రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, అక్టోబర్ 2015, శుక్రవారం

ఇంకేం ప్రేమో !





రచన-  దర్శకత్వం : రమేష్ సామల 


తారాగణం : సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి, రోహన్ బషీర్ పృథ్వీ, నాగినీడు, సప్తగిరి సంగీతం : జతిన్ రోషన్ , కెమెరా : భాస్కర్ సామల 

బ్యానర్ : ఎ కె ఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత : అశ్విన్ కుమార్ సహదేవ్ 
విడుదల : 22 అక్టోబర్, 2015

                        

     అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ యూత్ హీరోగా పాపులర్ అవ్వాలని  చేస్తున్న స్ట్రగుల్ లో భాగంగా మరో యూత్ సినిమాతో ఈ దసరాకి ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఈసారి కూడా మరో ప్రేమ కథని , అదీ ట్రయాంగులర్ లవ్ స్టోరీని ఆశ్రయించాడు. రమేష్ సామల అనే కొత్త దర్శకుడితో తన అదృష్టాన్ని  పరీక్షించుకుంటూ, ‘కొలంబస్’ అనే టైటిల్ తో ఇద్దరు హీరోయిన్లని వెంటేసుకుని నటించిన ఈ రోమాంటిక్ కామెడీలో కొత్తదనం ఏముందో ఈ కింద చూద్దాం..

కథ : 
        అశ్విన్ (సుమంత్ అశ్విన్) ఒక హత్యా యత్నం కేసులో రెండేళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇంటి కొస్తాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇక ఇందూ ( మిస్తీ చక్రవర్తి) ని  మర్చి పొమ్మంటారు. కానీ ఇందూ ని మర్చిపోలేక ఆమె కోసం గాలిస్తూంటాడు. తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆమె ని ప్రేమించాడు. తను బీటెక్ ఫెయిలవడంతో తనని వదిలేసి పైచదువులకి ఢిల్లీ వెళ్ళిపోయింది. తను ఢిల్లీ వెళ్ళి చూస్తే  అక్కడ వంశీ (రోహన్ బషీర్) అనే క్లాస్ మేట్  తో క్లోజ్ గా ఉంటోంది. దీంతో వంశీతో ఘర్షణ పడ్డ తనని వంశీ హత్యాయత్నం కేసులో ఇరికించి జైలుకి పంపించాడు. ఇప్పుడు విడుదలై,  ప్రేమ చావక అదే ఇందూని వెతకసాగాడు. ఆమె అమెరికా వెళ్లి పోయినట్టు తెలుస్తుంది.

        ఈ క్రమంలో నీరజ (శీరత్ కపూర్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇతన్ని చూస్తే ఆమెకి వొళ్ళు మంటగా వుంటుంది. ప్రేమ కోసం వెంట పడుతున్నాడని అనుకుంటుంది. తీరా చూస్తే ఈమె పనిచేస్తున్న కంపెనీ లోనే అమెరికానుంచి వచ్చి చేరుతుంది ఇందూ. దీంతో నీరజ సహాయం తీసుకుని ఇందూకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు అశ్విన్. ఇందూ దగ్గరవదు గానీ, నీరజ మాత్రం ప్రేమలో పడుతుంది ఆశ్విన్ తో. ఇప్పుడు అశ్విన్ ఏం చేశాడు- తను ప్రేమిస్తున్న ఇందూనే కోరుకున్నాడా,  లేక తనని ప్రేమిస్తున్న నీరజనే స్వీకరించాడా అన్నది మిగతా కథ.

కథెలా వుంది  
     రొటీన్ కథ. యూత్ చాలాసార్లు చూసేసి మానేసిన కథ. పూర్తి నిడివి  రోమాంటిక్ కామెడీల, లైటర్ వీన్ ప్రేమకథల నుంచీ చాలాకాలం క్రితమే వేరే జానర్స్ వైపు మళ్ళి పోయారు యువ ప్రేక్షకులు. తేజ లాంటి పేరున్న దర్శకుడు తీసిన ‘హోరా హరీ’ కి సైతం ఓపెనింగ్స్ లేవు. మరో క్రేజ్ వున్న దర్శకుడు మారుతీ కూడా ఈ తరహా సినిమాలకి దూరయయ్యారు. అయితే రోమాంటిక్ థ్రిల్లర్స్,  కాకపోతే హార్రర్ కామెడీలకి ఎగబడుతున్నారు యూత్. మార్కెట్ డిమాండ్ ఏమిటో తెలుసుకుని ఏ సినిమా అయినా తీయాలని ‘కొలంబస్’ రిజల్ట్ మరోసారి తేల్చి చెబుతోంది. 


ఎవరెలా చేశారు  
     సాఫ్ట్ లుక్స్ తో కోమలంగా వుండే  సుమంత్ అశ్విన్ లవర్ బాయ్ పాత్రలకే సరిపోతాడు. కానీ ఇలా ఎంత కాలం? వరుణ్ సందేశ్ కూడా లవర్ బాయ్ పాత్రలకే తప్ప మరి దేనికీ సరిపోక అతలకుతలమై పోయాడు. సుమంత్ అశ్విన్ అర్జెంటుగా తన పరిస్థితిని సమీక్షించుకోవాలి. ఈ సినిమా వరకూ చూస్తే, ఈ లవర్ బాయ్ పాత్ర ఎంటర్ టైన్మెంట్ యావతో మూలాలు మర్చి  ప్రవర్తించే, కొన్ని సార్లు కామెడీ కోసం ఓవర్ యాక్షన్ చేసే ఆషామాషీ  పాత్రగానే ఉండిపోయింది. ఇందూ కోసం ఒక ఎమోషనల్ డ్రైవ్ తో రగిలిపోయే పాత్రగా వుండివుంటే తేడాగా వుండేది. అప్పుడు కేవలం లవర్ బాయ్ పాత్రలేస్తున్న తనకి,  ఇదో డిఫరెంట్ క్యారక్టర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు పనికొచ్చేది. పాత్ర ఎమోషనల్ డ్రైవ్ ని డిమాండ్ చేస్తున్నప్పుడు కామెడీ కళాకారుడిగా మారిపోతే ఏం లాభం? 

        హీరోయిన్లిద్దరివీ అంతే ఫ్లాట్ క్యారక్టరైజేషన్స్. ముక్కోణ ప్రేమ కథల్లో మార్పేమీ లేకుండా ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన ఈ పాత్రల్లో వీళ్ళిద్దరూ తేలిపోయారు. ఈ పాత్రలూ వాటి ముగింపులూ కూడా ఏనాడో కాలం తీరిపోయాయి. ఎంత టాప్ హీరోయిన్లయినా తమ టాలెంట్స్ తో చేసేదేమీ వుండదు ఇలాటి పాత్రల్లో. 

        సప్తగిరి సీరియల్ డైరెక్టర్ గా చేసిన కామెడీ దర్శకుడు  రాసుకున్న పంచ్ డైలాగులతో బాగానే పేలినా- ఈ పాత్ర ప్రధాన కథలో ఇన్వాల్వ్ అయి క్లయిమాక్స్ లో ఏదో గిమ్మిక్ చేసి వుంటే సార్ధకమై వుండేది. కమెడియన్లని కరివేపాకులా వాడుకుని విసిరేయడం ఇంకెంత కాలం సాగుతుందో? 

        ఈ సినిమాకి ఉద్దేశపూర్వకంగా పింక్ టింట్ లో డీఐ చేసినట్టుంది. ఈ ప్రేమ కథంత లైటర్ వీన్ లో నే సాగింది కెమెరా వర్క్ కూడా. పాటలు ఓ మాదిరిగా వున్నాయి.

చివరికేమిటి 
      ఈ రొటీన్ ప్రేమ కథని ముగించ డానికి చివర్లో ఎన్నెన్ని మలుపులు, ఎన్నెన్ని సాగ తీతలు, ఎన్నెన్ని పాటలూ పెట్టి అపహాస్యం పాలయ్యారో చెప్పుకోవాలి. శీరత్ కపూర్ తో హీరో సెటిల్ అవుతాడని ప్రేక్షకులకి ఎప్పుడో హింట్ ఇచ్చేసినప్పుడు, తెలివి తక్కువగా ఆ డొంక తిరుగుడంతా అవసరమా?  అసలే అంతంత మాత్రం ప్రేమ కథకి ఈ డొంక తిరుగుడు ముగింపు మరింత హాని చేసింది. దర్శకుడిలో డైలాగులు రాసుకోగల మంచి టాలెంట్ వుంది. కథ చేసుకోగల- అదీ ట్రెండ్ లో వున్న కథ చేసుకోగల నేర్పు కూడా జతయితే మున్ముందు నిలదొక్కుకునే అవకాశం వుంటుంది. ఒక కొత్త దర్శకుడు అందరి కంటే కొత్తగా తాను ఏమిస్తున్నాడనేది క్రైటేరియా అయినప్పుడే మార్కెట్ లో మెరుస్తాడు. రొటీన్ కథతోనే రాజీ పడొచ్చు. ఆ రాజీ పడ్డ రొటీన్ కథలోనే కొత్తగా ఏమిస్తున్నాడనేది సెల్లింగ్ పాయింటు కావాలి. ఒకమ్మాయితో ప్రేమని సెట్ చేసుకోవడానికి ఇంకో అమ్మాయి సహాయం కోరినప్పుడు - పనిలో పనిగా నువ్వు మాత్రం నాతో  ప్రేమలో పడొద్దు -అని కండిషన్ పెట్టినప్పుడు ముక్కోణ ప్రేమకథకి కొత్త ముగింపు రావొచ్చు.

ఇంతకీ కొలంబస్ ఈ ప్రేమలో కనుగొన్న దేమిటి? 

-సికిందర్