రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 5, 2024

1396 : సందేహాలు- సమాధానాలు

 Q : ‘దొరసానిరివ్యూలో మీరు తెలంగాణా సినిమా అంటే ఇంకా ఆర్ట్ సినిమా కాదన్నారు. మరెలా వుండాలి? వివరించగలరు.
మకరందం, AD
A : ముందు తెలుగు సినిమా దర్శకుడో రచయితో కావాలనుకుంటే 1910 నుంచీ కనీసం తెలుగు సినిమా చరిత్ర విధిగా చదువుకుని రావాలి. సినిమా చరిత్రలో నిర్మాణాల పరంగా ఎక్కడెక్కడ  ఏమేం జరిగాయి,  పరిణామాలూ పర్యవసానాలూ వాటి పరిష్కారాలూ ఏమేం చోటు చేసుకున్నాయో తెలుసుకుని వుండాలి. ఇండియాలో వుంటూ ఇండియా చరిత్ర తెలియక పోవడం ఎలాటిదో, సినిమాల్లో వుంటూ సినిమా చరిత్ర తెలియక పోవడం అలాటిది. కనీసం మనం ఓ కంపెనీలో చేరాలన్నా దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని గానీ చేరం. సినిమాల్లో చేరాలంటే మాత్రం ఏమీ తెలుసుకోకుండా రెక్కలు కట్టుకుని వాలిపోవడమే.   

ఆర్ట్ సినిమాల చరిత్ర గురించి దొరసానిరివ్యూలోనే రాసి ఇలా ఇప్పుడెందుకు తీయకూడదో చెప్పాం. ఇంకా వివరాలు కావాలంటే  ప్రాంతీయ సినిమాల గురించిన వ్యాసాలున్నాయి : ఈలింక్ క్లిక్ చేసి సంచిక డాట్ కాం లో సినీ విశ్లేషణశీర్షిక లోకి వెళ్ళండి. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ సినిమాలు ఎలా మార్పు చెందాయో తెలుస్తుంది. తెలుసుకున్నాక తెలంగాణా ప్రాంతీయ సినిమా ఎలా వుండాలో మీకో అవగాహన ఏర్పడుతుంది. ఆర్ట్ సినిమాలు దేశవ్యాప్తంగా 1980 లలోనే భూస్వామ్య వ్యవస్థతో బాటే అంతరించిపోయి, ఒక దశాబ్దం తర్వాత దాని కొత్త రూపాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ తెలంగాణా సినిమా అంటే ఈ తరం మేకర్లు కూడా ఇంకా కాలగర్భంలో కలిసిపోయిన ఆర్ట్ సినిమాలనే దగ్గరే ఇరుక్కుపోయి దెబ్బ తింటున్నారు - చరిత్ర పుటలు తిరగేయక!

Q : నాదొక కఠిన సమస్య. జవాబు దొరకడం లేదు. కథలో నేను చెప్పాలనుకుంటున్న పాయింటు ఎప్పుడు స్పష్టం చేయాలి? ఇంటర్వెల్ ముందా, ఇంటర్వెల్ తర్వాతా? ముందు చెప్తే ఏం జరుగుతుంది? తర్వాత చెప్తే ఏం జరుగుతుంది? ఈ సమస్యని తీర్చగలరు.
 ఒక రచయిత
 A : స్క్రీన్ ప్లే చలన ప్రక్రియలో స్టోరీ పాయింటు (ప్లాట్ పాయింట్ వన్) ఏ టైంలో చెప్తే ఆ టైముకి కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ లో ఏదో టైంలో కాకుండా ఇంటర్వెల్ తర్వాత చెప్పి కథ ప్రారంభిస్తే, ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధంగాదు. ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధంగాకపోతే మంచిదా కాదా ఆలోచించుకోండి. దాన్నిబట్టి కథ చేయండి. మీరు స్ట్రక్చర్ లో కథ ఆలోచిస్తే, సినిమా శ్రేయస్సు దృష్ట్యా ఇంటర్వెల్ లోపే కథ ప్రారంభిస్తారు. అసలు కథ ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించడానికి కథకుడెవరు? కథ అతడి సొత్తు కాదు, ప్రధాన పాత్ర సొత్తు, డైరీ. దాని డైరీ అది రాసుకోకుండా ఇంకెవరు రాస్తారు? కాబట్టి కథని పట్టుకుని ప్రధాన పాత్రని నడపడంగా గాకుండా, ప్రధాన పాత్రని పట్టుకుని అది నడిపే కథతో సాగిపోవాలి. ఎప్పుడేం చేయాలో ప్రధాన పాత్రకి తెలిసినంతగా కథకుడికి తెలియదు. ప్రధానపాత్ర ఆటోమేటిగ్గా స్ట్రక్చర్లో ప్రయాణిస్తుంది. కథకుడు స్ట్రక్చర్ వదిలేసి కథతో క్రియేటివిటీలు చేసుకుంటూ, కథ ప్రారంభించకుండా మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంటాడు. కథ ప్రారంభించాలంటే ఫస్టాఫ్ అరగంట టైమ్ మంచి ముహూర్తం.

Q :   నేనొక ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. అయితే మీరు తరచూ యాక్టివ్ క్యారక్టర్పాసివ్ క్యారక్టర్ అని రాస్తుంటారు. యాక్టింగ్ కోర్సులో వీటి గురించి చెప్పడం లేదు. రేపు నాలాంటి నటులు పాత్రల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాసివ్ క్యారక్టర్స్ తో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటారు. నాకు భయంగా వుంది. రేపు నేను నటిస్తే నా సినిమాలు కూడా ఫ్లాపవుతాయాలేకపోతే నటుడిగా ఇదంతా నాకవసరం లేదంటారాడైరెక్టర్ చెప్పినట్టు చేయాలంటారాదయచేసి నా సందేహాలు తీర్చగలరు.
ఆర్ జె పియాక్టింగ్ విద్యార్థి
A :    ఇనిస్టిట్యూట్స్ లో యాక్టివ్పాసివ్ పాత్రలు నేర్పుతారు. పాసివ్ పాత్రలెందుకంటే ట్రాజడీల కవసరం కాబట్టి. రియలిస్టిక్- అన్ రియలిస్టిక్ పాత్రల నటన కూడా నేర్పుతారు. అయితే థియరీ నేర్చుకోవడం వేరుప్రాక్టికల్ గా కథ వినేప్పుడు అది యాక్టివా పాసివా గుర్తించడం వేరు. ఏ ఏ లక్షణాలు యాక్టివ్ కుంటాయిఏ ఏ లక్షణాలు పాసివ్ కుంటాయి అదనంగా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివి తెలుసుకోండి. విరివిగా సినిమాలు చూసి గుర్తించండి. సినిమాల్లో ప్రధాన పాత్రల్నే కాదుఇతర పాత్రల్ని కూడా పరిశీలించండి. సహాయ పాత్రలు పాసివ్ గా కూడా వుండొచ్చు. నష్టం లేదు. సినిమా ప్రధాన పాత్రదే అవుతుంది కాబట్టి అది యాక్టివ్ గానే వుందా తెలుసుకోండి. కథ ట్రాజడీ అయితే పాసివ్ గా వుండడాన్ని గమనించండి. కమర్షియల్ సినిమా అన్నాక హీరోయిన్విలన్ పాత్రలు కూడా యాక్టివ్ గానే వుండాల్సి వుంటుంది.
        
మీరు భవిష్యత్తులో హీరో అయితేకథ వినేప్పుడు ఆ కథ ట్రాజడీ కాకపోతేపాత్ర యాక్టివ్ పాత్రేనా తెలియడం అవసరం. ‘గీత గోవిందం’ లో హీరో పాసివ్ క్యారక్టరే కానీ స్క్రీన్ ప్లే వల్ల అది హిట్టయిందని ఒక ప్రముఖ ఇనిస్టిట్యూట్ సీనియర్ ప్రిన్సిపాల్ చెప్తూంటారు. ఇలా అన్నిసార్లూ జరగక పోవచ్చు. రిస్కు తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. అయితే ఇనిస్టిట్యూట్స్ లో ఏ పాత్ర ఎలా నటించాలో నేర్పుతారే తప్పఏ పాత్ర ఒప్పుకుని సినిమాలో నటించాలో అది నటుల ఛాయిస్సే.
        
మీరు సహాయ పాత్రలు చేయాల్సి వస్తే యాక్టివా పాసివా ప్రశ్న వుండదు. హీరోనే అవాలనుకుంటే యాక్టివ్ పాత్ర చిత్రణల్ని బాగా స్టడీ చేసుకోండి. రియలిస్టిక్ సినిమాలు ఆర్ట్ సినిమాలకి దగ్గరగా వుంటాయి. ఆర్ట్ సినిమాల్లో హీరో సర్వసాధారణంగా పాసివే. కానీ ఈ రోజుల్లో కమర్షియల్ గా తీయాల్సిన రియలిస్టిక్ సినిమాల్లో యాక్టివ్ గా వుండాల్సిందే. మీరు యాక్టింగ్ కోర్సు చేస్తూనేబయట కథలు వింటూండే ఏర్పాటు చేసుకుంటే ఇప్పట్నుంచే ప్రాక్టీసు అవుతుంది. కథలు వింటూకొత్తాపాతా సినిమాలు చూస్తూ అనుభవం సంపాదించుకోండి. ఈ సందర్భంగా ప్రసిద్ధ యాక్టింగ్ టీచర్ ఉటా హేగెన్ రాసిన ‘9 క్వశ్చన్స్’ అన్న పుస్తకం మీకు పనికి రావచ్చు. కొని చదవండి. పీడీఎఫ్ కూడా అందుబాటులో వుంది. ఆల్ ది బెస్ట్.

Q : మీ‌ బ్లాగు మొదటి సారి నిన్ననే చూసాను. నాదొక సందేహం. కథ చేస్తున్నపుడు కథలో లోటు పాట్లు అనేవి ఎలా తెలుస్తాయివివరించ గలరు. మంచి పుస్తకం సజెస్ట్ చేయగలరు.
ణి కుమార్, రచయిత
A :  రైటర్ అవాలనుకుప్పుడు ముందు రైటింగ్ నేర్చుకోవడం మీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టాలి. కథలు తర్వాత ఆలోచించ వచ్చు. కథలే ఆలోచిస్తే వాటినెలా రాయాలో తెలియదు. ఎలా రాయాలో నేర్చుకుంటే కథ ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. సిడ్ ఫీల్డ్ పుస్తకం కొనుక్కున్నానన్నారు. బేసిక్స్ నేర్చుకోవడానికి అదొక్కటి చాలు. జోసఫ్ క్యాంప్ బెల్ భారీ గ్రంథం ఎందుకు కొన్నారు. అది హయ్యర్ స్టడీస్. బేసిక్సే నేర్చుకోకుండా హయ్యర్ స్టడీస్ దేనికి. ఏమర్ధమవుతుందని. ఏది పడితే అది కొనకండి. హాయిగా సిడ్ ఫీల్డ్ పుస్తకం ముందు పెట్టుకుని, 'శివసినిమా చూస్తూ స్ట్రక్చర్ ని స్టడీ చేయండి చాలు. ఒక ఆర్నెల్ల పాటు దీని మీదే వుండండి. కథలు ఆలోచించకండి. స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత కథలు రాయడం నేర్చుకోవచ్చు. పుస్తకాలు ఇంకేమీ చదవక్కర్లేదుఉన్నమతి పోతుంది. ఆర్ట్ ఫీల్డ్ అలాటిది. నాలెడ్జి ఎక్కువైపోతే ఎవరికీ అర్ధంగాని మేధావులై పోయి ఎవరికీ అర్ధం గాని కథలు చెప్తారు. ఎంత చదివి నేర్చుకున్నా ఎవరైనా దర్శకుడు/రచయిత దగ్గర పనిచేస్తేనే ప్రాక్టికల్ నాలెడ్జి అబ్బుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

Q :   ఒక ఐడియా అనుకొని దాన్ని కథగా మలచాలి అనుకున్నప్పుడు అందుకోసం ఏమైనా మినిమం టైం పీరియడ్ పెట్టుకోవాలాలేక ఐడియా మీద ఎక్కువ రోజులు పని చేయాలాఎందుకంటే ఒక్కోసారి ఎన్నిరోజులు ఆలోచించినా కథ రెడీ అవదు. అప్పుడు అరే ఈ ఐడియా మిస్ అవుతున్నామే అనుకుంటాం. ఒక్కోసారి ఐడియా బాగున్నా ఆ సమయానికి మనం కథ చేయలేకపోతాం. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలిదీని గురించి వివరించగలరు.
వీడియార్అసోసియేట్
A : పైవొక ప్రశ్నకి చెప్పిన విధంగాఐడియా (స్టోరీ పాయింటు) నిర్దుష్టంగా కుదిరే వరకూ ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కుస్తీ పట్టాల్సిందే. ఐడియాగా కుదరనిది కథగా కుదరదు. బిందువుగా తెలియనిది సింధువుగా తెలియదు. ఎన్ని రోజులాలోచించినా కథ రెడీ అవడం లేదంటే ముందుగా ఐడియాని క్షుణ్ణంగా ఆలోచించక పోవడం వల్లే. ఐడియా ఆధారంగా బిగినింగ్ మిడిల్ ఎండ్ లతో సుస్పష్టమైన 20 పేజీల ( రైటింగ్ లో 50 పేజీలు) సినాప్సిస్ సిధ్ధం చేసుకోక పోవడం వల్లే. చేసే పని సిస్టమాటికల్ గా చేస్తే అయోమయం వుండదు.

Q :  నాకు ఒకచోట అవకాశముంది. కానీ కథ చేస్తూంటే మనసులో చూసిన రకరకాల సినిమాలన్నీ మెదులుతున్నాయి. ఆ సీన్లు, యాక్షన్, కామెడీలు గుర్తుకు వస్తోంటే రాయలేక పోతున్నాను. అలా నేను రాయగలనా? వాటిని బట్టి నా కథ మారిపోతుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. నా సమస్యకి పరిష్కారం సూచించగలరు. నా సమస్య నా అవుట్ పుట్ ని దెబ్బతీస్తోంది.
విఎల్ ఏ, అసోసియేట్ 
A :    చూసిన సినిమాలు మీరు రాయాల్సిన సినిమాలకి ఇన్పుట్స్ గా మీ మస్తిష్కంలో మెదులుతూంటే, మీ అవుట్ పుట్ దెబ్బతినక ఏమవుతుంది. ఈ సమస్య చాలా మందితో వుంటుంది. కథ రాస్తూంటే చూసిన సినిమాలన్నీ గుర్తుకు రావడం. మైండ్ రెండు భాగాలుగా వుంటుంది- హేపీ మైండ్, నాటీ మైండ్. రోజంతా మైండ్ లో 60 వేల పై చిలుకు థాట్స్ వస్తూంటాయి. వీటిలో 80 శాతం నెగటివ్ థాట్స్ అయితే, 20 శాతమే పాజిటివ్ థాట్స్ వుంటాయి. ఈ పాజిటివ్ థాట్స్ తో వుండేది హేపీ మైండ్ అయితే, నెగటివ్ థాట్స్ తో వుండేది నాటీ మైండ్. నెగెటివ్ థాట్స్ తో కోతి లాంటి నాటీ మైండ్, హేపీ మైండ్ పనులు చెడగొడ్తుంది.
        
కనుక నాటీ మైండ్ ని న్యూట్రల్ చేయాలంటే, హేపీ మైండ్ లో పాజిటివ్ థాట్స్ ని నాటాలి. నాటీ మైండ్ జరిగిన నష్టం గుర్తుచేస్తూంటే, లేదు రేపు లాభం వస్తుందని హేపీ మైండ్ లో పాజిటివ్ థాట్స్ ని నాటాలి. ఇలా ప్రతీ నెగెటివ్ థాట్ కి ఒక పాజిటివ్ థాట్ నాటుతూ వుంటే, నాటీ మైండ్ ఖాళీ అయిపోతుంది. ఇక రమ్మన్నా నెగిగెటివ్ థాట్స్, ఫీలింగ్స్ రావు. అలా శిక్షణ పొందుతుంది మనస్సు. జీవితం హాయిగా వుంటుంది. మనసు మీద అదుపు లేకపోతే రచయిత కాలేరు. పాత్రల్ని పాలించ లేరు.
        
ఇలాగే మీరు చూసిన సినిమాలు మీ రైటింగ్ వర్క్ ని దెబ్బతీస్తున్న నాటీ మైండ్ లో పేరుకు పోయిన థాట్స్ అనుకోండి. అప్పుడు ఆ సినిమాలు గుర్తుకు రాకుండా వుండాలంటే ఏవేవో కథలు వూహించి హేపీ మైండ్ లో నింపండి. నాటీ మైండ్ లోంచి చూసిన సినిమాలు వెళ్ళిపోతాయి. 80-20 ని రివర్స్ చేయండి. హేపీ మైండ్ ని వూహించిన కథలతో 80 శాతం నింపెయ్యండి.
        
ఈ వూహలు కూడా పద్ధతిగా వుండాల్సిన అవసరం లేదు. కథ రాస్తున్నప్పుడు ముందుకు కదలకపోతే ఫ్రీ విల్ రైటింగ్ అని వుంటుంది. అంటే మనసులో ఏ ఆలోచన వస్తే అది పేపరుమీద పెట్టడం. ఈ ఆలోచనలన్నీ చదివితే ఎక్కడో కథకి అవసరమైన ఆలోచన వుంటుంది. ఈ ఫ్రీ విల్ రైటింగ్ లాగా అడ్డదిడ్డంగా కథలు వూహిస్తూ హేపీ మైండ్ ని 80 శాతం నింపెయ్యండి. అప్పుడు 20 శాతానికి పడిపోయిన నాటీ మైండ్ ఇక ఏమీ చేయలేదు. ఇంకప్పుడు రాస్తున్న కథ సీన్లు ఆలోచించండి, చూసిన సినిమాల సీన్లు గుర్తుకు రమ్మన్నా రావు.  కథ చేస్తున్నప్పుడు సినిమాలు చూడడం మానెయ్యండి.

—సికిందర్