రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, నవంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!
రచన- దర్శకత్వం : వి ఐ ఆనంద్
తారాగణం :
 నిఖిల్‌, హెబ్బా ప‌టేల్‌, నందితా శ్వేత‌, అవికా గోర్‌,  వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు
మాటలు : అబ్బూరి రవి,
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, చాయాగ్రహణం : సాయి శ్రీరామ్‌
బ్యానర్ :
 మేఘ‌నా ఆర్ట్స్
నిర్మాత : పి. వెంకటేశ్వరరావు
విడుదల : 18 నవంబర్, 2016
***
      హీరో నిఖిల్ ‘శంకరాభరణం’తో చేదు అనుభవం తర్వాత, మరో నావెల్టీ అని భావించి ఈసారి హార్రర్ కామెడీలో నటిస్తూ, చేతిలో చిల్లర ఆడని ప్రేక్షుకుల ముందుకు సాహసించి వచ్చేశాడు.  ‘టైగర్’ తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ కిది రెండో సినిమా. ఇద్దరూ కలిసి ఈ హార్రర్ కామెడీతో సేఫ్ గేమ్ ఆడేద్దామని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’  అనే కంట్రోల్డ్ బడ్జెట్ సినిమాతో ఈ వారం ఆర్ధికంగా ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల మధ్య విచ్చేశారు- విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్!

కథ
     నాల్గేళ్ళ క్రితం అర్జున్ (నిఖిల్) ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూంటే, ఆమె రిజిస్ట్రార్ ఆఫీసుకి రాదు. దాంతో తన ప్రేమ విఫలమయిందని వెళ్ళిపోతాడు. నాల్గేళ్ళ  తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో యానిమేటర్ గా పనిచేస్తూంటాడు. ఆఫీసులో కిషోర్ (వెన్నెల కిషోర్) కి ఆత్మ ఆవహించిందని వైద్యం కోసం కేరళకి తీసుకుపోతాడు. అక్కడ అమల (హెబ్బా పటేల్) పరిచయమవుతుంది. ఈమె కూడా తన బంధువుకి దెయ్యం వదిలించడానికే ఇక్కడ మంత్రగాళ్ళ దగ్గర కొచ్చింది. ఇద్దరూ నాల్గురోజులు సరదాగా గడిపాక, ఒక రోజు అమల చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతుంది. అర్జున్ విజయవాడ వచ్చి ఆమె తండ్రి (తనికెళ్ళ) ని కలుస్తాడు. ఆ తండ్రి ఎప్పుడో నాల్గేళ్ళ క్రితమే తన కూతురు  అమల యాక్సిడెంట్ లో చనిపోయిందని అంటాడు. అర్జున్ తిరిగి హైదరాబాద్ వస్తే, ఇక్కడ మళ్ళీ అమల కన్పిస్తుంది. కానీ  తన పేరు నిత్య అని అంటుంది. అంతలో ఇంకో అమ్మాయి ఫోన్ చేసి, తనే అమలనని అంటుంది. తమిళనాడునుంచి బయల్దేరి వచ్చి ఆ పార్వతి (నందితా శ్వేత) అనే అమ్మాయి అర్జున్ ఇంట్లో మకాం పెడుతుంది.

        అసలు అమలా నిత్యా పార్వతీ వీళ్ళంతా ఎవరు? నాల్గేళ్ళ క్రితం అర్జున్ పెళ్లి చేసుకోబోయిందెవర్ని? చనిపోయిన అమల ఆత్మ మొదట నిత్యని, తర్వాత పార్వతినీ ఎందుకు ఆవహించి అర్జున్ ని వెంటాడుతోంది? అసలు అమల అమలేనా? ఈ చిక్కుముళ్ళన్నీ వీడాలంటే, ఇక సెకండాఫ్ చూడాల్సిందే.

ఎలావుంది కథ 
     ఇదొక హార్రర్ కామెడీ కథ. తెలుగులో ఈజీ బాక్సాఫీసు ఫార్ములాగా మారిన ఈ హార్రర్ కామెడీలని  మనమూ ప్రయత్నిద్దామని హీరోలందరూ క్యూ కడుతున్నారు- ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాల్లాగా. ఐతే ఇందులో కామెడీ వచ్చేసి రొటీన్ గా ఆత్మ చేతిలో కమెడియన్లు తన్నులు తినడమే. ఇక్కడ ఆత్మ కథ ప్రేమ కథతో ముడిపడి వుంటుంది. ఈ ప్రేమకథ కూడా పేలవంగా వుండడం ఇక్కడ ప్రత్యేకత. ఇటీవలే ‘నందిని నర్సింగ్ హోమ్’ లో కనీసం  ఆ హీరోయిన్ ఆత్మకి హీరోని సొంతం చేసుకోవాలన్న బలమైన కాంక్ష వుంటుంది. ఈ ఆత్మ ఎవరో హీరోకి కూడా తెలిసి అంతే ఎమోషనల్  గా మారతాడు. కానీ ప్రస్తుత సినిమాలో ప్రేమ కాదు కదా, ఆత్మతో అసలే ఏమోషనూ హీరో ఫీలవకుండా ఫ్లాట్ గా వుండడం ఇంకో ప్రత్యేకత. ‘నందిని నర్సింగ్ హోమ్’  లోనూ, ప్రస్తుత సినిమాలోనూ పెళ్లి సందర్భంగానే హీరోయిన్లు బైక్స్ మీద వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోతారు. 2000 లో మహేష్ భట్ రచన చేసి తీసిన ‘రాజ్’  (రహస్యం) అనే హిందీ హార్రర్ లో బలమైన లవ్ యాంగిల్ వుంటుంది. ఈ బలమైన లవ్ యాంగిల్ హీరోయిన్ క్యారక్టర్ ని, భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడే సతీసావిత్రి పురాణ పాత్ర ప్రతిఫలించే మిథికల్ క్యారక్టర్ గా చేసి, తీయడంవల్ల ఆ హార్రర్ ని మహిళలు సైతం  విరగబడి చూసి అంత పెద్ద హిట్ చేశారు. ఆత్మగా మారిన సెకెండ్ హీరోయిన్ బారినుంచి భర్తని కాపాడుకునే మెయిన్ హీరోయిన్ కథ అన్నమాట!  ప్రస్తుత హార్రర్ కామెడీలో ఫీలవడానికి ప్రేమా లేదు, కామెడీ అంతగా లేదు. కథని ఎలా చక్కదిద్దాలా అన్న దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టి, ఆ సీను కాకపోతే ఈ సీను, ఈ సీను కాదని ఆ సీనూ-  సీన్లతో ప్రయోగాలూ చేయడంతోటే సరిపోయింది అన్నట్టుంది. 

ఎవరెలా చేశారు
      హీరోగా ఇందులో నిఖిల్ చేయడానికేమీ లేదు. అసలేమీ లేదు. ఈ కథ తన హీరో పాత్ర కథ కాకపోవడం వల్ల, పనిగల హీరోయిన్ల మధ్య పాసివ్ గా వుండి పోతాడు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నారు. ఒక హీరోయిన్ రెండు వేర్వేరు పేర్లతో హీరోకి కన్పిస్తుంది- కాబట్టి  ఈ నాల్గు హీరోయిన్ పాత్రల్లో ఇద్దర్ని ప్రేమించడం, దెయ్యంగా మారిన  మూడో హీరోయిన్ తో భయపడుతూ గడపడం తప్పితే చేసిందేమీ లేదు. ఇన్ని హీరోయిన్ పాత్రలతో చెప్పుకోవడానికి కన్ఫ్యూజన్ గా వుండే ఈ కథలో- నిఖిల్ హీరో పాత్ర కూడా కన్ఫ్యూజ్ అయిపోయి పెళ్ళికి సిద్ధపడడం చాలా ఐరనీ. ఇదెలాగంటే, నాల్గేళ్ళ క్రితం తను ప్రేమించింది బురఖాలో వుండే ఆయేషా (అవికా గోర్) అనే ముస్లిం అమ్మాయిని. ఆమె బురఖా తీసి ముఖం  కూడా చూపించకుండానే ఇష్టముంటే పెళ్లి చేసుకోమంటుంది. చేసేది లేనట్టు అలాగే రిజిస్ట్రార్ ఆఫీసుకి రమ్మంటాడు. తీరా ఈమె బురఖా తీసేసి పెళ్లి చీర కట్టుకుని బైక్ మీద వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోతుంది. ఈ యాక్సిడెంట్ సంగతీ హీరోకి తెలీదు, ఆమె ముస్లిం కాదనీ, అమల అనే హిందువే అనీ కూడా తెలీకుండా వుండిపోతాడు. ఇలా తను ప్రేమించి పెళ్లి చేసుకోబోయిన అమ్మాయి ముఖం కూడా అతను చూడలేదు, అసలు పేరూ తెలీదు. ఇలా ఇది అసహజ చిత్రణయింది.

        తండ్రి ( తనికెళ్ళ) కి చెప్పే పెళ్లి చేసుకోవడానికి బయల్దేరిన అమల, ప్రమాదంలో చనిపోతే ఆ  తండ్రి రిజిస్ట్రార్ ఆఫీసులో ఆరాతీసి, హీరోని కనుక్కుని విషయం చెప్పడా? అసలు అమల కూడా పెళ్లి చేసుకుంటున్నానని ట్యూషన్ కి వెళ్తున్నంత ఈజీగా తండ్రికి చెప్పేసి వెళ్లిపోవడమేమిటో! ఆ తండ్రి అయినా వెంట వెళ్ళడా? కనీసం అల్లుడెవడో ముఖం చూడ్డానికి? విచిత్ర మనుషులు. ఇలా చెప్పుకుంటూ పోతే లొసుగులతో ఇదొక కథగానే మిగలదు, వదిలేద్దాం. దెయ్యాల సినిమాలకి దెయ్యాల పరంగా లాజిక్ అవసరం లేదు గానీ, ఇంకా మనుషులుగా మిగిలున్న పాత్రలతో లాజిక్ చాలా అవసరమే. ఇలా ఆయేషాయే అమల అని నిఖిల్ హీరో పాత్రకి తెలియక పోవడం వల్ల,  ఎక్కడా ఏ ఎమోషనూ లేకుండా పోయింది. కనుకనే కేరళలో అమల అని చెప్పుకున్న వేరే అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. 

        మొదట నిత్య అనే అమ్మాయిని ఆవహించిన అమల ఆత్మ,  తను అమల అని చెప్పుకున్నా, ఆతర్వాత పార్వతి అనే ఇంకో అమ్మాయికీ ఆవహించినప్పుడు  తను అమలే అని మొత్తుకున్నా,  ఇందుకే హీరోకి బల్బు వెలగలేదు. అమలే ఆయేషా అని తెలిస్తేగా! ఈ ఆత్మ క్లయిమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ చెబితే తప్ప,  హీరోకి ఈమే తను ప్రేమించిన ‘ఆయేషా’ అని తెలీదు. అసలు అమల ఆత్మ అయినా మొదటే తను ‘ఆయేషా’ అని హీరోతో ఎందుకు చెప్పుకోదో అర్ధం గాదు. అమల ఎవరో తెలీని హీరోతో నేను అమలా - నేను అమలా  - అంటూంటే ఎలా గుర్తుపడతాడనుకుంది ఆత్మ? తెలివి తక్కువ ఆత్మేమో. కథకి ఏమాత్రం ఉపయోగపడని బురఖా నాటకం వల్లే ఈ గజిబిజి అంతా ఏర్పడింది. ఇందుకే సినిమా సాంతం హీరో ఏమీ చేయలేని, ఏ ఎమోషనూ లేని,  శుష్క పాసివ్ పాత్రగా మిగిలిపోవాల్సి వచ్చింది. కథంతా ఆత్మదే, ఆత్మే తన కథ తాను నడుపుకుంటుంది దర్శకుడి పుణ్యాన అష్టకష్టాలూ పడి! వేకప్ నిఖిల్! ఫస్ట్ యాక్టివ్ క్యారక్టర్  అంటే ఏమిటో తెలుసుకుని అప్పుడు కథలు వినాలి. 

        హీరోయిన్లు హేబ్బా పటేల్, అవికా గోర్, నందితా శ్వేత ముగ్గురూ నల్గురుగా కన్పించి ప్రేక్షకుల చేత ఈలలు వేయించుకుంటారు. ఒక తరగతి ప్రేక్షకులకి ఈ సినిమా మాంచి మజా. హస్యబృందం వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్, వైవా హర్ష ముగ్గురూ ఆత్మతో లెంపకాయలు తినడమే కామెడీగా సరిపెట్టేశారు. సంగీతం ఛాయాగ్రహణం ఎవరేజీగా వున్నాయి.

చివరికేమిటి 
     దర్శకుడి స్క్రీన్ ప్లే పేలవంగా మొదటి సీను నుంచే కన్పిస్తుంది. కథని ఎలా ముగించాలో తెలీనట్టు క్లయిమాక్స్ గందరగోళంగా తయారయింది. కథని  ఓ పద్దతిగా ప్రారంభిస్తే దానికదే ఓ పద్దతిగా ముగుస్తుంది. అసలు తను ప్రేమించి పెళ్లి చేసుకోబోయిన అయేషా ఏమైందో హీరోకే తెలీని ప్రారంభం- కథ  ఎలా ముగించాలో తెలీని క్లయిమాక్స్ కే కదా దారి తీసేది. కనీసం జరుగుతున్న వాటిపట్ల హీరోకి ఒక తెల్సుకోవాలన్న జిజ్ఞాస, పరిశీలనాత్మక దృష్టీ , అన్వేషణా ఏవీ లేక ఖాళీగా ఉండిపోతే కథని ఎలా ప్రారంభించి ఎలా ముగించగలరు. ఇందుకే సెకండాఫ్ లో ఇలా కాదని అలా, మళ్ళీ అలా కాదని ఇలా ఇష్టానుసారం ట్విస్టులు. మెదడుకి బాగా పని కల్పించుకుని  ఈ ట్విస్టుల్ని ఫాలో అవడం సహన పరీక్షే. 

        సినిమా ఆడేస్తుంది, ఏం ఫర్వాలేదు. హార్రర్ కామెడీ, అందునా స్టార్ వేల్యూ వున్న హార్రర్ కామెడీ నవ్వించేస్తూ తప్పకుండా ఆడేస్తుంది. పెద్దనోట్లు మాయమై, సినిమాల విడుదలలు అగమాగమైన వేళ, బాక్సాఫీసు దగ్గర సింగిల్ గా సినిమాకే ఢోకా లేదు.

-సికిందర్
http://www.cinemabazaar.in