రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, మే 2019, గురువారం

825 : స్క్రీన్ ప్లే సంగతులు -5



        గత వ్యాసం ప్లాట్ పాయింట్ - 1 లో రిషి గోల్ ని పూర్తి చేసుకుంటూ అమెరికా ప్రయాణం కట్టాక, అక్కడ కంపెనీలో తన నైపుణ్యం ప్రదర్శిస్తున్న సమయంలో, తండ్రి మరణ వార్త విని వెనక్కొస్తాడు. ఇది కథన భంగం, రసభంగం, సీనస్ ఇంటరప్టస్ వగైరా వగైరా. కథనం, పాత్ర, ప్లాట్ పాయింట్ - 1 దాటుకుని ముందుకు వెళ్ళిపోయాక, అంటే మిడిల్లోకి వెళ్ళిపోయాక, వెనక్కి అంటే అదే బిగినింగ్ విభాగంలోకి తిరిగి రాకూడదనేది ఒక సూత్రం. బిగినింగ్ విభాగపు సీన్లు మిడిల్ విభాగంలోకి రాకూడదనేది సూత్రం. ఈ సూత్రం కథలో పాత్ర ప్రయాణానికి (క్యారెక్టర్స్ జర్నీ) సార్వజనీన సాంప్రదాయం. కానీ కథని ‘పాత్ర జీవిత ప్రయాణం’ లాగా చేయాలనుకున్నప్పుడు వర్తించనవసరం లేదు రసభంగమైనా సరే - అని ఈ స్క్రీన్ ప్లే భావం. సరే, మరేం చేయాలి? ఏ బలమూ లేకుండా వున్న ప్లాట్ పాయింట్ -1 కి బలాన్ని చేకూరుస్తూ, ద్వంద్వాల పోషణ (డైనమిక్స్) చేయడమే. ఒక పాజిటివ్ కి నెగెటివ్ తో చెక్. రిషి అమెరికా బయల్దేరుతున్నాడు – అదే సమయంలో తండ్రి చనిపోయాడు. ఇదెలా చేస్తారో ఏం చేస్తారో ఇక్కడ అనవసరం. కానీ రసవత్తర కథనమంటే ముందరి కాళ్ళకి బంధం వేసుకుని అది విప్పడమే. 

         అంత్యక్రియలు పూర్తయ్యాక తండ్రి రాసిన ఉత్తర మిచ్చి తల్లి చెప్తుంది - ఐఏఎస్ పోస్టుకి సెలక్ట్ అవాల్సిన వాడు, ఒక ప్రజాందోళనలో పాల్గొని, కేసై,  ప్రభుత్వోద్యోగానికి అర్హత కోల్పోయాడని. ఇక తండ్రి రాసిన ఉత్తరంలో సారాంశం - తన అసమర్ధ జీవితం రిషి సక్సెస్ కి స్ఫూర్తి అవడం తన సక్సెస్ కూడానన్నఅర్ధంలో సంతృప్తికరంగా వుంటుంది. మోటివేషనల్ గురు రాబర్ట్ స్కల్లర్ ఒక  పుస్తకంలో తన దగ్గరికొచ్చిన బిల్డర్ గురించి చెప్తాడు. ఆ బిల్డర్ పూర్తిగా దివాలా తీసి దయనీయమైన జీవితం గడుపుతున్నాడు. ఇక జీవితంలో సక్సెస్ కాలేనని వాపోతాడు. అప్పుడు స్కల్లర్ అంటాడు - నీ సక్సెస్ నీతోనే వుంది. చూడు అటు చూడు...ఆ బీచి వారగా పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్ బిల్డింగుల వరసంతా కట్టింది నువ్వే. అందులో వుంటున్న వందల కుటుంబాలకి లోన్లు ఇప్పించి, వాళ్ళ సొంతింటి కల నిజం చేసి, వాళ్లకి విజయవంతమైన కుటుంబ జీవితాల్నిచ్చింది నువ్వే. వాళ్ళెంత ఆనందంగా గడుపుతున్నారో చూడు. వాళ్ళ సక్సెస్సే నీ సక్సెస్. అదెక్కడికిపోతుంది. తిరిగి నీకే వ స్తుంది... వాళ్ళని చూసి ఆనందించు. ఆనందానికి ప్రకృతి స్పందిస్తుంది, బాధకి కాదు...అని. 

       ఇలా రిషి తండ్రి కూడా తన పరాజయ జీవితాన్నిచూసి రిషి ఎదిగితే, అది చూసి తను ఆనందించాలనుకున్నట్టు ఉత్తరాన్ని బట్టి అర్ధమవుతోంది. ఇందుకోసం కావాలనే దయనీయ జీవితాన్ని గడిపినట్టూ, భార్యని కూడా ఇబ్బంది పెట్టినట్టూ, పైగా ఇంట్లో ఎల్లవేళలా ఉద్రిక్త వాతావరణానికి కారకుడైనట్టూ వుంది. అవసరమా? తన జీవితంలోంచి రిషి నేర్చుకోవాల్సింది -  జీవితాన్నిపణంగా పెట్టి, ఆనాడు ప్రజాందోళనలో పాల్గొన్న తన పోరాట స్ఫూర్తి కాదా? మహర్షి జీవిత ప్రయాణానికి తోడ్పడే తండ్రి త్యాగం ఇది కాదా? పైగా ప్రజానీకం కోసం? ప్రజల కోసం జీవించు అన్న నీతి? రైతుల సమస్య తీర్చేందుకు తండ్రి ఇచ్చిపోయిన వారసత్వపు - ఎమోషనల్ కనెక్ట్?  కార్డ్ బోర్డ్ పాత్ర కాకుండా, రక్తమాంసాలున్న పాత్రచిత్రణ? 

          ఉత్తరం చదివిన రిషిలో ఏం మార్పు వచ్చిందో కూడా చూపెట్టలేదు. కనీసం తండ్రిని అపార్ధం చేసుకున్న పశ్చాత్తాపం కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇక తల్లిని తీసుకుని అమెరికా వెళ్ళడమే జీవిత ప్రయాణం లాగా చూపించారు.
***
         దీనితర్వాత ఈ మిడిల్ వన్ లో పార్టీ సీను కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రవిశంకర్, పూజా ఎందుకు రాలేదని అడుగుతాడు రిషి. మంచిదే పాత్ర స్వభావం ప్రకారం. తనే వాళ్ళని వదిలించుకుని వచ్చి, ఇన్నేళ్ళ తర్వాత వాళ్ళు రాలేదేమని అడగడం. తను వాళ్ళకి ఫోన్ చెయ్యడు, వాళ్ళే తన దగ్గరికి రావాలన్న స్వార్ధ స్వభావం కాబట్టి అలాగే అడగవచ్చు. కానీ - ‘వాళ్ళెందుకు రాలేదు, నా సక్సెస్ చూసి కడుపు మంటెక్కి పోయిందా?’ అని వుంటే ఇంకా బావుండేది పాత్ర స్వభావానికి. ఇప్పటికి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో ప్రేక్షకులకి తెలిసిపోయింది కాబట్టి, పాత్రలమధ్య ఏం జరిగిందో ఆ నేపధ్యంలోంచి మాట్లాడితే ప్రేక్షకుల్ని క్యారెక్టర్ ఇంకా బాగా థ్రిల్ చేసే వీలుంది. కిందపడే పాత్రని వీలైనంత పైకి తీసికెళ్లాలి కదా? ఇక కొద్ది క్షణాల్లో ప్రొఫెసర్ సమాధానంతో ఢమాల్మని కింద పడబోతున్నాడు రిషి సార్. 

          పూజా అక్కడే గేమింగ్ కంపెనీలో చేస్తోందని అంటాడు. రవిశంకర్ తండ్రి చనిపోయాడని అంటాడు. ఆ రోజు ఎగ్జామ్ పేపర్ దొంగతనం తన మీదేసుకుని చదువు చట్టు బండలు చేసుకున్న కారణంగా తట్టుకోలేక అతడి తండ్రి చనిపోయాడనీ అంటాడు. దీంతో తన సక్సెస్ వెనుక రవిశంకర్ వున్నాడని జ్ఞానోదయమవుతుంది రిషికి. అయితే సినిమా ప్రారంభదృశ్యాల్లో,  ఇప్పుడూ ఐరనికల్  సెటప్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల, ఆ పే ఆఫ్స్ లేక సాదాగా వెళ్లిపోతుందీ కథలో ఈ జ్ఞానోదయపు మలుపు.

          ఇదలా వుంచితే, రిషి జ్ఞానోదయానికి ఒక డ్యామేజింగ్ పాయింటు వుంటే సరిపోతుంది. రవిశంకర్ చేసిన త్యాగం చెంప పెట్టులాంటిది. ఈ పాయింటు చాలు. ఈ త్యాగం కారణంగా మళ్ళీ రవిశంకర్ తండ్రి కూడా చనిపోయాడన్న రెండో పాయింటు రిషి పాత్రని రెండు రకాలుగా దెబ్బ తీస్తుంది. ఒకటి, ఇప్పుడు రిషి తీసుకునే నిర్ణయం సందేహాస్పదంగా వుంటుంది. రెండు, రవిశంకర్ తండ్రి కూడా చనిపోవడం రిషి పాత్రని క్షమించరాని దోషిగా నిలబెడుతుంది. 

          రిషి ఇప్పుడు నిర్ణయం తీసుకుని రవిశంకర్ దగ్గరికి వెళ్తే ఏ కారణంగా వెళ్తున్నాడు? తన కోసం త్యాగం చేశాడనా?  లేక అతడి తండ్రి చనిపోయడనా? తండ్రి చనిపోయాడు కాబట్టి వెళ్ళడం తప్పనిసరి అవుతుంది. లేకపోతే  వెళ్ళి వుండేవాడా? వాడి బొంద త్యాగం అనుకుని వూరుకునేవాడా? ఏం జరిగి వుండేది? 

          రవిశంకర్ తండ్రి కూడా చనిపోతే రిషి మీద పాపభారం పెరిగి పోతుంది. రవిశంకర్ తండ్రిని కూడా చంపి, రిషిని ఇంత క్రూరంగా శిక్షించడం కథకుడికి అవసరమా? పాత్రని ఇంత డ్యామేజి చేయడం అవసరమా? రవిశంకర్ త్యాగమనే ఒక్క పాయింటు సరిపోదా? సర్వసాధారణంగా ఒక్క పాయింటుతోనే కథ నడుపుతారు. రెండు పాయింట్ల మీద నడిపితే ఏ పాయింటుతో హీరో ముందుకు నడుస్తున్నాడో అర్ధమవదు. అనుమానాస్పద వ్యక్తిగా వుంటాడు తన చర్యలతో.  

          రవిశంకర్ తండ్రి చనిపోవడమంటూ జరిగితే, ప్రభుత్వం తల పెట్టిన భూసేకర కార్యక్రమం కారణంగా చనిపోవాలి. ఇది ముందు కథకి ఉపయోగం. ఈ షాకింగ్ న్యూస్ రిషికీ, ప్రేక్షకులకీ ఒకే సమయంలో, రిషి రవిశంకర్ దగ్గరికి వెళ్లినప్పుడు సెకెండాఫ్ ఓపెనింగ్ లో రివీలై,  సెకెండాఫ్ హీరో జీవిత ప్రయాణపు కథకి బలమైన ఎత్తుగడ కావాలి. అయితే ఇక్కడ రవిశంకర్ ప్రతిఫలం కోరని ఆత్మాభిమానం కలవాడుగా, నిష్కృతి చేసుకునే రిషికి ప్రత్యర్ధి కావాలి...
           రిషి రవిశంకర్ దగ్గరికి బయల్దేరడంతో ఇంటర్వెల్.

          (రాస్తూంటే ఇంకా ఎలా వుంటుందోనన్న సందేహంతో ఆపెయ్యాలన్పిస్తోంది. ఇందుకే స్క్రీన్ ప్లే సంగతులు రాయకూడదనుకున్నట్టు ఒక ‘Q&A’ లో చెప్పుకున్నాం...
  కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే సవాలక్ష లోపాలుంటున్నాయనీ, వాటి లోపాలు రాయడమే పనిగా మారిందనీ, దీనికంటే అర్ధవంతమైన సినిమాలకి -  అవి పాతవైనా సరే - రాయడం బెటరన్పిస్తోందనీ పేర్కొన్నాం. కానీ ‘మహర్షి’ ని మొదలెట్టాక ఇక పూర్తి చెయ్యక తప్పదు. అదీ క్లుప్తంగా చేసేద్దాం. నేర్చుకోవడానికేమైనా వుంటే రాయడానికి ఉత్సాహం వస్తుంది. ప్రేక్షకులు జీవితంలో ఎమోషనల్ గానూ, లాజికల్ గానూ జీవిస్తారనీ, అదే సినిమాలు  చూసేప్పుడు మాత్రం ఎమోషనల్ జీవులైపోతారనీ, భావించుకుని  సినిమాలు తీస్తున్నంత కాలం వాటికి  విశ్లేషణలు వృధా)

సికిందర్