రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఆగస్టు 2015, బుధవారం

సాంకేతికం- ప్రొడక్షన్ డిజైనర్


ర్ట్ డైరెక్షన్ తీరు తెన్నులు మారిపోతున్నాయి... యథా సినిమాలు తథా సింగారాలూ.. హై ఎండ్
టెక్నాలజీ సినిమాలకి  ప్రధానాకర్షణ అవుతున్నప్పుడు, కళా దర్శకత్వం ఆ శిఖరాల్ని అందుకోకుండా కొనసాగలేదు. నేటి సోషియో ఫాంటసీ ల కాలానికి
తగ్గట్టుగా టెక్నాలజీని మార్చుకోవాల్సిందే. కథల్లో అంతర్భాగంగా వుండే స్పెషల్ ప్రాపర్టీస్ రూపకల్పన, మెగా సెట్స్ నిర్మాణాల్లో పొదుపు చర్యలు, అత్యాధునిక కలర్ స్కీమ్స్, అట్మాస్ఫియర్ - మెకానికల్ ఎఫెక్ట్స్, లొకేషన్ కన్వర్షన్, మెకానికల్ స్పెషల్ వెపన్స్,
క్రోమో కీయింగ్, మోడల్ మేకింగ్ తదితరాలే కాకుండా, గ్రాఫిక్స్  టెక్నాలజీతో కూడా సహవాసం నేటి కళా దర్శకుడికి తప్పనిసరి అవుతోంది. కేవలం ఇప్పుడు ఇంకా కుంచె పట్టుకుని రంగు లేస్తూ కూర్చోలేడు. తన వృత్తి పరిధిలో  సకలకళా వల్లభుడైన
ప్రొడక్షన్ డిజైనర్ గా అవతరించాల్సిందే!

          నిర్వచనానికి సరీగ్గా సరిపోతారు భూపేష్ ఆర్. భూపతి అనే ‘అనగనగా ఓ ధీరుడు’ విజువల్ వీరుడు. ఈ మధ్యే విడుదలైన ఈ సంచలనాత్మక సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ ఊహాతీతంగాగా ఎదిగింది. నిజ జీవితంలో లాగా సినిమాల్లో ఊహల్ని నిజం చేయడమంటే, ఏళ్లకొద్దీ పట్టే ప్రక్తియ కాదు. క్షణాల్లో సృష్టి చేసి చూపించే మంత్రాల పెట్టె - అలాటి ఆ పెట్టె లాంటి భూపేష్  ‘డిజిటల్ ఫోర్స్ స్టూడియోస్’  లో ఇప్పుడు లేటెస్టుగా కన్పించేది జ్యూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘శక్తి’  లో మంత్రం శక్తిని నింపుకున్న మెటల్ నాళిక- కథలో అంతర్భాగమైన స్పెషల్ ప్రాపర్టీ.

         ‘ఫాంటసీలూ పీరియడ్  ఫిలిమ్సూ నా స్పెషల్ ఇంటరెస్ట్’ అన్నారాయన స్టూడియోలో స్పెషల్ గా ఏర్పాటుచేసుకున్న హాలీవుడ్ దిగ్గజం జార్జి  లుకాస్ ఫొటో ఫ్రేమునే తదేకంగా చూస్తూ. స్పెషల్ ఎఫెక్ట్స్ జ్ఞాని జార్జి లుకాస్ తనకి స్ఫూర్తి అన్నారు. అయితే స్ఫూర్తి వేరు, బడ్జెట్ - టైం పరిమితులు వేరు. ఉన్న బడ్జెట్లో ఇచ్చిన టైంలో స్ఫూర్తినంతా సర్దాలంటే యాతనే. దీన్ని ఛాలెంజి గా తీసుకుని పనిచేశారు తను- ‘అనగనగా ఓ ధీరుడు’ కి.

          రామోజీ, అన్నపూర్ణా, పద్మాలయా- స్టూడియోల్లో నాలుగు భారీ సెట్లు నిర్మించారు. ఎంత విఖ్యాత  వాల్ట్ డిస్నీ భాగస్వామ్యమున్నా, బడ్జెట్ 30-32  కోట్ల రూపాయలే. ఇదే మాత్రం చాలదు. కనీసం 50-55  కోట్లు కావాలి. ఇది మంజూరు కాదు, కాబట్టి సర్వసాధారణంగా ఉపయోగించే ప్లాస్టరాఫ్ పారిస్ జోలికి పోకుండా, ఇండస్ట్రియల్ థెర్మో కూల్ సెట్స్ ని నిర్మించి బడ్జెట్ పరిమితుల్ని జయించారు. ఒక రైలు డబ్బా పొడవంత మహా సర్పం రూపకల్పన కూడా థెర్మో కూల్ తోనే చేశారు. మామూలు గా చేసినట్టూ ఫైబర్ గ్లాస్ తోనో, ప్లాస్టరాఫ్ పారిస్ తోనో చేసివుంటే  ఆ మహా సర్పం బరువు 12 రెట్లు పెరిగేది. వందలాది కార్మికులూ హస్తకళా నిపుణులూ కలిసి నిర్వహించిన ఈ క్రతువుకి గ్రాఫిక్స్ కూడా తోడయ్యాయి.

      
       ‘కొంత ఆర్ట్ డైరెక్షన్ మరి కొంత గ్రాఫిక్స్ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ హిట్  ‘300’ తోనే మొదలయ్యింది. దాన్ని చూసి మనమంతా ఫాలో అవుతున్నాం’ అని అసలు సంగతి చెప్పారు. ‘అనగనగా ఓ ధీరుడు’  విసిరిన సవాలుకి- దర్శకుడు కె. ప్రకాష్ తో బాటు, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ రాజ్ గోరె, కెమెరామాన్ సౌందర రాజన్, కాస్ట్యూమ్స్ డిజైనర్స్ ద్వయం నిఖార్- భక్తీ ప్రభృతులు అందించిన సహకారం  మరువలేనిదన్నారు.

      ‘ 2002 లో మీరు ‘అల్లరి’  అనే బుల్లి సినిమాతో ప్రారంభంయ్యారు. ఇప్పుడు ఇన్ని అద్భుతాల్ని సాధించి అగ్రస్థాయికి చేరుకున్నాక ఎవరైనా కోటిన్నర బడ్జెట్ తో వస్తే సహకరిస్తారా?’ అన్న ప్రశ్నకి- ఆల్రెడీ ఆ పని చేస్తూనే ఉన్నానన్నారు. తన సంపాదనలో కొంత భాగం తీసి- చిన్న సినిమాలు నిర్మిస్తున్నానన్నారు.

        అసిస్టెంట్ డైరెక్టర్లకి  
అవకాశాలు కల్పిస్తున్నానన్నారు. అలా తీసిందే ‘కచరా’ అనే బాలల సినిమా అనీ, దానికి బంగారు నంది  వచ్చిందనీ  ఆ షీల్డ్ చూపించారు. ఫిలిం ఫెస్టివల్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇలాటి ప్రత్యేకమైన సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన తమ్ముడు నీల్ భూపేష్ ని పారిస్ పంపి సినిమాటోగ్రఫీ చదివించా నన్నారు.

       తన సంపాదనలో కొంత భాగం తీసి- చిన్న సినిమాలు నిర్మిస్తున్నానన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లకి  అవకాశాలు కల్పిస్తున్నానన్నారు. అలా తీసిందే ‘కచరా’ అనే బాలల సినిమా అనీ, దానికి బంగారు నంది  వచ్చిందనీ  ఆ షీల్డ్ చూపించారు. ఫిలిం ఫెస్టివల్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇలాటి ప్రత్యేకమైన సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన తమ్ముడు నీల్ భూపేష్ ని పారిస్ పంపి సినిమాటోగ్రఫీ చదివించా నన్నారు.

        ‘అసలు నేను ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని అనుకోలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అహ్మదాబాద్ లో ఇండస్ట్రియల్ డిజైనర్ కోర్సులో చేరాను. అప్పుడా శాస్త్రాన్ని సినిమాల కెలా  ఉపయోగించుకోవచ్చో థీసిస్ రాస్తే, అది చూసి నిర్మాత డి. సురేష్ పిలిపించుకుని నాతో మాట్లాడారు. ‘నీ కాన్సెప్ట్ సినిమాలకి అప్లయ్ చేయాలంటే ఇంకో పదేళ్ళు  పడుతుంది- ఈ లోగా ఏం చేస్తావ్? రవి బాబు ‘అల్లరి’ తీస్తున్నాడు- వెళ్లి ఆ సెట్టింగ్స్ వ్యవహారాలు చూడు’ - అని రవిబాబు దగ్గరికి పంపించారు. అలా రవిబాబు దగ్గర నేరుగా ఆర్ట్ డైరెక్షన్ మొదలెట్టాను. రవి బాబు దగ్గరే పొదుపు కిటుకులూ తెలిశాయి. మన కళ్ళు 110 డిగ్రీల వక్ర రేఖలో చూస్తాయి. కెమెరా అంత  చూడదు. కాబట్టి దాని చూపు మేరకే సెట్స్ వేస్తే  చాలా డబ్బు అదా అవుతుందని ఆయన దగ్గర నేర్చున్నాను’ అని  వివరించారు.

         
      భూపేష్ చేసిన ఇండస్ట్రియల్ డిజైనర్ డిగ్రీ ,  స్పెషల్ ప్రాపర్టీస్, డమ్మీ వెపన్స్ ల తయారీకి ఉపయోగ పడుతోంది. హిందీ ‘నాకౌట్’ సినిమాకి సంజయ్ దత్ ఒక మల్టీ బ్యారెల్ రిమోట్ గన్ తయారు చేయించు కున్నారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ నిర్మాతలు తమ కొత్త సినిమాకి స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫరిచ్చారు. ‘గ్రహణం’ అనే పీరియడ్ ఫిలింతో  బాటు, ‘మల్లీశ్వరి’,  ‘షాక్’, ‘బాణం’, ‘ఓం శాంతి’, రవి బాబు అన్ని సినిమాలూ, మరికొన్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకీ పనిచేసిన తను- ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న మంచు మనోజ్ తో నిర్మిస్తున్న భారీ ఫాంటసీకి గాంధర్వ భవనం సెట్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై వున్నారు. గుంటూరుకి చెందిన భూపేష్ పూర్వీకులు మూడు తరాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.

సికిందర్ (ఫిబ్రవరి 2011, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక)