రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, అక్టోబర్ 2022, ఆదివారం

1240 :రివ్యూ!



దర్శకత్వం : ఇంద్ర కుమార్
తారాగణం : అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహీ తదితరులు
రచన : ఆకాష్ కౌషిక్, మధుర్ శర్మ; ఛాయాగ్రహణం : అసీమ్ బజాజ్, సంగీతం : అమర్ మోహిలే
బ్యానర్స్ : టీ-సిరీస్ ఫిల్మ్స్, మారుతీ ఇంటర్నేషనల్, సోహమ్ రాక్‌స్టార్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృషన్ కుమార్, అశోక్ ఠాకేరియా, సునీర్ ఖేటర్‌పాల్దీపక్ ముకుత్, ఆనంద్ పండిట్, మార్కండ్ అధికారి
విడుదల : అక్టోబర్ 25, 2022
***
          దీపావళి సినిమాల శ్రేణిలో థాంక్ గాడ్ ఇంకో ఫీల్ గుడ్ మూవీ అని ప్రకటించుకుంటూ వచ్చింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాల కాంబినేషన్లో సీనియర్ దర్శకుడు ఇంద్రకుమార్ కుటుంబ పర ప్రేక్షకులకి అందిస్తున్న కాకర పువ్వొత్తి అన్నారు. ఇంకా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో హోమ్లీ వాతావరణం. మామూలుగా అయితే పెద్ద స్టార్లు దీపావళి కుటుంబపర సినిమాలతో దిగాలి. ఈసారి గైర్హాజరయ్యాక అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లు మాత్రం వచ్చారు. అక్షయ్ కుమార్ తో రామ్ సేతు అనే భక్తి యాక్షన్ మూవీ అడుగున మిగిలుంటే 1-1.5 రేటింగ్స్ ని కూడా సొంతం చేసుకుని గర్వకారణంగా నిలిచాక, అజయ్ పరిస్థితి ఏమిటి? దీపావళికి తన జీవితంలో, ప్రేక్షకుల జీవితాల్లో వెలుగులు నింపడానికా? చీకట్లు నింపడానికా? ఇది తెలుసుకుందాం...

కథ

    కొన్నేళ్ళ క్రితం అయాన్ కపూర్ (సిద్ధార్థ్ మల్హోత్రా) ముంబైలో టాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా బాగా డబ్బు గడిస్తాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా పని చేసే భార్య రుహీ  కపూర్ (రకుల్ ప్రీత్ సింగ్), చదువుకునే కూతురు పిహూ కపూర్ (కీయారా ఖన్నా) వుంటారు. ఇంతలో పెద్ద నోట్లు రద్దు కావడంతో నల్లధనంతో నడిచే అతడి వ్యాపారం మూతబడుతుంది. అప్పులపాలై, ఇల్లు అమ్మకానికి పెట్టి కస్టమర్స్ దొరక్క కోపం, చిరాకు, ఆవేశం పెంచుకుని అల్లరి చేస్తూంటాడు. ఒక ఉద్రిక్త పరిస్థితిలో అదుపు తప్పి కారు యాక్సిడెంట్ చేసుకుంటాడు.

        కళ్ళు తెరిస్తే మాయాలోకంలో వుంటాడు. అది మోడరన్ గా వున్న యమలోకం. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబిసి) సెట్ లాగా వేసి వుంటుంది. ఆసనం మీద సూటు బూటు వేసుకుని ఆధునికంగా మిస్టర్ సీజీ (అజయ్ దేవగణ్) వుంటాడు. సీజీ అంటే చిత్రగుప్తుడు. అయాన్ పాపాల డేటా వినిపిస్తాడు. అందులో అయాన్ కోపం, స్వార్ధం, ఈర్ష్య, కామం వంటి నరకానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ వుంటాయి. నిజానికి అయాన్ చచ్చిపోయి యమలోకానికి రాలేదు. గాయాలతో హాస్పిటల్లో స్పృహలేని స్థితిలో ఆపరేషన్ టేబుల్ మీదున్నాడు. ఆత్మ కాసేపిలా యమలోకాని కొచ్చి మిస్టర్ సీజీకి చిక్కింది. ఆ ఆపరేషన్ కి అయిదు గంటలు పడుతుందనీ, ఈలోగా పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ తో జీవితంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని వస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందనీ, లేకపోతే ఇంతే సంగతులనీ మిస్టర్ సీజీ అప్డేట్స్ ఇస్తాడు.

        దీనికి గేమ్ ఆఫ్ లైఫ్ అనే గేమ్ షోలో పాల్గొనాలని రెండు డిజిటల్ కుండలు చూపిస్తాడు- పాపాల డిజిటల్ కుండ, పుణ్యాల డిజిటల్ కుండ. ఏ కుండ ముందు టాప్ అప్ కొస్తుందో దాని ప్రకారం అయాన్ సంగతి చూసుకోవడం జరుగుతుంది. ఖర్మ అనుకుని తప్పులు సరి దిద్దుకోవడానికి బయల్దేరతాడు అయాన్. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది 2009 నాటి డెన్మార్క్ సినిమా సార్టే కుగ్లర్ (సేల్స్ మాన్) కి అధికారిక రీమేక్ అని ప్రకటించి, పూర్తిగా భారతీయీ కరించారు. దర్శకుడు ఇంద్రకుమార్ 1990 లలో, 2000 ప్రారంభంలో దిల్, బేటా, రాజా, మస్తీ, ఢమాల్ వంటి 10 హిట్ సినిమాలు తీసిన వాడే. 2007 లో కనుమరుగై, తిరిగి 2011 నుంచి డబుల్ ఢమాల్, టోటల్ ఢమాల్, గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ అంటూ హిట్లే తీశాడు. కానీ ఇప్పుడేమైందో ఔట్ డేటెడ్ అయిపోయాడు. పూర్తిగా ’90 లనాటి వాసనలతో చాదస్తంగా థాంక్ గాడ్ తీశాడు.

        ఇలా దేవుడు పరీక్ష పెట్టే కథతో గతవారం ఓరి దేవుడా విడుదలైంది. 2021 లో తమిళంలో వినోదయా చిత్తం విడుదలైంది. వినోదయా చిత్తం’, థాంక్ గాడ్ దాదాపు ఒకటే. సముద్రకని దర్శకత్వం వహించిన వినోదయా చిత్తం (వింత కొరిక) లో దేవుడు వుండడు, కాలం రూపంలో సముద్రకని వుంటాడు. బాసిజంతో విర్రవీగే కార్పొరేట్ మేనేజర్ గా తంబి రామయ్య వుంటాడు. తను లేకపోతే ప్రపంచంలో పనులు జరగవనీ, ప్రపంచమే ఆగిపోతుందనీ ఆధిపత్య భావంతో కుటుంబం సహా జనాల్ని ఇబ్బంది పెడుతూంటాడు. ఒక రోజు కారు యాక్సిడెంట్ చేసుకుని కాలం దగ్గరికొస్తాడు. ఇంత త్వరగా తను చావడానికి వీల్లేదనీ, తను చేయాల్సిన పనులు ఇంకా మిగిలున్నాయనీతను లేకపోతే పనులాగి పోతాయనీ,  కనుక పనులు పూర్తి చేయడానికి 30 రోజుల సమయం కావాలనీ కాలాన్ని వేడుకుంటాడు. ఏం పనులు పూర్తి చేస్తావో చూస్తా పద - అని కాలం వెంట వస్తాడు.     

    
మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీమన కోసం కాలం ఆగదనీకనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ ఇది. ఇదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీజనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీమరణాన్ని చూసి భయపడకూడదనీచెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ.  ఇదే పేరుతో శ్రీవత్సన్ రాసిన తమిళ నాటకం  ఆధారంగా తీశారు. ఇందుకే గంటన్నర వుంది. నాటకం గాథగా వుంటే నష్టమేం లేదు. సినిమా కోసం నాటకాన్ని మార్చలేదని  సమాచారం. ఇక్కడే తప్పులో కాలేశారు ఈ గాథని కథగా మార్చకుండా. సముద్రకని దీన్ని గంటన్నర ప్రయోగాత్మక సినిమాగా తీసి ఓటీటీలో విడుదల చేశాడు. దీన్ని పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ లతో తెలుగులో రీమేక్ చేస్తామని ఆవేశపడ్డారు. తర్వాత వార్తల్లేవు. ఇది గాథ అని తెలుసుకోకుండా రీమేక్ చేసివుంటే చేతులు కాలేవి.

        ఇలా కాన్సెప్ట్ పరంగా థాంక్ గాడ్’, వినోదయా చిత్తం దగ్గర దగ్గరగా వుంటాయి. అయితే తమిళంలో తంబిరామయ్య నటన వల్ల ఎక్కువ వినోదంగా వుంటుంది. థాంక్ గాడ్ లో ఇద్దరు స్టార్లున్నా తీసిన విధానం వెనకటి కాలానికి చెందింది కావడం వల్ల నీరసంగా వుండి ఆకట్టుకోదు. పైగా ఇందులో హీరో పనులన్నీ ఆటంకాలు లేకుండా ఈజీగా జరిగి పోతూంటాయి. తంబిరామయ్య పూర్తి చేయాలనుకున్న పనులకి కాలం అడ్డు తగులుతూ వుంటుంది. ఎక్కువ సంఘర్షణకి లోనవుతాడు.

        చేసిన తప్పులు దిద్దుకునే కథతో నాగ చైతన్య నటించిన థాంక్యూ ఎలావుందో థాంక్ గాడ్ అలావుంది. హీరో యమలోకానికి వచ్చి గేమ్ ప్రారంభమయ్యే సీనుతో కథా ప్రారంభం తప్ప, మిగతా తప్పులు దిద్దుకునే సీన్లు నీరసంగా, పూర్ గా వుంటూ, ఇక ఇంద్రకుమార్ రిటైర్మెంట్ ని సూచిస్తున్నాయి.

నటనలు- సాంకేతికాలు
    యముడి పక్కన కామెడీగా వుండే చిత్రగుప్తుడు అజయ్ దేవగణ్ రూపంలో కామెడీగా వుండడు. అజయ్ తన సహజ ముఖ కవళికలతోనే వుంటాడు. నేటి కాలానికి మిస్టర్ సీజీగా స్టయిలిష్ చిత్రగుప్తుడుగా  హీరోకి ఆర్డర్లేస్తూంటాడు. మాటల్లో చిత్రగుప్తుడి వ్యంగ్యం కూడా వుండదు. కొన్ని డైలాగులు ఫన్నీగా వున్నాయి. ఒక బాగా నవ్వొచ్చే డైలాగుంది- మీ సూపర్ స్టార్ ఒకాయన పొడుగ్గా వుంటాడు కదా, ఆయన వచ్చి వెళ్ళాడు (కూలీ షూటింగులో అమితాబ్ బచ్చన్ గాయపడ్డ సంఘటన) ఇక్కడ గేమ్ గెలిచాడు. పోతూ మా ఐడియా దొంగిలించి కేబిసి షో ప్రారంభించుకున్నాడు అని!

          ఐతే యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పాత్రలో కామెడీ వుంది. అయితే తప్పులు దిద్దుకుంటూ చేసే కామెడీ కాలం చెల్లిన, పంచ్ లేని కామెడీ కావడంతో అతను తేలిపోయాడు. నేటి తరం ప్రేక్షకుల ట్రెండీ యాక్షన్ హీరో అయిన తను ఇలాటి సినిమాలోకి పొరపాటున వచ్చేశాడు.

        తెలుగులో కనుమరుగైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి హిందీలో ఆఫర్లు బాగానే వస్తున్నాయి గానీ, పాత్రలే సరిగ్గా వుండడం లేదు. పైగా సినిమాలు ఫ్లాపవుతున్నాయి- సర్దార్ కా గ్రాండ్ సన్, ఎటాక్, డాక్టర్ జీ, ఇప్పుడు థాంక్ గాడ్. ఇక నోరా ఫతేహీ యమలోకంలో ఒక పాటలో కన్పిస్తుంది.

        ఆధునిక యమలోకం సెట్, ఇతర సాంకేతిక విలువలు బాగానే వున్నాయి గానీ, పాటల విషయంలో ఇంద్రకుమార్ ఈసారి హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోయాడు. ఏవో పాటలు వచ్చిపోతాయి. ముగింపు సీను కూడా ఎంత సిల్లీగా వుందో చూస్తే- హీరో భార్యకీ, కూతురికీ ఒకే సారి కిడ్నీలు పోతాయి. ఇద్దరికీ తన రెండు కిడ్నీలూ  ఇచ్చేయడానికి ఆత్మహత్యా యత్నం చేస్తాడు హీరో. ఇంతలో డాక్టర్ వచ్చేసి - గుడ్ న్యూస్, కిడ్నీలు దొరికాయ్- ఎవరో చనిపోతూ అవయవ దానం చేశాడు. అవి సెట్ అయ్యాయి- అంటాడు. ఈ విడ్డూరం ఎలా జరిగింది? మిస్టర్ సీజీ వల్ల జరిగింది.

        ఇలా నవ్వాలో ఏడ్వాలో అర్ధంగాని ఈ సెంటిమెంటల్ డ్రామాని ప్రేక్షకులు తిట్టు కుంటారని ఇంద్రకుమార్ కి తెలిసే వుంటుంది. అందుకే ఉపాయంగా నేపథ్యంలో తన పాత హిట్ సాంగ్ వదిలాడు- దిల్ దేదీయా హై జాన్ తుమ్హే దీంగే, దగా నహీ కరేంగే సనమ్... అని పాట వస్తూంటే మాత్రం ప్రాణం లేచొస్తుంది మనకి నిజమే, కానీ దగా నహీ కరేంగే అంటూ పాటతోనే చేసిన దగాతో దొరికిపోయాడుగా!

—సికిందర్