రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 26, 2023

1384 : రివ్యూ


 రచన - దర్శకత్వం: తేజ మార్ని

తారాగణం : శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, మురళీ శర్మ, పవన్ తేజ్, బెనర్జీ తదితరులు 
 సంగీతం: రంజిన్ రాజ్, ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
సహ నిర్మాతలు: భాను కిరణ్ ప్రతాప, రియాజ్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి  
విడుదల : నవంబర్ 24, 2023
***
కథ

    రవి (రాహుల్ విజయ్) పోలీసుద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో కుమారి (శివానీ రాజశేఖర్) కానిస్టేబుల్ గా  పని చేస్తూంటుంది. రామకృష్ణ (శ్రీకాంత్) ఏఎస్సైగా వుంటాడు. కుమారి, రామకృష్ణలు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. రామకృష్ణ కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు కుమారి బంధువుఆమె సామాజిక వర్గ పార్టీ కార్యకర్త మున్నా (పవన్ తేజ్) అనే అతనుపోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై రామకృష్ణ లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు.

ఇంకో రోజు
రామకృష్ణ, రవి ఓ పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి రామకృష్ణ మేనల్లుడ్ని తెచ్చుకుంటాడు. అదే జీపులో కుమారి  ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రామకృష్ణ మేనల్లుడు పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో పార్టీ కార్యకర్త చనిపోతాడు. దీంతో ఆ పార్టీ  ఆందోళన చెలరేగుతుంది.
        
ఏపీ లోని ఆ నియోజక వర్గం టెక్కలిలో ఉప ఎన్నిక వుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 50 వేలు వున్నాయి.  దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన సిబ్బందిని అరెస్ట్ చేయమని హోమ్ మంత్రి జయరామ్ (మురళీ శర్మ) ని రంగంలోకి దించుతుంది అధికార పార్టీ ప్రభుత్వం.
        
దీంతో రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురూ పరార్ అవుతారు. మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితుల్ని 48  గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి జయరాం శపథం చేస్తాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) కి ఆ బాధ్యత అప్పగిస్తాడు డిజిపి.
        
వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా, ఎంతకాలం పరుగుదీశారురజియా అలీ టీం వాళ్ళని పట్టుకోగలిగిందామధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటిచేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికెలా బలయ్యారు... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది  2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నల్గురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నల్గురు పోలీసుల మీద ఎస్సీ/ఎస్టీ చట్టం కిందహత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు పన్నెండేళ్ళు గడిచిపోయినా కేసు ఇంకా తేలలేదనేది వేరే సంగతి.
       
ఈ ఉదంతాన్ని సినిమాకి అనుకూలంగా మార్చి 2021 లో మలయాళంలో
నాయాట్టు (వేట) తీశాడు దర్శకుడు మార్టిన్ ప్రకట్. దీన్ని తెలుగులో కోట బొమ్మాళి పిఎస్ గా రీమేక్ చేశారు. నాయాట్టు’ చూస్తే ది కథ కాదు. జీవితంలో కథలుండవుగాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు. ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు ‘నాయాట్టు’ తో. ఇదో ప్రత్యేకత.
        
అయితే ఒక సామాజికవర్గ కోణంలో చేసిన ఈ గాథ కాన్సెప్ట్ పరంగా తెలుగులోనూ డొల్లగా మారిందని చెప్పక తప్పదు. ఎత్తుకున్న కుల కోణాన్ని నిజాయితీగా చెప్పలేక అపహాస్యం చేసిన వరస కన్పిస్తుంది. గాథ అయివుండీయాంటీ క్లయిమాక్సుతో మ్యాన్ హంట్ థ్రిల్లర్ గా నిలబడిన రచనకాన్సెప్ట్ పరంగా చొరవ చూపలేక చతికిల బడిందని ఒప్పుకోవాలి.
       
మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానర్ గాథగా కొన్ని లోపాలతో
 చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామాగా ఇది థ్రిల్ చేసే మాట నిజమేఅయితే కాన్సెప్ట్ పరంగా అసందర్భంగా వుంది. ఒక సామాజిక వర్గపు కాన్సెప్ట్ తీసుకుని అర్ధం లేని గాథ చేశారు. అదే సామాజిక వర్గం వర్సెస్ అదే సామాజిక వర్గం వర్సెస్ అదే సామాజిక వర్గం అన్నట్టు బలాబలాల సమీకరణ చేసి పాత్రల్ని ఎడాపెడా వాడేశారు.
        
యాక్సిడెంట్ చేసి పారిపోయిన పోలీసులు ముగ్గుర్లో ఇద్దరు  రామకృష్ణ, కుమారి- ఓ సామాజిక వర్గం సభ్యులైతే, యాక్సిడెంట్ లో చనిపోయిన వాడూ అదే సామాజిక వర్గానికి చెందిన వాడు. ఇక యాక్సిడెంట్ చేసి పారిపోయిన అదే సామాజిక వర్గానికి చెందిన పోలీసుల్ని, పట్టుకోవాలని రచ్చ రచ్చ చేసేదీ అదే సామాజిక వర్గానికి చెందిన పార్టీ! ఇది చోద్యంగా లేదూ?
       
అంటే
, యాక్సిడెంట్ చేసి పారిపోయిన పోలీసుల్లో ఇద్దరు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా- మీ వాళ్ళని పట్టుకుని శిక్షించాలని అంత పట్టుదల మీకేంటయ్యా- అని హోమ్ మంత్రి ఈ గొడవని కొట్టి పారేయొచ్చు. వాళ్ళ  ఓట్ల గురించి అధికార పార్టీ ఆందోళన చెందే అవసరమే లేదు. అంటే సినిమా తీయడానికి కథే లేదు. మలయాళంలో జరిగిన ఈ పొరపాటుని తెలుగులో సరిదిద్దుకుని వుండొచ్చు. పారిపోయిన పోలీసులు వేరే సామాజిక వర్గం అంటే సరిపోయేది. బలాబలాల సమీకరణ అర్ధవంతంగా వుండేది. కేరళలో జరిగిన నిజ కేసులో పారిపోయిన పోలీసుల మీద ఎస్సీ/ ఎస్టీ కేసు పెట్టారంటే వాళ్ళు ఇదే సామాజిక వర్గం కాదని కదా?
       
ఒరిఓజినల్లో ఇంకే మార్పులు చేయకుండా
, తెలుగు మూస మసాలాలు వాడకుండా, ముగింపు కాస్త మార్చి, ఉన్నది వున్నట్టు రియలిస్టిక్ జానర్లో తీశారు. దీంతో మూస సినిమాలకి భిన్నంగా ఇది కనిపిస్తుంది. నేటి తెలుగు సినిమాల్ని మూస ఫార్ములాలు కాకుండా ఇలా రియలిస్టిక్ గా తీసినా ఆడతాయని కోట బొమ్మాళి పిఎస్ రీమేక్ ద్వారా గుర్తిస్తే మంచిదే.

నటనలు – సాంకేతికాలు


        మలయాళంలో జోజు జార్జి పాత్రని శ్రీకాంత్ పోషించాడు. అయితే ఈ ఏఎస్సై పాత్రకి గతంలో గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ స్పెషలిస్టుగా పని చేశాడని అదనపు హంగు ఇచ్చారు. శ్రీకాంత్ రాజకీయాలకి బలైన ఈ పోలీసు పాత్రని సహజత్వంతో నటించాడు. తనని వేటాడే పోలీసులతో హైడ్రామా, తన వాళ్ళతో ఫ్యామిలీ డ్రామా దృశ్యాలకి బలాన్నిచ్చాడు.
       
శ్రీకాంత్ కి ఎదుటి పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ ఎస్పీ పాత్ర. ఎత్తుకి పైయెత్తులు ఈ ఇద్దరి మధ్యే వుంటాయి. ఈ కరుడుగట్టిన పోలీసు పాత్రని పవర్ఫుల్ గా పోషించింది. కానిస్టేబుల్ గా శివానీ
, ఇంకో కానిస్టేబుల్ గా రాహుల్ విజయ్ లు బాధిత పాత్రల్ని తగు భావోద్వేగాలతో నటించారు. ఈ చదరంగపు ఆట ఆడే హోమ్ మంత్రిగా మురళీ శర్మ తన మార్కు నటనతో ఓకే.
       
కథ జరిగే శ్రీకాకుళం లొకేషన్స్
,  ఆంధ్రా- ఒరిస్సా బోర్డర్ దృశ్యాల్ని కెమెరామాన్ జగదీష్ ఒరిజినల్ మూవీకి తీసి పోనివిధంగా దృశ్యీకరించాడు. రియలిస్టిక్ జానర్ టోన్ లో, లైటింగ్ తో దృశ్యాల్ని క్యాప్చర్ చేశాడు. అలాగే రంజిన్ రాజ్ సంగీతంలో ఒక హిట్టయిన పాట, నేపథ్య సంగీతం బలంగా వున్నాయి. ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం అన్నీ మంచి క్వాలిటీతో వున్నాయి.

చివరికేమిటి
          ఈ రీమేక్ తో దర్శకుడు తేజ మార్ని సక్సెసయ్యాడు. పోలీసు వ్యవస్థని వాడుకునే రాజకీయ వ్యవస్థ, అందులో బలయ్యే పోలీసులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటర్ల పాత్ర- ఈ అంశాల్ని స్పృశిస్తూ చివర ఓ సందేశంతో మలయాళ ఒరిజినల్ని అనుసరించి మేకింగ్ చేశాడు. అయితే ఒక రాష్ట్రపు రాజకీయ -పోలీసు- ఎన్నికల వాతావరణానికి చెందిన కథ తెచ్చుకుని కృత్రిమంగా తెలుగులో అద్దేకన్నా, నేటివిటీ గల ఒరిజినల్ తెలుగు నేల కథల్ని సృష్టిస్తే వాటితో బలంగా ఫీలయ్యే అవకాశముంటుందేమో ఆలోచించాలి. 
—సికిందర్