రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 29, 2024

1425 : రివ్యూ


 

దర్శకత్వం : ఆదిత్యా దత్
తారాగణం : విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహీ, అమీ జాక్సన్, అంకిత్ మోహన్ తదితరులు
రచయితలు : ఆదిత్యా దత్, రెహాన్ ఖాన్, సరీం మోమిన్, మోహిందర్ ప్రతాప్ సింగ్
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, ఛాయాగ్రహణం : మార్క్ హేమిల్టన్
బ్యానర్ : యాక్షన్ హీరో ఫిలిమ్స్
నిర్మాతలు :  విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్
విడుదల : ఏప్రిల్ 26, 2024 (డిస్నీ+ హాట్‌స్టార్)   
***

        హైపర్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కమెండో సూపర్ యాక్షన్ సిరీస్ సినిమాలతో పాపులరయ్యాడు. డూప్ లేకుండా స్వయంగా ప్రమాదకర ఫైట్స్ నటించే విద్యుత్, ఈసారి డోస్ మరింత పెంచుతూ క్రాక్- జీతేగాతో జియేగా (గెలిస్తేనే బ్రతుకుతావ్) అనే స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నటించాడు. దివంగత బాలీవుడ్ గీత రచయిత ఆనంద్ బక్షీ మనవడు ఆదిత్యా దత్ దీనికి దర్శకత్వం వహించాడు. స్పోర్ట్స్ సినిమాలు చాలా వస్తూంటాయి. అయితే వీటికి భిన్నంగా స్పోర్ట్స్ కాని కాల్పనిక స్పోర్ట్స్ కి యాక్షన్ ని జోడించిన విద్యుత్ ప్రయోగం ఫలించిందో లేదో చూద్దాం...  

కథ
ముంబాయి మురికివాడల్లో నివసించే సిద్ధార్థ్ దీక్షిత్ (విద్యుత్ జమ్వాల్) కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ప్రమాదకవిన్యాసాలు చేస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తూంటాడు. కూపే డోర్లోంచి బయటికి వంగి, స్తంభాలని తాకి, పైకి ఎక్కి ఒక  కంపార్ట్ మెంట్ మీంచి  మరో కంపార్ట్ మెంటు మీదికి ఉరుకుతూ తన బ్యాచీ ఫ్రెండ్స్ కి పిచ్చెక్కిస్తూ వుంటాడు. దీంతో వీడొక క్రాక్ అనే పేరొస్తుంది. ఇలా వీడియోలు అప్ లోడ్ చేసి పోలాండ్ లో దేవ్ (అర్జున్ రామ్ పాల్) అనే అతను నిర్వహించే ప్రతిష్టాత్మక మైదాన్ అనే అండర్ వరల్డ్ స్పోర్ట్ ఈవెంట్స్ లో సెలెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తూ వుంటాడు. ప్రయత్నం ఫలించి అతడికి మైదాన్ నుంచి ఆహ్వానం వస్తుంది- ఇంకో 31 దేశాల క్రీడాకారులతో బాటు.
       
పోలండ్ లో మైదాన్ అనే క్రీడా ప్రపంచపు సామ్రాజ్యానికి అధిపతిగా వుండే దేవ్
,
మైదాన్ షోరన్నర్ గా యువతకి రేస్ లు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు బహుమానంగా పంచుతూంటాడు. ఇక్కడ మూడు రేసులుంటాయి. మొదటి రేసు గెలిచిన తర్వాత మైదాన్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఆలియా (నోరా ఫతేహీ) తో ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. మరోవైపు దేవ్ క్రీడల ముసుగులో చట్టవ్యతిరేక కలాపాలు చేస్తున్నాడని పసి గట్టిన పోలీసు అధికారి నోవాక్ (అమీ జాక్సన్) దేవ్ ని పట్టుకోవాలంటే సిద్ధార్థ్ సాయం తీసుకోవాలని భావిస్తుంది. ఈమె ద్వారా సిద్ధార్థ్ కి తన అన్న నిహాల్ దీక్షిత్ (అంకిత్ మోహన్) మరణ రహస్యం తెలుస్తుంది. నాల్గేళ్ళ క్రితం ఇక్కడ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన తన అన్న నిహాల్ మరణం వెనుక దేవ్ హస్తముందని అర్ధమవుతుంది.
       
దీంతో
సిద్ధార్థ్ లక్ష్యం మారుతుంది. ఇక అన్న హత్యకి దేవ్ మీద ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఇక్కడ్నుంచి దర్శకుడి ఇష్టానుసారం ఎలా పడితే అలా సాగుతుంది కథ ...

ఎలావుంది కథ
ఈ కథకి నల్గురు రచయితలు సారధ్యం వహించారు. ఈ కథని పూర్తిగా  మైదాన్ విజేతగా బాగా డబ్బు సంపాదించుకుని ధనవంతుడ్ని అవ్వాలన్న హీరో లక్ష్యం గురించి కాకహీరో అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకునే అవుట్ అండ్ అవుట్ రివెంజీ  డ్రామాగా కూడా గాక, లేదా క్రీడల పట్ల తనకున్న సహజ ప్రవృత్తిని క్యాష్ చేసుకోవడం ద్వారా ప్రసిద్ధి చెందాలన్న హీరో గోల్ గురించి కూడానూ కాక, ఏం చెప్పాలని ఈ కథ రాశారో అర్ధంగాకుండా జేశారు.
       
ఇలాటిదే ఇదే వారం విడుదలైన
రత్నం లో చూశాం. విలన్ బారీ నుంచి హీరోయిన్ని కాపాడే హీరో కథ కాస్తా, గతంలో ఆ విలన్ తన తల్లి మరణానికి కారణమయ్యాడన్న నిజం తెలిశాక  హీరో రివెంజీ కథగా మారిపోవడం. ఇలా చేస్తే -అంటే నడుస్తున్న కథలో ఇంకో పాయింటు లేవనెత్తితే- కథే మారిపోయి సినిమా ఫ్లాపవుతుందనేది చాలా సార్లు చూశాం. ఇలా జరగకుండా హాలీవుడ్ వాళ్ళు ఒక చిట్కా కనిపెట్టారు.
        
ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ (2016) లో కౌబాయ్ డెంజిల్ వాషింగ్టన్, ఓ గ్రామానికి బందిపోటు విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి తన గ్రూపుతో వెళ్ళి పోరాడుతూంటాడు. ఇలా సినిమా సాంతం పోరాడుతూనే  వుంటే, పాత్ర నమ్మశక్యంగా అన్పించదు. తనది కాని ఏదో వూరుని కాపాడే అవసరం తనకెందుకు? ఎందుకో చిట్ట చివర్లో వెల్లడిస్తాడు. ఆ బందిపోటు అయిన విలన్ని చంపుతూ, ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీనా ఇద్దరు చెల్లెళ్ళనీ చంపావ్ గుర్తుందా?’ అంటాడు వాషింగ్టన్. ఎండింగ్ లో ఈ  స్టేట్ మెంటుకి మనం కూడా షాకవుతాం విలన్ తో పాటు.  విలన్ తో వాషింగ్టన్ కి పాతపగ వుందనే విషయం మనకి అప్పటివరకూ తెలియకుండా దాచారు. తెలిస్తే రొటీన్ రివెంజి కథ అని తెలిసిపోయి ఇంటరెస్టు పోయేది.
       
ఇలా చిట్ట చివర్లో వెల్లడించాక
, వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా ఎలివేటయ్యే పాత్ర చిత్రణా పరమైన హంగు చేకూరింది. అంటే తనలో ఇంత బాధని దాచుకుని గ్రామం కోసం పోరాడాడన్న మాట. హీరో అనేవాడి   మొదటి ప్రాధాన్యం లోక కళ్యాణమే తప్ప సొంత లాభం కాబోదు. అందుకని తన పగదీర్చుకోవడానికే గ్రామంకోసం పోరాడినట్టు అన్పించదు. పగ లేకపోతే వచ్చే వాడు కాదనీ కూడా అన్పించదు. పగ గురించే అయితే విలన్ ఎక్కడున్నాడో అక్కడి కెళ్ళి చంపేసి పోవచ్చు. ఇలా కాకుండా స్వకార్యం, స్వామి కార్యం రెండూ చక్కబెట్టదల్చుకున్నాడు. ఇలా కథకి ఏక సూత్రతని కాపాడ్డంతో బాటు, హీరో క్యారక్టర్ ఎలివేషన్ కీ పనికొచ్చేలా ఎండింగ్ స్టేట్ మెంటుగా చేసి తురుపు ముక్కగా ప్రయోగించారు రివెంజీ అనే రొటీన్ ఎలిమెంట్ ని. దీంతో సినిమా ఫ్లాపయ్యే ప్రమాదం తప్పింది. ఈ మూవీ ఇదే టైటిల్ తో 1966 నాటి క్లాసిక్ కి రీమేక్.
       
పోనీ
క్రాక్ లో ధనవంతుడు అవ్వాలని మైదాన్ లో పాల్గొనేందుకు వచ్చిన హీరో- అన్న హత్య గురించి తెలిశాక రివెంజీ మోడ్ లోకి వెళ్తే వెళ్ళాడు, అప్పుడైనా లక్ష్యాన్ని అప్డేట్ చేసుకుని వుంటే ఈ కథ బతికి బట్టకట్టేది. ఎలాగంటే, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్లో సల్మాన్ ఖాన్ చనిపోయిన కొడుకు పేర బ్లడ్ బ్యాంకుకి డబ్బు కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా దిగుతాడు. ఎప్పుడో పుట్టగానే చనిపోయిన కొడుకు గురించి కథ మనకి తెలీదు. ఆ పుట్టిన శిశువుని కూడా మనకి చూపించరు. ఈ బాధాకర గతమంతా చివర్లో మ్యాచ్ గెలిచాకే మనకి తెలుస్తుంది. అప్పుడు కొడుకు పేర బ్లడ్ బ్యాంకు అనే అతడి ఉన్నతాశయం వెల్లడై క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
        
క్రాక్ లో హీరో అన్నకి సంబంధించి ఇలాటి ఉన్నతాశయం కోసం లక్ష్యాన్ని అప్డేట్ చేసుకోకుండా, డొల్లగా సాగిపోతుంది హీరో పాత్ర. దీంతో అప్డేట్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ సీన్స్ తప్ప, ఎమోషనల్ కనెక్ట్ లేని  వీడియో గేమ్ లా తయారైంది సినిమా.

నటనలు -సాంకేతికాలు
విద్యుత్ జమ్వాల్ డేర్‌డెవిల్ సాహసకృత్యాలు, వెయ్యి వోల్టుల విద్యుత్ లాంటి  యాక్షన్ సీక్వెన్సులు, ప్రమాదకరమైన రేసింగ్ క్రీడలు చూస్తూంటే మన బీపీ పెరిగిపోతుంది.  డూప్ లేకుండా ఏ కొండ లేదా పర్వతం నుంచి మెరుపు వేగంతో ఎలా దూకుతాడో పట్టుకోవడం కష్టం. మూడు రేసులు, చివర్లో విలన్ అర్జున్ రామ్ పాల్ తో షో డౌన్- అదరగొట్టేశాడని ఒప్పుకోవాలి. కానీ ఇది సరిపోలేదు. దీనికి తగ్గ కథ, పాత్ర చిత్రణ కూడా వుండాలి.
       
అర్జున్
రామ్ పాల్ విలన్ గా స్ట్రాంగ్ గా వున్నాడు. అతడి కథకి, పాత్ర చిత్రణకి లోపాల్లేవు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. అమీ జాక్సన్ పోలీసాఫీసర్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ని కమాండ్ చేసింది. నోరా ఫతేహీ కేవలం విద్యుత్ తో రోమాన్స్ కోసమన్నట్టు వుంది.
       
అయితే స్పోర్ట్స్ యాక్షన్ సీన్స్ ని ఎడిటింగ్ చేసిన విధానం అడ్డదిడ్డంగా వుంది. కొన్ని షాట్స్ తీయడం మర్చిపోవడం వల్లనో
, తీసిన షాట్స్ పొరపాటున డిలీట్ అయిపోవడం వల్లనో అన్నట్టు- పది పదాలున్న వాక్యంలో మూడు పదాలు మిస్సయినట్టు ఎడిటింగ్ వుంది. కానీ యాక్షన్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాక్షన్ నే స్పీడుగా పరుగులేట్టించేలా వుంది. కెమెరా వర్క్, పోలండ్ ని చీట్ చేసిన అజర్ బైజాన్ ఫారిన్ లొకేషన్ మంచి విజువల్ క్వాలిటీ నిచ్చాయి. విద్యుత్ జమ్వాల్ ఫ్యాన్స్ కి మాత్రం మాంచి కిక్కు నిచ్చే ఈ మూవీ డిస్నీ +హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ లో మాత్రమే వుంది.

—సికిందర్