రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 29, 2017

577 ; రివ్యూ!




ర్శత్వం : ఎన్‌.శంకర్
తారాగణం : సునీల్, నీషా రాజ్, షాయాజీ షిండే శ్రీనివాసరెడ్డి, సితార, ఝాన్సీ, చంద్రమోహన్, కృష్ణవాన్, రేష్ దితరులు
సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రణం:  సి.రాంప్రసాద్, మాటలు: శ్రీధర్ సీపాన
బ్యానర్ :  హాలక్ష్మి ఆర్ట్స్
నిర్మాత : ఎన్. శంకర్
విడుదల : డిసెంబర్ 29, 2017

***
          మర్షియల్ హీరో కలతో కామెడీని పరిత్యాగం చేసిన సునీల్ పరుగు ఇంకా కొనసాగుతూనే వుంది ఒక హిట్ కోసం.  హిట్ ఆయనకి  కొట్టలేని ఉట్టి  అవుతూనే వుంది. ఎందరో  నిర్మాతలు, దర్శకులు ఆయన్ని పిరమిడ్లు వేసుకుని భుజాన మోసినా హిట్టు అనే ఉట్టి  కామెడీగా గట్టి పోటీ ఇస్తూనే వుంది. ఇదంతా అనవసరమని,  తాజాగా దర్శకుడు ఎన్. శంకర్ తనే నిర్మాత అయి,  సునీల్ కోసం కాదుగానీ అవకాశాలు తగ్గిన తనకోసం రంగులరాట్నం ఎక్కారు. అమ్మా చూడాలీ... నిన్నూ నాన్నను చూడాలీ... నాన్నకు ముద్దు ఇవ్వాలి ... నీ వొడిలో నిద్దుర పోవాలీ ... అంటూ సినిమా ప్రారంభంలోనే పాట పెట్టి విజయాన్ని వేడుకున్నారు. మరి విజయం వరించిందా? ప్రేక్షకులు తరించారా? సునీల్ పరిస్థితేంటి? ఇవి ఒకసారి పరిశీలిద్దాం...

కథ 
     వెంకటాపురంలో ఉల్లాస్ (సునీల్) డబ్బుకోసం మోసాలు చేస్తూంటాడు. సులభంగా ధనవంతుడైపోవాలని  కలలు గంటాడు. వూళ్లోనే డబ్బు  పిచ్చిగల పటేల్ (సాయాజీ షిండే) అనే వడ్డీ వ్యాపారికి ఉల్లాస్ నచ్చి చెల్లెల్ని ఇవ్వాలనుకుంటాడు. అలాగేనని మాటిచ్చిన ఉల్లాస్ కి అమెరికా సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి లయ (మనీషా రాజ్) చిన్నప్పటి ఫ్రెండే కావడంతో ఆమెని చేసుకుని పటేల్ కి పగ పెంచుతాడు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత  లయ తాగుబోతు అని తెలిసేసరికి,  ఏమీ చేయలేక ఆమెతో అమెరికా వెళ్లి కష్టాలు పడతాడు. ఆమెని మార్చడానికి  ప్రయత్నిస్తాడు. ఇంతలో మొదట ఉల్లాస్ డబ్బుకోసం వేరే సంబంధం చూశాడని, డబ్బు కోసమే తనని చేసుకున్నాడనీ లయకి తెలిసి విడాకుల కేస్తుంది. ఇప్పుడు ఉల్లాస్ ఏం చేశాడు? తాగుడు వల్ల ఆరోగ్యం చెడిన లయ ఏమయ్యింది? చివరికి వీళ్ళిద్దరి కాపురం నిలబడిందా?... ఇవీ మిగతా కథలో తేలే అంశాలు.

ఎలావుంది కథ 
    
      ఇదే పేరుతో రఫీ రాసి, షఫీ తీసిన మలయాళ కథ ఇది. రఫీ షఫీల రాతతీతలు ఫ్రెష్ గా వుంటాయి. 50 కోట్లు వసూలు చేసిన ఈ కామెడీని తెలుగులో రీమేక్ కి తీసుకున్నారు. తెలుగు మర్యాదలన్నీ చేసి ఐదు కోట్లకి కూడా కొరగాకుండా చేశారు. 2015 లో తీసిన మలయాళం ని 1995 నాటి తెలుగులో తీశారు. సునీల్ ని ఆ కాలంలోకి పంపి చేతులు దులుపుకున్నారు.  మళ్ళీ సునీల్ 22 ఏళ్ళు  ప్రయాణించి రావాలి. అమ్మా చూడాలీ... అని ఈ కథకి శ్రీకారం చుడుతూ సినిమా మొదట్లోనే పాడుకున్న సునీల్ పాపం పసివాడు. శంకర్ ఎక్కించిన విమానం కూలి ఎడారిలో తప్పిపోయేలా చేసింది ఈ కథతో చేసిన ప్రయత్నం. శంకర్ ఎక్కిన రంగులరాట్నం కూడా రాంలీలా మైదానంలో అదేదోలాగా మారింది. 


ఎవరెలా చేశారు?
      ప్రాస డైలాగులతో సునీల్ నవ్వించాలనుకోవడం అత్యాశ. ప్రాసల పస తీరింది. రాసిన రచయిత ఈ కాలంలో లేడు. మలయాళంలోని సున్నిత హాస్యం సునీల్ వల్ల కాదేమో. యాక్షన్ హీరోగా మారేక నటనలో అభివృద్ధి చెందడం మానేసినట్టు కన్పిస్తోంది. పాత్రలోకి ప్రవేశించకుండా,  పైపైన పేలవమైన ఎక్స్ ప్రెషన్స్ తో సరిపెట్టాడు. తన కామెడీ పాత్రకి ఎక్కడా ఒక్క ప్రేక్షకుడూ నవ్వక పోవడమన్నది - కనీసం కింది తరగతుల మాస్ సోదరులు కూడా ఔదార్యం చూపకపోవడమన్నది - తన కమర్షియల్ హీరో లక్ష్యాలని పునరాలోచించుకోవాల్సిన  అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈసారి సునీల్ గట్టిగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. మలయాళంలో దిలీప్ నిలబెట్టిన ఒక్క సీనూ నటించ లేకపోయాడు. 


       హీరోయిన్ మనీషా రాజ్ మలయాళంలో మమతా మోహన్ దాస్ లోని టాలెంట్ లో సగం కూడా ప్రదర్శించ లేకపోయింది. అంతా  ప్లాస్టిక్ నటనే. ఇక ఇతర నటుల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. 

          సాంకేతిక విలువల కోసం బాగా ఖర్చుపెట్టారు. మలయాళంలో  ఇంత ఖర్చు పెట్టలేదు. కేరళ నేటివిటీ ఉట్టి పడేలా,  ఒద్దికగా తక్కువ బడ్జెట్లోనే అందంగా ట్రెండీ కామెడీ తీశారు. రెండిటి సంగీత దర్శకుడు గోపీ సుందరే. కానీ ఒరిజినల్ కిచ్చిన క్వాలిటీలో సగం కూడా  తెలుగుకివ్వలేదు. ఇవ్వాలంటే పిల్ల తెమ్మెర లాంటి ఆ ఫీల్, తాజాదనం  కన్పించాలిగా . నాటు కామెడీ తీస్తే ఏమిస్తాడు. ఆర్ ఆర్ చాలా హారిబుల్ గా వుంది. ఇక రాంప్రసాద్ కెమెరా కూడా పాత ఫ్యాషన్ గా చిత్రీకరించుకొచ్చింది. రెండు మూడు ఇండోర్స్ లో తప్పితే ఎక్కడా కష్టపడినట్టు కన్పించదు. 

          మేకింగ్ చాలా  అవుట్ డేటెడ్ గా  వుండడమే గాక, చెవులు పగిలేలా నటులందరూ గట్టిగా అరిచి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభలా తయారు చేసిపెట్టారు. మొదటి షాట్ నుంచీ చివరి వరకూ సినిమా అంతటా అరుచుకుంటూ మాట్లాడుకోవడమే వుంటుంది. దీన్ని విజువల్ మీడియా అంటారా? 

          దర్శకుడు శంకర్ తిరిగి మేకింగ్ గురించి కొత్త పాఠాలు  నేర్చుకుని అప్డేట్ అయితే తప్ప ఇక ముందు  కష్టమే. ముందుగా తన బ్యాడ్ రైటింగ్, బ్యాడ్ డైరెక్టింగ్ గుర్తించ గలిగితే మంచిది.

సికిందర్