రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, జనవరి 2018, మంగళవారం

589 : స్ట్రక్చర్ సంగతులు!

స్ట్రక్చర్ తోనే ఏ సంగతులైనా. స్ట్రక్చర్ లేని సంగతులకి నిలకడ లేదు. ‘రంగుల రాట్నం’ లోనైతే ఇద్దరు పడతుల కథ హీరోహీరోయిన్ల ప్రేమకథై పోయి, ‘సైజ్ జీరో’ లో బరువు తగ్గే సమస్య కథ కాస్తా క్లినిక్ చేసే మోసాల కథై పోయి,  ‘కిక్ -2’ లో ఇప్పుడు చెప్పాల్సిన సంగతులు ఇంకెప్పుడో చెబితే తేలిపోయి, హిందీ ‘ఆరక్షణ్’ లో రిజర్వేషన్ల సమస్య కాస్తా కార్పొరేట్ కాలేజీల దోపిడీ కథగా మారిపోయి – మొదలెట్టిన కథలే ఇంకో కథగా మారిపోయి అభాసు అవుతాయి. స్ట్రక్చర్ లో పోయని సంగతులు నేలపాలవుతాయి. తొట్టిలో పోస్తేనే నీళ్ళు మంచు అవుతాయి. అంచుల్లేని పళ్ళెంలో పోసిన నీరు పల్లం చూసుకుని జారుకుంటాయి. విచిత్రమేమిటంటే,  ఈ స్ట్రక్చర్ అంటేనే  లోకల్ గా ఎలర్జీ. అర్ధంగాక లోకల్ ఎలర్జీ. దీంతో క్రియేటివిటీ పట్టుకుని లేనిపోని లోకల్ ఏనర్జీ వృధాలు. స్ట్రక్చర్ అర్ధం గాకుండానే మేకింగులు. ది మేకింగ్ ఆఫ్ ఫలానా ‘కండల వీరుడు’ అని షూటింగ్ ప్రాసెస్ యూ ట్యూబ్ లో, ఛానెల్స్ లో చూపించినట్టు, ది రైటింగ్ ఆఫ్ ఫలానా ‘బండల వీరుడు’ అని రైటింగ్ ప్రాసెస్ రాసి విజ్ఞానాన్ని నల్గురితో పంచుకోవడం లోకల్ మర్యాద కాదు. కాపీ కొట్టడానికి దొరికే హాలీవుడ్ సినిమాల వెనుక  స్ట్రక్చర్ సంగతి అసలే తెలుసుకునే పాపాన పోవడం లోకల్ లక్షణమూ కాదు. ఏ  శాశ్వత స్ట్రక్చర్ ని పాటిస్తే ఆ హాలీవుడ్ సినిమా అలా వచ్చిందో అర్ధంజేసుకోవడం లోకల్ ఇగోకి ఇష్టముండదు. దేని అంతర్నిర్మాణం, అంతరార్ధం తెలుసుకో కుండానే పైపైన  ఉపరితలాల విహంగ వీక్షణాలు  చేసేసి అలా అలా దించెయ్యడమే లోకల్ హైబ్రిడ్ సాగుబడి. కాఫీ తయారు చేయలన్నా దానికో స్ట్రక్చర్ వుంటుంది. స్ట్రక్చర్ తెలియకపోయినా కాఫీ కాచెయ్యడం లోకల్ టేస్టు. స్ట్రక్చర్ తెలియకపోయినా అంతటి  హాలీవుడ్  సినిమాల్ని కాపీ కొట్టేయడం లోకల్ టాలెంట్. హాలీవుడ్ సినిమాల మనుగడకి  ప్రేక్షకుల్ని సూదంటు రాయిలా ఆకర్షించడానికి, ఆయా కాలాల్ని బట్టి స్ట్రక్చర్ ని ఎలాగెలా వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకోవడం లోకల్ ఫ్యాషన్. ఇలా మొత్తం లోకలైజుడు లేబర్ క్లాస్ యాక్టివిటీ. కళకి సంహార పథకం. హాలీవుడ్ వాళ్ళు మొట్ట మొదట అరిస్టాటిల్ నాటక శాస్త్రం లోంచి వాలు కుర్చీ లాంటి త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని సినిమాలకి తయారు చేసుకున్నారు. తర్వాత వాలు కుర్చీ కాదని  అదే తాము కనిపెట్టిన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణాల సూత్రాలతో  సినిమాలకి మెత్తని సోఫాలుగా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత మెత్తని సోఫాలు  కూడా కాదనుకుని అదే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని సిడ్ ఫీల్డ్ లోంచి తీసుకుని ఎగ్జిక్యూటివ్ చైర్ లాగా ఆధునికంగా రూపొందించుకున్నారు. ఎటొచ్చీ హాలీవుడ్ తయారు చేసుకుంటూ వస్తున్న ఆసనాలకి నాలుగు కాళ్ళంటూ వుంటూ వస్తున్నాయి. నాల్గు కాళ్ళుంటేనే ఆసనం. ఇది మారని యూనివర్సల్ స్ట్రక్చర్. మూడు కాళ్ళ కుర్చీ తయారు చేయమంటే వడ్రంగి ఛీకొట్టి వెళ్లి పోతాడు. మిడిల్ తీసేసి స్టోరీ రాయమంటే టాలీవుడ్ రైటర్ ఏంచక్కా రాస్తూ కూర్చుంటాడు. టాలీవుడ్ కాపీ కొట్టడానికి పట్టే హాలీవుడ్ కుందేటికి మూడే కాళ్ళు. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళని గట్టి విశ్వాసం. ఆ కుందేలే ముద్దు. నాల్గు కాళ్ళ కుర్చీ తెలీదు కాబట్టి మూడు కాళ్ళ కుందేలే యమ ముద్దు. కానీ కుందేటి కైనా నాలుగు కాళ్ళూ దివ్యంగా వుంటాయి. అది దాని యూనివర్సల్ స్ట్రక్చర్. అయినా స్ట్రక్చర్ అంటే ఎలర్జీ కాబట్టి నమ్మే ఆ మూడు కాళ్ళ కుందేటితో అవే సినిమాల సంగతులు. ఆ సంగతులన్నీ 90 శాతం ఫ్లాపుల కూపంలో ఆల్ టైం సూపర్ హిట్ క్లాసిక్ శోకాలవుతాయి పారంపర్యంగా. 

ళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం : కేవలం సంగతులతో కమర్షియల్ సినిమా కథ లేదా స్క్రీన్ ప్లే అవదు, ఓ స్ట్రక్చర్ తోనే   సంగతులు కమర్షియల్ సినిమా కథ లేదా స్క్రీన్ ప్లే అ వుతాయి. సంగతులే స్ట్రక్చర్ కాదు, సంగతులు కేవలం క్రియేటివిటీ. క్రియేటివిటీ స్ట్రక్చరూ  ఒకటి కాదు. క్రియేటివిటీ సాఫ్ట్ వేర్, స్ట్రక్చర్ హార్డ్ వేర్. హార్డ్ వేర్ లేకుండా సాఫ్ట్ వేర్ లేదు. స్ట్రక్చర్ ననుసరించి దానిలోపల సర్డుకునేదే  క్రియేటివిటీ. క్రియేటివిటీ యూనివర్సల్ కాదు. పుర్రెకో క్రియేటివ్  బుద్ధి. స్ట్రక్చర్ యూనివర్సల్. ఇక్కడ  పుర్రెకో బుద్ధి పనిచెయ్యదు. స్ట్రక్చర్ తోనే క్రియేటివ్ బుద్ధులకి బుద్ధి. క్రియేటివిటీ స్ట్రక్చర్ కాదు, స్ట్రక్చర్ కి లోబడి వుండే ఆర్టు. స్ట్రక్చర్ రహిత  క్రియేటివిటీ ఆర్ట్ సినిమా, లేక ఇండియన్ షార్ట్ ఫిలిం. స్ట్రక్చర్ సహిత క్రియేటివిటీ కమర్షియల్ సినిమా. ఇది 50 శాతమైనా  హాలీవుడ్ సక్సెస్ రేటుకి అత్యవసరం. ఖర్మ అనుకుని 90 శాతం అట్టర్ ఫ్లాపులతో సంతృప్తి చెందే టాలీవుడ్ కి చాలాచాలా అనవసర వ్యవహారం. నువ్వు 90 కి ఇటే మా హిట్టిస్టుల వైపు వుంటావా, లేక అటు ఫ్లాపిస్టుల వైపు గానీ వుండి పోతావా అని – జార్జి బుష్ స్టయిల్లో స్ట్రక్చర్ గనుక అల్టిమేటం ఇస్తే  – ఎలాగూ ఫోటోల కోసం స్వచ్ఛ భారత్  ఊడ్పులు ఊడ్వడం అదీ అయిపోయింది కదా,  ఏదోఇలా ఫ్లాపులు అవీ ఊడ్చుకుంటూ అటే వుండిపోయి, ఈ పాడు లోకల్ జీవితమిలా గడిపేస్తాం, మాకు 10 శాతం హిట్టుల క్లబ్బులో చేరి,  టాలీవుడ్ 90 ని  హాలీవుడ్ 50 గా చేసే మాయమంత్రాలెందుకు లెండని, వింజామర లూపుకుంటూ వినమ్ర  విన్నపాలు.
***

ఇంతకీ కేవలం క్రియేటివిటీతో స్క్రీన్ ప్లే ఎందుకు తయారు కాదు?  క్రియేటివిటీతో కథ వూహించలేం కాబట్టి - స్ట్రక్చర్ తోనే వూహించగలం కాబట్టి తయారుకాదు. మళ్ళీ వందోసారి ఈ బ్లాగులో చెప్పుకుంటూ వస్తున్నదే చెప్పుకుందాం. ఎందుకంటే ఇది పునశ్చరణ చేసుకోకపోతే  ‘స్ట్రక్చర్ తో ఎన్ని సంగతులు?’ అన్న టాపిక్  సరీగ్గా అర్ధం గాదు. బిగినింగ్ - మిడిల్ - ఎండ్ విభాగాలని వాటి 1 : 2 : 1 నిష్పత్తుల నిడివిల ప్రకారం యూనివ ర్సల్ కమర్షియల్ స్ట్రక్చర్ గా విభజించి, ఆయా విభాగాల్లో వాటివైన కార్యకలాపాల్ని(బిజినెస్ లని) నింపాలనేది నియమమం. 1. స్ట్రక్చర్ లో పావు వంతు సీన్లతో వుండే బిగినింగ్ విభాగం బిజినెస్ : కథా నేపథ్యాన్ని పాత్రల పరిచయాలతో చూపించుకొస్తూ, పాత్రల మధ్య సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, చివర సమస్యని స్థాపించడం, ప్రధానపాత్రకి ఆ సమస్యని సాధించే గోల్ ని అప్పగించడం. 

          2. కథలో సగభాగం సీన్లతో వుండే మిడిల్  విభాగం బిజినెస్ : ప్రధాన పాత్ర గోల్ కోసం ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షించడాన్ని గెలుపోటముల క్రీడగా ఉద్రిక్తత పెంచుకుంటూ చూపించుకొస్తూ, ప్రధాన పాత్ర పైచేయి సాధించే పరిష్కార మార్గాన్ని రివీల్ చేయడం. 



          3. కథలో మిగతా పావు వంతు వుండే సీన్లతో ఎండ్ విభాగం బిజినెస్ : దొరికిన ఆ పరిష్కార మార్గంతో ప్రత్యర్ధి మీద ప్రధాన పాత్ర పూర్తి గెలుపు సాధించి,  గోల్ కి చేరుకోవడం.


          పై స్ట్రక్చర్ లో బిగినింగ్ ముగింపులో,  గోల్ ఏర్పాటు కావడం ప్లాట్ పాయింట్ వన్ అనే ఘట్టమైతే, మిడిల్ ముగింపులో ఆ గోల్ సాధించడానికి దొరికే పరిష్కార మార్గం ప్లాట్ పాయింట్ టూ ఘట్టం.
 


            ఇదీ స్ట్రక్చర్. ఇది మారదు. అరిస్టాటిల్ అయినా అప్పల్రాజు అయినా దీంట్లో కుదురుకోవా
ల్సిందే తప్ప, దీన్ని కుదిపితే పతనమైపోతారు. బస్సు నడుపుతూ స్టీరింగ్ వీల్ పీకి పారేస్తే ఏమవుతుందో అదే అవుతుంది. స్టీరింగ్ వీల్ స్ట్రక్చర్ లో ఒక భాగం. ఎవరో చెప్పే ఈ స్ట్రక్చర్ భాగాలు నాకనవసరమనీ, నా క్రియేటివిటీ నాకుందనీ, ఆ స్టీరింగ్ పీకి అవతలపారేసి వొట్టి  చేతులతో బస్సు నడుపుతానంటే  ఎలా వుంటుందో, స్ట్రక్చర్ స్పేర్ పార్టులు పీకేసిన స్క్రీన్ ప్లే తో మూవీ కూడా అలాగే వుంటుంది – నేరుగా వెళ్లి మ్యాట్నీ కల్లా మూసీలో వుంటుంది – అవతల అంబర్ పేట ప్లాంటులో రివ్యూ రైటర్ల చేత శుద్ధి చేయించుకోవడానికి. శుద్ధి చేసి వదిలినా అవతల సూర్యాపేట కొచ్చేసరికి ప్రేక్షకుల్లేక ఎండిపోయి వుంటుంది మూసీ మూవీ.

         ఈ స్ట్రక్చర్ లోపల ఆయా విభాగాల బిజినెస్సులతో కూడిన సీన్లని ఎలా రూపొందించుకుంటారో అది మాత్రమే  పర్సనల్ గా చేసుకునే  క్రియేటివిటీ, అంతే. ఇంతే తప్ప క్రియేటివిటీకి ఏ నియమాలూ కొలమానాలూ లేవు దబాయించి పని గడుపుకోవడానికి. యూనివర్సల్ స్ట్రక్చర్ లో ఏర్పాటైన ఆయా విభాగాల బిజినెస్సుల్ని నిర్వహించుకోవడం వరకే క్రియేటివిటీ పని. కాకుండా, ఈ సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనేమిటి, అది నేను చెయ్యను గాక చెయ్యను, నా క్రియేటివిటీయే డిఫరెంటు అనుకుంటే  మూర్ఖత్వమవుతుంది.  సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన అనేది క్రియేటివిటీ పరిధిలోది కాదు, అది సమంజసమైన కమర్షియల్ కథకి యూనివర్సల్ స్ట్రక్చర్ లో ఒక   స్పేర్ పార్టు. స్పేర్ పార్టులకి వినాశం లేదు. అరిస్టాటిల్ కైనా ఇవే స్పేర్ పార్టులు, అప్పల్రాజుకైనా ఇవే స్పేర్ పార్టులు. వీటి జోలికిపోతే ఇక కమర్షియల్ కథ గురించి మర్చిపోవాలి, ఆర్ట్ సినిమాలు – లేదా మల్టీ ప్లెక్స్ సినిమాలు, ఇంకా లేదా ఇండీ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలి – అంతగా  క్రియేటివిటీ కువకువ లాడుతూంటే. లేదా యూరప్ వెళ్లి వరల్డ్ మూవీస్ తీసుకోవాలి.  ఎక్కువ ఇవి తీసి, ఎక్కువ ఇవి చూస్తే వున్న కమర్షియల్ మతులు పోతాయి. కమర్షియల్ ప్రక్రియకివి తోకలే తప్ప నెమలి పింఛాలు కావు. 

          ‘రంగులరాట్నం’ లో ఇదే జరిగింది : సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకురాకుండా హఠాత్తుగా మొదటి ప్రధాన పాత్ర అయిన మదర్ ని  చంపిపారేసి, సమస్య (ప్లాట్ పాయింట్ వన్)  ఏర్పాటు చేశారు. ఇలా చేస్తే గోల్ ఏర్పడాల్సిన రెండో ప్రధాన పాత్ర అయిన హీరోయిన్ కి ఈ చావుతో  సంబంధం లేకపోయి, ప్రతినాయకిగా మారిపోయింది! ఈ అడ్డం తిరిగిన కథలో హీరోకి సహజంగానే  గోల్ లేకుండా పోయింది. ఇదన్నమాట. ఇలా స్ట్రక్చర్ ని గల్లంతు చేసి, ఇది  నా క్రియేటివిటీ,  ఇలాగే తీస్తాననుకుంటే తీశాక తెరమీద తెలుస్తుంది ఆ డొల్లతనం. కనుక సమస్య కి దారితీసే  పరిస్థుల కల్పన అనే స్ట్రక్చరల్  బేస్ ని క్రియేటివిటీ పేరుతో తీసేయడానికి గానీ, మార్చేయడానికి గానీ వీలు పడదు. 

          అలాగే మిడిల్ బిజినెస్ లో సమస్యతో వుండే సంఘర్షణ అనే స్పేర్ పార్టుని  తీసేసి, దాన్ని క్లయిమాక్స్ లో కాసేపే పెట్టుకుందామనుకుంటే అదింకో వినాశక క్రియేటివ్ బుద్ధి. సమస్యకి పరిష్కార మార్గం చూపే ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ పరిష్కార మార్గమేదో ప్రధానపాత్రకి అందించి యాక్టివేట్ చేయకపోయినా,  ఇంకో మిడిల్ స్పేర్ పార్టుని  పీకెయ్యడమే. 
కాబట్టి  స్ట్రక్చర్, దానిలోపల బిజినెస్సులు, వాటి స్పేర్ పార్టులూ  ముందు బాగా తెలుసుకున్న తర్వాతే కమర్షియల్ స్క్రీన్ ప్లేని  చేపట్టాల్సి వుంటుంది. ఈ స్ట్రక్చర్ శాశ్వతం. బిగినింగ్, మిడిల్, ఎండ్ వరసక్రమంలో సర్వసాధారణంగా కథలుంటాయి. ఈ వరస క్రమాన్నే స్ట్రక్చర్ అంటారు. కొన్ని కథలు వరస క్రమం మారి వుంటాయి. అంటే మిడిల్ తో మొదలై, బిగినింగ్ తో నడిచి, మళ్ళీ మిడిల్ కొచ్చి, ఎండ్ కి వెళతాయి. అంటే  ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో కథ చెప్పడమన్నమాట. ఇది స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ని ప్లే తో కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ప్లే అనేది స్ట్రక్చర్ లోపల చేసుకునే క్రియేటివ్ సంగతులు. పైన చెప్పుకున్న ఫ్లాష్ బ్యాక్ పధ్ధతి కథ కూడా స్ట్రక్చర్ లో వరసక్రమంలో వుండే విభాగాల్ని అటూ ఇటూ మార్చి ప్లే చేసుకునే క్రియేటివిటీయే. కాబట్టి ఇప్పుడు స్ట్రక్చర్ కీ,  క్రియేటివిటీ కి తేడా మనకి బాగా తెలిసింది. మిడిల్ – బిగినింగ్ – ఎండ్ అనే అపక్రమ వరసలో ప్లే స్ట్రక్చర్ అవదు. స్ట్రక్చర్ ఎప్పుడు బిగినింగ్ –మిడిల్ - ఎండ్ – ABC అనే వరస క్రమంలోనే వుంటుంది. ఈ వరస క్రమాన్ని అటూ ఇటూ మార్చుకోవడం క్రియేటివ్  ప్లే నే (సంగతులే) తప్ప స్ట్రక్చర్ కాదు. ఫ్లాష్ బ్యాక్ ( BAC) ప్రక్రియతో కథని ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్ అనకూడదు. అది క్రియేటివ్ ప్లే ఇలాటి క్రియేటివ్ ప్లేలు మొత్తం తొమ్మిది  వున్నాయి.  అవన్నీ స్ట్రక్చర్లు కావు. ఒకే యూనివర్సల్ శాశ్వత స్ట్రక్చర్ కి అవి రకరకాల క్రియేటివ్ ప్లేలు మాత్రమే. 

        కాబట్టి ABC ని మాత్రమే స్ట్రక్చర్ అని బాగా గుర్తుపెట్టుకోవాలి. BAC, CAB, ACB... ఇవన్నీ స్ట్రక్చర్ తో రకరకాల క్రియేటివ్ ప్లేలు. అయితే స్ట్రక్చర్ లో ABC లని ఎలా ప్లే చేసినా, ఆ మొత్తం ప్లేలో స్థానాలు మారిన ABC ల్లో వాటివైన అవే నిష్పత్తులు, వాటివైన అవే బిజినెస్సులు, వాటివైన అవే  స్పేర్ పార్టులు, రెండు పాయింటులూ కనబడాలి. ఎన్ని రకాలుగా ప్లే చేసినా, ఈ మౌలిక స్ట్రక్చర్ తప్పిపోకుండా వుండాలంటే, ఒకటే పధ్ధతి : మొట్టమొదట   కథని ABC క్రమంలోనే  స్ట్రక్చర్ లో పక్కగా రాసుకుని,   ఆతర్వాత ఆ రాసుకున్న ABC లని ఎలా కావాలంటే అలా స్థానాలు మార్చుకోవడం.

          కాబట్టి స్ట్రక్చర్ అనేది ఒక్కటే, దాని రూపాలు తొమ్మిది. తనతో కలుపుకుని మొత్తం పది రకాలు. అసలు స్ట్రక్చర్ ఎలా వుంటుందో పైన బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అనే శాశ్వత చిత్రపటంలో తెలుసుకున్నాక, దీని రూపాలు ఒకటొకటి చూసుకుంటే – 1. నాన్ లీనియర్, 2. రియల్ టైం, 3. మల్టిపుల్ టైం లైన్, 4. హైపర్ లింక్, 5. ఫేబులా, 6. రివర్స్ క్రోనాలజీ, 7. రోషోమన్, 8. సర్క్యులర్, 9. ఒనీరిక్ మొదలైన  స్ట్రక్చర్ తో క్రియేటివ్ ప్లేలున్నాయి. 

          వీటిని నేర్చుకోవాలంటే తెలుగు హిందీ సినిమాలుకాక హాలీవుడ్ సినిమాలని ఉదాహరణగా తీసుకోవాలి. తెలుగు హిందీ సినిమాల్లో సూటి కథా  దాని ఫ్లో వుండవు. అనేక సబ్ ప్లాట్లు, కామెడీ ట్రాకులూ, పాటలూ వగైరా అడ్డొస్తూంటాయి. హాలీవుడ్ సినిమాలతో ఈ సమస్య వుండదు పైన చెప్పుకున్న క్రియేటివ్ ప్లేలు పరిశీలించుకోవడానికి.  అయితే క్రియేటివ్ ప్లే ల పిల్లల తల్లి అయిన స్ట్రక్చర్ కొచ్చేసి, తెలుగు ‘శివ’ ని చూసుకుంటే తెలుగులోనే చక్కగా మొత్తం  అర్ధమవుతుంది స్ట్రక్చర్ అంటే ఏమిటో. ఇందులో పాటలు తప్ప, కథకి అడ్డుపడే వేరే ట్రాకులు వుండవు. ఈ బ్లాగులోనే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  పేరుతో  ‘శివ’ నే నమూనాగా (శివ = సిడ్ ఫీల్డ్) తీసుకుని రాసిన 18 వ్యాసాలున్నాయి. ఇవి బ్లాగులో సెర్చ్ చేయడం తలనొప్పి కావొచ్చు. కొద్ది రోజులాగితే ఈ సమస్య తీరుతుంది. పుస్తకంగా తీసుకురావాలని కోరుతున్నారు. పుస్తకాలేయడం ఈ వ్యాసకర్తకి వంద పనుల్లో ఒకటి, అవి తర్వాత ఫాలో అవుతాయి - లేకపోతే లేదు. కానీ అర్జెన్సీ వున్న వాళ్ళు బ్లాగులోంచి అవసరమైనవి తీసి బైండింగులు చేయించుకుంటున్నారు.  ప్రస్తుతాని కివన్నీ జాతీయం.

          ‘శివ’ తో బాటు స్ట్రక్చర్ కి హాలీవుడ్ నుంచి, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, ఫ్యుజిటివ్, డై హార్డ్, విట్నెస్, స్టార్ వార్స్  మొదలైనవి చూసుకోవచ్చు.

 (రేపు : తొమ్మిది క్రియేటివ్ సంగతులు )


సికిందర్