రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, October 18, 2016

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17






స్క్రీన్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసలు ఎండ్ ఎలా మొదలవుతుంది?  ఎండ్ విభాగంలో జరిగే బిజినెస్ ఏమిటి?  సీక్వెన్సు లేమిటి? ఎండ్ కల్లా కథలో  ఏఏ అంశాలు ముగిసిపోవాలి?  వీటన్నిటినీ  వివరించుకుని ఈ ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాస పరంపరని ముగింపుకి తెద్దాం...
          ముందుగా  14 వ అధ్యాయంలో రాసిన  అంశాల్ని దగ్గర పెట్టుకుని, రెండిటినీ కలిపి చదువుకుంటే, ఎండ్ విభాగపు సైన్స్ నంతా బాగా అర్ధం జేసుకోవచ్చు. ఈ లింక్ ని క్లిక్ చేసి ముందుకు సాగండి:  
           https://sikander-cinemascriptreview.blogspot.in/2016_05_26_archive.html


        స్క్రీన్ ప్లే కి ఎండ్ విభాగం అనేది మిడిల్ అంతమైన చోట ప్లాట్ పాయింట్ -2 నుంచి ప్రారంభమవుతుంది. దీన్నే క్లయిమాక్స్ అంటారు. క్లయిమాక్స్ అంటే చిట్ట చివర్లో పాజిటివ్ శక్తి ( ఏ జానర్ ని బట్టి అలాటి కథానాయకుడు/నాయిక), నెగెటివ్ శక్తి (ఏ జానర్ ని బట్టి అలాటి  ప్రతినాయకుడు/నాయిక) మీద సాధించే అంతిమ విజయం. దీన్నే డా. పరుచూరి గోపాలకృష్ణ విస్తృతార్ధంలో  ‘ఫలప్రాప్తి’ అన్నారు, లజోస్ ఎగ్రీ ‘రిజల్యూషన్’ అన్నారు. రెండూ ఒకటే. కానీ మన సినిమాల్లో ఇప్పుడు విస్తృతార్ధంతో ముగిసే సినిమాలు అంతగా రావడం లేదు. హీరో గోల్ ని సాధించే ఉద్దేశంతోనే కథలు ముగిసిపోతున్నాయి తప్ప, హీరో గోల్ తో పాటూ కథా ప్రయోజనాన్ని కూడా సాధిస్తూ ‘ఫలప్రాప్తి’ గా,  ‘రిజల్యూషన్’ గా ముగియడం లేదు. ‘శివ’ దీన్ని దృష్టిలో పెట్టుకుంది. హీరో గోల్ కంటే కథా ప్రయోజనం ఉన్నతమైనది. కథా ప్రయోజనం కోసం హీరో గోల్ ని సాధించాలి తప్పితే, కథలో వ్యక్తిగత ప్రయోజనం కోసం కారాదు. 

        ‘ప్రధానపాత్ర ముఖ్యోద్దేశమేమిటో  ఆ దిక్కుగా ఆఖరి 30-40 నిమిషాల నడక వుండాలి, గెలుపోటముల మధ్య డోలాయమాన పరిస్థితి వుండాలి’ అన్నారు గోపాల కృష్ణ. ‘పతాక స్థాయికి చేరటానికి ముందు విషమ స్థితికి తీసుకు వెళ్ళాలి. ఇదే యాంటీ క్లైమాక్స్. ఇలా కథానాయికో, కథానాయకుడో  ఇక ఆశయాన్ని సాధించలేరు అని నూటికినూరు శాతం నమ్మకం కలిగించటమే విషమ స్థితి. ఆ తర్వాత ఫలప్రాప్తి సాధించాలి’  అని కూడా అన్నారు తన ‘తెలుగు సినిమా సాహిత్యం- కథ, కథనం, శిల్పం’ అన్న పుస్తకంలో.  

        ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’  లో-  ఎండ్ కుండాల్సిన వరస క్రైసిస్, క్లయిమాక్స్, రిజల్యూషన్ అన్నారు లజోస్ ఎగ్రి. ‘డెత్ ఈజ్ క్లయిమాక్స్, బిఫోర్ డెత్ ఈజ్ క్రైసిస్’ అన్నారు. అంటే చావుకి ముందు సంక్షుభిత పరిస్థితినీ – పోరాటాన్నీ చూపకుండా అకస్మాత్తుగా హీరో వచ్చేసి, ఒక్క పోటుతో విలన్ ని పొడిచి చంపేసి
-  ఐపోయింది కథ అంటే ఎంత దారుణంగా వుంటుందో, ఆ సంక్షుభిత పరిస్థితినీ – పోరాటాన్నీ చూపిస్తూ చంపేశాక  కూడా, వెంటనే  శుభం కార్డు వేయడమూ అంతే  అన్యాయంగా ఉంటుందన్నమాట. ‘జనతా గ్యారేజ్’ ఆకస్మిక ముగింపులో ఇదే చూశాం. ఇంత భారీ కథకి కథా ప్రయోజనం అన్న సంగతే ఆలోచించలేదు. 

         అలాగే ‘హైపర్’ లో కథా ప్రయోజనం ఆకస్మికంగా క్లయిమాక్స్ లో వూడి పడుతుంది. అంతవరకూ జరిగిన కథలో దీని ఊసే వుండదు- హీరో గోల్ తో మిళితమై కూడా వుండదు. హీరోతో సంబంధం లేకుండా హీరో తండ్రీ- విలన్ లు కలిసి, వాళ్లకి వాళ్ళు మొదలెట్టుకునే క్లయిమాక్స్ లో ‘సంతకం’ గురించి మొత్తం ప్రభుత్వోద్యోగులంతా తిరగబడే వృత్తాంతం కథా ప్రయోజనం అన్పించదు. ఈ కథా ప్రయోజనం గురించి హీరో ఎక్కడా మాట్లాడడు. 

        కథా ప్రయోజనమనేది కథకి ఆత్మ (సోల్) లాంటిది. అది కథలో అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది, వుండాలి. ‘శివ’ కథా ప్రయోజనం కళాశాలల్లో మాఫియాల జోక్యాన్ని రూపు మాపడం. అంతేగానీ  ఎవరో మాఫియా ప్రతినిధి జేడీ అనేవాడు హీరోయిన్ని తాకినందుకు హీరో పగబట్టిన వ్యక్తిగత కథ కాదు. శివ తన గ్రూపులోని మల్లిని భవానీ మనుషులు చంపినప్పుడు కూడా ఇంకింత  ఎక్స్ టెండ్ చేసిన కథా ప్రయోజనంతో కూడుకున్న మాటలే అంటాడు. మల్లిని చంపాడని తను భవానీని చంపితే, రేపింకో భవానీ పుట్టుకొస్తాడు, వాణ్ణి  చంపితే ఇంకో భవానీ పుట్టుకొస్తాడు- ఇలాకాకుండా ఇలాటి భవానీలని పుట్టిస్తున్న వ్యవస్థనే నాశనం చేయాలంటాడు. ఇదీ కథా ప్రయోజనం
, విస్తృతార్ధంలో ముగింపు, ఫలప్రాప్తి, రిజల్యూషన్ వగైరా వగైరా. ఇది జరిగిందా లేదా అనేది  ముగింపులో చూడాలి.    

        హీరో సామాజిక ప్రయోజనాన్ని చూస్తాడు. కానీ వ్యవస్థ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటుంది. బిన్ లాడెన్ ని చంపడం వల్ల టెర్రరిజం సమస్య సమసిపోలేదు. బిన్ లాడెన్ ని చంపకుండా అతడి భావజాలాన్ని ఎలా చంపెయ్యొచ్చో, తద్వారా టెర్రరిజానికి ఎలా శాశ్వతంగా తెర దించవచ్చో- ఒక హాలీవుడ్  రచయిత నుంచి సీఐఏ తీసుకున్న బ్లూ ప్రింట్ ని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆ హాలీవుడ్ రచయిత సరీగ్గా సినిమాలో శివ చెప్పిన మాటలే  చెప్పి హెచ్చరించాడు- మీరు బిన్ లాడెన్ చంపితే వందల మంది బిన్ లాడెన్ లు పుట్టుకొస్తారని. కానీ వ్యవస్థకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం- సమాజం, ప్రపంచం ఎలా పోతే ఏంటి. అందుకని బిన్ లాడెన్ భావజాలం నాశనం కాకుండా బిన్ లాడెన్ హతమయ్యాడు. అలాగే  గ్యాంగ్ స్టర్ నయీంని చంపేశాక వాణ్ణి సృష్టించిన వ్యవస్థని శిక్షించగలరా? వ్యవస్థ ఎప్పుడూ వ్యక్తిగత లాభాలే చూసుకుంటుంది- కానీ కథల్లో హీరో అలాకాదు- సామాజిక ప్రయోజనాన్నే కాంక్షిస్తాడు. 

        ‘శివ’ లో భవానీ అనుచరుడు గణేష్ కూడా ఇలాటి నయీం లాంటి వాడే. వీణ్ణి చట్టానికి పట్టిస్తే – భవానీతో బాటు, వీడి వెనుక వ్యవస్థ మొత్తాన్నీకూడా   వీడి ద్వారా నాశనం చేయవచ్చని అంతిమంగా శివ కనుగొన్న పరిష్కారమార్గం. అందుకే ప్లాట్ పాయింట్ టూ దగ్గర గణేష్ ని పట్టుకుని లాకప్ లో వేయించాడు. ఇక్కడ్నించీ వ్యవస్థ నాశనమయ్యే పాడు కాలం మొదలయ్యింది. వ్యవస్థకి సింబల్ మాచిరాజు.
                                          ***
       ఏ కథకైనా ముగింపు ప్రారంభంలోనే దాగి ఉంటుందని చెప్పుకున్నాం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర శివ జేడీని కొట్టి కథ ప్రారంభిస్తున్నప్పుడు,  అందులో ముగింపు ఏమిటీ అని చూస్తే- ఆటోమేటిగ్గా భవానీ అంతమేనని తెలిసిపోతుంది. అయితే ప్లాట్ పాయింట్ వన్ ని ప్లాట్ పాయింట్ టూ కి తాళం చెవిగా కూడా 14 వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఈ మొత్తం హీరో ఎదుర్కొంటున్న సమస్యకి హీరో పరిష్కార మార్గాన్ని  కనుగొని దాంతో క్లయిమాక్స్ ప్రారంభిస్తాడు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ హీరోకి పరిష్కార మార్గం ఎలా, ఎక్కడ్నించీ దొరుకుతుంది? అన్నిటికీ సమాధానం సృష్టి మూలమే. ప్లాట్ పాయింట్ వన్నే. 

        ముందుగా తాళం ఏదో తెలిస్తే దాన్ని విప్పే  తాళం చెవి ఏదో తెలుస్తుంది. తాళం  హీరో గోల్ లోని  అంశం అనుకుంటే, దాన్ని చేరుకునే ద్వారాల్ని తెరిచేదే తాళం చెవి అనే పరిష్కార మార్గం. ఏ జానర్ కి చెందిన కథకైనా ఈ ఏర్పాటు వుంటుంది. లేదంటే అది తోచినట్టూ రాసుకున్న ఏదో  ‘కత’ అయి వుంటుంది.  గోల్ లోని అంశానికి సరిపడా తాళం చెవి లేకపోతే, ఇంకేదో చేసి బలవంతంగా గోల్ ద్వారాలు తెరిస్తే అది దొంగ దారి అవుతుంది. ఉంగరం పడిపోయింది...పోతే పోనీ... హృదయం మాత్రం పదిలం పదిలం ... అనే పాత  పాట వున్నట్టు- తాళం చెవి దొరకని కథ ఏమంత పదిలంగా వుండదు. అసలు తాళం చెవులే లేని కథలు తయారవుతున్నాయి. 

        వెతికితే బిగినింగ్ లేదా మిడిల్ విభాగాల్లోనే ఈ తాళం చెవి దొరుకుతుంది. ‘శివ’ లో హీరో గోల్ వ్యవస్థ అయినప్పుడు దాన్ని సాధించే తాళం చెవి గణేషే అవుతాడు తప్ప భవానీ కాదు, మాచిరాజూ కాదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడ్డ గోల్ లోని  అంశం (కథా ప్రయోజనం) వ్యవస్థ నాశనమే అయినప్పుడు ముందుగా ఆ వ్యవస్థ నాశన క్రమం తెలియాలి. ఏం చేస్తే అలాటి వ్యవస్థ నాశనమవుతుందో సామాజిక స్పృహతో, సంయమనంతో, అర్ధవంతంగా  పరిశీలించాలి. (ఇతర జానర్ల కథలకి కూడా ఏంచేస్తే సమస్య పరిష్కారమౌతుందో ఇలా సైంటిఫిక్ గానే విస్తృతార్ధంలో ఆలోచించాలి). బిన్ లాడెన్ ని చెంపేస్తేనే అలాటి వ్యవస్థ నాశనం అవుతుందనుకుంటే భవానీని కూడా చంపెయ్యొచ్చు. అలా భవానీని చంపిన పాలకులకి తిరిగి ఓట్లు పడతాయేమోగానీ, ఈ అవగాహనారాహిత్యం వల్ల సినిమాలో హీరోకి మాత్రం టికెట్లు తెగవు. ఎందుకంటే ఇంతకి ముందే చెప్పుకున్నట్టు,  హీరో దృక్పథం దూరదృష్టితో కూడుకుని సువిశాలమైనదై వుంటుంది. పాలకుల్లాగా హ్రస్వ దృష్టితో వ్యక్తగత, పార్టీగత లాభాలు చూసుకోడు. ‘శివ’ లో హీరో భవానీని చంపలేదని కాదు, చంపాడు. వ్యవస్థకి సింబలైన మాచిరాజు నాశనమయ్యాకే భవానీని చంపాడు. పైన చెప్పుకున్న హాలీవుడ్ రచయిత కూడా బిన్ లాడెన్ భావజాలాన్ని నాశనం చేశాకే బిన్ లాడెన్ ని వురి తీయమన్నాడు. బిన్ లాడెన్ భావజాలాన్ని ఎలా నాశనం చెయ్యొచ్చో చాలా సైంటిఫిక్ గా చెప్పాడు. 

        అలా వ్యవస్థ నాశనమవ్వాలంటే గణేష్ తోనే  నరుక్కురావాలని  అంత సైంటిఫిక్ గా  శివ ఆలోచించాడు  గనుకనే, ప్లాట్ పాయింట్ టూ  అనే తాళాన్ని బిగినింగ్ విభాగంలోనే గణేష్ రూపంలో  తచ్చాడుతూ కన్పించిన తాళం చెవిని పట్టుకుని  తెరిచాడు. గణేష్ ని పట్టుకుని లాకప్ లో వేయించే చర్యతో, సమస్యకి పరిష్కారమార్గాన్ని సుగమం చేసుకున్నాడు. ఏ జానర్ కథ కైనా ఇలాటి ఏర్పాటుని బిగినింగ్ లేదా మిడిల్ విభాగాల్లోనే వెతికితే తప్పకుండా దొరుకుంతుంది. మరొకటేమిటంటే,  కథ అంటే ఆర్గ్యుమెంట్ అని కూడా చెప్పుకున్నాం. ఈ ఆర్గ్యుమెంట్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రశ్నని సంధిస్తుంది (సంధించ లేదంటే అది కథవదు. స్టేట్ మెంట్ తో కూడిన, సినిమాకి పనికి రాని ఏదో  కేవల ‘గాథ’ అవుతుంది). ఇలా లేవనెత్తిన ప్రశ్నకి ముగింపులో సమాధానం చెప్పి తీరాలి.   ప్లాట్ పాయింట్ వన్ దగ్గర శివ జేడీని సైకిలు చెయినుతో ఆ యెత్తున బాదడం మొదలెట్టాడంటేనే ఎంతో సవాలు భవానీ మీద. ఒక మామూలు కుర్రాడు భవానీ తోనే పెట్టుకున్నాడే ఇప్పుడేమిటీ అన్న కంగారు పుట్టించే ప్రశ్న. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ మలుపు యాక్షన్ ద్వారా తెలియ జేస్తేనే ప్రశ్న బలంగా, కంగారు పుట్టించేదిగా వుంటుంది ఆ విజువల్ ఎఫెక్ట్ వల్ల. ప్రేమ కథల్లో లాగా మాటా  మాటా  అనుకుని విడిపోయే వెర్బల్ ప్లాట్ పాయింట్ బలహీనంగా వుంటుంది, సరైన ప్రశ్న కూడా పుట్టించకుండా. ఇదే యాక్షన్ లో చూపిస్తే పుట్టాల్సిన కంగారంతా పుడుతుంది. ప్రశ్న ఎంత కంగారు పుట్టిస్తే క్లయిమాక్స్ అంత బలంగా వుంటుంది. ఎండ్ విభాగం బలహీనంగా వుందంటే దాని రుగ్మతలు  బిగినింగ్ విభాగంలో ఉన్నట్టేనని ఏనాడో ప్రఖ్యాత దర్శకుడు బిల్లీ వైల్డర్ చెప్పనే చెప్పాడు. ఇలాటి పరిశీలనలు చేసి చెప్పే దర్శకులు మనకున్నారా? తమ గురించి ఏదో ఫీలైపోతూ ఏటా తొంభై శాతానికి తగ్గకుండా  ఫ్లాపులు ఇవ్వడంలోనే వాళ్లకి ఆసక్తి. ఇంతాచేసి టాలీవుడ్ కి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇదే!
***

      గణేష్ ని లాకప్ లో పడేశాక ‘శివ’ ఎండ్ విభాగం ఈ మేకప్ తో వుంటుంది...
        79.  పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
        80.  ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
81.  పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని  శివ చంపడం.
       
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.
       
83.  వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ  చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
       
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
       
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
       
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
       
87.  అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
       
88.  ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే,  కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.
       
89. శివ అన్న ఇంట్లోంచి  భవానీ అనుచరులు కీర్తిని అపహరించడం.
       
90.  శివ కోర్టులో సీఐ కి గణేష్ ని అప్పగించడం, అక్కడే అన్న కూతురి అపహరణ గురించి తెలియడం.
       
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
       
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
       
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
       
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా
మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం.
       
95. పారిపోతున్న భవానీని శివ వెంటాడి చంపడం.
***సమాప్తం ***

     ఈ ఎండ్ విభాగం 17 సీన్లతో వుంది. ఓ 25 నిమిషాలలోపు రన్. బిగినింగ్ 20 సీన్లతో వుంటే, ఆ తర్వాత  మిడిల్ -1 వచ్చేసి 28 సీన్లతో, మిడిల్ - 2 వచ్చేసి 30 సీన్లతోనూ వున్నాయి. మొత్తం స్క్రీన్ ప్లే  20+58+17= 95 సీన్లు. అంటే  ప్రామాణికంగానే సుమారు అటూ ఇటుగా  1 : 2 : 1 నిష్పత్తిలోనే,  లేదా 25% +50% +25%  శాతంగానే విభాగాల సైజులున్నాయి.

        ఎండ్ విభాగం 25 శాతమే వుండాలని లేదు. కొన్ని కథలకి ఎండ్ నాలుగైదు సీన్లే సరిపోవచ్చు. గరిష్టంగా 25 శాతం మాత్రం దాటకూడదు. దాటిందంటే ముగింపు కోసం దర్శకుడు స్క్రిప్టు మీద అర్ధంగాక వదిలేసి, సినిమాతీసి వెండితెర మీద వెతుక్కుంటున్నట్టే జాలిగొలిపేలా వుంటుంది. ఇటీవల వచ్చిన ‘డోంట్ బ్రీత్’ లో ఎండ్ విభాగం ఇలాంటిదే.  ఎలా ముగించాలో తెలియనట్టు- ఒకదగ్గర ముగిస్తున్నట్టు అన్పింపజేస్తూ, మళ్ళీ అక్కడికే వచ్చి ఫ్రెష్ గా మొదలెడుతూంటాడు. ఇలా ముగిస్తున్నట్టే అన్పించి, ఇలాకాదని ఇంకో విధంగా  మళ్ళీ ఫ్రెష్ గా మొదలెట్టడం మూడు సార్లు జరుగుతుంది. 

        పై ఎండ్ విభాగం ఆర్డర్ లో మళ్ళీ రెండు సీక్వెన్సులు వున్నాయని గమనించ వచ్చు. అంటే బిగినింగ్ లో రెండు, మిడిల్ -1 లో రెండు, మిడిల్ -2 లో రెండూ సీక్వెన్సులు ఉన్నట్టే, ఎండ్  లోనూ రెండు సీక్వెన్సులుండి మొత్తం 8 సీక్వెన్సులతో ఈ స్క్రీన్ ప్లే సమతూకంతో వుంది. 

సీక్వెన్స్ -1
       
79.  పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
        80.  ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
81.  పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని  శివ చంపడం.
       
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.
       
83.  వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ  చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
       
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
       
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
       
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
       
87.  అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
       
88.  ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే,  కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.
       
89. శివ అన్న ఇంట్లోంచి  భవానీ అనుచరులు కీర్తిని అపహరించడం.
***


        సీక్వెన్సుల్ని గుర్తించడం ఎలా? మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్ని వాటిలో జరిగే  ఏ బిజినెస్ (కార్యకలాపాల) లక్షణాలతో గుర్తిస్తామో, సీక్వెన్సుల స్ట్రక్చర్ ని కూడా ఇవే విభాగాల బిజినెస్ లక్షణాలతో గుర్తిస్తాం. స్క్రీన్ ప్లే బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్లో, వీటి అంతర్నిర్మాణాలైన సీక్వెన్సుల్లో, మళ్ళీ ఈ సీక్వెన్సుల  అంతర్నిర్మాణాలైన సీన్లలోనూ- అన్నిటా బిగినింగ్ మిడిల్ ఎండ్ లనేవి విధిగా వుంటాయి- ఇవన్నీ విడివిడి బిజినెస్ లతో కూడి వుంటాయి. బిగినింగ్ విషయం పరిచయం చేసి సమస్యని స్థాపించే బిజినెస్ తో, మిడిల్ ఆ సమస్యతో సంఘర్షించే బిజినెస్ తో, ఎండ్ వచ్చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపే బిజినెస్ తోనూ వుంటాయి. 

        ఇలా పై రెండు సీక్వెన్సుల్లో మొదటి దాన్ని తీసుకుంటే,  ఇది 79 వ సీనుతో ప్రారంభమై, 89 వ సీనుతో ముగుస్తుంది. ఇందులో విభాగాలు చూద్దాం. 79వ సీనుతో  బిగినింగ్ విషయం చెప్పడం  ప్రారంభిస్తోంది...తనని లాకప్ లోంచి బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ బెదిరిస్తున్నాడు. తర్వాతి సీన్లో వాణ్ణి చంపెయ్యమని భవానీ ఆదేశించాడు. ఆ తర్వాతి సీన్లో గణేష్ ని చంపబోతే శివ వచ్చి చంపుతున్న వాణ్ణి  చంపేసి లాకప్ లోంచి గణేష్ ని తీసికెళ్ళి పోయాడు. ఇప్పుడు గణేష్ ని సజీవంగా కోర్టులో హాజరుపర్చాలన్న శివ ఎజెండాతో, కోర్టు కెళ్ళకుండా గణేష్ ని చంపాలన్న భవానీ కుట్రతో సమస్య ఏర్పాటై బిగినింగ్ విభాగం 82 వ సీనుతో ముగిసింది. దీన్ని ఈ కింది క్రమంలో గమనించ వచ్చు.

సీక్వెన్స్ -1  బిగినింగ్ విభాగం:  
       
79.  పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
        80.  ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
81.  పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని  శివ చంపడం.
       
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.

మిడిల్ విభాగం :
        83.  వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ  చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
       
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
       
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
       
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
       
87.  అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
       
88.  ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే,  కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.

          రు సీన్లతో వున్న పై మిడిల్ విభాగాన్ని చూస్తే- ఇందులో సంఘర్షణ ప్రారంభమయ్యింది.  గణేష్ గురించిన ప్రధాన సమస్యతో బాటు, మాచిరాజుతో ముందునుంచీ నడుస్తున్న సబ్ ప్లాట్ కూడా కొలిక్కి రావడం మొదలైంది. వ్యవస్థకి ప్రతిరూపం మాచిరాజు భవానీ ఇక వేస్ట్ అని భావించి ఊసరవెల్లిలా శివని ఆకర్షించేందుకు విఫలయత్నం చేశాడు. శివ గట్టి సమాధానం చెప్పి పంపించాడు. శివది సర్జికల్ ఆపరేషన్. పరిమిత స్థాయిలో గణేష్ మీద చర్య తీసుకుంటే ఆటోమేటిగ్గా మూలపురుషుడు మాచిరాజు కూడా క్లోజ్ అవుతాడన్న వ్యూహం పన్నాడు. అందుకే ఇప్పుడు మాచిరాజు తన దగ్గరికి వచ్చినా కొత్తాలోచన చేయలేదు. ఎలాగూ వచ్చాడు కాబట్టి వీడితో డీల్ కుదుర్చుకుని దొంగ దెబ్బ తీయాలని మరో నాటకానికి తెర తీయలేదు. శివ ఈజ్ సైంటిఫిక్.

        భవానీ గణేష్ వేటలోనే వున్నాడు. శివ బందీగా వున్న గణేష్ ని పట్టుకుని చంపెయయ్యాలన్న ఎత్తుగడతో శివ మీద విఘా పెట్టించాడు. శివని అనుసరించి వెళ్ళిన భవానీ అనుచరులకి శివ అన్న కుటుంబం గురించి తెలిసింది. ఇది భవానీ ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం చూపింది. దీంతో శివఅన్న కూతుర్ని తీసుకు రమ్మన్నాడు. ఈ సంఘర్షిస్తున్న సమస్యకి ఈ పరిష్కార మార్గంతో మిడిల్ ముగిసింది. 

ఎండ్ విభాగం:
       
శివ అన్న ఇంట్లోంచి భవానీ మనుషులు కీర్తిని అపహరించడమనే ఒకే సీనుతో ఎండ్ విభాగం ముగిసింది. ఇలా విషయ పరిచయం, సమస్య, సంఘర్షణ, పరిష్కారమనే విభాగాల పనిముట్లతో మొదటి సీక్వెన్స్ స్ట్రక్చర్ సాగింది.

సీక్వెన్స్ -2
        90.  శివ కోర్టులో సీఐ కి గణేష్ ని అప్పగించడం, అక్కడే అన్న కూతురి అపహరణ గురించి తెలియడం.
       
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
       
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
       
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
       
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం.
       
95. పారిపోతున్న భవానీని శివ వెంటాడి చంపడం.

బిగినింగ్ విభాగం:
          పై ఆర్డర్ లో మొదటి ఒకే సీనే విషయాన్ని పరిచయం చేసి, సమస్యని స్థాపించేసి  బిజినెస్ ని పూర్తి  చేసింది. శివ కోర్టు దగ్గర గణేష్ ని సీఐకి అప్పజెప్పాడు, అక్కడే కీర్తి అపహరణ గురించి తెలిసి సమస్యలో పడ్డాడు. ఈ సీక్వెన్స్ మొదటి సీక్వెన్స్ కి కౌంటర్ గా మొదలైందని గమనించ వచ్చు. మొదటి సీక్వెన్స్ లో గణేష్ ని అపహరించి శివ భవానీని  సమస్యలో పడేస్తే, ఈ రెండో సీక్వెన్స్ లో భవానీ కీర్తిని అపహరించి శివని సమస్యలో పడేశాడు. డైనమిక్స్ అంటే ఇదే. ఇలా పరస్పర యాంటీ కథనాలే కథలో  ఉత్కంఠని రేకెత్తిస్తాయి. పాసివ్ కథనాలు ఆర్గ్యుమెంట్ సహిత కథలకి వుండవు, సినిమాలకి పనికిరాని గాథలకే  వుంటాయి. పాసివ్ కథనమంటే బాగా కడుపు నిండిన రైటర్, వ్యవసాయానికి వ్యాయామాన్ని బద్దకించి, భుక్తాయసంతో బోర్లా పడి చేసే లేజీ రైటింగే. సోమరితనపు సొగసులు. సినిమా అంతే సంగతులు. ఏటా 90 శాతం ఫ్లాపులంటే ఆ దర్శకులు కూడా పాసివ్ పరమాణువులే. వేకప్ ఇండియా మానవులు కొద్ది మందే. 

మిడిల్ విభాగం :
         
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
       
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
       
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
       
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా
మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం. 

       
పై నాలుగు సీన్లతో మిడిల్ బిజినెస్ అయిన సంఘర్షణ ముగిసింది. అరెస్ట్ వారెంట్ రద్దుకోసం భవానీ ప్రయత్నం, కుదరక మాచిరాజుని చంపెయ్యడం; కీర్తి చావుని చూసి శివ ఇక భవానీని చంపేసేందుకు బయల్దేరడం. 

       
బ్ ప్లాట్ అయిన మాచిరాజు కథ మెయిన్ ప్లాట్ కంటే ముందే ముగిసిపోవడాన్ని గమనించాలి. మెయిన్ ప్లాట్ ముందు నుంచీ కూడా శివ- భవానీల మధ్యే వుంది. దీంతోనే కథకి ముగింపూ  వుంటుంది. కథలో వుండే సబ్ ప్లాట్స్ అన్నీ ప్రధాన కథకంటే ముందే ముగిసిపోవడం సరైన పధ్ధతి. ఇక్కడ కథా ప్రయోజనం వ్యవస్థని నాశనం చేయడమైనప్పుడు, ఇలాటి ప్రధాన విషయం సబ్ ప్లాట్ గా ఎందుకుందనవచ్చు. దీని ప్రతీక అయిన మాచిరాజుతో శివకి పెద్దగా సంపర్కం ఎందుకు లేదని కూడా అనొచ్చు. ప్రధాన దుష్ట శక్తి అదృశ్యంగా ఉంటేనే కథకి అందం. అలాగని కథకి ప్రధాన విలన్ అదృశ్యంగా వుండకూడదు. వుంటే ‘సరైనోడు’ లో లాగా విలన్ కీ - హీరోకీ సంపర్కంలేక, ఎంత సేపూ ఛోటా మోటా విలన్ అనుచరులతోనే క్లయిమాక్స్ వరకూ పాసివ్ రియాక్టివ్ పాత్రలాగా హీరో ఏకపక్ష పోరాటాలు చేసుకుంటూ- ఎక్కడున్నావ్ రా ముందుకురా - అని పదేపదే  విలన్ ని కేకలేసుకుంటూ గడపాల్సి వస్తుంది. హీరో కంఠశోషే తప్ప విలన్ తో ఏమీ జరగడం లేదని ఒక వెలితి బయల్దేరుతుంది. ఇలా కాకుండా సగం కథకల్లా విలన్ హీరో ముఖాముఖీ అవ్వాల్సిందే- ఎందుకంటే,  హీరో చేసే జర్నీయే కాన్ష మైండ్ లోంచి సబ్ కాన్షస్ మైండ్ లోకి. ఆ సబ్ కాన్షస్ మైండ్ లో  తలపడాల్సిన శక్తే కన్పించకపోతే ప్రేక్షకులకి  సైకలాజికల్ కనెక్ట్  వుండదన్న మాట  కథతో. 

        ఇద్దరు ముగ్గురు విలన్లు వున్నప్పుడు వాళ్ళల్లో ఒక విలనే ప్రత్యక్షంగా వుండి, మిగిలిన వాళ్ళు పరోక్షంగా వుంటారు. ‘హైపర్’ లోలాగా ఒకటో రెండో మూడో కృష్ణుడు లాగా ఒకరుపోయి ఇంకో విలన్ వచ్చే పధ్ధతి కథల్లో వుండదు. వుందంటే అది పాయింటు కాదు, పాదరసం. కథ ఏ పాయింటు మీదా నిలబడని పాదరసం. 

        మాచిరాజు సబ్ ప్లాట్ శివ లక్ష్యించిన వ్యవస్థతో ముడి పడి  వుంది. ఈ వ్యవస్థ కూడా అతణ్ణి భవానీయే చంపడంతో ఫినిష్ అయ్యింది- మరి ఒక హీరోగా శివ చేసిందేమిటని కూడా అనవచ్చు. చిచ్చు పెట్టిందంతా శివే. ‘ముత్యాల ముగ్గు’ లో కూడా చిచ్చు పెట్టేదంతా పిల్లలే. దాంతో విలన్లు ఒకర్నొకరు సర్వనాశనం చేసుకుంటారు- సృష్టి ఉపసంహారం త్రివిధాలుగా జరుగుతుందనే బ్రహ్మపురాణం ప్రకారం- అందులో ఒకటైన- పంచ భూతాలు ఒకదాన్నొకటి మింగేసుకునే నైమిత్తిక పద్ధతిలో ‘ముత్యాలముగ్గు’ విలన్లకి ముగింపు నివ్వడం జరిగింది. ‘శివ’ లోనూ ఇంతే. ఇలా ఈ రెండో సీక్వెన్స్ మిడిల్ లో సబ్ ప్లాట్ ముందుగానే ముగిసిపోయింది. భవానీ మాచిరాజు దగ్గరి కెళ్లాడన్న సమాచారంతో శివకి పరిష్కారం దొరికి,  అక్కడికి బయల్దేరడంతో- మిడిల్ బిజినెస్ సమగ్రంగా ముగిసింది. 

ఎండ్ విభాగం:
        ఇది భవానీని శివ వెంటాడి చంపే ఒకే సీనుతో ముగుస్తుంది. ఈ రెండో సీక్వెన్స్ బిగినింగ్ ఒకే సీనుతో ముగిసినట్టే, ఎండ్ కూడా ఒకే సీనుతో ముగిసింది. ఇక్కడ కథా ప్రయోజనం నెరవేరిన తర్వతే శివ స్వప్రయోజనం తీర్చుకున్నాడు- కీర్తిని చంపిన భవానీని చంపడం ద్వారా. పాత్ర చిత్రణ రీత్యా చూసినా శివ ముందు కథా ప్రయోజనానికే ప్రాధాన్య మిచ్చి,  మెచ్యూర్డ్ క్యారెక్టర్ అన్పించుకున్నాడు.
***
       ఎండ్ విభాగాన్ని రెండు సీక్వెన్సులు పటిష్టం చేశాయి. లైన్ ఆర్డర్ వేయడమంటే సీక్వెన్సుల్ని కూర్చడమే. సీక్వెన్సులు లేని లైన్ ఆర్డర్ పిచ్చి పిచ్చి పువ్వులు గుచ్చిన మాలలా వుంటుంది. ఇలా ఎండ్ విభాగాన్ని ముగించాక, మొదట్నించీ కథని క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇంకేవైనా నోళ్ళు తెర్చుకున్న మ్యాన్ హోల్స్ వున్నాయేమో, ఓపెన్ నాలాలూ వున్నాయోమో చూసుకోవాలి. మ్యాన్ హోల్స్ మీద వెంటనే మూతలేసేసి మూసెయ్యాలి. లేకపోతే వాటిలో పడి రైటరనే వాడు స్క్రిప్టుతో సహా గల్లంతై పోవచ్చు. ఓపెన్ నాలాల్ని కూడా వెంటనే మూసెయ్యాలి. స్క్రీన్ ప్లేలో ప్రతీ విభాగంలో రెండేసి సీక్వెన్సులు చొప్పున మొత్తం ఎనిమిది సీక్వెన్సులుంటాయి. కొన్ని ఆంగ్ల స్క్రీన్ ప్లే పుస్తకాల్లో చూసి 12,18 సీక్వెన్సులు వుంటాయని పొరబడకూడదు. అవి సీక్వెన్సులు కావు. ఎనిమిది సీక్వెన్సుల్లో కుదురుకున్న మజిలీలు. కథలో హీరో సాగించే ప్రయాణం తాలూకు దశలు మాత్రమే. ఐతే ఇన్ని దశలు కూడా మన సినిమాలకి అక్కర్లేదు. గత అధ్యాయాల్లో చెప్పుకున్నట్టు ఈ తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాల ఉద్దేశం- తెలుగులో ఇప్పటి కాలానికి తగ్గ కమర్షియల్ స్క్రీన్ ప్లేలు తయారు చేసుకునే సులువు చెప్పడమే. కాకపోతే క్వాలిటీ కోసం జోసెఫ్ క్యాంప్ బెల్, జేమ్స్ బానెట్ ల వంటి పండితుల శాస్త్రాల నుంచి, ఇప్పటి తెలుగు సినిమాలకి ఎంతవరకు నప్పుతుందో అంతే తీసుకుని ఈ స్ట్రక్చర్ ని డెవలప్ చేశాం. ఈ పండితులు చెప్పే అన్నేసి మజిలీలతో, ఇంకానేక పనిముట్లతో స్క్రీన్ ప్లే రాయడమంటే అది కళాఖండాలకే  అవసరం. కళాఖండాలు సమీప భవిష్యత్తులో తెలుగులో తీయరు కాబట్టి ఇంత శాస్త్రం మనకి అక్కర్లేదు. అనవసరంగా బుర్ర చెడగొట్టుకోవడమే. సింపుల్ గా బాక్సాఫీసు దగ్గర కాస్త పరువు నిలబెట్టుకుని, ఫ్లాపుల శాతాన్ని  ఇంకో పది శాతం తగ్గించుకుంటే చాలన్న పరిమిత ఆశే తప్ప, దీంతో పట్టిందల్లా సూపర్ హిట్టే అవ్వాలన్న గొంతెమ్మ కోర్కె కాదు.  


        ఎండ్ విభాగమనేది బిగినింగ్, మిడిల్ విభాగాల్ని పే ఆఫ్ చేసేది. కాబట్టి ఆ రెండు విభాగాల్లో లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలు, సస్పెన్స్, సబ్ ప్లాట్స్  మొదలైన వాటన్నిటినీ క్లోజ్ చేసిన తర్వాతే ముగింపు కెళ్ళాలి. బిగినింగ్ అద్దమైతే, మిడిల్ భూతద్దం, ఎండ్ సూక్ష్మదర్శిని.



రేపు ఉపసంహారం!
-సికిందర్