రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, ఫిబ్రవరి 2016, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు!


రైటర్స్ కార్నర్


    ఒక రోజు సెట్ ని తీర్చిదిద్దడంలో తీవ్ర కృషి చేస్తున్న ఓ కుర్రాణ్ణి చూసి అతను ఆర్ట్ డైరెక్టరా అనడిగారు కన్నడ హీరో రవి చంద్రన్. అతను అసిస్టెంట్ డైరెక్టరని ఎవరో చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ కుర్రాణ్ణి పిలిపించుకుని తను తీయబోయే సినిమాకి నియమించుకున్నారు. ఏడువేల జీతంతో స్క్రిప్టు, డైలాగులు రాసే పని అప్పజెప్పడంతో ఎంతో థ్రిల్ ఫీలయయ్యాడా కుర్రాడు.  అలా 1995లో రవిచంద్రన్ నిర్మించి, దర్శకత్వం వహించి, నటించిన ‘పుట్నంజా’ అనే హిట్ కి ఆ కుర్రాడు డైలాగులు రాశాడు. రాస్తూండగానే జీతం పెంచి 13 వేలు ఇచ్చారు  రవిచంద్రన్. ఆ సినిమా విడుదల రోజున ఆ కుర్రాడు బైక్ వేసుకుని థియేటర్ కి వెళ్తే మధ్యలో  పెట్రోల్ అయిపోయింది. బండి నెట్టుకుంటూ  రవిచంద్రన్ ఆఫీసు కెళ్ళాడు. రవిచంద్రన్ లోపలికి  పిలిచి జీతం ముట్టిందా అనడిగారు. చాలాకాలం క్రితం ముట్టిందన్నాడు కుర్రాడు. ఈ రోజు కూడా ముట్టలేదా అంటే ముట్ట లేదన్నాడు. చేతిలో లక్షా ముప్పయి వేలు పెట్టారు రవిచంద్రన్. షాక్ కి గురయిన కుర్రాడు ఆ డబ్బుతో ఇంటికి పరిగెడితే, ఎక్కడో దొంగతనం చేశాడని భార్య అనుమానించింది. కానీ ఆ సినిమా అతణ్ణి  స్టార్ ని చేసింది. వెంటవెంటనే రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. అవి ‘టపోరీ’, ‘అర్ధ’ అనే సినిమాలు. ఇంకో 4 వేల ఎపిసోడ్స్ వివిధ సీరియల్స్ కీ కూడా దర్శకత్వం వహించేశాడు.  ‘అర్థ’ కి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులతో గౌరవిస్తే,  2011 లో ప్రకాష్ రాజ్ తో తీసిన ‘పుట్టక్కన హైవే’ కి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
          మొత్తం 10 సినిమాలకి రచన, దర్శకత్వం, కొన్నిటికీ నిర్మాణమూ చేపట్టిన కెమికల్ ఇంజనీర్ అయిన బి. సురేష్, కొన్ని సినిమాల్లో నటించారు కూడా.  తాజాగా ప్రకాష్ రాజ్ తో నిర్మించి దర్శకత్వం వహించిన ‘దేవర నాదల్లి’’ ఫిబ్రవరి అయిదున విడుదలయ్యింది. సహాయ పాత్రగా నటించిన ‘బద్మాష్’ 26 వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ఆదిత్యా సన్వాల్ కి ఆయనిచ్చిన ఇంటర్వ్యూ  పాఠం...
మీరు స్క్రిప్టులు రాయడం ఎప్పుడు ఎలా ప్రారంభించారు?
        నా క్రియేటివ్ జర్నీ నాటకాలతో ప్రారంభమయ్యింది. నాటకాలు చేస్తున్నప్పడు పాపులర్ కన్నడ నటుడు, దర్శకుడు, రచయితా శంకర్ నాగ్ ని కలిశాను. ఆయనే నాకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. ఘోస్ట్ రైటర్ గా చాలా స్క్రిప్టులు రాశాను. 1988 లో బీహెచ్ఈఎల్ లో నా రెగ్యులర్ జాబ్ మానేసి ఫుల్ టైం రైటర్ గా మారాను. రైటర్ గా నా మొదటి సినిమా ‘మిథిలేయ సీతేయరు’. అప్పట్నుంచీ నాకు అవకాశాలు బాగా రాసాగాయి. 1992 వరకూ ఆర్టు తరహా సినిమాలే రాస్తూ వున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గా వుంటూనే. రవి చంద్రన్ గారు నన్ను పికప్ చేసినప్పటి నుంచీ కమర్షియల్ సినిమాల్లోకి వచ్చేశాను. ఇది నాకు చాలా ఆర్ధిక స్వాతంత్రాన్ని ఇచ్చింది, కానీ క్రియేటివ్ స్వేచ్ఛన్ని మాత్రం హరించి వేసింది.

మీ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఎంత మేరకు అది రీసెర్చి ప్రధానంగా వుంటుంది?
        సినిమాలకి సంబంధించి నా రైటింగ్ ప్రాసెస్ అంటే రైట్- రీరైట్- రీరైట్ మోర్...ఇంతే! నా అన్ని సినిమా స్క్రిప్టులూ ఎన్నో సార్లు తిరగరాసినవే. సబ్జెక్టు పైన చేసే రీసెర్చి నిరంతరంగా ఆ ఇన్ పుట్స్ కి స్థానం కల్పించే పరిస్థితి తెస్తోంది. ఇందువల్లే అసంఖ్యాక మైన రీరైటింగ్స్. ‘పుట్టక్కన హైవే’. ‘దేవర నాదల్లి’ సినిమాల విషయంలో యంగ్ టీం నాకు రీసెర్చి విషయంలో ఎంతో తోడ్పడ్డారు. ఎక్కడెక్కడినుంచో కొత్త  కొత్త సమాచారాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈ టీముతోనూ, ఈ సబ్జెక్టు లపైన నిపుణులతోనూ కూలంకషంగా చర్చించే వాణ్ణి. ఆ తర్వాతే స్క్రిప్టులో వాటికి చోటు కల్పించే వాణ్ణి. ఒక అంశంపై ప్రతీ చర్చా భిన్న కొణాల వైపు నుంచి జరిగేది. ఈ చర్చల ఆధారంగా కొత్త వెర్షన్లు తయారు చేసేవాళ్ళం కథలకి. ఇక స్క్రిప్టులు పక్కాగా వచ్చినట్టు టీము ఫీలవగానే కాస్టింగ్ ఎంపికకీ, లొకేషన్ హంట్ కీ వెళ్ళేవాళ్ళం. ఇది చాలా  ఎక్కువ టైము తీసుకునేది. కాస్టింగ్, లోకేషన్స్ ఫైనలైజ్ అయ్యాక స్క్రిప్టుని మళ్ళీ రీరైట్ చేసేవాళ్ళం. ఈసారి డైలాగుల్లో వచ్చే వివిధ యాసలకి కచ్చితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని. మూవీ మేకింగ్ మా మొత్తం టీము ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడేది. షూట్ చేయాల్సిన ఫైనల్ వెర్షన్ ని టీం మొత్తం కలిసి నిర్ణయించేది. ఇది నిర్ణయించాక, తిరిగి ఫైనలైజ్ చేసిన లోకేషన్స్ కెళ్ళి, ఫోటో గ్రాఫ్స్ తీసే వాళ్ళం. 800 షాట్లుగా సినిమా తియ్యాలనుకుంటే,  ఆ 800 షాట్లు ఎలా ఉండాలో 800 ఫోటో గ్రాఫ్స్ తీసేవాళ్ళం. వీటితో ఫైనల్ షూట్ ని ప్లానింగ్ చేసేవాళ్ళం. నా మూవీ  మేకింగ్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందుకనే చాలా తక్కువ సినిమాలు తీశాను.

మీ సినిమాలు సామాజిక స్పృహ గలవి. సబ్జెక్టుల్ని  మీరెక్కడ నుంచి తీసుకుంటారు- సమాజం లోచి యధాతధంగానా, లేక సమాజంలో జరుగుతున్న వాటికి ని కల్పన చేశా?
       
నాటకాలు, వీధి నాటకాలూ వేస్తున్నప్పుడు ఆ ఇతివృత్తాలన్నీ చుట్టూ వుండే  సమాజంలోంచి వచ్చినవే. ప్రయాణాలంటే నేను ఇష్ట పడతాను. సమాజంలో అట్టడుగు వర్గాలతో ఇంటరాక్ట్ అవడాన్ని కూడా ఇష్టపడతాను. సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో కథ వుంటుంది. వీటి గురించి నోట్స్ రాసుకుంటాను. ప్రస్తుతం నేను ప్లాన్ చేస్తున్న సినిమా కథ రైతులు- వాళ్ళు  వాడే   క్రిమిసంహారక మందుల గురించి. దురదృష్టమేమిటంటే అవే క్రిమి సంహారక మందులతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది నన్ను   బాగా కదిలించిన సామాజిక సమస్య. ఇంకో కథ మత సామరస్యం గురించి...ఇవ్వాళ మతసామరస్యమే ఉద్రిక్త పరిస్థితులకి లోనవుతోంది.

         
ఒక సమస్యని తీసుకున్నాక ముందు కథగా రాసుకుంటాను. ఆతర్వాత మిత్రులతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాను. దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్టుగా రాస్తున్నప్పుడు ఇది సినిమాగా తీయ వచ్చా, సీరియల్ గా తీయాలా, లేక నాటకంగా వేయవచ్చా నిర్ణయిస్తాను.

గిరీష్ కాసరవల్లి, పి శషాద్రి వంటి దర్శకులు సామాజిక స్పృహగల
సినిమాలెన్నో  తీశారు. అయితే వాటిని విడుదల చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కారణ మేమిటంటారువిశాల ప్రాతిపదికన ప్రేక్షక బాహుళ్యంలోకి ఇటువంటి సినిమాలని చేరవేయాలంటే ఏంచేయాలంటారు?
         
వారిద్దరి సినిమాలని నేను చాలా ఇష్టపడతాను. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు పట్టిన పట్టు వీడ లేదు. వాళ్ళ సినిమాల్ని రెగ్యులర్ థియేటర్లలో విడుదల చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు. అవి కొద్ది రోజుల కంటే ఎక్కువ ఆడేవి కావు. బహుశా అందుక్కారణం వాళ్ళ కథలు చెప్పే పధ్ధతి. కమర్షియల్ ఫ్రెండ్లీగా ఉండేట్టు వాళ్ళెప్పుడూ సినిమాల్ని ఎమోషనలైజ్ చేయలేదు. మెలోడ్రామా, డ్రామా అనేవి కూడా ఇష్టపడే వాళ్ళు కాదుఅందువల్ల ప్రేక్షకులకి  కథల్లో ఇన్వాల్ మెంట్ అసాధ్యంగా వుండేదిపెద్ద పోటీగా కమర్షియల్ సినిమాలు వున్నప్పుడు కథల్ని తరహాలో చెప్తే ఆదరణ ఎక్కడ వుంటుంది

         
కానీ గిరీష్, శేషాద్రిల సినిమాల్ని కర్ణాటకలో  చాలా నగరాల్లో ప్రైవేట్ ప్రదర్శనలుగా వేసేవాళ్ళు ప్రదర్శనలకి  ఒక ప్రత్యేక బృందం ప్రేక్షకులు వుండే వాళ్ళు. మేధావులు అనొచ్చు. కొన్ని సంఘాలు  సినిమాలు ప్రదర్శించేవి. ఫిలిం సొసైటీల ఉద్యమానికి కొనసాగింపుగా సంఘాలు పనిచేసేవి. అలా వచ్చిన సొమ్ములు నిర్మాతలకి పంపేవి. తరహా సినిమాలు సాధారణ ప్రేక్షకుల్లోకి తెసికెళ్ళడం అసాధ్యం. వాటి పోషణకి సంఘాల మీదే ఆధారపడాలి.

 కన్నడలో 30 శాతానికి పైగా రీమేక్స్ ఉంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయంఫ్రెష్  గా, డిఫరెంట్ గా వున్న స్టోరీస్ పట్టుకుని కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ప్రమోట్ చేయడానికి మీదగ్గర మార్గాలున్నాయి

     రీమేకులు ఒక శాపమే. కానీ రీమేకులే బాగా హిట్టవు తున్నాయి. దీంతో మరిన్ని రీమేకులు వస్తున్నాయి. కన్నడలోనే కాదు, హిందీ సహా ఇతరానేక భాషల్లో రీమేకుల సందడి నడుస్తోంది. అదేపనిగా వీటిని చూస్తున్న ప్రేక్షకులకీ  విసుగెత్తడం లేదు. కొత్త వాళ్ళని ప్రమోట్ చేయడం గురించి...దీని అవసరం చాలా వుంది. మా మీడియా హౌస్ స్టూడియో సంస్థకొత్త వాళ్లతో ప్రాక్జెక్టుకింద ఇద్దరు కొత్త దర్శకులకి అవకాశా లిచ్చాం. సంవత్సరం మరో ఇద్దరికి  ఇస్తాం. మొత్తం సినిమా పరిశ్రమా యువ టాలెంట్స్ ని ప్రోత్సహించడం చాలా అవసరం. వాళ్ళు కొత్త తరహా కథా కథనాలనే కాదు, కొత్త శక్తిని కూడా పరిశ్రమలో నింపుతారుప్రతీ పరిశ్రమా కొత్త టాలెంట్స్ కి ప్రయోగశాల కావాలి. షార్ట్ ఫిలిమ్స్ కొత్త తరహ కథా కథనాలకి మాత్రమే ప్రయోగశాలలు  కావు, అవి కొత్త టాలెంట్స్ కి లైబ్రరీలు వంటివి కూడాషార్ట్ ఫిలిం మేకర్స్  ఎక్కువ ప్రాధాన్య మివ్వాలి.

కన్నడ లో డబ్బింగులపై  నిషేధం ఇప్పటికీ వివాదా స్పదంగానే వుంది. ఒకవైపు కన్నడ సినిమాల్ని ఇతర భాషల్లోకి డబ్ చేస్తూనే కన్నడలో డబ్బింగులని  నిషేధించడం విచారకరం కాదంటారా?
         
నా అభిప్రాయంలో ఒక భాష నుంచి ఇంకో భాషలోకి డబ్బింగ్ ( లిప్ సింక్ డబ్బింగ్) చేయడం నేరంతో సమానం. ఒక దర్శకుడు  ఉద్దేశపూర్వకంగా కథనీ, నేపధ్య వాతావరణాన్నీ సెట్ చేస్తాడు. ఇందులో నటించే నటుడు వొరిజినల్ వాతావరణంలో ఇమిడిపోయి నటించి, పాత్రకి న్యాయం చేస్తాడు. నేపధ్యంలో వేరొకరు వచ్చి వేరే భాషలో నటుడి గొంతుని అనుకరించడమంటే మొత్తం  సెట్ చేసిన వాతావరణాన్నీ, కథనీ కిల్ చేయడమే అవుతుంది. దర్శకుణ్ణీ నటుణ్ణీ అవమానించడమే అవుతుంది

         
మన  నాట్య శాస్త్రంలో నటనని వాచికం, ఆంగికం, ఆహార్యం, సాత్వికం  అనే నాల్గు డైమెన్షన్లుగా నిర్వచించారు. నాలుగూ కలగలిసిపోతేనే అది అభినయ చతుర్ధం అవుతుంది. అలాంటప్పుడు  ఒక నటుడి వాచికాన్ని మరొకరు వచ్చి తన గొంతుతో మార్చేస్తే అప్పుడా మిగిలిన మూడు డైమెన్షన్లూ వికలమై పోతాయిఅప్పుడా ఒరిజినల్ నటుడి నటనకి అర్ధమే లేకుండా పోతుంది. ఇందువల్ల  డబ్బింగుల్ని నేనెప్పుడూ సమర్ధించను. ఇతర భాషల సినిమాల్ని డబ్బింగులు కాక, సబ్ టైటిల్స్ తో వున్నవే చూడమని నేను చెపుతూంటాను. ఇప్పటి వరకూ నాల్గు సినిమాలకి నేను దర్శకత్వం వహించాను, మరో ఆరు సినిమాలు  నిర్మించాను. దేన్నీ డబ్బింగ్ చెఉఅలెదు. సబ్ టైటిల్స్ తోనే ప్రపంచవ్యాప్తంగా అవి వెళ్ళాయి.

         
ఇక మీరన్నట్టు కన్నడ మార్కెట్లో ఇతర భాషల డబ్బింగులపై  అధికారికంగా నిషేధమూ లేదు. కానీ  1964 నుంచీ ఇతరభాషల సినిమాలని కన్నడలోకి డబ్బింగులు చేయడం  లేదు. కన్నడ సినిమా పరిశ్రమకి దీంతో ఏం సంబంధం లేదు. 1964లో కొందరు ప్రముఖ సాహిత్యవేత్తలకి ప్రజలూ తోడై డబ్బింగులకి వ్యతిరేకంగా ఉద్యమించారు, అంతే మధ్య కొందరు ఐటీ ప్రొఫెషనల్స్ సిసిఐ ( కాంపిటేషన్ కమిషన్ ఆఫ్  ఇండియా) కి కంప్లెయింట్ చేశారు. సిసిఐ చర్య తీసుకుంటే డబ్బింగులపై వున్న నిషేధం తొలగిపోవచ్చు. కానీ ఒక్క సిసిఐ ఆదేశంతో ఆరు దశాబ్దాలుగా అలవాటు పడిన సాంప్రదాయం తొలగిపోతుందనుకోను. కొందరు  తెగించి డబ్బింగులకి పాల్పడవచ్చు. అయితే   ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గరో, అమితాబ్ బచ్చనో డబ్బింగుల్లో వచ్చేసి తమది కాని గొంతుకలతో మాట్లాడుతూంటే కన్నడ ప్రేక్షకులు భరించలేరు.  

మీ  కొత్త సృష్టిదేవర నాదల్లిగురించి చెప్పండి...

 
         ఇది మల్టీ టైం లైన్ నెరేటివ్ మూవీ. ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్  లోంచి ఐడియా పుట్టింది. 1998 లో దీన్ని చదివి కత్తిరించి పెట్టుకున్నాను. అప్పట్నుంచీ  ఎన్నో వెర్షన్లు రాశాను. ఫైనల్ గా 2014 లో స్క్రిప్టు ని లాక్ చేశాను. సంవత్సరం ఆఖర్లో ప్రొడక్షన్లోకి దిగాను. సమాజం తాను  ఏర్పరచిన చట్టాలకే తానెలా భిన్న భాష్యాలు చెప్తుందో ఇందులో చూపించదల్చుకున్నాను. దర్శకుడిగా మల్టీ టైం లైన్  కథనం నాకు కత్తిమీద సామే. దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను

మీకు స్ఫూర్తి నిచ్చిన దర్శకుల గురించి చెప్పండి?
         
అకిరా కురసోవా, ఇంగ్మార్ బెర్గ్ మాన్, ఎమిర్ కుస్తురికా, కిమ్ కీ డాక్, గిరీష్ కాసరవల్లి ...ఇలా ఎందరో. మంచి సినిమా, చెడ్డ సినిమా అని వుండవు నా దృష్టిలో. చూసిన ప్రతీ సినిమా నుంచీ ఏదో ఒక విజువల్ కమ్యూనికేషన్స్ పాఠాన్ని నేర్చుకుంటాను...

-సికిందర్
cinemabazaar.in