రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 28, 2020

982 : రివ్యూ


 రచన - దర్శకత్వం : అనుశ్రీ మెహతా 

తారాగణం : హితేన్ తేజ్వానీ, అనుప్రియా గోయెంకా, సెహబాన్ అజీమ్, ఆయుష్మాన్ సక్సేనా, అశ్విన్ మిశ్రా, రవి ఖేమూ, అశోక్ పండిత్
సంగీతం: ఎ. వసంత్
, ఛాయాగ్రహణం : క్షితిజ్ తారే
నిర్మాత : ప్రీతీ రాఠీ గుప్తా
బ్యానర్ : ఇరోస్ ఇంటర్నేషనల్
విడుదల : ఇరోస్ నౌ

***

        స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఇరోస్ నౌ నిర్మాణంలో మరో మర్డర్ మిస్టరీ అన్ కహీ విడుదలైంది. ఈ నెలలోనే హలాహల్ అనే మర్డర్ మిస్టరీ కూడా విడుదలైంది. హిందీలో ఓటీటీ కంటెంట్ అంటే యూత్ ని టార్గెట్ చేసే క్రైమ్, అడల్ట్ మూవీస్ గనుక ప్రస్తుత మర్డర్ మిస్టరీ అర్ధంలో మర్డర్ మిస్టరీయే గానీ, కంటెంట్ లో కాదు. జరిగిపోయిన సీరియల్ మర్డర్స్ గురించి చర్చ. సింగిల్ లొకేషన్, టేబుల్  చుట్టూ చర్చ. చర్చించుకుని సీరియల్ కిల్లరెవరో తేల్చే కథ. అ గథా క్రిస్టీ నవలల్లో పడక్కుర్చీ డిటెక్టివ్ పరిశోధన లాగా. అయితే ఈ టైపు కథకి క్రిస్టీ ఫార్ములాతో ఊపిరి బిగబట్టే సస్పెన్సు సృష్టించవచ్చు. ఇదే జరగలేదు. 

    
రుగురు అనుమానితుల్ని ఒకచోట బంధించి మీలో సీరియల్ కిల్లరెవరో తేల్చుకు  చెప్పండనే స్టోరీ ఐడియా వరకూ బాగానే వున్నా, నిర్వహణా లోపం వల్ల ముగింపు సహా తేలిపోయింది. పూర్తిగా డైలాగులతో నడిచే ఈ కథ డైనమిక్స్ కొరవడి ఎందుకూ కొరగాకుండా పోయింది ప్రయోగం చేసిన కొత్త దర్శకురాలి చేతిలో.

    అభిమన్యూ మాథుర్ (హితేష్ తేజ్వానీ) ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్
, టియా శర్మ (అనుప్రియా గోయెంకా) రీజనల్ మేనేజర్, లెస్బియన్; సంతోష్ హుడా (సెబాన్ అజీమ్) రిచ్ హర్యానా యూత్, రోషన్ ఖేర్ (అశ్విన్ ముష్రాన్) డివోర్సీ, క్రిష్ మల్హోత్రా (ఆయుష్మాన్ సక్సేనా) డ్రగ్ బానిస, దీపక్ మెహ్రా (రవి ఖేమూ) టెలికాం మేనేజర్ - వీళ్ళందరూ సీరియల్ కిల్లింగ్ లో అనుమానితులు.

    సంవత్సర కాలంగా ఢిల్లీలో పదకొండు మంది అమ్మాయిల హత్యలు జరిగాయి. ఇవన్నీ వివిధ మెట్రో స్టేషన్స్ కేంద్రంగా జరిగాయి. హత్యాస్థలాల్లో ఆధారాలతో పై ఆరుగురిని పట్టుకున్నారు. అందరి మీదా సాక్ష్యాధారాలున్నాయి కానీ అందరూ హంతకులు కాదు. వాళ్ళు చెప్పే సమాధానాలు నమ్మదగ్గవిగా లేవు. అందుకని వివిధ పోలీస్ స్టేషన్లో వున్న వాళ్ళని పట్టుకొచ్చాడు ఐజీ షేర్గిల్ (అశోక్ పండిత్). మాస్ ఎన్ కౌంటర్లు చేయడానికి తీసికెళ్ళాడని వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకంటే అతను ఎన్ కౌంటర్ స్పెషలిస్టు.

    ఆరుగుర్నీ ఒక గ్యారేజీలో వేసి
, సాక్ష్యాధారాల ఫైళ్ళు వాళ్ళ ముందు పడేసి, మీలో ఎవరు సీరియల్ కిల్లరో తేల్చుకుని చెప్పమన్నాడు. పన్నెండు గంటలు టైము. ఈ లోగా చెప్పకపోతే పన్నెండు గంటల తర్వాత ఎన్ కౌంటర్లయి పోతారు.

    ఇదీ సమస్య. ఇప్పుడు ఒకొక్కరి ఫైలు తీసి విచారణ ప్రారంభిస్తారు ఆరుగురూ. తమ నిర్దోషిత్వాల్ని నిరూపించుకునే ప్రయత్నంలో పరస్పరం నిందించుకుంటారు. రహస్యాలు బయట పెట్టుకుంటారు. కొట్టుకుంటారు. ఇలా టేబుల్ చుట్టూ చర్చ చివరికి వాళ్ళల్లో ఒక సీరియల్ కిల్లర్ ని పట్టిస్తుంది. 

    గ్యారేజి దాటి సీన్లు బయటి కెళ్ళవు. ఫ్లాష్ బ్యాకులుండవు. వాళ్ళు చెప్పుకునే కథనాలకి విజువల్ సపోర్టు వుండదు. కేవలం వెర్బల్ డ్రామా. నటనలు మాత్రం బావున్నాయి. కానీ సింగిల్ లొకేషన్లో వాగ్యుద్ధాలతో కథలో అసలు బిగి లేదు. కథలో ఉత్కంఠ పెంచే మలుపుల్లేవు. అరుచున్నంత మాత్రాన, కొట్టుకున్నంత మాత్రాన కథలో టెన్షన్ పెరగదు. పదకొండు మంది అమ్మాయిల్ని చంపుతూ పోవడానికి సైకో కిల్లర్ కి ఏదో మానసిక కారణం వుంటుంది. ఈ కారణాన్ని పట్టుకోవడానికి సాక్ష్యాధారాలు చూపించుంకుని కొట్టుకోవడం కాకుండా, అందరి మెంటల్ కండిషన్ ని పరిశీలనకి పెడితే, సీరియల్ కిల్లర్ పైకి కన్పించే కామన్ లక్షణాల్ని పట్టుకోగల్గితే, సమస్య ఒక పద్ధతిగా సాల్వ్ అయ్యే అవకాశముండేది. చిట్టచివరికి సీరియల్ కిల్లర్ రివీలయినప్పుడు వాడి మాటలు, నటన, తిరగబడి మిగతా వాళ్ళని చంపేసే ప్రయత్నం- లేదా చంపిపారేసీ ఈజీకి లొంగిపోయే ముగింపు వుండి వుంటే – ఈ షోడౌన్ కనీసం కొన్ని రోజులు వెంటాడేది. కానీ ఒక మాటతో చప్పటి ముగింపు షో ఆఫ్ చేసేసింది.

    ఈ టైపు సినిమాలేమున్నాయా అని సెర్చి చేస్తే
, 1986 లో బాసు భట్టాచార్య తీసిన
ఏక్ రుక్తాహువా ఫైసలా (వాయిదా పడ్డ నిర్ణయం) దొరికింది. 18 ఏళ్ల యువకుడికి పడిన మరణ శిక్షని పన్నెండు మందితో కూడిన జ్యూరీ తిరగదొడే కథ. ఒక గదిలో సాగే చర్చోపచర్చల కోర్టు రూమ్ డ్రామా. ఇది 1957 లో సిడ్నీ లుమెట్ తీసిన క్లాసిక్ 12 యాంగ్రీ యంగ్ మెన్ కి రీమేక్. అన్ కహీ (అన్ టోల్డ్) కొత్త దర్శకురాలు అనుశ్రీ మెహతా తోచినట్టు గుడ్డిగా తీయకుండా,ఈ సినినిమాలు చూసి కాస్త జానర్ రీసెర్చి చేసుకుని వుంటే బావుండేది.

సికిందర్