రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, October 4, 2022

1224 : రివ్యూ!


రచన - దర్శకత్వం: ము. మారన్
తారాగణం : అరుళ్ నిధి స్టాలిన్, మహిమా నంబియార్, అజ్మల్ అమీర్, విద్యా ప్రదీప్, సుజా వారుణి, ఛాయాసింగ్, లక్ష్మీ రామకృష్ణన్, జాన్ విజయ్, ఆనంద రాజ్, ఆడుకాలం నరేన్ తదితరులు

సంగీతం: సామ్ సిఎస్, ఛాయాగ్రహణం : అరవింద్ సింగ్
బ్యానర్ ; యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : ఢిల్లీ బాబు

విడుదల : సెప్టెంబర్ 30, 2022 (ఆహా)

***

       మిళం నుంచి ఓ మర్డర్ మిస్టరీ రేయికి వేయి కళ్ళు ఈ వారం ఆహా ఓటీటీ లో విడుదలయింది. ఒరిజినల్ ఇరవుక్కు ఆయిరం కన్గల్‌ టైటిల్ తో 2018 లోనే విడుదలయింది. ఇది జియో సినిమాలో ఇదివరకే వుంది. తెలుగు వెర్షన్ ఇప్పుడు ఆహాలో విడుదలైంది. దీనికి ము. మారన్ కొత్త దర్శకుడు. అరుళ్ నిధి స్టాలిన్ హీరో. చాలా చిత్ర విచిత్ర మలుపులతో ఈ మర్డర్ మిస్టరీ వుంది. ఇలాటి సినిమాలకి ఓటీటీల్లో మంచి ఆదరణ వుంటోంది. ఓ రెండు గంటలు మెదడుకి పనిబెట్టే అపరాధ పరిశోధక కథలు, మెదడే అవసరం లేని రోమాంటిక్ కామెడీలకంటే చాలా నయమే కాలక్షేపానికి. ఈ మర్డర్ మిస్టరీ ఎంత కాలక్షేపమో ఓ రౌండేసి చూద్దాం...

కథ

    క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్ నిధి స్టాలిన్), నర్సు సుశీల (మహిమా నంబియార్) ప్రేమించుకుంటూ వుంటారు. తండ్రికి చెప్పి పెళ్ళి చేసుకోవాలని సుశీల ఆలోచన. ఇంతలో గణేష్ (అజ్మల్ అమీర్) అనే అతను సుశీలని ఒక రోమియో బారి నుంచి కాపాడతాడు. తర్వాత రెండు సార్లు అక్కడక్కడా ఎదురవుతాడు. అతడి తీరు తేడాగా వుందని గ్రహిస్తుంది సుశీల. హద్దు మీరితే కొడుతుంది. రూపాలీ (ఛాయా సింగ్) అని సుశీల రిచ్ ఫ్రెండ్ వుంటుంది. ఆమెకి పరస్త్రీ లోలుడైన భర్త వసంత్ (జాన్ విజయ్) తో సమస్యలుంటాయి. ఆమెని గణేష్ ట్రాప్ చేశాడని సుశీల తెలుసుకుంటుంది.

గణేష్ ఒక హనీ ట్రాప్ టీంని ఆపరేట్ చేస్తూంటాడు. టీం మెంబర్లు అనిత (విద్యా ప్రదీప్), మాయ (సుజా వారుణి) లని మగవాళ్ళకి ఎరగా వేసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. ఆ వచ్చే లక్షల రూపాయాల్నిఎంజాయ్ చేస్తూంటాడు.

ఒకసారి వైజయంతీ అనే క్రైమ్ నవలా రచయిత్రి (లక్ష్మీ రామకృష్ణన్) భరత్ క్యాబ్ ఎక్కినప్పుడు, రోడ్డు వారగా ఒకడు హై ఎండ్ బైక్ మీద పోతూంటే అనుమానంగా చూస్తుంది. ఇలాటిదే బైక్ మీద ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ ప్రమాద స్థలం నుంచి బైక్ మాయమైంది. ఇప్పుడు ఆ బైక్ మీద పోతున్న వాడు గణేష్ అని ఆమెకి తెలీదు.

ఇలా వుండగా, సుశీలతో బాటు రూపాలీనీ గణేష్ వేధిస్తున్నాడని తెలుసుకున్న భరత్, గణేష్ సంగతి చూడాలని వెళ్తాడు. ఈ సమయంలోనే గణేష్ తో బ్లాక్ మెయిల్ కీ, దోపిడికీ గురైన మురుగేశన్ (ఆనందరాజ్), నరేన్ (ఆడుకాలం నరేన్) లు గణేష్ ని చంపడానికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. తర్వాత పక్కింటి అతను కంప్లెయిట్ చేస్తే పోలీసులు వచ్చి చూస్తారు. ఆ ఇంట్లో గణేష్ టీం మెంబర్ మాయ చచ్చిపడి వుంటుంది.

ఈ ముగ్గుర్లో మాయని చంపిందెవరు? గణేష్, అనితలు ఏమైపోయారు? వర్షపు రాత్రి ఏమిటీ మిస్టరీ? ఈ కేసులో ఇంకెన్ని లోతుపాతున్నాయి? ఇంకెందరు పాత్రధారులున్నారు? నిందితుడిగా పరారీలో వున్న భరత్ ఈ జటిల సమస్యని ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    చిన్న బడ్జెట్లతో వీరావేశంతో తీసేస్తున్న ప్రేమ సినిమాలకి థియేటర్లలో దిక్కు లేదు, ఓటీటీల్లోనూ రొక్కం లేదు. ఇవన్నీ ప్రమాదకరంగా ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ప్లాస్టిక్ లాంటి వ్యర్ధాలే. క్రైమ్ సినిమాలకి ఓటీటీల్లో డిమాండ్ వుంది. దీంతో ఇవి క్వాలిటీ ఎలా వున్నా (క్రైమ్ కి క్వాలిటీ ఏమిటి) చూసేస్తున్నారు ప్రేక్షకులు. కాస్త క్వాలిటీ వున్నవి రేయికి వేయి కళ్ళు అంటూ వస్తూంటాయి. వచ్చినప్పుడు నల్గురి నోళ్ళల్లో నానుతాయి. ఏమిటీ స్పెషాలిటీ అని చూస్తే- క్రైమ్ ఈజ్ సీరియస్ బిజినెస్ కామెడీ లాగే. కామెడీని తీయడాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలో, క్రైమ్ తీయాలన్నా అంతే సీరియస్ గా తీసుకోవాలి. బలహీన నేరాలు, వాటికి బలహీన దర్యాప్తులు, హీనమైన కథనాలు, ముగింపులూ తీస్తే వేరే కామెడీలు తీయనవసరం లేదు, ఇవే హాస్యాస్పదంగా వుంటాయి.

ఇదొకటైతే, క్రైమ్ లో సస్పెన్స్ అంటే చివరి వరకూ హంతకుడెవరో తెలియకుండా అదృశంగా వుంచడమే అనుకుని ఇంకా తీసేస్తున్నారు. ఈ ఎండ్ సస్పెన్సు కథలు ఏనాడో కాలం చెల్లిపోయాయని తెలుసుకోవడం లేదు. సినిమాకి కథ కావాలి, దాంతో యాక్షన్ కావాలి. సినిమా అంటే చలన చిత్రం, చలనంలో వుండేది. కథ కదలకుండా, యాక్షన్ లేకుండా నిశ్చలంగా వుండేది కాదు. ఇలా ప్రత్యర్ధి పాత్ర అయిన హంతకుడు అదృశ్యంగా వుంటే కథే పుట్టదు, యాక్షనే వుండదు. హంతకుడెవరా అని హీరోగారు వెతుక్కోవడంతోనే సరిపోతుంది. హంతకుడు ప్రత్యక్షంగా వుంటే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ తో హీరోతో కథా, దాంతో యాక్షనూ సాధ్యమవుతాయి. ఇదే రేయికి వేయి కళ్ళు తో చేశాడు దర్శకుడు. ఎండ్ సస్పెన్స్ ఉచ్చులో పడకుండా సీన్ టు సీన్ సస్పెన్స్ తో కథనం చేశాడు.

ఇందులో హత్యకి అనుమానితులు ముగ్గురున్నా, పరారీలో వున్న గణేషే హత్య చేశాడని మనకి తెలిసిపోతుంది. కనుక ఎండ్ సస్పెన్స్ లేదు. ఇక అతడెలా దొరుకుతాటడన్న సీన్ టు సీన్ సస్పెన్సుని పుట్టిస్తూ యాక్షనే వుంది. ఇందుకే ఈ రెండు గంటల మర్డర్ మిస్టరీ ఇంట్రెస్ట్ గా మారింది. అయినా ఇందులోనూ లోపాలున్నాయి. కథ నడపడానికి పాయింటు కళ్ళముందున్నా, అసందర్భమైన పాయింటు ని లాగి సెకండాఫ్ కథనం చేశాడు. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. 

నటనలు - సాంకేతికాలు

    ఈ జానర్ సినిమాల్లో హీరో అనే వాడు కనీసం నవ్వకుండా మూతి ముడుచుకుని సీరియస్ గానే వుండాలా? సస్పెన్స్ అనే ఎలిమెంటే సీరియస్సై నప్పుడు, దాన్ని ఛేదించే హీరో కూడా సీరియస్ గానే వుంటే ద్వంద్వాలు వర్కౌట్ కాక, రిలీఫ్ లేని ఒకే మూడ్ తో సినిమా సాగి ఓపికని పరీక్షిస్తుంది. ఇందులో హీరో అరుళ్ నటన ఇదే. ఒక్కోసారి సీరియస్సో, విషాదమో అర్ధం గాని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు. దర్యాప్తులో ఒక కొత్త విషయం తెలిసినప్పుడు మనం ఆశ్చర్య పడితే తను సీరియస్ గానే వుంటాడు. ఇలావుంటే కథని ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ చేస్తాడు. మర్డర్ మిస్టరీని ఛేదించడంలో తెలివితేటల వరకూ ఓకే కానీ, కాస్త వినోదం కూడా అందించాలి ప్రేక్షకుల నుంచి డబ్బులు తీసుకున్నాక. ఇది ఆర్ట్ సినిమా కాదు కాబట్టి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడా లేకుండా అరుళ్ ఇన్వెస్టిగేషనే కొనసాగడానికి కారణముంది. ఇది అనుమానితుడైనందుకు అతడి అవసరమే గాబట్టి.

       విలన్ గా అజ్మల్ ఇంకా సరాదాగా వుంటాడు సీరియస్ పనుల్లో కూడా డైలాగ్ కామెడీతో. హీరో క్యారక్టర్ కంటే ఈ క్యారక్టర్ కలర్ఫుల్ గా వుంటుంది. హీరోయిన్ మహిమా నంబియార్ హోమ్లీగా వుండే నటి. మర్డర్ జరిగిన తర్వాత ఈమె పాత్ర నామ మాత్రంగా వుంటుంది. కథని మలుపులు తిప్పే కీలక పాత్ర రిచ్ మొగుడికి భార్యగా అవస్థలు పడే చాయా సింగ్ ది. పాత్ర స్వరూపం మార్పులకి గురయ్యే క్రమాన్ని బాగా నటించింది. కథ డెప్త్, ఆత్మ అన్నీ ఈమె పాత్ర తోనే వున్నాయి. ఇక రచయిత్రి పాత్రలో లక్ష్మీ రామకృష్ణన్ కూడా. ఈమెతో ముగింపులో అతి చేశాడు దర్శకుడు. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం.

       అనుమానితులుగా జాన్ విజయ్, ఆనంద రాజ్, ఆడుకాలం నరేన్ లలో  ఆనంద రాజ్ ది కామెడీగా వుండే పాత్ర. మిగిలిన ఇద్దరూ అనుమానితులుగా బాగానే నటించారు గానీ, అసలీ అనుమానితులకి సంబంధించిన కథనమే అవసరం లేదు. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం.

        టెక్నికల్ గా బావుంది. ఈవారం విక్రమ్- వేదా కి సంగీతమిచ్చిన సామ్ ఈ మర్డర్ మిస్టరీకి కూడా థ్రిల్లింగ్ స్కోరు ఇచ్చాడు. సస్పెన్సు ని ఎలివేట్ చేసే బాణీలతో ఒక శైలిని మెయింటైన్ చేశాడు- మ్యూజిక్ డిజైన్ గా. అరవింద్ ఛాయాగ్రహణం కూడా ప్రొఫెషనల్ గా వుంది. కొత్త వాడైన మారన్ దర్శకత్వం పకడ్బందీగానే వుంది. సీన్ ఎక్కడ ప్రారంభించాలో, సీనులో ఏఏ విషయాలు కెమెరాకి అవసరం లేదో, సెల్ఫ్ ఎడిట్ చేసుకుని స్క్రిప్టు రాసినట్టుంది.

చివరికేమిటి

    ఫస్టాఫ్ మొదటి ముప్పావు గంట కథనాన్ని వివిధ పాత్రల్ని సెటప్ చేయడానికే తీసుకున్నాడు దర్శకుడు. పాత్రలు అనేకం వున్నాయి. అయితే  మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లాగా మల్టీపుల్ పాత్రలతో కన్ఫ్యూజన్ లేదు. ముప్పావు గంట తర్వాత మర్డర్ జరిగి హీరో సహా అనుమానితులు ముగ్గురూ ఎవరికి వాళ్ళు ఉడాయించడంతో, తర్వాత హీరో అరుళ్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా పారిపోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఇంతవరకూ నీటుగా, బలంగా వుంది. ఈ మొత్తం మర్డర్ సీక్వెన్సులో విలన్ అజ్మల్ ని చూపించక పోయినా అతనే హంతకుడని మనకి తెలిసిపోతుంది. కనుక హంతకుడితో ఎండ్ సస్పెన్స్ కథనం వుండే ఆస్కారం లేదు.

సెకండాఫ్ తోనే సమస్య. పాయింటేమిటంటే అజ్మలే హంతకుడని తెలిసిపోతున్నాక, అనుమానితులుగా అరుళ్, ఆనందరాజ్, ఆడుకాలం నరేన్ లని చూపించడంలో అర్ధం లేదు. వెంటనే అరుళ్ అజ్మల్ ని పట్టుకుని తన మీద నిందని తొలగించుకునే ఎజెండాతో కొనసాగాలి. ఇలా కాకుండా ఆనంద రాజ్, నరేన్ లని ఒకరి తర్వాత ఒకర్ని పట్టుకునే ట్రాక్ తో, పట్టుకుని వాళ్ళు చెప్పే ఫ్లాష్ బ్యాకుల ద్వారా వాళ్ళకి హత్యతో సంబంధం లేదని తెలుసుకుని వదిలేయడం ద్వారా- జరిగిందేమిటంటే మనకి ముందే తెలిసిన విషయమే మళ్ళీ చెప్పడం లాగా తయారయ్యింది. వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఎలా నమ్ముతాడో తెలీదు. ఎలాటి ప్రశ్నలు వెయ్యడు. తర్వాత ఇంకో అనుమానితుడు కూడా తెరపై కొస్తే అతడితో కూడా ఇదే తంతు.

ఈ మొత్తం వ్యవహారంలో హతురాలితో సంబంధమున్న అజ్మల్ కనిపించడం లేదని తెలుసుపోతున్నాక అరుళ్ వెంటనే అతడి వేటలో పడితే కథనం సరైన ట్రాక్ లో వుంటుంది. అనుమానితులతో, వాళ్ళ ఫ్లాష్ బ్యాకులతో చూపించిందంతా అనవసర చిత్రీకరణ, లాజిక్ లేని కథనం.  

అజ్మల్ ని పట్టుకోవాలంటే, బాధిత భార్య ఛాయా సింగ్ తో వున్న పాయింటు మీద దృష్టి కేంద్రీకరిస్తే సులభమమై పోయేది. ఇలాటి లాజిక్కులు వదిలేసి ముక్కు ఎక్కడుందంటే తల చుట్టూ తిప్పి చూపినట్టుంది కథనం. ఇక అనుమానితుడు ఆనందరాజ్ చంపడానికి పిస్తోలుతో వెళ్ళినప్పుడు, మాయ చచ్చిపడి వుంటుంది. ఆమె పక్కన పిస్తోలు వుంటుంది. ఆ పిస్తోలుతో కన్ఫ్యూజై, తన పిస్తోలు అక్కడ పడేసి, అక్కడున్న ఆ పిస్తోలుతో వచ్చేస్తాడు. పోలీసులకి హత్యా స్థలంలో పిస్తోలు దొరికినప్పుడు అదెవరిదో తెలుసుకుని ఆనందరాజ్ ని పట్టుకోవచ్చు. ఆ పని చెయ్యరు. అలాగే, రచయిత్రి భర్త యాక్సిడెంట్లో మరణించి బైక్ మిస్సయితే, ఆ బైక్ నిపట్టుకునే ఆలోచన కూడా చెయ్యరు పోలీసులూ క్రైమ్ రచయిత్రి. ఆ బైక్ అజ్మల్ కొట్టేసి తిరుగుతూంటాడు. రచయిత్రి భర్తని అతనే యాక్సిడెంట్ చేసి చంపి, బైక్ కొట్టేశాడా? ఆ భర్త కూడా హనీ ట్రాప్ బాధితుడేనా? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.

చివరికి అంతా సుఖాంతమయ్యాక, క్రైమ్ నవలా రచయిత్రి వైజయంతీ 50 వ కోసం ఒక గొప్ప అయిడియా కనిపెడుతుంది. ఈ అయిడియా అరుళ్ కే చెప్తుంది. దాని ప్రకారం కేసులో జరిగినట్టు మాయని అజ్మల్ చంపడు. అరుళ్ ప్రేమిస్తున్న హీరోయినే మాయని చంపుతుంది. కేసులో అజ్మల్ ఇరుక్కుంటాడు. పాపం అరుళ్ ప్రేమిస్తున్న హీరోయిన్ ని సీక్రెట్ హంతకురాలిగా చేస్తే ఆమెతో అతడెలా  బ్రతుకుతాడనుకుందో రచయిత్రి? యాక్సిడెంట్ లో పోయిన తన భర్త బైక్ వేసుకుని అజ్మల్  తిరుగుతున్న విషయం మర్చిపోయిందేమో? భర్తని కూడా అతనే చంపి వుంటాడన్న మన అనుమానం కూడా తీర్చకుండా.    

       ఇలా సెకండాఫ్ లో వుండాల్సిన కథ వొకటైతే చూపించింది ఇంకొకటిగా తయారైంది.
—సికిందర్