రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, February 8, 2017

పాత సంగతి...






     ఇప్పడు తెలుగు సినిమా అంటే యాక్షన్ సినిమాగానే అర్ధం చెప్పుకోవాల్సి వస్తోంది గనుక, ఓ యాక్షన్ సినిమాలో   హీరో పాత్ర చిత్రణని సమగ్రంగా చూసి ఎంత కాలమైంది? హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఆడిన కాలంలో ఆయా స్టార్ హీరోయిన్ల పాత్రలు (శారద ‘ప్రతిధ్వని’, విజయశాంతి ‘కర్తవ్యం’) పూర్తిగా యాక్టివ్ నడకలతో అర్ధవంతంగానే వుండేవి. ఇప్పుడు స్టార్ హీరోల యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక, దాదాపు ప్రతీ యాక్షన్ సినిమాలోనూ అయితే అనావృష్టి (ఎన్టీఆర్ ‘అశోక్’),  కాకపోతే అతివృష్టి (జగపతి బాబు ‘బ్రహ్మాస్త్రం’) అన్నట్టుగా సాగుతోంది పాత్రచిత్రణల ప్రాసెస్. ఇవి పెద్దగా ఆడకపోవడమో, లేదా అస్సలు ఆడకపోవడమో జరుగుతోంది. పాత్ర చిత్రణల్లో యాక్టివ్- పాసివ్ ల తేడాల గురించి,  వీటిని  గుర్తించకపోతే  జరిగే అనర్ధాల గురించీ సినిమా సమీ క్షల్లో, వ్యాసాల్లో  ఎంతకాలంగా వూదరగొడుతున్నా ఎందుకనో – ‘థ్రోయింగ్ పెరల్సు బిఫోర్ ది స్వైన్’ అని  గురజాడ ‘గిరీశం’  కొటేషించినట్టే  వుంటోంది ఇంకా పరిస్థితి! 

  
        ‘పంచ్ కి పంచ్- మంచికి మంచి’ అంటూ మంచి డైలాగే రాసుకున్నారు ఓ సినిమాలో.  మరి హీరో అలా లాగిపెట్టి  ఓ పంచ్ ఇచ్చుకున్నంత మాత్రాన అతను యాక్టివ్ క్యారక్టర్ అయిపోతాడా?  యాక్షన్ సీన్స్ నటించినంత మాత్రాన యాక్టివ్ అయిపోతాడా? మంచితనం ప్రదర్శిస్తే  యాక్టివ్ అనే అర్ధమా? ఇలాటి అశాస్త్రీయ అర్ధాలతో హీరోయిజాలు పేలవమైన పాసివ్ పాత్రలుగా చతికిలబడిపోవడాకి కారణమౌతున్న రచయితని ఏ మానసిక కోణంలో చూడాలి?

        హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర చిత్రణ అనేసరికి ఆమె మానసికలోకంలోకి చప్పున వెళ్ళిపోతాడు రచయిత. అదే హీరో పాత్రనేసరికి ససేమిరా అతడి మనసులోకి చూడడు. ఆడపాత్ర మనసులోకి జొరబడడం, ఆ పాత్ర ఏమనుకుంటోందో వినడం అదేదో మగాడికుండే వయోరిస్టిక్ దుగ్ధ వల్లనేమో. అదే చాలామంది దర్శకురాళ్ళ సినిమాల్లో చూస్తే, ఆ స్త్రీపాత్ర చిత్రణలు హాస్యాస్పదంగా వుండడాన్ని గమనించ వచ్చు. వాళ్ళు స్త్రీ పాత్ర మనసులోకే చూడనట్టు వుంటారు- ఆడదానికి ఆడదే శత్రువన్నట్టు. హీరో పాత్రని రచయిత కేవలం బయటి నుంచి భౌతికంగా చూడ్డం వల్లేనా  ఇలా ప్రాణంలేని పాసివ్ పాత్రలుగా వరస కడుతున్నాయి హీరోల పాత్రలు? 

          కానీ సైకాలజీ ప్రకారం చూస్తే  మానసిక సంఘర్షణ లేనిది భౌతిక సంఘర్షణ లేదు. అంతా మనస్సులోనే వుంది. మనసు ఎలా వుంటే తీసుకునే చర్యలూ  అలా వుంటాయి. రచయిత పాత్రల మనసునే పట్టించుకోకుంటే పాత్రల చర్యలూ బోలుగా వుంటాయి. ‘ప్రతిధ్వని’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాల్లో శారద, విజయశాంతి పాత్రల మానసిక సంఘర్షణని కలుపుకుని పాత్ర చిత్రణలు చేయడం వల్లే వాటి బాహ్య చర్యలు (యాక్షన్) అంత బలంగా కట్టి పడేశాయి. ‘ప్రతిఘటన’ లోనూ విజయశాంతి  మానసిక సంఘర్షణ లోంచే అంత బలమైన, సజీవ ప్రతీకార చర్యా వ్యక్తమయ్యింది. ‘మౌనపోరాటం’, ‘ఎర్రమందారం’ లలో కూడా యమున పోషించిన పాత్రలు మానసిక సంఘర్షణ సహిత సవ్యమైన భౌతిక పోరాటాలే. అందుకని ఇవి యాక్టివ్ పాత్రలయ్యాయి.

          ఇలాకాక, నేటి యాక్షన్ హీరోల పాత్రలు కేవలం కండబల ప్రదర్శనే పెట్టుకుని నిరర్ధక నిర్జీవ వికార చేష్టలు పోతున్నాయి. హీరో విపరీతంగా స్పందించడమో, లేదా అసలే స్పందించక పోవడమో లాంటివి పాసివ్  లక్షణాల కిందే వస్తాయి. పాసివ్ పాత్ర అంటే సమస్యకి పరిష్కారాలు వెతక్క విధికి లేదా కాలానికి తలవంచి కూర్చునేది. ట్రాజడీ పాత్రలు పాసివ్ పాత్రలు. దేవదాసు పాసివ్ పాత్ర. పాత్రని కథ నడిపినా, లేదా రచయిత నడిపినా పుట్టేవి  పాసివ్ పాత్రలు. ఇలా  యాక్షన్ సినిమాల్లో హీరో పాసివ్ గా మారితే చాలా దయనీయంగా కన్పిస్తాడు. విలన్ చేతిలో మరీ బాధితుడైపోయి హాస్యాస్పదంగా వుంటాడు. 

        విలన్ తో పోరాటంలో హీరో పాసివ్ గా వుంటే  విలన్ చేతిలో బాధితుడి కిందే, కట్టు బానిస కిందే  లెక్క. కాకపోతే రియాక్టివ్ గా వుంటాడు. అంటే విలన్ లీడ్ తీసుకుని హీరోకి ఏదో చేస్తేనే హీరో తిరగబడి (రియాక్ట్ అయి) ఎదురు దాడి చేస్తాడు. ఇదే తంతు పదే పదే  రిపీటవుతూ వుంటుంది. ఈ ఎదురు దాడులే హీరో చేస్తున్న గొప్ప యాక్షన్ అనుకుంటాడు రచయిత. అది ఆ హీరో పాత్ర పాల్పడుతున్న తెలివితక్కువ తనమనుకోడు రచయిత. ప్రేక్షకులూ  ఇది చూసే చప్పట్లు కొడతారు. ఫ్యాన్సూ అదిరింది బాసూ  అనేసి ఈలలేస్తారు. హీరో పాత్ర  పాసివ్ గా విలన్ చేతిలో బాధితుడు అవకుండా వుండాలంటే, అసలు విక్టిమ్ (బాధిత వ్యక్తి ) మెంటాలిటీ ఏమిటోతెలియాలి.  దాని  బారిన పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియాలి. దీని మీద డాక్టర్  వేన్ డయర్  రాసిన ప్రసిద్ధ సైకాలజీ పుస్తకం ‘పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్’  (1978) చదివితే  అంతా బోధపడుతుంది. ఈ పుస్తకం పీడీఎఫ్ ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

     ఇక్కడ అసలు జరుగుతోందేమిటంటే, విలన్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకుని హీరోని అడిస్తూంటే, హీరో వూరికే నరుకుతా చంపుతా  అంటూ ఎడాపెడా ఎదురు దాడులు చేస్తూ ఆత్మ రక్షణ చేసుకోవడమే. అంటే ఎంత సేపూ విలన్ సాధింపులకి తను రియాక్షనే చూపిస్తున్నాడు తప్పించి, విలన్ చేతిలోంచి ఆ పరిస్థితిని వూడలాక్కుని, వాణ్ణి ఆత్మ రక్షణలో పడేసే ఆలోచనే చేయడం లేదన్న మాట. ఆత్మరక్షణలో పడేసేవాడే హీరో, ఆత్మరక్షణ చేసుకునే వాడుకాదు. అందుకే ఇది తెలివితక్కువ తనం. దాదాపు ప్రతీ సినిమాలో ఇదే తంతు కన్పిస్తోంది. దీంతో హీరో  ఏమాత్రం విషయం లేనివాడిగా తేలిపోతూ తెలివిగల  ప్రేక్షకులకి దొరికిపోతాడు. ఇతరులకి గొప్ప జాలీ కన్నీళ్ళూ తెప్పిస్తూ వుండిపోతాడు. ఆ ప్రేక్షకుల దృష్టిలో ఇది గొప్ప సెంటిమెంటల్ డ్రామా అయిపోతుంది. హాలీవుడ్ కథల్నికాపీ  చేసినా ఇదే  ధోరణి కన్పిస్తోంది. 


      నిజమే, రక్త మాంసాలున్న హీరో పాత్ర ప్రయాణంలో కొంత జాలినీ సానుభూతినీ ప్రేక్షకులనుంచి పొంది తీరాల్సిందే. అదెంతవరకూ? టైం అండ్ టెన్షన్ పరిధుల్ని దాటనంత వరకూ. టైముతో టెన్షన్ అనులోమ సంబంధంలో వుంటుంది. టైము గడిచే కొద్దీ ఈ టెన్షన్ ని  కథ నడిపే ( కథని రచయిత నడిపితే పాసివ్ పాత్రయిపోతుంది- టైం అండ్ టెన్షన్ వుండదు) హీరో పాత్ర పెంచుకుంటూ పోలేదంటే, ఆ పాత్ర విఫలమైనట్టే. యాక్షన్ వల్లే ఈ టెన్షన్ పెరుగుతుంది, రియాక్షన్స్ తో కాదు. 


           నితిన్ నటించిన ‘రామ్’ లో తన మీద విలన్ జరుపుతూ వుండే దాడులకి హీరో నితిన్ ప్రతిసారీ రియాక్ట్ అవుతూ తిప్పి కొట్టడం, జెనీలియాని తీసుకుని పారిపోతూ వుండడమే తప్ప, విలన్ గుట్టు ఎక్కడుందో అది పట్టుకుని, వాణ్ణి తన గుప్పెట్లోకి  తెచ్చుకుని, ఆటాడించే  ప్రసక్తే వుండదు. హీరోని చూసి విలన్ పారిపోతూ వుండడం కమర్షియల్ సినిమా అవుతుంది, విలన్ ని చూసి హీరో పలాయనం చిత్తగించడం కచ్చితంగా ఫ్లాప్ సినిమా అవుతుంది. 

           ‘బ్రహ్మాస్త్రం’లో జగపతిబాబు కళ్ళెర్ర జేస్తూ చంపుతా చంపుతా అని అరవడమే గానీ, ఆ చంపడం ఎప్పుడో, దానికేం సన్నాహాలు చేస్తున్నాడో ఏమీ వుండదు. రచయిత చాలా అజ్ఞానంతో- సినిమా పరిజ్ఞాన రాహిత్యంతో- కథల్లో లక్ష్యాన్ని విలన్ కి ఏర్పాటు చేసేస్తే ఇంతే మరి. లక్ష్యం వుండాల్సిన హీరో కి ఏ లక్ష్యమూ లేకుండా పాసివ్ పాత్రగా మిగిలిపోతాడు.
 
       1930 లలో సముద్రాల రాఘవాచార్య దగ్గర్నుంచీ నేటి పరుచూరి బ్రదర్స్ వరకూ సాహిత్యంలోంచీ, నాటకాల్లోంచీ వచ్చిన రచయితలే సినిమా రచయితలూ కావడంవల్ల పాత్ర చిత్రణలు బలంగా ఉండేవి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల కాలం వరకూ పాసివ్ పాత్రల్ని చూడలేదు. 2000 సంవత్సరం నుంచీ కొత్త కొత్త దర్శకులే రచయితలూ అయిపోవడంవల్ల- రచయిత కుండాల్సిన మూలాల్లేకపోవడం వల్ల,  నాల్గు డీవీడీలు చూసి స్క్రిప్టులు రాసెయ్యడంవల్లా  వచ్చింది సమస్యంతా. రచయిత రక్తంలోవుంటాడు, డీవీడీ ల్లోంచి వచ్చిన వైరస్ లో వుండడు. దర్శకులై పోవాలనుకునేవాళ్ళు  ఈజీగా వైరస్ రచయితలై పోతే చాలు యూత్ మెచ్చును, సక్సెస్ వచ్చును అనే పెద్ద స్కామ్ కే  తెరతీశారు.

         వైరస్ రచయితలకేం తెలుసు రక్తమాంసాలున్న పాత్రల స్వభావం. పులి చర్మం తెచ్చి మేకకి కప్పేస్తున్నారు. పులి తోలు మేక ఎంత పొటమరించి ఫైటింగులు చేసినా పులై  పోదుగా? ఈ పరిస్థితుల్లో మానవ స్వభావం గురించి ఇటీవల లండన్ యూనివర్సిటీ కాలేజీ జరిపిన రీసెర్చిని పరిశీలించడం  అవసరం కావొచ్చు. ప్రొఫెసర్ సుఖ్విందర్ షేర్గిల్ బృందం ఏం చేసిందంటే, ఒక వొత్తిడిని కలిగించే పరికరం మీద ఒక వలంటీరు చేతి వేలిని వుంచి, కొంత వొత్తిడిని కల్గించి దాన్ని రికార్డు చేశారు. అప్పుడు తను ఫీలయిన వొత్తిడి తోనే  రెండో వలంటీరు వేలిమీద నొక్కమన్నారు. నొక్కింతర్వాత ఆ రెండో వలంటీరుని తను ఫీలైన బలంతోనే మొదటి వలంటీరు వేలిని నొక్కమన్నారు. ఇలా పరస్పరం ఇద్దరి చేతా కొన్ని సార్లు నొక్కించింతర్వాత, ఆ పరికరం చూపిస్తున్న రీడింగుల్ని చూస్తే ఏముంది, ఆశ్చర్యం! 

      నొక్కులాట  ఇంటరెస్టింగ్ గా తేలింది! వలంటీర్లు  ఇద్దరూ పరస్పరం తాము ఫీలైన వొత్తిడి కంటే 40 శాతం అధిక వొత్తిడితో నొక్కుతున్నారు. మీటర్ రీడింగ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. మమూలు స్పర్శగా మొదలైన  క్రీడ, తీవ్ర ఘర్షణకి దారితీసే స్థాయికి చేరిపోయింది. పైకి మాత్రం వాళ్ళు ఒకే స్థిరమైన వొత్తిడితో  నొక్కుతున్నామనుకుంటున్నారు. 
         ఇదే జరుగుతోంది సినిమాల్లోనూ. ఆ వలంటీర్ల లాగే మనసు లోపల రగిలే ప్రతీకారేచ్ఛని పట్టుకోలేకపోతున్నారు. పాత్రకి ఇది మిస్సవడం వల్ల ప్రేక్షకులు అనుభవించే ‘కచ్చి’ తీరే ప్రసక్తే వుండదు. అప్పుడా చప్పిడి సినిమా చెప్పా పెట్టకుండా ప్రొడ్యూసరింటికి వెళ్ళిపోతోంది. పై రీసెర్చివల్ల తేలిందేమిటంటే, ఏ మనిషీ తనకి కలిగిన నొప్పికి బాధపడుతూ కూర్చోడు. అంతకి ఎక్కువ  నొప్పినే  తిరిగి కల్గిస్తాడు. ఇది ఆ వలంటీర్లకి లాగే పైకి తెలియకపోయినా లోలోపల అసంకల్పితంగా జరిగిపోతుంది. కొన్నిసార్లు ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యంకాకపోవచ్చు. తను అశక్తుడే కావొచ్చు. అంతమాత్రాన మనసు లోపలి ‘ఇచ్ఛ’ ఎక్కడికీ  పోదు. ఆ ‘ఇచ్ఛ’ యే ప్రేక్షకుల ‘కచ్చి’ తో కనెక్ట్ అవుతూ వుంటుంది. అప్పుడు సినిమా అన్నాక హీరో లేవాలి, లేచి సాధించాలి. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటూ వుండే ప్రేక్షకులు,  వాటిని హీరో సాధిస్తూంటే చూసి ఆనందించే అవకాశం కల్గించకపోతే  ఎలా? 

          ఇదంతా అనావృస్టి పాత్రల సంగతి. ఇక అతివృష్టి కొస్తే, కంటికి కన్ను లోక సమ్మతమేగానీ, కన్రెప్పకి కన్ను న్యాయసమ్మతమైన ప్రతీకారం కాదంటాడు హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజీ  ప్రొఫెసర్ డానియెల్ గిల్బర్ట్. లెబనాన్ దేశం తమ ఇద్దరు సైనికుల్ని బంధించిందన్న కోపంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడాన్ని యూరోపియన్ యూనియన్ తప్పు బట్టలేదనీ, అయితే నిర్విచక్షణగా ఆ యెత్తున దాడులు జరపడాన్ని ప్రపంచమంతా ఖండించిందనీ గుర్తు చేశాడీయన.  తిప్పి కొట్టడం ఓకే, కానీ అంత  తీవ్రత కూడదంటాడు. 

          కానీ మన సినిమాల్లో కన్రెప్పకి కన్నుకాదు, మొత్తం తలకాయలే తెగిపడు తున్నాయి. ఆ తల తెగిన మొండెం అలాగే మోటారు బైకుమీద రివ్వున దూసుకెళ్ళడాన్ని ‘అశోక్’ లోనే  చూశాం. తల్లీ తండ్రీ చెల్లీ చక్కటి కుటుంబమూ వున్న ఇంజనీరింగ్ విద్యార్థి కదేం విపరీతమో, తల్వార్లు పట్టుకుని నగరవీధుల్లో నరమేధం గావిస్తాడు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బిమల్ రాయ్ కుమారుడు జాయ్ రాయ్, మన ప్రేక్షకులు హృదయంతో సినిమాలు చూస్తారన్నాడు. మరి ప్రతీకారమైనా హృదయం ఒప్పేదిగా లేకపోతే ఆ  హీరో గతీ, సినిమా సంగతీ ఇంతే సంగతులు. 


       అనావృష్టి పాత్రల్లాగే అతివృష్టి పాత్రలు కూడా పాసివ్ పాత్రలే. మనోబలం లేనివాడే బలప్రయోగంతో ఒప్పించబోతాడు. ఇలాటి పాత్రలకి పట్టరాని ఆవేశమే తప్ప ఆలోచన వుండదు. మరి ఇంతకీ సమగ్రమైన యాక్షన్ పాత్ర ఎలా పుడుతుంది? ఇందుకు స్వామి సుఖబోధానంద నుంచి తీసుకోవచ్చు. స్వామి సుఖబోధానంద యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆధునిక జీవితంలోంచి ఉదాహరణలు తీసుకుని, చాలా సింపుల్ గా ఆథ్యాత్మిక విషయాలు చెప్తాడు. ఒక సమస్య ఎదురైతే ముందు దాంతో సామరస్యాన్ని ఏర్పరచుకోమంటాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యర్ధి పట్టులో లాక్ అయిన చేతిని విసురుగా లాగేసుకుంటే చేతి ఎముకలు విరిగి పోతాయనీ, ప్రత్యర్ధి పట్టులోనే కాస్సేపలా వుండిపోయి, అతని పట్టుని అర్ధం చేసుకునే ప్రయత్నం ఇవతలి ఫైటర్ చేస్తాడనీ వివరిస్తాడు. అప్పుడు చెయ్యిని విడిపించుకునే ఒడుపు తెలిసివచ్చి, సునాయాసంగా లాక్ తీసుకుని ఎదురు దెబ్బ తీస్తాడనీ విజువలైజ్  చేస్తాడు సుఖబోధానంద. 

          ఇలా జీవితంలో వుండే డైనమిక్సే  సినిమా పాత్రలకి లేకపోతే ప్రేక్షకులకి అవి దూ రంగా వుండి పోతాయి. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ కూడా ఏమంటాడో చూద్దాం : “ఒక పరిస్థితికి దెబ్బ తిన్న హీరో ఆ పరిస్థితిని రూపుమాపాలని కమిటవుతాడు. మన జీవితాల్లోనూ ఈ కమిట్ మెంటే మనల్ని కట్టేస్తుంది. ఒకసారి మనం కమిటయ్యాక, మాటి చ్చాక, సంతకం పెట్టాక, ప్రమాణం చేశాకా, ఇహ  వెనుదిరిగి పోలేం.  కాబట్టి కమిట్ మెంటే కీ లకం. ఇది లేకుండా ఏదీ సాధించలేం. 

       “ అలా హీరో కమిటయ్యాక, కొందరు సాయపడే వాళ్ళు  ప్రత్యక్షమవుతారు. మనకీ జీవితంలో ఇలాగే జరుగుతుంది. ఈ సాయమనేది వ్యక్తులు అందించే సాయం రూపంలోనే గాక, మనకి పుట్టే ఐడియాల ద్వారా కూడా అందవచ్చు. ఏ కమిట్ మెంటూ లేకుండా కూర్చుంటే  మన పరిస్థితులు చక్కబడే ఎలాటి సాయమూ ఎక్కడ్నించీ అందదు.  (‘వసంతం’ లో వెంకటేష్ పాసివ్ పాత్ర ఇంతేగా). కానీ మనం కమిట్ మెంట్ తో వున్నామని తెలిస్తే మనచుట్టూ ఎందరో చేరతారు, మనసులోనూ ఎన్నో ఐడియాలూ ముసురుకుంటాయి. ఎన్నో సలహాలందుతాయి. ఫలానా వ్యక్తుల్ని  కలవాలి, ఫలానా కోర్సుకి అటెండవ్వాలి, ఫలానా పుస్తకం చదవాలి, ఇలా ఎన్నో...  కథలో హీరోకి ఇలాటి ‘హెల్పర్’ తో ఏర్పడే సంబంధం ప్రేక్షకులతో అత్యంత అవసరమైన సైకలాజికల్ కనెక్షన్ ని ఎర్పాటు చేస్తుంది.

          “ వీటన్నిటినీ క్రోడీకరించుకుని హీరో ప్రణాళిక వేసుకుంటాడు. ఇక చర్యకి పూనుకుంటాడు. సమస్య తీవ్రతని, దాని కారకుల్నీ లేదా,  కారణమైన అంశాల్నీ, పరిష్కార మార్గాల్నీ కనిపెట్టి ఉద్యుక్తుడవడంతో సమగ్రమైన యాక్టివ్ పాత్రగా అతను మారిపోతాడు...”


-సికిందర్
(2006, ఆంధ్రభూమి ‘వెన్నెల’)