రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 15, 2018

647 : స్క్రీన్ ప్లే సంగతులు!



ఫ్లాష్ బ్యాక్
సీన్ :   కిటికీలో కూర్చుని బుక్ చదువుతూంటాడు జూన్ హా. టీసూ వస్తాడు. ఇద్దరూ స్టూడెంట్స్. టీసూ వచ్చి నిలబడి క్యాప్ తీస్తాడు. అతడి క్రాఫు మధ్యకి పాపిడీ తీసినట్టుంటుంది గానీ నిజానికి మధ్యకి  పొడుగ్గా కాలువలా షేవ్ చేయించుకున్నాడు. తన కాబోయే భార్యకి లవ్ లెటర్ రాయాలంటాడు. లవర్స్ కి జూన్ హా లవ్ లెటర్స్ రాసి పెడుతూంటాడు. టీసూ అద్దం ముందు వచ్చి నిలబడి చెబుతూంటాడు. ఆ అమ్మాయి తన ఫాదర్ ఫ్రెండ్ కూతురంటాడు. తామిద్దర్నీ దగ్గరయ్యేందుకు స్వేచ్ఛ కల్పించారంటాడు. ఆ అమ్మాయి తనకి ఎప్పుదు ఈ మెయిల్ పంపినా తన ఫాదర్ చూస్తాడని, తను ప్రేమిస్తున్నాడో లేదో  సీఐడీలా గమనిస్తున్నాడనీ అంటూ, ఆ అమ్మాయి ఫోటో తీస్తాడు.  దాన్ని టేబుల్ మీద పెట్టి జూన్ హా వైపు తోస్తే, అది వెళ్లి అవతల కింద పడుతుంది. గబుక్కున వెళ్లి తీసి జూన్ హా ముందు పెడతాడు. జూన్ హా ఆ ఫోటో లోని అమ్మాయి కేసే  అలా చూస్తూంటే, ఈమె పొలిటీషియన్ కూతురని, పొలిటీషియన్ కూతురు ఎంత డొల్లగా వుంటుందో తెలుసుకదాని అంటాడు. ఫోటోలో అమ్మాయిని అలా చూస్తూ వున్న జూన్ హా ఆలోచనలు ఎటెటో పోతాయి...

పాయింట్ : 
    జీహై ఆమె తల్లి డైరీలో చదువుతున్న ఫ్లాష్ బ్యాక్ ఇది. ఫ్లాష్ బ్యాకులో ఈ మొదటి సీనులో జూన్ హా, టీసూ కలుసుకున్నారనీ, కలుసుకుని ఫలానా ఈ మాటలు మాట్లాడుకున్నారనీ జీహై తల్లి కి ఎలా తెలుసని  ఇలా రాసిందీ – అనుకోవచ్చు. సినిమాల్లో ఫ్లాష్ బ్యాకులు ఇంతే. పాత్ర తను వుండడానికి అవకాశం లేని చోట, ఇతర పాత్రల గుట్టు మట్లన్నీ కళ్ళారా చూసినట్టు పూసగుచ్చి
నట్టు ఫ్లాష్ బ్యాకులో కలిపి చెప్పేయడం ఆనవాయితీ. ఇది కూడా ఇంతే. లేకపోతే  కథ చెప్పలేరు. దర్శకుడి పాయింటాఫ్ వ్యూ అయితే ఈ సమస్య వుండదు. కానీ ఇక్కడ తల్లి రాసిన డైరీ,  ఆమె పాయింటాఫ్ వ్యూయే అయి వుండక తప్పదు. 

          ఈ సీను ఫ్లాష్ బ్యాక్ కి బిగినింగ్ విభాగం. ఈ బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయ క్రమాన్ని  ఎక్కువ సాగదీయలేదు. ఈ మొదటి  సీన్లోనే  మూడు ముఖ్య పాత్రలని ఎస్టాబ్లిష్ చేసేసి, ‘స్టోరీ’ కూడా సెటప్ చేసేశాడు  దర్శకుడు. ఇదే గనుక ప్రధాన కథ బిగినింగ్ విభాగంలో చూస్తే, అక్కడ పాత్రల పరిచయాలకి మాంటేజీలూ, కొన్ని సీన్లూ వేస్తూ కొంత సమయం గడిపినట్టు గమనించాం. చాలా తెలుగు సినిమాల తెలుగాలోచనలో ఫ్లాష్ బ్యాక్ కళ ఇలా కన్పించదు. ఎలా వుంటుందంటే, ప్రధాన కథ బిగినింగ్  విభాగంలో పాత్రల పరిచయానికి ఎన్ని సీన్లతో ఎంత సమయం తీసుకుంటారో, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపించాల్సి వస్తే, అందులోనూ పాత్రల పరిచయ సీన్లతో, అంత సమయమూ తీసుకుంటారు. బ్యాడ్ రైటింగ్ ఇది. కథ ముందుకు కదలకుండా రెండు కాలాల బిగినింగ్ విభాగాలే సమయాన్ని తినెయ్యడం (
Don't tell the reader about the past until he or she cares about the future. A flashback should not stop a movie just to provide exposition. A flashback should move the story forward - David Trottier, The Walt Disney Company screenplay developer). విడివిడిగా రెండు కథలు చూపిస్తూంటే అది వేరు, ఒకే కథలో ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు వాటి స్ట్రక్చర్లో వాటి క్రియేటివిటీ ఒకేలా వుండదు. ఫ్లాష్ బ్యాక్ బిగినింగ్ విభాగం చప్పున ముగిసి పోవాలి. 

          ఇదే జరిగిందిక్కడ.  ఫ్లాష్ బ్యాక్ మొదటి సీన్లోనే రెండు ముఖ్య పాత్రలని ప్రత్యక్షంగా ఎస్టాబ్లిష్  చేసేసి, మూడోదైన హీరోయిన్ తల్లి పాత్రని  పరోక్షంగా డైలాగుల్లో ఎస్టాబ్లిష్ చేసి, ‘కథ’ కూడా సెటప్ చేసేశాడు ఈ ఒక్క  సీన్లో. ఏమిటా ‘కథ’? టీసూ పెళ్లి చేసుకోబోయే ‘హీరోయిన్’ కి, జూన్ హై చేత  ఉత్తరాలు రాయించడం. ( ఈఫ్లాష్ బ్యాక్ లో వున్నది ‘కథ’ కాదనీ, ‘గాథ’  అనీ గత వ్యాసం ఒకదాంట్లో చెప్పుకున్నాం. ఇక్కడ సౌలభ్యం కోసం ‘కథ’ అనే పదాన్నే వాడుతున్నాం). 

          ఇక్కడ ప్రధాన కథ బిగినింగ్ డైనమిక్స్ కీ, ఫ్లాష్ బ్యాక్  బిగినింగ్ డైనమిక్స్ కీ పోలికలు చూద్దాం. ప్రధాన కథలో హీరోయిన్ ఫ్రెండ్ కోసం తను ప్రేమిస్తున్న హీరోకి ఈ -  మెయిల్ లెటర్స్ రాస్తున్నట్టు గమనించాం. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కొచ్చేసి హీరో తన ఫ్రెండ్ కోసం తను ప్రేమిస్తున్న హీరోయిన్ కి లెటర్స్ రాస్తున్నట్టు డైనమిక్స్ క్రియేట్ చేశాడు. ఇది వినోదపర్చే నాటకీయత.

          అయితే డైనమిక్స్ కోసమే  డైనమిక్స్ అన్నట్టు ఈ డైనమిక్స్ ని సృష్టించాడా, లేక వీటికి లోతైన భావ మేమైనా వుందా? దర్శకుడు మొత్తం ఈ మూవీ కథని విధిలీల, తలరాత అనే సెంటిమెంట్లతో ప్లాన్ చేశానన్నాడు. ఫ్లాష్ బ్యాక్ మొత్తం వీటి ఆధారంగానే నడుస్తుంది. విధి చేతిలో బొమ్మలు ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమికుల పాత్రలు.  అయితే ఫ్లాష్ బ్యాక్ లో దీని ప్రభావం ప్రధాన కథపై పడకుండా ఎలా వుంటుంది? విధి సర్వాంతర్యామి కదా? ఇదొక పాయింటు డైనమిక్స్ కి. 

       రెండో పాయింటు, ఫ్లాష్ బ్యాక్ లో ఎవరైతే మనం టీసూని ఇప్పుడు చూస్తున్నామో, ఇతనే ప్రధాన కథలో జీహైకి  తండ్రి అవుతాడన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో టీసూ ఏం చేస్తున్నాడు -  తను రాయాల్సిన ఉత్తరాలు కాబోయే భార్యకి తను రాయకుండా, ఆ రాత పనిని  అదేదో ‘లో - క్లాస్ యాక్టివిటీ’ అన్నట్టు ఫీలై,  ఫ్రెండ్ జూన్ హై చేత రాయించుకుని చేతులు దులుపుకుంటున్నాడు. దీనికి ‘శిక్ష’ పడవద్దా?  ‘శిక్ష’ అప్పుడే పడితే ఇప్పుడు కూతురు అనుభవించడానికేముంటుంది? కూతురు అనుభవించడానికి వుండక పోతే విధి అనే కాన్సెప్ట్ ఎక్కడుంటుంది?  విధి అనే కాన్సెప్ట్ వుండకపోతే డైనమిక్స్ ఎక్కడుంటాయి? డైనమిక్స్ వుండకపోతే ప్రేక్షకులతో అన్ కాన్షస్ గా, సైకలాజికల్ కనెక్షన్ ఎక్కడుంటుంది? సైకలాజికల్ కనెక్షన్ లేకపోతే  బాక్సాఫీసు కలెక్షన్లు ఎక్కడుంటాయి? 

          తండ్రి అలా చేసినందుకు ఇప్పుడు కూతురు అనుభవిస్తోంది. తండ్రి కంటే ఎక్కువే అనుభవిస్తోంది. తండ్రి వేరే అతనితో రాయించుకున్నది ఎవరికో కాదు, తన తల్లికే. ఇప్పుడు తను మాత్రం  తను ప్రేమిస్తున్నతనికే  తన ఫ్రెండ్ రాసినట్టు  రాయాల్సివస్తోంది. ఇదే పెద్ద శిక్ష. మంచైనా చెడైనా ఏ  చర్యా కాల గర్భంలో కలిసిపోదు. సమయం వచ్చినప్పుడు పొడుకువచ్చి లెక్క తేల్చుకుంటుంది. రక్త సంబంధాన్ని కూడా వదలదు. 

          తెలుగు కథకి ఒక సీనుకి ఇంతాలోచన చేసి చెప్పామనుకోండి, తెలుగాలోచనకి ఇది తలకే మాత్రం ఎక్కక, విసురుగా వెళ్లి కుప్పతొట్లో పడుతుంది. 

          దీని తర్వాత ఇంకో డైనమిక్స్ ఏమిటంటే, ప్రధాన కథ పెళ్ళికాని ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో మధ్య ముక్కోణ ప్రేమ కథగా ప్రారంభమైతే, ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి సెకండ్ హీరోతో పెళ్లి నిశ్చయమైన హీరోయిన్ కీ – హీరోకీ మధ్య ముక్కోణంగా ఆరంభమవుతోంది.

      ఇంకో డైనమిక్స్ ఏమిటంటే,  ప్రధాన కథ ఓపెనింగ్ లో,  తోటలో పుస్తకాలు పేరుస్తున్న హీరోయిన్ ని కిటికీలోంచి చూపిస్తాడు దర్శకుడు. ఇదే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతున్నపుడు,  కిటికీలో కూర్చుని పుస్తకం చదువుతున్న హీరోని చూపిస్తాడు. అతడి రూమ్ నిండా పుస్తకాలు చక్కగా పేర్చి వుంటాయి.

          దర్శకుడు చెబుతున్న కథతో బాటు,  దాని పొరల్లో చెప్పని కథ కూడా ఈ సీన్లో వుంది. ముక్కోణ ప్రేమల్లో ఎవరెవరికి పెళ్లవుతుందో బెంచి క్లాసులో కూర్చుని కళ్ళప్పగించి చూస్తున్న ముసలమ్మ కూడా చెప్పేస్తుంది. అయినా తెల్లారిన తెలుగు చిల్లరాలోచనలకి అలాటి ఎల్పీ (లొట్టపీసు) ముక్కోణ కథలే పదేపదే నిస్సిగ్గుగా వస్తూంటాయి. వాటితోనే సెల్ఫీలు దిగి ఎఫ్బీలో పెడతారు. 

          ఇప్పుడు జూన్ హా, టీసూ – వీళ్ళిద్దరిలో ఫ్లాష్ బ్యాక్  హీరోయిన్ ఎవరికి  దక్కుతుందో మనం వూహించెయ్యగలం. జూన్ హా కే దక్కుతుందని చూడగానే తెలిసిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమయ్యింది ఇతడి ఫోటో ఆధారంగానే కూడా కాబట్టి,  ఇవన్నీ మన అంచనాలకి బేస్ అవుతాయి. అయితే విధి ఆడిన వింత ఆటలో ఇది తారుమారవుతుంది చివరికి. ఆమె టీసూనే పెళ్లి చేసుకుంటుంది. ఈ రివర్సల్ మనం వూహించం  కాబట్టి - వూహించిన, తెలిసిపోతున్న-  ముక్కోణ ప్రేమకథతో  రొటీన్ నీ, మొనాటనీ ని తప్పక ఫీలవుతాం. 

          దీన్ని నివారించడానికి దర్శకుడు ఒక పని చేశాడు. ఈ పని చేయాలనీ తెలుగు చిల్లరాలోచనకి వంద సినిమాలు తీసినా రాదు. ఏ క్షణంలో కథలో ఏమీ లేదని తెలిసిపోతుందో, ఆ క్షణాన్నే ప్రేక్షకుల్ని కోల్పోవడం ఖచ్చితంగా జరుగుతుంది.  ఇలా జరక్కుండా దర్శకుడేం చేశాడంటే, కథలో కప్పి కథ చెప్పాడు. అదెలా? ముక్కోణం ఫ్లాట్ అన్పించకుండా, టీసూ  క్యారెక్టర్ ని మిస్టీరియస్ గా చిత్రించి ప్రేక్షకులకి లాక్ వేశాడు. అంతే, ఇక ఈ ముకుతాడుతో  సినిమా సాంతం ప్రేక్షకులు వీడి వెంట పోతూ వుండాల్సిందే – అసలు వీడి కథేంటా అని. 

          ఏం చేశాడంటే, కిటికీలో కూర్చుని జూన్ హా బుక్ చదువుతూంటే టీసూ వస్తాడు. సన్నగా పొడుగ్గా వుంటాడు. వస్తూనే నవ్వుతూ పలకరించి, నెత్తికున్న క్యాప్ తీస్తాడు. ఆ నెత్తి మీద జుట్టు రెండు పాయలుగా విడిపోయి వుంటుంది. మధ్యలో పోలవరం కాలువ తవ్వినట్టు  తెల్లగా పొడుగ్గా వెడల్పాటి డిప్ప కన్పిస్తూంటుంది. ఏమిటిది? ఇదేదో కొత్త ఫ్యాషన్  అని పెట్టాడా? అస్సలు కాదు.

        అతను డైలాగులు కొడుతూ నిలువుటద్డం ముందుకొస్తాడు. ఇప్పుడు ఈ షాట్ లో ముగ్గురు కన్పిస్తూంటారు. టీసూ - జూన్ హా – అద్దంలో టీసూ ప్రతిబింబం. మళ్ళీ ఇదేమిటి? ఎందుకిలా?

          ఇదే మిస్టరీ మన బుర్రకి పదునుపెడుతూ. సీనులో ఏదీ కథతో కనెక్ట్ అవకుండా చూపడంలేదు. రెండు పాయలుగా జుట్టు వీడి పోయి వుండడం. అద్దంలో అతను  రెండుగా కన్పించడం, ఇవి అతను చచ్చి పునర్జన్మేదో ఎత్తే  సింబాలిజాలే. అంటే ఇతడి జీవితం  రెండుగా వుంటుంది, హీరోయిన్ కోసం కాక – హీరోయిన్ కోసం అయ్యీ. ఇది ముందుముందు మనకి తెలుస్తుంది.  

          ఇలా క్యారెక్టర్ ని మిస్టీరియస్ గా, ఇంటరెస్టింగ్ గా ప్రవేశపెట్టడం ద్వారా ముక్కోణ మొనాటనీని ఛేదించగల్గాడు దర్శకుడు. 

          టేబుల్ మీద హీరోయిన్ ఫోటో పెట్టి జూహా వైపు తోస్తే అది వెళ్లి కింద పడుతుంది. అంటే ఆమె జూహాకి అందబోవడం లేదన్న మాట. ఇలా ప్రతీ చేతలో, ప్రతీ కదలికలో, మాటలో కథ వుంది. 

 ఈ ఒక్క సీనులో ...
          **రావడం రావడం ఆలస్యం చేయకుండా,  హీరో దగ్గరికి సెకెండ్ హీరోని రప్పించి అతడికి హీరోయిన్ తో పెళ్లి అని చెప్పేసి వెంటనే ‘కథ’ కి ముడేశాడు దర్శకుడు.
          **ముక్కోణం ఇంటరెస్టుని కాపాడడానికి సెకెండ్ హీరో క్యారెక్టర్ ని మిస్టీరియస్ గా ప్రెజెంట్ చేశాడు.
          **ప్రధాన కథ ప్రారంభ సీన్లతో, ఫ్లాష్ బ్యాక్ ప్రారంభ సీనుని కనెక్ట్ చేస్తూ ఉత్తరాలు రాసే పరస్పర విరుద్ధ డైనమిక్స్ తో కట్టి పడేశాడు.
          **హీరోయిన్ పాత్రని కూడా ఇక్కడే పరోక్షంగా డైలాగులతో పరిచయం చేశాడు, ఆమె రూపం కూడా ఫోటోలో చూపించాడు.
          **ఆమె రాజకీయ నాయకుడి కూతురనీ, కాబట్టి డొల్లగా వుండవచ్చనీ, సెకెండ్ హీరో చేత చెప్పించి, ఆమెని తను ప్రేమిస్తున్నాడో లేదో తండ్రి కనిపెడుతున్నాడనీ  కూడా ఒక హర్డిల్ ని సెటప్ చేశాడు.
          **సెకెండ్ హీరో ఫోటోని  హీరో వైపు తోసినప్పుడు, అది కింద పడిపోవడం ద్వారా హీరో ప్రేమ పట్ల శంక రేకెత్తించాడప్పుడే.
          **సెకెండ్ హీరో తలకట్టుతో, అద్దంలో అతడి  ప్రతిబింబంతో రెండు జీవితాల భవిష్య వాణేదో విన్పించాడు.
          ఇలా ఒకే సీనులో ఇన్ని విశేషాలూ, డైనమిక్సూ, పాత్రచిత్రణలూ, వాటి ఫోర్ షాడోయింగ్సూ అన్నీ ఎస్టాబ్లిష్ చేసేసి,  ఇక ‘కథ’ కి గ్రీన్ సిగ్నలిచ్చాడు ముందు కెళ్ళి పోవడానికి...

          కొసమెరుపేమిటంటే
హీరో అలా హీరోయిన్ ఫోటో చూస్తూంటే, అతడి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది ఆమెతో!
          ఫ్రెండ్ కి పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయితో!
          ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్.
          ఇంత మజాగా కథ చెప్పడం ఎక్కడ చూస్తాం!
          సీన్ ఓపెనింగ్ - పెళ్లి ఫిక్సయిన హీరోయిన్.
          సీన్ ఎండింగ్ – ఆల్రెడీ హీరో ఆమెతో రోమాన్సులో వున్నాడని  ట్విస్ట్!  
          ఒక ఫ్లాష్ బ్యాక్ తో ఓపెనై, అందులోంచి ఇంకో ఫ్లాష్ బ్యాక్ బిగినవడం...
          ఇలా కథ రాసుకుని ఒక్క సినిమా చేసి వెళ్ళిపోతే చాలు. 

సికిందర్