రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 26, 2017

రివ్యూ!





కథ దర్శకత్వం : రాజకిరణ్ 

తారాగణం : విష్ణు మంచు, హన్సిక, తనికెళ్ళ, జయప్రకాష్, పోసాని, ప్రభాస్ శీను, సత్యం రాజేష్, ఎం వివి సత్యనారాయణ తదితరులు
 స్క్రీన్ ప్లే- మాటలు : డైమాండ్ రత్నబాబు, సంగీతం : అచ్చు రాజమణి, ప్రవీణ్ లక్కరాజు,   ఛాయాగ్రహణం : పిజి విందా
బ్యానర్:  ఎంవివి సినిమా
నిర్మాత : ఎంవివి సత్యనారాయణ
విడుదల : జనవరి 26, 2017
***
త సంవత్సరం ‘ఈడో రకం-  ఆడో రకం’ తో అంతగా సక్సెస్ ని  చవిచూడని మంచు విష్ణు,  రిపబ్లిక్ డే కి మళ్ళీ విడుదల వాయిదా పడిన ‘యముడు -3’ స్పేస్ ని ఉపయోగించు కుంటూ హడావిడిగా విడుదల తేదీని ప్రకటించుకుని ఇప్పటికిప్పుడు  ‘లక్కున్నోడు’ తో తిరిగి వచ్చేశాడు. 2015 లో ‘శంకరాభరణం’ తీసి ఫ్లాప్ నెదుర్కొన్న నిర్మాత ఎంవివి సత్యనారాయణ, ఈసారి సినిమా జాతకం ఎలా తేలినా విలన్ గా మాత్రం తను నిరూపించుకుందామని ప్రేక్షకుల ముందుకొచ్చారు. విష్ణు పక్కన తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తూ హన్సిక వచ్చేసింది. ‘గీతాంజలి’ అనే హార్రర్ కామెడీతో వెలుగులోకొచ్చిన దర్శకుడు రాజ కిరణ్, ‘త్రిపుర’ తో ప్రతిష్ఠ మసకబారి ఇప్పుడు కామెడీతో అదృష్టాన్ని  పరీక్షించుకుందామని - అదే సమయంలో సరైన కామెడీలు తీయగల దర్శకులు ఇప్పుడున్నారా అనే ప్రశ్నకి సమాధానం కూడా చెపుదామని అన్నట్టుగా జానర్ జంప్ చేశారు. ఇన్నీ కలిసి ఈ ప్రయత్నం అనుకున్న ఫలితం రాబట్టిందా లేదా ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ
          లక్కీ ( విష్ణు) అదృష్ట జాతకుడు కాదు. చిన్నప్పట్నించీ ఏది పట్టుకున్నా కుటుంబానికి  దురదృష్టమే వెంటాడేసరికి తండ్రి భక్త వత్సలం (జయప్రకాష్) విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తల్లీ చెల్లెలు సానుభూతితోనే వుంటారు. పుట్టాక పేరు పెట్టేటప్పుడు కూడా ఆ ముహూర్తానికి లక్కీ వల్ల జరిగిన అనర్ధానికి పేరే పెట్టకుండా వదిలేస్తాడు భక్తవత్సలం. అవమానపడుతూ అలాగే పేరు లేకుండా పెరిగిన లక్కీ, హైదరాబాద్ వచ్చేస్తాడు ఫ్రెండ్ (సత్యం రాజేష్) దగ్గరికి. రాగానే ఆ ఫ్రెండ్ దివాలా తీసి వీధిన పడతాడు.

          పాజిటివ్ పద్మ (హన్సిక) అనే అమ్మాయి పరిచయమవుతుంది- ఈమె ఇంట్లో అందరూ కీడు జరిగినా పాజిటివ్ గానే ఆలోచిస్తారు. గడ్డం గీసుకునేప్పుడు చర్మం చిట్లి రక్తం వచ్చినా తండ్రి (తనికెళ్ళ భరణి) పీక తెగనందుకు సంతోషించాలని పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఇల్లుపోయినా గుండాగి చావనందుకు సంతోషించాలని పాజిటివ్ గా చెప్తుంది వదిన. ఇలా పాజిటివ్ పద్మ లక్కీకి పరిచయమైనా అతడిని శని వెంటాడుతూనే వుంటుంది. తనకి రావాల్సిన ఉద్యోగం ఆమెకొస్తుంది. 

          ఇలావుండగా, చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికి వెళ్తాడు లక్కీ. అక్కడొక బాధ్యత నెత్తినేసుకుని  నగరానికి వస్తే, దురదృష్టంతన్ని చెల్లెలి పెళ్లి ఆగిపోయే గతి పడ్తుంది. దీంతో ఆత్మహత్య చేసుకోబోతూంటే, ఒక దొంగోడు (ప్రభాస్ శీను) జొరబడి డిస్టర్బ్ చేస్తాడు. ఇంకో  క్రిమినల్ వచ్చి, తన దగ్గరున్న బ్యాగు ఈ పూట వుంచుకుంటే కోటి రూపాయలిస్తానని ఆఫర్ చేసేసరికి- లక్కీ తన లక్ దారిలో పడిందని ఓకే అంటాడు- ఈ ఓకే తో అతడి కథ ఏ మలుపులు తిరిగిందో వెండి తెర మీద చూడాలి. 

ఎలావుంది కథ
          కథ పాతదే అయినా ఇదొక కుటుంబ సమస్యతో కూడిన సమంజసమైన కథ. దర్శకుడి తాజా దృష్టివల్ల ఈ కథ కొత్త ఫీల్ తో ఫన్నీగా మారింది. ఈనాటికి అవసరమైన యూత్ అప్పీల్ తో, ఒక ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనరయ్యే అవకాశాలన్నీ వున్నాయి దీనికి. దురదృష్టవశాత్తూ  ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఫస్టాఫ్ వరకే ఈ తాజాదనాన్ని ప్రదర్శించి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఫస్టాఫ్ లో సున్నిత హాస్యంతో, అదుపులో వుంచిన భావోద్వేగాలతో ఒక పూర్తి  స్థాయి కామెడీ జానర్ అన్పించేట్టు చేసుకొచ్చి, ఆ  తర్వాత కథతోనూ  జానర్ తోనూ మర్యాద తప్పి, ఏదేదో గోల కామెడీ చేసేశారు. పైగా దీనికి క్లయిమాక్స్ లో రచయిత తనకు తానే ఇలా కీర్తించుకుంటాడు- “ఇది ఎంటర్ టైన్మెంట్ ఫార్ములా అనుకున్నా, రివెంజి ఫార్ములానా! వాటే స్క్రీన్ ప్లే సర్జీ!” అని ఒక పాత్ర చేత అన్పిస్తాడు- క్లయిమాక్స్ కొచ్చేసరికి  ఇది కూడా పూర్తిగా ఓ స్టేజి నాటకంలా మారిపోయి ప్రేక్షకులు లేచిపోతున్నా ... స్క్రీన్ ప్లే అనీ, ఫార్ములాలనీ అంటాడు. ఇకనైనా  సినిమాల్ని అల్లాటప్పాగా మార్చేస్తున్న ఈ ఫార్ములాల వంటకాల్ని మానుకుని, జానర్ల మాట మటాడుకుంటే స్క్రీన్ ప్లేలు బాగుపడతాయేమో.

ఎవరెలా చేశారు
          మంచు విష్ణుకి నిజానికిది  సెన్సిబుల్ పాత్ర ఫస్టాఫ్ వరకూ. తన దురదృష్టాలతో  స్ట్రగుల్ చేస్తూ ప్రతీమాటా హాస్యంగా, ప్రతీ ఆలోచనా  హాస్యంగానే వుంటూ, యూత్ అప్పీల్ తో  – బాక్సాఫీసు అప్పీల్ తో చాలా ఫ్రెష్ గా, చూపులు తిప్పుకోలేనంతగా  వుంటుంది  క్యారక్టర్. తన పాత్రని నిలబెట్టడానికి ఫస్టాఫ్ అంతా గత జీవితాన్ని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా  చెప్పడం బాగా తోడ్పడింది. కథలో ఇప్పటి వరకూ పోషించుకుంటూ వస్తున్న ఈ  కామెడీ జానర్ లోనే  ఇంటర్వెల్ కూడా-  దొంగోడితో, క్రిమినల్ తో- బాగా నవ్వొచ్చే బ్యాంగు ఇచ్చింది- ‘స్వామి రారా’ ఇంటర్వెల్ ని గుర్తుకు తెస్తూ- తర్వాతేమిటో  వెంటనే చూడలన్నంత ఉత్కంఠని రేకెత్తిస్తూ. ఇలా సెకండాఫ్ మీద ఆసక్తి రేపే ఇంటర్వెల్ ‘స్వామిరారా’ తర్వాత మళ్ళీ ఇదే. నైస్ క్రియేషన్ క్రియేటివిటీతో. 

          దీన్తర్వాత తద్దినం పెట్టడం మొదలయ్యింది తన పాత్రకి. ఆ జీవితం, ఆ హాస్యం ఎటుపోయాయో,  ఆ ఫస్టాఫ్ ఫన్ ఎటుపోయిందో, అసలు కథ వదిలేసి కొసరు సీరియస్ యాక్షన్ కథ పట్టుకుని –కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టయి పోయింది. ఆ గోదారిలో నీళ్ళు కూడా లేవు. పోలవరం వెళ్ళినా పనిజరిగేట్టు లేదు, అప్పటికి స్టేజి నాటకమైపోయింది. పాటలూ ఫైట్లూ బాగానే చేసినా అవి కథలో, పాత్ర చిత్రణలో కలిసిపోయి వుంటేనే ఎవరికైనా తదనుగుణ హుషారు తెప్పిస్తాయి- లేకపోతే వూరికే శబ్ద కాలుష్యాన్నే సృష్టిస్తాయి. 

          పాజిటివ్ పద్మగా హన్సిక ఫస్టాఫ్ ఫన్నీ క్యారక్టర్ కాస్తా- సెకండాఫ్ లో పాత్రకి పనిలేక క్లయిమాక్స్ కి దర్శనమిస్తుంది. ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ ఫ్రెష్ కామెడీని అందించారు. తండ్రి పాత్రలో జయప్రకాష్ ఒక్కడే  సీరియస్ గా వుంటాడు. కథలో మిగతా పాత్రలన్నీ హాస్యంగా మాటాడేవే. ఇక విలన్ గా వేసిన నిర్మాత సత్యనారాయణ, బలమైన విలన్ గా నటించి తన నటనాభిలాషకి న్యాయం చేసుకున్నారు. తెలుగు విలన్లు కరువైన ఈ రోజుల్లో తను ప్రకాశించ వచ్చు.

          పాటల గురించి చెప్పుకోవడానికేమీ లేదుగానీ, పిజి విందా ఛాయాగ్రహణం అత్యంత కలర్ఫుల్ గా వుంది. డైమండ్ రత్నబాబు రాసిన మాటలు, స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకే సినిమాకి పనికొచ్చాయి. ఫస్టాఫ్ లో తను ఇంతకి  ముందు లేని క్రియేటివిటీతో ఆశ్చర్య పర్చాడు. సెకండాఫ్ కథనేం చేసుకోవాలో అర్ధంగాక కలగాపులగం చేసేశాడు.

చివరికేమిటి
          ఒక మంచి ఫన్నీ  ఫ్యామిలీ డ్రామా, నవంబర్ ఎనిమిదిన దేశంలో ఏం జరిగిందో,  అలా ఇంటర్వెల్ తర్వాత  చెల్లని చిత్తు కాగితమైపోయింది. కొత్త నోట్ల దోపిడీతోనే ఈ కథ మొదలవుతుంది గానీ, ఈ కొత్త నోట్ల కొసరు కథే  సెకండాఫ్ లో అసలు కథై కూర్చుంది – దోపిడీ దొంగల రొటీన్ తో. ఫ్యామిలీలో అంత పనికొచ్చే ప్రాబ్లమ్స్ తో అసలు కథని వదిలేశారు. ఇంటర్వెల్ కి హీరో చుట్టూ చాలా వ్యక్తిగత సమస్యలుంటాయి. దురదృష్ట జాతకుడుగా తండ్రి తో సంబంధాలు పూర్తిగా చెడిపోయి ఒక నింద మోస్తాడు, చెల్లెలి పెళ్లి ప్రమాదంలో పడి, మరో వైపు హీరోయిన్ కూడా చీదరించుకుని చాలా దయనీయ పరిస్థితిలో హీరో పడతాడు.  పాత్రకి బలమైన ఎమోషన్, ఆ ఎమోషన్ తాలూకు గోల్, శత్రువులా వెంటాడే దురదృష్టం...కానీ వీటితో ఏనాడూ కోల్పోని ధైర్యం, చాలా హాస్యప్రియత్వమూనూ...

          ‘భలే భలే మగాడివోయ్’ లో ఇలాటిదే లోపముంటుంది హీరోకి- మతిమరుపనే లోపం. దీంతో  ప్రేమలో చివరంటా దేకుతూ వుంటాడు నవ్వుపుట్టిస్తూ. విష్ణు పాత్రకి కూడా అంతర్గత శత్రువులా వెంటాడే దురదృష్టం అనే లోపం పుట్టుక నుంచీ వుంది- కానీ ఇంటర్వెల్ తర్వాత పాత్ర దీన్నుంచి తెగిపోవడంతో  తెగిన గాలిపటంలా అయిపోయింది.

           దర్శకుడు రాజకిరణ్ కామెడీ జానర్ ని ప్రయత్నించడం మంచిదే. కానీ కామెడీ జానర్ లో దీన్ని ఫ్యామిలీ కామెడీ చేయాలనుకున్నారా, రొటీన్ గా అరిగిపోయిన పనికి రాని  యాక్షన్ కామెడీ చేయాలనుకున్నారా స్పష్టత తెచ్చుకోవాల్సింది. స్పష్టత లేకుండా రెండూ కలిపేస్తే కలవవు. పైగా ఏది అసలు కథ, ఏది కొసరు కథ అన్న స్పష్టత కూడా లేకపోతే ఏం చెప్పాలనుకున్నారో తెలియకుండా పోతుంది. 

          చివర్లో కొడుకు మీద తండ్రి అభిప్రాయం మారడానికి వేసిన సీను ఫస్టాఫ్ లాంటి సీన్లలాగా అర్ధవంతంగా వుందా?  కాబోయే మతిమరుపు వియ్యంకుడు హీరో ఇచ్చిన డబ్బు తీసుకుని మర్చిపోతాడని ప్రేక్షకులకి అప్పుడే తెలిసిపోయేలా లేదూ?  కథలో ఒక సమస్య ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో ఎంత  గోప్యత, సస్పన్స్  పాటించాలి?  ఆ డబ్బు తీసుకుని అతను మర్చిపోవడమే హీరో చెల్లెలి పెళ్లి కొచ్చిన కష్టం. 

          తనకెంత మతిమరుపున్నా పాతిక లక్షలు తీసుకున్న విషయం మర్చిపోయేంత మతిమరుపు కాదంటాడు కాబోయే వియ్యంకుడు. ఆ డబ్బు హీరో చేతిలో ఎక్కడ మిస్సయి  ఎక్కడ దొరికిందో సాక్ష్యాలుండగా ఆ సంగతి ఎందుకు చెప్పడు హీరో తండ్రితో? చెప్తే  ఇక్కడితో కథ అయిపోతుందనా?  చటుక్కున కథ అయిపోయే విధంగా సమస్య ఎందుకు ఏర్పాటు చేయాలి?  ‘శతమానం భవతి’ లో ఇదే జరిగిందిగా? ఇంత జరిగాక చివరి సీనులో ఇదే వియ్యంకుడు,  డబ్బు తీసుకున్న విషయం మతిమరుపు వల్ల  మర్చిపోయానని తనే ముందు కొచ్చి ఎలా అనేస్తాడు? అతనే ప్రాబ్లం క్రియేట్ చేసి అతనే క్లియర్ చేస్తే, ఇక హీరో ఎందుకు? కథలో అతను చేసే దేమిటి?

          సస్పెన్స్ అన్నది క్రైం, మర్డర్, హార్రర్, యాక్షన్ మొదలైన కథల్లోనే వుంటుందని అనుకోవడం వల్ల, ఫ్యామిలీ కథలకీ ప్రేమల కథలకీ ఇలాటి తిప్పలు తప్పడం లేదు. సస్పెన్స్ అనేది ప్రతీ జానర్ కీ ప్రాణం. కాబోయే వియ్యంకుడికి మతి మరుపని అసలు ముందు  చెప్పకుండా, డబ్బు తీసుకుని తిరగబడ్డాక – ఆ  క్యారక్టర్ ని వ్యవహారం కంటిన్యూ చేస్తూ- అంచెలంచెలుగా మతిమరుపు లక్షణాల్ని ఓపెన్  చేస్తూ- చివరికి ఈయనకి మతిమరుపని హీరో పట్టుకుని నాల్గు దులిపితే బావుంటుందా- అమ్మో అది సస్పెన్స్,  అలా వుం డకూడదని- ఏర్పాటు చేసిన ప్రాబ్లంలో ఎలిమెంట్స్ ని కిల్ చేసుకుని, తెలిసిపోయేలా కథ నడిపితే బావుంటుందా ఆలోచించుకోవాలి.

-సికిందర్
http://www.cinemabazaar.in





         



         






రిపబ్లిక్ డే స్పెషల్!




వీరుడి మరణ దృశ్యమిది...
    
ద్యం మత్తులో జోగుతున్న ఆ సైనికుడు తుపాకీ ఎత్తి- ‘ఏంటాలోచిస్తున్నావ్? ఈ దెబ్బకి అమరుడై పోవాలనే?’ అన్నాడు వ్యంగ్యంగా. ఆలోచన తన అమరత్వం గురించి కాదన్నాడు తుపాకీ ఎదురుగా గుండె దిటవుతో వున్నతను. తన ఈ విప్లవ జ్వాల భావితరాలకి  స్పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. వెటకారంగా నవ్వాడు సైనికుడు. ‘ఏంటా నవ్వు? కాల్చారా నన్ను పిరికి పందా!  నువ్వు కాల్చి చంపేది నీ ఎదుట నిస్సహాయంగా వున్న మనిషినే – బెదరకు, కానీయ్!’ అరిచాడు గట్టిగా, తాళ్ళతో బంధించి  బందీగా వున్నతను. చావంటే భయం లేని అతణ్ణి చూసి పిచ్చెత్తి పోయిన సైనికుడు తుపాకీ దడదడ లాడించేశాడు క్షణమాలస్యం చెయ్యకుండా.  నిట్ట నిలువునా శరీరాన్ని జల్లెడ చేసేశాయి తొమ్మిది తూటాలూ.  అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. జగత్ప్రసిద్ద విప్లవకారుడతను – ఎర్నెస్టో చేగువేరా!

         
చాలా అరుదుగా విప్లవకారులకి చట్టరీత్యా శిక్షలు పడతాయి. సూపర్ స్టార్ కృష్ణ 1974  లో అల్లూరి సీతారామరాజు చరిత్రని వెండి తెర కెక్కించి నప్పుడు అప్పటి ప్రేక్షకులకి ఎన్ కౌంటర్ అనే పదం తెలిసివుండదు. అలాటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూసి వుండరు. తెలుగు సినిమాకి మొదటి కలర్ కౌబాయ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 ఎంఎం, మొదటి ఆప్టికల్ స్టీరియో సౌండ్...ఇలా ప్రపంచంలో  ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తనే మొదటిసారిగా తెలుగులో అందిస్తూ కొత్త చరిత్రలు రాసుకుంటూ పోయిన డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా కృష్ణని  ఇప్పటి వరకూ కీర్తించడం జరుగుతోంది.  

     అభ్యుదయకరంగా  ఈ వినూత్న సాంకేతిక దృష్టే కాకుండా, ‘అల్లూరి సీతారామ రాజు’ తో కృష్ణ చరిత్రలోంచి అసంకల్పితంగా ఇంకేం శంఖం పూరించారో గ్రహించి గ్రంథస్థం చేయలేదెవరూ. సూపర్ స్టార్ కృష్ణ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాల్లో- తర్వాతి కాలంలో పోలీసులు చేపడుతూ పోయిన, ఇంకా ఇప్పటికీ చేపడుతూ వస్తున్న ‘ఎన్ కౌంటర్’ అనే చర్యని ఆనాడే అల్లూరి చరిత్ర ద్వారా ఎత్తి చూపారని మనం చెప్పుకు తీరాలి.

        సినిమాలో ఈ ఎన్ కౌంటర్ లేదా రాజ్య హింస అనే దుశ్చర్య  స్వాతంత్ర్య పూర్వం తెలుగు ప్రాంతంలో జరిగిందే. కాకపోతే అప్పట్లో బ్రిటిష్ ఏలుబడిలో వుంది. ఆనాడు బ్రిటిషర్లు అల్లూరి సీతారామారాజుతో పాల్పడింది ఎన్ కౌంటరే – కాకపోతే పక్కా బూటకపు ఎన్ కౌంటర్, పచ్చి హత్య. ఆ బ్రిటిష్ అధికారి కనీసం దీనికి ఎన్ కౌంటర్ అనే ముసుగు కూడా వేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,  అల్లూరిని ఎలా హతమార్చాడో కళ్ళకి కట్టారు కృష్ణ.

     సినిమాని సర్వకళా సమ్మేళనమనగానే సరిపోదు. అందులో ప్రజల చైతన్య పరిధిని విస్తృత పర్చే విషయం లేకపోతే ఆ కళలన్నీ వృధాయే. కళే ఒక సాధనం. సృజనాత్మక దృష్టితో కళల్తో  ఏమైనా సాధించవచ్చు. అల్లూరి సీతారామ రాజు చరిత్ర ఫక్తు డ్రై సబ్జెక్టు అనుకుంటూ సినిమా తీయడానికి పదిహేడేళ్ళుగా ఎన్టీఆర్ తాత్సారం చేస్తూంటే, అప్పటికి 34  ఏళ్ల హీరో కృష్ణ, ఆ డ్రై నెస్ ని కాస్తా  భక్తిరస పారవశ్యాలతో సస్యశ్యామలం చేసేశారు!
        అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి దైవత్వాన్ని కూడా ఆపాదించి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి.  విప్లవకారుడి మత దృష్టి రాజకీయ నాయకుడి మత దృష్టిలా విభజించదు, కలుపుకుంటుంది. నాస్తికులైన విప్లవకారులు ఉద్యమాలు నడపడంలో విఫలమైపోతూంటారు. 

    విప్లవకవిత్వంలో భావ కవిత్వ వుండదు. కానీ ఈ సినిమా ఈ రూలునే బ్రేక్ చేసింది. రూల్సు బ్రేక్ చేయాలంటే అసలంటూ రూల్స్ ఏమిటో తెలిసివుండాలి. ఈ సినిమాకి ఏకైక రచయితగా త్రిపురనేని మహారథి స్థాయికి ఇదేం పెద్ద సమస్య కాదు. ఓ వైపు సామాజికంగా అమాయక గిరిజనుల కోసం పోరాడే వీరుడిగా అల్లూరిని చూపిస్తూనే, మరో వైపు కథా శిల్పం చెడకుండా- జానర్ దెబ్బ తినకుండా- అల్లూరిని మహిషాసుర మర్ధిని స్తోత్రం పాడగల పారంగతుడిగానూ చిత్రించడం ఆయనకే చెల్లింది. విప్లవపాత్రలో పురాణ పాత్ర మమేకమన్న మాట. ఇలా మెజారిటీ ప్రజల సెంటిమెంట్సుని దృష్టిలో పెట్టుకునే కళే ఎన్నాళ్ళయినా బ్రతుకుతుందని కూడా రుజువు చేశారు.


      చరిత్ర పుస్తకాలు, డాక్యుమెంట్లు, పోలీసు ఫైళ్ళు, చింతపల్లి - కృష్ణ దేవిపేట అడవులు, అల్లూరి పరిచయస్థులూ ...ఇవన్నీ ఈ తొలి తెలుగు సినిమా స్కోప్ సినిమా కథా రచనలో  తోడ్పడ్డాయి మహారథికి  (ఈ వ్యాసం చదివాక ఫోన్ చేసి, తనని కలిసి వుంటే ఇంకా చాలా సమాచారం అందించే వాణ్ణని అన్నారు మహారథి- కానీ ఏ వారానికా వారం మూడురోజుల్లో ఈ సినిమా వ్యాసాలందించే డెడ్ లైన్ల కారణంగా కొన్నిసార్లు కొందర్ని కలవడం సాధ్యం కాలేదు). “రెండ్రోజుల క్రితం వేసుకున్న చొక్కా ఇమ్మంటేనే ఏడుస్తున్నావ్, 200 ఏళ్ల నుంచీ పరిపాలిస్తున్న తెల్లోడు స్వరాజ్యం ఇమ్మంటే ఇస్తాడ్రా సన్నాసీ?” అన్న డైలాగు మహారథి పేల్చ గల్గారంటే, అది ఆ  ప్రజల మధ్య తిరుగాడితేనే  తప్ప, ఏసీ రూంలో ఎంచక్కా కొలువుదీరి చొక్కా నలక్కుండా కూర్చుంటే రాదు. 


       మన్యం వీరుడు అల్లూరి (1897-1924) . విశాఖ ఏజెన్సీలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టం (1882) ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే చూసి చలించాడు అల్లూరి. ఇక సమస్తం త్యజించి ఆ గిరిజనుల కోసం తెల్లవాడితో ప్రాణాంతక పోరాట బాట పట్టాడు. జీవితం నీ కిచ్చిన పిలుపుని నువ్వు నిరాకరించావంటే, నిన్ను సృష్టించిన శక్తిని నువ్వు అవమానించుకున్నట్టేనని అంటాడు రాబిన్ శర్మ- ‘ది మాంక్ హూ సోల్డ్  హిజ్ ఫెరారీ’ అన్నతన  పాపులర్ పుస్తకంలో. అలా తనకి జీవితం ఇస్తున్న పిలుపు నందుకుని ఆలోచించకుండా ముందుకే సాగి పోయాడు అల్లూరి. చదువు నైన్త్ దగ్గరే ఆగి పోవచ్చు, పాతిక నిండకుండానే అతడి రాజకీయ పరిజ్ఞానం అపారమైనది. తటాలున తుపాకీ పట్టి బరిలోకి  దూకలేదు, ముందుగా కాంగ్రెస్ సభకి హాజరవుతాడు. నేతలు అక్కడ స్థానిక పరిపాలన మన చేతుల్లో వుండాలని ప్రసంగిస్తూంటారు. స్థానిక పాలన కాదు, మొత్తం దేశ పాలనే  మన చేతికి రావాలని యావద్దేశ సంక్షేమాన్నీకాంక్షిస్తాడు అల్లూరి. ఆ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటమెలా సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన  చేస్తానని ప్రేమించిన సీతతో చెప్తాడు. “ ఏ మార్గంలో స్వాతంత్ర్యం లభిస్తుందో, ప్రజాభిప్రాయానికీ, దేశ ప్రగతికీ ప్రయోజనకరమో గ్రహించాలంటే,  ముందుగా దేశ పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలి,  ప్రజా సమస్యల్ని అర్ధం జేసుకోవాలి”  అని చెప్పి దేశాటనకి  వెళ్ళిపోతాడు. 

       తిరిగి వచ్చి, “అజ్ఞానంలో, శోకంలో ఈ జాతి ఎంత భయంకరంగా బతుకుతోందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తం కావాలి. అందుకు విప్లవ మార్గ మొక్కటే శరణ్యం” అని సీతకి చెప్పి మళ్ళీ  సాగిపోతాడు. 

        కాంట్రాక్టర్ల మెడలు వంచి గిరిజనులకి కూలీ డబ్బు లిప్పిస్తాడు. తగాదాలు మీరే పరిష్కరించుకోండి  గానీ పోలీసుల దగ్గరికి వెళ్ళవద్దని జాగ్రత్త చెప్తాడు. కూలీ డబ్బులు కడుపు నిండా తాగడానిక్కాదనీ, మీ భార్యా బిడ్డలు కడుపు నిండా తినడానికనీ చెప్పి తాగుడు మాన్పిస్తాడు.

         గిరిజనుల దాస్య బుద్దిని ఇలా పటాపంచలు చేస్తున్న అతడి నిశబ్ద విప్లవం చూసి ఠారెత్తి పోతారు తెల్లవాడి తొత్తులు. ఇక అతను  చెట్లు నరికి, పోడు  వ్యవసాయం కూడా చేపట్టడంతో రసకందాయంలో పడుతుంది కథ. అప్పటికి గిరిజనుల్లో దైవ సమానుడిగా ఎదిగిన అల్లూరి తనతో బాటు అనుచరులైన ఘంటం దొర, మల్లన్న దొర, అగ్గి దొర తదితరుల్ని దళంగా చేసుకుని,  బ్రిటిష్ పాలకుల మీద ప్రత్యక్ష పోరాటానికి దిగుతాడు. మొదట స్పెషల్ పోలీసుల్ని ఓడించి, చివర్న అస్సాం  రైఫిల్స్ రెజిమెంటుకి చిక్కి, వైజాగ్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ ఎదుట నిలబడతాడు బందీగా  చింతపల్లి అడవుల్లో. అతడి ఇంత దేశభక్తినీ, ప్రజాపోరాటాన్నీ ఏమాత్రం గుర్తించని రూథర్ ఫర్డ్-  కాల్పులకి ఆదేశిస్తాడు. కానీ కాల్చబోతే  సిబ్బందికి చేతులు రావు. అల్లూరిలో ఒక రాముడు, ఒక జీసస్, ఒక అల్లాయే కన్పిస్తూంటారు. ఆఖరికి విప్లవ నినాదాలతో గర్జిస్తూనే తుపాకీ గుళ్ళకి నేలకొరుగుతాడు అల్లూరి సీతారామరాజు.

       ఇది ఓపెన్ మర్డర్. చేగువేరా విషయం వేరు. కనీసం ఆ బొలీవియా అధ్యక్షుడు ప్రపంచ భయంతో చేగువేరా మరణం ఎన్ కౌంటర్ లా కన్పించాలని ఆదేశించాడు. రూథర్ ఫర్డ్ ది  దేని  భయామూ లేని బరితెగింపు. భూమ్మీద న్యాయ వ్యవస్థకి తామే పట్టు గొమ్మలమని చెప్పుకునే బ్రిటిషర్లు ఇలా ఆటవిక న్యాయాన్ని అమలు చేయడం సిగ్గు చేటైన విషయం. దీన్ని ఎత్తి చూపిస్తున్న ఈ మహోజ్వల చిత్రరాజం ప్రయోజనం ఇంతకంటే నెరవేరడం వుండదు. 
         
          ఈ మహాయజ్ఞంలో తెర వెనుక రచయిత మహారథితో బాటు, దర్శకుడు రామచంద్ర రావు, ఆయన హఠాన్మరణంతో  దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు, గీత రచయితలు  సినారె, కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ...అపూర్వ  సేవలందించారు. తెలుగు వీర లేవరా,  వస్తాడు నారాజు వంటి ఆల్ టైం హిట్ పాటల సంగతి  చెప్పుకోనక్కర్లేదు. ‘తెలుగు వీర లేవరా’  పాట రచనకి మహాకవి శ్రీ శ్రీకి  జాతీయ ఉత్తమ గీతం అవార్డు లభించింది. అలాగే సంగీత  దర్శకుడు ఆదినారాయణ రావు రాసిన ‘హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్’ అనే పూర్తి ఇంగ్లీషు పాటకూడా వుంది. తెలుగు సినిమాల్లో ఇంగ్లీషు పాటకూడా ఇదే తొలిసారి. 

      ఇక వస్తాడు నారాజు...’ పాట తర్వాత  సన్నివేశం గురించి చెప్పుకోవాలి. గానకోకిల పి. సుశీల కంఠ స్వరంలో విజయనిర్మల మీద చిత్రీకరించిన ఈ పాట భావాత్మకంగానే కాదు, ఆథ్యాత్మికంగానూ  మనల్ని ఏ లోకాలకో   తీసికెళ్ళి పోతుంది తనవెంట. పాట  పూర్తవుతూండగా, దేశాటన ముగించుకుని కృష్ణ వస్తాడు. వెళ్తున్నప్పుడు కార్తీక  పౌర్ణమి నాటికి  తిరిగి వచ్చి ప్రేమ విషయంలో నిర్ణయం చెప్తానని చెప్పి  వెళ్ళాడు. ఈ నిరీక్షణలోనే ఆ పాట పాడుకుందామె. ఇప్పుడతను వచ్చాక ఈ సీనుని  ఎలా ప్రారంభించాలి? ఇవాళ్టి  డివిడిల ‘రచైత’ పాత్ర అంతరంగంలోకి వెళ్ళకుండా, పాత్రని ఉన్నతీకరించకుండా- ‘నేనొచ్చేశా సీతా!’ అని చైల్డిష్ గా కృష్ణ  చేత పలికించేస్తాడనడంలో ఎలాటి సందేహమూ అక్కర్లేదు. లేదా కాస్త వెనకటి వీడియో టేపు తరం ‘రచైత’ ఐతే – ‘వచ్చావా నాథా!’ అని ప్రేమోన్మాదిలా అరిపించేస్తాడు విజయనిర్మల చేత. మిడిమేలపు ప్రేక్షకులేమో  ఈలలేసి చప్పట్లు కొట్టేస్తారు సూపర్ డైలాగు అనేసి!

          విజయనిర్మల పాత్ర సీతది అంత నేలబారు పాత్రేం  కాదు. ఆమె ప్రేమని ఇచ్చేదే గానీ కోరుకునేది కాదు. అతడి మనసెరిగి మాటాడే స్వభావమామెది. అప్పుడతను అలా తిరిగి ఇంటికి రాగానే చూసి  తన గురించి  సర్వమూ మర్చిపోయి, అతడి సంఘర్షణలో తనూ బేషరతుగా భాగస్వామిని అయిపోతున్నట్టూ, దేశాటనలో అతను పొంది వుంటాడనుకుంటున్న  జ్ఞాన సంపదని వూహించుకుని ఉప్పొంగిపోతూ,  ఒకే మాట అంటుంది- ఒకే మాట మెచ్యూర్డ్ గా చటుక్కున - “దేశమంతా చూశావా?” అని! 

          మతులు పోవాల్సిందే మనుషులకి ఇలా అన్న ఆమెని చూసి.  గ్రేట్ క్యారక్టర్. పాత్ర అంతరంగ మెరిగి, పాత్రోచితంగా ఇంత గొప్ప  డైలాగు సృష్టించిన మహారథి  నిజంగా జీనియస్!


***
       1965  లో రంగ ప్రవేశం చేసిన హీరో కృష్ణకి తొమ్మిదేళ్ళకే  1974 లో వందవ సినిమా ఇది!  ఇవాళ్టి హీరోలు ఇది చూసి కళ్ళు తేలేయాల్సిందే. రెండు ప్రధాన పాత్రల్లో కృష్ణ- విజయనిర్మలతో బాటు, కె జగ్గయ్య రూథర్ ఫర్డ్ గా కన్పిస్తే,  గుమ్మడి వెంకటేశ్వరరావు, ( ఘంటం దొర) ప్రభాకర రెడ్డి, (మల్లన్న దొర),  బాలయ్య (అగ్గి దొర) మన్యం వీరులుగా కన్పిస్తారు. పేకేటి శివరాం, రాజనాల, త్యాగరాజు బ్రిటిష్ అధికారులుగానూ, కల్పిత పాత్రల్లో మోహన్ బాబు, చంద్ర మోహన్, అల్లురామలింగయ్య, కెవి చలం, రాజబాబు, మంజుల జయంతి,  రాజశ్రీ కన్పిస్తే, ఓ ప్రత్యేక పాత్రలో  టి ఎల్ కాంతారావు  దర్శనమిస్తారు. 



       హిందీలో కమల్ అమ్రోహీ ‘పాకీజా’ తీసినప్పుడు వాడిన కెమెరాలూ  లెన్సులూ తెప్పించుకునే ఈ సినిమా స్కోపు యజ్ఞానికి తెరతీశారు కృష్ణ. 19  కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ‘అల్లూరి సీతారామ రాజు’ కి రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు లభించింది. హిందీలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ గా డబ్ అయింది.

-సికిందర్
( ‘సాక్షి’- 2009 ఆగస్టు)