రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

రైటర్స్ కార్నర్











స్క్రీన్ రైటింగ్ గురు మైకేల్ హాగ్ స్వయంగా డెవలప్ చేసిన బేసిక్ ప్లాట్ స్ట్రక్చర్ గురించి చాలాచోట్ల చాలాసార్లు చెప్పి వున్నారు. ఒక పుస్తకమే దీని మీద రాశారు. తన థియరీకి  సిడ్ ఫీల్డే  ఆధారమని  ఈయన చెబుతున్న స్ట్రక్చర్ ఎలా వుంటుంది... సమాంతర సినిమాలని వదిలేస్తే, ప్రధాన స్రవంతి సినిమాలకి స్ట్రక్చర్ అనేది ఎక్కడైనా మారుతుందా? ప్రామాణికమైన త్రీ యాక్ట్ ( మూడంకాల) స్ట్రక్చర్ కాకుండా ఇంకేముంటుంది? అదెలా వుంటుంది? దీన్నెలా వివరిస్తారు మైకేల్ హాగ్? ఇది తెలుసుకోవడానికే డెన్నిస్ మాగీ ఫాలన్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ పాఠంలోకి వెళ్తున్నాం...


మీరు రాసిన పుస్తకం The Hero’s Two Journeys లో మీసొంత బేసిక్ ప్లాట్ స్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. ఎందుకు?

స్ట్రక్చర్ ని  సరళీకృతం చేయడానికే. స్ట్రక్చర్ అంటే అదేదో సంకిష్ట పదార్ధమనే  అభిప్రాయం వుంది. ఇది నిజం కాదు. స్ట్రక్చర్ అంటే సంఘటనల సీక్వెన్స్ మాత్రమే. కథలో ఏం జరుగుతుంది, అదెప్పుడు జరుగుతుందీ అని చెప్పేదే స్ట్రక్చర్. విజయవంతమైన కథల్నీ, స్క్రీన్ ప్లేల్నీచూస్తే పటిష్టంగా ఆరుభాగాలుగా విడగొట్టి వుంటాయి. ఈ ఆరుభాగాలూ  ఐదు టర్నింగ్ పాయింట్స్ వల్ల ఏర్పడతాయి.

దీన్ని వివరిస్తారా?

మొదటి భాగాన్ని ‘సెటప్’ అంటాన్నేను. ఇది కథలో పది శాతం వుంటుంది. ఇందులో హీరోని పరిచయం చేస్తాం. అతడి రోజువారీ జీవితాన్నీ చూపిస్తాం. మున్ముందు ఈ జీవితం ఒడిదుడుకుల పాలవుతుంది  గాబట్టి ఈ సెటప్ లో దీన్నెలా చిత్రిస్తామన్నది  కీలకం అవుతుంది. ఈ పది శాతంతో మొదటి భాగం ముగిసి మొదటి టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ్నించీ  రెండో భాగం లో హీరోకి ఓ పరిస్థితి ఎదురవుతుంది, ఇంతకి  ముందు సెటప్ లో ఎదురవని అసాధారణ పరిస్థితి. దీన్ని ‘న్యూ సిట్యుయేషన్’ అంటాను. ఈ పరిస్థితిలోంచి తదనుగుణమైన కొన్ని సంఘటనలు పుట్టి,  ఇంకో పదిహేను శాతం కథ పూర్తవగానే, అంటే ఇప్పటి వరకూ ఇరవై అయిదు శాతానికి కథ చేరుకోగానే  ఆ ‘న్యూ సిట్యుయేషన్’ ఇంకా  క్లిష్ట స్థితి కిందికి  మారుతుంది. ఇది రెండవ టర్నింగ్ పాయింట్.

మీరంటున్న ఈ రెండు  దశలు సింపుల్ గా ఫస్ట్ యాక్టే కాదంటారా?

అవును. ఇంకోలా చెప్పాలంటే, ఫస్ట్ యాక్ట్ కథంతా ఈ ఇరవై ఐదు శాతానికి  చేరుకోగానే ఈ అత్యంత క్లిష్ట పరిస్థితి అనే రెండో టర్నింగ్ పాయింటునే టచ్ చేస్తుంది. ఫస్ట్ యాక్ట్ బిజినెస్ అంతా ఈ సెకండ్ టర్నింగ్ పాయింటుకి రన్నప్ లాంటిదే నన్నమాట. దీనికి ‘ఛేంజ్ ఆఫ్ ప్లాన్స్’  అని పేరుపెట్టాను. కొన్ని సార్లు ఈ పాయింటుని గుర్తించడం కష్టమే అవుతుంది. ఫస్ట్ యాక్ట్ నుంచి త్వరగా బయటపడమని రైటర్స్ మీద వొత్తిడి తేవడం వల్ల ఈ రెండో టర్నింగ్ పాయింటు వుండీ లేనట్టు ఉండిపోతుంది. కథని సెటప్ చేసే మొదటి పది పేజీలూ   చాలా ముఖ్యమైనవి. అయితే హీరోకి గోల్ అనేది రెండో టర్నింగ్ పాయింటు దగ్గరే ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ సూత్రం. హీరో గోల్ ఏదైనప్పటికీ ఈ రెండో టర్నింగ్ పాయింటు దగ్గర్నుంచే మొదలవ్వాలి.

అర్ధమయింది. ఇప్పడు కథలో మూడో భాగం గురించి చెప్పండి.

రెండో టర్నింగ్ పాయింటు నుంచీ మొదలయ్యే కథలో మూడో భాగాన్ని ‘ప్రోగ్రెస్’ అంటాన్నేను. ఇందులో హీరో తన గోల్ సాధించడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. ఒక ఆలోచన ప్రకారం సాగిపోతూంటాడు...ఆ ఆలోచన పనిచేస్తున్నట్టే వుంటుంది... అప్పుడు మూడో టర్నింగ్ పాయింట్ అనే  మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. దీన్ని ‘పాయింటాఫ్  నో  రిటర్న్’ అంటాను. ఇక్కడ హీరో తన ఆలోచనని కార్యరూపంలో, లేదా మాటల రూపంలో తిరుగులేని విధంగా బలంగా ప్రకటిస్తాడు. దీంతో నాల్గవ భాగంలోకి ప్రవేశిస్తాం. దీన్ని ‘కాంప్లికేషన్స్ అండ్ హయ్యర్ స్టేక్స్’ అంటాన్నేను. ఆ నాల్గవ భాగంలో హీరో చుట్టూ వున్న ప్రపంచం మూసుకుపోతుంది. అవాంతరాలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ పోతాయి...


అప్పుడు నాల్గవ టర్నింగ్ పాయింటు వస్తుంది. దీన్ని ‘మేజర్ సెట్ బ్యాక్’ అంటాను. దీంతో సెకండ్ యాక్ట్ ముగుస్తుంది. యాక్ట్ టూ అనేది స్క్రీన్ ప్లే  మిడిల్ లో వుండే యాభై శాతం కథ. ఇది ¼ – ½ – ¼  అనే సిడ్ ఫీల్డ్ నిర్వచించిన త్రీ యాక్ట్ స్ట్రక్చరల్ మోడల్. ఆయనకి  నేను చాలా రుణపడివుంటాను. ఆయన్ని ఎంత మెచ్చుకున్నా తనివితీరదు. నా స్ట్రక్చరల్ మోడల్ కి ఆయన్నుంచే స్ఫూర్తి పొందాను. ఇక సెకండ్ యాక్ట్ ముగింపులో హీరోకి జరగరానిది జరగాలి. ఇక అతడికి దారులన్నీ మూసుకుపోవాలి. ఇది ఐదవ భాగానికి దారి తీస్తుంది. దీన్ని ‘ఫైనల్ పుష్’ అన్నాను. ఇక్కడ హీరో నెమ్మదిగా తేరుకుని అంతిమ పోరాటం ప్రారంభిస్తాడు. ఇది ఐదో టర్నింగ్ పాయింటు. దీంతో కథ పూర్తవుతుంది.   

ప్లాట్ స్ట్రక్చర్ కి మీరు పర్సెంటేజీల గురించి చాలా మాట్లాడారు. పరిచయానికి పదిశాతం, మొదటి  టర్నింగ్ పాయింటుకి ఇరవై ఐదు శాతం. మిడిల్ మొత్తం యాభై శాతం, డెబ్బై ఐదో శాతానికి సెట్ బ్యాక్...గణిత శాస్త్ర సమీకరణల్లాగే వున్నాయివీ...

దీనికి చాలా విమర్శలే ఎదుర్కొన్నాన్లెండి. ప్రతీ టర్నింగ్ పాయింటూ కథ  ఫలానా ఇంత శాతం పూర్వగానే రావాలని  నేను చెప్పడం వ్యతిరేకతనే సంపాదించుకుంది. కానీ నేను చెబుతున్న ఆరు భాగాల స్ట్రక్చరల్ మోడల్ అదేదో కచ్చితమైన కొలతలతో కూడుకున్నదేం కాదు. ఒక గైడ్ మాత్రమే. విజయవంతమైన ఒక వెయ్యి సినిమాల స్ట్రక్చర్ లోంచి వచ్చిందే ఇది. కచ్చితంగా పర్సెంటేజీలు పాటించమనడం లేదు. స్క్రీన్ ప్లే ఆకట్టుకోవాలంటే ఈ పర్సెంటేజీలకి దగ్గరగా ఉండమనే నేను చెప్తున్నది...

అయితే రైటర్స్ ఈ పర్సెంటేజీ పాయింట్లు దృష్టిలో ఉంచుకుని స్క్రీన్ ప్లేలు చేసుకోవాలంటారు?

        ఓ  హెచ్చరిక చేస్తాను. మొదటి రఫ్, రెండో రఫ్ రాస్తున్నప్పుడు అస్సలు పర్సెంటేజీ లని పట్టించుకోవద్దు. కొందరు రచయితల్ని చూశాను- పర్సెంటేజీలు పెట్టుకుని కథలు అల్లుతూంటారు. దాంతో క్రియేటివిటీ దెబ్బతిని పోతోందని గమనించరు. కథని సృష్టించకుండానే ఎడిట్ చేయలేరు కదా. అందుకని స్వేచ్చగా, ఏ సంకెళ్ళూ లేకుండా, విస్తారంగా కథని సృష్టించుకున్న తర్వాత, పర్సెంటేజీల ప్రకారం టర్నింగ్  పాయింట్సు వచ్చేలా కథని ఎడిట్ చేసుకోవడం చేయాలి.

ఆరుభాగాలుగా విడగొట్టి  మీరు స్ట్రక్చర్ అంటే  భయాన్ని పోగొట్టారు, థాంక్స్.  

 

(నోట్ : పై ఆరుభాగాల మోడల్ నే ఆరు బ్లాకుల మోడల్ గా ఎప్పటినుంచో చెప్పుకుని మనం చేస్తున్నదే. యాక్ట్స్ అనీ, ప్లాట్ పాయింట్స్ అనీ పండిత  భాష మాటాడి వ్యతిరేకత మూటగట్టుకోకుండా, ఎదుటి వాళ్లతో ఆమ్ ఆద్మీలా కలిసిపోయి పనిచేసుకోవాలంటే అర్ధమయ్యే ‘బ్లాకుల’ భాష మాట్లాడ్డమే మేలు.  త్రీ యాక్ట్స్ లో బిగినింగ్ వరకూ ఒక బ్లాకుగా, మిడిల్ ఇంటర్వెల్ వరకూ రెండుగా చేసి మరో రెండు బ్లాకులుగా, మిడిల్ ఇంటర్వెల్ తర్వాత మరో రెండు బ్లాకులుగా, ఎండ్ ఇంకో బ్లాకుగా కథని విభజించి మొత్తం ఆరు బ్లాకులుగా  చేసి కథనం చేస్తూంటే, ఇంత సింపులా అని  అందరూ ఆనందపడుతూ అంగీకరిస్తారు. ఇలా బ్లాకుల వారీగా కథని గుర్తుంచుకుని, చర్చలో కూడా రెండో బ్లాకులో ఇలా చేద్దాం, ఐదవ బ్లాకులో ఇలా చేద్దాం అని వాళ్ళు చెబుతూంటే వినసొంపుగా వుంటుంది. మైకేల్ హాగ్ మోడల్ తెలియకముందే మనమిక్కడ అమల్లో పెట్టేశాం. కాకపోతే మైకేల్ హాగ్ ఎంత సింప్లీ ఫై చేసినా ఆ సాంకేతిక పదాలు, పర్సెంటేజీలూ  ఇక్కడ వాడలేం, అవన్నీ మనసులో పెట్టుకుని ఆ ప్రకారమే కథ అల్లుకోవచ్చు   -సికిందర్)

 

 


.
.