రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, November 28, 2022

1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1

    దెయ్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో, చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ్మించేలా సినిమాలు తీయడం అంత ఆరోగ్యకరమైతే కాదు. చేతబడి చేస్తున్నారని అనుమానించి చంపే దురాగతాలు ఎన్నో జరుగుతున్నాయి- మసూద ఇలాటిదే కథ. మసూదాబీ చేతబడి చేస్తోందని నమ్మి ఆమెని చంపేయడం ఈ కథకి మూలం. చంపితే చంపారుగానీ, చంపిన వాళ్ళని జైల్లో వేసి వుంటే మూఢ నమ్మకాల్ని ఖండించే సినిమాగా పాజిటివ్ గా వుండేది.

        క భూత ప్రేతాలు ఆవహించడమన్నది ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల్లో ఇంకో మూఢ నమ్మకం. భూతం ఆవహించిన వ్యక్తి విపరీత ప్రవర్తన అదో మానసిక రుగ్మతే తప్ప మరేం కాదు. దీన్ని చేతబడితో ముడి పెట్టకుండా దెయ్యం పట్టింది, భరతం పడదాం అన్నట్టుగా సినిమాలు తీసుకుంటే ఫర్వాలేదు. కానీ మసూదాబీని చేతబడి చేస్తోందని చంపిందిగాక, ఆమె ప్రేతాత్మే ఓ అమ్మాయిని పూనినట్టు చూపించి, మళ్ళీ ఆమెని చంపడం దగ్గరే వచ్చింది సమస్య.

హాలీవుడ్ క్లాసిక్ హార్రర్ ది ఎక్సార్సిస్ట్ చేతబడితో ముడి పెట్టకుండా దెయ్యం పట్టింది, భరతం పడదాం అన్నట్టుగా తీసిన సినిమా. ఆ ఎక్సార్సిస్ట్-  అంటే మంత్రగాడి పాత్ర చర్చి ఫాదరే పోషిస్తాడు. 1973 లో తీసిన ఈ సంచలన అమెరికన్ హార్రర్ సినిమాలో- క్షుద్ర శక్తి (దెయ్యం) మరెక్కడిదో కాదు, ఇరాక్ నుంచి తెచ్చుకున్నారు. తర్వాత ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేనే ఒక దెయ్యమని ముద్రవేసి చంపారు, అది వేరే విషయం. ఎక్సార్సిస్ట్ స్ఫూర్తితోనే తెలుగులో చేతబడి క్షుద్ర సాహిత్యం మొదలైంది.

ఈ సినిమా నమాజ్ కోసం పిలుపునిచ్చే అజాన్ తో ప్రారంభమవుతుంది. ఉత్తర ఇరాక్ లో ఆర్కియాలజిస్టులు త్రవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు మొదలవుతాయి. పురావస్తు త్రవ్వకాల్లో కాథలిక్ పూజారి పాల్గొంటాడు. త్రవ్వకాల్లో సెయింట్ జోసెఫ్ పతకం,  ఇంకో ఇరాక్ మైథాలజీలో ఫుజుజు అనే క్షుద్ర శక్తి విగ్రహమూ బయట పడతాయి. కాథలిక్ పూజారి సెయింట్ జోసెఫ్ పతకం తీసుకుని వెళ్ళిపోతాడు. ఫుజుజు కళ్ళు అతన్నే చూస్తాయి... అక్కడ రెండు కుక్కలు కాట్లాడుకుంటూ వుంటాయి.

ఆ విగ్రహంలోని ఫుజుజు క్షుద్ర శక్తియే అమెరికాలో పన్నెండేళ్ళ బాలికని ఆవహిస్తుంది. ఈమె తల్లి సినిమా హీరోయిన్. నాస్తికురాలు. సింగిల్ మదర్. ఆ విపత్తు నుంచి కూతుర్ని కాపాడుకోవడానికి నాస్తికత్వాన్ని వదులుకుని మతాన్ని ఆశ్రయించే ఈ హార్రర్ కథ అత్యంత జుగుప్సాకరంగా తీశారు. ప్రేక్షకులు వాంతులు చేసుకున్నారని, కొందరు గుండెపోటుతో చనిపోయారనీ సమాచారం. ఆ క్షుద్ర శక్తిని బాలిక నుంచి వదిలించడానికి, చివరికి చర్చి ఫాదరే తనలో ఆవాహన చేసుకుని ఆత్మబలి దానం చేస్తాడు. ఇందులో చేతబడి లేదు, మంత్రగాడిగా చర్చి ఫాదర్ దెయ్యాన్ని వదిలించడమే వుంది.

మసూద ముస్లిం చేతబడి కథగా తీసినప్పుడు చేతబడి మూఢ నమ్మకమని చెప్పలేదు సరే, విరుగుడు మంత్రాలు కూడా శాస్త్రోక్తంగా చూపించలేదు. ఇస్లాంలో ఖురాన్ లో వున్నదొకటి, బయట చేసేదొకటి. ఇస్లాంలో చేతబడిని సిహ్ర్ అంటారు. సిహ్ర్ కి పాల్పడడం సైతాను సాయం కోరడంగా నిషేధించింది ఖురాన్. సిహ్ర్ కి విరుగుడుగా మంత్రాలు కూడా వివరించింది. అంతేగానీ సిహ్ర్ కి పాల్పడే వాళ్ళని చంపమనలేదు. ఈ ముఖ్యమైన విషయాలు సినిమాలో చూపించలేదు. జిన్ అంటే క్షుద్ర శక్తుల్ని వదిలించే సెంటర్ నడిపే మోడరన్ పీర్ బాబా ఏ మంత్రాలూ చదవకుండా అదిలిస్తాడు లేకపోతే హూంకరిస్తాడు. లేదా తలమీద చేయిపెట్టి శాంతింప జేస్తాడు. క్లయిమాక్స్ లోనైతే ఎక్కడో కూర్చుని తస్బీర్ పట్టుకుని పెదాలు కదుపుతూంటాడు. అది మంత్రాలు చదవడంలా వుండదు.

ఇస్లాంలో చేతబడికి స్థానమేంటో, క్షుద్ర విద్యలు ఎంత నిషిద్ధమో, విరుగుడుగా ఏం చెప్పారో, కథ కవసరమయ్యే కనీస సమాచారంతో సినిమా తీస్తే తెలియని ప్రేక్షకులు తెలుసుకుంటారు. చూపించడానికి కొత్త విషయం తీసుకున్నప్పుడు అది ఇన్ఫో టైన్మెంట్ గా వుంటే బావుంటుంది.

2. బిగినింగ్ విభాగం  

    ఇప్పుడు కాన్సెప్ట్ విశ్లేషణ పక్కనబెట్టి, కథా కథనాల స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. మనిషి మానసిక లోకమెలా వుంటుందో స్క్రీన్ ప్లే రూపం అచ్చం అలా వుంటుంది. వుండాలి. అప్పుడే ప్రేక్షకులతో సినిమా కనెక్ట్ అయీ దానికి రాసిన క్రియేటివ్ రాతల కొద్దీ ఆడుతుంది. కాన్షస్ మైండ్ (స్క్రీన్ ప్లేలో బిగినింగ్), సబ్ కాన్షస్ మైండ్ (మిడిల్), మధ్యలో ఇగో (ప్రధాన పాత్ర) కలిపి మనిషి మానసిక లోకం. కాన్షస్ మైండ్ తో వుండే ఇగో, సబ్ కాన్షస్ మైండ్ లోకి దూకి, అక్కడుండే సమస్యలతో పొరాడి విజయాన్ని పొందే (ఎండ్), పొందమని చెప్పే మనోవైజ్ఞానిక శాస్త్ర నమూనాయే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. సినిమా కథలే కాదు, సాహిత్యంలో రాసే ఏ కథలైనా ఇంతే.

హార్రర్ సినిమాల్లో పాడుబడ్డ ఇళ్ళు, దెయ్యాలు, దెయ్యం పూనిన మనుషులూ ఇవన్నీ సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకలే. ఇటీవల విడుదలైన, మమ్ముట్టి నటించిన రోషాక్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో మమ్ముట్టి దుష్టశక్తి వున్న పాడుబడ్డ ఇంట్లోనే దిగుతాడు. దీంతోనే- ఈ సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకతోనే - నిజాలు తెలుసుకోవడానికి మమ్ముట్టి పాత్ర ఇగో పోరాటన్న మాట.

అలాగే మసూద లో మసూదాబీ దెయ్యం పూనిన అమ్మాయే సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీక. ఈమెతోనే కథ. మసూద కథ చేతబడి తీసేస్తే ఎక్సార్సిస్ట్ కథే. తల్లీ కూతుళ్ళు, వాళ్ళకి సాయపడే మగ పాత్ర, చర్చి ఫాదర్ సహా. ఎక్సార్సిస్ట్ లో దుష్టశక్తి ఇరాక్ మైథాలజీ లోంచి వస్తే, మసూద లో ముస్లిం చేతబడి లోంచి వచ్చింది.

ఈ స్క్రీన్ ప్లే 1989 లో చిత్తూరు జిల్లా గ్రామంలో మీర్ తాజ్ అనే ముస్లిం రైతు కుటుంబంలో హింసాత్మక ఘటనలతో ప్రారంభమవుతుంది. తర్వాత హైదరాబాద్ లో ఓ భవనంలో ఓ యువతి దారుణ హత్యతో ముగుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికొస్తే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది. ఇందులో కథా పరిచయం, పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా వుంటాయి. సమస్య స్థాపన వుండదు, ఇదే లోపం.

హైదరాబాద్ లో ఆ హత్య జరిగిన పాడుబడిన భవనం ఎదురుగానే పాత అపార్ట్ మెంట్ ఫ్లాట్లో నీలం అనే సైన్స్ టీచర్, స్కూలుకెళ్ళే కూతురు నాజియాతో వుంటుంది. పక్క ఫ్లాట్లో గోపీ అనే సాఫ్ట్ వేర్ వీళ్ళతో స్నేహంగా వుంటాడు. నీలంని వదిలేసి దూరంగా వుంటున్న భర్త డబ్బుల  కోసం వేధిస్తూ వుంటాడు. గోపీ ఆఫీసులో మినీని ప్రేమిస్తూంటాడు.

ఇలా పాత్రల పరిచయాలయ్యాక, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ఇలా మొదలవుతుంది - నాజియా చేతికి కొత్తగా వేసుకున్న బ్రాస్లెట్ చూసి క్లాస్ మేట్ అడిగితే మదర్ కొనిచ్చిందని అంటుంది. ఓ రాత్రి నాజియా భయానక రూపంలో వేరే గొంతుతో భయపెట్టేలా మాట్లాడుతుంది. నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు అంటుంది. ఎవరు?’ అంటే వాడే అంటుంది.

దీంతో భయపడి డాక్టర్ కి చూపిస్తారు. డాక్టర్ పరీక్షలు చేసి మందులు రాస్తాడు. సైన్సుని నమ్మే నీలం సైన్స్ మీద నమ్మకం లేక భూత వైద్యుడ్ని చూపిద్దామంటుంది. పీర్ బాబా దగ్గరి కెళ్తారు. పీర్ బాబా అసిస్టెంట్ అల్లావుద్దీన్ తావీజు ఇచ్చి కట్టమంటాడు. ఆ తావీజు స్కూల్లో తీసేస్తుంది కూతురు. ఆమెని చూసి మీర్ తాజ్ అనే అతను (సినిమా ప్రారంభంలో 1989 పూర్వ కథ పాత్ర) దగ్గరికొస్తాడు. దూరం నుంచి ఇది చూస్తుంది- 1989 లో దారుణ హత్యకి గురైన యువతి ఆత్మ. వెంటనే మీర్ తాజ్ రక్తం కక్కుకుని చచ్చిపోతాడు.

స్కూల్లో కూతురు ముక్కు నుంచి రక్తం వస్తుంది. రాత్రి కూతుర్ని పడుకోబెట్టిన నీలం - బ్రాస్లెట్ ని చూసి ఇదెక్కడిదని అడిగితే, క్లాస్ మేట్ ఇచ్చిందంటుంది కూతురు. క్లాస్ మేట్ కి మదర్ ఇచ్చినట్టు చెప్పి వుంది. నీలం కి మంచం పక్కన మసూదాబీ అని రాసి వుండడం కన్పిస్తుంది. అదే రాత్రి ఫ్లాట్ కొస్తున్న నీలం ఫ్లాట్ యజమాని కొడుకు, ఎదురుగా పాడుబడ్డ ఇంటి సందులో ఏదో చూసి కేకలు పెడతాడు. నీలం, గోపీ వెళ్ళి చూస్తే భీకరంగా కూతురు కన్పిస్తుంది. దీంతో విశ్రాంతి పడి ఫస్టాఫ్ పూర్తవుతుంది.

3. ఫస్టాఫ్ లోనే సమస్యలు

    ఈ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో సమస్యలున్నాయి. మొదటి పదినిమిషాలు పూర్వ కథ తీసేస్తే, పైన చెప్పుకున్న బిగినింగ్ విభాగం ఇంటర్వెల్ వరకూ దాదాపు గంట సాగుతుంది. ఈ గంటలో పాత్రల పరిచయాల మొదటి 40 నిమిషాల్లో, 20 నిమిషాలు ప్రేమ ట్రాకే తీసుకుంటుంది. స్టార్ సినిమాల నుంచి దిగుమతి అయిన ఈ టెంప్లెట్ ప్రేమ ట్రాకు నుంచి నుంచి ఇంకా విముక్తి లభించడం లేదు ప్రేక్షకులకి. ఇంకెన్నిసార్లు హీరోయిన్ని ప్రేమలో పడేసే అవే హీరో చేష్టలు మొదలు పెట్టి చూపిస్తూ పోతారో తెలీదు. వీటిని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారిప్పుడు.

ఈవారం విడుదలైన అలిపిరికి అల్లంత దూరంలో నూ ఇదే అరిగిపోయిన టెంప్లెట్. సినిమా కేవలం ప్రేమ కథే అయితే వేరు, సినిమా ప్రేమ కథ కానప్పుడు ప్రేమ కథే అన్నట్టుగా ఫస్టాఫ్ లవ్ తో ఎలా నింపేస్తారో తెలీదు. ఆల్రెడీ ప్రేమలో వున్నట్టు హాఫ్ వేలో చూపిస్తే పోయేదానికి.

ఈ నెల తమిళ హిట్ లవ్ టుడే (బడ్జెట్ 5 కోట్లు- బాక్సాఫీసు 70 కోట్లు) లో ఇలాగే చూపించారు. ఆల్రెడీ ప్రేమలో వున్న హీరో హీరోయిన్లతోనే సినిమా ప్రారంభమవుతుంది. ఇది ప్రేమ కథే అయినా ఎలా ప్రేమలో పడ్డారో టెంప్లెట్ జోలికి పోకుండా దాన్ని కట్ చేసి- హాఫ్ వేలో ఆల్రెడీ ప్రేమలో వున్నట్టు చూపించేసి, కాన్షష్ గా సినిమాల్ని చూసే ప్రేక్షకుల్ని రక్షించాడు దర్శకుడు. 

ఇక 40 వ నిమిషంలో కూతురికి దెయ్యమావహించడంతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ప్రారంభమవుతుంది. ఈ కల్పన తప్పుగా  రివర్స్ చేసి చూపించారు. అంటే 40 వ నిమిషంలో కూతురికి దెయ్యంపట్టినట్టు ముందే చూపించేసి- తర్వాత డాక్టర్, పీర్ బాబా, తావీజు, ఆత్మ, మీర్ తాజ్ చావు, స్కూల్లో కూతురి ముక్కు నుంచి రక్తం, బ్రాస్లెట్, మసూదా పేరు, కూతురి భీకర రూపం వగైరా చూపించుకుంటూ పోయారు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రయోగం కోసం చేసి వున్నట్టయితే బెడిసి కొట్టింది.

ఎప్పుడైనా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అంచెలంచెలుగా చేసుకుపోతారు. హార్రర్ కైనా ఇంతే. దెయ్యం పట్టినట్టు చూపించాలంటే ముందు దాని సింప్టమ్స్ చూపించుకుంటూ వస్తారు. క్లాసిక్ ఎక్సార్సిస్ట్ లో తల్లికి బీరువాలో శబ్దాలు వినిపిస్తాయి. కూతురు తనకి లేని ఫ్రెండ్ గురించి చెప్తుంది. తర్వాత చర్చిలో మేరీమాత విగ్రహం పాడు చేసి కన్పిస్తుంది. ఆ తర్వాత తల్లి ఏర్పాటు చేసిన ఒక విందులో కూతురు మూత్రం పోసుకుంటుంది. కూతుర్ని మంచం మీద పడుకోబెడితే మంచం వూగిపోతుంది. చర్చి ఫాదర్ కి చనిపోయిన తన తల్లి వచ్చి వికృతంగా కన్పిస్తుంది. కూతురు వయోలెంట్ గా మారుతుంది. డాక్టర్ కి చూపిస్తే పాజిటివ్ రిపోర్టు వస్తుంది.

ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అంచెలంచెలుగా చేసుకొస్తూ- చివరిగా తల్లికి స్నేహితుడిగా వున్న ఒకడ్ని కూతురు కిటికీ లోంచి విసిరి చంపేయడంతో దెయ్యం పట్టిందన్న నిర్ధారణతో అప్పుడు సమస్యని ఏర్పాటు చేస్తారు. మసూద లో మనిషి మైండ్ రిసీవ్ చేసుకునే ఈ సహజ కథన ప్రక్రియని రివర్స్ చేసి - ముందు కూతురికి దెయ్యంపట్టినట్టు సమస్యని ఏర్పాటు చేసేసి- తర్వాత కారణాలు చూపించుకొచ్చారు. దీంతో బిగినింగ్ విభాగం చెదిరిపోయి ఫస్టాఫ్ విషయం లేక, కథే ప్రారంభం కాక - కథేమిటో అర్ధం గాకుండా పోయింది.

ఓపెనింగ్ బ్యాంగ్ కావచ్చు, పూర్వ కథ కావచ్చు - అక్కడ అర్ధోక్తిలో వదిలేసిన విషయాన్ని (హుక్ ని) ఇంటర్వెల్లో కనెక్ట్ చేసి ఇంటర్వెల్ బ్యాంగో మరోటో వేస్తే కథనం పాయింటుకొచ్చి అర్ధమవుతుంది. ఓపెనింగ్ ని ఇంటర్వెల్లో కనెక్ట్ చేయకుండా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో చెప్తామంటే అప్పటిదాకా కథేమిటో అర్ధం గాదు!

4. ఆర్డర్ సవరిస్తే థ్రిల్
    కూతురికి దెయ్యం పట్టినట్టు ముందు వేసిన సీను (40వ నిమిషం) ఇంటర్వెల్ కి ముందు వేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. 40 వ నిమిషం నుంచి సింప్టమ్స్ చూపించుకొస్తే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన శరీగ్గా వుంటుంది. బ్రాస్లెట్, ఎవరితో మాట్లాడక పోవడం, ముక్కు నుంచి రక్తం, వింత ప్రవర్తన, డాక్టర్, పీర్ బాబా, తావీజు తీసేయడం, మీర్ తాజ్ చావు, మసూదా పేరు, అప్పుడు కూతురికి దెయ్యంపట్టినట్టు దెయ్యం మాటలు (నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు’)... ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూపించి, వీటన్నిటి పర్యవసానంగా- పూర్వ కథలో దారుణ హత్యకి గురయిన యువతిని  ముందుకు తీసుకొచ్చి, ఇంటర్వెల్లో మసూదాబీ ప్రేతాత్మగా సమస్యని స్థాపిస్తే, ఆమె వార్ డిక్లేర్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ సృష్టిస్తే, సరైన వరస!

పై విధంగా ఆర్డర్ వుంటే ఓపెనింగ్ ఇంటర్వెల్ దగ్గర కనెక్ట్ అయి విషయం అర్ధమవుతుంది. కానీ ఇంటర్వెల్లో ఏం చూపించారు? ఎవరో ఫ్లాట్ యజమాని కొడుకు భీకరరూపంలో నాజియానే చూస్తే ఇంటర్వెల్. దీంతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ఏదో చేసుకొచ్చినా సమస్య ఎక్కడ ఏర్పాటయింది? సమస్య నాజియాతో కాదుగా? కథ ప్రకారం ఇంటర్వెల్లో ఏ సీను వేసి హార్రర్ ఎలిమెంటుకి ఎలివేషనివ్వాలి? నీలం ఫ్లాట్ యజమాని కొడుక్కి దెయ్యంలా నీలం కూతురే కన్పిస్తే అది ఎలివేషనా? ఇది కూడా ఇంకో రిపీట్ సీనే. రిపీట్ సీనే ఇంటర్వెల్లో వేసి టెన్షన్ గ్రాఫు పెంచగలరా? కథ కొచ్చి ఖలనాయికని దాస్తున్నాడెందుకు దర్శకుడు? కాన్ఫ్లిక్ట్ ఎవరితో? కూతురికి పట్టిన దెయ్యంతో. మరి ఆ మసూదాబీ దెయ్యాన్ని ఇప్పుడు తెర మీద ప్రత్యక్షం చేసి- కాన్ఫ్లిక్ట్ తో హార్రర్ కి ఎలివేషనిస్తూ ఇంటర్వెల్ వేయాలిగా? ఇంటర్వెల్లో అయినా కాన్ఫ్లిక్టే లేకపోతే ఎలా?

ఎక్సార్సిస్ట్ లో మొదట్లో మిస్టీరియస్ గా చూపించిన ఫుజుజు విగ్రహం లోని దుష్టాత్మే బాలికని ఆవహించిందన్న విషయం ఎక్కడా దాచలేదు. కథ కొచ్చి ఖలనాయకుడ్ని దాచలేదు. ఎండ్ సస్పెన్స్ చేయలేదు. శత్రువెవరో తెలిస్తే దానికి తగ్గ టెన్షన్ అనుభవిస్తాం, తెలియక పోతే బీపీ పడిపోయి పడుకుంటాం. ఇక దెయ్యమే వచ్చి లేపినా లేవం. సినిమా ప్రారంభంలో వేసిన 1989 హింసాత్మక ఘటనలు దేనికి జరుగుతున్నాయో చెప్పేయకుండా సస్పెన్స్ లో పెట్టేశారు. దీంతో మసూదాబీ కూడా తెలియకుండా పోయింది. ఈ సస్పెన్స్ ని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో విప్పడానికి అట్టి పెట్టుకున్నారు. కానీ ఈ సస్పెన్స్ ని విప్పాల్సింది సూచనా ప్రాయంగానైనా ఇంటర్వెల్లోనే- దుష్టాత్మగా మారిన మసూదాబీ పాత్రతోనే. అప్పుడే కథ అర్ధమవుతుంది. లేకపోతే ఏమీ అర్ధంగాక ఇంటర్వెల్ తేలిపోతుంది. అందుకని ఇంటర్వెల్లో మసూదాబీ ప్రేతం ఫుల్ రేంజిలో ప్రత్యక్షమైతే సమస్య ఏర్పాటయినట్టు. ప్లాట్ పాయింట్ వన్ వచ్చినట్టు. ప్రధాన పాత్రకి ఇప్పుడేం చేయాలో గోల్ ఏర్పాటై, కాన్ఫ్లిక్ట్ తో కథ ప్రారంభమైనట్టు.

కనుక సినిమాలో వున్నట్టుగా ఇంటర్వెల్లో అది బిగినింగ్ కి ప్లాట్ పాయింట్ వన్ కానప్పుడు, బిగినింగ్ ఫస్టాఫ్ లో ఇంకా ముగియనట్టే. అంటే సెకండాఫ్ లో కూడా బిగినింగ్ కొనసాగితే గానీ ప్లాట్ పాయింట్ వన్ రాదన్న మాట. ఇలా ఫస్టాఫ్ లో చేసిన పొరపాట్లకి స్ట్రక్చర్ చెదిరిపోయింది. కాన్షస్ -సబ్ కాన్షస్ -ఇగో మోడల్ తో వుండే స్క్రీన్ ప్లే అనే వ్రాతప్రతి వరస తప్పింది.

5. ట్రైలర్ మూమెంట్స్ మిస్

    ఈ కాన్ఫ్లిక్ట్ తో తలపడే ఇద్దరు ప్రధాన పాత్ర ధారులున్నారు- నీలం, గోపీ. ఎక్సార్సిస్ట్ లో ఇద్దరు చర్చి ఫాదర్లు ప్రధాన పాత్రధారులుగా వున్నట్టు. నీలం, గోపీల గోల్ కూతురికి దెయ్యం నుంచి విముక్తి కల్గించడం. అయితే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని ట్రైలర్ మూమెంట్స్ తో చూపించక పోవడంతో కూడా ఫస్టాఫ్ హార్రర్ థ్రిల్ లేకుండా పోయింది. ట్రైలర్ మూమెంట్స్ అంటే, ట్రైలర్ కోసం ఏ ఎంపిక చేసిన షాట్లు/ సీన్లు కట్ చేస్తారో అలాటి థ్రిల్లింగ్ - హార్రర్ విజువల్స్ కథలో వుండాలి.

ఇక ప్లాట్ డివైసుల నిర్వహణ కూడా సరిగా లేదు. కూతురికి తావీజు కట్టాక ఒక టీచరైన నీలం కూతుర్ని అబ్సర్వేషన్ లో వుంచకుండా, కూతురు తావీజు తీసేసిన విషయమే గమనించకుండా వుంటుంది. చేతికున్న బ్రాస్లెట్ గురించి అడిగినప్పుడు తావీజు లేని విషయం చూడదు. మొదట్లోనే కూతురు దెయ్యం పట్టి నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు అన్నప్పుడు, ఎవరు?’ అంటే వాడే అన్నప్పుడు - ఎవరి గురించి మాట్లాడుతోందని తీవ్రంగా ఆలోచించదు. తెలుసుకోవడానికి ప్రయత్నించదు. మంచం పక్కన మసూదాబీ అని రాసి వుంటే ఇదెవరు రాశారని కూడా అడగదు. ఇలా ప్లాట్ హోల్స్ వదుల్తూ పాత్రచిత్రణ చేయడం సరైంది కాదు.

అసలు మసూదాబీ అని వారు రాశారు? దెయ్యమే రాసి వుంటుంది. ఎందుకు రాసి వుంటుంది? తర్వాత అది పీర్ బాబా చూడాలనీ, చూసి తన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలనీ కథ నడవడం కోసం రాసి వుంటుందా? సిల్లీగా లేదూ? ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళడానికి లీడ్ కోసం ఇంతకంటే మంచి మార్గం దొరక లేదా?

రెండోది-  నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు అన్నప్పుడు, ఎవరు?’ అంటే వాడే అన్నప్పుడు -దెయ్యం తను రివెంజీతో వున్నట్టు చెప్పేసినట్టే. నాజియా తావీజు తీసేశాక, పూర్వ కథ క్యారక్టర్ మీర్ తాజ్, నాజియాని చూస్తున్నప్పుడు - దూరం నుంచి దెయ్యం చూస్తుంది. ఆమెని చూసి మీర్ తాజ్ రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. పూర్వ కథలో ఇతనే కదా తనని దారుణంగా చంపింది? ఇప్పుడతను చచ్చాక రివెంజీ తీరిపోయినట్టేగా? ఇంకెందుకుండాలి దెయ్యం? అంటే కథ అయిపోయినట్టేగా?

ఎవరో మీర్ తాజ్ వచ్చి నాజియాని ఎందుకలా చూశాడు? దెయ్యం తనని చంపడానికి సెటప్ కోసమేనా? ఇంటలిజెంట్ మేకింగ్ చేసినప్పుడు దానికి తగ్గ ఇంటలిజెంట్ రైటింగ్ కూడా అవసరమే. కథకకి అతకని హార్రర్ దృశ్యాలతో భయపెట్టాలని ప్రయత్నించడం సరైంది కాదు. అసలు దెయ్యమనే నమ్మకమే ఇల్లాజికల్. అలాగని దాంతో కథ కూడా ఇల్లాజికల్ గా వుండడం బావుండదు.
(మిగతా రేపు)

—సికిందర్ 

 

Sunday, November 27, 2022

1250 : రివ్యూ!


 (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యులర్ గా ఆర్టికల్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు మసూద రివ్యూ, రేపు స్క్రీన్ ప్లే సంగతులు అందుకోండి!)

రచన- దర్శకత్వం : సాయికిరణ్
తారాగణం : సంగీత, బాంధవీ శ్రీధర్, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, అఖిలా రామ్, శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్, సత్యం రాజేష్, తదితరులు.
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం బి. నగేష్ 
బ్యానర్ : స్వధర్మ్ ఎంటర్ టైమెంట్స్
నిర్మాత : ఎన్ రాహుల్ యాదవ్
విడుదల : నవంబర్ 18, 2022
***
          ళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే రెండు హిట్లు తీసిన నిర్మాత రాహుల్ యాదవ్ మూడో ప్రయత్నం మసూద హార్రర్ జానర్లో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు ముందు కొచ్చింది. హార్రర్ సినిమాలు చూసి భయపడే ప్రేక్షకులింకా వున్నారా అంటే లేరనే చెప్పేంతగా హార్రర్ కామెడీలు హాస్యమాడాయి. ఈ పరిస్థితిలో ఒక సీరియస్ హార్రర్ తీసేందుకు సాహసం కావాలి. మసూద తీసిన కొత్త దర్శకుడు ఈ సాహసం చేశాడు. మసూద చూసిన కొందరు వర్ధమాన దర్శకులు నిజంగా భయపడ్డామని కితాబు  నిచ్చారు. మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసేలా ఈ హార్రర్ అంత భయపెట్టించేలా వుందా? ఈ విషయం పరిశీలిద్దాం...

కథ

హైదరాబాద్ లో లో నీలం (సంగీత) ఒక సైన్స్ టీచర్. డబ్బుల కోసం వేధించే భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌) కి దూరంగా వుంటూ కూతురు నాజియా(బాంధవి శ్రీదర్) ని చదివించుకుంటూ వుంటుంది. పక్క ఫ్లాట్ లో వుండే సాఫ్ట్ వేర్ గోపీ (తిరువీర్) ఈ తల్లీకూతుళ్ళకి సహాయంగా వుంటాడు. ఆఫీసులో మినీ (కావ్యా కళ్యాణ్ రామ్) ని ప్రేమిస్తాడు. ఒక రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంది. దెయ్యం ఆవహించినట్టు అన్పించే సరికి భయపడి హాస్పిటల్ కి తీసికెళ్తారు నీలం, గోపీ. నీలం కి ఎవరో పీర్ బాబా గురించి చెప్పడంతో సైన్స్ టీచర్ అయిన తను, తాంత్రిక విధ్యల్ని నమ్మాల్సి వచ్చి పీర్ బాబా(శుభలేఖ సుధాకర్) కి కూతుర్ని చూపిస్తుంది. నాజియాని మసూద అనే ప్రేతాత్మ ఆవహించినట్టు పసిగట్టిన పీర్ బాబా- మసూద ఎవరో తెలుసుకోమని గోపీని పురమాయిస్తాడు. గోపీ చిత్తూరు దాకా వెళ్ళి మసూద అలియాస్ మసూదాబీ గురించి ఆరా తీస్తే, కొన్ని భయంకర నిజాలు తెలుస్తాయి.

ఎవరీ మసూదాబీ? చిత్తూరు జిల్లాలోని ఆ గ్రామంలో కొచ్చి ఎందుకు మీర్ తాజ్ అనే వ్యవసాయ దారు ఉమ్మడి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది? ఆమెకి హైదరాబాద్ లో నాజియా కేం సంబంధం? ఆమె ప్రేతాత్మని తుదముట్టించేందుకు పీర్ బాబాతో, నీలంతో  కలిసి గోపీ చేసిన ప్రాణాంతక సాహసాలేమిటి? ఇవన్నీ మిగతా కథలో తెలుసుకోవచ్చు. 

ఎలావుంది కథ

హార్రర్ సినిమాలంటే భయంపోయేలా హార్రర్ కామెడీలొచ్చి హాస్యమాడాయి ఇంత కాలం. మళ్ళీ సీరియస్ హార్రర్ తిరిగి వచ్చి భయపెట్టేందుకు థియేటర్స్ లో రెడీగా వుంది. ముస్లిం చేతబడి కథ కావడంతో పూర్తిగా కొత్తదనాన్ని ఫీలయ్యేలా చేసే మసూదకొత్త దర్శకుడే తీశాడా అన్నట్టుగా వుంది టెక్నికల్ గానూ. దీన్ని చూసి భయపడినట్టు చెప్పుకున్న వర్ధమాన దర్శకుల మాట నిజమే. మళ్ళీ ఇరవై ఏళ్ళ క్రితం మహేష్ భట్ తీసిన హిందీ రాజ్ (రహస్యం) సూపర్ హిట్ సీరియస్ హార్రర్ ని గుర్తు చేసేలా వున్న మసూద –కథాకథనాల రీత్యా  ముస్లిం పాత్రలతో పూర్తి స్థాయి చేతబడి నేపథ్యంతో కొత్తదనాన్ని సంతరించుకోవడంతో-  దీనికి పానిండియాకి వెళ్ళగల అర్హతలు కూడా వుండొచ్చు.

ఐతే నిడివి అతిగా వుంది రెండు గంటలా 40 నిమిషాలూ. ఫస్టాఫ్ గంటకే ముగించినా సెకండాఫ్ గంటన్నరకి పైగా లాగారు. ఫస్టాఫ్ నీలం- నాజియా- గోపీ- మినీల సాధారణ జీవితం, ఇందులో గోపీ- మినీల లవ్ ట్రాక్, తర్వాత నాజియాకి ప్రేతాత్మ ఆవహించడంతో కథ మొదలవుతుంది. మధ్యలో లవ్ ట్రాక్ అనేది అంతగా బావుండదు. ఇక ఫ్రేతాత్మ ఆవహించాక కూడా కథ ఇంకో మలుపు తీసుకోకుండా ఇంటర్వెల్ వరకూ కేవలం ప్రేతాత్మతో భయపెట్టే సీన్లే రిపీటవుతూంటాయి. ఇంటర్వెల్లో కూడా ప్రేతాత్మ భయపెట్టే ఇంకో రిపీట్ సీనుతోనే సాదాగా వుండి తేలిపోతుంది.

సెకండాఫ్ ప్రారంభంలో కథ ఇంకో మలుపు తీసుకుని, మసూదాబీ హార్రర్ ఫ్లాష్ బ్యాక్ తో భయపెట్టడం మొదలెడుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిత్తూరు జిల్లా గ్రామంలో మంత్రగత్తె మసూదాబీ చేతబడి ఘోరాలు ఇదివరకు వచ్చిన సినిమాలకి భిన్నంగా, బీభత్సంగా వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ తర్వాత పీర్ బాబా -నీలం, గోపీలకి ఒక చాదర్ ఇచ్చి, మసూదాబీ కంకాళం మీద కప్పమనే విరుగుడు మంత్రంతో సుదీర్ఘ క్లయిమాక్స్ మొదలవుతుంది.

ఈ క్లయిమాక్సే హద్దులు దాటి సాగుతూ సాగిపోతూ వుంటుంది. బీభత్స భయానక రసం అదేపనిగా ఎక్కువైపోతే భయపెట్టడం పోయి విసుగుపుట్టించే ప్రమాదం కూడా వుంది. నటనలు, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత ప్రభావశీలంగా వుండడంతో ఈ ప్రమాదం కాస్త తప్పిందనుకోవాలి. అయినా ఎడిట్ చేసి 20 నిమిషాలు తొలగిస్తే బెటర్.

నటనలు- సాంకేతికాలు

హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన సంగీత -తల్లి పాత్రలో నటన, ఎక్స్ ప్రెషన్స్, కూతురి కోసం స్ట్రగుల్, పక్క ఫ్లాట్ గోపీతో బాండింగ్, అతడితో కలిసి చిత్తూరు అడవుల్లో నైట్ పూట క్లయిమాక్స్- ప్రతీ చోటా దృష్టి నాకర్షిస్తుంది.

కూతురుగా బాంధవీ శ్రీధర్ ప్రేతాత్మ ఆవహించిన హార్రర్ సీన్లు, క్లయిమాక్స్ లో అందర్నీ చంపుతూ చేసే బీభత్సం టెర్రిఫిక్ గా నటించింది. గోపీగా తిరువీర్ అమాయకుడిగా, భయస్థుడిగా ఫస్టాఫ్ లో పాత్ర అంతగా లేకపోయినా- సెకండాఫ్ లో కథని తానే డ్రైవ్ చేసే యాక్టివ్ పాత్రగా మారిపోతాడు. మాస్ హీరోయిజాలు లేని సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇంకా చిత్తూరు జిల్లా గ్రామంలో ఉమ్మడి కుటుంబంలోని ముస్లిం పాత్రలూ, హైదరాబాద్ లో పీర్ బాబా హవేలీ లోని ముస్లిం పాత్రలూ తెలుగు సినిమాకి కొత్త బ్యాక్ డ్రాప్ నిస్తాయి.

ఇక టక్ చేసుకుని వుండే మోడరన్ పీర్ బాబాగా శుభలేఖ సుధాకర్, అసిస్టెంట్ అల్లావుద్దీన్ గా సత్యం రాజేష్ కూడా పాత్రల్లో బలం లేక సాధారణంగా కన్పిస్తారు. అయితే క్లయిమాక్స్ లో పీర్ బాబా ప్రత్యక్షంగా పాల్గొనకుండా చాదర్ ఇచ్చి నీలం, గోపీలని పంపేసి వూరుకోవడం, ఎక్కడో నమాజు చేయడం ద్వారా ప్రేతాత్మని అంతమొందించా లనుకోవడం ఏ మాత్రం కుదర్లేదు. నీలం- గోపీలే ప్రాణాలకి తెగించి చాదర్ కప్పి ప్రేతాత్మని అంతమొందిస్తారు.

ఇక మసూదాబీగా నటించిన అఖిలారామ్ కి అందరి కంటే ఎక్కువ ప్రశంసలు దక్కుతాయి. దెయ్యంగా మొహంలో చూపించిన భావాలు ల్యాండ్ మార్క్ ఎక్స్ ప్రెషన్స్ గా నిలుస్తాయి. అయితే బురఖాలో వున్నప్పుడు డూప్ ని వాడినట్టు ఎత్తుగా, బలిష్టంగా కన్పిస్తుంది. పది మందిని ఫైట్ లో విరగదీస్తుంది కూడా. అఖిలారామ్ ని చూస్తే ఈ రేంజి ఫైట్ ఆమెకి సాధ్యం కాదు. అసలు బురఖాలో వున్నది మేల్ ఆర్టిస్టో- లేదా ఫైటరో అయివుండాలి.

చవకబారు తనం లేకుండా రిచ్ విజువల్స్, టైట్ గ్రాఫిక్స్, స్లిక్ ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ తో సౌండ్ డిజైన్, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. అయితే 80 శాతం షూట్ చేశాక, నచ్చక రీషూట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే స్క్రిప్టు కూడా మార్చుకుని వుండాల్సింది. ఇది మామూలు సీరియస్ హార్రర్ కాదు- హార్డ్ హిట్టింగ్ హార్డ్ కోర్ హార్రర్. చావులు, రక్తాలు, ఆర్తనాదాలు, బీభత్సం, జుగుప్సా యదేచ్ఛగా చూపించేశాడు కొత్త దర్శకుడు సాయి కిరణ్. తొలిసారిగా ముస్లిం చేతబడి నేపథ్యమనేది ఈ మూవీ యూఎస్పీ అనాలి.

—సికిందర్

Friday, November 18, 2022

1249 : రివ్యూ!

రచన -దర్శకత్వం : రాజ్ విరాట్
తారాగణం : నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరీటి దామరాజు, రఘు కుంచె తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ్
నిర్మాతలు: ప్రవీణ్, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి
విడుదల : నవంబర్ 4, 2022
***
        నందు విజయ్ కృష్ణ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. సహాయ పాత్రలు కూడా నటిస్తున్నాడు. తన దగ్గర ఏ పాత్రయినా నటించగల టాలెంట్ వుంది గానీ మంచి అవకాశాలు రావడం లేదు. ఇటీవల సవారీ లో హీరోగా నటించాడు గానీ అది మరీ బి గ్రేడ్ సినిమాలాగా వుంది. తిరిగి ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ వచ్చాడు. ఇందులో యాంకర్ రేష్మీ గౌతమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన రాజ్ విరాట్ కొత్త దర్శకుడు. ఈ ముగ్గురూ కలిసి టైటిల్ తో పోటీపడుతూ నిజంగా బ్లాక్ బస్టర్ బొమ్మ తీశారా లేదా చూద్దాం...

కథ

మత్స్యకారుడైన పోతురాజు (విజయ్ కృష్ణ) దర్శకుదు పూరీ జగన్నాథ్ వీరాభిమాని. కథ రాసి పూరీ జగన్నాథ్ చేత సినిమా తీయించాలని పగటి కలలు కంటూ వుంటాడు. ఆ కథ పట్టుకుని పోతూ యాక్సిడెంట్ కి గురవుతాడు. ఆ కథ ఓ నిర్మాత చేతిలో పడుతుంది. అతను చదువుతాడు. అది పోతురాజు కథ.

పోతురాజు వూళ్ళో నేస్తాలని వేసుకుని వీధి పోరాటాలు చేస్తూ ఆవారాగా తిరుగుతూంటాడు. నయాపైసా కట్నం లేకుండా ప్రేమిస్తున్న వాడితో చెల్లెలి పెళ్ళి జరిపిస్తాడు. వాణి (రేష్మీ గౌతమ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈమెకి ఎవరైనా కొట్టుకుంటూ వుంటే చూసి ఆనందించడం సరదా. ఈమె కోసం జనాలని కొట్టడం ప్రారంభిస్తాడు. ఇంతలో ఒకడు డాన్సింగ్ స్కిల్స్ చూపించే సరికి వాడి వెంట పడుతుంది వాణి. వాడి సంగతి చూస్తాడు. మరింతలో గతంలో తన తండ్రి చనిపోయిన కారణం తెలుస్తుంది పోతురాజుకి. దీంతో తండ్రిని చంపిన వాళ్ళ మీద పగబడతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ

అర్ధం పర్ధం లేని కథ. బొమ్మ బ్లాక్ బస్టర్ కాదుకదా అట్టర్ ఫ్లాప్ అవడానికి కూడా కొన్ని అర్హతలుంటాయి. షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకులతో ఇదే సమస్య. రెండు గంటల నిడివిగల కథ చేసుకోవడానికి యాక్ట్స్ తెలీవు. పైగా ఈ కొత్త దర్శకుడు సినిమా అనగానే ఇంకా అరిగిపోయిన మూస ఫార్ములా కథనే  తయారు చేసుకున్నాడు. అందర్నీ కొట్టే ఆవారా హీరో, నిస్సహాయ తండ్రి, చెల్లెలి పెళ్ళి, హీరోయిన్ తో లవ్ ట్రాక్, తండ్రి మరణానికి రివెంజ్... ఇదీ వరస!

ఇంకా విచిత్రమేమిటంటే, ఆవారా హీరో రాసుకున్న ఈ ఆత్మకథ నిర్మాతకి నచ్చి  రికమెండ్ చేయడానికి పూరీ జగన్నాథ్ దగ్గరికి వెళ్ళడం! అయితే పూరీ జగన్నాథ్ బ్రతికిపోయాడు. నిర్మాత ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళగానే, ఆయన పర్మిషన్ ఇవ్వలేదేమో, అందుకని కట్ చేసి శుభం వేసేశాడు దర్శకుడు. 

కథ కోసం క్రియేట్ చేసిన రూరల్ వాతావరణం, మత్స్యకారుల జీవితం, సంస్కృతి, కుల దైవాలు, వీటి తాలూకు సంగీతం...ఇవి మాత్రం చక్కగా చిత్రీకరించాడు. ఇంకోటేమిటంటే దృశ్యాల టేకింగ్ కూడా రెగ్యులర్ సినిమాల్లాగా గాకుండా, నోయర్ జానర్ లో ఆఫ్ బీట్ సినిమా శైలిలో చేశాడు. తనకి ఏదో కొత్త టెక్నిక్ ని ఫాలో అవ్వాలన్న ఉత్సాహముంది. అయితే మోడరన్ టెక్నిక్ కి పాత చింతకాయ కథ వల్ల ఫలితం తారుమారైంది. .

కొత్త దర్శకులు కథ దగ్గర  విఫలమవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కథని చాలాకాలం శ్రమించి తయారు చేసుకుని వుంటారు. ఆ కథే వాళ్ళ కెరీర్ కి పునాది వేస్తుందనే నమ్మకంతో కృషి చేస్తారు. అయినా ఆ కథతో తీసిన సినిమా ఫ్లాపయ్యిందంటే కథా కథనాల గురించి చాలా బేసిక్స్ తెలియకుండానే కృషి చేశారన్నమాట. మొదటి సినిమాతో ఫ్లాపయిన దర్శకుడు ఇక ముందుకు కొనసాగడం కల్ల. రాబర్ట్ మెక్ కీ అన్నట్టు, తాననుకున్న కథే కథనుకుంటే దటీజ్ షిట్!

ఒకప్పుడు యూత్ సినిమాల ట్రెండ్ లో మిడిల్ మటాష్ అనే కొత్త రోగంతో సినిమాలు చూశాం. అంటే క్లయిమాక్స్ వరకూ కథే ప్రారంభం కాకుండా ఒకటే కామెడీలతో బిగినింగే నడిచి, మిడిల్ మాయమైపోతుంది. క్లయిమాక్స్ దగ్గర అప్పుడు మిడిల్ ప్రారంభమై- అంటే కథ ప్రారంభమై- ప్రేమలో ఏదో సిల్లీ ప్రాబ్లంతో ఐదు పదినిమిషాలు సంఘర్షణ జరిగి- ఆ కాస్తా మిడిల్ ముగిసిపోయి- ఎండ్ తో పరిష్కారమై పోతుంది సమస్య. ఇందుకే దీన్ని మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే- అంటే కథ లేని స్క్రీన్ ప్లే అనాలి.
        
ఈ కొత్త దర్శకుడితో ఇదే జరిగి వుండాలి. బహుశా ఆనాడు యూత్ సినిమాలు చూస్తూ పెరిగిన జీవితం. ఆ ప్రభావంతో ఈ మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే. ఆ నాటి యూత్ సినిమాల చీడ పీడ కథనాలు నేటికీ దర్శకులవుతున్న వాళ్ళని చెడగొడుతున్నాయి. ఈ విషయం అనేకసార్లు బ్లాగులో ప్రస్తావించుకున్నా- ఇంకా ఇలాగే సినిమాలు తీస్తున్నారు. చాలా మంచి విషయం. ఇలాగే తీసి నిర్మాతలకి బుద్ధి చెప్పాలి.

ఇందులో ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ వరకూ హీరో అల్లరి, ఫైట్లు, ప్రేమలూ ఇవే వుంటాయి కథే ప్రారంభం కాకుండా. సెకండాఫ్ సగం గడిచాక తండ్రి పాత్రతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమై, హత్య, రివెంజీ వీటితో ముగిసిపోతుంది. అంటే మొదట్నుంచీ ఈ కథనం దేని గురించో తెలియడానికి అకస్మాత్తుగా రివెంజీ పాయింటు వచ్చే ప్లాట్ పాయింట్ టూ వరకూ ఆగాలి. ఇదీ కథ అని ఇప్పుడు తెలుస్తుంది. ఈ కథ ప్రారంభించడానికి గంటన్నరకి పైగా బిగినింగ్ ని సాగదీశాడు. ఇక తండ్రి మరణానికి ఒక పూర్తి విషాద గీతమే వేశాడంటే ఏ కాలంలో వున్నాడో అర్ధం జేసుకోవచ్చు.

నటనలు-సాంకేతికాలు

రఫ్ ఆవారా పాత్రలో విజయ్ కృష్ణ నటన చూస్తే ఏ పాత్రయినా నటించేయగలడనేది స్పష్టమవుతుంది. అయితే ఆవారా కదాని మరీ ఓవరాక్షన్ కూడా చేశాడు. ఈ పాత్ర పూరీ జగన్నాథ్ అభిమాని అయినప్పుడు, పూరీ జగన్నాథ్ తీసిన సినిమాల్లో వివిధ హీరోల యాక్టింగ్ ని ఇమిటేట్ చేసినా బావుండేది వినోదానికి.

విషయాల్ని తేలికగా తీసుకుని ఎంజాయ్ చేసే పాత్రలో రేష్మీ గౌతమ్ మంచి ఈజ్ తో నటించింది. తన వల్ల సీన్లకి గ్లామర్ వచ్చింది. ఇంకా ఒకరిద్దరు తప్ప నటీనటులందరూ కొత్త వాళ్ళే. అందరూ రూరల్ శ్రామిక వర్గ పాత్రల్ని సహజంగా నటించేశారు.

పైన చెప్పుకున్నట్టు, కంటెంట్ లేకపోయినా టెక్నికల్ గా ప్రయోగం చేయాలన్న ప్రయత్నం వరకూ సఫలమైంది. ప్రశాంత్ విహారి సంగీతం, సుజాతా సిద్ధార్థ్ ఛాయాగ్రహణం, ఎడిటింగ్, యాక్షన్ సీన్స్ వగైరా కొత్తదనాన్ని ప్రదర్శించాయి. అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడానికి ఇవి చాలవు. సినిమాలోనే నిర్మాత పాత్ర చేత దర్శకుడు తనే చెప్పించినట్టు- కథ -కథలా అన్పించే బలమైన కథ కావాలి!

—సికిందర్