రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 31, 2017

          టీవలి సంవత్సరాల్లో చూసుకుంటే, ఏడాదికి సుమారు వందమంది కొత్త దర్శకులు తెలుగులో రంగ ప్రవేశం చేస్తున్నారు. కొత్తగా వచ్చే దర్శకులెవరైనా బడ్జెట్ మూవీస్ తో మొదలవ్వాల్సిందే. రాను రాను కొత్త దర్శకుల బడ్జెట్ మూవీల సంఖ్యా పెరిగిపోతోంది. గత సంవత్సరమే రికార్డు స్థాయిలో 117 విడుదలయ్యాయి. అంటే 117 మంది కొత్త దర్శకులన్నమాట. వీళ్ళు తీస్తున్న బడ్జెట్ మూవీస్ సగటున వారానికి మూడు చొప్పున విడుదలవుతున్నాయి. మూడూ అట్టర్ ఫ్లాపవుతున్నాయి. వారం వారం ఓ ఐదారు కోట్లు బడ్జెట్ సినిమాల పేరిట కోల్పోతున్నాయి కనీసం మూడేసి బ్యానర్లు. ఏడాదికి 156 కోట్లు కోల్పోతున్నాయి సదరు బ్యానర్లు.  ఇందులో వ్యాపారం చేయరాక నష్టపోయే బ్యానర్లు కొన్నే. ఈ నష్టాన్నే లెక్కించాలి. మిగతా వ్యాపారంకోసం కాక మరింకెందుకో కోల్పోయే బ్యానర్ల గురించి బాధపడనవసరం లేదు. వాటి దృష్టిలో అది కోల్పోవడం కాదు. అయినా మొత్తంగా చూస్తే  బడ్జెట్ సినిమాల సెగ్మెంట్ ని ఒక పెద్ద నష్టాల ఊబిగా,  భయంకరమైన ‘బి’ గ్రేడ్ లోయగా తయారు చేసి పెట్టారు. తీసిన బడ్జెట్ మూవీస్ ని  కొనే నాధుడుండడు, బ్యానరే మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని విడుదలచేసుకోవాలి. అది ఎందుకూ పనికిరాని విడుదల. శాటిలైట్ హక్కులూ రావు. ఒకప్పుడు విడుదల చూపించుకుంటే ఎంతో కొంత శాటిలైట్ హక్కులైనా  వచ్చేవి. ఇప్పుడు విడుదలే శాపంగా మారింది.

          ఒకప్పుడు బడ్జెట్ సినిమాలు కాస్త క్వాలిటీతో తీసేవిగా- క్వాలిటీ లేని నాసిరకం ‘బి’ గ్రేడ్ గా తీసేవిగా రెండు రకాలుండేవి. ఇప్పుడు బడ్జెట్ మూవీస్ కి అంతా  కలిపి ఒకటే గ్రేడ్ కన్పిస్తోంది - నాసిరకం ‘బి’ గ్రేడ్! ఇందుకే వీటివైపు ఎవరూ కన్నెత్తి చూడ్డం లేదు. రివ్యూలకీ నోచుకోవడం లేదు. బ్యానర్లు కూడా ‘బి’ గ్రేడ్ కిందికి  దిగజారిన బడ్జెట్ మూవీస్ నే ఇంకా తీస్తూ నష్టపోతున్నాయంటే  రకరకాల కారణాలున్నాయి...హాబీ కోసమో, ఎంజాయ్ మెంటు కోసమో, మీడియాలో ఇమేజి బిల్డప్  కోసమో  తీసి నష్టపోతే అది నష్టం కిందికి రాదు. ఇమేజి కోసం పెట్టుబడి కిందికి, జాయ్ రైడ్ జేబు ఖర్చుల కిందికి వస్తుంది. బ్లాక్ తో నష్ట పోతే అది వైట్ కిందికి మారిపోతుంది కనుక ఇది కూడా నష్టం కాదు. ఈ  బ్యానర్లు తీసే ఆ ఒక్క  ఫ్లాప్ తో వెళ్ళిపోతాయి. వీటి తోబాటు ఆ కొత్త దర్శకులూ ఇంటికెళ్ళి పోతారు. ఇలా కాక సిన్సియర్ గా వ్యాపారం కోసంవచ్చి అవగాహనా రాహిత్యంతో నష్టపోయే బ్యానర్స్ గురించే ఆలోచించాలి. ఓ నాల్గేళ్ళ క్రితం బడ్జెట్ మూవీస్ 60- 70 కి మించేవి కాదు. అవి కూడా ‘బి’ గ్రేడ్ కి దిగజారిన నష్ట జాతకాలే. బడ్జెట్ సినిమాలు చాలా పూర్వం కూడా వుండేవి. వాటి సక్సెస్ రేటు కూడా తక్కువే అయినా సక్సెస్ అయ్యాయంటే పది, ఇరవై రెట్లు లాభాలు తెచ్చి పెట్టేవి.

           యాభై లక్షలతో ‘చిత్రం’ తీస్తే 10 కోట్లు,  రెండు కోట్లతో ‘నువ్వే కావాలి’ తీస్తే 20 కోట్లు ఎలా వచ్చాయో ఇప్పుడాలోచిస్తే బుర్ర తిరుగుతుంది. ‘ఐతే’, ‘హేపీ డేస్’, ‘జయం’, ‘ఆనంద్’ లాంటివి కూడా  మంచి ఆర్ధిక విజయాలు చవి చూసిన బడ్జెట్ మూవీసే.

          అప్పట్లో బడ్జెట్ మూవీస్ నుంచి స్టార్లుగా,  పోనీ పాపులర్ హీరో హీరోయిన్లుగా ఎదిగి వచ్చిన వాళ్ళుండే వాళ్ళు.  ‘అల్లరి’ తో నరేష్, ‘చిత్రం’ తో ఉదయ్  కిరణ్, రీమా సేన్, ‘నువ్వే కావాలి’ తో తరుణ్, రిచా పల్లోడ్, సునీల్, ‘జయం’ తో నితిన్, సదా, గోపీచంద్, ‘ఐతే’ తో శశాంక్, సింధూ తులానీ, ‘ఆనంద్’ తో రాజా, కమలినీ ముఖర్జీ,  ‘హేపీ డేస్’ తో తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్ లు...ఇలా లిస్టు థ్రిల్లింగ్ గా వుంటుంది. ఇప్పటి లిస్టులో చూడ్డాని కేమీ వుండదు. ఏ కొత్త హీరో ఎవరో, ఎవరొచ్చి పోతున్నాడో; ఏ కొత్త హీరోయిన్ ఎవరో, ఎవరొచ్చి పోతోందో అంతా ‘బి’ గ్రేడాట మాయ! 

          ఆనాటి  బడ్జెట్ మూవీస్ తో వచ్చి పాపులరైన దర్శకుల్లో తేజ, శేఖర్ కమ్ముల, వీఎన్ ఆదిత్య, చంద్ర శేఖర్ ఏలేటి, విజయభాస్కర్, రవిబాబు లాంటి వాళ్ళు ఎందరో  నిలదొక్కుకుని ఆపైన మరిన్ని తీస్తూ పోతే, ఇప్పుడు తీస్తున్న కొత్త దర్శకులందరూ ఆ మొదటి  దాంతోనే  అదృశ్యమైపోతున్నారు. ఎవరొస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా పేర్లు తెలీనంతగా.  \

          ఇలా ఓ సక్సెస్ ని  గానీ, భావి హీరో హీరోయిన్లని గానీ, భావి దర్శకుల్ని గానీ అందించలేని దైన్యంతో   ‘బి’  గ్రేడ్ కి దిగజార్చేశారు బడ్జెట్ మూవీస్ ని!

    బడ్జెట్ మూవీస్ ని  దేనికీ వుపయోగపడని ‘బి’ గ్రేడాటగా మార్చేశాక, బడ్జెట్లు పెంచెయ్యడం ఇంకో ఫ్యాషన్ గా  మారిందిటీవల.  కోటితో పోయే ‘బి’ గ్రేడ్ కి గ్రాండ్ గా రెండు కోట్లు,  కాస్త ఆడితే తప్ప ఏ శాటిలైట్ హక్కులకీ  గ్యారంటీ లేని ‘బి’ గ్రేడ్ కూడా కాని నాసిరకానికి కూడా, రెండూ ప్లస్ పబ్లిసిటీ ఇరవై  = రెండూ  ఇరవై అని  ఫిగర్  చెప్పడం కొందరు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కొత్త దర్శకులకి ఫ్యాషన్ గా మారిపోయింది. వ్యాపారానికి కాక ఇంకోలా వాడుకోవడానికి వచ్చే బ్యానర్లకి ఐదు కోట్లకి గాలం వేసినా వేయాల్సిందే. ఒక కొత్త బ్యానర్ పుత్రరత్నమే హీరో అవాలనే దుగ్ధతో వుంటే, ఆ ‘బి’ గ్రేడ్ బడ్జెట్ ని ఏకంగా  ఐదున్నర  కోట్ల మెగా బడ్జెట్ కి పెంచేసి  దుగ్ధ తీర్చిన కొత్త దర్శకుడు గొప్పోడే. ఎలాటి వాడికి అలాటి వాడే  దొరుకుతాడు. అలాగని వున్న  నాల్గు వ్యాపారాలకి తోడు ఇదింకో వ్యాపారమని వచ్చే సిన్సియర్ బ్యానర్స్ తో కొత్త దర్శకుడు ఇలా చేస్తే గొప్ప కాదు. అది గొయ్యి తవ్వడం- తనకీ, ఆ సిన్సియర్ బ్యానర్ కీ కూడా. 

           కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరేవారు కొందరైతే;  మినిమం నాని, శర్వానంద్, సందీప్ కిషన్, రాజ్ తరుణ్ ల లాంటి స్టార్స్ ని కోరేవారు మరి కొందరు. ఈ రెండూ జాప్యానికి దారి తీసేవే. కొత్త దర్శకుడు కొత్త వాళ్లతో తీసే రోమాంటిక్ కామెడీ కో, దెయ్యం కామెడీ కో  అడుగుతున్న రెండు కోట్లకి పైబడి ఫ్యాన్సీ బడ్జెట్లు పెట్టే  బ్యానర్లు ముందుకు రావడానికి  ఎంత జాప్యం జరుగుతుందో; నాని టు రాజ్ తరుణ్ రేంజిలో అవకాశం దక్కించుకోవడానికీ అంతే  జాప్యం జరుగుతుంది. కొత్త దర్శకులకి స్టార్లు అవకాశం ఇవ్వాలని లేదు, ఇవ్వాలనుకుంటే రెడీగా డేట్లు వుండవు. ఏడాదో రెండేళ్ళలో  వేచివుండాలి. అప్పుడు కూడా పరిస్థితులెలా మారిపోతాయో తెలీదు. 

          ఇలా ఫ్యాన్సీ బడ్జెట్లు, స్టార్స్ తో అవకాశాలూ అనే పెద్ద కోరికలు పెట్టుకుని ఎక్కడేసిన గొంగళి అవుతున్న వాళ్ళూ  లెక్కలేనంత మంది.
***
       పై కెగరాలంటే కింద భూమి వుండాలి, భూమి లేకుండా పైకెగర లేవంటే రుచించదు. షార్ట్ కట్సే కావాలి. ఇదంతా  ఏ రూల్సూ లేని ఆటే  కాబట్టి ఏదైనా జరిగిపోవచ్చు. ఒక్కటే జరగడం లేదు. కోటితో తీస్తే పది,  పోనీ రెండు తెచ్చి పెట్టే  ఫస్ట్ టైం డైరెక్టర్ ఎవరూ కన్పించడం లేదు.  డాక్టర్ దాసరి నారాయణ రావు అక్కినేనితో ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ అనే పెద్ద సినిమా తీయక మునుపు తీసిన 20 సినిమాలూ బడ్జెట్ మూవీసే. బడ్జెట్ సినిమాల దర్శకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక కామెడీ సినిమాల దర్శకుడే లేనట్టు, బడ్జెట్ సినిమాల దర్శకుడంటూ  కూడా ఎవరూ లేరు.   ఓవర్ బడ్జెట్ ఫ్లాప్స్ ఇచ్చే కొత్త  దర్శకులు, అప్పుడే స్టార్స్ కి నిచ్చెనేసే కొత్తదర్శకులూ క్రిక్కిరిసి వున్నారు. 

          కోడి రామకృష్ణ కూడా బడ్జెట్ సినిమాల దర్శకుడుగా ప్రారంభంలో  పేరు తెచ్చున్నారు. తక్కువ బడ్జెట్ తో ఆయన తో తీస్తే మంచి లాభాలొస్తాయనే నమ్మకం వుండేది. ఇవ్వాళ పరుగెత్తి పాలు తాగేయడానికి వీలిచ్చేంత  సులభ  టెక్నాలజీ అందుబాటులో కొచ్చాక, నిలబడి నీళ్ళేందుకు తాగాలనుకుంటున్నారు. ఒకవేళ ఓ బడ్జెట్ సినిమాకి  కొత్త దర్శకుడు రూపాయి మీద హీన పక్షం పది పైసలు లాభం తెచ్చి పెట్టినా, మళ్ళీ ఇతర బడ్జెట్ నిర్మాతలకి అందుబాటులో వుంటాడన్న నమ్మకంలేదు. వెళ్ళిపోయి తనకి అందుబాటులో వుండని  స్టార్స్ కోసం ప్రయత్నాల్లో వుంటాడు పది పైసల సక్సెస్ తో. ఆ స్టార్సూ  దొరకరు, ఎందుకంటే అక్కడ రద్దీ ఎక్కువ. పైగా సీనియర్ దర్శకుల పోటీ. వాళ్ళని దాటుకుని పది పైసల కొత్త సక్సెస్ ఫుల్ దర్శకుడికి అవకాశం రావాలి. ఒకవేళ వచ్చినా వెంటనే ప్రారంభం కాదు. ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేసి వచ్చిన కొత్త దర్శకుడికి ఓ రేంజి స్టార్స్ అవకాశ మివ్వాలన్నా ఏంతో కాలం పడుతుంది.   

          దీంతో ఎవరైనా కొత్త దర్శకులు సక్సెస్ ఫుల్ బడ్జెట్ సినిమా తీసినప్పటికీ, మళ్ళీ  బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలకి అందుబాటులో వుండడం లేదు. దీంతో ఆ నిర్మాతలు ఇంకో ఫస్ట్ టైం దర్శకుణ్ణి నమ్మి మునిగిపోవాల్సి వస్తోంది. ఒక సక్సెస్  ఇచ్చిన బడ్జెట్  దర్శకుణ్ణి పట్టుకుందామంటే అతను  స్టార్స్ వెయిటింగ్ రూములో వెయిట్ చేస్తూంటాడు. అటు స్టార్ తో తీయలేకా, ఇటు ఇంకో బడ్జెట్  నిర్మాతకి ఉపయోగపడకా త్రిశంకు స్వర్గంలో కొట్టు మిట్టాడుతూ వుంటాడు. 

          చాలా విచిత్రంగా వుంటుంది.  ఒక కొత్త దర్శకుడుగా ఒకప్పుడు తను బడ్జెట్ మూవీ అవకాశం  కోసం బ్యానర్స్  చుట్టూ తిరిగిన నిరుద్యోగపు రోజుల్ని, పడిన పడిగాపుల్నీ  ఎలా మర్చిపోతాడో అర్ధం గాదు. ఇప్పుడు చూస్తే, కొత్త దర్శకుడిగా ఒక బడ్జెట్ మూవీ సక్సెస్ చేసి కూడా  స్టార్స్ దగ్గర మళ్ళీ అవే వెయిటింగ్ బాధలు పడుతూంటాడు. అదే నిరుద్యోగం చేస్తూ  టైం వృధా చేసుకుంటాడు. దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తను ఒంటరి వాడే. అయినా కనీసం పది మంది నిర్మాతల్ని కలుస్తూంటాడు అవకాశాల కోసం. ఏదో ఒక ఆశ, నల్గురితో సంబంధాలూ వుండి ఊరట లభిస్తుంది. అలా  కొత్త దర్శకుడుగా  ఒక బడ్జెట్ మూవీ పట్టుకుని సక్సెస్ ఇచ్చాడే అనుకుందాం, ఇక స్టార్ ముంగిట్లో వాలిపోయి మళ్ళీ ఒంటరి వాడైపోతాడు, మళ్ళీ నిరుద్యోగి అయిపోతాడు. తనని దర్శకుణ్ణి చేసిన బడ్జెట్ మూవీ సెగ్మెంట్ ని మర్చిపోతాడు. సక్సెస్ ఇచ్చిన ఇతడి కోసం బడ్జెట్ నిర్మాతలు ప్రయత్నిస్తే స్టార్ దగ్గర కన్పిస్తాడు. పైకెళ్ళి పోయినవాడు మన కెందు కొస్తాడులే అనుకుంటారు బడ్జెట్ నిర్మాతలు. ఇలా చుట్టూ నిర్మాతలతో సంబంధాలు కోల్పోయి, స్టార్ దగ్గర ఎటూ తేలక, ఒంటరి నిరుద్యోగపు వెతలు అనుభవిస్తూ వుంటాడు. కొంతకాలానికి ప్రేక్షకుల జ్ఞాపకాల్లోంచి కూడా చెరిగిపోతాడు. 

          ఒక బడ్జెట్ మూవీ సక్సెస్ చేసి ఆ సెగ్మెంట్ లో కింగ్ అన్పించుకున్నాక, వేరే కింగులున్న చోటికి ఛోటా కింగుగా ఎందుకెళ్ళాలో అర్ధంగాదు. ఢిల్లీ కింగ్ అన్పించుకున్న అరవింద్  కేజ్రీవాల్ ముందు తన రాజ్యంలో  తాను పూర్తిగా బలపడకుండా, అప్పుడే పంజాబ్ కీ, గోవాకీ వెళ్లి కంగు తిని-  ఢిల్లీ గల్లీలు కూడా  పోగొట్టుకున్న పరిస్థితే ఇదీ.   సినేరియా మారవచ్చు- పాత్ర ప్రయాణం మాత్రం ఎక్కడైనా ఒకలాగే వుంటుంది-  వుండాల్సిన తెలివితో వుండకపోతే. పరుగెత్తి పాలే తాగుదా మనుకుంటున్నారు. అయితే ఇలా ఎంత సేపు తాగుతామనే ఆందోళన కూడా  లోలోపల పీకుతూనే వుంటుంది. 

          ఇలా కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరడంతో, స్టార్స్ తో అవకాశాలు ఆశించడంతో, కొత్త దర్శకుడిగా  సక్సెస్ ఇచ్చినా  మళ్ళీ బడ్జెట్  సెగ్మెంట్ కి దూరమవడంతో,  బడ్జెట్ సినిమాలు ‘బి’ గ్రేడ్ అగ్నిగుండానికి ఆహుతవుతున్నాయి.

1. బడ్జెట్ సినిమాలు సక్సెస్ కావడం లేదు.
2. బడ్జెట్ సినిమాలు భావి హీరోహేరోయిన్లని అందించడం లేదు
3. బడ్జెట్ సినిమాలు భావి దర్శకులని తయారు చేయడం లేదు
4. బడ్జెట్ సినిమాలు ‘బి’ గ్రేడ్ కి దిగజారిపోయాయి.
5. కొత్త దర్శకులు ఫ్యాన్సీ బడ్జెట్లు కోరుతున్నారు.
6. కొత్త దర్శకులు స్టార్స్ తో అవకాశాలు ఆశిస్తున్నారు.
7. కొత్త దర్శకులు సక్సెస్ ఇచ్చి బడ్జెట్ నిర్మాతలకి దొరకడం లేదు.
8. కొత్త దర్శకులు బడ్జెట్ సినిమాల్ని ‘బి’ గ్రేడ్ అగ్నిగుండంలో పడేసి పోతున్నారు.
9. కొత్త బ్యానర్స్  వ్యాపారం కోసం రావడం లేదు.
10. కొత్త బ్యానర్స్ వ్యాపారం కోసం వచ్చినా ఏం తీయాలో తెలీడం లేదు.
11. కొత్త బ్యానర్స్  కొత్త దర్శకుల్ని తమ సారధిగా భావించడం లేదు.
12. కొత్త బ్యానర్స్ బడ్జెట్ మూవీస్ ని ‘బి’ గ్రేడ్ కి దించి వెళ్ళిపోతున్నాయి.   
***
      ఓ  చిన్న యాడ్ ఫిలిం తీయాలంటే చాలా సృజనాత్మక శక్తి కావాలి. ఆ యాడ్ మీద  కంపెనీ  అమ్మకాలు ఆధారపడి వుంటాయి కాబట్టి. అలాంటిది ఒక బడ్జెట్ మూవీ అమ్ముడుబోవాలంటే ఇంకెంత సృజనాత్మక శక్తి కావాలి. సృజనాత్మక శక్తిని అరచేతిలో టెక్నాలజీగా భావిస్తే  ‘బి’ గ్రేడ్ మూవీసే తీయగల్గుతారు. అరచేతిలో టెక్నాలజీ షార్ట్ ఫిలిమ్స్ కి, ఇండీ ఫిలిమ్స్ కి, క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్ కీ,  హోమ్  వీడియోస్ కీ ఉపయోగ పడొచ్చు గానీ,  బడ్జెట్ మూవీస్ కి కాదు. ‘చిత్రం’  అప్పుడు అరచేతిలో టెక్నాలజీ లేదు, ‘ఈ రోజుల్లో’ అప్పుడుంది. ఆ తర్వాత  అది బడ్జెట్ మూవీస్ కే  పనికి రాలేదు. సినిమాకి అనుకరణలైన  షార్ట్  ఫిలిమ్స్, ఇండీ ఫిలిమ్స్, క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్, హోమ్  వీడియోస్  టెక్నాలజీ తో బడ్జెట్ మూవీ తీయబోతే, అదెందుకూ పనికిరాని  ‘బి’ గ్రేడ్ సరుకుగా మూలబడుతుంది.  

          పై అనుకరణల (షార్ట్  ఫిలిమ్స్, ఇండీ ఫిలిమ్స్, క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్, హోమ్  వీడియోస్)  నుంచి బడ్జెట్ మూవీస్ కి కొత్త దర్శకుడు ప్రమోటవుతున్నప్పుడు, అతను  వేసే అడుగు బారుగా వెళ్లి బిగ్ కమర్షియల్స్  ఆకర్షణల  మీద ఐరన్ లెగ్ లా  పడుతోంది. అదీ సమస్య. బడ్జెట్ మూవీ తీయబోతే ఎవరి సమస్య అయినా ఇదే- బిగ్ కమర్షియల్స్ మీద ఐరన్ లెగ్స్ వేసే యోచన.  అనుకరణలకీ, బిగ్ కమర్షియల్స్ కీ మధ్య బడ్జెట్ మూవీస్ అనే వారధి వుంటుందని గమనించడం లేదు.  అనుకరణల మీంచి కాలెత్తితే, బారుగా తీసికెళ్ళి బిగ్ కమర్షియల్ ఎట్రాక్షన్స్ మీద దభీమని వేస్తున్నారు. తాము ముందు గడిపే షార్ట్, ఇండీ, క్రౌడ్,  హోమ్  అనుకరణల కాలం మాయల ఫకీరు కాలం. ఇవి తీస్తున్నప్పుడు భావి దృష్టి  బడ్జెట్ సినిమాల మీద వుండదు- బిగ్ కమర్షియల్  ‘సరైనోడు’ లో అల్లు అర్జున్ అలా ఇరగదీశాడు, ఇంకో బిగ్ కమర్షియల్  ‘లక్కున్నోడు’ లో మంచు విష్ణు ఇలా యాక్షన్ చేశాడు... మనంకూడా అలా తీయాలి ....అంటూ బిగ్ కమర్షియల్ పోకడల్నే  మనసంతా మేట వేసుకునేలా చేస్తుంది మాయల ఫకీరు కాలం. దీంతో బడ్జెట్ మూవీ తీయబోతే అది బిగ్ కమర్షియల్ అనుకరణలాగే వుంటుంది తప్ప,  బడ్జెట్ మూవీ ఒరిజినాలిటీని ప్రదర్శించదు. 

          అరచేతిలో టెక్నాలజీతో ఉత్సాహపడి నేరుగా బిగ్ కమర్షియల్ కి గాలం వేసుకోవాలంటే నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అంతేగానీ కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్ దొరికినప్పుడు బిగ్ కమర్షియల్ కలల్ని మర్చిపోవడమే  కాదు, అసలు చేతిలో వున్న కోటి బడ్జెట్ మూవీని కూడా బిగ్ బడ్జెట్ కొలమానాలతో చూడకూడదు. కానీ ఈ డిసిప్లిన్ ఎవరి కుంటుంది- ఇది ఏ రూల్సూ వర్తించని ఆట కదా!  చేతిలో కలానికి వుండనట్టే బడ్జెట్ కీ రూల్స్ లేవు! బిగ్ కమర్షియల్స్ కీ,  బడ్జెట్ మూవీస్ కీ దేనికీ – సినిమా అనే కళారూపానికి- అరచేతిలో టెక్నాలజీ అనే తేలిక భావపు మైండ్ సెట్ పనికి రాదని చెప్తే ఎవరు వింటారు?  నాటకాల మైండ్ సెట్, సీరియల్స్ ల మైండ్ సెట్ సినిమాలకి పనికి రానట్టే, అరచేతిలో టెక్నాలజీ అల్ట్రా మోడరన్ మైండ్ సెట్ కూడా పనికిరాదు. ప్రపంచం వేగంగా పరిగెడుతున్నట్టే  అన్పిస్తుంది, అంతే. మనం నేర్చుకుంటూ వెనకబడి పోతున్నామని అందిన పనిముట్టు అందుకుని ఒకడికంటే ముందుకు పరుగులు తీస్తూంటాం. కానీ ప్రపంచం ఎక్కడా వేగంగా పరిగెట్టడం లేదు.పని గంటలు అవే ఎనిమిది గంటలున్నాయి. భూమి ఇరవై నాలుగ్గంటలే తన చుట్టూ తాను తిరుగుతుంటుంది.  అదేం స్పీడు పెంచుకుని  గిర్రున ప్రపంచాన్ని కూడా తిప్పడం లేదు మనం చెలరేగిపోవడానికి. పరిగెట్టాలనుకుంటే ఏమీ నేర్చుకోలేరు, తెలుసుకోలేరు.
***
        నిలబడి నీళ్ళే తాగుతూంటే అమృతం దానికదే కురుస్తుంది. సినిమా నిలబడి నీళ్ళే తాగమంటుంది, పరుగెత్తి పాలు తాగమనదు. సినిమా మదగజం లాంటిది. దాన్ని లొంగ దీసుకుని  విజయయాత్ర చేయాలంటే మెరికలు తిరిగిన మావటి వాడు కావాలే  గానీ, ఇంకో టెక్నాలజీ- యాప్  లేదు. సినిమాని వ్యూహంతో లొంగదీయాలి. బడ్జెట్ మూవీని ఇంకింత వ్యూహంతో లొంగ దీయాలి. కొత్త దర్శకుడు సినిమా అనగానే బడ్జెట్ మూవీ ని దాటుకుని సుదూరాన బిగ్ కమర్షియల్స్ ఆకర్షణల్ని చూడ్డం మానుకోవాలి. అదొచ్చినప్పుడు అది తీయొచ్చు, ప్రస్తుతం చేతిలో వున్నది బొటాబొటీ కోటిన్నర ప్రాజెక్టే. దీని వ్యూహం దీనికుంటుంది, దానివ్యూహం దీనికుండదు. అరచేతిలో టెక్నాలజీని మర్చిపోవాలి- అది సినిమా మైండ్ సెట్ కాదు. బడ్జెట్ మూవీ మైండ్ సెట్ అసలే కాదు. బడ్జెట్ మూవీ మైండ్ సెట్, బిగ్ కమర్షియల్ కి మించిన సృజనాత్మక దృష్టే!

(ఇంకా వుంది)


- సికిందర్