రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, జూన్ 2019, సోమవారం

842 : స్క్రీన్ ప్లే సంగతులు - 2


లీనియర్ కథ
            ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) ఒక ఐపీఎస్ ఆఫీసర్. మానస (ఆషిమా నర్వాల్) ని చూసి ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. వూళ్ళో కాంట్రాక్ట్ కిల్లర్ అలీని, అతడి గ్యాంగ్ నీ పట్టుకునే ప్రయత్నాల్లో వుంటాడు. ఘర్షణలో కొంత మంది గ్యాంగ్ మెంబర్స్ చచ్చిపోతారు. అలీ దొరుకుతాడు. అతను పగబట్టి తప్పించుకుని ప్రభాకర్ భార్య మానసని హత్య చేస్తాడు. అతణ్ణి  పట్టుకోవడానికి ప్రభాకర్ విజృంభిస్తాడు. ఇక చంపడమే లక్ష్యంగా పెట్టుకుని జాబ్ కి రిజైన్ చేసి, వెతుక్కుంటూ వైజాగ్ వచ్చి మకాం పెడతాడు. 

          ఎదుటి ఫ్లాట్ లో అచ్చం మానస లాగే వున్న జయంతి (ఆషిమా నర్వాల్), తల్లి (సీత) తో వచ్చి దిగడంతో స్టన్ అవుతాడు. ఆమె తల్లి కోరిక మేరకు లగేజి సాయం పడుతూ క్లోజ్ గా ఆమెని చూస్తాడు. అప్పట్నుంచీ ప్రతీరోజూ ఆమె ఆఫీసు కెళ్ళాడానికి ఫ్లాట్ డోర్ తీసుకుని బయటికి రాగానే, తనూ డోర్ తీసుకుని కాకతాళీయంగా వచ్చినట్టు ఆమెని కింద ఆఫీసు కారుదాకా అనుసరించి, పక్క కెళ్ళి పోవడం మొదలెడతాడు.

          ఇది గమనించిన జయంతి కోలీగ్ అతడి గురించి హెచ్చరిస్తుంది. అతనలాటి వాడు కాదని మందలిస్తుంది జయంతి. ప్రభాకర్ ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూంటాడు. కానీ సరిగ్గా వెళ్ళడు. అతణ్ణి చూస్తేనే భయమేస్తుందని వాపోతుంది రిసెప్షనిస్టు. ఇంకా అలీ అన్వేషణలో వున్న ప్రభాకర్ ని ఒక ఇన్ఫార్మర్ కలిసి లొకేషన్ షేర్ చేస్తానంటాడు. ఆ లొకేషన్ లో అలీ వుంటాడు. అలీ అనుచరుడు అలీకి సమాచారమిస్తాడు. ప్రభాకర్ కోటిని చంపేశాడనీ, బాబ్జీ కోమాలో కెళ్ళిపోయాడనీ అంటాడు. ఇక్కడికి ప్రభాకర్ వచ్చేటప్పటికి అలీ తప్పించుకుంటాడు. 

        మర్నాడుదయం జయంతితో అదే ఫాలోయింగ్ రిపీట్ చేస్తాడు ప్రభాకర్. ఆమె కారెక్కి వెళ్తూ ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపమంటుంది. దిగి లోపలికి వెళ్తుంది. కావాల్సిన వస్తువు చెక్ చేస్తూంటే ఒకడు గమనించడం కంటబడుతుంది. అతణ్ణి చూసి ఆమె పారిపోతూంటే వెంటాడతాడు. ఆమె తప్పించుకుని ఫ్లాట్ కొచ్చేసి తల్లికి చెప్తుంది వంశీ వైజాగ్ వచ్చేశాడని. ఇద్దరికీ భయాందోళనలు మొదలవుతాయి. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. భయపడుతూ ‘ఎవరూ?’ అంటే, ‘మీటర్ రీడింగ్’ అని వాయిస్ వస్తుంది. జయంతి తల్లి డోర్ తీయగానే జొరబడిపోతాడు వంశీ.

          అతడితో పెనుగులాడి పెనుగులాడి, కేబుల్ మెడకి చుట్టి లాగి చంపేస్తారు తల్లీ కూతుళ్ళు. ఈ శబ్దాలు విని ప్రభాకర్ వస్తాడు. పరిస్థితి చూసి హెల్ప్ చేస్తానంటాడు. వాళ్ళు నేను చంపానంటే నేను చంపానని నేరం మీదేసుకుని లొంగి పోతామంటారు. మీలో ఎవరు నేరంమీదేసుకున్నా మరొకర్ని పోలీసులు వదలరని అంటాడు. ఐతే ఇద్దరం లొంగిపోతామంటారు. లొంగిపోతే లొంగి పోవచ్చు గానీ, కేసులోంచి తప్పించుకోవాలంటే మాత్రం బాడీని మాయం చేయాలంటాడు. ఇతనెవరో చెప్పమంటాడు. ఇతను  మంత్రి తమ్ముడు, రెండేళ్ళ నుంచి జయంతి తనని పెళ్లి చేసుకోవాలని వేధి స్తూంటే తప్పించుకుని వైజాగ్ వచ్చేశారు. ఇది కనుక్కుని వచ్చేసి దాడి చేశాడు. ఇ
ది ఫిబ్రవరి 4 పగలు జరిగిన సంఘటన. 

        ఫిబ్రవరి 6  రాత్రి 8 - 9 గంటల మధ్య, బీచ్ రోడ్డు మైదానంలో ప్రభాకర్ తన భార్యని చంపిన అలీని చంపేసి పెట్రోలు పోసి నిప్పంటిస్తాడు. తెల్లారి సమాచారమందుకుని డీసీపీ కార్తికేయ (అర్జున్) వచ్చి, మొహం పూర్తిగా కాలిపోయిన శవాన్ని చూస్తాడు. వేలి ముద్రలు చెడకుండా చేతులు బాగానే వుంటాయి. ఇతనెవరో గుర్తు పట్టడానికి ఒకే ఒక్క ఆధారంగా ప్యాంటుకి టైలర్ లేబుల్ వుంటుంది. ఒక సాక్షి వచ్చి, రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇక్కడ మంట చూశానంటాడు.  

          అటు ప్రభాకర్ జయంతికి కాల్ చేసి, ప్రాబ్లమేం లేదుగా అనడుగుతాడు. పోలీసులు వస్తే తామిద్దరికీ కాంటాక్ట్ వున్న విషయం చెప్పవద్దంటాడు. కార్తికేయ పోస్ట్ మార్టం రిపోర్టు తెలుసుకుంటాడు. మరణం రాత్రి 8
- 9 గంటల మధ్య జరిగి వుండాలి. వూపిరి తిత్తుల్లోకి పొగ చేరలేదు కాబట్టి, చనిపోయిన తర్వాత అగ్నికి ఆహుతై వుండాలి. తాడు లేదా కేబుల్ నుపయోగించి ఊపిరి  తీసి వుండాలి. ఇంతలో లాడ్జిలో ఒక గెస్ట్ మిస్సయ్యాడని సమాచారం వస్తుంది. 

          ప్రభాకర్ కారు నడుపుకుంటూ పోతూంటాడు. పక్క సీట్లోకి చూస్తాడు. ఖాళీగా వుంటుంది. మళ్ళీ చూస్తాడు. మానస కన్పిస్తుంది. ఎక్కడికి తీసి కెళ్తున్నావని అడు గుతుంది. వెళ్ళాక నీకే  తెలుస్తుందని అంటాడు. ఇప్పుడే చెప్పమంటుంది. మళ్ళీ చూస్తే  ఆమె వుండదు. కారు నది దగ్గరాపుతాడు. కారులోంచి ప్యాక్ చేసిన వంశీ శవాన్ని తీసి నదిలో పడేస్తాడు. 

         
లాడ్జిలో ఒక గెస్ట్ మిస్సయ్యాడని వచ్చిన సమాచారంతో ఫోరెన్సిక్ టీముతో వెళ్తాడు కార్తికేయ. అక్కడ వేలి ముద్రలు కాలిన శవం వేలి ముద్రలతో సరిపోతాయి. ఆ లాడ్జిలో దిగింది వంశీ అనీ, అతనే హత్యకి గురయ్యాడనీ అభిప్రాయాని కొస్తాడు కార్తికేయ. 

          వంశీ గురించి తెలుసుకుంటే అతను మంత్రి కొడుకు. జయంతిని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్నాడు
.  ఈ సమాచారంతో జయంతినీ, ఆమె తల్లినీ అనుమానించి ప్రశ్నిస్తాడు కార్తికేయ. అప్పుడు వాళ్ళ డోర్ చైనూ, లోపల గ్రానైట్ దిమ్మే డ్యామేజి అయి వుండడాన్ని ఓరకంట గమనిస్తాడు. వంశీ ఎవరో తెలియదంటారు వాళ్ళు. ఫిబ్రవరి 6 తేదీ రాత్రి ఎక్కడున్నారని అడుగుతాడు. ఆఫీసు నుంచి లేటుగా వచ్చానని అంటుంది జయంతి.

          కార్తికేయ వెళ్ళిపోతూ, ఎదుటి ఫ్లాట్ దగ్గరికి తిరిగొస్తాడు. ఫ్లాట్ లో వున్న ప్రభాకర్ ని చూసి, ఆ తల్లీ కూతుళ్ళ గురించి ఆరా తీస్తాడు.  జయంతి గురించి తెలియదంటాడు ప్రభాకర్. వాళ్ళు అనుమానాస్పదంగా ఏమీ లేరంటాడు. తర్వాత ప్రభాకర్ జయంతికి కాల్ చేసి, పోలీసులకి ఏం చెప్పారని అడుగుతాడు. మీరేం చెప్పమన్నారో అదే చెప్పామని అంటుంది.

          ప్రభాకర్ కి మానస మెదులుతుంది. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావ్ అనడుగుతుంది. ఆమెతో రోమాన్స్ చేసిన దృశ్యం మెదులుతుంది. కార్తికేయ వెళ్లి జయంతి కొలీగ్ ని విచారిస్తాడు. ఆమె జయంతికి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తుంది. వంశీ గురించి కూడా చెప్పలేదంటుంది.  ఫిబ్రవరి 6 రాత్రి 8 -9 గంటల మధ్య ఆమె ఎక్కడుందని అడుగుతాడు. ఆ తర్వాత వెళ్లి పై అధికారి (నాజర్) ని కలుస్తాడు.  హెల్ప్ లేకుండా ఇద్దరు లేడీస్ చంపి శవాన్ని తెచ్చి బీచ్ రోడ్డులో పడెయ్యడమా... ఎవరో హెల్ప్ చేసి వుండాలనీ, అతను లవరై వుండొచ్చనీ అంటాడు పై అధికారి.

        కార్తికేయ ఇంకో జయంతి కొలీగ్ ని విచారిస్తాడు. జయంతి ఎదుటి ఫ్లాట్ లో వున్న ప్రభాకర్ ప్రవర్తన గురించి చెప్తుంది కొలీగ్. మార్నింగ్ ప్రభాకర్ ఫ్లాట్ దగ్గర నిఘా వేస్తాడు కార్తికేయ. ముందు జయంతి బయటికి వచ్చి కారెక్కి వెళ్ళిపోతుంది. ఆమె వెనకాలే వచ్చిన ప్రభాకర్ జాగింగ్ చేస్తూ వెళ్లి పోతూంటాడు. వాళ్ళిద్దరికీ ఏ సంబంధమూ లేదని నిర్థారించుకుంటాడు కార్తికేయ. 

           ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రభాకర్ ఎవరో తెలిసిందని వెబ్ సైట్లో చూపిస్తాడు. ప్రభాకర్  ని ఐపీఎస్ అధికారిగా  పేర్కొంటూ వున్న ఆ న్యూస్ చూసి స్టన్ అవుతాడు కార్తికేయ...అలీ గ్యాంగ్ ని పట్టుకున్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్...
          ఐపీఎస్ ప్రభాకర్ అలీ గ్యాంగ్ ని వెంటాడుతున్న దృశ్యంతో ఇంటర్వెల్.
***
          కార్తికేయ పై అధికారికి కాల్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతాడు. ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారి అనీ, అతడి గురించిన సమాచారం అతడి దగ్గర  పని చేసిన కోలా వెంకట్ అనే ఎస్సై కి తెలుసనీ అంటాడు పై అధికారి. కార్తికేయ కోలా వెంకట్ ని కలుసుకుంటాడు. ప్రభాకర్ చాలా మంచి ఆఫీసర్ అనీ, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నామనీ, ఆయన రెండేళ్ళ క్రితం రిజైన్ చేశారనీ అంటాడు కోలా వెంకట్. 

          ప్రభాకర్ ఐపీఎస్ మీద  దృశ్యాలు వస్తాయి. అలీ గ్యాంగ్ ని వెంటాడడం, అలీని పట్టుకుంటే అతను పగతో అరవడం వగైరా. ఈ వార్త న్యూస్ పేపర్లో ప్రముఖంగా వస్తుంది. 

          ఇక కార్తికేయ తిరిగి వచ్చి ప్రభాకర్ ని కలుస్తాడు. ఆ తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామనీ, ఇన్ఫర్మేషన్ కావాలనీ అంటాడు.  వాళ్ళనే పట్టుకుని అడగ మంటాడు ప్రభాకర్. కార్తికేయ పై అధికారి నాజర్ ని కలుస్తాడు. ప్రభాకర్ కి జయంతితో కాంటాక్ట్ వుండి వంశీ హత్య విషయంలో ఆమెకి హెల్ప్ చేసివుంటే, కాంటాక్ట్ లేనట్టే  రోజూ ఉదయం ఆమెని ఎందుకు ఫాలో అవుతున్నాడని అంటాడు నాజర్. 

       ప్రభాకర్ వర్రీ అవుతాడు. వెళ్లి లొంగి పోతాడు. వంశీని తనే హత్య చేశానంటాడు. అపార్ట్ మెంట్ లో వంశీ తన కెదురై జయంతి గురించి అడుగుతూంటే, వాళ్ళు బీచ్ రోడ్డుకి మారిపోయారని దారి మళ్ళించాననీ, రాత్రి బీచ్ రోడ్డులో వున్నఅతణ్ణి  చంపేశాననీ అంటాడు. 

          కార్తికేయ జయంతిని ప్రశ్నిస్తాడు. ప్రభాకర్ గురించి తనకేమీ తెలీదని అంటుంది. ప్రభాకర్ ని సైకియాట్రిస్టు విచారిస్తాడు. జయంతిని ప్రేమిస్తున్నానంటాడు ప్రభాకర్. మానసని కార్లో తీసుకుపోతున్న అదే దృశ్యాన్ని మళ్ళీ వూహించుకుంటాడు. ఒక చోటికి చేరుకున్నాక  పెళ్లిని ప్రతిపాదిస్తాడు. నువ్వు జయంతిని ప్రేమించలేదు, వూహించుకుని చెప్తున్నావని అంటాడు సైకియాట్రిస్టు. ఇతడి మాటలు నిరాధారాలని కార్తికేయకి  చెప్పేస్తాడు.  కేస్ క్లోజ్ అని కార్తికేయకి నాజర్ చెప్పేస్తాడు.

          కార్తికేయ ఒప్పుకోడు. తను జయంతి ఫ్లాట్ కెళ్ళినప్పుడు డోర్ చైన్, గ్రానైట్ దిమ్మె డ్యామేజీ అయివుండడాన్ని గుర్తు చేసుకుని, హత్యా దృశ్యాన్ని అల్లుతాడు. వంశీ వచ్చి మీటర్ రీడింగ్ అంటూ డోర్ బెల్ నొక్కిందగ్గర్నుంచీ, తల్లి కూతుళ్ళు అతణ్ణి చంపిన విధానం, ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి హెల్ప్  చేస్తాననడం వరకూ దృశ్యాన్ని అల్లి చెప్తాడు. 

          హత్య రాత్రి 8 - 9 మధ్య జరిగినట్టు పీఎం రిపోర్టు వుందనీ, ఆ సమయంలో తల్లీ కూతుళ్ళ ఎలిబీలు చెక్ చేశాననీ, వాళ్ళు ఇంటి దగ్గరే వున్నారనీ, 8.30 కి వాటర్ బాయ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు చూశాడనీ, ఆ తర్వాత వాళ్ళు చంపి శవాన్ని తీసి కెళ్ళి బీచ్ రోడ్డులో పడేసి తగులబెట్టారనుకున్నా, 9 గంటలకి బీచ్ రోడ్డులో మంటని చూసినట్టు సాక్షి చెప్పినప్పుడు - అంత స్వల్ప వ్యవధిలో తల్లీ కూతుళ్ళు శవాన్ని తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవడం అసాధ్యమనీ, కనుక వాళ్ళని అనుమానించ లేమనీ వివరిస్తాడు నాజర్. 

       కార్తికేయ జిల్లా వార్తల్లో ఒక కేసు చూస్తాడు – 4 వ తేదీ నదిలో కొట్టుకు వచ్చిన మంత్రి తమ్ముడు వంశీ శవం గురించి. వెంటనే ఎలర్ట్ అవుతాడు. ఇప్పుడు కేసు అర్ధమైనట్టు ప్రభాకర్ తో చెప్తాడు. వంశీ హత్య 6 వ తేదీ కాదు, 4 వ తేదీన జరిగిందనీ. ఆ శవాన్ని ప్రభాకర్ నదిలో పడేశాడనీ, అది పక్క జిల్లాకి కొట్టుకు పోయి దొరికితే అది జిల్లా వార్త అవుతుంది తప్పితే ప్రముఖ వార్త అవదని అనుకున్నాడనీ, అసలు వంశీని తను చంపలేదనీ, చంపిన తల్లీ కూతుళ్ళని కాపాడడానికి శవాన్ని మాయం చేశాడనీ, ఆతర్వాత 6 వ తేదీ రాత్రి బీచ్ రోడ్డులో  అలీని హత్య చేసి ఆ శవాన్ని వంశీగా నమ్మించే ప్రయత్నం చేశాడనీ చెప్పుకొస్తాడు. 

          ప్రభాకర్ జయంతిని  కలిసి సరెండర్ అవుతున్నట్టు చెప్తాడు. చెయ్యని హత్యకి మీరెందుకు సరెండర్ అవాలని అంటుందామె. అప్పుడు మానస గురించి చెప్తాడు. మానస లాగే వున్న నిన్ను చూసి హెల్ప్ చేశాను, సరెండర్ అవుతున్నది వంశీ హత్యలో కాదు, మానసని చంపిన అలీని చంపిన కేసులో... కాబట్టి మీరు సేఫ్ అంటదు.  ఆమె ఏడుస్తుంది.      

         లొంగిపోయిన ప్రభాకర్ కార్తికేయతో చెప్తాడు  - జయంతి భయపడితే తట్టుకోలేననీ, ఆమె భయం పోగొట్టడానికి ఎన్ని హత్యలైనా చేస్తాననీ అంటాడు. చేయని హత్య గురించి పిచ్చిగా మాట్లాడుతున్నాడనీ, తన భార్యని చంపిన అలీని చంపినా, ఆ తల్లీ కూతుళ్ళ పట్ల మానవత్వంతో ప్రవర్తించి నేరం తన మీదేసుకున్నాడనీ, ఇలాటి ఐపీఎస్ ని మనం కాపాడుకోవాలనీ, కేసు క్లోజ్ చేస్తాడు నాజర్.
(విశ్లేషణ రేపు) 

 
సికిందర్  
telugurajyam.com