రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

1138 : సందేహాలు- సమాధానాలు


Q :   స్క్రీన్ ప్లే త్రీయాక్ట్ స్ట్రక్చర్ పుస్తకాలు గానీ, లేదా వీడియోలు గానీ స్క్రీన్ ప్లే నేర్చుకోవడానికి పనికొస్తాయంటారా? ఎందుకంటే మీరు స్ట్రక్చర్ గురించి ఎక్కువ రాస్తుంటారు. నేను ఈ మధ్య దీని మీద దృష్టి పెట్టాను. ఇది ఎంతవరకూ ఉపయోగపడుతుంది?  
—జి. కృష్ణ, అసిస్టెంట్

A :   అలా ఉపయోగపడదు. కేవలం స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే తయారవదు. స్ట్రక్చర్ కేవలం స్క్రీన్ ప్లేకి స్థిరపడిన త్రీయాక్ట్స్ నమూనానే ఇస్తుంది. దాంట్లో ఆయా యాక్ట్స్ ప్రకారం కథ చేసుకోవాలి. దీంతో అయిపోదు. ఈ నమూనా లోపల కథకి తగ్గ క్రియేటివిటీ అవసరపడుతుంది. ఈ క్రియేటివిటీకి - అంటే కథ చెప్పే తీరుకి- రూల్స్ లేవు. ఒక్కొక్కరి క్రియేటివిటీ ఒక్కో విధంగా వుంటుంది. ఎన్ని విధాలుగా క్రియేటివిటీ వున్నా స్ట్రక్చర్ కి లోబడే వుండాలి. ఈ క్రియేటివిటీ ఏమిటనేది స్ట్రక్చర్ లో వుండే వివిధ సినిమాలు చూస్తూంటే తెలుస్తుంది. సినిమాలకి పని చేస్తూంటే తెలుస్తుంది. ప్రాక్టికల్ గా అనుభవం కానిది రాదు. స్ట్రక్చర్ ఓ థియరీ మాత్రమే. క్రియేటివిటీ ప్రాక్టీసుని కోరే యాక్టివిటీ. స్ట్రక్చర్ అస్థిపంజరమైతే, క్రియేటివిటీ రక్తమాంసాలు. ఈ రెండూ కలిస్తేనే స్క్రీన్ ప్లే. ఉత్త స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే కాదు, ఉత్త క్రియేటివిటీ స్క్రీన్ ప్లే కాదు.

        సినిమాలు స్ట్రక్చర్ లో లేకుండా ఫ్లాపవడం వల్లే గుర్తు చేయడానికి స్ట్రక్చర్ గురించి రాయాల్సి వస్తోంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పుస్తకాల్లో, వీడియోల్లో క్రియేటివిటీ గురించి చెప్పరు. ఇంగ్లీషులో వచ్చే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పుస్తకాలని, వీడియోల్నీ యథా తధంగా తెలుగులోకి దింపేసి చెలామణీ చేయడం కూడా భావ్యం కాదు. మన సినిమాల కథా కథనాలు వేరు. హాలీవుడ్ పుస్తకాల్లోని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని మన నేటివిటీకి కస్టమైజ్ చేసుకుంటేనే, అది నిజమైన మన స్క్రీన్ ప్లే అవుతుంది.

Q :   భీమ్లా నాయక్’, అయ్యప్పనుమ్ కోషియమ్ ల గురించి మీరు రాసిన రివ్యూలో వాటిలో  కథకు న్యాయం జరగలేదన్నారు. ఇగోకు, ఆత్మగౌరవానికి మధ్య పోరాటం ఇంకెలాముగియాలంటారు? ఒక అసోసియేట్ గా ఇది తెలుసుకోవడం నా కవసరమని అడుగుతున్నాను. మీరు చెబితేనే బావుంటుందని భావిస్తున్నాను.
కె. రవికాంత్, అసోసియేట్

A :   ఒకరి మీదే ఆధారపడకుండా ఇంకొందర్ని కూడా అడగాలి. అయినా ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాక వీటి గురించి ఈ చర్చ అవసరం లేదు. సెకండాఫ్ కథ కాని కథతో డీజే టిల్లు హిట్టయ్యాక దాన్ని కూడా విశ్లేషించ లేదు. ఈ సినిమాల చుట్టూ ఏర్పడిన మూడ్ ని దృష్టిలో పెట్టుకుని వీటిని అలా వదిలేయడమే మంచిది. ఆత్మగౌరవం - ఇగో అనే సైకలాజికల్ పాయింటుకి ది గ్రీన్ మైల్’, జో సమ్ బడీ అనే హాలీవుడ్ సినిమాలు, ది ఇన్సల్ట్ అనే లెబనాన్ మూవీ చూసి ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు.

Q :  ఈ మధ్య రెగ్యులర్ గా రివ్యూలు ఇస్తున్నందుకు సంతోషం. నాకు వలిమై చూస్తే నవ్వొచ్చింది. ఫస్టాఫ్ కి, సెకండాఫ్ కి కథ పోలికే లేదు. తెలుగులో ఫ్లాపయ్యింది. కథల్ని అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఎందుకు తీయడం లేదు. ఇంత భారీ బడ్జెట్ తో ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు?
—బిజిఎస్. రావు, రచయిత

A :  దర్శకుడి కథ ఎన్నో రకాలుగా మారిపోతూంటుంది. మార్చేసిన వాళ్ళు కనపడరు. అది మీదేసుకుని దర్శకుడే విలన్లా కనబడతాడు మనకి. వలిమై దర్శకుడి ఎన్ని ఇంటర్వ్యూలు చదివినా అతను కథలో మార్పుల గురించి మాట్లాడలేదు. తెరవెనుక ఏమేం జరిగాయో మనకి తెలీదు. అపహాస్యపు కథకి అట్టహాసపు బడ్జెట్ ఏ లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రకారం జరిగిందో విశ్వానికే తెలియాలి. ఇంకో వైపు ఒక కొత్తవాడు ఎంతో మంచి స్క్రిప్టు పట్టుకుని కోటి రూపాయల బడ్జెట్ కోసం తిరుగుతున్నా విశ్వం కనికరించదు. అసలు విశ్వం తానేమిటో తెలుసుకోవడానికి మనమే ఒక మార్గమని సైంటిస్టు కార్ల్ సాగన్ అంటాడు. కాబట్టి బడ్జెట్లు, రిస్కులు టాపిక్ పక్కన పెడదాం.

        వలిమై లాంటి హైపర్ యాక్షన్ తీయాలంటే దాని కాన్సెప్ట్ లేదా ఐడియా, మార్కెట్ యాస్పెక్ట్ చూసుకుని, ఆ తర్వాతే వీటిని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ చూసుకోవాలి. ఒక విలన్ నిరుద్యోగుల్ని బానిసలుగా చేసుకుని, వాళ్ళతో నేరాలు చేయిస్తూ సామాజిక బెడదగా మారడమనే కాన్సెప్ట్- యూత్ అప్పీల్ తో మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న కొత్త కథ. యూత్ అప్పీల్ లేకుండా ఏ సినిమా నిలబడదు. ఇలాటి కాన్సెప్ట్ ని సెకండాఫ్ లో నిరుద్యోగుల్ని పక్కన బెట్టేసి, హీరో కుటుంబ కథగా, హీరో తమ్ముడే విలన్ తో చేతులు కలిపే, అరిగిపోయిన పాత టెంప్లెట్ కథగా మార్చెయ్యడంతో- ఫస్టాఫ్ లోని కాన్సెప్ట్, మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ అన్నీ గల్లంతయ్యాయి. కుటుంబాన్ని కాపాడుకుని చివరి సీన్లో హీరో, ఆ దారితప్పిన నిరుద్యోగులకి ఓ లెక్చరిచ్చి ముగిస్తే, దారి తప్పిన నిరుద్యోగుల మీద కథైపోయింది! ఆ నిరుద్యోగులే హీరోకి సమస్యైపోయి, హీరో నిరుద్యోగులూ సంఘర్షించుకునే యాక్షన్ స్టోరీని క్రియేటివ్ యాస్పెక్ట్ డిమాండ్ చేస్తూంటే, ఇంకేదో కథ చూపించారు.

—సికిందర్