రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, మార్చి 2021, బుధవారం

1026 : బాక్సాఫీసు

    జాతి రత్నాలు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం బాక్సాఫీసు బరిలో జాక్ పాట్ కొడుతూ పోతున్నారు. 5 రోజుల్లో 19 కోట్ల వరకూ జాక్ పాట్ కొట్టేశారు. బాక్సాఫీసు రత్నాలు అన్పించుకున్నారు.  అనుదీప్ కెవి అనే కొత్త దర్శకుడు స్వప్నా సినిమా ప్రొడక్షన్ బ్యానర్లో, మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో, జాతి రత్నాలు రికార్డు కలెక్షన్లతో ట్రేడ్ పండితుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం ఓవర్సీస్ తో బాటు రెండు రాష్ట్రాల్లో, 5 వ రోజు  2.7 కోట్లు వచ్చాయి. 5 రోజుల్లో మొత్తం కలెక్షన్లు 19.02 కోట్లు. మొదటి రోజు 3.92 కోట్లు, రెండవ రోజు 2.9 కోట్లు, మూడవ రోజు 4.2 కోట్లు, నాల్గవ రోజు 5.3 కోట్లూ వచ్చాయి.


        ఇంతటితో ఆగేలా లేదు. నేటితో రెండవ వారంలోకి అడుగుపెడుతోంది. ఈ వారం కూడా కలెక్షన్లు స్ట్రాంగ్ గా వుండబోతాయని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తం లైఫ్ టైమ్ పర్ఫార్మెన్స్ 30 కోట్లు పైనే వుంటుందని అనుకుంటున్నారు. జాతి రత్నాలు కి కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బాగా ప్లస్ అయింది. ఈమె ఇక రవితేజతో చేయబోతోంది. ఈ మూవీ ప్రధానంగా అర్ధం పర్ధం లేని మైండ్ లెస్ కామెడీయే. జోకులే తప్ప కథేమీ వుండదు. ఈ జోకులకి యువప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయి కథా కాకరకాయా లేకపోవడాన్ని పట్టించుకోవడం లేదు. ఒక చిన్న బడ్జెట్ సినిమాని భారీ బ్లాక్‌బస్టర్‌ స్థాయికి తీసికెళ్లారు. నిజానికి పరిమిత థియేటర్ల లోనే మొదట రిలీజ్ చేశారు. భారీ రెస్పాన్స్ చూసి రెండవ రోజునుంచీ థియేటర్ల సంఖ్యని పెంచుకుంటూ పోయారు నిర్మాతలు.


      ‘జాతిరత్నాలు ఇలా వుంటే, ఇక శ్రీకారం లో శ్రీ లోపించి కారం ఘాటు ఎక్కువైంది. దేశంలో రైతాంగం ఆందోళన విజయవంతంగా 100 రోజులు దాటిపోతే; రైతాంగం మీద తీసిన 'శ్రీకారం' ముందుకెళ్ళనని మొరాయించింది. రైతులు వ్యతిరేకిస్తున్న కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం లాగే యజమాని కింద ఉమ్మడి రైతుల్ని చూపిస్తే ఎలా? ఈ దోపిడీ బావజాలాన్ని గత వందేళ్ళల్లో చాలాసార్లు తిప్పి కొట్టారు రైతులు. దీని వసూళ్ళు  7.10 కోట్ల దగ్గర వున్నాయి. ఫ్లాప్ కింద పరిగణిస్తున్నారు. శర్వానంద్ కి వరసగా ఇది నాల్గో ఫ్లాప్. కరోనాకి ముందు, కరోనాకి తర్వాతగా సినిమాల విభజన వుండబోతొందని గుర్తించాలి శర్వానంద్. కరోనా తర్వాత మరింత గ్లోబల్ ప్రేక్షకులుగా మారారు ఆడియెన్స్. మూసని తిప్పికొట్టి వాస్తవికతని కోరుకుంటున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్-  శ్రీ విష్ణుల పాతమూస  గాలి సంపత్ కి సహజంగానే వడ గాలులు వీచాయి.

సికిందర్