రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, నవంబర్ 2016, మంగళవారం

రివ్యూ!రచన- దర్శకత్వం : కరణ్ జోహార్
తారాగణం : రణబీర్ కపూర్, అనూష్కా శర్మ, ఐశ్వర్యారాయ్, లీసా హెడెన్, ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితరులు
మాటలు : నిరంజన్ అయ్యంగార్, సంగీతం: ప్రీతమ్
బ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్
నిర్మాతలు : అపూర్వా మెహతా, హీరూ యాష్ జోహార్, కరణ్ జోహార్
విడుదల : అక్టోబర్ 28, 2016
***
2012 నాటి కరణ్ జోహార్ కీ, ఇప్పటి కరణ్ జోహార్ కీ తేడా -ఏమీ లేదు టేకింగ్ లో అభివృద్ధి తప్ప.  2012  లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కి దర్శకత్వం వహించినప్పుడు, అది ’80 ల నాటి అమ్మమ్మల  సినిమాలా కాలం చెల్లిన వ్యవహారంతో  నవ్వులాటగా వుంది. పాత చాదస్తాలు మరీ ఎక్కువ వుండే కరణ్ జోహార్,  ఆ సినిమాలో స్టూడెంట్స్ చేత పాత పాటలే ధారాళంగా పాడించేశాడు. ఈ కాలంలో స్టూడెంట్స్ ‘ధూమ్ మచాలే ధూమ్’ అంటూ గంతు లేస్తారేమో గానీ, ఏనాటివో తమకి తెలీని  ’70 లనాటి,  ‘లే జాయేంగే లే జాయేంగే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ అని విర్రవీగి పాడుకోరు. ఆ నాటి గాయనీ గాయకులే తెలియరు. ఎల్లారీశ్వరి ఎవరో తెలీని యంగ్ కళాకారులు టాలీ వుడ్ లోనే  బస చేసి వున్నారు. 2012 లో కరణ్ జోహార్ తన పాత అభిరుచుల్ని ఈనాటి పాత్రలకి అంటగట్టి, ఈనాటి ప్రేక్షకుల మీద రుద్ది తృప్తి తీర్చుకున్నట్టు, తిరిగి ఇప్పుడూ అదే పని చేశాడు. పాత సినిమాల రిఫరెన్సుల్నీ, డైలాగుల్నీ, పాటల్నీ యధేచ్చగా  వాడేసి, ఇప్పటి అల్ట్రా మోడరన్ ‘జనరేషన్- వై’ క్యారక్టర్స్ ని చాలా అతి చేసి, అసహజంగా  చూపించాడు. అసలు కథనే చాదస్తంగా ముగించాడు. యూత్ సినిమాలంటే బహుశా- ఇప్పటి యూత్ ని భవిష్యత్తులో మంచి ముసలాళ్ళుగా తయారు చేసేవై వుండాలేమో గానీ,  ముసలి కథలతో వాళ్ళని ఇప్పుడే ముసలి వాళ్ళుగా తయారు చేసేవిగా కాదేమో!

        ‘యే దిల్ హై ముష్కిల్’ కరణ్ జోహార్ అందించిన కొత్త సీసాలో పాత సారా. పాతో కొత్తో, ఏదో ఒక దానికి కట్టుబడి వుంటే ఏ చిక్కూ వుండేది కాదు, రెండూ కలిపేయడంతో కషాయంలా తయారైంది. ‘బాయ్ ఫ్రెండ్స్ సినిమాల లాంటి వాళ్ళు- కొందరు టైంపాస్, కొందరు బ్లాక్ బస్టర్స్’ అని అనూష్కా శర్మ చేత అంత ఫన్నీగా- ట్రెండీగా పలికించగల్గినప్పుడు, అంతే ఫన్ గా- ట్రెండీగా  కరణ్ పనితనమూ వుండాలిగా...

కథ 
      లండన్ లో అయాన్ సంగర్ (రణబీర్ కపూర్) బాగా డబ్బున్నవాడి కొడుకు. గొప్ప సింగర్ నవ్వాలన్న కోరిక పెట్టుకుని తిరుగుతూంటాడు. ఓ బార్లో అలీజే ఖాన్( అనూష్కా శర్మ) పరిచయమై వెంటనే ఒకటైపోతారు ఫ్రెండ్స్ గా. అలీజేకి డాక్టర్ ఫైసల్ (ఇమ్రాన్ అబ్బాస్) అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయాన్ కీ లీసా (లీసా డిసౌజా) అనే గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. అయాన్, అలీజే ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని పబ్స్ కీ, టూరిస్ట్ స్పాట్స్ కీ ఎడాపెడా తిరిగేస్తూ పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తూ వుంటారు. ఓ రోజు ఓ పార్టీలో అలీజే బాయ్ ఫ్రెండ్ డాక్టర్ ఫైసల్, అయాన్ గర్ల్ ఫ్రెండ్ లీసా సెక్స్ చేస్తూ దొరికిపోతారు. దీంతో అలీజే ఫైసల్ తో వెంటనే కట్ చేసుకుంటుంది గానీ, అయాన్ మాత్రం గోలగోల చేస్తాడు లీసా చేసిన పనికి. రోడ్డు మీద పడి పొర్లాడుతాడు. గోడుగోడున ఏడ్చేస్తాడు. అప్పుడు ఇతడిది చిన్న పిల్లాడి మనస్తత్వమని గ్రహిస్తుంది అలీజే. 

        అయాన్ ఇక అలీజే ప్రేమలో రిలీఫ్ పొందాలని చూస్తూంటాడు. అలీజేకి  ఫైసల్ తోనే కాదు, అంతకి ముందు డీజే అలీ (ఫవాద్ ఖాన్) అనే బాయ్ ఫ్రెండ్ తో కూడా బ్రేకప్ అయింది. బాయ్ ఫ్రెండ్స్ తో ఈ అనుభవాల దృష్ట్యా  అయాన్ కూడా తనలాగే ప్రేమలో ఎక్కడ దెబ్బ తింటాడోనని, అతణ్ణి  ప్రేమించకుండా  ప్రేమకి దూరంగా వుంటూ ఫ్రెండ్ షిప్ మాత్రమే చేస్తానంటుంది- ‘ప్యార్ మే జునూన్ హై, పర్ దోస్తీమేఁ సుకూన్ హై’  (ప్రేమలో ఉన్మా దముంది, స్నేహంలో సుఖముంది)  అని చెబుతూ  ఫ్రెండ్ షిప్ ఎంజాయ్ చేస్తూంటుంది. 

        చేసేది  లేక అలాగే ఆమెతో తిరుగుతూంటాడు- ప్రేమలో పడ్డం మన చేతుల్లో లేదు, కానీ ప్రేమకి దూరంగా వెళ్ళిపోవడం మన చేతుల్లోనే వుందని తనని తాను  మోటివేట్ చేసుకుంటూ. ఎప్పుడైతే అలీజే పాత బాయ్ ఫ్రెండ్  డీజే అలీ తిరిగి ప్రత్యక్షమై, తనకింకో ఛాన్సిచ్చి చూడమంటాడో, అప్పుడు అలీజే ఆలోచనలో పడిపోతుంది. అయాన్ ఇరకాటంలో పడిపోతాడు. అలీతో వెళ్ళిపోతున్న అలీజేని దేబిరి మొహం వేసుకుని చూస్తాడు. 

        ఇప్పుడు గోలగోల చేసి ఏడిస్తే ఓదార్చే వాళ్ళే లేరు. కనుక  తానొక ఏడ్పనేదే  తెలీని దసరాబుల్లోడులాగా వుండాలని తనకితానే  ఫీలైపోతూ,  లక్నోలో అలీజే పెళ్ళికెళ్ళి అల్లరల్లరి చేసి పాట పాడతాడు. చివరికి అలీజే మొగుడు డీజే అలీ చేతిలో అవమానపడి వెళ్ళిపోతాడు.

        లండన్ వచ్చి మళ్ళీ షోకిల్లా రాయుడిలా ఫ్రాంక్ ఫర్ట్ కి బయల్దేరుతున్నప్పుడు, ఏర్ పోర్టులో సబాఖాన్ (ఐశ్వర్యా రాయ్) పరిచయమౌతుంది. ఈమె ఉర్దూ కవిత్వం రాస్తుంది, రాసింది చదువుకుంటుంది. ఈమె ఇప్పుడు వియన్నా వెళ్తోంది. ఈమెకి తాహిర్ ఖాన్ (షారుఖ్ ఖాన్ అతిధిపాత్ర) తో విడాకులయ్యాయి. ఈమెతో ఆ కాసేపు పరిచయంలోనే తన భగ్నప్రేమ వెళ్ళ బోసుకుంటాడు అయాన్. ఆమె తను రాసిన కవిత్వం చదువుకోమని ఇచ్చి వెళ్ళిపోతుంది. మూడు నెలల తర్వాత వియన్నాలో ఉంటున్న ఆమెకి ఫోన్ చేసి వెంటనే బయల్దేరతాడు. అక్కడ ఇద్దరూ సెక్స్ చేసుకుంటారు. సహజీవనం మొదలు పెడతారు. అప్పుడు అనుకోకుండా అలీజే వచ్చేస్తుంది. ఈమె రాకతో సబా ఆలోచనల్లో మార్పు వస్తుంది. రాత్రికి రాత్రి అయాన్ ని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేస్తుంది. ఇలా మరోసారి రోడ్డున పడ్డ అయాన్,  లబోదిబోమంటూ అలీజే ఉంటున్న హోటల్ గదికి మారథాన్ రన్ మొదలెడతాడు పరుగుల రాజులాగా...

ఎలావుంది కథ 
     పైన చెప్పుకున్నంతవరకూ సరదా రోమాంటిక్ కామెడీలానే వుంటుంది, అక్కడ్నించీ మాత్రం బరితెగించిన  రోమాంటిక్ డ్రామాలోకి తిరగబెడుతుంది. అలీజేకి క్యాన్సర్ అని తెలియడంతో! క్యాన్సర్!!
        ఎప్పటి క్యాన్సర్ కథలు...ఎప్పటి బాక్సాఫీసు ఫార్ములా!  ఎంత బరితెగింపు! కరణ్ జోహార్ @ 1980 లా తయారయ్యింది. తన రోమాంటిక్ కామెడీతో నేటి యూత్ మానసిక లోకాన్ని ఆవిష్కరించాల్సి వుండగా, అయిపోయిన తన పాత ముచ్చట్లు తీర్చుకునే పనికి పాల్పడ్డం చాదస్తం కాక  ఏమిటి? జానరో రక్షతి రక్షితః అన్నారు. రోమాంటిక్ కామెడీ జానర్ లోకి క్యాన్సర్ ని  తగిలించి విషాదమయ రోమాంటిక్ డ్రామాగా మార్చేస్తే,  దీన్నే జానర్ అనాలి- రోమాంటిక్ కామిడేడ్పు అనే కొత్త జానర్ అనాలేమో.  కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి దాకా జానర్ మర్యాద అనేదే పట్టడం లేదు.

        ఈ ప్రేమ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అంతు చిక్కదు. ప్రేమ వంకరైనది...ఆ వంకరలోనూ సుఖపడ్డం కేవలం కొంత మందికే వచ్చు- అన్న కథానాయకుడి మాట పట్టుకునైనా ఈనాటి నగర- విదేశీ ‘ప్రేమలు’ ఎలా ముగుస్తున్నాయో, వాటికెలా రెస్పాండ్ అవ్వాలో (రియాక్ట్ కాదు) చూపించివుంటే, ఈ రోమాంటిక్ కామెడీకో అర్ధం వుండేది.

        చూపించిన కథ ప్రకారం చూస్తే, కథానాయకుడి కష్టాలూ చూస్తే, ఒకటే అర్ధమౌతోంది...ప్రేమలు దోమలు బంద్ చేయండి,  బయట అవి మీకు దక్కవు, శుభ్రంగా పెద్దలు చూసిన సంబంధం చేసుకుని అడ్జెస్ట్ అయిపోండి- అని చెప్పాలనుకున్నారేమో! చివరికి ఏ ప్రేయసీ లేకుండానే మిగిలిపోయాడు కథానాయకుడు...స్వగతంతో ఈ కథ చెప్పుకొస్తూ. చాలా  కన్ఫ్యూజన్ గా వుంది ఈ కాన్సెప్ట్!

ఎవరెలా చేశారు
      నిస్సందేహంగా రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ చాలా టాలెంటెడ్ నటుడు. తన తల్లి, నాటి హీరోయిన్ నీతూ సింగ్ పోలికలొచ్చి, తండ్రి రిషీకపూర్ నే తలదన్నే నటవీరుడిగా విరివిగా చలామణిలో వున్నాడు. ‘రాక్ స్టార్’ లో పరమ మ్యాడ్ లవర్ పాత్రతో జ్వాలలు రేపినా, ‘బర్ఫీ’లో మూగవాడి కామెడీతో తెగ నవ్వించినా అతడికే చెల్లింది. ఇప్పుడూ తీసిపోలేదు. ఆమాట కొస్తే ఈ సినిమా ఫస్టాఫ్ అంతా ‘రాక్ స్టార్’ మ్యాడ్ లవర్ పాత్రే. కాకపోతే ఈసారి అమ్మాయిల తాకిడి ఎక్కువ. ఓ అమ్మాయి చేత ప్రేమలో తన్నించుకోవడం, మళ్ళీ ఇంకో అమ్మాయితో తన్నించుకోవడానికి రెడీ కావడం...ఇలా మూడుసార్లు ఫుట్ బాల్ లా అటూఇటూ తన్నించుకుంటూ వుండే క్రేజీ క్యారక్టర్ గా బాగా రక్తి కట్టిస్తాడు. ఇంత మాత్రాన ఇతను పాసివ్ క్యారక్టర్ కాదు. పాసివ్ క్యారక్టర్ అయితే మొదటి  అమ్మాయితో బ్రేకప్ దగ్గరే ఆగిపోయి ఏడుస్తూ కూర్చునే వాడు. ఇలాకాక మళ్ళీ తనే కొత్త ఖాతా తెరిచే యాక్టివ్ నెస్ తో, చొరవతో వుంటాడు. యాక్టివ్ క్యారెక్టర్ ఓడిపోకూడదని లేదు, తన ప్రయత్నాలు చేసి ఓడిపోయే యాక్టివ్ క్యారక్టర్ లోపాలు తెలుసుకుంటాడు.  ప్రయత్నమే చేయకుండా ఓటమిని అంగీకరించి కూర్చునే  పాసివ్ క్యారక్టర్ ట్రాజడీ కథగా  మిగిలిపోతాడు. రణబీర్ కపూర్ పాత్ర మెడకి హీరోయిన్ క్యాన్సర్ అనే ఆ ఒక్క గుదిబండ లేకపోతే,  ఈ ట్రెండీ లవ్ స్టోరీని ఇంకెంత క్రేజీగా ముగించి వుండేవాడో!


         అనూష్కా శర్మ సునాయాసంగా సీన్స్ ని పండించగలదు. ఈ కాలం రిచ్ అమ్మాయిల యాటిట్యూడ్ ని తనే బాగా పోషించగలదు.  కానీ తన పాత్రకి ఒక ఐడెంటిటీ అంటూ లేదు, రణబీర్ పాత్రకి సింగర్ అనే ఐడెంటిటీ వున్నట్టు. బ్రేకప్స్ ని ఈజీగా తీసుకుని- రణబీర్ పాత్రతో ఫ్రెండ్ షిప్ కే కట్టుబడి క్యాన్సర్ దాకా కొనసాగడం పాత్రకున్న చిత్తశుద్ధిని బయటపెడుతుంది గానీ, క్యాన్సర్ టర్నింగ్ తోనే తను ఆడియెన్స్ కనెక్ట్ కోల్పోయింది. సుమారు అరగంట పాటు ఈ క్యాన్సర్ డ్రామాని  తనతో భరించడం కనా కష్టంగా చేసుకుంది. ఒకచోట- ‘మహమ్మద్ రఫీ అంటే తక్కువ పాడి, ఎక్కువ ఏడుస్తాడు ఆయనేనా?’ అని రణబీర్ ముందు తన అమాయకత్వాన్ని వెల్లడించుకుంటుంది (ఈ డైలాగుకి సోషల్ మీడియా అంతా విరుచుకుపడింది కరణ్ జోహార్ మీద, అయినా ఈ డైలాగు తీసేయలేదు). కానీ ఈ అనూష్కా పాత్ర పాయింటాఫ్ వ్యూలో ఈ డైలాగు కరెక్టే. నేటి తరానికి మహమ్మద్ రఫీ ఏం తెలుసు? అందుకే అలా అజ్ఞానంతో మాట్లాడింది. అలాటి నేటి తరం పాత్రకి, పాత సినిమాల్లోలాగా  క్యాన్సర్ తగిలిస్తే, ఆ క్యాన్సర్ కి ఇప్పుడే ప్రేక్షకులు ఫీలైపోయి అయ్యో పాపమని చూస్తారు? ఇప్పుడు అంకిత్ తివారీ లాంటి సింగర్ ఉదాహరణ కావాలి;  క్యాన్సర్ కి బదులు, నేటి యువతుల ఆధునిక జీవన శైలుల పుణ్యమాని, అప్పుడే మెనోపాజ్ ప్రాప్తించి, ఇక పిల్లలు పుట్టని స్థితికి చేరుకుంటున్న- పెళ్లి అవకాశాలు చట్టుబండలు చేసుకుంటున్న - కొత్త సమస్య గురించి చెప్పాలి. ఇంకా క్యాన్సర్ తో ముసలి డ్రామా ఇప్పుడెవరికి కావాలి. 


       ఇక ఐశ్వర్యారాయ్ తన ఫిట్నెస్ తో, కాపాడుకుంటున్న గ్లామర్ తో హూందాగా కన్పిస్తుంది పాత్ర ప్రకారం. పాత్ర మాత్రం డొల్లగా మిగిలిపోయింది. ఈమెని చూస్తే ‘పాకీజా’లో మీనా కుమారి పాత్ర గుర్తు కొస్తుంది. వెలయాలిగా మీనాకుమారి కవితాత్మకంగా వెల్లడించే హృదయబాధలాంటిది ( హర్ తవాయీఫ్ యేక్ లాష్ హై) ఒక డైవోర్సీగా తనూ  బాధని ప్రకటించి వుంటే పాత్ర వికసించేది. కవిత్వంతో రణబీర్ పాత్రని కట్టి పడేసిందీ లేదు. ‘కవయిత్రి పెళ్లి చేసుకోవాలి, అప్పుడు భర్తతో ఓకే అయితే మంచిదే, కాకపోయినా లాభమే, ఇంకా మంచి కవిత్వం వస్తుంది’ - అనే ఈమె, అలాటి మంచి కవిత్వం ఏం రాసిందో తెలీదు- భర్తతో విడాకులాయ్యాక. కవిత్వం కంటే రణబీర్ పాత్రతో ఇన్ స్టెంట్ రిలేషన్ షిప్, సెక్సూ సహ
జీవనమూ  ఇవే డామినేట్ చేస్తాయి. ఈ వయసులో ఈమెకిది ప్రేమో, మోహమో ఏమో...ఏమీ అర్ధంగాదు.


        ఈ సినిమాలో నటించి వివాదాస్పదుడైన పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ మీద సీన్లు తక్కువే. హోలీ సీను, పెళ్లి సీనూ ఇతడి మీద అద్భుతంగా తీశారు. ఈ కథ ఈ ఐదారు పాత్రల చుట్టే తిరుగుతుంది, వచ్చి పోయే బ్యాక్ గ్రౌండ్ పాత్రలు చాలా వున్నాయి. డైలాగ్  వెర్షన్ లో భాగంగా రణబీర్, అనూష్కాలు పాత పాటలు వల్లించడం (కొన్ని పాత సినిమాల డైలాగులు కూడా) వదిలేస్తే, సినిమా కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్ ట్యూన్ చేసిన సాంగ్స్ ఫెంటాస్టిక్ గా వున్నాయి. వీటి చిత్రీకరణ కూడా హైలైట్ అనే చెప్పాలి. అదొక అద్భుత ఊహాప్రపంచం. అలాగే ఐయాన్ ఆండ్ర్యూస్ కళా దర్శకత్వం గానీ, మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ గానీ విజువల్ గా చాలా టాప్ రేంజికి తీసికెళ్ళాయి సినిమాని. ఇక అనిల్ మెహతా ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.        నిరంజన్ అయ్యంగార్ రాసిన మాటలు రణబీర్, అనూష్కాల పాత్రల రీత్యా ట్రెండీ గానే వున్నప్పటికీ, ఈ ట్రెండీ నెస్ ని కిచిడీ చేస్తూ పాత్రలకి అతకని ఫిలాసఫికల్ డైలాగులూ వున్నాయి. సెకండాఫ్ లో ఐశ్వర్యారాయ్ కి సరేసరి. మీనాకుమారిలా పాత్రకి డెప్త్ వుంటే అయ్యంగార్ డైలాగులూ ఇంకా బాగా వచ్చేవేమో. 

        కరణ్ జోహార్ దర్శకత్వంలో ఏ లోటూ లేదు, పైగా కొత్త దర్శకుల టేకింగ్ ని బలాదూరు చేసేట్టు వుంది. ఇందులో సాధించిన విజయం మిగతా కథాకథానాల, పాత్ర చిత్రణల విషయంలో, మొత్తంగా కాన్సెప్ట్ పరంగా సాధించలేక పోయాడు కరణ్. నిడివి రెండు గంటలా 40 నిముషాలు చాలా ఎక్కువ. చాలా నిడివిని  క్యాన్సరే తినేసింది!

 నాణేనికి మరో వైపు
     పైన చెప్పుకున్న ప్రేమ కథ గానీ, పాత్రలుగానీ, ఆ చెప్పుకున్నంత సాదా సీదాగా లైటర్ వీన్ గా ఏమీ వుండవు. రణబీర్, అనూష్కాల నవతరం పాత్రలకి పాత చాదస్తాల మోతబరువు బ్యాగేజీ చాలా ఎక్కువ.  కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లో లాగే, మాటాడితే పాత సినిమా పాటెత్తుకుని వీరంగం వేస్తారు యువనటులూ పాత్రలూ అయిన రణబీర్, అనూష్కాలు. సింగర్ అవ్వాలనుకుంటున్న రణబీర్ ని పాడమని అనూష్కా అడిగిందే తడవు- ‘గాతా రహే మేరా దిల్’  అని కిషోర్ కుమార్ పాట ఎత్తుకుంటాడు. 1965 నాటి ‘గైడ్’ లోని ఈ పాట ఇప్పుడు 51 ఏళ్ల తర్వాత ఎంతమందికి తెలిసివుంటుంది? బహుశా నడివయసు వాళ్ళకి, ఆపై వయసు వాళ్లకీ తెలుస్తుందేమో ఎంజాయ్ చేయడానికి. సినిమాలో కూడా ఈ ఏజ్ గ్రూప్ పాత్ర పాడుకుంటే అతుకినట్టు వుంటుంది. యువ పాత్రకి చాలా చాలా ఎబ్బెట్టుగా, నీచంగా వుంటుంది. యువ పాత్రకి ఈ పాటలు తెలిసి వుండే అవకాశంలేదు. ఇంకా చెప్పాలంటే చిట్ట చివర్లో ఏనాటిదో లతామంగేష్కర్ పాడిన పాట కూడా ఎత్తుకుంటారు రణబీర్, అనూష్కాలు కలిసి! ‘ఈ ట్రాజడీలో మనం ఏం చేయాలి? ఆర్డీ బర్మన్ పాటలు పాడుకోవాలి-‘ అని చెప్పుకుని ‘జైజై శివ్ శంకర్...’ అంటూ మొదలెట్టి ఆర్డీ పాటలు కొన్ని పాడి పడేస్తారు! ఇప్పుడు ఆర్డీ బర్మన్! ఇలా తెరమీద  జరిగేదంతా ఈ సినిమా కొచ్చిన యువప్రేక్షకులకి తెలియని, సంబంధం లేని ‘సబ్జెక్టివ్’ వ్యవహారమే. సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ‘ఆబ్జెక్టివ్’ గా వుండాలని పెద్దలు చెప్తారు. 

       అసహజంగా రఫీ పిచ్చిగల రణబీర్ యువ పాత్ర, పారిస్ వెళ్ళగానే నైట్ క్లబ్ లో- ‘ఏన్ ఈవెనింగ్ ఇన్ పారిస్’ లో రఫీ పాడిన టైటిల్ సాంగ్ పాడేస్తుంది. శంకర్- జైకిషన్ ల సారధ్యంలో 1967 నాటి ఈ సూపర్ హిట్ సాంగ్ 49 ఏళ్ల తర్వత ఇప్పుడెందరికి తెలుస్తుంది-  పాడుతున్న పాత్రతో పాటు ఊగిపోతూ ఎంజాయ్ చేయడానికి? ఇలా దర్శకుడు తన కాలంనాటి సొంత టేస్టులన్నీ ఈనాటి పాత్రల మీద, ప్రేక్షకుల మీదా రుద్ది రంధి తీర్చుకుంటున్నట్టు వుంటుంది.

          ఇంకా వుంది- అనూష్కా తనకి శ్రీదేవిలా చీరకట్టుకుని పాడుకోవాలని వుందని చెప్పి- ఎల్లోసారీ కట్టుకుని ‘చాందినీ’ లో శ్రీదేవి సాంగేసుకుంటుంది! అంతకి ముందు రణబీర్ ‘కోరా కాగజ్ థా యే దిల్ మేరా’  అనే 47 ఏళ్ల నాటి మరో కిషోర్ సాంగ్ ని హమ్ చేస్తాడు!

        ఇప్పుడో అమ్మాయి కరీనా కపూర్ లానో, కత్రినా కైఫ్ లానో కత్తిలా చీర కట్టుకుని వాళ్ళ పాటేదైనా వుంటే ఎగిరెగిరి స్టెప్పు లేస్తుందేమో? హస్కీ వాయిస్ తో సునిధీ చౌహాన్ పాడే ‘బరస్తా హై బాదల్ బరస్తా’ సాంగ్ తో దుమ్ము రేపేస్తుందేమో? అసలు రణబీర్ తాను  మహమ్మద్ రఫీలా సింగర్ అవ్వాలనుకుంటున్నానని అనడం మరీ చోద్యం గాక పోతే ఏమిటి?  కరణ్ జోహార్ రఫీ కాలేకపోయిన పాత కోరికని తను తీర్చడమేమిటి ప్రేక్షకుల ప్రాణాల్ని బలిపెట్టి? తన పాత్ర కోరిక తీర్చడానికి  శంకర్ మహదేవన్, యోయో హనీ సింగ్, మికా సింగ్, ఆతిఫ్ అస్లం ఎవరూ ఈ కాలానికి తగ్గట్టు లేనట్టు. 

        పాటలతో పాట్లు ఇలా వుంటే- ఇక మాటల విషయానికొస్తే ఒకపక్క - ‘ప్రేమలో ఉన్మాదముంది, స్నేహంలో సుఖముంది’ లాంటి క్రేజీ డైలుగులు పలుకుతూనే, మరోపక్క-  ‘లోగ్ అక్సర్ కహెతే హై నా కీ దిల్ దిమాగ్ కే  బీచ్ మేఁ దిల్ కీ సున్నీ  చాహియే...లేకిన్ జబ్ దిల్ టూట్ జాతా హైతో ఉస్ సే బెహతర్ అడ్వైజ్ తో దిమాగ్ హీ దేతా హై...’  (మనసు చెప్పేది వినాలా, బుద్ధి చెప్పేది వినాలా అన్నప్పుడు, మనసు  చెప్పేదే  వినాలని అంటారు..కానీ మనస్సు విరిగిపోయినప్పుడు బుద్ధి మాత్రమే మంచి సలహా ఇస్తుంది)  లాంటి సాహిత్య సౌరభాలతో గుబాళించే బరువైన రాజభాష మాట్లాడుకోవడం రసభంగం కల్గించే వ్యవహారంలాగా వుంటుంది- పాత పాటల మోజులాగే.

        ఈ కథ ఫస్టాఫ్ రణబీర్- అనూష్కాల రణగొణ ధ్వనుల ప్రేమలతో వుంటుంది. సెకండాఫ్ కొచ్చేసరికి ఇది ఐశ్వర్యా రాయ్ పాత్రతో, ప్రశాంత తటాకంలా మారిపోవాలి. ఈ ప్రశాంత తటాకపు అనురాగఝరిలో  రణబీర్ పాత్ర తాలూకు క్యారక్టర్ ఆర్క్, గ్రోత్ కన్పించాలి. ఐతే ఇది ప్రశాంత తటాకంలా ప్రేక్షకుల మనస్సులో ముద్రేసుకుని డిఫరెంట్ గా కనపడాలంటే, ఫస్టాఫ్ లో ప్రశాంత తటాకం తాలూకు ఫిలాసఫీ, గాంభీర్యం లాంటివేవీ రణబీర్- అనూష్కాల పాత్రల మధ్య కనపడకూడదు. ఫస్టాఫ్ కేవలం  పిచ్చి పిచ్చి డైలాగులతో, మదపిచ్చి ప్రేమలతో అల్లకల్లోలంగా చూపిస్తే, సెకండాఫ్ లో ఐశ్వర్యారాయ్ పాత్రతో దాన్ని ఒక కొలిక్కి తేవచ్చు. నిజానికి ఐశ్వర్యారాయ్ పాత్ర పాత సాంప్రదాయానికి ప్రతీక లాంటిది. దీన్ని దర్శకుడు చంపేశాడు. విన్ స్టన్ చర్చిల్ అంటాడు- పాత సాంప్రదాయమనే ములు గర్రతో పొడుస్తూ వుండకపోతే, ఆధునికత్వమనే గొర్రెల మంద చెల్లాచెదురై పోతుందని! శంకరాభరణం శంకర శాస్త్రి గొడవ కూడా ఇదే కదా-  ముందు సాంప్రదాయ సంగీతం నేర్చుకోండ్రా, అప్పుడు మీ కారుకూతల మ్యూజిక్ దార్లో వుంటుందనేసి?


     ఐశ్వర్యా రాయ్ రణబీర్ కి ఇలా ఒక గైడ్ లా వుండాల్సింది- చంద్రముఖి దగ్గర దేవదాసు సాంత్వన పొందినట్టు. అనూష్కా తో గోలగోల ప్రేమ ముగిశాక, ఐశ్వర్య దగ్గరకి రణబీర్ వచ్చినప్పుడు ఒక ప్రశాంతవాతావరణం కన్పించి, ఆమె కవిత్వంతో ఇన్స్పైర్ అయి, జీవితంలో మొదటిసారిగా కవితాత్మక ధోరణిలో-  ‘పాకీజా’ లో రాజ్ కుమార్ లా- ‘ఇస్ ఘర్ కే ఇన్సానోఁ కో హర్ సాన్స్ కే బాద్ దూస్రే సాన్స్ కే లియే భీ- ఆప్సే ఇజాజత్ లేనీ పడ్తీ హై...’ (ఈ ఇంట్లో మనుషులకి ఊపిరి పీల్చిన ప్రతీసారీ ఇంకో ఊపిరి కోసం కూడా మీ అనుమతి పొందాల్సి వుంటుంది) - లాంటి గుబాళింపు భాష ఇక్కడ మాట్లాడ్డం ప్రారంభిస్తే, క్యారెక్టర్ లో ఈ సర్పరైజ్ ఎలిమెంట్ కి ప్రేక్షకులు ఉలిక్కిపడి,ఇక్కడ్నించీ ఫ్రెష్ ఫీలింగ్ తో నిశితంగా గమనించే వీలుండేది. 

        ఆమె కవయిత్రి- అతను  గాయకుడూ అయినప్పుడు, ఈ సంబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒట్టి లవర్స్ గా కలిపేశారు. అతను మామూలోడు కాదు, దేన్నైనా అందిపుచ్చుకుని  ఓ ఆటాడుకునే రకం. అలాటి వాడు ఆమె కవిత్వంతో తనలోని గాయకుణ్ణి మెరుగులు దిద్దుకుని గ్రేట్ సింగర్ గా మెరిసిపోగలడు. ఆమె వైవాహిక జీవితంలో దెబ్బతింది, తను ప్రేమలో దెబ్బ తిన్నాడు- ఇలాటి ఇద్దరి కలయిక కళ కోసమే అయ్యుంటే గొప్పగా వుండేది. ఇలాటిది సంజయ్ లీలా భన్సాలీ చేసి, ఎక్కడికో తీసికెళ్ళి పోగలడు. కరణ్ జోహార్ వీళ్ళిద్దరి మధ్య క్షణికమైన శారీరక సంబంధం ఏర్పాటుచేసి సాధించిందేమిటో అర్ధంగాదు. వీళ్ళిద్దరి సంబంధం ఖాయం కాదని ప్రేక్షకులు గ్రహించగలరని కరణ్ కి తెలుసు. అవతల ఎంత పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా అసలు హీరోయిన్ అనూష్కా పాత్ర బ్యాలెన్స్ గా వుండనే వుంది. మళ్ళీ ఏదో జరిగి ఎప్పుడో తిరిగి వస్తుందని ప్రేక్షకులు తమ అనుభవసారంతో ఇట్టే  ఘాట్టిగా పసిగట్టేయగలరనీ కరణ్ కి తెలుసు. అలా వీళ్ళిద్దరికీ పెళ్లితో ముగింపు అనే మాటకి తావే లేనప్పుడు, సెక్స్ చేయించడం దేనికి? సెక్స్ బదులు సంగీత సాహిత్యాలేవో  వాళ్ళముందు పడేస్తే పోదా? సీనియర్ నటి ఐశ్వర్యా రాయ్ పాత్రని చర్చిల్ కొటేషన్ ప్రకారం సాంప్రదాయ విలువలకి కాణాచిగా మార్చి, పెడ ధోరణి ప్రేమల్ని దారిలో పెడుతూ రణబీర్ పాత్ర కళ్ళు తెరిపించేదిగా చిత్రిస్తే ఏమయ్యేది?
        ఇక దీని తర్వాత క్యాన్సర్ పర్వం లోకి మనం పోనవసరం లేదు.


స్క్రీన్ ప్లే సంగతులు
       సౌలభ్యం కోసం దీన్ని కథ అంటూ చెప్పుకొచ్చాం గానీ, ఇది కథేనా, లేకపోతే గాథా అన్న సందేహాలు బయల్దేరతాయి. కథ అనుకోవడానికి ఇందులో ప్రతీసారీ ఓటమిని పొందే హీరోతో ఆర్గ్యుమెంట్ లేదు. జడ్జే మెంట్ లేదు. జడ్జ్ మెంట్ వుండని స్టేట్ మెంట్ లా గాథలాగా సాగిపోతూ వుంటుంది ప్రవాహం- ఒక ఇంటర్యూ ఇస్తూ హీరో చెప్పుకొచ్చే తన అనుభవాలతో. 

        మొదటి హీరోయిన్ ది ప్రేమ కాదు, కేవలం ఫ్లర్టింగ్. మెయిన్ హీరోయిన్ ఫ్రెండ్ షిప్ అంటూ వెళ్ళిపోయింది. రెండో  హీరోయిన్ మెయిన్  హీరోయిన్ మీద హీరో ప్రేమ చూసి వెళ్ళ గొట్టింది. మళ్ళీ మెయిన్  హీరోయిన్ ప్రేమకి పనికి రాకుండా క్యాన్సర్ పేషంట్ అయి వచ్చింది. ఇలా ఎక్కడా ఒక గీత గీసి- ఇప్పటి ప్రేమల్లో  ఇదీ తప్పు, ఇదీ ఒప్పూ  అనే పాయింటుతో ఆర్గ్యుమెంట్ కీ, దానికి జడ్జిమెంటు కీ అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఇది ఓ కథలా అన్పించదు. కేవలం వివిధ అమ్మాయిలతో హీరో అనుభవాల తాలూకు ఒక గాథ. అంటే ఐడియాని నిర్మించుకుంటున్న మొదటి అడుగులోనే తప్పటడుగు పడిందన్న మాట. 

        సరే, గాథలు కమర్షియల్ సినిమాలకి పనికి రావంటున్నప్పుడు ఈ సినిమా ఇంత హిట్టెలా అయిందని అనొచ్చు. ఈ సినిమాని చుట్టు ముట్టిన వివాదాలే కలిసివచ్చాయేమో. పైగా పెళ్ళయాక ఐశ్వర్యారాయ్ కన్పిస్తున్న మొదటి సినిమా ఇదే. పైగా కరణ్ జోహార్ సినిమా కూడా ఇది. ఇలాటి కొన్ని బాహ్య ఆకర్షణలు ప్రేక్షకుల్ని భారీగా రాబట్టాయేమో. తీరా లోపలి కెళ్తే కదా సినిమాతో అసలు పరిస్థితి తెలిసేది. 


        కరణ్ జోహార్ ‘కథ’ ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ ఎలాగో వర్కౌట్ అయిపోయినా, క్రియేటివ్ యాస్పెక్ట్ ఎలా వుందో పైన చెప్పుకుంటూ వచ్చాం. ఐడియాని మూడు మూలస్థంభాలు, రెండు పిల్ల స్థంభాల మధ్య సర్ది స్ట్రక్చర్ చేసిన విధానం బాగానే వుంది గానీ, ఈ స్థంభాల మధ్య నడిపించిన విషయమే దీని ద్వారా ఏం చెప్తున్నారో అర్ధంగాని గందరగోళాన్ని సృష్టించింది. పైన చెప్పుకున్నట్టు- బయట ప్రేమల్లో పడకండి, అమ్మాయిలు చెత్త- ఇంట్లో చూసిన  చక్కటి సంబంధం బుద్ధిగా చేసుకు చావండి- అనేట్టు వుంది. దర్శకుడు పక్కా స్త్రీ ద్వేషి అన్నట్టు తయారయ్యింది.        అరగంటలో వచ్చే మొదటి గర్ల్ ఫ్రెండ్ సెక్స్ సీన్ తో హీరో భూమ్యాకాశాలు ఏకం చేసే దగ్గర మొదటి మూల స్థంభం - ప్లాట్ పాయింట్ వన్ - ఏర్పడింది. ఇప్పుడు ఈ మిడిల్ వన్ విభాగం బిజినెస్ ప్రకారం  ప్రేమ వద్దనీ, ప్రెండ్ షిప్పే కావాలనీ అనే మెయిన్ హీరోయిన్ తో హీరో చేసే స్ట్రగుల్ చూపించుకొచ్చారు. హీరోయిన్ మొదటి బాయ్ ఫ్రెండ్ తిరిగి ప్రత్యక్షమై అతన్తో హీరోయిన్ వెళ్లిపోవడంతో ఇంటర్వెల్ కి దారి తీసే మొదటి పిల్ల మూలస్థంభం - పించ్ వన్- ఏర్పాటు చేశారు. మెయిన్ హీరోయిన్ పెళ్ళితో ఇంటర్వెల్. దీని తర్వాత మిడిల్ టూ విభాగంలో, హీరో స్ట్రగుల్ కొనసాగిస్తూ  సెకెండ్ హీరోయిన్ అయిన కవయిత్రితో రిలేషన్ షిప్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి మెయిన్ హీరోయిన్ రావడంతో రెండో మూలస్థంభానికి దారి తీయించే రెండో పిల్ల స్థంభాన్ని - పించ్ టూ- ఏర్పాటు చేశారు. రెండో హీరోయిన్ వెళ్ళ గొట్టడంతో హీరో వెళ్లి మళ్ళీ మెయిన్ హీరోయిన్ ని కలుసుకుని, ఆమె క్యాన్సర్ పేషంటని తెలుసుకోవడంతో రెండో మూల స్థంభం- ప్లాట్ పాయింట్ టూ - ఏర్పాటు చేశారు. ఇక్కడ్నించి ఎండ్ విభాగమంతా క్యాన్సర్ సంగతులు, ఇద్దరి స్ట్రగుల్, ఆమె మరణం వగైరాలతో ముగింపు. 

        మొదటి మూలస్థంభం గర్ల్ ఫ్రెండ్ మోసంతో హీరో చేసే అల్లరితో- ఫిజికల్, విజువల్ యాక్షన్తో గుర్తుండిపోయేలా బాగా ఎలివేట్ అయ్యింది. రెండో మూలస్థంభం కూడా విజువల్ గానే వుంది గానీ, ఎలివేట్ అవకుండా ఉస్సూరన్పించేలా వుంది- హీరోయిన్ క్యాన్సర్ అని చూపించడంతో! 


        రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ డ్రామాగా ట్రాజడీగా మారిపోవడం, ఫస్టాఫ్ ట్రెండీ పాత్రలకి అవసరం లేని పాతవాసనల పాటలూ మాటలూ పెట్టడం, సెకండాఫ్ లో సెకెండ్ హీరోయిన్ తో ఏ ప్రయోజనమూ లేకపోవడం వంటి కొట్టొచ్చే లోపాలతో -అసలేం తేల్చారో చెప్పని సందిగ్ధంతో, చూశామంటే ఏదో చూశామన్నట్టు వుంటుంది కరణ్ కళాపోషణ.-సికిందర్
http://www.cinemabazaar.in