రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, జనవరి 2020, శుక్రవారం

912 : స్క్రీన్ ప్లే అప్డేట్స్


        స్క్రీన్ ప్లేల్లో ఒకటి కంటే ఎక్కువ ప్రధాన పాత్రలుండ కూడదని చట్టాలైమైనా చెప్తున్నాయా, లేదు కదా? నిజానికి ప్రేక్షకులు ఒకటి కంటే ఎక్కువ ప్రధాన పాత్రలతో సమాంతర కథా ప్రయాణాలని ఇష్టపడతారు కూడా. మరి మీకెందుకు సందేహం? ఒకవేళ ఇలాటి స్క్రీన్ ప్లేలకి కావాల్సిన స్కిల్స్ మీకు లేకపోవడం వల్ల కావొచ్చు. నిజమే, కొత్త రచయితలు చాలామంది ఒక ప్రధాన పాత్రతోనే కథ నడపడంలో ఇబ్బంది పడతారు. అలాటిది బహుళ ప్రధాన పాత్రలు సమస్యే. ప్రధాన పాత్రలు రెండున్నాయనుకుందాం, వీటి నిర్వహణలో వచ్చే సమస్య లేమిటి? రెండిటికీ సమాన స్క్రీన్ టైం ఇచ్చేస్తే సమస్యలుండవని  మీరనుకుంటున్నారా? అది పొరపాటు. ఆ రెండు ప్రధాన పాత్రల కథలూ పెనవేసుకుపోవాలి- కథనపరంగానూ, కాన్సెప్ట్ పరంగానూ. కావాలంటే మీరే చూడండి - విజయవంతమైన రెండు ప్రధాన పాత్రలతో వచ్చిన సినిమాలు దీన్నే సాధించాయి. ‘టాయ్ స్టోరీ’ తీసుకోండి. ఇందులో వుడీ పాత్ర కథా ప్రయాణానికి ఉత్ప్రేరక పాత్ర బజ్ హేతువు. ఆస్కార్ స్క్రీన్ ప్లే ‘థెల్మా అండ్ లూయిస్’ తీసుకోండి. ఇందులో థెల్మాకి లూయిస్ గైడ్. సాంకేతికంగా ఈ రెండూ జంట పాత్రలు కావు. కానీ ఇది జంట హీరోయిన్ల సినిమానే. కనుక మీ స్క్రీన్ ప్లేల్లో జంట ప్రధాన పాత్రల ప్రయాణంలో కథని బలి చేసే ప్రమాదం తప్పాలంటే ఈ కింది పొరపాట్లు చేయకండి.
1. ఒకే ప్రధాన పాత్రకి స్పష్టమైన గోల్
        రెండు ప్రధాన పాత్రలకి సమాన స్క్రీన్ టైం వుండి ఒక ప్రధాన పాత్రకే డ్రామా వుంటే, అంటే స్పష్టమైన గోల్ వుంటే, ఆ రెండో ప్రధాన పాత్ర ఇట్టే ప్రాధాన్యం కోల్పోవడమే గాక, విసుగు కూడా పుట్టిస్తుంది. తప్పనిసరిగా ఒక ప్రధాన పాత్రకే స్పష్టమైన గోల్ వుండాలనీ, రెండో ప్రధాన పాత్రకి అంత అవసరం లేదనీ అనుకుంటే, ఇలా చెయ్యొచ్చు : మొదటి ప్రధాన పాత్ర పగ్గాలు రెండో ప్రధాన పాత్ర చేతిలో వుంచవచ్చు. “మిడ్ నైట్ రన్”, “రెయిన్ మాన్” లలో చార్లెస్ గ్రోడిన్, డస్టిన్ హాఫ్ మన్ ల పాత్రలు ఇలాటివే. గోల్ కోసం ప్రయత్నిస్తున్న మొదటి ప్రధాన పాత్రని వెనక్కి లాగుతూ, ఆ పాత్ర గమ్యాన్ని ఆలస్యం చేసే యాక్షన్ (కార్యరూపంలో) లో వుండే పాత్రలివి.
        ఇంకో ప్రత్యామ్నాయం ఏమిటంటే, మొదటి ప్రధాన పాత్రకి ఔటర్ గోల్ జర్నీ ఇచ్చి, రెండో ప్రధాన పాత్రకి దాని తాలూకు ఇన్నర్ గోల్ తాలూకు జర్నీని ఇవ్వడం. ‘ది షాషంక్ రిడెంప్షన్’ టిం రాబిన్స్ కి జైల్లోంచి బయటపడలన్న ఔటర్ గోల్ వుంటుంది, మోర్గాన్ ఫ్రీమాన్ కి జైల్లోంచి బయటపడ్డాక ప్రపంచాన్నిఎలా ఎదుర్కోవాలన్న ఇన్నర్ గోల్ వుంటుంది. ఔటర్ గోల్ భౌతిక మైనది, ఇన్నర్ గోల్ మానసికమైనది.

2. ప్రధాన పాత్రలు రెండిటి గోల్స్ ఒకటే
      ప్రధాన పాత్రలు రెండూ ఒకే గోల్ కోసం కలిసి పనిచేసే కథల ఆలోచన కూడా మీకొచ్చి రాసేసి వుండొచ్చు. ఒకే గోల్ కోసం రెండు ప్రధాన పాత్రల కలిసి పనిచేయడమెందుకు? ఆ పనేదో ఒక ప్రధాన పాత్రే చేయొచ్చుగా? అయినా రెండు ప్రధాన పాత్రలూ తప్పవనుకుంటే దీన్ని అర్ధవంతంగా ఇలా చేయొచ్చు : ఇలాటి సందర్భంలో రెండు ప్రధాన పాత్రలున్నా, అవి ఒకే పోతలో పోసినట్టుగాక, వేర్వేరుగా అన్పించాలి. ‘థెల్మా అండ్ లూయిస్’ లో దీన్ని గమనించ వచ్చు. ఇందులో ఇద్దరి గోల్ మెక్సికోకి చేరుకోవడమే. చేరుకుంటారు, అయితే వాళ్ళ లక్ష్యాలే వేర్వేరు. థెల్మా లక్ష్యం మెక్సికో చేరుకోవడమైతే, ఆ ప్రయాణంలో ఆమె వెర్రి పన్లు చేయకుండా క్షేమంగా చేరవేయడం లూయిస్ లక్ష్యం. థెల్మా నేర్చుకునే ప్రధాన పాత్రయితే, లూయిస్ నేర్పే ప్రధాన పాత్ర.
       
ఇంకో తరహా ఇలా వుంటుంది: ‘హీరో టీమ్’ లో హీరోలందరూ కలిసి ఒకే గోల్ తో వున్నా, వాళ్ళ స్కిల్స్ వేర్వేరు. దీంతో విలక్షంగా వుంటారు. ‘లెథల్ వెపన్’, ‘ది మెన్ హూ వుడ్ బి కింగ్’, ‘బుచ్ కాసిడీ అండ్ ది సన్ డాన్స్ కిడ్’...  ఇలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.       
3. రెండిట్లో ఒక ప్రధాన పాత్రకి ఆసక్తి నశించడం

         కొన్నిసార్లు నా పరిశీలనకి వచ్చే జంట పాత్రల స్క్రిప్టుల్లో, ప్రధాన పాత్రలు రెండూ పోటాపోటీగా ప్రారంభమవుతూ బాగానే కన్పిస్తాయి. కానీ సగానికొచ్చేసరికి ఒక ప్రధాన పాత్రకి ఆసక్తి నశించి, డీలా పడిపోవడం కన్పిస్తూంటుంది. దానికి గోల్ పట్ల ఏమాత్రం ఇష్టముండదు. అక్కడ్నించీ అది గోల్ కోసం ప్రయత్నిస్తున్న రెండో ప్రధాన పాత్రతో కథగా మారిపోతుంది. ఈ పరిస్థితి అనేక కారణాల వల్ల ఉత్పన్న మవుతుంది : జంట పాత్రల మధ్య తగినంత సంఘర్షణ లేకపోవడం, గోల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రధాన పాత్రకి పణం ఎలిమెంట్ - అంటే రిస్కు తీసుకునే అవసరం బాగా హెచ్చు స్థాయిలో వుండడం, లేదా రెండో ప్రధాన పాత్రని తీర్చిదిద్దడానికి చాలినంత స్క్రీన్ టైం లేదనుకోవడం...ఇలా అనేక కారణాలుంటాయి. 4ప్రారంభం ఒకరిది, సారధ్యం మరొకరిది
       రెండు బలమైన ప్రధాన పాత్రల్ని వాటి అప్పీల్ చెడకుండా నిర్వహించడం కష్టమైన పనే. ఒక్కోసారి రైటర్ రాస్తున్న కథా భాగానికి ఏ పాత్రతో సౌలభ్యంగా వుంటుందో దాంతో రాసుకుపోవడం జరుగుతూంటుంది. చాలా అరుదైన సందర్భాల్లో ఇది చెల్లిపోవచ్చు. మైకేల్ మన్ తీసిన ‘ది ఇస్ సైడర్’ చూడండి : ఇందులో రసెల్ క్రో పాత్ర కథ ప్రారంభిస్తే, అల్ పచినో పాత్ర కథ ముగిస్తుంది. అనుభవజ్ఞులైన రచయితలైతే దీన్నిదిగ్విజయం చేయగలరు. ‘షిండ్లర్స్ లిస్ట్’ లో ఐజాక్ స్టెన్ కథగా ప్రారంభమవుతుంది, అంతలోనే షిండ్లర్ పాత్ర ఆ కథనందుకుని ముగించే దిశకి తీసికెళ్ళి పోతుంది. 

5. సమాంతరంలో సమన్వయ లోపం జంట పాత్రలు రెండూ సమాంతరంగానే కొనసాగుతాయి, కానీ ఆ సమాంతర యానంలో వాటి మధ్య సంబంధంగానీ, సమన్వయంగానీ కన్పించదు. మొగుడూ పెళ్ళాలు ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్టు రోజంతా గడిపి, రాత్రెప్పుడో బెడ్రూంలో చూసుకోవడం లాంటిదన్న మాట. ఇలా జంట పాత్రలు రెండూ ఒకరి కథలో ఇంకొకరు ఇన్వాల్వ్ అవకపోతే, అది ఒక కథ అన్పించదు, రెండు కథలతో రెండు సినిమాల లన్పించుకుంటాయి.  
మరేం చేయాలి?
       చేయలేకపోవడమంటూ లేదు. కథా కథనాలతో, పాత్రల ప్రయాణాలతో కాలక్రమంలో మీరు సంపాదించుకునే అనుభవమే జంట పాత్రల కథలకి, లేదా ఇంకా ఎక్కువ పాత్రల కథలకి ప్రావీణ్యాన్ని సమకూర్చి పెడుతుంది.  ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి : సర్వసాధారణంగా జంట పాత్రలు వేర్వేరు విధులు, లేదా కార్య కలాపాలు నిర్వహిస్తాయి. ‘ది షాషంక్ రిడెంప్షన్’ లో లాగా, ఒక ప్రధాన పాత్ర ఆపరేషనల్ ప్రధాన పాత్రయితే, రెండోది పాయింటాఫ్ వ్యూ ప్రధాన పాత్రవుతుంది. జేమ్స్ కేమేరాన్ తీసిన ‘ది అబెస్’ రెండిటి విముక్తి గురించిన కథగా వుంటుంది. ఔటర్ జర్నీలో బడ్, లిండ్సే ని కాపాడతాడు, ఇన్నర్ జర్నీలో లిండ్సే బడ్ ని స్వీకరిస్తుంది. జంట పాత్రల సినిమాల్లో పరస్పరం విరోధులైన పాత్రలతో వున్నవి బాగా మెప్పించాయి. హీట్, హౌస్ ఆఫ్ శాండ్, ఫాగ్ ఉదాహరణలు. అనేక రోమాంటిక్ కామెడీలు కూడా ఇలాగే మెప్పించాయి. 
***
        సూచన : బయట కొన్ని స్క్రిప్టు కార్యకలాపల వల్ల బ్లాగ్ పోస్టులు ఆలస్యమవుతున్నాయి. ఇంకో రెండు మూడు వారాలు పోతే వెసులుబాటు లభించవచ్చు.అప్పుడు పోస్టులు వూపందుకుంటాయి. అంతవరకూ ఓపిక పట్టగలరు. ఆదివారం ‘సందేహాలు- సమాధానాలు’ తో కలుద్దాం.
సికిందర్

.