రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 5, 2018

681 : స్ట్రక్చర్ అప్డేట్స్



    S –Specific : మీ ప్రధాన పాత్ర గోల్ నిర్దిష్టంగా, పటిష్టంగా వుండాలి. అస్పష్టంగా, నైరూప్యంగా వుండకూడదు. మీ ప్రధాన పాత్ర గోల్ విస్పష్టంగా లేనప్పుడు, కథనాన్ని థీమ్ మింగేసి, కథ నత్తనడక నడుస్తూ లక్ష్య రహితంగా వుంటుంది. దీనికి మీ ఫ్యాన్స్ సంతృప్తి చెందే అవకాశం లేదు. 

     SMART ఫ్రేమ్ వర్క్ లోని అన్ని ఎలిమెంట్స్ లో S ఎలిమెంట్ అత్యంత ముఖ్యమైనది. అందుకని మీ ప్రధానపాత్ర గోల్ నిరుష్టంగా వున్నప్పుడు, ఇక మిగతా కథా పథకం పరికరాలన్నీ యాదృచ్ఛికంగా వాటి స్థానాల్లో అవి భర్తీ అయిపోతాయి. ఉదాహరణకి, మీరు తన నుంచి తాను విముక్తి పొందాలనుకుంటున్న ప్రధాన పాత్రతో కథ రాయాలనుకున్నా రనుకుందాం – చూడ్డానికి ఈ గోల్ అర్ధవంతంగానే, ఆకట్టుకునేదిగానే వుంటుంది గానీ తగినంత నిర్దుష్టంగా వుండక, అస్పష్టంగా వుంటుంది.

      
అందుకని ఆ ప్రధానపాత్ర తన నుంచి తాను ఎలా విముక్తి పొందగలడో ఒక బాహ్య చర్యని మీరు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. ‘ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్’ నే తీసుకుంటే, ఇందులో ప్రధాన పాత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. ఇతడికి గతంలో జాన్ ఎఫ్ కెన్నెడీని కాపాడలేక పోయానన్న అపరాధభావం వెన్నాడుతూంటుంది. అందుకని ప్రస్తుత అమెరికా  అధ్యక్షుణ్ణి కాపాడి, ఆ అపరాధభావం నుంచి విముక్తి పొందుతాడు. ఇప్పడు గోల్ ఎంత నిర్దుష్టంగా, విస్పష్టంగా వుందో గమనించండి. అధ్యక్షుడి ప్రాణాలని కాపాడే గోల్ తో వున్న ప్రధానపాత్రని చూస్తే, ఇతను గతం తాలూకు అపరాధభావం నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేస్తున్నాడని ప్రేక్షకులు వెంటనే అర్ధం జేసుకుంటారు.



     మీరు యాక్షన్, మిస్టరీ, లేదా థ్రిల్లర్ కథ రాస్తూంటే, ప్రత్యర్ధి పాత్ర పాయింటాఫ్ వ్యూతో మేధోమధనం జరిపి రాయడం మొదలెట్టి నప్పుడు, అది నిర్మాణాత్మకంగా వస్తుంది. అసలు ప్రత్యర్ధి పాత్ర ఏం చేయాలనుకుంటోంది? దీన్ని నిర్దుష్టంగా నిర్వచించండి. దీని తర్వాత సింపుల్ గా, ప్రధాన పాత్ర గోల్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. అప్పుడిక ప్రత్యర్ధి పాత్ర ఏ అపాయం తలపెట్ట బోతోందో దాన్ని ప్రధాన పాత్ర ఆపేందుకు SMART ఫ్రేమ్ వర్క్ లోని ఒక్కో ఎలిమెంట్ తో తీర్చిదిద్దుకుంటూ పోండి.  

(రేపు M ఎలిమెంట్)


ఒక ఆస్కార్ పరిచయం



        కొన్ని సినిమాలు గొప్పవి ఎందుకవుతాయి? అలాంటి గొప్ప సినిమాల్లో ఏదో మనల్ని ఆకట్టుకునే అంశం వుంటుందా? అంత ఆకర్షణ సినిమాలకెందుకు? ప్రభావం చూపించగలిగే శక్తి ఎలా వస్తుంది సినిమాకి? గొప్ప సినిమాలు గొప్పవి ఎందుకవుతాయంటే అవి విలువల గురించి గొప్పగా చెప్తాయి. విలువలే మనిషికి మనిషిగా గుర్తింపునిచ్చేది. మనం విలువలపై నిలబడకపోయినా, సినిమాలో కొన్ని పాత్రలు విలువల్ని నిలబెడతాయి. అక్కడే మానవత్వం బయటపడేది. మానవత్వంతో కూడిన ప్రతి విషయం మనల్ని ఆకట్టుకుంటుంది, గుర్తింపు పొందేలా చేస్తుంది.
         
ప్పుడప్పుడే సినిమాలని అర్ధం చేసుకుంటూ, సినిమా విద్యని అభ్యసిస్తున్న రోజులవి. మిత్రుడు అల్లం శశిధర్ పరభాషా చిత్రాలని పరిచయం చేసేవాడు, అలా అతను పరిచయం చేసిన ఒక చిత్రం అమెరికన్ బ్యూటీ. కొన్ని విషయాలు ఎదుగుతున్నపుడు ప్రభావం చూపిస్తాయి, అలాగే కొన్ని సినిమాలు మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి... అలాంటి సినిమా గురించే మనమిపుడు చర్చించుకోబోతున్నాం. మకుటం చూడగానే ఇదేదో యువత మెచ్చే మసాలా సినిమాలా వుంటుంది అనిపిస్తుంది, చూచిన తర్వాత తెలుస్తుంది దాన్లో ఎంత వ్యంగ్యం వుందో  - ఎంతటి అంతరార్ధం వుందో. వ్యంగ్యం అసాధారాణమైన రచనా శైలి -  సమాజంలో పోకడలని జీర్ణించుకోలేని రచయిత దాన్ని అవహేళన చేయడమే వ్యంగ్య రచన. 

         
ఇక సినిమా విషయానికి వస్తే....ఇదెందుకు గొప్ప చిత్రమైందో, దానిలో విలువల గురించి చర్చించారో తెలుసుకుందాం.

         ప్రస్తుతం మనం చర్చిస్తున్న సినిమాలో కథానాయకుడు ద్వంద్వాలకి బాధితుడవుతాడు? ఆకర్షణలో అతను చిక్కుకుని దాన్నుండి అతను విమోచనం చెందాలి. అదే సినిమాలో చర్చించే విలువలు. ఆకర్షణ అతనికి ప్రేరణ కల్పిస్తే - విమోచనం చెందుతున్నపుడు అతడు సంస్కరించబడతాడు. పూర్తిగా మారిపోతాడు, అప్పుడతను అతను గతంలో వున్నలాటి  వ్యక్తి ఎంత మాత్రమూ కాబోడు. ద్వంద్వ విలువలతో కథ చెప్తునపుడు కథానాయకుడిలో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మార్పు లేని వ్యవస్థ ఏదీ మనలేదు - డ్రామా అనే రసంలో అత్యద్భుతమైన స్థితిని చూపేది మార్పే. మార్పు మంచికైనా కావచ్చు,  లేడూ చేటైనా  చేయవచ్చు. మార్పు గురించి చెప్పటం ద్వారానే వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి మానవత్వం గురించి కథ మనలోనిచైతన్యాన్ని తట్టిలేపుతుంది. వాస్తవానికి రచయితలు కథలు రాయడంలో పరమార్ధం ఇదే అయి వుండాలి.

          ప్రారంభంలోనే  థోరా బిర్చ్  అనే అమ్మాయి  తన తండ్రిగా ఎలాంటి వ్యక్తిని ఊహించుకుంటుందో చెప్తూ, తన తండ్రిలాంటి కాముకుడ్ని చూడలేదని అంటుంది. ఆమె స్నేహితుడు వెస్ బెంట్లీ - నీ కోసం నీ తండ్రిని చంపమంటావా అంటాడు....కథ మొదలైన ఐదు నిమిషాల్లోపే తన కథా ప్రపంచం ఎలాంటిదో రచయిత పరిచయం చేసాడు. వ్యక్తులు వ్యక్తిత్వాలు మెల్లగా ఒక్కోటి రచయిత బయటపెడతాడు.

         
కథా ప్రపంచం నుండి మెల్లగా కథానాయకుడి ప్రపంచంలోకి ప్రయాణిస్తాం. కథ (Subject) సముద్రమంత విశాలమైనది, కథానాయకుడు (Goal or Object) దానిలో ప్రయాణించే నావలాంటి వాడు. అతన్ని అర్ధం చేసుకోవటం ద్వారా మాత్రమే మనం కథని అర్ధం చేసుకోగలం.

          కెవిన్ స్పెసీ
 తన గురించి తాను చెప్పుకుంటూ మనకి పరిచయం అవుతాడు. తనుండే వీధి, ఇల్లు పరిచయం చేస్తూ త్వరలోనే తను మరణిస్తానని చెప్తాడు. తనని ప్రత్యక్షంగా చూడగానే అతను చేసే పని నిద్రలేచి స్నానాల గదిలో హస్తప్రయోగం చేసుకుంటాడు. ఇది యువతని ఉత్తేజ పరిచే సందర్భమే కావచ్చు కానీ వయసులో పెళ్లి అయి కూడా పని చేయటానికి కారణమేంటి అనే ఆలోచన కలిగితీరాలి. చూస్తుండగా అలోచన కలుగజేయటం రచయితలోని అద్భుతమైన మేధని బయటపెడుతుంది. ఎందుకంటే సినిమాలు చూచేది యంత్రాలు కాదు, మనుషులు. వాళ్లు ఆలోచిస్తారు.

      భార్య వస్తువుల పట్ల, పువ్వుల పట్ల ఎంతో సున్నితంగా ప్రవర్తిస్తుంది. ఇతనేమో రోజులో తనకి అత్యంత ఆనందాన్నిచ్చే సమయం ఇదే అంటాడు. ఇంతలో ఇరుగుపొరుగు పరిచయం...తెచ్చిపెట్టుకున్న నవ్వు, తప్పదనే పలకరింపు....వాళ్లని చూస్తూ అతను తాము గతంలో ఎంత ఆనందంగా వుండే వాళ్లమో చెప్తూ తన భార్య పరాయి మగాడితో చనువుగా వుండటాన్ని చూస్తూ ఆగ్రహంగా వున్నట్టు కనిపిస్తాడు....దానికి కారణం తర్వాత చెప్తాడు రచయిత. కథని అవసరమైనపుడే విప్పాలి. కూతురు యవ్వనంలో తన శరీరంలో కొలతల పట్ల కలత చెందుతూ  కనిపిస్తుంది. అతను తన భార్య కూతురు తనని పనికిమాలిన వాడిగా భావిస్తారని చెప్తాడు. తనేదో కోల్పోయానని అదేమిటో తనకి తెలియదని, కోల్పోయింది తిరిగి పొందటం అసాధ్యం కాదని చెప్తాడు. తను పని చేసే పత్రికలో ఉద్యోగం పట్ల అసంతృప్తిగా వుంటాడు. ఉద్యోగం విషయం భార్యాభర్తల మధ్య వివాదానికి కారణం అవుతుంది. రాత్రి భోజనాలపుడు వారి మధ్య బంధాలు ఎంత బలహీనంగా వున్నాయో అర్ధం అవుతుంది. కొత్త వాళ్లు పక్కింట్లో అద్దెకు దిగుతారు. పక్కింటి కుర్రాడు వీడియో తీస్తూ కనిపిస్తాడు. 

          అనెట్ బెనింగ్  (భార్య)  పాత్ర రియల్ ఎస్టేట్లో ఎదగటానికి ఎంత విఫలయత్నం చేస్తుందో అర్ధమవుతుంది.ఇలా మొదలైన కథలో కీలకమైన కొక్కెం (Hook) పడే సమయం వచ్చేసింది. మెనా సువారీ  పాత్రని చూడగానే కథానాయకుడిలో తనేం పోగొట్టుకున్నాడో తనకి తెలిసివస్తుంది. అదే అతన్ని ఆకర్షణలోకి లాగుతుంది. ఇలా కథపై ఆసక్తి (Curiosity) మొదలవుతుంది. అలా మొదలైన ఆకర్షణ...

         
ఆమె  పరిచయం ఐన దగ్గరి నుండి ఆమె ఆలోచనలే, ఆమెతో మాట్లాడటానికి యువకుడిలా ప్రయత్నాలుఇదే సమయంలో కథానాయకుడి కూతుర్ని పక్కింటి కుర్రాడు మౌనంగా  ఆరాధిస్తుంటాడు. పక్కింటి కుర్రాడి ఇంట్లో సన్నివేశం అతని తల్లి మానసికంగా ఎలాంటి స్థితిలో వుందో పరిచయం చేస్తుంది. తల్లి పంది మాంసం కుర్రాడికి వడ్డిస్తుంది, నేను పంది మాంసం తినను కదా అని కొడుకు అంటాడు. ఆమె తనని తాను మరచిపోయింది, ఎందుకు అనేది భర్త పాత్రని చూపించటం ద్వారా అర్ధమయ్యేలా చెప్తాడు. క్రిస్ కూపర్  ఆమె భర్త డోర్ బెల్ మోగితేనే ఇంటికి ఎవరైనా వచ్చే వాళ్లున్నారా అని భార్యని అడుగుతాడు. పొరుగు వాళ్లు పలకరించటానికి వస్తే వాళ్లని సేల్స్మెన్ అనుకుని అదే వాళ్లని అడుగుతాడు. అతను మిలటరీలో పనిచేసినవాడు క్రమశిక్షణ ప్రతి సందర్భంలో చూపిస్తాడు. భార్య దగ్గర కొడుకు దగ్గర కూడా అతని మిలటరీ దర్పం చూపిస్తాడు. అదే క్రమంగా అతని భార్యలో తనని తాను మర్చిపోయే స్థితిని తెచ్చింది.

      కథలో పార్టీ సన్నివేశం కీలక మలుపు (ప్లాట్ పాయింట్ -1), భార్య పరాయి మగాడితోచనువుగా 

వుండటాన్నిజీర్ణించుకోలేని  కథానాయకుడు బాధగా వుంటాడు. పక్కింటి పార్టీలో  కథానాయకుడికి పరిచయమయి డ్రగ్ ఇస్తాడు. తన కూతురి స్నేహితురాలితో పరిచయం, ఆమె ఆలోచనలు క్రమంగా ఆమెపై అంతులేని ఆకర్షణగా మారతాయి. క్రమంగా తన శరీరాకృతి నాజూగ్గా చేసుకోవటంపై దృష్టి పెడతాడు.  ఉద్యోగం మానేస్తాడు. భార్య రియల్ ఎస్టేట్లో దిగ్గజం మోజులో పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతాడు, అక్కడే భార్య రియల్ ఎస్టేట్ దిగ్గజంతో కలిసి వుండటం చూస్తాడు. కూతురు పక్కింటివాడితో ప్రేమలో పడుతుంది. కుటుంబంలో కలహాలు మామూలే. 


         
భార్య రియల్ ఎస్టేట్లో తన చేతకాని తనం, భర్త ప్రస్తుత స్థితి, తను చేస్తున్న తప్పు పని, భర్తపై చులకన భావం అవి ఇంట్లో గొడవలుగా పరిణమిస్తాయి. తల్లి చేతిలో దెబ్బలు తిన్న కూతురు పక్కింటివాడి ప్రేమలో స్వాంతన పొందుతుంది. అది చూచిన పక్కింటివాడి తండ్రి అతన్ని దండిస్తాడు. ఇక్కడి భార్యతో హీరో ప్రణయానందంలో వున్నపుడు ఆమె మనస్తత్వం మనకి పూర్తిగా అర్ధమవుతుంది. అతను బంధాలకి భావాలకి ప్రాధాన్యత ఇచ్చేవాడు, ఆమె వస్తువులకి సమాజంలో తనుండే స్థితికి విలువనిచ్చేది. ఇలా వారిద్దరూ భిన్న ధృవాలని మనకి పూర్తిగా అర్ధం అవుతుంది.

         
సినిమా మొదట్లో యువతి యువకులు మాట్లాడుకున్న సన్నివేశం ప్రస్తుతం మనం చూస్తాం. సైకోగా పొరబడిన పక్కింటివాడ్ని కథానాయకుడి కూతురు ప్రేమిస్తుంది. తండ్రి తన స్నేహితురాలితో చనువుగా వుండటాన్ని కూతురు అభ్యంతరం చెప్తుంది. తన కొడుకు పక్కింటివాళ్లతో చనువుగా వుండటాన్ని మిలటరీవాడు గమనిస్తాడు, అతను కొడుకు జీవితాన్ని అణువణువునా గమనిస్తున్నాడని మనకి అర్ధం అవుతుంది. అలా గమనిస్తూ వుండగానే ఒకరోజు తన కొడుకు కథానాయకుడు కలిసి వున్నపుడు అపార్ధం చేసుకుంటాడు. వారిద్దరి కలయికకి తనదైన అర్ధమ్ తీసుకుంటాడు. కొడుకుని మందలిస్తాడు కీలకమైన మలుపు (ప్లాట్ పాయింట్ - 2). పక్కింటి కుర్రాడు ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాడు. బాధపడిన మిలటరీ తండ్రి కథానాయకుడ్ని కలిసి పరీక్షిస్తాడు అపార్ధాన్ని మరింత బలవత్తరం చేసుకుంటాడు. స్నేహితురాలితో  కథానాయకుడి కూతురు గొడవ పడుతుంది. స్నేహితురాలు ఒంటరిగా వుంటుంది. ఆమెకి కథానాయకుడు సరైన తోడు అనిపిస్తుంది. ఇద్దరు దగ్గరయ్యే సందర్భం వస్తుంది. బయట కథానాయకుడి భార్య కారులో వేదన పడుతూ తను ఓటమిని అంగీకరించనని చెప్తూ రివాల్వర్ బయటికి తీస్తుంది, వర్షం పడుతూ వుంటుంది.

         
కథానాయకుడి కూతురి స్నేహితురాలితో సంగమించబోయే సందర్భంలో తనకిదే మొదటి అనుభవం అని చెప్తుంది. తను చేస్తున్న తప్పేమిటో అతనికి అర్ధం అవుతుంది. క్షణం అతను మారతాడు. తను చేయేబోయిన పనికి పశ్చాత్తాప పడి అమ్మాయిని స్వాంతన పరిచి అక్కడి నుండి వెళతాడు. చివరి క్షణాలు కుటుంబం గురించి, భార్య కూతుళ్ల గురించి వాళ్ల ఫొటోలు చూస్తూ ఆనందంగా గడుపుతాడు. ఇంతలో తుపాకి పేలిన శబ్ధం, రక్తపు మడుగులో కథానాయకుడు. అతన్ని, రక్తాన్ని సంఘటనలో సౌందర్యాన్ని పక్కింటి కుర్రాడు గమనిస్తుంటాడు....కథానాయకుడి స్వగతం వినటంతో సినిమా ముగుస్తుంది.

      మరణానికి ముందు చివరి క్షణాల్లొ మన పూర్తి జీవితం మన కళ్ల ముందు కనిపిస్తుంది అని చెప్పి. అతని అనుభవం ఇలా చెప్తాడు చివరి క్షణాలు, క్షణాలు కాదు, అనంత కాల ప్రవాహం బాల్య స్మృతులతో మొదలై యవ్వనం, జీవితంలో వ్యక్తులు, దగ్గర వ్యక్తులు భార్య కూతురు గురించి చెప్పి "నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా నేను ప్రతికూలంగా ఆలోచించవచ్చు కానీ నా చుట్టూ ఇంత సౌందర్యం వుండగా పిచ్చివాడిగా బతకటం అసాధ్యం అని నేను భావిస్తాను". స్వగతం మాంటేజ్లో చెప్తూ చివరి క్షణాలు సుడిగాలిలో ఎగిరే తగరపు సంచిపై ముగిస్తాడు - చివరికి అతనుండే వీధి చూపిస్తాడు దర్శకుడు. దాని అర్ధం ఏమై వుండాలి?

         
మనం భావాల సుడిగుండంలో బ్రతికుతున్నాం. భావాలే మనం - అనుకున్నంత కాలం వాటిల్లోనే సుడిగాలిలో సంచి తిరిగినట్టు తిరుగుతూ అక్కడే వుంటాం. కథానాయకుడిలో మార్పు చూపించి అతనికి తన భావాల నుండి విముక్తి కల్పించి కథలో అపార్ధం నుండి బయటపడిన వ్యక్తిగా చూపించాడు. అలా తనని తాను తెలుసుకున్న క్షణం ప్రపంచం నుండి అతనికి విముక్తి లభించింది....మరి కథలో చైతన్యాన్ని తట్టి లేపే అంశం ఏమై వుండాలి?

         
దీన్లో అపార్ధం నుండి బయటపడే పాత్ర కథానాయకుడొక్కడే. మిగతా పాత్రలన్నీ అపార్ధం చుట్టూ తిరుగుతూంటాయి. అదే మానవ సంబంధాల్ని దెబ్బతీస్తుంది. అదే చివరికి కథ చూచాక అర్ధం చేసుకోవల్సిన విషయం. అపార్ధం మానవ సంబంధాల్ని దెబ్బతీస్తుంది అనే చిన్న థీమ్ఎంత గొప్ప కథని తయారు చేసిందో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.

మూల్పూరి. ఆదిత్య చౌదరి

(ఆదిత్య పదేళ్ళ తర్వాత ప్రత్యక్షమై ఈ వ్యాసం రాసి పంపాడు.
గతంలో ‘నవతరంగం’  సైట్లో రాసేవాడు. దర్శకత్వ ప్రయత్నాల్లో
వున్నాడు
. స్క్రీన్ ప్లే నాలెడ్జి సంపాదించుకున్నాడు. ఇక సినిమా
తీయడమే తరువాయి. మూస కథలు ఆలోచించడు. అదీ ప్రత్యేకత)