రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, డిసెంబర్ 2018, బుధవారం

718 : స్క్రీన్ ప్లే సంగతులు


మయం చూసుకుని కొన్ని సరిపడా షాకిస్తూంటాయి. అద్భుతమా, కర్మఫలమా అన్నట్టుంటాయి. రాస్తున్న స్క్రీన్ ప్లే సంగతుల్లాంటిదే కథ ఎదురైనప్పుడు షాక్కొడుతుంది. మొన్న సాయంత్రం ఒక అపాయింట్ మెంట్ కారణంగా రాస్తున్న ‘భైరవ గీత’ స్క్రీన్ ప్లే సంగతులు ముగింపు వాయిదా వేసి వెళ్లినప్పుడు – అక్కడ విన్న స్టార్ మూవీ కథ సరీగ్గా ‘భైరవ గీత’  స్క్రీన్ ప్లే సంగతుల్లాగే తగిలి షాకిచ్చింది. ‘భైరవ గీత’ ప్రధానకథ, ఉపకథల ఆయోమయమెలా వుందో స్క్రీన్ ప్లే సంగతుల్లో వరసగా రాసుకుంటూ వస్తున్నాక - ఇదే అక్షరాలా భూతంలా ఎదుట నిల్చుంది. అద్భుతం కాదు, ‘భైరవ గీత’ గురించి  అలా రాస్తూ కూర్చున్నందుకు ఇది కర్మఫలమే. గంటన్నర పాటూ అలాటిదే స్క్రీన్ ప్లే సంగతులతో కథ వింటూ కర్మఫలం అనుభవించాక, అసలు విషయం చెప్తే ఈసారి గట్టి షాక్ తినడం ఆయన వంతైంది. ఏ ‘భైరవ గీత’ స్క్రీన్ ప్లే సంగతులు సీరియల్ రాయడం ఆపి ఇక్కడి కొచ్చామో, ఆ స్క్రీన్ ప్లే సంగతులే ఆయన నేరేషన్ లో వున్నాయని, గంట క్రితం బ్లాగులో పోస్టు చేసి వచ్చిన తాజా భాగం సెల్ ఫోన్లో చూపిస్తే, నోట మాట రాలేదాయనకి. ఈ కథ క్రియేటివ్ స్కూల్లోంచి, పెద్దబాల శిక్ష కూడా లేని వరల్డ్ మూవీస్ బేకారు బడి లోంచి బయటికొస్తేనే కథ. లేకపోతే కథ కాని కథ గాథ. ఓ అందమైన అగాథం. తీసేవాళ్ళతో బాటు చూసే వాళ్ళందరికీ ఉచిత ఆతిధ్యం. అగాథంలో అఘాయిత్యం.

          ‘భైరవ గీత’ ప్రధాన కథని ఉపకథ ఎలా హైజాక్ చేసి సక్సెస్ ని డిమాండ్ చేసిందో గత వ్యాసంలో చూశాం. ఈ హైజాకులు క్రాష్ లాండింగ్ కే దారి తీస్తాయి. ప్రధాన కథతో వుండే సేఫ్ లాండింగ్, సక్సెస్ ఉపకథతో వుండవు. సినిమాలో చెప్పిన ప్రకారం ఇది 1991 లో నిజంగా జరిగిన కథయినప్పుడు, ఇది బానిసల తిరుగుబాటుని ప్రేరేపించిన ప్రేమ కథయినప్పుడు – ప్రేరేపించిన ప్రేమ కథే ప్రధాన కథవుతుంది, అదే కథవుతుంది, దాని చుట్టే కథ వుంటుంది, దానికే ముగింపు వుంటుంది. సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్  యూత్ అప్పీల్ ని తోడుకునే రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్ అయినప్పుడు - రోమాంటిక్స్ తోనే కథా నిర్మాణం జరుగుతుంది. బానిసల కథతో కాదు. లేకలేక ఎకనమిక్స్ తో వచ్చి, మౌత్ టాక్ తో ‘హుషారు’ స్లీపర్ హిట్టయింది. రోమాంటిక్స్ తో ఒక్కటీ లేదు. 

          1991 లో జరిగిన కథంటున్న దాన్ని అప్పటి కథాకాలంతో పీరియడ్ ఫిలింలా తీశారా లేక, పాయింటు మాత్రమే తీసుకుని ఇప్పటి కాలంలో కథని స్థాపించారా స్పష్టత కూడా లేదు.  అప్పటి కథాకాలం చూపిస్తున్నట్టయితే ప్రొడక్షన్ డిజైన్ అలాలేదు. కనీసం కాస్ట్యూ మ్స్, వాహనాలు కూడా అప్పటివి లేవు. పీరియడ్ ఫిలిమన్న ఫీలే లేదు. హిందీలో ‘అశోకా’ లాంటి కొన్ని చారిత్రక కథల్ని యూత్ అప్పీల్ కోసం డిజైనర్ చరిత్రల్లాగా తీశారు. అలాకూడా తీయలేదు. 

          కథని ఇప్పటి కాలంలో స్థాపిస్తే ఇది ఇప్పుడు లేని వాస్తవ దూరమైన బానిసల కథ. నమ్మశక్యంగా వుండదు. ఏదో అయ్యీ కాని పీరియడ్ ఫిలిమే అనుకున్నా, పీరియడ్ ఫిలింలో బానిసల కథతో హోల్ సేల్ గా హోరెత్తించడం యూత్ ఆప్పీల్, మాస్ అప్పీల్ అన్పించుకోవట్లేదు. బానిసత్వాలు, నక్సలిజాలు ఇప్పటి యూత్ కి పరిచయంలేని ఒకప్పటి  గొడవలు. అప్పుడు దీన్ని హోల్ సేల్ హోరాహోరీతో సమూహ కథగా కాకుండా, రెండు మూడు పాత్రల మీదే ఫోకస్ చేసి, పాయింటెడ్ గా చెప్పవచ్చు. ఎన్నికల సర్వేల్లో జనం మొత్తం అభిప్రాయాలూ సేకరించి, జనం మొత్తంతో మైకులు పెట్టించి - మా ఓటు ఆయనకే, ఈయన నోటు మాకే అన్పించరు. శాంపిల్ గా కొందరి అభిప్రాయం తీసుకుని జనం మొత్తం మీద రుద్దుతారు. 

          ఇలాగే బానిసలకి శాంపిల్ గానో, ప్రతినిధులుగానో భైరవనీ, అతడితో ఓ ముగ్గురు బానిసల్నీ చూపిస్తే మొత్తం బానిసల సమూహ కథే అవుతుంది. ‘శివ’ లో ఐదుగురు విద్యార్థుల కథ మొత్తం విద్యార్థుల కథయినట్టు. ఇలా శాంపిల్ పాత్రల  మీద ఫోకస్ తో పాయింటెడ్ గా కథ చెప్తే బలంగా కనెక్ట్ అవుతుంది. వూరు వూరంతా బానిసల్ని చూపిస్తూ, వాళ్ళ గుంపు ఆవేశాలతో, తిరుగుబాట్లతో, డప్పు పాటలతో వీరంగం వేస్తే, విజువల్ అప్పీల్ గల్లంతై వైరాగ్యం వచ్చేస్తుంది. 

          భైరవతో బాటు నల్గురు బానిసలు, ఒక గీత, ఒక సుబ్బారెడ్డి దొర. ఇంతే సింపుల్ గా. సుబ్బారెడ్డి బారినుంచి భైరవ గీతల ప్రేమని కాపాడడం కోసమే తోటి బానిసల పోరాటం, ప్రాణత్యాగాలు వగైరా. ప్రేమని గెలిపించి సుబ్బారెడ్డిని ఓడిస్తే బానిసత్వం నుంచి ఆటోమేటిగ్గా విముక్తి కూడా. లైను ప్రేమ కథ కోసం ప్రేమ కథ మీదే వుంటుంది రోమాంటిక్స్ కి న్యాయం చేస్తూ. బిగినింగ్ – మిడిల్ – ఎండ్ లలో ప్రేమ కథే వుంటుంది. ప్లాట్ పాయింట్స్ ప్రేమ కథతోనే వుంటాయి. 
      
          కానీ ముందుగా ఐడియా దగ్గర నిర్మాణం లేకుండా ఏదీ స్పష్టంగా నిర్మించడం కుదరదు. స్టోరీ గోల్ వేరు, కాన్సెప్ట్ గోల్ వేరు. ఇక్కడ స్టోరీగోల్ ప్రేమ కథ, కాన్సెప్ట్ గోల్ బానిసత్వ విముక్తి. స్టోరీ గోల్ తో ప్రేమ కథ ఆద్యంతం నడుస్తూంటే, కాన్సెప్ట్ గోల్ తో బానిసత్వ విముక్తి అంతర్లీనంగా వుంటుంది. చివరికి ప్రేమ విజయం పూర్తవగానే, బానిస సంకెళ్ళూ పుటుక్కున తెగి, తాగి తెగ తందానా లాడుకోవచ్చు. 

          ఉప కథ ప్రధాన కథ ఎప్పుడూ అవదు. ప్రధాన కథతో సంబంధమున్నదైతే ఉపకథ విడికథ ఎన్నడూ అవదు. కాన్సెప్ట్ గోల్ కి మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ లేకపోతే, ఈ రెండూ వున్న స్టోరీ గోల్ లో అంతర్లీనమై పోతుంది. పాత్రకి స్టోరీ గోల్ తో ఫిజికల్ యాక్షన్, కాన్సెప్ట్ గోల్ తో ఎమోషనల్ యాక్షన్ వుంటాయి. సమగ్రపాత్ర చిత్రణవుతుంది. సినిమా ఫ్లాపయిందంటే ఎందుకు ఫ్లాపయిందో సరైన కారణం  క్రియేటివ్ స్కూలుకి, వరల్డ్ మూవీస్ బడికీ అంతుబట్టదు. కారణాలు స్ట్రక్చర్ స్కూల్ చెప్తే నచ్చదు. కారణాలు తెలియకుండా ఇలా గడిచిపోతూంటే చాలు.

(అయిపోయింది)

సికిందర్