రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, డిసెంబర్ 2014, మంగళవారం

ఐటెం ట్రెండ్

ఐటెం సాంగ్స్ తో వన్స్ మోర్ చరిత్ర!
     ఎంటర్ టైన్ మెంట్ అంటే హాట్ హాట్ కంటెంట్ గా అర్ధం మారిపోయాక టాప్ హీరోయిన్లు తమ వంతూ ఆ కాష్టంలోకి ఆజ్యంపోస్తూ, వాంప్స్ మాదిరిగా ఐటెం సాంగ్స్ తో రసిక ప్రేక్షకుల్ని రంజింప జేస్తున్నారు. బికినీ వేసినప్పుడు లేని బింకం ఐటెమప్పుడు ఎందుకట అనీ తలావొక కెవ్వు పాటెత్తుకుని ఆడిపాడేస్తున్నారు. `60 లలోనే  హిందీ హీరోయిన్ బికినీ వేసినప్పుడు తెలుగు హీరోయిన్ నిండు చీరలోనే ఉండిపోయింది. ఆ చీర తగ్గుతూ తగ్గుతూ పొట్టి నిక్కరు దాకా  వచ్చింది. అదికూడా చాలక బికినీ తో వొళ్ళు కప్పుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు బికినీల్లోనే  చాలా కాన్ఫిడెంట్ గా ఫీలవుతోంది. ఇక ఐటెం సాంగ్స్  తో మేజువాణీ కూడా మొదలెట్టేసి, నేటి సినిమా హీరోయిన్ తలచుకుంటే ఏ శిఖరాలకి చేరుకోగలదో నిరూపిస్తోంది.
          నిర్మాతలకి కమర్షియల్ హిట్ కావాలి, టాప్ హీరోయిన్లకి తక్షణ రొక్కం  కావాలి. ఈ రెండే ఐటమ్స్ సాంగ్స్ పుట్టుకకి కారణం. టాప్ హీరో పక్కన క్రేజీ హీరోయిన్ తో ఓ ఐటెం సాంగ్ పెడితే వాణిజ్య విలువలు బాగా పెరుగుతాయనే ఆశ నిర్మాతలకి, రెండ్రోజుల్లో ఇరవై నుంచీ 75 లక్షలవరకూ ఒక్క ఐటెం సాంగ్ తోనే గడించ వచ్చన్న ఆశయం హీరోయిన్లకీ ఏర్పడి ఐటెం సాంగ్స్ పుడుతున్నాయి. ఇక ఈ సాంగ్స్ కి అట్టహాసంగా కోటి- కోటిన్నర ఖర్చుపెట్టి వేసే భారీ సెట్టింగులతో కళాదర్శకులకీ, వాళ్ళ  పరివారానికీ పుష్కలంగా ఆర్జనకూడా! కాస్ట్యూమర్లని కూడా మర్చిపోవద్దు!
         
మగధీర   తో ప్రారంభమైన సోషియో ఫాంటసీ సినిమాల ఒరవడిలో అకస్మాత్తుగా భారీ సెట్టింగులు వేసే ట్రెండ్ ఒకటి ప్రారభమై, హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ కట్టడాలతో పోటీ పడుతూ ఆ  సినిమా సెట్స్ కూడా వెలిశాయి. ఆ సినిమాలు అంతరించి పోయాయి. కానీ అలాటి సెట్స్ వేసే ట్రెండ్ ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మళ్ళీ మొదలైంది. కాకపోతే అవుట్ డోర్ లో కాదు. ఇలా ఒక పెద్ద స్టార్ సినిమాలో ఐటెం సాంగ్ కే హీరోయిన్ పారితోషికాలూ సెట్ నిర్మాణాలతో కలుపుకుని  రెండు కోట్లకి పైనే   ఖర్చు పెడుతున్నారు. తాజాగా కరెంట్ తీగలో సన్నీ లియోన్ ఐటెం పాటకి వేసిన సెట్ ఖర్చే కోటిన్నర రూపాయలు. ( ఛార్మీ వంటి చిన్న తార తో ఓ తమిళ సినిమాకి తీసిన ఐటెం పాటకి కోటి రూపాయల సెట్ వేశారు!
  దేశం లో ఐటెం పాటకి కళ్ళు తిరిగే మొత్తం అక్షరాలా ఆరుకోట్ల రూపాయలు హిందీలో వచ్చిన బాస్కోసం ఖర్చు పెట్టారు. అక్షయ్ కుమార్ సోనాక్షి సిన్హా లు నటించిన ఈ సినిమాలో పార్టీ ఆల్ నైట్ అనే ఐటెం పాటలో అక్షయ్ , సోనాక్షి, ప్రభుదేవా, యోయో హనీసింగ్ ఇంకా ఆరువందల మంది విదేశీ మోడళ్ళు కన్పిస్తారు!)     ఐతే ఇటీవల మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో ఐటమ్స్ సాంగ్స్ సంగతి దేవుడెరుగు- బడ్జెట్ లో భారీగా కోత పెట్టుకుని కొత్త సినిమాల నిర్మాణాలకి పూనుకుంటున్నారు. 

        ఎన్టీఆర్ ఆదేశాలతో పూరీ జగనాథ్ దర్శకత్వం వహిస్తున్న టెంపర్సినిమాకి ఇదే అమలవుతోంది. స్టార్లు, స్టార్ దర్శకులు చెరో పదీ పన్నెండేసి కోట్లు పారితోషికాలు తీసుకుంటూ తమకు  అట్టర్ ఫ్లాప్ సినిమాలు అంటగడుతున్నారని ఇటీవల బయ్యర్లు తిరుగుబాటు చేయడంతో, మొదటగా కళ్ళు తెర్చింది ఎన్టీఆరే. ఇది తనకి రభస నేర్పిన పాఠం. మహేష్ బాబు కూడా ఈ సంవత్సరం నేనొక్కడినేతర్వాత ఆగడుకూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆగడునిర్మాతలకి ఆరు కోట్లు వెనక్కి ఇచ్చేసినా- ఆయన భవిష్యత్ ప్రణాళికేమిటో  తెలీదు. ఎన్టీఆర్ మాత్రం పూరీ దర్శకత్వంలో నటిస్తున్న టెంపర్కి పారితోషికం తీసుకోకుండా నైజాం హక్కులు పొందితే,  పూరీ కూడా అదే దారిలో సీడెడ్ హక్కులు రాయించుకున్నారు. ఇది సరయిన పద్దతి! తమ పనితనం చూసి ఆయా ఏరియాల్లో ప్రేక్షకులిచ్చేదే సరైన ప్రతిఫలం!
          ఇంతేగాక టెంపర్ నిర్మాణ వ్యయం  కూడా బాగా తగ్గేట్టు ప్లాన్ చేశారు. దీంతో సీన్స్ కీ, పాటలకీ విదేశాలకి వెళ్ళడంలేదు. ఐటెం సాంగ్ తప్పడం లేదు, కాకపోతే ముందు అనుకున్న శృతీ హాసన్ ని కాదని, కెనడా మోడల్ నోరా ఫతేహీ ని తీసుకున్నారు. జంక్షన్ లో..అంటూ మహేష్ బాబుతో శృతీ హాసన్ ఆగడులో నాలుగు నిమిషాలు కనపడే ఐటెం సాంగ్ కి అక్షరాలా యాభై లక్షల రూపాయలు సొంతం చేసుకుంది! నా పేరు సిల్కు..అంటూ  అల్లుడు శీనులో మరో ఐటెం సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టేప్పే సిన టాప్ హీరోయిన్ తమన్నా కయితే 75లక్షలు ముట్టాయి!

         ఐటెం సాంగ్స్ వ్యయం తగ్గించడానికి పూరీ అనుసరిస్తున్న ఫార్ములా ఫారిన్ మోడళ్ళని ప్రవేశపెట్టడం. మన టాప్ హీరోయిన్లు, లేకపోతే  బాలీవుడ్ హీరోయిన్లు గా సాగుతున్న ఐటెం సాంగ్ ల ట్రెండ్ అంతర్జాతీయ మోడళ్ళతో ఇంకో మలుపు తిరిగింది. బ్రెజిల్ కి చెందిన మోడల్ గాబ్రిలా బెర్టెంట్ ని దేవుడు చేసిన మనుషులులో ఐటెం సాంగ్ కోసం తీసుకొచ్చిన పూరీ, మళ్ళీ ఇప్పుడు టెంపర్ కోసం నోరా ఫతేహీ ని పట్టుకొచ్చారు. మధ్యలో దిల్ రాజు ఎవడులో రాం చరణ్ తో ఐటెం సాంగ్ కోసం స్కార్లెట్ విల్సన్ ని దిగుమతి చేశారు.
          మన దేశపు సినిమాలకి మాత్రమే పరిమితమైన ఈ ఐటెం సాంగ్స్ అనే మసాలా దినుసుని   
ది అఫీషియల్ డిక్షనరీ ఆఫ్ అన్ అఫీషియల్ ఇంగ్లిష్ఇలా నిర్వచిస్తోంది...కథతో సంబంధంలేకుండా, అందమైన డాన్సర్లతో ఆడిపాడించి, కమర్షియల్ గా ఆకర్షించేందుకు వినియోగించే ఒక హంగు అని...సెన్సార్ బోర్డు కూడా జోక్యం చేసుకుని, ఐటెం సాంగ్ వుండే సినిమాలకి సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది వేడి వేడి చర్చకు దారితీసింది. అలా అనుకుంటే ఇక  యూసర్టిఫికేట్ సినామాలే వుండవు. పాతరోజుల్లో ప్రతి భాషలోనూ కుటుంబ కథా చిత్రాల్లో, మన సినిమాల్లో విజయలలిత,  జ్యోతిలక్ష్మి పాటల్లాగా - ఏదోవొక వాంప్ సాంగ్  వుండేది. వాటికి  సర్టిఫికేట్ ఇచ్చిన దాఖలా లేదు. ఇంతే కాదు,  ఇప్పుడు ఐటెం సాంగ్స్ ని ఛానెళ్ళలో కూడా ప్రదర్శించ కూడదని సెన్సార్ బోర్డు ఉత్తర్వులు వెలువడ్డాయి.  అసలు ఐటెం సాంగ్ నిర్వచనాన్నే సెన్సార్ బోర్డు ఇంతవరకూ స్పష్టంగా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏది నాటీ సాంగ్ అవుతుంది, ఏది ఐటెం సాంగ్ అవుతుందో ఎలా చెప్పగలదని ప్రశ్నిస్తున్న వారూ వున్నారు. ఈ గొడవలు మనకెందుకు, ఐటెం సాంగ్ లేకపోతే  సినిమా ఏమైనా ఫ్లాప్ అవుతుందా అని ఆలోచిస్తున్న నిర్మాతలూ  వున్నారు.  

          ఒకప్పటి వాంప్ పాత్ర నేటి ఐటెం గర్ల్ అయ్యింది. ఇంత వరకూ ఫర్వాలేదు. ఐతే ఒక టాప్ హీరోయిన్ వున్న సినిమాలో ఇంకో టాప్ హీరోయిన్ అతిధి పాత్ర వేయడానికే
నోచెప్పేస్తున్న  దృష్టాంతాలు చూస్తున్న రోజుల్లో, ఏమాత్రం సంకోచించకుండా  ఐటెం గర్ల్ రూపంలో దిగుమతి అవడానికి ఎస్చెప్పేస్తోంది. తను వచ్చేసి ఐటెం గర్ల్ రూపంలో వాంప్ ఆర్టిస్టు వృత్తిని లాక్కోవడం అలా వుంచుదాం, అసలు ఆ పాత్రకి తను దిగజారుతున్నానని కూడా భావించడం లేదు.  ప్రత్యేకంగా జ్యోతి లక్ష్మిలు, డిస్కో శాంతిలు, అభినయశ్రీలు ఇప్పుడు అక్కర్లేదు- తమన్నా,శృతీ హసన్, శ్రియ, ఛార్మీలు వచ్చేసి ఆపని కానిచ్చేస్తున్నారు. ఎంతటి టాప్ హీరోయిన్ అయినా ఆ స్థానంలో ఎన్నాళ్ళు వుంటుందో గ్యారంటీ లేదు. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే తాపత్రయం లోంచే ఇలాటి బుద్ధులు పుడుతున్నాయని, ఇప్పుడు సినిమాలు తీయకుండా ఈ తమాషా చూస్తున్న ఓ సీనియర్ నిర్మాత అన్నారు. ఐటెం సాంగ్స్ కి పెడుతున్న డబ్బులతో ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయొచ్చని ఆయన అభిప్రాయం. సరీగ్గా  ఈయన అభిప్రాయాన్నే పైన మనం చెప్పుకున్న హిందీ సినిమా ఐటెం సాంగ్ విషయంలో ఇంకాస్త ఘాటుగా వెలిబుచ్చాయి బాలీవుడ్ వర్గాలు. ఐటెం పాట పేరుతో ఆరుకోట్ల రూపాయలు తగిలెయ్యడాన్ని తీవ్రంగా నిరసించారు. చిన్న నిర్మాతలు, కొత్త కొత్త  దర్శకులు ఎందరో పెట్టుబడులకి మొహం వాచి  వుంటే, ఒక ఐటెం పాటకి ఆరుకోట్లు తగిలెయ్యడం బాధ్యతారాహిత్యమని తీవ్రంగా విమర్శించారు. 

          కొందరు హీరోయిన్లు ఐటెం పాటలు ఒప్పుకోవడానికి వాళ్ళ పరిస్థితి కారణమౌతోంది- హీరోయిన్ గా అవకాశాలు సన్నగిల్లడం! దీన్ని అర్ధం జేసుకోవచ్చు. నమిత
, ఆశాసైనీ, ఫర్జానా, సమీరా రెడ్డి, పార్వతీ మెల్టన్, కిమ్ శర్మ, కౌశ, రీమా సేన్, హంసా నందిని, మాళవిక, రంభ, స్వాతీ వర్మ .....ఇలా అవకాశాలు తగ్గిన హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి ఒప్పుకుంటున్నారు. అయితే ఎదుగుతున్న నటి అంజలి కూడా సూర్య నటించిన యముడులో ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో అంతుబట్టదు. ఇక ఛార్మి విషయం చెప్పక్కర్లేదు. ప్రియమణి అయితే షారుఖ్ ఖాన్ నటించిన హిందీ చెన్నై ఎక్స్ ప్రెస్లో వన్ టూ త్రీఅనే ఐటెం పాటేసుకుంది. శ్రియ కూడా వెళ్లి సంజయ్ దత్ నటించిన జిల్లా ఘజియా బాద్లో మై ఛమియా నంబర్ వన్ హూ, మై ఛమియా ఐటెం బాంబ్ హూ..అని నేరుగా ఐటెం బాంబునని డిక్లేర్ చేసుకుంది!

     వీళ్ళందరి సుడిగాలిలో కేవలం ఐటెం గర్ల్ గానే వచ్చి కొన్నాళ్ళు ఊపిన ముమైత్ ఖాన్ అమాంతం తెరమరు గయ్యింది. అభినయశ్రీ గురించి చెప్పక్కర్లేదు. ఇలాటి వృత్తి ఐటెం డాన్సర్లు సినిమాల్లో ఇంకో పాత్ర కూడా పోషించే వాళ్ళు. విలన్ పక్కన ఉంపుడు గత్తెలుగా వుండడం. ఇది అనాదిగా వస్తున్నదే. విజయలలిత, జ్యోతి లక్ష్మి, రాజసులోచన, జయమాలిని, హలం, సుభాషిని, అనూరాధ, జయశ్రీ, పాకీజా, రమ్యశ్రీ, కుయిలి, ఆల్ఫోన్సా, షకీలా, డిస్కో శాంతి, సిల్క్ స్మిత..వీళ్ళంతా ఒకప్పుడు ఈ శాఖని ఏలుకున్నారు. కాకపోతే వీళ్ళని వాంప్స్ అనేవాళ్ళు. వీళ్ళ పాటల్ని క్లబ్ సాంగ్స్ అనేవాళ్ళు, ఆ క్లబ్ సాంగ్స్ లో కేబరే డాన్సర్స్ అన్పించుకునే వాళ్ళు. లేదా ద్వందార్ధాలు బాగా దట్టించి –‘సూదిలో దారం సందులో బేరంలాంటి ఫోక్ సాంగ్స్ వేసుకునే వాళ్ళు. ఇలాటి వాటికి తిరుగులేని ఐటెం సింగర్గా ఎస్టాబ్లిష్ అయింది ది గ్రేట్ ఎల్లారీశ్వరియే! ఇప్పుడు అలాటి ఐటెం సింగర్స్ ఎవరో చెప్పగలమా?

          ఐతే హిందీలో టాప్ హీరోయిన్ వైజయంతీ మాలా, షకీలా లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఐటెం గర్ల్గా అనేక సార్లు కన్పించినవారే. దీనికి సాహసించడానికి  మన హీరోయిన్లకి ముక్కుతూ మూల్గుతూ ఐదు దశాబ్దాలకి పైగా పట్టింది. 1954 లోనే  మొట్ట మొదటిసారిగా దేశీయ సినిమాల్లో ఐటెం గర్ల్గా వెలసిన తార షకీలా. ఈమె గురుదత్, షమ్మీ కపూర్ ల వంటి  అగ్ర హీరోల  సరసన హీరోయిన్ గా నటించిన గ్లామర్ తార. అలాంటిది  ఆర్ పార్లో బాబూజీ ధీరే చల్నా-ప్యార్ మే జరా సంభల్నా’ ( చూసి అడుగెయ్యి బాబూ, ప్రేమలో జాగ్రత్త) 

           ఇక 1957 లో ఆశాఅనే సినిమాలో ఈనా  మీనా డీకాఅని నేటికీ మోగే ఐటెం సాంగ్తో మళ్ళీ టాప్ హీరోయిన్ వైజయంతీ మాలా దుమ్మురేపింది. తిరిగి  మధుమతిలో చడ్ గయో పాపీ బిచువా  (పాపిష్టి తేలు ఎక్కేసింది),  ఇంకా మళ్ళీ సాధన  లో కహోజీ తుం క్యా క్యా ఖరీదోగే’ (చెప్పవయ్యా ఏమేం కొంటావ్) లాంటి డబుల్ మీనింగులతో హృదయాల్ని మీటింది’. ఇలా పది  పన్నెండు వరకూ ఇవ్వాళ మనం చెప్పుకునే ఐటెం సాంగ్స్ తో  చెలరేగింది- అంత పాపులర్ హీరోయిన్ గా ఉంటూ కూడా!

షకీలా
        1965 లో అంతస్తులులో రేలంగి, రమణా రెడ్డి కమేడియన్లని వెంటేసుకుని వీధిలో చుట్టూ జనం మధ్య భానుమతి పాడే దులపరో బుల్లోడో దుమ్ము దులపరో బుల్లోడోపాట అందులో సాంతం ఈవ్ టీజర్లమీద ఎంత విసుర్లు ఉన్నప్పటికీ, ఐటెం సాంగ్ కాక మరేమిటి? ఇక హిందీలో మాధురీ దీక్షిత్ అయితే తేజాబ్లో ఏక్  దో తీన్పాటతో దేశమంతా మార్మోగించింది. తిరిగి ఖల్నాయక్లో చాలా వివాదాస్పదమైన పాట- పార్లమెంట్ లోనూ గొడవకి దారితీసిన ఐటెం సాంగ్ -చోళీ కే పీఛే క్యాహైగురించి తెలిసిందే.

          కాకపోతే అప్పట్లో డిమాండ్లు లేవు. ఆశ్చర్యకరమైన పారితోషికాలు ఐటెం సాంగ్స్ లో కన్పించే హీరోయిన్లకి లేవు. అలాగే ఎక్స్ పోజ్ చేసే కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు ధరించలేదు. మూలాన్ని తీసుకుని దాని షోకుల్ని మార్చేస్తే అది ఇప్పటి ఐటెం సాంగ్ అయింది - తను ఇప్పటి ఐటెం గర్ల్ అయింది, అంతే.  మూలాలున్నంత కాలం అవి  పునరావృతమవుతూనే 
వైజయంతీ మాలా 

వుంటాయి వివిధ రూపాల్లో. 1930 లలోనే వున్న రాజనర్తకే తర్వాత
కాలంలో క్లబ్ డాన్సర్ అయినట్టు, `50 లలో కవ్వించే స్పెషల్ సాంగ్స్ నటించిన హీరోయినే నేటి ఐటెం గర్ల్ అయ్యింది. దీనిపట్ల ఎవరికీ  అభ్యంతరం ఉండనవసరం లేదు. కమర్షియల్ సినిమాకి ఏ హద్దులూ వుండవు. నిజజీవితంలో అసాధ్యమైన వాటిని చూపించి రంజింప జేయడమే వాటి విధి. నేటి సినిమాల్లో ఒక అర్ధవంతమైన పాత్రంటూ లేక, నామమాత్రంగా మిగిలిన హీరోయిన్- ఎంత టాప్ హీరోయిన్ అయినా, నటిగా నిరూపించుకోవడానికి ఇంకేమీ లేక,  చేయకూడని విన్యాసాలు చేస్తూ ఇలాగే  దారితప్పి తిరుగుతుంటుంది..ఎవరేమంటారు?

సికిందర్ 
(డిసెంబర్ 2014 ‘ఈవారం’)