రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జులై 2020, గురువారం

955 : రివ్యూ


‘ఘూమ్ కేతు’
రచన - దర్శకత్వం : పుష్పేంద్ర నాథ్ మిశ్రా
తారాగణం: నవాజుద్దీన్ సిద్దిఖీ, రాగిణీ ఖన్నా, అనురాగ్ కశ్యప్, రఘువీర్ యాదవ్, ఇళా అరుణ్ తదితరులు
సంగీతం : స్నేహా ఖన్వాల్కర్. ఛాయాగ్రహణం : సత్య రాయ్ నాగ్ పల్
నిర్మాత : అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్
***
      నురాగ్ కశ్యప్ లాంటి టాప్ దర్శకుడు నిర్మించిన సినిమా ఆరేళ్ళూ విడుదలకి నోచుకోక పోవడం వింతే. ఆరేళ్ళ నాడే ఇలా పురాతన కాలపు సినిమాలా తీసి కామెడీకి శ్రద్ధాంజలి ఘటిస్తే అది సినిమాకీ శ్రద్ధాంజలి ఘటించడమే అయింది. డిస్ట్రిబ్యూటర్లు కరోనా డెత్ అనుకుని పారిపోవడమే అయింది. ఇప్పుడు ‘జీ5’ ముందుకు వచ్చి స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న యాడ్ ఫిలిం మేకర్, టీవీ డైరెక్టర్ పుష్పేంద్ర నాథ్ మిశ్రా దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ కొచ్చాడు. ప్రస్తుతం ఈయన తీస్తున్న ‘తాజ్ మహల్ 1989’ అనే రిలేషన్ షిప్స్ తో కూడిన కథతో వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అవుతోంది.

       
వాజుద్దీన్ సిద్దిఖీ, అనురాగ్ కశ్యప్ లతో బాటు అతిధి పాత్రల్లో అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షీ సిన్హా, చిత్రాంగద సింగ్, దర్శకుడు నిఖిల్ అద్వానీ లతో ఇంత స్టార్ ఎట్రాక్షన్ వున్నా, ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదంటే దీని కామెడీ వ్యవహారం ఏ స్థాయిలో వుందో అర్ధం జేసుకోవచ్చు. ఉన్న గంటా 40 నిమిషాల నిడివికి కూడా నిలబడని కామెడీ పేరుతో ఏదో కథ!

కథ
     ఘూమ్ కేతు (నవాజుద్దీన్) తాజాగా జానకీ దేవి (రాగిణీ ఖన్నా) ని పెళ్లి చేసుకుని ఉత్తరప్రదేశ్ లో వుంటాడు. మనసు బాలీవుడ్ వైపు లాగుతూంటుంది. కిరాణా షాపు నడిపే తండ్రి దద్దూ (రఘువీర్ యాదవ్) నీకు సినిమా లేంట్రా అని చెడా మాడా తిడుతూంటాడు. తను బాలీవుడ్ రైటర్ అవ్వాల్సిందే నని పట్టుబట్టి కూర్చుంటాడు ఘూమ్ కేతు. కిరాణా లెక్కలు రాసినంత మాత్రాన, నీ పెళ్లి పత్రికల మీద పేర్లు రాసినంత మాత్రానా బాలీవుడ్ రైటర్ అయిపోతా వట్రా అని ధూంధాం చేస్తాడు పరమ కోపిష్టి దద్దూ. ఘూమ్ కేతుకి మేనత్త (ఇళా అరుణ్) సపోర్టు బాగా వుంటుంది. తల్లిలేదు, తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఇంకో పెళ్లి కాని  పెదనాన్న వుంటాడు. ఘూమ్ కేతు ఇలా కాదని ఒక ‘గిలిగింతలు’ అనే హాస్య పత్రికలో చేరడానికి పోతాడు. ఆ ఎడిటర్, నువ్వు పత్రికల్లో రాయడానికి పనికిరావని- సినిమా రైటర్ గా పని కొస్తావని- తను రాసిన ‘30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవడమెలా?’ అన్న బుక్ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. 

       ఆ బుక్ పట్టుకుని ముంబాయి పారిపోతాడు ఘూమ్ కేతు. పెళ్ళయిన పదిరోజుల్లో పారిపోవడం చూసి దద్దూ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాడు. వాడి  ఫోటో ఇమ్మంటే ఫ్యామిలీ ఫోటో ఆల్బం తీసుకుని పారిపోయాడంటాడు. ఫోటో లేకుండా పోలీసులు ముంబాయి పోలీసులకి సమాచారం అందిస్తారు. ఫోటో లేని మిస్సింగ్ కేసు ఇన్స్ పెక్టర్ దద్లానీ (అనురాగ్ కశ్యప్) ముందుకొస్తుంది. 30 రోజుల్లో ఈ కేసు సాల్వ్ చేయకపోతే, మంచి నీళ్ళు కూడా పుట్టని చోట ట్రాన్స్ ఫర్ అయిపోతావని పై అధికారి నుంచి వార్నింగ్ వస్తుంది. 

        పోలీసులకి ఫోటో దొరక్కుండా ఇన్స్ పెక్టర్ దద్లానీ పై పోర్షన్లోనే మకాం వేసిన  ఘూమ్ కేతు జోరుగా మూడు స్క్రిప్టులు రాస్తూంటాడు. షారుఖ్ ఖాన్ ని టార్గెట్ గా  పెట్టుకుంటాడు. ఓ దొంగ ఆ స్క్రిప్టులు ఎత్తుకుపోవడంతో పోలీస్ స్టేషన్ కెళ్ళి ఇన్స్ పెక్టర్ దద్లానీకే కంప్లెయింట్ ఇస్తాడు. ఇప్పుడేం జరిగింది? దద్లానీ ఘూమ్ కేతుని పట్టుకున్నాడా? ఘూమ్ కేతు బాలీవుడ్ రైటర్ అయ్యాడా? ఇద్దరిలో ఎవరి ఆశయం నెరవేరింది? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు 
      1970 మోడల్ గెటప్ తో, డ్రెస్సులతో నవాజుద్దీన్ అవుట్ డేటెడ్ గా వుంటే కామెడీగా వుంటుందనుకున్నట్టుంది. ఇది బెడిసి కొట్టింది. నవ్వుకాదు కదా నీరసం వచ్చేస్తుంది. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటి ఫ్యాషన్ తో రంగు రంగుల డ్రెస్సు లేసుకుంటే మాంచి కిక్ తో నవ్వొచ్చే సందర్భం. నవాజుద్దీన్ ఘూమ్ కేతు పాత్ర కూడా కాలం చెల్లిన పురాతన సినిమా పాత్ర. ఇలా కూడా నటించడానికీ, ఏదో నవ్వించడా నికీ తగిన స్పేస్ కూడా లేదు. అతడి స్పేస్ ని ఇతర పురాతన పాత్రలు మింగేస్తూంటాయి. బాలీవుడ్ లో రైటర్ గా ఎపిసోడ్స్ కూడా పెద్దగా ఏమీ వుండవు. మధ్యలోనే అతను విరమించుకుని వెనక్కి రావడంతో, మొదట్లో ఆసక్తి రేకెత్తించిన రైటర్ పాత్ర ముగిసిపోయి తేలిపోతాడు. నవాజుద్దీన్ ఈ సినిమా చేయడం బ్యాడ్ జడ్జిమెంట్. 

        ఇన్స్ పెక్టర్ గా అనురాగ్ కశ్యప్ ఇంకో బలహీన కామెడీ పాత్ర. ఇందులో తనుకూడా చేయగల్గిందేమీ లేదు. వూళ్ళో ఘూమ్ కేతు ఇంటిదగ్గర పాత్రలన్నీ ఓవరాక్షన్ కామెడీ. వీళ్ళంతా సినిమాకి చేయాల్సిన హాని అంతా చేసేస్తారు. అతిధి పాత్రల్లో కన్పించే అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా తదితరులు వాళ్ళ వాళ్ళ సినిమా షూటింగుల్లో సంక్షిప్తంగా కన్పిస్తారు. సంక్షిప్తంగా కన్పించినా, చివర్లో అమితాబ్ పాత్ర కథని మలుపు తిప్పే పాత్ర. ఈ అవుట్ డేటెడ్ సినిమాకి అమితాబ్ వల్ల చివరి పది నిమిషాలే కాస్త హుషారు పుడుతుంది.  

        సాంకేతికంగా యాడ్ ఫిలిం మేకర్ గా కొన్ని క్రియేటివిటీలు చూపించాడు దర్శకుడు. అట్టహాసంగా సెట్ వేసి సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ చేయడం, నవాజుద్దీన్ వూహించుకుని రాస్తున్న మూడు కథల్ని విజువలైజ్ చేసి చూపించడం మొదలైనవి. 16 ఎంఎం బ్లాక్ అండ్ వైట్ లో చార్లీ చాప్లిన్ టైపు మూకీ సీన్లు వేసి వ్యంగ్యం చేయాలనుకున్న క్రియేటివ్ ప్రయత్నం కూడా రాణించలేదు. ఇవి పాత కాలం ప్రేక్షకులకి తప్ప నేటి యువ ప్రేక్షకులకి ఎక్కవు. ఇక సంగీతం, ఛాయాగ్రహణం పేలవంగానే వున్నాయి. నిర్మాణ విలువలకి స్థానం లేదు. తక్కువ బడ్జెట్ లో లాగించేశారు.  

కథాకథనాలు 
     2007 లో కమెడియన్ వినయ్ పాఠక్, రజత్ కపూర్ లతో వచ్చిన సూపర్ హిట్ ‘భేజా ఫ్రై’ తో పోలిస్తే ‘ఘూమ్ కేతు’ కథ ఓ కామెడీ కథే కాదు. ‘భేజా ఫ్రై’ లో వినయ్ పాఠక్ బాలీవుడ్ సింగర్ నవ్వాలని పల్లెటూరు నుంచి వచ్చి, ఆడియో కంపెనీ బాస్ రజత్ కపూర్ ఇంట్లో తిష్టవేసి, తన సంగీత రాగాలతో బుర్ర తినేస్తాడు. చాలా అమాయక క్యారక్టర్. తనేం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఆడియో బాస్ కీ, అతడి భార్యకీ తంపులు పెట్టి కాపురం గుల్ల చేస్తాడు. ఇదొక విజయవంతమైన న్యూ ఏజ్ కామెడీ. ‘ఘూమ్ కేతు’ లో నవాజుద్దీన్ కి బాలీవుడ్ లో రైటర్ అయ్యే ప్రయత్నాలతో తగిన సీన్లే వుండవు. ఈ సీన్ల మధ్య వూళ్ళో వున్న ఓల్డ్ ఫ్యామిలీ గొడవల కామెడీలు మాటి మాటికీ వస్తూంటాయి. ఇవే ఎక్కువ భాగం ఆక్రమిస్తూ కథకి అడ్డు పడుతూంటాయి.

        పైగా దర్శకుడు ‘ఫోర్త్ వాల్’ టెక్నిక్ ప్రదర్శించడం ఒకటి. అంటే పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథని, పాత్రల్ని వివరించడం. ఇది ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ లో అక్షయ్ ఖన్నా మీద బాగా వర్కౌట్ అయింది. ‘ఘూమ్ కేతు’ లో ఫ్యామిలీ గొడవల్ని చూపించడానికే ఈ టెక్నిక్ ని సాకుగా వాడుకున్నాడు దర్శకుడు. రైటర్ నవ్వాలని ముంబాయి వెళ్ళిపోయిన నవాజుద్దీన్ ఆ ప్రయత్నాలేవో చేసుకోకుండా, ఎప్పుడు చూసినా ఇంకా ఎక్కడో వూళ్ళో వదిలేసి వచ్చిన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటూ -  మా నాన్న ఇలా చేశాడు, పిన్ని ఇలా చేసింది, మేనత్త ఇలా చేసింది, కొత్త భార్యతో ఇలా జరిగిందీ అని ప్రేక్షకులకి చెబుతూ పిచ్చి కామెడీ సీన్లేసు కోవడమేమిటో? ఈ కథ ఫ్యామిలీ గొడవల గురించా, బాలీవుడ్ ప్రయత్నాల గురించా?

        స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్, స్ట్రక్చర్ సంబంధ సూత్రాలూ పట్టించుకోక పోవడం వల్ల ‘ఘూమ్ కేతు’ అయినా, ‘సూఫీయం సుజాతాయుమ్’ అయినా కథేమిటో అర్ధంగాని దయనీయ స్థితిలో పడి అట్టర్ ఫ్లాపయ్యాయి. నవాజుద్దీన్ 30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవ్వాలి, అనురాగ్ కశ్యప్ 30 రోజుల్లో నవాజుద్దీన్ ని పట్టుకోవాలి. ఇదీ కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే నవాజుద్దీన్ రైటర్ అయ్యే ప్రయత్నాలు మానుకుని ఊరికెళ్ళి పోతాడు. ‘సూఫీయం సుజాతాయుమ్’ లో కూడా కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే పాత్రలు  దేని దారి అది చూసుకుంటాయి. ఇవి కథలెలా అవుతాయి? వీటినెవరు చూస్తారు?

        నవాజుద్దీన్ స్క్రిప్టు పోగొట్టుకున్నాక వూళ్ళో వున్న ఫ్యామిలీ గుర్తుకొచ్చి, ఆ సెంటి మెంట్లు గొప్పగా అన్పించి ముంబాయి వదిలి ఇంటికెళ్ళి పోతాడు. అసలు ఈ పాత్రే రైటర్ పాత్రగా నమ్మశక్యంగా వుండదు. జీవితంలో ఏమీ రాయని వాడు బాలీవుడ్ రైటర్ అవ్వా లనుకోవడం ఆషామాషీగా తీసుకున్నట్టుంది దర్శకుడు. అతను రాసే కథలు కూడా ‘సవతి తల్లి’ అనీ, ‘బాత్రూం లో హత్య’ అనీ ఇలాటి చిల్లర వేషాలు.  

        నవాజుద్దీన్ స్క్రిప్టు రాసుకుంటూ ఒక చోట అనుకుంటాడు - ‘కామెడీ రాయడం సీరియస్ బిజినెస్, ప్రేక్షకులు కూడా నవ్వాలి కదా’ అని. దర్శకుడు మాత్రం దీన్ని సీరియస్ బిజినెస్ గా తీసుకోక ‘సి గ్రేడ్’ కామెడీగా చేసి వదిలాడు.

సికిందర్
(తెలుగురాజ్యం డాట్ కాం)