రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఆగస్టు 2023, మంగళవారం

1360 : థియేటర్ న్యూస్!

 సాయంత్రం : జైలర్ స్క్రీన్ ప్లే సంగతులు!


     సినిమా ప్రకటనలు నిర్మాతలు విడుదల చేస్తారు. అవి చూసి ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళి సినిమా చూస్తారు. ఇది ఎక్కడైనా అమలయ్యే విధానం. కానీ సినిమా థియేటరే సినిమాలకి రారండని ప్రేక్షకులకి గుర్తు చేసే ప్రకటనలు విడుదల చేస్తే? ఈ అవసరం ఎందుకొస్తుంది? ప్రేక్షకులు మరీ బొత్తిగా సినిమాలు చూడాలన్న ధ్యాసే లేకుండా ఇంకేవో పార్టీలు పబ్బాలు, పిక్నిక్ లు, షాపింగులు, ఎంజాయ్ మెంట్లలో మునిగి తేలిపోతూంటే థియేటర్లు ఏమైపోవాలి? అందుకని నిర్మాతలతో సమానంగా థియేటర్ల యజమానులు కూడా ప్రకటనలివ్వడం అమెరికాల్లో జరుగుతోంది. అమెరికాలో 450 థియేటర్లతో నడిచే ప్రసిద్ధ రీగల్ సినిమాస్ గ్రూపు ఈ పనే చేసి మూడు యాడ్స్ విడుదల చేసింది. ఈ స్పూఫ్ వీడియోలతో ప్రేక్షకుల్ని తన థియేటర్లకి పరుగులు పెట్టేలా చేస్తోంది.

        టీటీలు, వీకెండ్ పార్టీలు, ఎంటర్ టైంమెంట్ పార్కులు... ఇలా వినోద సాధనాలు పెరిగిపోవడంతో థియేటర్ల మనుగడ కోసం కొత్త కొత్త చిట్కాలు ప్రయోగించక తప్పడం లేదు. మూడు ఫోమో వీడియోలతో ఈ ప్రచార కార్యక్రమం ఛేపట్టింది రీగల్ గ్రూపు. చికాగోకి చెందిన క్రియేటివ్ ఏజెన్సీ క్వాలిటీ మీట్స్ ఈ ఫోమో వీడియోల్ని విడుదల చేసింది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన ఈవెంట్ ని మిస్ అవుతున్నామనే భావోద్వేగ ప్రతిస్పందనని జనాల్లో రేకెత్తించడం. పార్టీల్లోనో, ఇంకెందులోనో మునిగి తేలుతున్నప్పుడు హఠాత్తుగా టీవీలో ఫోమో యాడ్ వస్తే, అది చూసి ఆ ఈవెంట్ వైపు పరుగెత్తేలా చేస్తాయి ఈ ఫోమో యాడ్స్.
       
రీగల్ గ్రూపు
పూల్, బీబీక్యూ, ఐస్-క్రీం అనే మూడు ఫోమో స్ఫూఫ్ యాడ్స్ ని విడుదల చేసింది. ఇవి 1973 నాటి హార్రర్ క్లాసిక్ ది ఎక్సార్సిస్ట్  నుంచి తీసుకుని చేసిన ఫన్నీ హార్రర్ సీనుతో ఒకటి చేసింది. ఏదో కార్యక్రమంలో వున్న ప్రేక్షకులు బుర్ర గోక్కుని థియేటర్స్ కి వెళ్ళేలా  చేసేంత హాస్యాస్పదంగా ఈ స్ఫూఫ్స్ వున్నాయి. పాత్రలు ఇవి చూస్తున్న స్పాట్స్ లోని వ్యక్తులకి సినిమా చూడడం కూడా ఓ ముఖ్యమైన దినచర్య అని గుర్తు చేస్తున్నాయి. ఈ నెలలోనే ఈ ప్రచార కార్యక్రమం మొదలెట్టింది. టీవీల్లోనే గాక సోషల్ మీడియాలోనూ ఈ యాడ్స్ ని గుప్పిస్తూ ప్రేక్షకుల్ని రాబట్టుకుంటోంది రీగల్ గ్రూపు.
       
అసలు కోవిడ్ మహమ్మారి దెబ్బకి అప్పుల్లో కూరుకుపోయి దివాలా ప్రకటించిన రీగల్ గ్రూపు జులై చివరి వారంలో
ఒపెన్ హైమర్, బార్బీ సినిమాలు రెండిటి సూపర్ సక్సెస్ తో బయటపడింది. బయటపడడంతో ఆగకుండా ప్రేక్షకుల్ని తన థియేటర్లకి తరిలించుకు పోవడానికి పెద్ద యెత్తున ఫోమో యాడ్స్ గుప్పించింది. గత సెప్టెంబర్ లో దివాలా ప్రకటించినప్పుడు బిలియన్ల కొద్దీ అప్పులున్నాయి. అదిప్పుడు 4.53 బిలియన్‌ డాలర్ల మేర తగ్గించుకున్నామని ప్రకటించింది. కొత్త ఈక్విటీ మూలధనంలో 800 మిలియన్‌ డాలర్లు సేకరించామని, 1.71 బిలియన్‌ డాలర్ల డెట్‌ ఫైనాన్సింగ్‌ ని పొందామనీ గ్రూపు ఛైర్మన్ ఎరిక్ ఫాస్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది.
       
కోవిడ్
మహమ్మారి సమయంలో గ్రూపు చాలా థియేటర్లని మూసి వేయవలసి వచ్చింది. దీంతో 2020, 2021 లలో 3.3 బిలియన్ డాలర్లకి పైగా నష్టాల్ని చవిచూసింది. ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ లో 51 థియేటర్లు మూసివేసే వున్నాయి.
       
రీగల్ సినిమాస్ గ్రూపు
సినిమాలని త్రీడీలో చూపించే రియల్ త్రీడీ కంపెనీలో భాగ స్వామి. రీగల్ ప్రీమియం థియేటర్స్ లో పెద్ద ఫార్మాట్ లో, డాల్బీ అట్మాస్ సౌండ్, బట్‌ కిక్కర్ మోషన్ సీట్లు, ఉన్నతీ కరించిన  స్క్రీన్‌పై 4కే లేజర్ ప్రొజెక్షన్‌ ని అందిస్తోంది. ఇవిగాక మొత్తం అమెరికాలో 94 ఐమాక్స్ థియేటర్లని నిర్వహిస్తోంది. 4డీ ఎక్స్ : సీజీవీ పేరుతో 4 డీ ఎక్స్ చోదిత మెరుగైన సీట్లతో గల థియేటర్స్ ని నిర్వహిస్తోంది. ఇందులో గాలి, స్ట్రోబ్ లైట్లు, నీరు, పేలుళ్ళు, లెగ్ టిక్లర్‌లు, వైబ్రేషన్‌లు, వర్షపు తుఫాను, పొగ, సువాసన వంటి ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాటి థియేటర్లు 32 వున్నాయి.
       
ఇక స్క్రీన్ ఎక్స్ పేరుతో
 270-డిగ్రీల వీక్షణ కోసం గోడల మీద రెండు అదనపు స్క్రీన్‌లతో సినిమాల్ని ప్రదర్శిస్తోంది. 2021 నాటికి ఈ థియేటటర్లు 34 వున్నాయి. ఫోమో యాడ్ ని ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు.

—సికిందర్

ఫోమో యాడ్