రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 30, 2021

1073 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
తారాగణం : నాగశౌర్య
, రీతూ వర్మ, మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
, ఛాయాగ్రహణం : పి. వంశీ, విష్ణు శర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 29
, 2021

***

        కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో నాగశౌర్య ప్రేమ కథతో దీపావళి ప్రేక్షకుల హృదయాల్లో కాకర పువ్వొత్తులు వెలిగించడానికి వచ్చాడు. పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ గ్లామర్ తోడయ్యింది. దీనికి పేరున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తోడ్పాటునందించింది. ఇన్ని హంగులతో ఏమిటి కొత్త దర్శకురాలు అందిస్తున్న ప్రేమ కథ? ఇది చూద్దాం...

కథ

    ఫారిన్ నుంచి ఆకాష్ (నాగశౌర్య) హైదారాబాద్ వస్తాడు. అతను ఆర్కిటెక్ట్. హైదారాబాద్ లో భూమి (రీతూ వర్మ) ఒక స్టార్ట్ అప్ కంపెనీ నడుపుతూ వుంటుంది. ఆమె చాలా కఠినంగా వుంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు. ఆమె కంపెనీకి ఆకాష్ డిజైన్ చేసి ఇస్తాడు. ఈ క్రమంలో ఆమెని ఆకర్షించాలని ప్రయత్నిస్తాడు. ప్రేమించాలనీ చూస్తాడు.  ఆమె ఇవేవీ ఒప్పుకోదు. ఆమె తల్లి (నదియా)మాత్రం సంబంధాలు చూస్తూంటుంది. భూమికి పెళ్ళి ఇష్టముండదు. కారణం చెప్పదు. ఇంతలో భూమి, ఆకాష్ లు విడిపోయే సంఘటన జరుగుతుంది. ఏమిటా సంఘటన? ఎందుకు విడిపోయారు? ఎలా కలుసుకున్నారు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

    ప్రేమికులు విడిపోయి కలుసుకునే రోటీన్ తెలుగు ప్రేమ సినిమా కథ. ఒక మాటతో తేలిపోయే సమస్యకి సాగదీస్తూ పోయే కథ. అసలు చెప్పాలనుకున్న పాయింటేమిటంటే, తల్లిదండ్రులు కొడుకులకి పెళ్ళి చేసుకోవడానికి చాలినంత సమయమిస్తారు, అదే కూతుళ్ళ విషయంలో తొందర పెడతారెందుకు, మానసికంగా సిద్ధంగా వున్నారో లేదో తెలుసుకోరెందుకు - ఇదీ చెప్పాలనుకున్న పాయింటు, కథ.

        హీరోయిన్ తండ్రి (మురళీ శర్మ) ఈ పాయింటు రైజ్ చేయడానికి సెకండాఫ్ లో సగం వరకూ సమయం పట్టింది. అంటే సకాలంలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు కాని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. ఇలా ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ లో సగం వరకూ ఈ పాయింటు వచ్చే దాకా ఏమీ జరగదు, అంటే కథే మొదలు కాదు. ఈ పాయింటుతో కథ మొదలయ్యాక కూడా ఏం చేయాలో అర్ధంగాక, ఫ్లాష్ బ్యాక్, కామెడీ ట్రాక్, పాటలూ వంటి వాటిని భర్తీ చేశారు. కథ కాని, కథే లేని కథతో సినిమా తీసిన  దర్శకురాలి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా కథా మూలాల గురించి నెట్లో రెండు టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున మన్మథుడు’, జగపతి బాబు ప్రవరాఖ్యుడు రెండూ కలిపితే వరుడు కావలెను కాలం చెల్లిన కథ అని.

నటనలు – సాంకేతికాలు
      పాత్ర నటించడం కంటే (నటించడానికి పాత్రలో ఏముందని) ఫ్యాషన్ పెరేడ్ చేస్తున్నట్టు స్టయిలిష్ కాస్ట్యూమ్స్ తో నాగశౌర్య చేసిన ప్రదర్శన దీపావళికి హోమ్లీగా, కనువిందుగా వుంది.  రీతూ వర్మ పాత్రకే కథ వుంది, దాంతో పాత్రకి కొంత బలమూ వుంది. మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో పూజా హెగ్డే పాత్రకి లాగా. ఈ నేపథ్య బలంతో స్ట్రిక్టు ఆఫీసు బాస్ గా చక్కగా నటించింది. తల్లిగా నటించిన నదియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండాఫ్ కామెడీ ట్రాకు నడిపించిన సప్తగిరి కథలేని సినిమాకి కాస్త దిక్కు. కానీ వెన్నెల కిషోర్ కామెడీ మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో లాగే మరోసారి విఫలమైంది.

        ఈ సినిమాలో రెండు పాటలు క్యాచీగా వుంటూ హిట్టయ్యాయి. మిగిలిన పాటలు- దిగు దిగు నాథ తో పాటు ఏవరేజి. ఇక విజువల్స్, నిర్మాణ విలువలూ ఫ్రెష్ గా రోమాంటిక్ ఫీల్ ని సరఫరా చేసేలా వున్నాయి-  ఈ ఫీల్ కథా కథనాలతో లేకపోయినా. 

చివరికేమిటి

     పాతబడిన రొటీన్ కథ, అందులోనూ సెకండాఫ్ సగం వరకూ కథేమిటో  తెలియని కథ కాని కథ. ఫస్టాఫ్ ముప్పావుగంటా హీరోహీరోయిన్ల కలుసుకోవడాలు, ముచ్చట్లాడు కోవడాలూ తప్ప ఏమీ జరగని విసుగు. ఆ తర్వాత హీరోహీరోయిన్లు విడిపోవడమనే ఒక మలుపుతో రిలీఫ్ పొందినా, సెకండాఫ్ లో షరా మామూలే. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఒక పెద్ద విఫలమైన సృజనాత్మకత. పైన చెప్పుకున్న అసలు పాయింటు వచ్చి మళ్ళీ మనకి హుషారు వచ్చినా, ఆ పాయింటు కూడా ఎటూ కదలక మొరాయించడం. సప్తగిరి వచ్చి కామెడీ ట్రాకుతో లేపడం. ఇంకెలాగో కథని ముగించడం. హుషారు తెప్పించేలా వుండాల్సిన ప్రేమ సినిమాలు ఇలా ఓల్డేజీ హోమ్ లో వున్నట్టు ఎందుకుంటున్నాయో ప్రశ్నించుకుంటే బావుంటుంది. దీనికి సినిమా సమీక్షకుడు గణేశ్ రావూరి మాటలు రాశాడు. కానీ ఫ్రెష్ గా వున్న మాటలు విషయం లేని  ఇంత పురాతన కథని ఏం ఆదుకుంటాయి.

—సికిందర్