 3, భైరవ, విశ్వరూపం 2, ఇప్పుడు వివేకం...అజిత్ -  దర్శకుడు శివాల కాంబినేషన్ లో గతంలో వీరం, వేదాలం అనే రెండు పెద్ద హిట్స్ వచ్చాయి. తిరిగి ఇప్పుడు వివేకంతో వచ్చారు. వివేకంని పూర్తిస్థాయి విదేశీ స్పై థ్రిల్లర్ గా తీస్తూ తమిళ సినిమాని మరో మెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం చేశారు ఏ హాలీవుడ్ ప్రమాణాలకీ తీసిపోకుండా. వంద కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామంటున్న ఈ స్పై థ్రిల్లర్ అజిత్ ని నిలబెట్టిందా, లేక సూర్యకి సింగం 3 మిగిల్చిన అనుభవం లాంటిది అందించిందా అన్నది ప్రశ్న. రెండేళ్ళ తర్వాత అజిత్ నటించిన వివేకంలో వివేకం పాలెంత,  అవివేకం పర్సెంటేజీ ఎంత అనేది ఓ సారి చూద్దాం...

కథ 
     తూర్పు యూరప్ లోని సెర్బియాలో టెర్రరిజం  వ్యతిరేక సీక్రెట్ ఏజెన్సీ పని చేస్తూంటుంది. అందులో ఏకే అనే అజయ్ కుమార్ (అజిత్) ఏజెంట్ గా వుంటాడు. కన్నుగప్పి తిరిగే విద్రోహులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని చంపడంలో ఇతను స్పెషలిస్టు. ఇతడికో అందమైన భార్య హాసిని (కాజల్ అగర్వాల్)  వుంటుంది. ఈమెకి భర్త ఏ ప్రమాదకర డ్యూటీ మీద వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తాడనే నమ్మకం వుంటుంది. ఈ నమ్మకమే అతణ్ణి గెలిచేలా చేస్తూంటుంది. ఏజెన్సీలో నల్గురు ప్రాణమిత్రులు కూడా వుంటారు. వాళ్ళల్లో ముఖ్యుడు ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్). నటాషా (అక్షరా హాసన్)  అనే ఒక గుర్తు తెలియని హ్యాకర్ వుంటుంది. ఆమెదగ్గర అణుబాంబుల్ని పేల్చగల సీక్రెట్ కోడ్స్ తో కూడిన డ్రైవ్స్ వుంటాయి. కొన్ని కార్పోరేట్ శక్తులు సీక్రెట్ సొసైటీగా ఏర్పడి, అణుశక్తితో ప్రపంచంలో భూకంపాల్ని సృష్టించి వ్యాపారం చేసుకుంటూ వుంటాయి. అలాటి ప్లుటోనియం బాంబుల్ని పేల్చే కొడ్సే నటాషా దగ్గరవుంటాయి. ఈమెని పట్టుకుని ఆ ప్రమాదాన్ని నివారించే బాధ్యత జేకేకి అప్పగిస్తారు. ఆమె వేటలో బయల్దేరిన జేకేకి ఆమె దొరికేసరికి వూహించని విధంగా కొన్ని సంఘటనలు జరిగి షాక్ అవుతాడు. అక్కడ్నించీ అతను  తీవ్ర ప్రమాదంలో పడతాడు. ఇలామిత్రులు శత్రువులై అతణ్ణి వాడుకున్న ద్రోహాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ - 8 తిరగేసిన కథలా వుంది. ఇందులో ఐదుగురు మిత్రులైన సీక్రెట్ ఏజెంట్లు. ఏ డేటాబేస్ లోనూ వివరాల్లేని సిఫర్ అనే ఒక ఆడ సైబర్ టెర్రరిస్టు. ఈమె విన్ డిసిల్ భార్యనీ చిన్నారి కొడుకునీ కిడ్నాప్ చేసి అతణ్ణి తన కార్యకలాపాలకి వాడుకుంటుంది. విన్ డిసిల్ మిత్రులు తమకి ద్రోహం చేసి ఏదో కుట్రకి పాల్పడుతున్నాడని అతడి కార్యకలాపాల్ని అడ్డుకోవడం. ఇంతే. ఈ కథ కాస్తా ‘వివేకం’ లో మిత్రులే ద్రోహులై, సిఫర్ లాంటి నటాషా మంచి పిల్లగా తేలి, మిత్ర ద్రోహులు వర్సెస్ హీరో యాక్షన్  కథగా  రూపాంతరం చెందింది. ఇందులో హీరో ఒక మాటంటాడు- దేవుడు తన వైపు వున్నాడని. దీనికి విలన్ నవ్వి- కోతి నుంచి మనిషి ఎలా పరిణామం చెందాడో,  దేవుడు కూడా అలాగే పరిణామం చెందాడు డబ్బుగా – అంటాడు. బాగానే వుంది కానీ,  ఈ తిరగేసిన కథ బాక్సాఫీసు దగ్గర డబ్బుగా పరిణామం చెందడం కష్టమే.

ఎవరెలా చేశారు 
      దేశంలో నెరసిన జుట్టుతో అజిత్ ఒక విలక్షణ హీరో. చాలా గ్లామరస్ ఫేసు కూడా. ఈయనకి స్పై యాక్షన్ తోడైతే అది హై వోల్టేజ్ యాక్షన్ గా పరిణామం చెందడం ఖాయం. ఇదే చూస్తామిక్కడ. పైగా తను విసిరే రెండు లైన్ల పంచ్ డైలాగులు. ఫ్రెండ్ షిప్ మీద ఎన్నిసార్లు మార్చి మార్చి రెండు లైన్ల పంచ్ లు  విసురుతాడో లెక్కేలేదు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8  లో విన్ డిసిల్ సహా నల్గురు మిత్రులూ పేల్చే సింగిల్ లైన్ డైలాగులు ఎంత ఉర్రూతలూగించాయో తెలిసిందే. స్టార్ ని హీమాన్ గా చూపిస్తున్నప్పుడు ఆ స్థాయిలో అతడి నోట్లోంచి మాటలు వూడి  పడకపోతే పేలవంగా వుంటాడు. డైలాగ్స్ పరంగా కూడా అజిత్ వండర్ చేశాడు. ఆధునిక తెలుగు స్టార్ యాక్షన్ మూవీస్ కి డైలాగ్స్ పరంగా ఎఫ్ ఎఫ్ -8 ఒక గైడ్ అని ఆ రివ్యూలో రాశాం. అదిప్పుడు తమిళ ‘వివేకం’ లో కన్పిస్తోంది. 

          హాలీవుడ్ కూడా కళ్ళప్పగించి చూసే స్థాయిలో అజిత్ చేసిన స్టయిలిష్ స్పై పోరాటాలు ఈ సినిమాకి పెద్ద హైలైట్. అయితే ఇవే మైనస్ కూడా సరైన కథ లేకపోవడం వల్ల. ఇక భార్య పాత్రలో కాజల్ అగర్వాల్ చాలా బ్యూటిఫుల్. చాలా అందంగా ఆమె చెప్పే మాటలకి కళ్ళు చెమ్మగిల్లుతాయి. కానీ ‘నేనేరాజు - నేనే మంత్రి’ లోలాగా ఆమెది  అర్ధం లేని పరాజితురాలి పాత్ర కాదు. అనుక్షణం భర్తకి దన్నుగా వుండే, ఎట్టి  పరిస్థితుల్లో ప్రమాదాలనుంచి లాక్కు వచ్చే బలమైన సతీసావిత్రి పాత్ర. మహేష్ భట్ హిట్  ‘రాజ్’ (రహస్యం) అనే హార్రర్ లో దుష్ట శక్తి నుంచి భర్తని కాపాడుకునే కసితో వుండే బిపాషా బసు పోషించిన పాత్ర కూడా ఇలాటిదే సతీసావిత్రి పాత్ర. ఈ హార్రర్ కి మహిళలు కూడా ఎగబడి పెద్ద హిట్ చేశారు. కానీ ‘వివేకం’ కి ఈ అదృష్టం లేదు. కాజల్ పాత్ర ఎంత బావున్నా, యాక్షన్ హోరు దాన్ని మింగేసింది. అదే ఎఫ్ ఎఫ్ -8 లో విన్ డిసిల్ ఫ్యామిలీ స్టోరీ కథలో కలిసిపోతుంది. విన్ డిసిల్ కి పుట్టిన ఉయ్యాలూగే బుడ్డోడి కామెడీ జేసన్ స్టాథంతో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎపిసోడ్స్. 

           బాలీవుడ్ లో కనుమరుగవుతున్న హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. హీరోని పోగుతూ వుండే విలన్. విలనీ పండలేదు. కంప్యూటర్ స్క్రీన్స్ ముందే  కూర్చుని తెగ వాగుతూ వుండే వీక్ విలన్. 

          అక్షరా హాసన్ ఎందుకో నటాషా పాత్రకి సరిపోలేదు. ఈ పాత్రలో కొత్త హీరోయిన్ కంటే, ఎవరైనా ప్రముఖ సీనియర్ నటి వుంటే వూపు వచ్చేది. కనీసం నయనతార. ఎఫ్ ఎఫ్ -8  లో ఇదే అడవిలన్ సిఫర్ గా ప్రముఖ ఆస్కార్ నటి చార్లీజ్ థెరాన్ నటించి కథకి  మరింత క్రేజ్ తెచ్చింది. 

          కళ్ళప్పగించి చూసే కెమెరా వర్క్ వెట్రి చేశాడు. కళ్ళుతిరిగే యాక్షన్ కొరియోగ్రఫీ దర్శకుడు శివ చేశాడు. కిక్ ఇచ్చే సంగీతాన్ని అనిరుధ్ ఇచ్చాడు. ఇండియాలో ఈ స్థాయి యాక్షన్ మూవీ ఇదే. ఒక స్థాయిగల స్టార్ సినిమాలతో సరిపెట్టుకోలేకపోతున్న ప్రేక్షకులకి స్పై మూవీస్ తో అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్ళి సంతృప్తి పర్చాలేమో. కానీ మొన్న తెలుగు ‘లై’, ఇవ్వాళ తమిళ ‘వివేకం’ ఇది సాధించాయా? 

చివరికేమిటి?
          ఏమీ లేదు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్సే. ఇప్పుడు మనం కొత్తగా కళ్ళు తెర్చి తీస్తున్న సీరియస్ స్పై సినిమాలు హాలీవుడ్ తీసి తీసి బోరు కొట్టించుకుని, ఎంటర్ టైనర్ స్పైలు తీస్తున్నారు. ‘లై’ లోనూ ‘వివేకం’ లోనూ లోపించింది ఇదే. ఫస్టాఫంతా ఇంటర్వెల్ ముందు వరకూ తెరపైకే రాని నటాషాని పట్టుకునే వెతుకులాటే సరిపోతుంది. హీరో పక్కన కమెడియన్ కరుణాకరన్ నవ్విస్తూంటాడు గానీ, సెకండాఫ్ లో మాయమైపోతాడు. సెకండాఫ్ అంతా విలన్ అయిన ఫ్రెండ్ మీద పగతీర్చుకునే వ్యవహారమే. ఇదీ సీరియస్సే. చీటికీ మాటికీ రిలీఫ్ లేకుండా యాక్షన్ సీన్లు. ‘సింగం త్రీ’ పరిస్థితే ఇక్కడా ఎదురవుతుంది. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ హీరోకి ఇంటి దగ్గర హీరోయిన్ తో ఏదో టెన్షన్ వుండే ఫార్ములా వుంటుంది. ఇదే ఫార్ములా  కొన్నిసార్లు అజిత్ - కాజల్ ల మధ్య బెడిసి కొట్టింది. అతను భీకర పోరాటంలో వున్నప్పుడు ట్రింగు ట్రింగు మని సెల్ మోగడం, అతను పోరాటం చేస్తూనే ఆమె కబుర్లు వినడం. ఆమెతో ఒక సీను మాత్రం బాగా పండింది. ఆమెని చంపడానికి శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ఎక్కడ్నించో బుల్లెట్ దూసుకురావడం, భర్త వచ్చాడనే ఆనందాన్ని ప్రకటిస్తూ ఆమె చేసే యాక్షన్ బాగా పేలింది.  అజిత్ కంటే కాజల్ ఫన్నీ క్యారక్టర్. 

          ఇక ఈ మొత్తం గందరగోళంలో స్క్రీన్ ప్లే అనే పదార్ధం ఎప్పుడు నోట్లో పడుతుందా అని నోరు తెర్చుకుని చూడడమే. అది పడదు, మనకి ఆశ తీరదు. ఫ్రెండ్స్ తో సెంటిమెంట్లు దెబ్బ తిన్న కథ, భార్యతోమళ్ళీ అదే సెంటి మెంట్ల కథా చెప్పుకురావడం వల్ల  ఏదీ హత్తుకునేలా  లేకుండా పోయింది. ఫ్రెండ్స్ ని ఎఫ్ ఎఫ్ -8 ఫ్రెండ్స్ లాగే ఎంటర్ టైనింగ్ యాక్షన్ లో వుంచి, భార్యతో ఎమోషనల్ ట్రాక్ వుండివుంటే - కాంట్రాస్ట్ తో కాస్తయినా కథ అనే పదార్ధం కనబడేది.


-సికిందర్