రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

505 : రివ్యూ



రచన -  ర్శత్వంపూరీ న్నాథ్
తారాగణం :  నందమూరి బాలకృష్ణ, శ్రియాశన్, ముస్కాన్, కైరా త్, పృథ్వీరాజ్, బీర్ బేడీ, విక్రమ్ జీత్, అలీ దితరులు
సంగీతం
అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం  ముఖేష్‌. జి
బ్యాన
ర్ : వ్య క్రియేషన్స్, నిర్మాత వి.ఆనంద ప్రసాద్
విడుదల : సెప్టెంబర్ 1, 2017
***
          బాలకృష్ణ @ 101 వ సినిమా, పూరీజగన్నాథ్ @  4 వరస ఫ్లాపులూ కలిసి  ‘పైసా వసూల్’ అనే మేన్షన్ హౌస్ మేనియా క్రియేట్ చేయబూనుకున్నారు. రోష పౌరుషాలతో సింహా, లెజెండ్, శాతకర్ణిలతో  సీరియస్ బాలకృష్ణనే చూస్తూ వచ్చిన ప్రేక్షకులకి, అభిమానులకి,  ఈ సారి ‘బుడ్డా హోగా తేరా బాప్’ బాలయ్యగా చూపించాలనుకుని పూరీ జగన్నాథ్ అలవాటుగా తన బ్యాంకాక్  బీచి కథల సంపుటిని ఆశ్రయించారు. బాలయ్య చేత ‘నాకు మేన్షన్ హౌస్ తప్ప ఏమీ తెలీదు’ అని బ్రహ్మాండంగా అన్పించారు. బాక్సాఫీసు మేనియా సృష్టించడానికి బాలయ్యని తేడాసింగ్ గా చూపించారు. మరి తను ఎంత తేడాగల విషయం అందించారు పూరీ? విషయం లేకుండా బాలయ్య మాత్రమే తేడాగా వుంటే సరిపోతుందా? ఒకసారి చూద్దాం...

కథ 
        పోర్చుగల్ లో వుండే బాబ్ మార్లే అనే మాఫియా, తన తమ్ముణ్ణి ఇండియన్ పోలీసులు చంపారని ఇండియాలో పోలీసుల్ని చంపించడం మొదలెడతాడు. ఇతణ్ణి పట్టుకోవడానికి ఇండియన్ గూఢచార సంస్థ ‘రా’ కి రాజకీయాలు అడ్డుపడుతూంటాయి. అందుకని చట్టానికి వెలుపల కిరాయి నేరస్థుల చేత బాబ్ మార్లేని చంపించాలని  నిర్ణయిస్తాడు  ‘రా’ చీఫ్ (కబీర్ బేడీ).

          తేడా సింగ్ (బాలకృష్ణ)  అనే రఫ్ క్యారక్టర్ కి  నిహారిక (ముస్కాన్) అనే అమ్మాయి నచ్చి ఆమె వెంట పడుతూంటాడు. ఆమె పోర్చుగల్ లో కన్పించకుండా పోయిన తన అక్క సారిక గురించి ప్రయత్నాలు చేస్తూంటుంది. ఆమెకో తల్లి కూడా వుంటుంది. ఆమెని కూడా చంపడానికి బాబ్ మార్లో ప్రయత్నిస్తూంటాడు. తేడా సింగ్ కాపాడుతూంటాడు. ఒకపోలీస్ ఆఫీసర్ (కైరా దత్) తేడా సింగ్ ని ట్రాక్ చేస్తూంటుంది. బాబ్ మార్లే ని అంతం చేయడానికి ఇతనే కరెక్ట్ అని ‘రా’ చీఫ్ కి చెప్పి, తేడా సింగ్ ని లోకల్ మార్లే గ్యాంగులో కోవర్టుగా చేరేలా చేస్తుంది. ఇంతలో తన అక్కని చంపింది తేడా సింగేనని హారికకి తెలిసి అతణ్ణి షూట్ చేస్తుంది. తేడా సింగ్ పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోతాడు సారిక హత్యానేరం మీద పడి.  అప్పుడసలేం జరిగిందో గతం చెప్పుకొస్తాడు తేడా సింగ్.

          సారిక ఎవరు? పోర్చుగల్ కి ఎందుకెళ్ళింది? అక్కడెలా చనిపోయింది?  పోర్చుగల్ లో తేడా సింగ్ తో ఆమెకి సంబంధమేమిటి? మధ్యలో బాబ్ మార్లే ఎలా వచ్చాడు? ...మొదలైన సందేహాలకి సమాధానం కోసం సెకండాఫ్ చూడాలి.

ఎలావుంది కథ?
         అదే పూరీ మార్కు బ్యాంకాక్ బీచి కథ. అవే మాఫియా పాత్రలు, అదే కోవర్టు హీరో, మాఫియాలతో ప్రమాదంలో పడే అదే హీరోయిన్ వగైరా. ఆయనకి  ఇలాటి అవాస్తవిక మాఫియా కథలు తప్ప ఇంకోటి సాధ్యం కాదేమో. కథలో పాయింటు కాని  దేశభక్తి డైలాగులు కొన్ని రాస్తే తేడాగల కథ అయిపోతుందేమో? కథే లేకుండా స్టార్లతో సినిమాలు తీసే అదృష్టం తనకే దక్కింది. ముంబాయిలో మాఫియాల పని ఎప్పుడో అయిపోయిందని హిందీ దర్శకులు యూపీ, బీహార్ ల మీద పడి అక్కడి ముఠాల కథలు తీస్తున్నారు. పూరీ ఇంకా మాఫియాల దగ్గరే వున్నారు. ఇంకా వుంటారు, ఇలాగే  వుండిపోతారు. 


ఎవరెలా చేశారు
      తేడా సింగ్ గా బాలకృష్ణ చాలా జోష్ తో నటించారు. వయసుని  మర్చిపోయి వూగిపోయారు. తెరని  ఎక్కడికక్కడ చించేశారు. సీరియస్ గా వుంటూనే తెగ కామెడీ చేశారు. ఎడా పెడా డైలాగులు కొట్టి, ఫన్నీగా ఫేసు పెట్టి  ఘోల్లున నవ్వించారు. పాటలతో హుషారెక్కించారు, పోరాటాలతో ఉర్రూతలూగించారు. తన ఈ హంగామా అంతా  చూసి యంగ్ హీరోలు పారిపోయేలా చేశారు. తన ఫ్యాన్స్ కీ, మాస్ కీ కడుపు నిండా విందు భోజనం పెట్టారు – ‘పది మందికి పెట్టినా, నల్గురిని కొట్టినా నేనే’  డైలాగుతో కలుపుకుని. 

            అయితే పాత్ర, దానికి తగ్గ యాక్షన్ వుంటే సరిపోతుందా? కథ? కథ సంగతేమిటి? కథ లేకపోతే  పాత్రతో మాన్షన్ హౌస్ కిక్కు వస్తుందా?  పూరీ మార్కు ఈడియాటిక్ హీరో పాత్ర తనకి నచ్చి వుండొచ్చు. కానీ ఇతర దర్శకుల సినిమాల్లో నటించడం వేరు, పూరీ సినిమాలో నటించడం వేరు. పూరీ సినిమాలకి మహిళా ప్రేక్షకులు వుండరు. అలాటిది మహిళాలోకం మద్దతుగల తను బాలయ్య పూరీ సినిమాలో నటించడం రిస్కే అయినప్పుడు – దాంట్లో కాస్త కథ వుండేలా చూసుకుని, అది హోమ్లీగా వుండేట్టు జాగ్రత్తపడి వుండాల్సింది. పూరీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ నయం. అందులో కథ వుంది, హోమ్లీగా వుంది. హిట్టయింది. ఇప్పుడు పూరీతో బాలయ్య ఫ్యాన్స్ కీ, మాస్ కీ ఎంత కడుపు నిండినా,  చివరికి వాళ్ళు కూడా వెలితి ఫీలవక తప్పదు. 

          ఇతర నటీనటుల విషయాని కొస్తే శ్రియ సహా ముస్కాన్, కైరా దత్, కబీర్ బేడీ, విక్రం జిత్ వగైరా యంత్రికంగానే కన్పిస్తారు. ఈ ఫార్ములా నటనలు చూసి  చూసి వున్నవే. అలీ రెండు సీన్లలో ఎందుకున్నాడో తెలీదు. కాస్సేపు కన్పించే విలన్ లాయర్ గా పృథ్వీది  సీరియస్ పాత్ర. 

          అనూప్ సంగీతంలో గోలిసోడా, జీవిత చక్రం రీమిక్స్ పాట, మామా యేక్ పెగ్ లావో, పద మరీ పాటలు నాల్గూ బావున్నా,  కథే లేని విపరీత యాక్షన్ గందరగోళంలో గల్లంతైపోయాయి. కొన్ని చోట్ల అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బావుంది. ముఖేష్ ఛా యాగ్రహణం మరీ అద్భుతంగా ఏమీ లేదు. గత పూరీ ‘రోగ్’  లో వున్న క్వాలిటీ లేదు. పోర్చుగల్ లో తీసిన ఛేజింగ్ ఎపిసోడ్ బావుంది. 

చివరికేమిటి 
      పూరీ తను మారకుండా స్టార్స్ ని ఎంత తేడాగా చూపించీ ప్రయోజనంలేదు. తేడా గల పూరీ వుంటే స్టార్లు తేడాగానూ నటించనవసరం లేదు. అవే మాఫియా కథల్ని తేడా లేకుండా అదే టెంప్లెట్  స్క్రీన్ ప్లేతో అలాగే  చూపించే అలసత్వం తనకిక ఎంత మాత్రమూ తగదు. అడ్డగోలు పాత్ర చిత్రణల్ని యాక్షన్ హంగామాతో కప్పిపుచ్చలేరు. తేడా సింగ్ ‘రా’ ఏజెంట్ అయినప్పుడు టాక్సీ డ్రైవరుగా పోర్చుగల్ లో వుంటూ ఏం చేస్తున్నట్టు? మాఫియాని ఎక్స్ పోజ్ చేయడానికి వచ్చేజర్నలిస్టు సారిక పాత్రకి వున్న లక్ష్యం తేడా సింగ్ కి ఎందుకు లేదు? జర్నలిస్టు ఏదో వీడియో తీస్తూ దొరికిపోవడం, ఆమెని  చంపడానికి విలన్లు వెంట పడ్డం పూరీ ఇంకా కొత్త అనుకుంటున్నారా ప్రేక్షకులకి? తేడా సింగ్ ని ప్రేమించిన జర్నలిస్టు సారిక, తేడా సింగ్ ని కాపాడుతూ తను చచ్చి పోతే, తేడా సింగ్ అలియాస్ బాలా,  ఆమె చెల్లెలికి లైనేస్తూ వెంట పడ్డం కరెక్టేనా? పైగా ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాకులతో అర్ధంజేసుకోవడానికి కష్టంగా లేదా? కథే లేనప్పుడు తడవకో ఫ్లాష్ బ్యాకుతో గందరగోళం చేయడమెందుకు? ఏం చేసినా అది తన రొటీన్ టెంప్లెట్టేగా?

          మొత్తం సినిమాలో మెచ్చుతునక అనుకోవాల్సింది ఒకే ఒక్కటి. క్లయిమాక్స్ ఫైట్ లేకుండా, అదంతా ముందే ముగిసిపోయి విలన్ చచ్చిపోయాడని ఫ్లాష్ బ్యాక్ గా చూపించడం. దీంతో హీరో - విలన్ కొట్టుకునే రొటీన్ ముగింపు బాధ తప్పింది. ఇలాటి చమత్కారాలు  చేయవచ్చు పూరీ. కానీ ఎంత సేపూ మాఫియా సినిమాలతో కాదు.

-సికిందర్
cinemabazaar.in