రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 13, 2018

636 : స్పెషల్ ఆర్టికల్






      వైజాగ్ సముద్ర మార్గాన టెర్రరిస్టులు వచ్చారనీ, అక్కడి ఎమ్మెల్యే వాళ్ళని  దాచి బాంబు దాడుల పథకం వేశాడనీ ఒకాయన స్క్రిప్టు రాస్తాడు. ఇంకో ఆయన హోంమంత్రి టెర్రరిస్టు లతో కుమ్మక్కై నగరంలో బాంబు దాడుల కుట్ర పన్నాడనీ సినిమా తీయబోతాడు. మరొకాయన జిష్ణు అనే హీరో పాత్రని  టెర్రరిస్టుగా  పోలీసు పట్టుకోవడాన్ని సినిమాగా తీసేస్తాడు. మరింకో ఆయన కువైట్ సంక్షోభంలో విదేశాంగ శాఖ చేసిందేమీ లేదనీ,  అంతా తమ హీరోనే భుజాన్నేసుకుని  అక్కడి భారతీయులని స్వదేశానికి స్వయంగా తరిలించాడనీ సినిమా తీసేసి చూపించేస్తాడు. తాజాగా మరొకాయన యురేనియం కార్పొరేషన్ అధికారులు పచ్చి దేశద్రోహులనీ, వాళ్ళందర్నీ హీరో పట్టుకున్నాడనీ చిత్రీకరణ చేస్తాడు. తాజాగా మరింకో ఆయన భారత విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ కి పాదాక్రాంతం చేసేసి తరించే చిత్రణతో ముందుకు రాబోతాడు...


          సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వ వ్యవస్థల్ని కించపర్చే అత్యుత్సాహానికి పోయి ప్రస్తుతానికి ఇద్దరు  దొరికిపోయారు. కువైట్ సంక్షోభం మీదఏర్ లిఫ్ట్ అనే హిందీ సినిమా తీసిన వాళ్ళు, యురేనియం కార్పొరేషన్ లో అవినీతి అంటూగరుడ వేగ అనే తెలుగు సినిమా తీసిన వాళ్ళూ ఆ ఇద్దరు.  ఏర్ లిఫ్ట్మీద ఆనాటి విదేశాంగ శాఖాధికారులు, ఎయిరిండియా పైలట్లూ ధ్వజమెత్తి దర్శకుణ్ణి న్యూస్ ఛానెల్ కి లాగి క్షమాపణ కూడా చెప్పించారు. ‘గరుడ వేగ మీద యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఇప్పుడు కోర్టు కెక్కారు. దీంతో  ఈ సినిమా శాటిలైట్ హక్కులకీ, రీమేక్ హక్కులకీ భంగం కలిగేలా కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. 

         
ఏర్ లిఫ్ట్తో విదేశాంగ శాఖ పరువు తీస్తే, ‘గరుడవేగతో యుసీఐఎల్ అధికారుల్ని దేశద్రోహులుగా చిత్రించారు (‘ఏర్ లిఫ్ట్వివాదం మీద వ్యాసం కోసం, ఈ వ్యాసం చివర లింక్ ని క్లిక్ చేయండి). కడప జిల్లాలోని తుమ్మలపల్లి గనుల్లోంచి యురేనియం, ప్లుటోనియం, థోరియంలని తవ్వి తీసి,  కృష్ణపట్నంలో నౌకల ద్వారా ఉత్తర కొరియాకి స్మగ్లింగ్ చేసి అమ్ముకుంటున్నట్టు సినిమాలో చూపించారు. ఈ దేశద్రోహుల్లో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర  హోంమంత్రి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖాధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులూ వున్నట్టు చిత్రీకరించారు. హీరో గారేమో గొప్ప ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ (ఈ సినిమాలో ఆఖరికి ఎన్ ఐ ఏ చీఫ్ ని సైతం దేశద్రోహుల్లో కలిపేశారు – పాసివ్ క్యారెక్టర్ హీరో గారొక్కరే సచ్ఛీలుడు!) గా వీళ్ళందర్నీ పట్టుకుని దేశభక్తుడై పోతాడు. 

          దేనికైనా ఒక హద్దుంటుంది. దేశ ద్రోహుల్ని చూపించాలంటే ఇంకా విలన్ పాత్రలు చాలా వున్నాయి. ఏకంగా ప్రధాన మంత్రి ప్రత్యక్ష ఆజమాయిషీ కింద నడిచే అణుశక్తి శాఖ అనుబంధ సంస్థ అయిన యుసిఐఎల్ ని దేశద్రోహుల అడ్డాగా చూపించడానికి చాలా మతి చెడి వుండాలి. దేశప్రతిష్ట, దేశభద్రత వంటి సున్నిత అంశాల పట్ల ఎడ్యుకేటెడ్స్ అయివుండీ, సృజనాత్మక  స్వేచ్ఛ పేరుతో కామన్ సెన్స్ లేకుండా రొడ్డకొట్టుడు చిత్రణలు చేస్తే, తర్వాత నిప్పుతొక్కిన కోతుల్లా క్యారు క్యారు మనాల్సి వస్తుంది.  దేశప్రతిష్ట, దేశభద్రత వంటివి నిప్పులాంటివి. వాటితో ఆడుకుంటే వొళ్ళు కాలిపోతుంది. యుసిఐఎల్ లో కుంభకోణాలు జరగ లేదని కాదు. సిబ్బంది నియామకాల్లోనో, యంత్ర పరికరాల కాంట్రాక్టుల్లోనో అంతర్గత స్కాములు చేసుకుంటున్నారు. అది వేరు. కానీ ఏకంగా దేశానికే ద్రోహం తలపెట్టే దుష్టాలోచనలు మాత్రం చేయలేదు. అలాటి దుష్టాలోచనలు ఇలాటి సినిమాలు తీసేవాళ్ళకే వస్తాయి. 



       ఎందుకొస్తాయంటే,  ఇక దుష్ట పాత్రల్ని చూపించడానికి రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పోలీసు వ్యవస్థలో భాగమైన  సిబిఐ శాఖా పనిబట్టి – పనిబట్టి బోరు కొట్టేసింది. ఇక  కొత్తవి కావాలి, కొత్త విలన్లు కావాలి. అందుకని రక్షణ శాఖ కిందికి వచ్చే శాఖల పని కూడా బట్టాలి. ఇంకా మాటాడితే టెర్రరిస్టులని పట్టుకునే ఎన్ఐఏ శాఖ, విదేశాల్లో గూఢచార కార్యకలాపాలు సాగించే ‘రా’ (రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్) శాఖని కూడా దేశద్రోహులుగా విలన్ల కింద వాడేసుకోవాలి. ఇది కూడా బోరుకొడితే,  త్రివిధ దళాల మీద కూడా పడి,  అడ్డంగా విలన్లుగా చీరేసి వాడేసుకుని పారెయ్యాలి! 

          లాజిక్కా? సినిమాకి లాజిక్కేంటి?  దేశభద్రత కదా? దేశభద్రతేంటి? దేశప్రతిష్ట కదా? దేశ ప్రతిష్టేంటి? ఇలాగైతే సినిమాలు తీయలేం, సినిమాలు తీయడం పరువు తీయడమెలా అవుతుంది?  సరే, వ్యవస్థల గురించి ప్రేక్షకులకి తప్పుడు సమాచార మివ్వడం కాదా, ఇదే నిజమని ప్రేక్షకులు నమ్మేయొచ్చు కదా? ఏంటి తప్పుడు సమాచారం, సినిమాని సినిమాలాగే చూడాలి ! అదేంటి, కథని కథలా చూడాలికదా? కథెవడిక్కావాలి, ఓన్లీ బిగ్ నేమ్స్ తో అన్నీఓకే అయిపోతాయి – ఎవడూ నోరెత్తడు! 

          కాబట్టి టెంప్లెట్ కథల్లో కరివేపాకులా వాడేసుకోవడానికి  ఈ ప్రతిష్టాత్మక వ్యవస్థలు కావాలి. ఈ వ్యవస్థల పేర్లు  చెప్పుకుంటే బోలెడు మైలేజీ కూడా వస్తుంది. రక్షణ శాఖ కింది కొచ్చే హైదరాబాద్ డీఆర్ డీఓ,  పక్క దేశాన్ని గడగడ లాడించే బ్రహ్మాండమైన ఒక క్షిపణి తయారు చేసినట్టూ, దాన్ని ఢిల్లీ చేరవేయడానికి లారీలో వేసి తరలించినట్టూ చూపిస్తారు. ఆ లారీ డుక్కుడుక్కు మంటూ రోజులతరబడి ఢిల్లీ పోతూనే వుంటుంది. ఎందుకలా అంటే, విద్రోహులు దాడి చేసి దోచుకోగల్గాలిగా? అప్పుడు హీరోగారు వూడిపడి గొప్ప దేశభక్తితో దాన్ని కాపాడి సన్మానం పొందాలిగా?  అందుకని వైమానిక దళం విమానంలో దాన్ని తరలించరాదు. అది పూర్తిగా సృజనాత్మక స్వేచ్ఛకి వ్యతిరేకం. 

          ఇలా వ్యవస్థల ప్రతిష్టని దెబ్బతీయడం ఒకటైతే, విదేశీ శక్తులతో కుమ్మక్కైనట్టు చూపడం ఇంకోటి. ఇక్కడ కూడా విదేశీ శక్తులూ అంతర్గత శక్తులూ ఒకటే అనుకుంటారు. అందుకని ఒక  ఎమ్మెల్యే టెర్రరిస్టులతో చేతులు కలిపి బాంబు దాడులు జరిపినట్టు  స్క్రిప్టు రాసేస్తా డొకాయన. ఇంకో హోం మంత్రి కూడా ఇదే పని చేసినట్టు సినిమా తీయబోతాడొకాయన.  రాజకీయ నాయకుల్ని విలన్లుగా చూపడం ఓకే. కానీ ఎవరు ఎవరితో కుమ్మక్కవుతారనే కామన్ సెన్స్ వుండాలి. రాజకీయ నాయకులు మాఫియాలతో చేతులు కలపవచ్చు ఆర్ధిక ప్రయోజనాల కోసం. టెర్రరిస్టులతో చేతులు కలిపి దేశద్రోహం చేసే దాకా పోరు. టెర్రరిస్టులతో ఏ ఆర్ధిక ప్రయోజనాలు కూడా నేరవేరవు. ఒక హోం మంత్రిని ముఖ్యమంత్రిగా చేయడానికి కిరాయి గూండాల్లాగా బాంబులు పేల్చడానికి టెర్రరిస్టులు కూడా రారు. టెర్రరిజం కథలు వేరు, రాజకీయ కథలు వేరు. అందులోని  విలన్లని ఇందులోకీ,  ఇందులోని  విలన్లని అందులోకీ వేసేసి గిలక్కొట్టి చూపించేస్తే ఐపోదు. 

          ఇలాటిదే ఒక కథతో ఒక బిజెపి నాయకుడు వచ్చారు. అది రాజకీయ నాయకులు టెర్రరిస్టులతో కుమ్మక్కవడం గురించి. ఏ కాశ్మీర్ లోనో  వేర్పాటు వాదులెవరికో టెర్రరిస్టులతో సంబంధాలుండొచ్చేమో గానీ, అందరూ అలా వుంటారని కన్విన్స్ చేయలేమని చెప్పాడీ వ్యాసకర్త. రాజకీయ నాయకులు అవినీతి పరులు కావొచ్చేమో గానీ, దేశం మీద దాడులు జరిపించే దేశద్రోహులు అయివుండరనీ, ఆర్ధిక ప్రయోజనాల కోసం మాఫియాలతో చేతులు కలప వచ్చనీ, ఆ మాఫియాలు కూడా సమాజ ద్రోహులుగా వుంటారు గానీ,  దేశానికే హాని తలపెట్టే శక్తులతో చేతులు కలపరనీ ... ఇలా క్లాసిఫై చేసి చెప్పేసరికి ఆయన ఆలోచనలో పడి కన్విన్స్ అయ్యారు. కానీ ముందే ఫిక్స్ అయిపోయిన కథలోంచి బయటికి రాలేకపోయారు. రెండు నెలలు ఎటూ తేలక  స్క్రిప్టు పని 

ఆగిపోయింది. 

          కథల్లో బలాబలాల సమీకరణ అని వుంటుంది. ఒక వైపు మంచిని, మరోవైపు చెడునీ మొహరించాలి. మంచి వాడైన  హీరో,  చెడ్డ వాడైన విలన్ మనుషులతో కూడా లాలూచీ పడి పోరాడుతున్నట్టు చూపిస్తే అది మంచీ చెడుల సమరం అవదు. పైగా ఆ విలన్ దృష్టిలో హీరో బలహీనుడై పోతాడు. మన దేశానికీ,  శత్రు దేశానికీ పోరాటం వచ్చినప్పుడు, మన దేశం పూర్తిగా గుడ్, శత్రుదేశం వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. మన దేశపు వ్యవస్థల్ని అలా గొప్పగా చిత్రించాలి. 

          ఇంకో స్క్రిప్టు ఈ మధ్య తగిలింది. ఇందులో రక్షణ మంత్రి పాకిస్తాన్ కి చర్చలకి వెళ్తున్నట్టు వుంది. రక్షణ మంత్రి ఎలా వెళ్తాడు, విదేశాంగ మంత్రి వెళ్తాడు గానీ... విదేశాంగ మంత్రి కూడా ఎందుకు వెళ్తాడు, రెండు దేశాల మధ్య అధికారుల స్థాయి చర్చలు జరుగుతాయి గానీ...అలా కూడా ఎందుకు చేస్తారు, పాకిస్తాన్ తో చర్చల్లేవ్ పొమ్మని మన ప్రభుత్వం అంటూంటే....నిజంగా కాశ్మీర్ లో పరిస్థితి చూస్తూ ఇలాటి ఆలోచనలు కథకులెలా చేస్తారు?  కానీ ఇలాగే చేయడానికి ఫిక్స్ అయిపోయారు. భారత్ వెళ్ళి పాకిస్తాన్ లో వాలిపోయి - చెప్పండి సార్ చెప్పండి - అంటూ గులామై పోవడం! 

          ఇలాటి వాటికి  సెన్సార్ వాళ్ళు బ్రహ్మాండంగా సర్టిఫికేట్ ఇచ్చేయడం. తాంబూలా లిచ్చేశాం తన్నుకోమనడం. వ్యవస్థల్ని బాధితులుగా తయారు చేసి వదలడం. ఆ బాధిత వ్యవస్థలు ఛానెళ్ళకో, కోర్టులకో  ఎక్కి పోరాడాల్సి రావడం. ఒక్క ఫాల్స్ సినిమాతీసి కాల రెగరెయ్యడం కోసం పనిమాలా వ్యవస్థల్ని పాడుగా చూపించడం, తమ వ్యవస్థ ఏంతో  బాగున్నట్టు! 

           ఈ దుందుడుకుతనానికి అడ్డుకట్ట పడి, వొళ్ళు దగ్గర బెట్టుకుని సినిమాలు తీయడానికి ‘గరుడవేగ’ లాంటి షాకులవసరమే. 



.



         












635 : స్పెషల్ ఆర్టికల్




గరుడవేగ టీమ్కి షాక్ ఇచ్చిన కోర్టు! 
Updated : 12-Apr-2018 : 19:16
      రాజశేఖర్ హీరోగా నటించిన పీఎస్వీ గరుడవేగ’ చిత్రం చాలా కాలం తర్వాత రాజశేఖర్కి హిట్ని అందించిన విషయం తెలిసిందే. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లపరంగా మాత్రం సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం శాటిలైట్, డబ్బింగ్, రీమేక్ హక్కులకు భారీ రేటు రావడంతో చిత్రం సేఫ్ ప్రాజెక్ట్గానే బయటపడింది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు చిత్రానికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గరుడవేగ’ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని హైదరాబాద్సిటీ సివిల్కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

విషయంలోకి వస్తే, మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమా ఉందని యురేనియం కార్పొరేషన్ఆఫ్ఇండియా, సిటీ సివిల్కోర్టులో పిటిషన్దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ చేపట్టిన సివిల్జడ్జి కె.కిరణ్కుమార్  పిటిషనర్తరపు న్యాయవాది వాదనను విన్న అనంతరం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి జరపకూడదంటూ   మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో ఉందని, ఉన్నతాధికారులు కుంభకోణంలో భాగస్వాములైనట్లు చిత్రంలో చూపించారని, కుంభకోణాన్ని ఎన్ఐఏ అసిస్టెంట్ కమీషనర్ పాత్రలో హీరో రాజశేఖర్ వెలికితీసినట్లుగా చూపించారని పిటిషనర్ న్యాయవాది తన వాదనని వినిపించారు.

కేసుపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసినట్లుగా జడ్జి తీర్పునిచ్చారు. అయితే సడెన్గా జరిగిన పరిణామంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమా విడుదలై, థియేటర్లలో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇటువంటి ఉత్తర్వులు రావడంతో చిత్ర యూనిట్ అయోమయానికి గురవుతోంది.
(ఆంధ్రజ్యోతి, 12.4.17) 
***
స్పెషల్ ఆర్టికల్ రేపు!