రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 5, 2024


 

    శ్రీ విష్ణు పోషించిన భవభూతి పాత్ర నటన ఇంద్రుడు చంద్రుడు (1989) లో కమల హాసన్ ని కాపీ కొట్టినట్టుంది. అదే పొట్ట పెరిగి, పారపళ్ళతో కనిపిస్తూ, బొంగురు గొంతుతో మాట్లాడే కమల హాసన్ నటన ఒక నీటైన అద్బుత ప్రయోగంగా హిట్టయ్యింది ఆ రోజుల్లో

రచన- దర్శకత్వం : హసిత్ గోలి
తారాగణం : శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, రవిబాబు, సునీల్, గోపరాజు రమణ  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వేదరామన్ శంకరన్, కూర్పు విప్లవ్ నిషాదం
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్
విడుదల : అక్టోబర్ 4, 2022
***

        2021- 22 లలో ఓ మూడు ఫ్లాపుల తర్వాత శ్రీవిష్ణు 2023 లో సామజవరగమన కామెడీతో ఓ హిట్టిచ్చి, తిరిగి ఓం భీమ్ బుష్ అనే ఇంకో ప్లాప్ తో  సరిపెట్టుకున్నాడు. అయితే 2021 ప్రారంభంలో రాజరాజ చోర అనే హిట్ కూడా ఇచ్చాడు. దీనికి దర్శకుడు హసిత్ గోలి. తిరిగి ఇదే దర్శకుడితో ఈవారం స్వాగ్ అనే మరో కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ తిరిగి ఓ క్లీన్ ఎంటర్ టైనర్ ని అందించిందా? దసరా సందర్భంగా దీన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చా? తెలుసుకుందాం...

కథేమిటి?

ఎస్సైగా రిటైరైన భవభూతి (శ్రీవిష్ణు) రిటైర్మెంట్  డబ్బులు రాలేదని బాధ పడుతున్న సమయంలో తనది శ్వాగణిక వంశపు వారసత్వమని, కోట్ల రూపాయల సంపద తనకి వచ్చే అవకాశముందని తెలుసుకుంటాడు. వంశవృక్ష నిలయానికి వెళ్ళి ఆ సంపదని క్లెయిమ్ చేస్తాడు. అక్కడికే అనుభూతి (రీతూ వర్మ) అదే పని మీద వస్తుంది.  శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవాలంటే అవసరమైన రాగి పలక వుండాలి. అది ఈమె దగ్గర వుంటుంది. 
       
ఈ రాగి పలక భవభూతికి కాక ఈమెకెలా వచ్చింది
? భవభూతి లాగే వున్న సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు) ఎవరు? వీళ్ళిద్దరికీ సంపద దక్కకుండా చేసిన యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? 1551 ళ్ళ క్రితం మాతృస్వామ్యాన్ని స్థాపించి మగాళ్ళని తోక్కెసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ) నుంచి అధికారాన్ని లాక్కుని,  పితృ స్వామ్య వ్యవస్థని స్థాపించిన అదే వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? ఇందులో రేవతి (మీరా జాస్మిన్)  ఎవరు? చివరికి సంపద ఎవరి సొంతమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ 

స్త్రీ పురుషుల్లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని గాకుండా అందరినీ సమానత్వంతో చూడడమే  మానవత్వమని మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. ఇది పాత బడిన- కాలం చెల్లిన  పాయింటేమీ కాదు. ఈ అసమానతల సమస్య, సంఘర్షణ  ఎక్కడైనా ఎప్పటికైనా వుండేవే. అయితే దీన్ని సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో యూత్ కోసం ఉద్దేశించాల్సింది పోయి  – యూత్ కి ఏమాత్రం కనెక్ట్ కాని పురాతన జానపద కథల కాలంలో స్థాపించి, యూత్ అప్పీల్ కీ మార్కెట్ యూస్పెక్ట్ కీ అందకుండా  చేశాడు.

జానపద పాత్రలు, సన్నివేశాలు,  సంభాషణలు, హాస్యాలూ  వగైరా ఔట్ డేటెడ్ మూవీ అన్పించేలా చేసేస్తాయి. ఇంతే గాకుండా ఏం కథ చెప్తున్నాడో అస్సలు అర్ధంగాక, కామెడీ కూడా అర్ధం గాక, అర్ధమవడానికి వీల్లేని ట్విస్టులతో, బోలెడు హడావిడీ చేసేస్తూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు! చివర్లో చెప్పిన మెసేజ్ తప్ప ఏదీ అర్ధంగాదు. దీన్ని దర్శకుడి ఓవర్ ఇండల్జెన్స్ అనాలేమూ!

        
పురాతన కాలంతో ప్రారంభమయ్యే ఫస్టాఫ్ కథ ఇదేదో కొత్త ప్రయోగంలా అన్పించి ఆసక్తి రేపుతుంది. పది నిమిషాల్లో నేటి కాలంలో కొచ్చేసరికి శ్రీవిష్ణు ఎస్సై పాత్రతో ఓవరాక్షన్ మొదలై, ఇక దర్శకుడి ఓవరాక్షన్ కూడా మొదలైపోతుంది. ఎన్నెన్నో పాత్రలు, ఏమేమో సంఘటనలు, తెర మీద ఏదీ రిజిస్టర్ కాని స్పీడుతో, ఇక కథని పట్టుకోవడం అసాధ్యమై- శ్రీవిష్ణు మరో రెండు పాత్రల ఎంట్రీతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్ కొస్తే మళ్ళీ పురాతన కాలపు కథతో ప్రారంభమవుతుంది. ఈ సెకండాఫ్ శ్ర్రెవిష్ణు - సునీల్ ల మద్య సాగదీసిన పేలవమైన కామెడీతో సహనపరీక్ష పెడుతుంది. ఫస్టాఫ్ లో కంగాళీ కామెడీతో చేసిన హంగామా అంతా కూడా సెకండాఫ్ లో మాయమైపోయి సీరియస్ సినిమా అయిపోతుంది. కథ విషయంలో గానీ, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విషయంలో గానీ దర్శకుడికి పట్టు, అవగాహన, స్పష్టత లేక ఇదంతా జరిగింది. మళ్ళీ చివర్లో శ్రీవిష్ణు చేఠ మెసేజ్ ఇప్పించే విషయంలో మాత్రం డిసిప్లిన్ గా వున్నాడు దర్శకుడు. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ట్విస్టుతో సినిమా అదరగొడుతుందన్న శ్రీ విష్ణు స్టేట్ మెంట్ పూర్తిగా ఫెయిలైనట్టు లెక్క.

నటనలేమిటి? సాంకేతికాలేమిటి?
 శ్రీ విష్ణు పోషించిన భవభూతి పాత్ర నటన ఇంద్రుడు చంద్రుడు (1989) లో కమల హాసన్ ని కాపీ కొట్టినట్టుంది. అదే పొట్ట పెరిగి, పారపళ్ళతో కనిపిస్తూ, బొంగురు గొంతుతో మాట్లాడే కమల హాసన్ నటన ఒక నీటైన అద్బుత ప్రయోగంగా హిట్టయ్యింది ఆ రోజుల్లో. దీన్ని కాపీకొట్టిన శ్రీవిష్ణు నీట్ నెస్ బదులు వెకిలి తనంతో మెప్పించబోయాడు. ఈ గెటప్, డబ్బింగ్ ఏమాత్రం కుదర్లేదు. మిగిలిన పాత్రల అభినయం రొటీనే కాబట్టి కష్టపడే పనిలేకుండా పోయింది. అయితే ఈ పాత్రలన్నీ కూడా గందరగోళపు కథలో ఆకట్టుకునే అవకాశం లేదు..
       
మహారాణి పాత్రలో
, తర్వాత ఈ కాలంలో లింగ వివక్ష నెదుర్కొనే ఆత్మాభిమానం గల సాధారణ యువతి  పాత్రలో రీతూ వర్మ మాత్రం నీటుగా నటించింది. ఈ రెండూ సీరియస్ పాత్రలే. కంగాళీ కామెడీలో ఈమె భాగం కాలేదు. శ్రీవిష్ణు భార్య పాత్రలో మీరా జాస్మిన్ కూడా చెప్పుకోవాల్సిన నటి. ఇక సునీల్ రొటీన్. వంశ వృక్ష నిలయంలో
రవిబాబు, గోపరాజు పాతకాలపు పాత్రలు, నటన యూత్ కి అవసరం లేదు. రవి బాబుతో పరమానందయ్య శిష్యుల్లాగా వుండే నటుల హాస్యమేమీ లేదు.
       
పురాతన కాలపు సెట్స్
, వాతావరణ సృష్టి, దీనికి తగ్గ కెమెరా వర్క్ బావున్నా వీటితో సంగీతం మాత్రం పోటీపడలేదు. పాటలేమీ వర్కౌట్ కాలేదు. ఈ గజిబిజి కథకి ఎడిటింగ్ ఎలా వర్కౌట్ అయిందో ఎడిటర్ కే తెలియాలి.
       
జానపద కథల్లోంచి కథ తీసుకుని మోడరన్ కాలపు కథ చెప్పిన సినిమాలెన్నో వచ్చాయి. ఫాటల్ ఎట్రాక్షన్
, కిల్ లిస్ట్, ఏక్ హసీనా థీ, బుల్ బుల్ వంటివి. స్వగ్ లింగ వివక్ష కథని నేటి కాలంలో స్థాపించి మెసేజి ఇస్తే బాక్సాఫీసు అప్పీల్  బ్లాస్ట్ అయ్యేది.

—సికిందర్